వాయు మహా పురాణము
5 - సృష్టి ప్రకరణము
లోమహర్షణ ఉవాచ :-
యద్ధిసృష్టేస్తు సంఖ్యాతం మయా కాలాంతరం ద్విజాః ।
ఏతత్ కాలాంతరం జ్ఞేయమహర్వై పారమేశ్వరమ్॥
రాత్రిస్త్వే తావతీ జ్ఞేయా పరమేశస్య కృత్స్నశః ।
అహస్తస్య తు యా సృష్టి ప్రలయో రాత్రిరుచ్యతే ॥
అహస్తస్య విద్యతే తస్య న రాత్రిరితి ధారణా ।
ఉపచారః ప్రక్రియతే లోకానాం హితకామ్యయా॥
ప్రజాః ప్రజానాం పతయ ఋషయో మునిభిః సహ ।
ఋషీన్ సనత్కుమారాఖ్యాన్ బ్రహ్మసాయుజ్యగైః సహ ॥
ఇంద్రియాణీంద్రియార్థాశ్చ మహాభూతాని పంచ చ ।
తన్మాత్రా ఇంద్రియగణో బుద్ధిశ్చ మనసా సహ॥
అహస్తిష్ఠంతి తే సర్వే పరమేశస్య ధీమతః ।
అహరంతే ప్రలీయన్తే రాత్ర్యంతే విశ్వసంభవః॥
లోమహర్షణుడిట్లు పలికెను: - ఓ విప్రులారా! నేను మరియొక కాలములో చేయబడిన సృష్టిని గురించి వివరించితిని. ఈ కాలము పరమేశ్వరునికి పగలు అని తెలుసుకొనుడు-పరమేశ్వరుని రాత్రి పగటితో సమానమైన వ్యవధిని కలిగియుండును. సృష్టికాలము పరమేశ్వరుని పగలు అనియు, ప్రలయము రాత్రి అనియు చెప్పబడును. సామాన్య జనుల క్షేమమును గోరి, పరమేశ్వరునకు పగలే గాని, రాత్రి ఉండదని, ఉపచారము (కల్పన)గా పండితులు చెప్పుదురు . ప్రజలు, ప్రజాపతులగు ఋషులు, మునులు, బ్రహ్మలోకమునందుండే సనత్కుమారుడు మొదలగు ఋషులు, ఇంద్రియములు, ఇంద్రియ గోచరములగు పదార్థములు, ఐదు మహాభూతములు, తన్మాత్రలు (సూక్ష్మభూతములు), మనస్సు, బుద్ధి అనునవి, జ్ఞాన స్వరూపుడగు పరమేశ్వరుని పగటి యందు ఉన్నవి. పగలు పూర్తి కాగానే ఆయన యందు లీనమగును. రాత్రి పూర్తి కాగానే మరల జగత్తు సృష్టింపబడును.
స్వాత్మన్యవస్థితే సత్వే వికారే ప్రతిసంహతే ।
సాధర్మేృణావతి ష్ఠేతే ప్రధాన పురుషావుభౌ॥
తమః సత్త్వ గుణావేతౌ సమత్వేన వ్యవస్థితౌ ।
అత్రోద్రిక్తౌ ప్రసూతౌ చ తౌ తథా చ పరస్పరమ్॥
గుణసామ్యే లయో జ్ఞేయో వైషమ్యే సృష్టిరుచ్యతే ।
తిలేషు వా యథాతైలం ఘృతం పయసి వా స్థితమ్॥
తథా తమసి సత్వే చ రజోఽ వ్యక్తాశ్రితం స్థితమ్ ।
ఉపాస్య రజనీం కృత్స్నాం పరాం మాహేశ్వరీం తదా ॥
అహర్ముఖే ప్రవృత్తే చ పుర: ప్రకృతి సంభవః ।
క్షోభయామాస యోగేన పరేణ పరమేశ్వరః ॥
ప్రధానం పురుషం చైవ ప్రవిశ్యాండం మహేశ్వరః ।
ప్రధానాత్ క్షోభ్యమాణాత్తు రజో వై సమవర్తత ॥
