మార్కండేయ మహా పురాణము

Table of Contents

18 - మదాలసోపాఖ్యానము

పూర్వము మహావీర్య సంపన్నుడగు “శత్రు జిత్త” మను పేరు గల రాజు గలడు. అతడు చేసిన యజ్ఞములచే దేవేంద్రునికి సంతుష్టి గలిగెను. ఆ రాజుకు సర్వ లక్షణములు గల వాడు, శత్రువులను సంహరించు వాడు, మహా వీరుడును, “ఋతధ్వజు” దను కుమారు డుండెను. ఆ రాజ కుమారుడు బుద్ధి, విక్రమ, లావణ్యముల యందు గురు, శుక్ర, అశ్వినీ దేవతలతో సమానముగా నుండెను. మరియు నాతడు వయస్సుకు దగిన సత్త్వ, విక్రమ చేష్టలు గల వాడై యుండెను. ఆయా కాలము లందు కావ్య చర్చలతో, గీతాది శ్రవణములతో నాటక దర్శనములతో అక్ష క్రీడా వినోదములతో శస్త్రాస్త్రములతో వినయ విధేయతలతో గడుపు చుండెను.

ఒక్కొక్క సమయమున యోగ్యులయిన వారితో మల్లయుద్ధ క్రీడలు, రథముల మీద, అశ్వముల మీద యుద్ధ సంబంధ మగు నభ్యాసముల యందాసక్తి గల వాడై తోటి రాజ పుత్రులతో క్రీడించు చుండును. ఆ రాజ కుమారుడు రాత్రులందు గూడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య బాలకులతో వినోదముగా కాలము గడుపు చుండెను. ఆ రాజ కుమారుని వద్దకు సమాన వయస్కులగు పిల్లలందరూ ఆడు కొనుటకు వచ్చు చుండిరి. కొంత కాలమునకు నాగ లోకము నుండి భూలోకమునకు ఇద్దరు నాగ కుమారులు వచ్చిరి. “అశ్వతరు” డను నాగరాజు యొక్క కుమారులగు వారిద్దరు బ్రాహ్మణ బాలకుల రూపము ధరించి ఈ రాజ కుమారుని యొద్దకు వచ్చిరి. వారిద్దరూ తరుణ వయస్కులు, రూప సంపన్నులుగా నుండిరి. వారిద్దరూ సమాన వయస్కులగు బ్రాహ్మణ పుత్రుల తోను రాజకుమారుని తోను వినోదముగా ప్రీతి పూర్వకముగా ఆటలాడు కొనుచు రాజ పుత్రుని వద్దనే యుండ సాగిరి.

రాజ కుమారుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుమారులతో , నాగరాజు కుమారుల తోను స్నాన యానా రోహణములు జేయుచు విహరించు చుండెను. మరియు గంధ, వస్త్ర, అన్న సంయుక్త భోజనములు, ఆ రాజ కుమారునితో బాటు జేయు చుండిరి. నాగ కుమారులు ప్రతి నిత్యము వచ్చి ఆట లాడుకొని మరల వారి లోకమునకు బోవు చుండిరి. రాజ కుమారుని ప్రేమాదరణములచే వారిట్లు వచ్చు చుండిరి. నాగ కుమారులు గూడ రాకుమారుని యందలి ప్రీతిచే వచ్చి పరస్పరానంద మనుభవించు చుండిరి. రాజ కుమార నాగ కుమారులు పరస్పర హాస వివిధ వినోద సంలాపాదులతో మహా సంతోషముగా నుండిరి. ఆ యిద్దరు నాగ రాజకుమారులు లేనిచో, నా రాకుమారుడు స్నాన, పాన, భోజనములు జేయడు. నాగ కుమారులు లేనిచో క్రీడా యుండదు. అభ్యసించ వలసిన శాస్త్ర విద్యలు అభ్యసించడు. ఆ నాగ కుమారులు గూడ రసాతల లోకములో రాత్రి భాగమున నేమియు తోచక రాత్రులు గడుపు చుందురు.

