31 - దేవవంశవర్ణనం

సూతవాచ :-

 ఇత్యేషా సమనుజ్ఞాతా కథా పాపప్రణాశినీ

 యాదక్షమధికృత్యేహ కథా శర్వాదుపాగతా

పితృవంశ ప్రసంగేన కథా హ్యేషా ప్రకీర్తితా

 పితృణామానుపూర్వ్యేణ దేవాన్ వక్ష్యామ్యతః పరమ్

 త్రేతాయుగముఖే పూర్వమాసన్ స్వాయంభువేఽన్తరే

 దేవా యామా ఇతిఖ్యాతాః పూర్వం యే యజ్ఞసూనవః

అజితా బ్రహ్మణ పుత్రాః జితా జివజితాశ్చ యే

 పుత్రాః స్వాయంభువస్యైతే శుక్రనామ్నాతు మానసా:     

 సూతుడనేను:- దక్షుని విషయమై శివుని వల్ల నిచట నడచిన మీ కథపాప ప్రణాశినిగ నంగీకరింబడినది-1. పితృవంశ ప్రసంగమున ఈ కథ చెప్పబడినది. ఆ తరువాత పితరుల యనుక్రమమున దేవతలను జెప్పబోవుచున్నాను-2. పూర్వము త్రేతాయుగ ప్రారంభమున స్వాయంభువ మన్వన్తరమున దేవతలుండిరి. పూర్వము యజ్ఞమున బుట్టిన యా దేవతలు 'యాగములు' అని యనబడిరి. జితులు జీవజితులు అనువారు ఎవరుండిరో, వారు బ్రహ్మ యొక్క పుత్రులైన అజితులు. వీరు స్వాయం భువునకు మానసపుత్రులు శుక్రులను పేరు గలవారు.

తృప్తిమంతో గణా హ్యేతే దేవానాం తు త్రయః స్మృతాః

 ఛందోగాస్తు త్రయస్త్రింశత్సర్వే స్వాయంభువస్య హ

 యదుర్యయాతి ర్ధౌ దేవౌ దీధయః స్రవసో మతిః

విభాసశ్చ క్రతుశ్చైవ ప్రజాతిర్విశతో ద్యుతిః

 వాయసో మజ్గలశ్చైవ యామా ద్వాదశకీర్తితాః

 అభిమన్యు రుగ్రదృష్టి సమయోఽథ శుచివ్రతాః

 కౌవలో విశ్వరూపశ్చ సుపక్షో మధుపస్తథా

 తురీయో నిర్హపుశ్చైవ యుక్తో గ్రావజినస్తు తే

 యమినో విశ్వదేవాద్య యవిష్టోఽమృతవానపి

 అజిరోవిభుర్వీభావశ్చ మృతికోఽథ దిదేహకః

 శ్రుతిశృణో బృహచ్ఛుక్రో దేవా ద్వాదశకీర్తితాః  

      వీరు తృప్తిమంతులై దేవతల మూడో గణములుగా తలంప బడిరి. ఛందోగులైన ముప్పది మువ్వురందరు స్వాయంభువుని వారు-5. యదువు యయాతి అనునిద్దరు దేవతలు, దీధయుడు, స్రవసుడు, మతి, విభాసుడు, క్రతువు. ప్రజాతి, విశతుడు, ద్యుతి-6.వాయసుడు, మంగలుడు,- అను నీ12 గురు యాములు (యాములును దేవతలు)గా జెప్పబడిరి. అభిమన్యువు, ఉగ్రదృష్టి, సమయుడు, శుచివ్రతుడు, కేవలుడు, విశ్వరూపుడు, సుపక్షుడు, మధుపుడు-7, తురీయుడు, నిర్ఘపుడు, యుక్తుడు, గ్రాజినుడు,- అనువారు, యమీనుడు, విశ్వుడు, దేవాద్యుడు, యవిష్ణుడు, అమృతవంతుడు-8, అజీరుడు, విభువు, విభావుడు, మృలికుడు, దిదేహకుడు, శ్రుతిశృణుడు, బృహచ్ఛకుడు అను వారును పండ్రెండుగురు దేవతలుగా జెప్పబడిరి.