కార్యరూపమగు జగత్తు ఉపసంహరింపబడెను. సమస్త ప్రాణులు తమలో లీనము కాగా, ప్రధాన పురుషులు ఇద్దరు సమాన ధర్మముగలవారై ఉండేను. ప్రధానము (ప్రకృతి) యందు తమస్సత్య గుణములు సమముగా నుండెను. వాటిలో ఒకటి ఉద్రేకమును పొందినపుడు మరల సృష్టి కలుగును. గుణములు సమముగానున్న అవస్థ ప్రలయ మనియు, గుణములలో విషమ స్థితి కలిగినపుడు సృష్టి అనియు చెప్పుదురు. నువ్వు గింజలలో నూనేవలే, పాలలో నేయివలె, రజోగుణము తమస్సత్యగుణముల యందు అవ్యక్తమునాశ్రయించి ఉండును. పరమేశ్వరుడు రాత్రి భాగమునంతను గడుపగా, పగలు ప్రారంభమయ్యేను. అపుడు మరల ప్రకృతి నుండి సృష్టి బయలుదేరెను. పరమేశ్వరుడు సర్వోత్కృష్టమగు యోగము యొక్క ప్రభావము వలన, ప్రధాన పురుషుల యందు అండము నందు తీవ్రమగు కదలికను కలుగజేసెను. ఆ విధముగా క్షుణ్ణము చేయబడిన ప్రధానము నుండి రజోగుణము బయల్వెడలేను.
రజః ప్రవర్తకం తత్ర బీజేష్వపి యథా జలమ్ ।
గుణవైషమ్య మాసాద్య ప్రసూయంతే హ్యధిష్ఠితాః ॥
గుణేభ్యః క్షోభ్యమాణేభ్యః త్రయో దేవా విజజ్ఞిరే ।
ఆశ్రితాః పరమా గుహ్యాః సర్వాత్మానః శరీరిణః ॥
రజో బ్రహ్మాతమో హ్యగ్నిః సత్త్వం విష్ణురజాయత ।
రజః ప్రకాశకో బ్రహ్మా సృష్టృత్వేన వ్యవస్థితః ॥
తమః ప్రకాశకోఽ గ్నిస్తు కాలత్వేన వ్యవస్థితః ।
సత్త్వప్రకాశకో విష్ణురౌదాసీన్యే వ్యవస్థిత: ॥
ఏతా ఏవ త్రయోవేదా ఏతా ఏవ త్రయోఽగ్నయః ।
పరస్పరాశ్రితా హ్యేతే పరస్పర మనువ్రతాః ॥
బీజము నుండి అంకురము వచ్చునట్లు చేయునది జలము. అటులనే, గుణవైషమ్యమును పొందిన ప్రధానము నుండి ప్రాణులు జన్మించునట్లు చేయునది రజోగుణము. ఈ విధముగా గుణములలో క్షోభను కలుగజేయగా, ముగ్గురు దేవతామూర్తులు జన్మించిరి. సర్వప్రాణులకు ఆశ్రయమైన ఆ దేవతలు సర్వ శ్రేష్ఠులు. వారి తత్యము తెలియ దుష్కరము. వారు శరీరాకారమును ధరించిరి. రజో గుణము బ్రహ్మగను, తమో గుణము అగ్నిగను, సత్య గుణము విష్ణువుగను పరిణమించెను. రజోగుణము ప్రముఖముగా గల బ్రహ్మ సృష్టికర్త అయినాడు. తమోగుణము ప్రముఖముగా గల అగ్ని కాలరూపుడైనాడు. సత్యము ప్రధానముగా గల విష్ణువు ఉదాసీనుడగ నున్నాడు. ఈ ముగ్గురు దేవతలు మూడు వేదములుగను, మూడు అగ్నులు గను ప్రకాశించుచున్నారు. వీరు పరస్పర సహకారముతో జగత్కార్యమును నిర్వహించుచున్నారు.
