మార్కండేయ మహా పురాణము
39 - యోగ నిరూపణము
ఈ ప్రకారముగా ఏ యోగి బాగుగా యోగ చిత్తుడై యుండునో జన్మాంతర శతముల కైనను తిరిగి ఆ యోగి స్వస్థానము నుండి నివృత్తుడు కాడు. యోగి విశ్వరూపుడు, విశ్వేశ్వరుడు, విశ్వ భావనుడు విశ్వపాద శిరోగ్రీవుడు నగు పరమాత్మను ప్రత్యక్షము చేసు కొనును. ఆ పరమాత్మను ప్రత్యక్షము చేసు కొనుటకు మహా పుణ్య ప్రదమగు “ఓం” అను ఏకాక్షరమును జపించ వలెను. అదే అధ్యయనము చేయ వలెను. ఓంకార స్వరూపమును శ్రవణము చేయ వలెను. అకార, ఉకార, మకారములు అను ఈ మూడు అక్షరములు ఓంకారము యొక్క స్వరూపమై యున్నవి. వీటిని మూడు మాత్రలుగా తెలుసుకొన వలెను. ఈ మూడు మాత్రలు క్రమానుసారముగా సాత్త్విక, రాజస, తామసములై యున్నవి. ఈ మూడక్షరముల కంటె అతిరిక్తముగా ఓంకారమునకు ఒక అర్థ మాత్ర ఉన్నది. అది సాత్త్వికాది మూడు గుణముల కంటే అతీత మైనది.అనగా నిర్గుణ స్వరూపమై యున్నది.
ఈ అర్థ మాత్ర పిపీలిక (చీమ) తో సమాన గమనము కలిగి స్పర్శ యుక్తమై ఉన్నది. ఇది శిరోభాగ మందు చూడబడు చున్నది. ఓంకారము ప్రయోగించి ఏ విధముగా గమనము చేయు చున్నదో ఈ ప్రకారముగా యోగ యుక్త పురుషుడు ప్రతి అక్షర మందు ఓంకార మయుడు అగు చున్నాడు. ప్రాణము ధను స్స్వరూపము. ఆత్మ బాణ స్వరూపము. బ్రహ్మ లేధ్యస్య రూపముగాను తెలుసుకొన వలెను. అప్రమత్తుడై బాణముతో సమానముగా బ్రహ్మను లక్ష్యము చేసినచో తన్మయుడు కాగలడు. ఓంకారము మూడు వేదములు, మూడు లోకములు, మూడు అగ్నులు, త్రిమూర్తులు, ఋక్, సామ, యజుః, స్వరూపములై ఉన్నది. పరమార్థ విచారముచే ఓంకారము సార్ద త్రిమాత్రలు గల దానినిగా తెలుసుకొన వలెను. ఈ ఓంకార మందు సంయుక్తుడైన యోగి ఓంకార మందు విలీనుడగును. ఆకారము భూర్లోకము ఉపకారము భువర్లోకము సవ్యంజన మగు మకారము స్వర్లోకముగా చెప్ప బడెను. మొదటి మాత్ర వ్యక్తమని రెండవ మాత్ర అవ్యక్తమని చెప్పుదురు.
మూడవ మాత్ర చిచ్చక్తి అని చెప్పుదురు. మరియు నాల్గవ మాత్ర పరమ పదమని చెప్పబడెను. ఈ ప్రకారముగా ఈ మాత్రలను యోగ భూములుగా తెలుసుకొన వలెను. “ఓం” అను ఈ అక్షరము యొక్క ఉచ్చారణ మాత్రము చేతనే సమస్తములగు సత్, అసత్ రూపములు గ్రహింప బడిన వగుచున్నవి. మొదటి మాత్ర హ్రస్వము, రెండవ మాత్ర దీర్ఘము, తృతీయ మాత్ర ప్లుత స్వరూపమై యున్నది. అర్థ మాత్ర యొక్క స్వరూప వర్ణనము చేయుట సాధ్యము కాదు. ఈ ప్రకారముగా యోగి ఓంకార సంజ్ఞకము, అక్షర స్వరూపమగు పర బ్రహ్మను తెలుసుకొని ఓంకార ధ్యానము చేసినచో ఆ యోగి సంసార చక్రము నుల్లంఘించి త్రివిధ బంధములను (ఈపణ త్రయములు) త్యజించిన వాడై పరమాత్మ స్వరూపమగు పరబ్రహ్మ యందు లీనమగు చున్నాడు. కర్మ బంధము క్షయము గాని యెడల, అరిష్టముల వలన మృత్యువును తెలుసుకొని మరణ కాలమందు జాతి స్మృతి కలవాడై మరల యోగిగా పుట్టును. ఈ కారణముచే యోగి సిద్ధి అసిద్ధుల యందు అరిష్టము లన్నింటిని తెలుసుకొన వలెను. అరిష్టములను తెలుసు కొనినచో మరల కాల మందు దుఃఖ ప్రాప్తి ఉండదు.
