40 -  భువనవిన్యాసో

సూత ఉవాచ:-

మర్యాదా పర్వతే శుభే దేవకూటే నిబోధత

విస్తీర్ణే శిఖరే తస్య కూటే గిరివరస్య హ

సమన్తాద్యోజ నశతం మహాభవన మండితమ్

 జన్మక్షేత్రం సుపర్ణస్య వైనతేయస్య ధీమతః

 నైకైర్మహా పక్షిగణై ర్గారుడైః శీఘ్రవిక్రమైః

 సంపూర్ణ వీర్యసంపన్నై ర్దమనైరుర గారిభిః

 పక్షిరాజస్య భవనం ప్రథమం తన్మహాత్మనః

 మహావాయు ప్రవేగస్య శాల్మలి ద్వీపవాసినః

తస్యైవ చారుమూర్ధ్నస్తు కూటేషు చ మహర్ధిషు

దక్షిణేషు విచిత్రేషు సప్తస్వపితు శోభినః

 సంధ్యా భ్రాభాః సముదితాః రుక్మప్రాకారతోరణాః

 మహాభావన మాలాభిః శోభితా దేవనిర్మితాః

త్రింశద్యోజన విస్తీర్ణాశ్చత్వారిం శత్తమాయతాః

 సప్తగంధర్వనగరా నరనారీ సమాకులాః

 ఆగ్నేయా నామ గంధర్వా మహాబల పరాక్రమాః

 కుబేరాను చరాదీప్తాస్తేషాం తే భవనోత్తమాః  

సూతుడు పలికెను:- మర్యాద పర్వతమై(సరిహద్దుపర్వతమై) శుభ్రమైన దేవకూట పర్వతము గలదు. విశాలమైన శిఖరము గల యా పర్వత శ్రేష్ఠపు శిఖరమున-1. అంతట నూరు యోజనములు గలిగి, మహా భవనములచే నలంకరింపబడి, బుద్ధిమంతుడైన సుపర్ణుడైన వినతాసుతుడైన గరుడుని యొక్క జన్మక్షేత్రము గలదు-2. వేగ విక్రమము గలిగి, సంపూర్ణ వీర్య సంపద గలిగి, శత్రువులను దమింప జేయగలిగి, సర్పశత్రువులైన గరుడ వంశ సంభవములైన యనేక మహాపక్షి గణములచే మొదట గూడియున్న ఆ మహాత్ముడైన పక్షిరాజు(గరుడుని) యొక్క భవనము అచట గలదు. ఆ పక్షిరాజు మహా వాయువేగము గలవాడు, శాల్మలి ద్వీపనివాసి-3,4, ఆ దేవకూట పర్వతము యొక్క శిరోభాగము సుందరము. దాని మహా సంపన్నమైన దక్షిణ(కుడి) శిఖరములు విచిత్రములు, ఏడు-5, అచట ఏడు గంధర్వ నగరములు గలవు, అవి సంధ్యారాగము వలె నెఱ్ఱని కాంతిగలవి. గుమికూడి పైకెగసి నట్లుండును. బంగారు ప్రాకారములతోను తోరణముల తోను కూడినవి. వనమాలలచే గొప్పకాంతిగలిగి శోభించినవి. దేవతలచే నిర్మింపబడినవి-6. ముప్పది యోజనములు విశాలములైనవి. నలబది యోజనముల పొడవుగలవి. అట్టి గంధర్వ నగరములేడుగలవు-7. ఆగ్నేయులను గంధర్వులు. మహాబలపరాక్రమముగలవారు. కుబేరసేవకులు, వారి యాభవనరాజములు మిక్కిలి ప్రకాశించినవి-8.