పరస్పరేణ వర్తంతే ధారయంతి పరస్పరమ్ ।
అన్యోన్యమిథునా హ్యేతే హ్యన్యోన్యముప జీవినః ॥
క్షణం వియోగో న హ్యేషాం న త్యజంతి పరస్పరమ్ ।
ఈశ్వరో హి పరో దేవో విష్ణుస్తు మహతః పరః ॥
బ్రహ్మా తు రజసోద్రిక్తః సర్గాయేహ ప్రవర్తతే ।
పరశ్చ పురుషో జ్ఞేయః ప్రకృతిశ్చ పరాస్మృతా ॥
అధిష్ఠితోఽసౌ హి మహేశ్వరేణ ప్రవర్తతే చోద్యమానస్సమంతాత్ ।
అనుప్రవర్తంతి మహాంత ఏవ చిరస్థితాః స్వే విషయే ప్రియత్వాత్ ॥
వీరు ఒకరిని మరియొకరు ధరించుచున్నారు. ఒకరికి మరియొకరు ఆధారముగా, ఒకరితో మరియొకరు కూడి, జగత్కార్యమునందు ప్రవర్తిల్లుచున్నారు. వీరు ఒకరినొకరు విడిచి క్షణకాలమైననూ ఉండరు. దేవతలకు కూడా దైవము పరమేశ్వరుడు. మహత్తు కంటే ఉత్కృష్టమైనవాడు విష్ణువు. రజోగుణము యొక్క ఉద్రేకము గల బ్రహ్మ సృష్టి కార్యమునందు ప్రవర్తిల్లును. పురుషుడు పరుడు (సర్వోత్కృష్టుడు) అనియు, ప్రకృతి పర (సర్వోత్కృష్టమైనది) అనియు చెప్పబడినది. ఈ ప్రకృతి మహేశ్వరునిచే అధిష్ఠితమై, సర్వదా ఆయనచే ప్రేరితమై ప్రవర్తిల్లుచున్నది. బ్రహ్మగారు మొదలగు మహాత్ములు తదను సారముగా తమ క్షేత్రములలో తమ ధర్మములను ప్రేమతో నిర్వర్తించుచున్నారు.
ప్రధానం గుణవైషమ్యాత్సర్గకాలే ప్రవర్తతే ।
ఈశ్వరాధిష్ఠితాత్ పూర్వం తస్మాత్సద సదాత్మకాత్ ॥
బ్రహ్మా బుద్ధిశ్చ మిథునం యుగపత్సంబ భూవతుః ।
తస్మాత్తమోఽవ్యక్తమయః క్షేత్ర జ్ఞో బ్రహ్మసంజ్ఞిత: ॥
సంసిద్ధః కార్యకర ణైర్ర్బహ్మాఽగ్రే సమవర్తత ।
తేజసా ప్రథమో ధీమానవ్యక్తస్సం ప్రకాశతే ॥
గుణములలో విషమ స్థితి ఏర్పడుట వలన ప్రధానము (ప్రకృతి, అవ్యక్తము) ఈశ్వరాధిష్ఠితమై జగత్సృష్టి యందు ప్రవర్తిల్లుచున్నది. ప్రధానము కారణ రూపములో అసత్ అనియు, కార్య రూపములో సత్ అనియు చెప్పబడుటచే సద సదాత్మకమగును. బ్రహ్మగారు, మహత్తు అను జంట దాని నుండి ఒక్కసారిగా పుట్టెను. పరబ్రహ్మయనబడు క్షేత్రజ్ఞుడు అవ్యక్తమును వ్యాపించి, దేహేంద్రియములతో గూడి బ్రహ్మగారి రూపములో సృష్ట్యాది యందు ప్రకటమయ్యెను. ప్రథమజీవుడగు బ్రహ్మగారు బుద్ధి శాలియై, తేజశ్ళాలియై ప్రకాశించెను.
