మార్కండేయ మహా పురాణము

Table of Contents

17 - దత్తాత్రేయోపాఖ్యానము

సర్వేశ్వరుడగు కార్తవీర్యుడు ఋషీశ్వరుడు జెప్పిన యీ వాక్యము వినిన బిమ్మట, దత్తాత్రేయా శ్రమమునకు పోయి యాతడిని భక్తితో పూజించెను. పాద సంవాహనాదుల చేతను, స్రక్చందనాదులు, గందోదకము, పండ్లు మొదలగు వానిని దెచ్చుట చేతను, మరియు నట్లు భోజ్యములగు నన్నములకు తగిన వ్యంజనాదులు సమకూర్చుట చేతను, ఆయన యెంగిలి కడుగుట చేతను, ముని సంతుష్టుడయి అప్పుడా రాజును చూచి యిట్లనియె. దేవతలు మద్యపాన మాంస భక్షాదులు నిందిత కర్మలుగా జెప్పిరి. ఇంతియే గాక ఈ యువతి గూడ నావద్ద యున్నది. ఈమెతో సంభోగము చేయుటచే దుష్కర్ముడనై వున్నాను. నీవు నన్ను యిట్లు ఎల్లప్పు డాటంక పరచుట తగినది గాదు. ఓయీ! నీకు నేను ఉపకారము జేయ నశక్తుడను. శక్తుడగు వాని నారాధింపుము.

దత్తాత్రేయుడిట్లు జెప్పగా వినిన యా రాజు గర్గ మహర్షి జెప్పిన వాక్యమును గుర్తు బెట్టుకొని ఆయనకు ప్రణమిల్లి తిరిగి యిట్లు బలికెను.

దేవా! నీవు పురాణ పురుషుడవు. స్వీయ మాయా సమావృతుడవై యిట్లు ప్రవర్తించు చున్నావు. మహానుభావా! నీవు పాప రహితుడవు. ఈ దేవి సర్వ సంసార దుఃఖమునకు అరణి. ఇట్లని పలికినందున దత్తుడు సంప్రీతుడై మరల నాతనితో నిట్లనియె. అతి రహస్యమగు నా నామమును నీవు జెప్పితివి గాన వరమును గోరు కొనుమని మహా వీర్యము గలవాడు, భూమండల మంతయు స్వాధీనము జేసుకొనిన వాడు నగు కార్తవీర్యునికి మరల జెప్పెను.

రాజా! అందు మూలమున నాకు నీ యందత్యంత సంతుష్టి కలిగినది. ఏ నరులు నన్ను గంధ మాల్యాదులతో పూజించెదరో, నాకు సమ్మతములగు పరిశుద్దాన్నముల చేతను, మాంస, మద్యోప హారముల చేతను, గీతముల చేతను, బ్రాహ్మణార్చనల చేతను, లక్ష్మీ సమేతుడగు నన్నా రాధింతురో, మరియు బాదోదకముల చేతను, మనోహరము లయిన వీణా, వేణు, శుభాదుల చేతను, శేవించుదురో, యట్టి వారికి నేను పుత్రా దారధనాదుల నిచ్చి పరమ సంతోషము గలిగించెదను. అవధూతనగు నేను, నన్ను బూజించు వారాలకు సర్వ సంపదల నొసంగెదను. నన్నవమానించు వారలను వధించెదను. నీవు నన్ను బూజించితివి గాన నీకు శుభమగును గాక. నీ మనస్సున కభీష్టమగు వరమును గోరుము. ఓయీ! నేను గుహ్యనామ సంకీర్తనముచే ప్రసాద సుముఖుడ నైతిని.

దేవా! నీవు నా యందు ప్రసన్నుడ వైనచో నత్యుత్తమ మగు బుద్ధి ఐశ్వర్యమును యిమ్ము. నేను ధర్మము చెడకుండా (ఐశ్వర్యము వలె) ప్రజా పాలనము జేయునట్లు గాను పరానుస్మరణ జ్ఞానము (శత్రువు నను సరించు జ్ఞానము) యుద్ద రంగమున నాతో సమానముగా రెండవ వాడు లేనట్లుగా వరమిమ్ము.