ఆసన్ స్వాయంభువ స్యైతే అన్తరే సోమపాయినః

త్విషిమన్తో గణాహ్యేతే వీర్యవంతో మహాబలాః.

 తేషామింద్ర! సదాహ్యాసీ ద్విశ్వభుక్ ప్రథమో విభుః

 అసురా యే తదా తేషామాసన్ దాయాదబాంధవాః

 సుపర్ణయక్షగంధర్వాః పిశాచోరగ రాక్షసాః

అష్టౌ తే పితృభిః సార్ధం నాసత్యా దేవయోనయః

 స్వాయంభువేఽన్తరేఽ తీతాః ప్రజాస్త్వాసాం సహస్రశః

ప్రభావ రూపసంపన్నా ఆయుషా చ బలే న చ

 విస్తరాదిహ నోచ్యన్తే మాప్రసంగో భవత్విహ

 స్వాయంభువో నిసర్గశ్చ విజ్ఞేయః సాంప్రతం మనః

 అతీతే వర్తమానేన దృష్టో వైవస్వతేన సః

ప్రజాభిర్దేవతాభిశ్చ ఋషిభిః పితృభిః సహ      

వీరు స్వాయంభువ మన్వంతరమున సోమపాయులై (సోమరసమును ద్రాగువారై ఉండిరి. వీరు వెలుగు విరజిమ్ము గణములు. వీర్యవంతులు మహాబలులును-10. వారికి ఎల్లప్పుడు మొదటి విభువు విశ్వపాలకుడనునై యింద్రుడుండెను. అప్పుడు అసురులను వారెవరుండిరో, వారు వారికి దాయాదులైన బాంధవులు ఆస్తిని పెంచుకొనదగిన సోదరులు)-11. సుపర్ణయక్ష, గంధర్వులు, పిశాచ, ఉరగ-రాక్షసులు, అశ్వనీ దేవత లిరువురును గలిసి యెనమండుగురును పితృదేవతలతో గలిపి దేవయోనులు (దేవజాతిలో బుట్టినవారు)12. స్వాయంభువ మన్వన్తరమున వీరి ప్రజలు (సంతానము) వేలకొలది గతించిరి. వారు ఆయుష్యము, బలము, ప్రభావము, రూపము వీనితో చక్కగా గూడుకొన్నవారు-13. ఇచట అనవసరప్రసంగము జరగగూడదని వారిని గూర్చి విస్తరముగా జెప్పబడుట లేదు. ప్రస్తుత స్వాయంభువమనువు సృష్టికోలమని తెలియవలేను 14. స్వాయంభువ మనువుగడవగా వైవస్వతమనువు సృష్టికాలము ప్రజల చేతను, దేవతల చేతను, ఋషుల చేతను, పితరుల చేతను వర్తమానముగా జూడబడినది.

తేషాం సప్తర్షయః పూర్వమాసన్ యేతాన్ని బోధతు

 భృగ్వంగిరామరీచిశ్చ పులస్త్య: పులహః క్రతు:

అత్రిశ్చైవ వసిష్ఠశ్చ సప్తస్వాయంభువేఽన్తరే

 అగ్నీధ్రశ్చాతిబాహుశ్చ మేధా మధాతిథిర్వసుః

 జ్యోతిష్మాన్ ద్యుతిమాన్ హవ్యః సవనః పుత్ర ఏవ చ

 మనోః స్వాయంభువ స్యైతే దశపుత్రా మహౌజసః 

వారిలో పూర్వము సప్తర్షులుగా నున్నవారిని వినుడు. భృగ్వంగిరుడు, మరీచి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు-16, అత్రి, వసిష్ఠుడు. వీరు స్వాయంభువమన్వంతరమున నేడుగురు ఋషులు అగ్నీధ్రుడు, అ తిబాహుడు, మేధుడు, మేధాతిథి, వసువు-17, జ్యోతిష్మంతుడు, ద్యుతిమనుడు, హవ్యుడు, సవనుడు, పుత్రుడు అను నీమహాతేజస్వులు పదిమంది స్వాయంభువమనువు యొక్క పుత్రులు.