స వై శరీరీ ప్రథమః కారణత్వే వ్యవస్థితః ।
అప్రతీఘేన జ్ఞానేన ఐశ్వర్యేణ చ సమన్విత: ॥
ధర్మేణ చాప్రతీఘేన వైరాగ్యేణ సమన్వితః ।
తస్యేశ్వరస్యా ప్రతిఘం జ్ఞానం వైరాగ్య లక్షణమ్ ॥
ధర్మైశ్వర్య కృతా బుద్ధిర్భ్రాహ్మీ జజ్ఞే భిమానినః ।
అవ్యక్తాఙ్ఞాయతే చాస్య మనసా చ యదిచ్ఛతి ॥
వశీకృతత్వాత్ వైగుణ్యాత్ సురేశత్వాత్ స్వభావతః ।
చతుర్ముఖస్తు బ్రహ్మత్వే కాలత్వే చాంతకోఽభవత్ ॥
సహస్రమూర్ధా పురుషస్తిస్రోఽవస్థాః స్వయంభువః ।
సత్త్వం రజశ్చ బ్రహ్మత్వే కాలత్వే చ రజస్తమః ॥
సాత్త్వికం పురుషత్వే చ గుణవృత్తి: స్వయంభువః ।
లోకాన్ సృజతి బ్రహ్మత్వే కాలత్వే సంక్షిపత్యపి ।
పురుషత్వే హ్యుదాసీనస్తిస్రోఽవస్థా ప్రజాపతే ॥
ఆ ప్రథమ జీవుడు జగత్సృష్టి యందు ప్రవర్తిల్లెను. ఆయన సాటిలేని జ్ఞానముతో, ఈశన శక్తితో, ధర్మముతో, జ్ఞాన వైరాగ్యములతో ప్రకాశించెను. ప్రథమ శరీరాభిమాని యగు బ్రహ్మగారి బుద్ది ధర్మముతో, ఈశన శక్తితో నిండియుండెను. ఆయన మనస్సులో దేనిని సంకల్పించిననూ, అది అవ్యక్తము నుండి పుట్టుచుండెను. ఆయన స్వభావము చేతనే జితేంద్రియుడు, విశేషగుణ సంపన్నుడు, దేవతలకు అధిపతియగుట వలన ఇది సంభవమయ్యెను. పురుషుడు చతుర్ముఖ బ్రహ్మ అయేను. ఆయనయే సంహారకుడగు కాల స్వరూపుడాయెను. స్వయంభువు (స్వయముగా నుండువాడు, పుట్టుకలేనివాడు) అనంత శిరస్సులు గలవాడు (సమస్త ప్రాణిరూపుడని భావము) నగు పురుషునకు మూడు అవస్థలు గలవు. సత్యరజస్సులు ప్రముఖముగా గల బ్రహ్మ, రజస్తమస్సులు ప్రముఖముగా గల సంహారకుడు, సత్యము ప్రముఖముగా గల పురుషుడు అను మూడు గుణ ప్రయుక్తములగు అవస్థలు స్వయంభువు యగు పరమాత్మకు గలవు. ఆయన బ్రహ్మరూపుడై లోకములను సృజించును. సంహారకుడై లోకములనుపసంహరించును. అసంగుడగు పురుషుడు అనునది మూడవ అవస్థ.
బ్రహ్మకమల గర్భాభః కాలో జాత్యాంజనప్రభః ।
పురుషః పుండరీకాక్షో రూపం తత్పరమాత్మనః ॥
యోగేశ్వరః శరీరాణి కరోతి వికరోతి చ ।
సానాకృతి క్రియారూపనామవృత్తి: స్వలీలయా ॥
త్రిధా యద్వర్తతే లోకే తస్మాత్ త్రిగుణ ఉచ్యతే ।
చతుర్ధా ప్రవిభక్తత్వాచ్చ తుర్వ్యూహః ప్రకీర్తిత: ॥
యదాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయం ప్రతి ।
తచ్చాస్య సతతం భావస్తస్మాదాత్మా నిరుచ్యతే ॥
ఋషిస్సర్వగతత్త్వాచ్చ శరీరాద్యాత్ స్వయం ప్రభుః ।
స్వామిత్వమస్య తత్సర్వం విష్ణుస్సర్వ ప్రవేశనాత్ ॥
బ్రహ్మగారు పద్మము లోపలి భాగము వలె నుండును. సంహారకుడగు కాలుడు కాటుక కాంతి గలవాడు. పురుషుడు పద్మము వంటి నేత్రములు గలవాడు. పరమాత్మ యొక్క రూపము ఇట్లుండెను. యోగశక్తి సంపన్నుడగు పరమేశ్వరుడు తన లీలచే వివిధ ఆకారములను ధరించి, వివిధ క్రియల నాచరించుచూ, వివిధ నామములతో వివిధ దేహములలో ప్రకటమై, మరల వాటిని, అంతర్ధానమొనర్చుచుండును. ఆయన మూడు రూపములలో, మూడు వేర్వేరు గుణములతో ప్రకటమగుటచే త్రిగుణుడనబడును. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ద అను నాల్గు రూపములలో విభాగమును పొందుటచే చతుర్వ్యూహుడు అని కీర్తించబడును. జీవదేహమునందు చైతన్యరూపుడుగ నుండి సుషుప్తిలో స్వరూపమును పొందును. స్వప్నములో స్వయం ప్రకాశముతో విస్తరించును. జాగ్రదావస్థలో విషయసంస్కారముల ననుభవించును. జీవుని వివిధ అవస్థలలో ఏకరూపము (అహంప్రత్యయరూపము)గ నుండును. కాన, పరమేశ్వరునకు ఆత్మయను సార్థక నామము కలిగినది. ఆయన సర్వవ్యాపకుడగుటచే ఋషి అనియు, సర్వముపై అధిపతియగుటచే ప్రభువు అనియు, సర్వమును ప్రవేశించుటచే విష్ణువు అనియు కీర్తింపబడును.