తస్య చోత్తరకూటేషు భువనస్య మహాగిరేః

హర్మ్య ప్రాసాదబద్దం చ ఉద్యానవన శోభితమ్

 పురమాశీవి షైః పూర్ణమహాప్రాకార తోరణమ్

వాదిత్ర శతనిర్ఘోషైరానందిత వనాంతరమ్

 దుష్ప్రసహ్యమమిత్రాణాం త్రింశద్యోజన మండలమ్

నగరం సైంహికేయానా ముదీర్ణం దేవవిద్విషామ్

 సిద్ధదేవర్షి చరితం దేవకూటే నిబోధత   

ఆ భువనపు మహాగిరి యొక్క ఉత్తర శిఖరము లందు ధనిక భవనముల చేతను దేవబ్రాహ్మణ నివాసములైన మేడల చేతను చుట్టబడినదియు ఉద్యానవనములతో శోభితమైనదియునైన-9. పురము గలదు. అది ఆశీ విషములచే (సర్పములచే) నిండినది. గొప్ప కోటగోడలు తోరణమును గలది. నూర్లకొలదీ వాద్యముల ధ్వనులచే ఆనందించిన వనమధ్య ప్రదేశములు గలదీ-10. శత్రువులకు సహింపనలవి కానిది, ముప్పది యోజనముల మండలము గలది, ఎత్తుగా పెరిగినది, అది దేవశత్రువు లైన రాహు సంతానముల నగరము, ఇక దేవకూటము నందలి సిద్ధదేవరుల చరితము వినుడు-11.

ద్వితీయే ద్విజశార్దూల మర్యాదా పర్వతే శుభే

 మహాభవన మాలాభిర్నానావర్ణ భిరావృతమ్

సువర్ణ మణిచిత్రాభి రమేకాభిరలంకృతమ్

విశాలరథ్యం దుర్ధర్షం నిత్యం ప్రముదితం శివమ్

 నరనారీ గణాకీర్ణం ప్రాంశు ప్రాకారతోరణమ్

షష్టియోజన విస్తీర్ణం శతయోజన మాయతమ్

నగరం కాలకేయ నామ సురాణాం దురాసదమ్

దేవకూటతటే రమ్యే సన్నివిష్టం సుదర్జయమ్

 మహాభ్రచయ సంకాశం సునాసన్నామ విశ్రుతమ్ 

రెండవదియై శుభమైన మర్యాదా (సరిహద్దు) పర్వతమున ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ! కాలకేయులను రాక్షసుల నగరము గలదు. అది అనేక వర్ణములుగల మహాభవనముల పంక్తులతో జుట్టబడినది-12. ఆ భవనములు బంగారము చేతను మణులచేతను నిర్మింపబడిన చిత్రములచే నలంకరింపబడినవి. ఆ నగరము విశాలమైన రథమార్ధములు గలవి. శత్రువులచే నశింపజేయనలవిగానిది. నిత్యసంతోషము గలది. శివమైనది-13. స్త్రీ పురుష గణములచే నిండినది. పొడవైన కోటగోడలు ద్వారతోరణములును గలది. అటువది యోజనముల వెడల్పు, నూరు యోజనముల పొడవును గలది-14. శత్రువులకెవ్వరికిని జొరగానిది. రమ్యమైన దేవకూటపుతటమున గూర్చొనియున్నట్లున్నది. జయింపనలవి కానిది. గొప్పమేఘముల సమూహముతో బోలినది. ‘సునాసత్’ అని ప్రసిద్ధిగాంచినది -15.

తస్యైవ దక్షిణే కూటే వింశద్యోజన విస్తరమ్

 ద్వీషష్టి యోజనాయామం హేమప్రాకారణం శుభమ్

హృష్టపుష్టావలిప్తానా మావాసాః కామరూపిణామ్

జౌత్కచానాం ప్రముదితం రాక్షసానాం మహాపురమ్ 

ఆదాని యొక్క(దేవకూటముయొక్క) దక్షిణ శిఖరమున ఇరువదియోజనముల వెడల్పు, ఆఱువదిరెండు యోజనముల పొడవును గలదియై, బంగారు కోట గోడలు గలదియై-16. ఔత్కచులైన (పైకి నిక్కబోడిచుకొన్న తలవెంట్రుకలు గల) రాక్షసుల మహాపురముగలదు. ఆ రాక్షసులు కామరూపులు, సంతుష్టులు, బలిష్ఠులు మదించినవారును, వారి నివాసభవనము లచట గలవు-16,17.

మధ్యమే తు మహాకూటే దేవకూటస్యపై గిరేః

సువర్ణమణి పాషాణైశ్చితైః శ్లక్ష్ణ తరైః శుభైః

 శాఖా శతసహస్రా ద్వైర్నెకారోహ సమాకులమ్

 స్నిగ్ధ పర్ణమహామూల మనేకస్కంధవాహనమ్

 రమ్యం హ్యవిరలచ్చాయం దశయోజన మండలమ్

 తత్ర భూతవటన్నామ నానాభూత గణాలయమ్

మహాదేవస్య ప్రథితం త్ర్యంబకస్య మహాత్మనః

దీప్తమాయతనం తత్ర సర్వలోకేషు విశ్రుతమ్

వరాహ గజసింహర్ష శార్దూల కరభాననైః

గృధ్రోలూక ముఖైశ్చైవ మేషోష్ట్రాజ మహాముఖైః

 కదంబైర్వికటై: స్థూలైర్లంబ కేశతనూరు హైః

నానావర్ణాకృతి ధరైర్నానా సంస్థాన సంస్థితైః

 దీప్తైర నేకైరుగ్రాస్యైర్భూతైరు గ్రపరాక్రమైః

అశూన్య మభవన్నిత్యం మహాపారిషదై స్తథా

 తత్ర భూతపతేర్భూతా నిత్యం పూజాం ప్రయుంజతే

ఝుర్ఘరైః శంకపట హైర్భేరీడిండిమగోముఖైః

 రణితాల సితోద్గీతై ర్నిత్యంవలీత వర్జితైః

విస్ఫూర్జిత శతైస్తత్ర పూజాయుక్తా గణేశ్వరాః

 ప్రీతాః పురారి ప్రమథా సత్ర క్రీడాపరాః సదా

 సిద్ధదేవర్షి గంధర్వయక్ష నాగేంద్రపూజితః

స్థానే తస్మిన్ మహాదేవః సాక్షాల్లోక శివఃశివః  

ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే భువనవిన్యాసో నామ చత్వారింశోఽధ్యాయః   

దేవకూట పర్వతము యొక్క మధ్య మహాశిఖరమున, మహాత్ముడై మహాదేవుడైన ముక్కంటి యొక్క యనేక భూతగణములకు నిలయమైన  భూతవటమనునొక మహావట వృక్షము గలదు. అది ముక్కంటి యొక్క ప్రకాశవంతమైన నివాసము సర్వలోక ప్రసిద్ధమైనది-20. అది బంగారం చేతను, మణులచేతను, రాళ్లచేతను దట్టముగానున్న చిత్రములు గలిగి శుభకరములైన నూరు శాఖల చేతను, వాని నున్న అనేక పక్ష్యాదులచే సమాకులమైనది-18. దట్టమైన యాకులతోను గొప్పవేళ్ళతోను అనేక శాఖలను మోయుచున్నది. రమ్యమైనది. దట్టమైన నీడకలది. పదియోజనముల మండలము గలది-19. పంది ఏనుగు సింహము ఎలుగుబంటి-పులి-ఒంటెపిల్ల-గద్ద-గుడ్లగూబ-గొజ్జా-మేక-21. వీని విశాలముఖములు గలిగి, గుబురుగాను వికటముగాను, లావుగాను, పొడవుగాను ఉన్న తలవెంట్రుకలు బడలి పై వెంట్రుకలును గలిగి, అనేక వర్ణములు ఆకారములును ధరించి, అనేక సంస్థానము(స్థితుల) లోనుండి-22. ఉగ్రులై ఉగ్రముఖులై, ఉగ్రపరాక్రములై, ఉజ్జ్వలులైన భూతముల చేతను, అట్లే మహాపారిషదులచే చండీశ్వరాది ప్రమథగణముఖ్యుల చేతను, (ఆ వటవృక్షము) ఎల్లప్పుడు నిండియుండును-23. అచట భూతములు భూతపతియైన శివుని నిత్యము పూజింతురు. రర రములు (కయిముడి వాద్యములు) శంఖములు, పటహములు(తప్పెటలు), భేరులు(దుందుభులు) డిండిమములు (రాయరిగిడిగిళ్ళు) గోముఖములు (ఆవు ముఖమువంటి వాద్యవిశేషములు)-24. ఈ వాద్యములయొక్కరకరకములైన ధ్వనులతో గూడి గానములచేత భ్రమణములు లేని నూర్ల విస్పూర్జితములచేతను శివగణనాథులు శివపూజాయుక్తులగుదురు. సంతుష్టులగుదురు. క్రీడాపరులగుదురు-25. సిద్దులచేతను, దేవతలచేతను, ఋషులచేతను, గంధర్వులచేతను, యక్షులచేతను నాగేంద్రులచేతను పూజితుడై సాక్షాత్తు లోకశివంకరుడై మహాదేవుడైన శివుడు ఆ స్థానమున పూజితుడగుచుండును -26.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువన విన్యాసమను నలుబదవ యధ్యాయము. 40.