మరియు లాఘవ గుణయుతములగు వేయి బాహువులు బొంద గోరుచున్నాను. ఆకాశ, జల, భూమి, పర్వతము లందు మరియు సర్వ ప్రదేశముల యందు అవ్యాహిత గమనము, ఉత్తముడగు మనుజునిచే వధయు గోరు చున్నాను. దుర్మార్గ ప్రవృత్తి గల వానికి సన్మార్గ దేశికుడ నగునట్లు వరమిమ్ము. శ్లాఘనీయులగు అతిధులు గలుగుదురు గాక. అటులనే దానమునకు అక్షయమైన ధనము కలుగు గాక. రాష్ట్రమందు నన్ను స్మరించుట వలన ద్రవ్య నష్టము లేకుండు గాక. హే దేవా! నీ యందు నిత్య మచంచల భక్తిని గలిగి యుందును గాక.

హే వత్సా! నీవు ఏమి గోరితివో అవి యన్నియు బొందెదవు గాక. నా యనుగ్రహమున ఈశ్వర సంబంధమగు చక్రవర్తిత్వము గలుగు గాక.

తరువాత నా దత్తాత్రేయునికి వందనము జేసి యా కార్తవీర్యార్జునుడు, సమస్త ప్రజల నాహ్వానించెను. పట్టాభిషేకము చేసికొన గోరెను. ఆ సమయమున గంధర్వులు,అప్సరా గణములు వచ్చిరి.  అట్లు వశిష్టాది మహర్షులు వచ్చిరి. పర్వత రాజులు సమస్త గంగాది నదులు రత్న సంభవములగు సముద్రములు వచ్చెను. ప్లక్షాది వృక్షముల ఇంద్రాది దేవతలు, వాసుకీ ప్రముఖులగు సర్పరాజులు కార్త వీర్యుల పట్టాభిషేకమునకు వచ్చిరి. గరుడాది పక్షి రాజులు పౌరులు జానపదులు సమస్త లోక వాసులు వచ్చిరి. ముని వరుడగు దత్తాత్రేయుని ప్రసాదముచే పట్టాభిషేకమునకు సమస్త సంభారములు గూర్చ బడెను. తరువాత బ్రహ్మాది దేవతలు అగ్ని దేవుని ప్రజ్వలింప జేసిరి. దత్తాత్రేయ స్వరూపుడగు నారాయణుడు పట్టాభిషేకము జేసెను.

పిమ్మట సముద్ర దేవతలు, నదీ దేవతలు, ఋషులు క్రమముగా నభిషేకించిరి. “కార్త వీర్యార్జునుడు చక్రవర్తి యయ్యె” నని చాటించిరి. మహాయోగి దత్తాత్రేయుని యనుగ్రహమున అఖండైశ్వర్య వంతుడు మహా బలాన్వితు డయ్యెను. ఈ రోజు మొదలు నేను దప్ప యెవరు గూడ ఆయుధములు ధరించరాదు అని జెప్పెను. అట్లు ధరించినచో పరహింసా రహితుడైనను అట్టివాడు నాచే వధింప బడును. ఇట్లు ఆజ్ఞాపించెను. నాటి నుండి ఏ మానవుడు గూడ ఆయుధములు ధరించిన వాడెక్కడ గూడ లేడు. మహాపురుషుడు పురుష వ్యాఘ్రుడు నగు నాతడు దప్ప నతని సాటి ఎవ్వరు లేరు. గ్రామ పాలుడు పశుపాలుడు ఆతడే యాయెను. క్షేత్ర పాలకుడు గూడ ఆతడే ఆయెను. రెండవ వాడు లేడు. తాపస రక్షకుడు ఆతడే. అర్థపాలకుడు గూడ నాతడే ఆయెను.

శత్రు వీర ఘాతకుడగు నా చక్రవర్తి చొర, సర్ప, అగ్ని, శస్త్ర, శత్రువులు, భయంకరమగు సముద్రాది జలములు మొదలగు వీటి వలన యాపదలు సంభవించినచో, వాటి నుండి రక్షించు వాడయ్యెను. ఇదంతయు ఎందులకు? కార్తవీర్యార్జునుని నామ స్మరణ మాత్రముచే మనుష్య గణము సమస్త యాపదల నుండి విముక్తు లగు చుండెను. ఆ రాజు పాలించు చుండ నెవ్వరికి ద్రవ్య నష్టము గలుగ లేదు. ఆ రాజు అనేకములగు మహా యజ్ఞములు జేసెను. సమాప్తి యందు కోరిన దక్షిణ లిచ్చెను. మహా తపస్వి అయ్యెను. యుద్దము లందు మహా వీరుడయ్యెను. అప్పుడు కార్త వీర్యుని మహిమను సమృద్ధిని జూచి అంగిరా మహర్షి “ఏ రాజులు గూడ కార్తవీర్యుని సమానము గాజాల” రనెను. యజ్ఞ, దాన, సంగ్రామ, తపస్సులలో కార్తవీర్యుని సమానులు లేరు. దత్తాత్రేయుని అనుగ్రహముచే ఏ రోజున అఖండైశ్వర్యాది వరలాభము గలిగెనో.

రాజా! ప్రతి సంవత్సరము ఆ రోజు రాగానే దత్తాత్రేయుని గురించిన యజ్ఞము జేయు చుండెను. సమస్త ప్రజలు గూడ అటులనే దత్త యాగము జేయు చుండిరి. ఇట్లు సావధానులై రాజు మరియు ప్రజలు దత్త యాగము జేసిరి. దీమంతుడగు దత్తాత్రేయుని మహాత్మ్య మిట్టిదని జెప్పనలవి గాదు. చరాచర గురుడు, అనంతుడు, శార్జధన్వుడు, శంఖ, చక్ర, గదాదారి, అప్రమేయుడు నగు శ్రీమన్నారాయణుడు దత్తాత్రేయ రూపమున అవతరించెను. దత్తుని జన్మ కర్మలు పురాణములందు నానా ప్రకారములుగా చెప్ప బడినవి. ఆది మధ్యాంత రహితుడు, ప్రమాణ రహితుడు, శంఖ, చక్రాదిధారి యగు శ్రీ దత్తాత్రేయుని రూపమును ధ్యానము జేసిన వారు ధన్యు లయ్యెదరు. “ఓ విష్ణు భక్తులారా! ఎవరయితే భక్తితో నన్ను ఆరాధించెదరో వారికి సుఖము గలుగ జేయుదును. అచిర కాలమున సంసార దుఃఖమూలా నుండి విముక్తి గలుగజేయుదును. నేను భక్తి సులభుడను “ అని ప్రతిజ్ఞ జేసెను.

“కేవలము పత్ర పుష్ప ఫలాదులతో పూజించినను నేను అట్టి వారికి మోక్షమును ప్రసాదించెదను.” అని ఈ ప్రకారముగా దత్తాత్రేయ స్వామి జెప్పెను. జనము ఇట్టి మహాత్ముని ఎందుకు సేవించరు? దత్తాత్రేయ మహాముని అనాది నిధనుడు. ధర్మము నాచరించుటకు, అధర్మమును నశింప జేయుటకు స్థితి పాలనములు చేయు చుండును. జనకా! ఇప్పుడు నీకు అలర్కుడను వాని జనన వృత్తాంతమును జెప్పెదను. దత్తాత్రేయుడు అలర్కరునికి యోగ ప్రభావమును జెప్పెను. అలర్కుడు పితృ భక్తుడు రాజర్షి మహాత్ముడునై యుండెను.