భగవాన్ భగసద్భావాత్ రాగో రాగస్య శాసనాత్ ।
పరశ్చ తు ప్రకృతత్వాదవ నాదోమితి స్మృత: ॥
సర్వజ్ఞస్సర్వ విజ్ఞానాత్ సర్వస్సర్వం యతస్తతః ।
నరాణామయనం యస్మాత్తేన నారాయణః స్మృతః ॥
త్రిధా విభజ్య స్వాత్మానం త్రైలోక్యం సంప్రవర్తతే ।
సృజతే గ్రసతే చైవ వీక్షతే చ త్రిభిస్తు యత్ ॥
సమగ్రమగు ఐశ్వర్యము, సామర్థ్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము అను ఆరు గుణములకు, భగము అని పేరు. అవి కలవాడు గనుక పరమాత్మకు భగవానుడని పేరు. ఆయన రాగమును శాసించువాడు గనుక, 'రాగుడు' అనబడును. ప్రకృతి కంటే ఉత్కృష్టుడు గనుక పరడు అనియు, రక్షించువాడు గనుక 'ఓం' అనియు కీర్తింపబడును. సర్వమును యేరింగినవాడు గనుక సర్వజ్ఞుడనియు, సర్వము ఆయన నుండియే ఉద్భవించినది గనుక సర్వుడనీయు అనబడును. సర్వప్రాణులకు ఆశ్రయము గనుక నారాయణుడనబడును, ఆయన తనను తాను మూడు రూపములుగా విభాగము చేసి, ఒక రూపముతో ముల్లోకముల సృష్టిని, మరియొక రూపముతో స్థితిని, ఇంకొక రూపముతో లయమును చేయుచున్నాడు.
అగ్రే హిరణ్యగర్భస్స ప్రాదుర్భూత శ్చతుర్ముఖః ।
ఆదిత్వాఛ్చాది దేవోఽసావ జాతత్వాదజః స్మృతః ॥
పాతి యస్మాత్ప్రజాస్సర్వాః ప్రజాపతిరతః స్మృతః ।
దేవేషు చ మహాన్ దేవో మహాదేవస్తతః స్మృతః ॥
సర్వే శత్వాచ్చ లోకానామవశ్యత్వాత్త థేశ్వరః ।
బృహత్వాచ్చ స్మృతో బ్రహ్మా భూతత్వాద్భూత ఉచ్యతే ॥
క్షేత్రజ్ఞః క్షేత్ర విజ్ఞానాద్వి భుస్సర్వగతో యతః ।
యస్తాత్ పుర్యనుశేతే చ తస్మాత్పురుష ఉచ్యతే ॥
నోత్పాదితత్వాత్ పూర్వత్వాత్ స్వయంభూరితి సస్మృతః ।
ఇజ్యత్వాదుచ్యతే యజ్ఞః కవిర్విక్రాంత దర్శనాత్ ॥
నాల్గు ముఖములు గల హిరణ్యగర్భుడు మున్ముందు ఆవిర్భవించెను. ఆయన సర్వమునకు ఆదియందు ఉండుటచే, ఆది దేవుడనబడును. పుట్టుకలేనివాడు గనుక, అజుడనబడును. ప్రజలనందరిని పాలించువాడు గనుక, ప్రజాపతియనబడును. ