వాయు మహా పురాణము
3 - సృష్టి ప్రకరణము
సూత ఉవాచ :-
మహేశ్వరా యోత్తమ వీర్య కర్మణే సురర్ష ఛాయామిత బుద్ధితేజసే ।
సహస్ర సూర్యానల వర్చసే నమః త్రిలోక సంహార విసృష్టయే నమః ॥
ప్రజాపతీన్ లోక నమస్కృతాం స్తథా స్వయంభు రుద్ర ప్రభృతీన్ మహేశ్వరాన్।
భృగుం మరీచిం పరమేష్ఠినం మనుం రజస్తమో ధర్మమథాపి కశ్యపమ్ ॥
వసిష్ఠ దక్షాత్రి పులస్త్య కర్దమాన్ రుచిం వివస్వంత మథాపి చ క్రతుమ్ ।
మునిం తథైవాంగిరసం ప్రజాపతిం ప్రణమ్య మూర్ధ్నా పులహం చ భవతః ॥
సూతుడిట్లు పలికెను:- సర్వ శ్రేష్ఠమగు పరాక్రమము, కర్మ, బుద్ది మరియు తేజస్సు కలిగినట్టియు, అనంత సూర్యుల వర్చస్సు కలిగినట్టియు, ముల్లోకములను సంహరించి, సృష్టించునట్టియు, దేవ దేవుడైన మహేశ్వరుని కొరకు నమస్కారము. ముల్లోకములలో పూజింపబడే ప్రజాపతులను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, భృగువును, మరీచిని, మనువును మరియు, రజస్తమోధర్మములు గల కశ్యపున, వసిష్ఠుని, దక్షుని, అత్రిని, పులస్త్యుని, కర్దముని, రుచిని, సూర్యుని, క్రతువును, అంగిరసమహర్షిని, ప్రజాపతిని, మరియు పులహుని మనసా స్మరించి, శిరసా నమస్కరించెదను.
తథైవ చుక్రోధ న మేకవింశతిం ప్రజావివృద్ధ్యార్పిత కార్య శాసనమ్।
పురాతనానప్య పరాంశ్చ శాశ్వతాన్ తథైవ చాన్యాన్ సగణాన వస్థితామ్ ॥
తథైవ చాన్యానపి ధైర్యశోభినో మునీన్ బృహస్పత్యుశనః పురోగమాన్।
తపః శుభాచార ఋషీన్ దయాన్వితాన్ ప్రణమ్య వక్ష్యే కలిపాప నాశినీమ్॥
మరియు, ఇరువది ఒకటవ ప్రజాపతి యగు చుక్రోధనుని, నమస్కరించెదను. పురాతనులు, శాశ్వతులు, తమ తమ శిష్యగణములతో కూడియున్నవారు. ధైర్యము (జ్ఞానము) తో శోభించువారునగు ఇతర ఋషులను నమస్కరించెదను. తపస్సు, సదాచారము, దయలతో కూడిన బృహస్పతి శుక్రాది మునిపుంగవులను నమస్కరించి కలి యొక్క పాపమును పోగొట్టే పురాణమును చెప్పెదను.
ప్రజాపతేః సృష్టి మీమామనుత్తమాం సురేశ దేవర్షి గణైరలంకృతామ్।
శుభామతుల్యా మనఘామృషి ప్రియాం ప్రజాపతీనామపి చోల్బణార్చిషామ్॥
తపోభృతాం బ్రహ్మదినాది కాలికీం ప్రభూతమావిష్కృత పౌరుషశ్రియమ్।
శ్రుతౌ స్మృతౌ చ ప్రసృతా ముదాహృతాం పరాం పరాణామనిల ప్రకీర్తితామ్ ॥
ప్రజాపతి యొక్క ఈ సృష్టి సర్వ శ్రేష్ఠమైనది. దీని యందు ఇంద్రుడు, దేవ గణములు, ఋషి గణములు విరాజిల్లు చున్నవి. తపోధనులు, మహా తేజశ్శాలురునగు ప్రజాపతుల శుభమైన, సాటిలేని, పుణ్యశాలియగు, ఋషి పూజితమగు సృష్టిని కూడా వర్ణించెదను. బ్రహ్మగారీ పగలు ప్రారంభమయ్యే వేళలో ఆయన సృష్టి సామర్థ్యము ఈ జగద్రూపముగా ప్రకటితమయ్యెను. వేదమునందు, స్మృతుల యందు వర్ణింపబడి, వాయుదేవునిచే కీర్తింపబడిన ఈ మహామహిమాన్వితమగు సృష్టిని వర్ణించేదను.
సమాస బంధైర్ని యతైర్యథాతథం విశబ్దనేనాపి మనః ప్రహర్షిణీమ్ ।
యస్యాం చ బద్ధా ప్రథమాప్రవృత్తి: ప్రాధానికీ చేశ్వరకారితా చ॥
యత్తత్ స్మృతం కారణమ ప్రమేయం బ్రహ్మ ప్రధానం ప్రకృతి ప్రసూతి।
ఆత్మా గుహా యోనిరథాపి చక్షుః క్షేత్రం తథైవామృతమక్షరం చ॥
శుక్రం తపస్స త్త్వ మతి ప్రకాశం తద్వ్యష్టి నిత్యం పురుషం ద్వితీయమ్।
తమప్రమేయం పురు షేణ యుక్తం స్వయంభువా లోకపితా మహేన ॥
ఈ పురాణము సుందరమగు సమాసములతో, విశిష్టమగు శబ్దములతో మనస్సునకు ఆహ్లాదమును కలిగించును. దీని యందు ఈశ్వరుని సంకల్పముచే ఆహ్లాదమును కలిగించును. దీని యందు ఈశ్వరుని సంకల్పముచే ప్రధానము నుండి బయలుదేరిన ప్రథమ సృష్టిని బంధింపబడినది. జగత్కారణము, ప్రమాణ గోచరము కానిది, ప్రకృతికి మూలము, ఆత్మ రూపముగా హృదయగుహ యందు ప్రకాశించే ద్రష్టయగు పరబ్రహ్మ వర్ణింపబడినది. క్షేత్ర స్వరూపము, మరియు అక్షర శబ్దవాచ్యుడు, అమృతస్వరూపుడు, శుద్ధజ్ఞానస్వరూపుడు, నిత్యుడునగు జీవుని స్వరూపము, ముల్లోకములకు పితామహుడగు బ్రహ్మగారిని సృష్టించిన అప్రమేయు (ప్రమాణములకు అందని డగు పరమాత్మ స్వరూపము నిరూపింపబడినవి.
ఉత్పాదకత్వా ద్రజసోతిరేకాత్ కాలస్య యోగాన్నిగమావధేశ్చ ।
క్షేత్రజ్ఞయుక్తాన్ నియతాన్ వికారాన్ లోకస్య సంతాన వివృద్ధి హేతూన్॥
ప్రకృత్యవస్థా సుషువే తథాష్టౌ సంకల్ప మాత్రేణ మహేశ్వరస్య ।
దేవాసురాద్రి ద్రుమసాగరాణాం మనుప్రజేశర్షి పితృద్విజానామ్॥
పిశాచయక్షో రగరాక్షసానాం తారాగ్రహార్కర్ష నిశాచరాణామ్।
మాసర్తు సంవత్సరరాత్ర్యహానాం దిక్కాలయోగాది యుగాయనానామ్॥
వనౌషధీనామపి వీరుధాం జలౌకసామప్సరసాం పశూనామ్।
విద్యుత్సరిన్మేషు విహంగమానాం యత్సూక్ష్మగం యద్భువి యద్వియత్స్థమ్॥
యత్ స్థావరం యత్ర యదస్తి కించిత్ సర్వస్య తస్యాస్తి గతిర్విభక్తి ।
ఛందాంసి వేదా: సఋచో యజూంషి సామాని సోమశ్చ తథైవ యజ్ఞ:॥
రజోగుణ ప్రధానుడగు సృష్టికర్త సృష్టి కాలమునందు కర్మ ఫలానుసారముగా, క్షేత్రజ్ఞుని (జీవుని) తో గూడిన, పాంచ భౌతిక వికారములగు దేహములను సృష్టించి, ఆ ప్రాణుల ద్వారా వాటి వాటి సంతానము వృద్ధియగు నట్లేర్పరిచెను. జగద్రూపముగా పరిణమించిన ప్రకృతి యందు మహేశ్వరుడు సంకల్ప మాత్రము చేతనే తన ఎనిమిది అవస్థా విశేషములను (మూర్తులను) సృష్టించెను. దేవతలు, అసురులు, పర్వతములు, వృక్షములు, సముద్రములు, మనువులు, మహారాజులు, ఋషులు, పితరులు, ద్విజులు, పిశాచములు, యక్షులు, నాగులు, రాక్షసులు, నక్షత్రములు, గ్రహములు, సూర్యుడు, సప్తర్షి మండలము, నిశాచరులు, మాసములు, ఋతువులు, సంవత్సరములు, రాత్రులు, పగళ్లు, దిక్కులు, కాలము, యోగములు, యుగములు, అయనములు, వనములు, ఓషధులు, లతలు, సరస్సులు, అప్సరసలు, పశువులు, విద్యుత్తు, వర్షము, మేఘములు, పక్షులు మొదలగు వాటి గతి, విభాగము ఈ పురాణము నందు వర్ణింపబడినవి. భూమి యందు, ఆకాశము నందు ఉండే సూక్ష్మ గమనము గల ప్రాణులు, మరియు చెట్లు మొదలగు కదలని ప్రాణులు ఇత్యాది సర్వప్రాణుల గతి, విభాగములు దీనియందు గలవు. ఛందస్సులు, వేదములు, ఋక్కులు, యజుస్సులు, సామలు, సోమము మరియు యజ్ఞము దీని యందు వర్ణింపబడినవి.
ఆజీవ్యమేషాం యదభీప్సితం చ దేవస్య తస్యైవ చ వై ప్రజాపతేః।
వైవస్వతస్యాస్య మనోః పురస్తాత్ సంభూతిరుక్తా ప్రసవశ్చ తేషామ్॥
యేషామిదం పుణ్యకృతాం ప్రసూత్యా లోకత్రయం లోకనమస్కృతానామ్।
సురేశ దేవర్షి మనుప్రధీనాం ఆపూరితం చోపరి భూషితం చ॥
ఆ బ్రహ్మదేవుడు తన అభిమతముననుసరించి వివిధ ప్రాణులకు జీవికను కల్పించుట, ముందుగా వైవస్వతమనువు యొక్క పుట్టుక వర్ణింపబడినవి. ముల్లోకముల యందు పూజింపబడే ఇంద్ర, బృహస్పతి, మన్వాది ధీశాలురపుట్టుకచే ఈ సృష్టి పూర్ణమై ప్రకాశించినది. అట్టి ఆపుణ్యాత్ముల ఉత్పత్తి కూడా వర్ణింపబడినది.
రుద్రస్య శాపాత్ పునరుద్భవశ్చ దక్షస్య చాప్యత్ర మనుష్యలోకే।
వాసః క్షితౌ వా నియమాద్భవస్య దక్షస్య చాత్ర ప్రతిశాపలాభః॥
మన్వంతరాణాం పరివర్తనాని యుగేఘ సంభూతి వికల్పనం చ।
ఋషిత్వమార్షస్య చ సంప్రవృద్ధి: యథా యుగాదిష్వపి చేత్తదత్ర॥
యే ద్వాపరేషు ప్రథయంతి వేదాన్ వ్యాసాశ్చ తేఽత్ర క్రమశో నిబద్దా:।
కల్పస్య సంఖ్యా భువనస్య సంఖ్యా బ్రహ్మస్య చాప్యత దినస్య సంఖ్యా ॥
రుద్రుని శాపముచే దక్షుడు మనుష్య లో మలో జన్మించి, నియమబద్దముగా జీవించుట, దక్షుడు రుద్రునకు ప్రతి శాపమునిచ్చుట. మన్వంతరములు మారుచుండుట, యుగములయందు జరిగే సృష్టి ప్రళయములు, ఋషి ధర్మము, యుగాదుల యందు దాని వృద్ధి వర్ణింపబడును. ద్వాపర యుగములందు వేద విభాగము చేసిన వ్యాసుల క్రమము, కల్పములోని సంవత్సరముల సంఖ్య, లోకముల సంఖ్య, బ్రహ్మగారి దినములోని కాలమానము అను విషయములు ఈ పురాణములో నిబంధింపబడినవి.
అండోద్భిజ స్వేదజరాయుజానాం ధర్మాత్మనాం స్వర్గనివాసినాం వా।
యే యాతనాస్థాన గతాశ్చ జీవా: తర్కేణ తేషామపి చ ప్రమాణమ్॥
ఆత్యంతికః ప్రాకృతికశ్చ యోఽయం నైమిత్తికశ్చ ప్రతిసర్గ హేతుః।
బంధశ్చ మోక్షశ్చ విశిష్య తత్ర ప్రోక్తా చ సంసారగతి: పరా చ॥
ప్రకృత్య వస్థేషు చ కారణేషు యా చ స్థితిర్యా చ పునః ప్రవృత్తిః।
తచ్ఛాస్త్రయుక్త్యా స్వమత ప్రయత్నాత్ సమస్త మావిష్కృతధీ ధృతిభ్య: ॥
విప్రా ఋషిభ్యస్సముదాహృతం యత్ యథాతథం తచ్ఛృణుతోద్యమానమ్ ॥
ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తీ సృష్టే ప్రకరణం నామ తృతీయోఽధ్యాయః ॥
అండజములు (గ్రుడ్డు నుండి పుట్టే పక్ష్యాదులు), ఉద్భిజములు (భూమి నుండి పుట్టే వృక్షాదులు) స్వేదజములు (చెమట నుండి పుట్టున నల్లులు మొదలైనవి), జరాయుజములు (గర్భము నుండి పుట్టే మనుష్యాదులు) అను నాలు రకముల ప్రాణులు, స్వర్గాది లోకములను పొందే ధర్మాత్ములు, నరకములో యాతనలను అనుభవించే జీవుల వివరములు ఈ పురాణములో సోపపత్తికముగా వర్ణింపబడినవి. ఆత్యంతీక ప్రళయము (జగత్తు ఈశ్వరుని యందు విలీనమగుట), ప్రాకృతిక ప్రళయము (దేహము పతనమగుట), నైమిత్తిక ప్రళయము (నిద్రలోనికి జారుకొనుట), బంధ మోక్షములు, సర్వోత్కృష్టమగు ప్రాజాపత్య స్థానముతో కూడిన సంసారగతి దీనియందు వర్ణింపబడినవి. ప్రళయమునందీ బ్రహ్మాండములు జగత్కారణమగు ప్రకృతి యందు నిలీనమై యుండుట, ఇత్యాది విషయములను అన్నింటిని ధీశాలురగు మీ ముందు నా బుద్ధిశక్తి ననుసరించి ఆవిష్కరించెదను. ఓ విప్రులారా! వాయుదేవునిచే మహర్షులకు చెప్పబడిన పురాణమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పెదను. వినుడు.
శ్రీ వాయు మహాపురాణములో సృష్టి ప్రకరణము అనే మూడవ అధ్యాయము ముగిసినది.