ఇట్లు నాగ కుమారులు రాత్రి సమయ మందు వేడి నిట్టూర్పులతో కాలము గడపి రసాతలము నుండి పగటి భాగమున యాతని వద్దకు వచ్చు చుండిరి. ఈ ప్రకారముగా కొంత కాలము గడచినా పిమ్మట నాగరాజైన యశ్వతరుడు ఒక రోజున ఇద్దరు కుమారులను జూచి యిట్లనియె. ప్రియ పుత్రులారా మీకు మర్త్య లోకమందు ప్రీతి యెట్లు కలుగు చున్నది? మిమ్ములను జూచి చాలా రోజులైనది. ఈ పాతాళ లోకమందు మిమ్ము జూచుట లేదు. ప్రియమైన మిమ్ములను చూడకుండ ఉండలేను. పగలు మీరు కనబడుట లేదు. రాత్రి భాగమందే గనబడు చున్నారు.

ఇట్లు తండ్రి స్వయముగా అడిగిన పిమ్మట అంజలి ఘటించి, నమస్కరించి మహానుభావులు నాగ రాజ కుమారులు నగు వారు ఇట్లు చెప్పిరి.

“తండ్రీ ఋతధ్వజుని యొక్క కుమారుడు శత్రుజిత్తు అను పేరు గలవాడు గలడు. అతడు రూప వంతుడు, సరళచిత్తుడు, శూరుడు, మాని, ప్రియవాది, యశస్వి, వాగ్మి, విద్వాంసుడు, మిత్ర భావము గలవాడు. మరియు ప్రఖ్యాత మగు యశస్సు గల వాడు. వక్త, విద్వాంసుడు, స్నేహ పాత్రుడు, గుణ నిధియునై యున్నాడు.

మరియు నాతడు గౌరవనీయ పురుషుల గౌరవించు వాడు, లజ్జావంతుడు, వినయ భూషణుడు, యిట్టి వాడు గాన అతని యుపచారము, యాతని రీతి, అతని యొక్క సద్గుణంబులు మమ్ముల నాకర్షించినవి. నాగలోక మందు గాని, మరి యెచ్చటను గాని అచ్చట నున్న ఆనందము మాకు గలుగ లేదు. తండ్రీ! అతని వియోగముచే పాతాళ మందు చల్లని రాత్రి గూడ వేడిగా నున్నది. అతని సాంగత్యము కలిగినచో సూర్య తాపాన్వితమగు పగలైనను మాకు ఆహ్లాద జనకముగా నున్నది.

“పుత్రులారా! పుణ్యశీలులైన నా కుమారులు ధన్యులు. మీరు అతనిని పొగడు చున్నారు. మీరు గుణవంతులు గాన ఆతని పరోక్ష మందు ఆతని సుగుణములను వర్ణించు చున్నారు. లోకమున శాస్త్రవేత్త లైనను దుష్ట స్వభావ సంపన్ను లుందురు. మూర్ఖు లైనను సుస్వభావ సంపత్తి గల వారుందురు. శాస్త్రజ్ఞుడు సుశీలుడునగు నా రాజపుత్రు డత్యంత ధన్యుడు. మిత్రుని ద్వారా మిత్ర గుణము ప్రకటించుట, శత్రువు నుండి గూడ పరాక్రమమును వర్ణింబడుట యనునది సత్పురుషుల లక్షణములని నేను తలంచు చున్నాను.

అట్టి సత్పురుషుడగు కుమారుడు గల వాడే తండ్రి యని ఎల్లప్పుడు పెద్దలు జెప్పుదురు. మీరు అట్టివారు గాన నేను తండ్రినైతిని. అట్టి యుపకారి యగు రాజ పుత్రునికి మీరేమైనా జేయ దలబెట్టితిరా? పుత్రులారా! ఆ మిత్రుని మనస్సును సంతోషింప జేయుటకు నేమైన జేసితిరా? అట్లు సంతోషింప జేసిన వాడి జీవితమే సుజీవితము. వాడి జన్మయే సఫలము. ఎవడు అర్థులయిన వారిని విముఖులను జేయడో, మిత్రులయిన వారికి సహాయము జేయునో అట్టి వాని జన్మ ధన్యము. గావున మన గృహమున సువర్ణము, మొదలైన రత్నములు, వాహనములు ఆసనము లున్నవి గదా! ఇవియే గాక నింక నేమియైనను మీ మిత్రుని సంతోషింప జేయుటకు సంశయించక ఇవ్వ గోరుచున్నారు. మిత్రుడయిన వానికి అపకారము జేసిన వాడి జీవితము వ్యర్థము. ఏ పురుషుడు ఉపకార పరుడైన మిత్రునకు ప్రత్యుపకారము జేయడో వాని జీవనము వ్యర్ధము. మిత్ర వర్గమునకు ఉపకారము జేయ వలెను. శత్రువర్గమునకు అపకారము జేయ వలెను.

