మార్కండేయ మహా పురాణము

Table of Contents

73 - ఆరవ మన్వంతరము

 

ఓ ద్విజోత్తమా! ఐదు మన్వంతరములను గురించి నీకు చెప్పితిని. చాక్షుష మనువు యొక్క అరవ మన్వంతరము వృత్తాంతమును చెప్పెదను వినుము. ఓ ద్విజుడా! అన్య జన్మమున ఈతడు పరమేష్టి యగు బ్రహ్మ దేవుని చక్షువుల నుండి జన్మించి యుండెను. ఈ కారణమున ఈ జన్మము నందు కూడా అతని పేరు చాక్షుషుడని కలిగెను. (మహాత్ముడు, రాజర్షియగు అనమిత్రుడికి భద్ర అను భార్య యందు విధ్వాంసుడు, శుచి జాతి స్మరుడు మరియు విభుడు, గుణయుక్తుడు నగు ఒక పుత్రుడు కలిగెను.) తన ఒడి యందు కూర్చొని యున్న ఆ నూతన పుత్రుని ఆదరించి తల్లి తిరిగి ఆనందము నిండినదై ఆలింగనము చేసుకొనెను. అనంతరము తిరిగి ఆనందింప సాగెను. ఇట్లు చేయుటచే తల్లి ఒడిలో నున్న ఆ జాతి స్మర పుత్రుడు హాస్యము చేసెను. అప్పుడు తల్లి అత్యంత క్రోధితురాలై అతనితో ఇట్లు చెప్ప సాగెను.

ఓ కుమారా! నేను భీతురాల నైతిని. నీ వదన మందు నవ్వు ఎందులకు? ఈ చిన్నతనమున జ్ఞానోత్పన్నము చేయ ఏదేని శుభమును చూచితివా ఏమి? (తల్లి పలికిన వచనములను విని పుత్రుడు నవ్వుచూ చెప్ప సాగెను.)

ఎదురుగా ఏ మార్జాలము నన్ను భక్షింప వలెనని కోరుచున్నదో నీవు దానిని చూచుట లేదా? మరియు ఏ జాతహారిణి గుప్త రూపమున ఉన్నదో దానిని కూడ నీవు తెలిసి కొనలేదా? ఎప్పుడు నీవు పుత్ర ప్రీతితో స్నేహముతో నన్ను చూచుచూ పులకిత మైన మరియు స్నేహపూరిత నేత్రములతో మాటి మాటికి ఆదరముతో నన్ను ఆలింగనము చేసుకొంటివో అప్పుడు నాకు నవ్వు వచ్చినది. ఇప్పుడు దాని కారణము చెప్పెదను వినుము. మార్జాలము రెండవ వైపు దాగుకొని వున్న జాతహారిణి తమ పని యందు ఆసక్తులై నన్ను స్వార్థ తత్పరతతో చూచు చున్నవి.

ఈ రెండు ఏ విధముగా స్వార్థముతో నా యడల నమ్రతా హృదయము కలవై యున్నవో నీవు కూడా అదే విధముగా స్వార్థము కొరకు నా యెడల స్నేహవతి వైనావు. నాకు ఇట్లు తెలిసినది. ఈ మార్జాలము జాతహారిణి నన్ను భుజించుట కొరకు హరించును. కాని నీవు నా వలన క్రమముగా కోరిన ఉప భోగ్య కాలమును పొంద వలెనని కోరుచున్నావు. నన్ను ఎరుగుట లేదు. నేను ఎవరను? నేను నీకు ఏ ఉపకారము చేయలేదు. చాలా దినముల నుండి పరిచయము లేదు. కేవలము ఐదు ఆరు దినముల మాతా పుత్రులుగా కలిసితిమి. అయినప్పటికి నీరు నిండిన నేత్రములతో నాతో స్నేహము చేయుచుంటివి. ఆలింగనము చేసుకొను చుంటివి. మరియు కపటము లేని హృదయముతో నన్ను “ఓ తండ్రీ! ఓ కుమారా! ఓ భద్రా!” అని ఈ విధముగా పలుకు చున్నావు.

ఓ కుమారా! ఉపకారము ఆశించి నేను నిన్ను ఆలింగనము చేసుకొనుట లేదు. ఈ ఆలింగనము ద్వారా ఆట లాడించుట ద్వారా నీకు ప్రీతి కలుగ నట్లయితే నేను నిన్ను పరిత్యజించెదను.

నీ వలన నాకు ఎట్టి స్వార్థము కలిగినదో నేను కూడా దానిని పరిత్యజించితిని. ఈ విధముగా పలికి, ప్రసూతి జడవతుడు బాహేంద్రియ సంపన్నుడు, విసుద్ద, అంతః కరణుడు అగు ఆ పుత్రుని పరిత్యజించి సూతికా గృహము నుండి వెడలి పోయెను. తదనంతరము జాతహారిణి ఆ తల్లిచే త్యజింప బడిన పుత్రుని అపహరించెను. జాతహారిణి ఈ బాలకుని హరించి విక్రాంతుడను పేరు గల మహీపాలకుని భార్య యొక్క శయ్యపై నుంచి, క్రొత్తగా జన్మించిన ఆమె పుత్రుని హరించెను. ఆ జాతహారిణి ఆ రాజపుత్రుని కూడా వేరొక గృహము నందుంచి అచటి పుత్రుని హరించి చివరకు మూడవ దానిని భక్షించెను. అతి నిర్దయురాలగు ఆ జాతహారిణి ప్రతిదినము ఈ విధముగా క్రొత్తగా జన్మించిన బాలకులను హరించి మొదటి ఇద్దరినీ మార్చి మూడవ దానిని తిను చుండెడిది.

ఆ తర్వాత విక్రాంతుడను ఆ మహీపతి క్షత్రియునకు ఏ ఏ సంస్కారములు ఉన్నవో, ఆ పరివర్తనము చెందిన పుత్రునికి కూడా ఆ సంస్కారములన్ని చేయించెను. విక్రాంత నరపతి అత్యంత ఆనందితుడయ్యెను. ఈ కారణముచే విధానానుసారముగా ఆనందుడని ఆ పుత్రునికి నామ కారణము చేసెను. గురువు గారు ఆ యజ్ఞోపవీతము పొందిన కుమారునిచే తల్లి సమీపమునకు వెళ్లి ప్రథమ నమస్కారము చేయమని చెప్పెను. ఆనందుడు గురువు గారి వచనములు విని నవ్వుచూ చెప్పసాగెను.

నేను ఏ తల్లికి వందనము చేయుదును? తల్లికా లేక పెంచి నామెకా?

ఓ మహాభాగా! ఈ జారుతాత్మజు రాలగు హైమిని యను పేరు గల విక్రాంత రాజు యొక్క ప్రధాన మహిషి నీ తల్లి కాదా ఏమి?

ఈమె బోధుడను పేరుగల విప్ర శ్రేష్టుని యొక్క పుత్రుడు విశాల గ్రామ నివాసి యగు చైత్రిని తల్లి. ఈమె గర్భము నుండి ఆ చైత్రుడే జన్మించెను. నేను వేరొక చోట జన్మించితిని.

ఓ ఆనందా! నీవు ఎచటి నుండి వచ్చితివి? నీవు చెప్పిన ఆ చైత్రుడెవరు? నీవు ఎక్కడ జన్మించితివి? మరియు ఇచ్చటకు ఎట్లు వచ్చితివి? ఇక్కడ జన్మించిన వాడు ఎచటకు వెళ్ళెను? నేవేమి చెప్పుచున్నావో, అది మహా సంకటముగా కనిపించు చున్నది.

ఓ ద్విజుడా! నేను అవనీ పతి యగు అనమిత్రుడను క్షత్రియుని గృహమున అతని భార్య గిరిభద్ర యొక్క గర్భమున జన్మించితిని. మరియు నన్ను జాతహారిణి అపహరించి ఈ ప్రదేశమున ఉంచినది. మరియు హైమిని యొక్క పుత్రుని హరించి ద్విజశ్రేష్టుడగు బోధుని గృహమునకు తీసుకొనిపోయి, ఆ ద్విజోత్తముడగు బోధుని సంతానమును భక్షించి పోయినది. హైమినీ సుతుడగు ఆ బాలకుడు విశాల గ్రామము నందు ద్విజ సంస్కారముచే సంస్కరింప బడెను.

మరియు మీ వలన నేను ఇక్కడ సంస్కరింప బడినాను. ఓ మహాభాగా! మీరు నాకు గురువులు. మీ ఆజ్ఞ నాకు బాగుగా పాటింప దగినది. ఓ గురువు గారూ! నేను ఏ తల్లికి నమస్కారము చేయుదును?

ఓ కుమారా! అతి విషమ, మహా సంకటము సంప్రాప్తించినది. ఏమియు తెలియుట లేదు. మోహ కారణముచే బుద్ధి భ్రమించు చున్నది.

ఓ విప్రర్షీ! ఈ విధముగా వ్యవస్థలు గల ఈ జగత్తు నందు మొహమునకు కారణము ఏమి? అందువలన ఎవరు ఎవరి పుత్రుడు? మరియు ఎప్పుడు ప్రాణి జన్మించి నప్పటి నుండి ప్రాణుల సాంగత్యము వివిధ సంబంధాలను పొందు చున్నదో, అప్పుడు ఎవరు ఎవరికీ బంధువులు కారు. సంబంధ యుక్త మనుష్య గణాలు ఏ విధముగా మృత్యువు ద్వారా తిరుగుచు నుందురో, ఈ ప్రపంచము నందు బాంధవ గణాల సహితము ఉత్పన్నమైన మనుష్యుల యొక్క ఏ సంబంధ ముండునో, అది కూడా ఈ విధముగానే దేహము నాశనము చెందిన పిమ్మట వినాశనము పొందును.

ఈ కారణముచే నేను చెప్పుచుంటిని. “ప్రపంచమున నివసించు వారికి ఏ బంధువులు లేరు. మరియు నిత్య బంధువు లెవరు? అందువలన ఎవరి కొరకు మీ బుద్ధి భ్రాంతి యగు చున్నది? నేను ఈ జన్మ యందె ఇద్దరు తండ్రులను, ఇద్దరు తల్లులను పొందితిని. అన్య దేహములను ధరించు వారికి అట్లైనచో తిరిగి ఆశ్చర్య మెందులకు? ఇప్పుడు నేను తపస్సు చేసు కొందును. మీరు విశాల గ్రామము నుండి ఈ భూపతి యొక్క పుత్రుడగు ఆ చైత్రుని ఈ స్థానమునకు తీసికొని రండు.

తదనంతరము రాజు భార్య బంధు గణాల సహితముగా విస్మయము చెందిన వాడై ఆ పుత్రుని మోహమును వీడి అతనికి వనమునకు వెళ్ళుటకు సమ్మతించెను. మరియ ఏ బ్రాహ్మణుడు చైత్రుని పెంచు చుండెనో, ఆ బ్రాహ్మణుని సన్మానించి తన పుత్రుని తెచ్చుకొని, ఆ రాజు ఆతనిని రాజ్యాభిషిక్తుని చేసెను.

ఇక్కడ ఆ ఆనందుడు మోక్ష విరోధులగు, అన్ని కర్మలను నశింప చేసుకోన వలెనను కోరికచే బాల్యావస్థ నుండియే మహా వనము నందు తపస్సు చేయ నారంభించెను. ఎప్పుడు ఆనందుడు ఈ విధముగా తపస్సు చేయుట యందు ప్రవృత్తు డయ్యెనో, అప్పుడు బ్రహ్మ దేవుడు అతనితో ఇట్లు పలికెను. వత్సా! దేని కొరకు నీవు ఇట్లు తీవ్రమగు తపస్సును చేయు చున్నావు? చెప్పుము.

ఓ భగవానుడా! ఎట్టి కార్యములు అన్నియు నాకు సంసార బంధనము యొక్క హేతు స్వరూపములై యున్నవో, వాని నాశనము కొఱకు నేను ఆత్మా శుద్ధి కొరకు తపస్సు చేయు చున్నాను.

క్షీణాధికార మనుష్య గణాలు ముక్తికి యోగ్యులు, కర్మవంతుడవు కానిచో నీవు సత్త్వాధికారి అయి ఏ విధముగా ముక్తిని పొందెదవు? నీవు ఆరవ మనువు అయ్యెదవు. ఇప్పుడు వెళ్ళుము. అట్లే కార్యములు చేయుము. అట్లు చేసిన ముక్తిని పొందెదవు. ఇప్పుడు నీకు తపస్సు చేయనవసరం లేదు.

బ్రహ్మ ఇట్లు చెప్పగానే ఆ మహామతి “అట్లే యగు గాక” అని పలికి ఆ కర్మాభిముఖుడై తపస్సు నందు విరతు డయ్యెను. బ్రహ్మ ఆతనిని తపస్సు నుండి నివృత్తుని గావించి “చాక్షుష” అను మొదటి పేరుతో అభిహితుని చేసెను. అనంతరము అతడు చాక్షుష మనువు అను పేరుతో ఖ్యాతి నొందెను. అటు పిమ్మట అతడు ఉగ్రుడను పేరు గల రాజు యొక్క పుత్రిక విదర్భను వివాహము చేసుకొని ఆమె గర్భము నుండి అనేక విక్రమ శాలులగు పుత్రులను ఉత్పన్నము చేసెను. ఓ ద్విజుడా! ఆ మన్వంతరాధిపతి యొక్క మన్వంతరమందు ఏ ఏ దేవతలు, ఏ ఏ ఋషులు,ఏ ఇంద్రుడు, ఏ ఏ సంతానము లుండిరో, అవి వినుము. ఓ విప్రుడా! ఈ మన్వంతర మందు దేవతల యొక్క ప్రథమ గణాలు “ఆప్య” అను పేరు గలవారు. ఆ గణమందు విఖ్యాత కర్ములు, యజ్ఞము నందు హవ్వ భోజులునగు ఎనిమిది దేవత లుండిరి.

విఖ్యాత బలవీర్యులు, ప్రభా మండల మధ్యస్థులు అగుటచే దుర్దర్శ అపర దేవతలుండిరి. దేవతలకు “ప్రసూత” యను పేరు గల రెండవ గణము నందు కూడ ఎనిమిది, మంది దేవత లుండిరి. ఓ ద్విజుడా! మూడవ భవ్యాఖ్య దేవతా గణమందు ఎనిమిది మరియు నాలుగవ యూథక గణము నందు ఎనిమిది దేవతలు ఉండిరి. ఐదవ గణము నందు అమృతాశులను పేరుతొ విఖ్యాతి పొందిరి. ఓ ద్విజుడా! ఆ మన్వంతర మందు ఇతర దేవా గణాలు లేక సంజ్ఞకులు ఈ ఐదవ గణమందు కూడా అమృతభోజులగు దేవతలు పూర్వము వారివలె అష్ట సంజ్ఞకులు. నూరు యజ్ఞములు చేసి భాగభుక్ “మనోజబ” అను పేరుగల ఇంద్రుడు వారికి అధిపతిగ నుండెను. సుమేధా, విరజా, హవిష్మానుడు, ఉన్నత, మధు, అతి సహిష్ణుత. ఈ సప్తర్షు లుండిరి. చాక్షష మనువు యొక్క ఉరు, పురు, శతధ్యుమ్న మొదలగు మహా బలవంతులు అగు పుత్రులు పృథ్వీపతు లయిరి.

ఓ ద్విజుడా! నేను ఈ ఆరవ మన్వంతర విషయమును,ఈ చాక్షుష మనువు యొక్క జన్మ మరియు చరిత్రను నీకు చెప్పితిని. ఇప్పుడు “వైవస్వత” అను పేరు గల ఏ ఏడవ మనువు ఉండెనో, ఆతని మన్వంతరము యొక్క దేవతలు మరియు వారి విషయమును నీకు చెప్పెదను వినుము. (బుద్ధి మంతుడగు ఏ మానవుడు పృథ్వి యందు ఈ చాక్షుష మన్వంతరము యొక్క కీర్తన చేయుదురో, లేక వినియెదరో వారు పుత్రులను, ఆరోగ్య సుఖ సంపదలను పొందెదరు.)