వాయుప్రోక్తా మహాసత్త్వా రాజానః ప్రథమేఽన్తరే

 సాసురంతత్స గంధర్వం సయక్షోరగ రాక్షసమ్

స పిశాచమనుష్యం చ సుపర్లాప్సర సాంగణమ్

 నో శక్యమానుపూర్వ్యేణ వక్తుం వర్షశతైరపి

బహుత్వాన్నా మధేయానాం సంఖ్యా తేషాం కులే తథా

 యా వై ప్రజకులాఖ్యాస్తు ఆసన్ స్వాయంభువేఽన్తరే

 కాలేన బహునా తీతా అయనాబ్ద యుగక్రమై: 

వీరు వాయువుచే జెప్పబడినవారు. మహాబలవంతులై స్వామంభువ ప్రథమార్తరమున నుండిన రాజులు. అసురలతోను, గంధర్వులతోను, యక్ష-ఉరగ-రాక్షసులతోను, పిశాచ-మనుష్యులతోను, సుపర్ణ- అప్సరోగణములతోను-19. వీరి యనుక్రమము నూరేండ్లలో గూడ జెప్పతరము గాదు. అట్లే బహుత్వమువలన వీరి కులమునందు వీరి నామధేయముల సంఖ్యయు జెప్పవలనుపడదు-20. స్వాయంభువ మన్వన్తరమున ఏయే పేరిట ప్రజకులములుండెనో అవి యన్నియు దక్షిణ ఉత్తర అయనములయొక్కయు, ప్రభవాది సంవత్సరములయొక్కయు, కృతాదియుగముల యొక్కయు క్రమములతో బహుళమైన కాలముతో గతించినవి.

ఋషయ ఊచు:-

 క ఏష భగవాన్ కాలః సర్వభూతాపహారకః

 కస్య యోనిః కిమాదిశ్చ కిం త త్త్వం స కిమాత్మజః

 కిమస్య చక్షుః కా మూర్తి: కేచాఽస్యావయవాః స్మృతాః

 కిం నామధేయః కోఽస్యాత్మా ఏత త్ప్రబ్రూహి పృచ్ఛతామ్

ఋషులనిరి:- సర్వభూతములనపహరించు భగవంతుడైన కాలుడెవరు? ఆతనివల్లనేమి సంభవించును? ఆతనికి మూలమేమి? ఆతని తత్త్యము (నిజస్వరూపము) ఏమి? ఆతని జనకుడు కుమారుడునెవరు?-22. ఆతనికేదికన్ను? ఏది మూర్తి? ఆతని యవయవములేవి? ఆతని పేరేమి? ఆతని యాత్మయెవరు? అడిగిన మాకిదంతయు జెప్పుడు అని ఋషులడిగిరి.

సూత ఉవాచ:-

శ్రూయతాం కాలసద్భావః శ్రుత్వా చైవావధార్యతామ్

 సూర్యయోనిర్నిమేషాదిః సంఖ్యాచక్షుః స ఉచ్యతే

 మూర్తిరస్యత్వహో రాత్రే నిమేషావయవశ్చ సః

 సంవత్సరశతం త్వస్య నామ చాస్యకలాత్మకమ్

 సాంప్రతానాగతాతీతకాలాత్మా స ప్రజాపతి:

 పంచానాం ప్రవిభక్తానాం కాలావస్థాం నిబోధత

దినార్థమాసమాసైస్తు ఋతుభిస్త్వస్య వయవైస్తథా

 సంవత్సరస్తు ప్రథమో ద్వితీయః పరివత్సరః

 ఇద్వత్సరస్తృతీయస్తు చతుర్థశ్చాను వత్సరః

 వత్సరః పంచమస్తేషాం కాలః స యుగసంజ్ఞితః

 తేషాం తు తత్త్వం వక్ష్యామి కీర్త్యమానం నిబోధత  

సూతడనెను:- కాలము యొక్క యునికి యెట్టిదో వినుడు. విని చక్కగా బుద్దియందు నిలుపుకొనుడు. కాలమునకు సూర్యుడు యోని (పుట్టుస్థానము) అది నిమేషము (కనురెప్పపాటు కాలము)-.సంఖ్య కన్ను-24. ఆకారము రాత్రి పగలును. అవయవములు నిమేషములు. నూరేండ్లీతని నామము, ఆత్మకళ (30 కాష్టలకాలము= 540 కనురెప్పపాట్ల కాలము) భూత భవిష్యద్-వర్తమాన కాలరూపమైనదియాత్మ, ఆతడు ప్రజాపతి (బ్రహ్మ)-25, ఐదుగా విభజించిన కాలావస్థను (స్థితిని) వినుడు. దీనములు, పక్షములు, నెలలు, రెండేసి నెలలతోనేర్పడిన ఋతువులు, ఆరేసి మాసములతో నేర్పడిన ఆయనములు ఇవి కాలముయొక్క యైదు దశలు-26. మొదటి మొత్తము సంవత్సరము. రెండవది పరివత్సరము, మూడవది ఇద్వత్సరము, నాలుగవది అనువత్సరము-27. ఐదవది (అనగా ఐదేండ్లకాలము)5 కాలము అది యుగమను పేరుగలది. పానీయొక్క తత్యమును నేను జెప్పెద వినుడు.

ఋతురగ్నిస్తు యః ప్రోక్తః స తు సంవత్సరో మతః

 ఆదిత్యయోఽసౌ సారః కాలాగ్నిః పరివత్సర:

శుక్లకృష్ణాగతిశ్చాపి అపాం సారమయః ఖగః

 స ఇడా వత్సర: సోమః పురాణే నిశ్చయో మతః

 యశ్చాఽయం తపతే లోకాస్తనుభిః సప్తసప్తిభిః

 ఆశుకర్తా చ లోకస్య స వాయురీతీ వత్సరః

 అహంకారాత్ రుదన్ రుద్రః సద్భూ(భూ)తో బ్రహ్మణస్త్ర(స్తు)యః

 స రుద్రో వత్సరస్తేషాం విజజ్ఞే నీలలోహితః

 తేషాం హి తత్త్వం వక్ష్యామి కీర్త్యమానం నిబోధత

 అంగ ప్రత్యంగ సంయోగాత్ కాలాత్మా ప్రపితామహః

 ఋక్సామయజుషాం యోనిః పంచానాం పతిరీశ్వరః

 సోఽగ్నిర్యజుశ్చ సోమశ్చ సభూతః సప్రజాపతిః

ప్రోక్తః సంవత్సరశ్చేతి సూర్యోఽయోఽగ్నిర్మనీషిభిః

 యస్మాత్కాల విభాగానాం మాసర్త్వయనయోరపి

 గ్రహనక్షత్ర శీతోష్ణ వర్షాయుః కర్మణాం తథా

యోజితః ప్రతిభాగానాం దివసానాం చ భాస్కరః

వైకారికః ప్రసన్నాత్మా బ్రహ్మపుత్రః ప్రజాపతిః

ఏకే నైకోఽథ దివసో మాసోఽథర్తుః పితామహః

 ఆదిత్యః సవితా భానుర్జీవనో బ్రహ్మసత్కృతః

 ప్రభవశ్చాత్య యశ్చైవ భూతానాం తేన భాస్కర:

 తారాభిమానీ విజ్ఞేయ స్తృతీయః పరివత్సరః

 సోమః సర్వౌషధిపతి ర్యస్మాత్స ప్రపితామహః

 ఆజీవః సర్వభూతానాం యోగక్షేమ కృదీశ్వరః

అవేక్షమాణః సతతం భిభర్తి జగదంశుభిః

 తిథీనాం సర్వసంధీనాం పూర్తిమా దర్మయోరపి

 యోనిర్నిశాకరో యశ్చ యోఽమృతాత్మా ప్రజాపతి:

 తస్మాత్ సపితృమాన్ సోమ ఋగ్యజుశ్చంద ఆత్మకః

 ప్రాణాపనసమానాద్యైర్వ్యానోదాత్మ కైరపి

 కర్మభిః ప్రాణినాం లోకే సర్వచేష్టా ప్రవర్తకః

 ప్రాణాపాన సమానానాం వాయూనాం చ ప్రవర్తనమ్

 పంచానాం చేంద్రియమనోబుద్ధి స్మృతి జలాత్మనామ్

 సమాన కాలకరణః క్రియాః సంపాదయన్నివ

సర్వాత్మా సర్వలోకానామావహః ప్రవహాదిభిః

 విధాతా సర్వభూతానాం క్షమా నిత్యం ప్రభంజనః

 యోనిరగ్నే రపాంభూమే రమేశ్చంద్ర మసశ్చ యః

 వాయుః ప్రజాపతిర్భూతం లోకాత్మా ప్రపితామహః

 ప్రజాపతి ముఖైర్దేవైః సమ్యగిష్ట ఫలార్థిభిః

 త్రిభిరేవ కపాలైస్తు అంబకై రోషధిక్షయే

 ఇజ్యతే భగవాన్ యస్మాత్త స్మాత్ర్యంబక ఉచ్యతే

 గాయత్రీ చైవ త్రిష్టుప్ చ జగతీ చైవ యా స్మృతా

 త్ర్యంబకానామతః ప్రోక్తా యోనయః సవనస్యతాః

 తాభిరేకత్వ భూతాభిస్త్రివిధాభిః స్వవీర్యతః

త్రిసాధన పురోడాశస్త్రికపాలః స వై స్మృతః

 ఇత్యేతత్పంచ వర్షం హి యుగం ప్రోక్తం మనీషిభిః

ఋతువు అగ్నియని యేది చెప్పబడినదో అది' సంవత్సరముగా సమ్మతమైనది. సూర్యునిలో సారభూతమైనదేది కలదో అది కాలాన్ని పరివత్సరము-29. ఆతని గతి (నడక)యు శుక్ల పక్ష-కృష్ణపక్ష రూపమైనది. జలసారముతో నిండినవాడు ఖగుడు (సూర్యుడు, చంద్రుడు) ఆతడు' ఇడావత్సరము, సోముడు (చంద్రుడు), అని పురాణమున నిశ్చయమైన మతము 30. ఏడు గుఱ్ఱము (కిరణము)ల రూపముననున్న శరీరములచేత ఎవడు లోకములను తపింపజేయునో ఆతడు లోకములను వేగముగా సృష్టించువాడై వాయువు అను సంవత్సరము-31. అహంకారం వలన బ్రహ్మనుండి రోదించుచు బుట్టినవాడు రుద్రుడు అను వత్సరము వానికి ఐదేండ్లు యధిపతులకు, (అగ్ని-సూర్య-సోమ- వాయు-రుద్రులకు) నీల లోహితుడు (నలుపు ఎరుపు వర్ణముగల) శివుడు కలిగెను. వారి తత్త్యమును జెప్పెదను వినుడు-32. అంగ ప్రత్యంగ సంయోగము వలన కాలస్వరూపుడు బ్రహ్మ, ఆతడు ఋగ్వేద- సామవేద- యజుర్వేదములు బుట్టినచోటు. పై యైదువిధములైన వత్సరములకు పతియైన ఈశ్వరుడు-33. ఆతడు అగ్ని, యజుస్సు, సోముడు. ఆతడు భూతము, ఆతడు ప్రజాపతి (బ్రహ్మ). ఆతడే సంవత్సరమనియు, సూర్యుడనియు, అగ్నియనియు విద్వాంసులచే జెప్పబడెను-34, ఈవిధముగ కాలవిభాగములైన మాస-ఋతు-ఆయనములకును అట్లే గ్రహనక్షత్రశీత-ఉష్ణ-వర్ష-ఆయుఃకర్మలకును, కాలప్రవిభాగములైన దివసములకును జోడింపబడినవాడు సూర్యుడు-35, అతడు వైకారకుడు (కాలమునుబట్టి వికారమును జెందువాడు) నిర్మలాత్ముడు. బ్రహ్మ పుత్రుడు బ్రహ్మయును, ఒక్కడయ్యును అనేక స్వరూపములు గలవాడు. దినము, మాసము, ఋతువు వీని స్వరూపములుగలవాడు పితామహుడు (తండ్రులనుబుట్టించినవాడు)-36. అదితికి బుట్టినవాడు విశ్వమునుగన్నవాడు, కాంతితో బ్రకాశించువాడు, ప్రాణులను జీవింపజేయువాడు, బ్రహ్మచే సత్కరింపబడినవాడు, ప్రాణులకుపుట్టుకయైనవాడు, నాశనమైనవాడును. కావున భాస్కరుడు (కాంతికలు గజేయువాడు)-37. తారాభిమానియై సోముడు (చంద్రుడు) మూడవ పరివత్సరముగా తెలియదగినవాడు. అతడు అన్ని యోషధులకు పతికావున ప్రపితామహుడు (బ్రహ్మ)-38. సర్వప్రాణులకు జీవనాధారము, యోగక్షేమముల జేయువాడు (కోరినది కూర్చి రక్షించువాడు) తనకిరణములచే జూచుచున్నవాడై జగమునెల్లప్పుడు రక్షించును-39.తిథులకును, పర్వసంధులకును పూర్ణిమ- అమావాస్యలకును కారణభూతుడు. నిశాకరుడు (రాత్రినంతయుతనకాంతి సుఖకరముగ జేయువాడు) అమృత స్వరూపుడు (సముద్రమునుండి యమృతంతోడబుట్టినవాడు). కావున ప్రజాపతి (బ్రహ్మ)-40. కావున నాసోముడు పితృమంతుడు, ఋగ్యజుర్వేదాత్మకుడు. ప్రాణ-అపాన-సమాన-వ్యాన ఉదాన రూపములైన పంచప్రాణవాయువుల క్రియలచేత లోకమున ప్రాణుల సర్వచేష్టలను చేయించువాడు, ప్రాణ-అపాన మాన వాయువులనుగూడ నడిపించువాడును-42. మనోబుద్ధి స్మృతి (జల) స్వరూపములైన పంచేంద్రియములయొక్క (త్వక్-చక్షు శ్రోత్ర- జిహ్వా-ఘ్రాణముల యొక్క) క్రియలను జేయించుదానివలె సమానకాలమునకు సాధనమైనవాడును 43. సర్వాత్ముడును సర్వలోకముల నావహవాయువుతో నావహించియుండువాడును, (ఆవాహ) ప్రవహ-సంవహ- ఉద్వహ వివహ-పరివహ-పరావహములను నేడు వాయువులచే సర్వప్రాణుల సృష్టించువాడును, నిత్యము సర్వసామ్యప్రతిపత్తితో జగముయొక్క స్థితిని నిర్వహించువాడును, ప్రభంజనుడును (విజృంభించినపుడు సర్వమును ధ్వంసము చేయువాడును) 44. అగ్నికిని (దాని నుండి బుట్టినందున) జలమునకును (దానినుండిబుట్టినందున) భూమికిని సూర్యునకును చంద్రునకును పుట్టు స్థానమైన వాయువు ప్రజాపతియే (బ్రహ్మ). పంచభూతములలోనొకటి. వాయురూపమున లోకమంతనిండి లోకస్వరూపమైనది. కావున ప్రపితామహుడు (బ్రహ్మ)-45. భూమిలో ఓషధులు క్షీణించినపుడు చక్కగా ఇష్టఫలములను గోరిన బ్రహ్మమొదలగు దేవతలచే మూడే మూడు కపాలములచేతను అంబకములచేతను భగవంతుడు హోమము జేసి పూజింపబడుటచే త్ర్యంబకుడనబడెను-46. గాయత్రి-త్రిష్టుప్- జగతి అనియే ఛందస్సులున్నవో, అవియే త్ర్యంబకములను పేరులతో ఆసవనమునకు (యజ్ఞమునకు) యోనులుగా (నిర్వహణసాధనములుగా) జెప్పబడినవి-47. తమశక్తితో నేకత్వమును బొందినవియై త్రివిధములైనయా గాయత్రి- త్రిష్టుప్-జగతీ ఛందస్సులచే మూడు సాధనములు గల పురోడాశముగలదిగను, మూడు కపాలములు గలదిగను ఆ సవనము తలంపబడినది. 

ఇత్యేతత్పంచ వర్షం హి యుగం ప్రోక్తం మనీషిభిః

 యచ్చైవ పంచధాత్మా వై ప్రోక్తః సంవత్సరో ద్విజైః

 సైకం షట్కం విజజ్ఞేఽథ మధ్వాదీ నృతవఃకిల

 ఋతుపుత్రార్తవః పంచ ఇతి సర్గః సమాసతః

 ఇత్యేష పవమానో వై ప్రాణినాం జీవితాని తు

 నదీవేగ సమాయుక్తం కాలో ధావతి సంహరన్

 అహోరాత్ర కరస్తస్మాత్ స వాయురభవత్పునః

ఏతే ప్రజానాం పతయః ప్రధానాః సర్వదేహినామ్

 పితరః సర్వలోకానాం లోకాత్మానః ప్రకీర్తితాః

 ధ్యాయతో బ్రహ్మణో వక్రాదుద్యన్ సమభవద్భవః

 ఋషిర్విప్రా మహాదేవో భూతాత్మా ప్రపితామహః

 ఈశ్వరః సర్వభూతానాం ప్రణవా యోపపద్యతే

 ఆత్మవేశేన భూతానా మంగ ప్రత్యంగ సంభవః

 అగ్నిః సంవత్సరః సూర్యశ్చంద్రమా వాయురేవ చ

 యుగాభిమానీ కాలాత్మా నిత్యం సంక్షేపకృద్విభుః

 ఉన్మాదకోఽను గ్రహకృత్స ఇద్వత్సర ఉచ్యతే

రుద్రావిష్టో భగవతా జగత్యస్మిన్ స్వతేజసా

ఆశ్రయాశ్రయాయి సంయోగాత్తనుభిర్నామభి స్తథా

 తతస్తస్య తు వీర్యేణ లోకాను గ్రహకారకమ్

 ద్వీతీయం భద్రసంయోగం సంతతస్యైక కారకమ్

 దేవత్వం చ పితృత్వం చ కాలత్వం చాస్యయత్పరమ్

 తస్మాద్వై సర్వధా భద్రస్తద్వద్భిరభి పూజ్యతే

 పతిః పతీనాం భగవాన్ ప్రజేశానాం ప్రజాపతిః

 భవనః సర్వభూతానాం సర్వేషాం నీలలోహిత

ఓషధీః ప్రతిసంధత్తే రుద్రః క్షీణాః పునః పునః

 ఇత్యేషాం యదపత్యంవై న తచ్ఛక్యం ప్రమాణతః

 బహుత్వాత్పరి సంఖ్యాతుం పుత్ర పౌత్ర మనంతకమ్

 ఇమం వంశం ప్రజేశానాం మహతాం పుణ్యకర్మణామ్

 కీర్తయన్ స్థిరకీర్తీనాం మహతీం సిద్ధిమాప్నుయాత్

 ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే దేవవంశ వర్ణనం నామైకత్రింశోఽధ్యాయః