పురుష మేఘములు మిత్రులకు ఉపకారమును వర్షించును. ప్రాజ్ఞులు ఎల్లప్పుడు మిత్రుల యున్నతిని గోరు చుండును.

తండ్రీ! ఆ రాజకుమారునకు కావలసిన దేమియు లేదు. ఆతడు కృత కృత్యుడు. అట్టి వానికి మేము ఏ యుపకారము జేయగలము? ఆతడు గృహ మందు యాచక జనమునకు గోరిన పదార్థములను యిచ్చి గౌరవించు చుండును. ఆ రాజ కుమారునకు యుపకారమును జేయుటకు మాకు ఏ మాత్రము సమర్థత లేదు. అతనికి కావలసిన కోరిక యేమియు లేదు. అతని వద్ద నున్న రత్నములు మన పాతాళ లోకమందు కూడా లేవు. మరియు అతని వద్ద నున్న వాహనములు, ఆసనములు, యానములు, భూషణములు, వస్త్రములు, యిచ్చట మనకు లేవు. ఆతని కున్న విజ్ఞానము ఇంకొకరికి లేదు. తండ్రీ! ఆ రాజకుమారుడు పండితుల యొక్క సందియములను గూడ నివారించు శక్తి గలవాడు. యిట్టి వాడైనను కేవలము ఆ రాజకుమారునకు జేయదగిన పని యొకటి యున్నది. ఆ పనిని మాత్రము మేము జేయుటకు సమర్దులము గాము. ఆ కోరిక తీరవలయుననిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాదుల యనుగ్రహమున్న యెడల దీర గలదు.

అట్లైనచో నా రాజకుమారుని యొక్క యుత్తమ కార్యమేదో దెలుపుడు. విన వలెనని కుతూహలముగా నున్నది.

పండితులైన వారికి యసాధ్యమని సాధ్యమని ఏమున్నది? మానవులు దేవత్వము, దేవేంద్రత్వము, దేవ పూజ్యత్వమును గూడ బొందు చుందురు. దృఢ ప్రయత్నము గల పురుషులు మనో వాంచితములను నెరవేర్చు కుందురు. వారికి ఇహ లోక, పర లోకముల యందు తెలియనిది, పోరానిది,పొంద రానిది యుండదు. మనస్సును, ఇంద్రియములను నిగ్రహించి యాత్మను వశము జేసుకొని దృఢ యత్నము గల వాడైనచో వానికి సర్వము సిద్ధించును. చిన్నవయిన చీమలు అధిక ప్రయత్నము జేసి వేల కొలది యోజనములు బోగలుగు చున్నవి. పక్షిరాజగు గరుత్మంతుడు ఐనను ప్రయత్నా హీనుడగుచో నొక యడుగు వేయుటకు గూడ సమర్థుడు కాజాలడు. చూడుడు! ధ్రువుడు ధ్రువ లోకమును బొందెను. భూలోక మెక్కడ? ధ్రువ స్థాన మెక్కడ? ఉద్యోగి యగు వానికి పొంద రానిది లేదు. అనుద్యోగికి పొంద దగినది లేదు. ఉత్తానపాద మహారాజ కుమారుడు భూలోక మందున్న వాడైనను మహా ప్రయత్నము జేసి దుర్లభమగు ద్రువ మండలమును నలంకరించెను. గావున, పుత్రులారా! ఆ రాజకుమారుని కార్యమేమియో జెప్పుడు.

నా భూపాల సుతుడు మంచి వాడు గాన యాతడి కార్యమేమియో చెప్పుడు. మీరు గూడ మిత్రుని ఋణము తీర్చు కొన గలుగుదురు గాక.

జనకా! మహాత్ముడునగు నా రాజ సూనుడు ఒకానొకప్పుడు తన పూర్వ వృత్తాంతమును జెప్పెను. సత్ప్రవర్తన గల ఆ రాజకుమారుడు కౌమారవస్థలో జరిగిన వృత్తాంతము జెప్పెను. ఆ కుమారుని పేరు ఋతధ్వజుడు. తండ్రి పేరు శత్రుజిత్తు. అతడి తండ్రి వద్దకు నొక విప్రుడు వచ్చెను. ఆ ద్విజుని పేరు గాలవుడు. ఆయన యొక శ్రేష్టమగు నశ్వమును వెంట తీసుకొని వచ్చెను. రాజ సమీపమునకు వచ్చి రాజుతో నిట్లనియె. రాజా! దైత్యాధము డగు నొక రాక్షసుడు నా యాశ్రమమును నాశనము జేయు చున్నాడు. ఆ పాపాత్ముడు గజ, సింహాది రూపములు ధరించి వనములను బాడు చేయుచున్నాడు. మరియు నా రాక్షసుడు ఇతరములైన భయంకర జంతు రూపముల ధరించి అహర్నిశ మకారణముగా మౌన వ్రతమును పాటించి సమాధి ధ్యాన నిష్ఠుడనగు నాకు విఘ్నము గలిగించు చున్నాడు.

పార్థివా అట్లు విఘ్నము జేయు చున్నను వానిని శాపాగ్ని దగ్ధుని జేయుటకు మాలాంటి వారము సామర్థము గల వారము గాము. నరనాథ! క్రోధాగ్ని తపోనాశనము జేయును. రాజా దుఃఖార్జితమగు తపస్సును వ్యర్థము జేయుటకు ఇష్టపడ కున్నాను. ఇట్లుండ నేనొక రోజున వాని కారణముగా మహా దుఃఖమున నిర్విణ్ణ చేతస్కుడనై యుంటిని. నేను ఆ సమయమున ఆకాశముకై జూచుచు వేడియగు నిట్టూర్పు వదలితిని. అప్పుడు తత్క్షణమే గగన తలము నుండి ఈ యశ్వము భూతలమునకు వచ్చెను. పిమ్మట నరనాథా! ఆకాశవాణి నాతో నిట్లు బల్కెను. ద్విజోత్తమా! ఈ తురగము ఏ మాత్రము శ్రమ లేక సకల భూమండలము తిరిగి రాగలదు. మరియు సూర్య సమాన వేగము గలది. పాతాళ, ఆకాశ, జలము లందు తిరుగు లేని గమనము గలది యగు ఈ యశ్వమును నీ కొరకు ఇచ్చు చున్నాను.

సమస్త దిక్కులను పర్వతములను అతిక్రమించి శ్రమయనునది లేక భూ వలయమును ప్రదక్షిణము జేసి రాగలదు. అందు వలన నీ తురగము “కువలయము” అను పేరుతో లోకము లందు ప్రఖ్యాతి బొందగలదు. పాపాత్ముడగు దానవాధముడు నిన్ను ఎల్లవేళలా క్లేశ బరచు చున్నాడు. శత్రుజిత్తు అను భూపాలుని కుమారుడు ఋతధ్వజుడు అను వాడు గలడు. అతను యీ అశ్వరత్నము నారోహించి వానిని వధించ గలడు అని యాకాశవాణి జెప్పెను. ఈ అశ్వ ప్రాప్తిచే నీ కుమారుడు గూడ ప్రఖ్యాతిని బొంద గలడు. ఇందు వలన నీ వద్దకు వచ్చితిని. ఆ రాక్షసుడు తపో విఘ్నము జేయు చున్నాడు. గాన నో రాజా! రాజగు వాడు గూడ తపస్సులో భాగమును బంచుకొను వాడే గాన ఆ దానవుని నివారించుము. భూపాలా! ఈ యశ్వ రత్నమును నీకిచ్చు చున్నాను. గ్రహింపుము. అప్పుడా రాజు గాలవుని మాటలు వినిన యనంతరము ధర్మ లోపము గాకుండుటకు కుమారునకు ఆజ్ఞ ఇచ్చెను. ధర్మాత్ముడగు నా రాజు కుమారునికి కౌతుకాది మంగళాశీర్వచనాదులు గావించి యప్పుడు గాలవ మహర్షి వెంట బంపించెను. ఆ మహర్షియు నా రాజ కుమారుని దీసికొని తన యాశ్రమమునకు బోయెను.