 ఈ విధముగా విద్వాంసులచే ఐదేండ్లయుగము చెప్పబడినది. దానినే ద్విజులు (బ్రాహ్మణులు) ఐదు విధముల స్వరూపముగల సంవత్సరమనిరి. అది వసంత-గ్రీష్మ-వర్ష-శరత్- హేమంత -శిశిరములను ఋతువులనారింటిని జనింపజేసెనట-49. ఋతువులు పుత్రులుగా గలవి యైదేడులు. ఇది సంగ్రహముగా సృష్టి- అనీ యీ విధముగ నీవాయువు ప్రాణులకు జీవిత ప్రాయుడు-50. నది తనవేగముతో గూడినదానిని సంహరించుచు పరుగిడినట్లే కాలము (వాయువు) గూడ తన వేగముతో గలిపికొని సర్వమును సంహరించుచు పరుగిడును. కావున కాలవాయువు అహోరాత్రములు చేతులుగాగలదయ్యెను-51. ఈ వాయువులే ప్రజలకు పతులై సర్వప్రాణులకు ప్రధానులుగను, సర్వలోకములకు పితరులుగను లోకాత్ములుగను కీర్తింపబడిరి-52. భవుడు (శివుడు) ధ్యానము జేయుచున్న బ్రహ్మయొక్క ముఖమునుండి పైకి వెడలుచు బుట్టెను. ఆతడు ఋషి, విప్రుడు, మహాదేవుడు, ప్రాణులకాత్మ, బ్రహ్మ-53. ఆతడు సర్వప్రాణులకీశ్వరుడు. ప్రణవమునకు తగిన యర్థమగును. తన ప్రవేశముతో ప్రాణులయంగ ప్రత్యంగములలో చక్కగా నుండువాడు-54. ఆతడు అగ్నీ సంవత్సరము, సూర్యుడు, చంద్రుడు, వాయువుగూడను. ఆతడు యుగాభిమాని, కాలస్వరూపుడు, నిత్యము జగమునుపసంహరించువాడు, విభువు. అతడు పిచ్చెత్తింపజేయువాడు (మత్తిల్లజేయువాడు) అనుగ్రహించువాడు, ఇద్వత్సరుడని గూడ జెప్పబడును-55. ఈ జగమున భగవంతుని చేతన తేజముతో (వత్సరము) రుద్రావిష్టమైనది. తనశరీరముల (అష్టమూర్తులచేతను అనంతనామములచేతను ఆశ్రయాశ్రయి భావసంయోగమునగూడ వత్సరము రుద్రావీష్టమైనది-56. తరువాత ఆతని (శివుని) వీర్యముచే (బలముచే) లోకానుగ్రహముజేయునదియై రెండవదియైన మంగళ సంయోగము విశాలముగ వ్యాపించిన దానినేకముజేయునది-57. దేవత్వము, పితృత్వము, కాలత్వము, దీనికంటెను పరమైన (ఉత్కృష్టమైన) దేదికలదో దాని కంటేను అన్నివిధములుగా భద్రమైనవాడుగా తదేత్తలచే నాశివుడు పూజింపబడును-58. ఆ భగవంతుడు నీలలోహితుడు పతులకుపతి, ప్రజాపతులకు ప్రజాపతి సర్వప్రాణులకును సర్వులకును భవనము. ఆ రుద్రుడు క్షీణించిన యోషధులను మరల మరల నాటి పోషించి పెంచును-59. ఈ విధముగ నీదేవతల సంతానమింతయని చెప్పనలవికాదు. అది బహువిధమై యనంతమైన పుత్ర పౌత్రులు గలదగుట దానిని లెక్కింపనలవికాదు-60. పుణ్యకర్ములు. స్థిరమైన కీర్తిగలవారు, మహాత్ములునైన ప్రజాపతులయొక్క యీ వంశమును కీర్తించినవాడు మహాసిద్దిని బొందును-61.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున దేవవంశవర్ణ మను ముప్పదీయొకటవ యధ్యాయము.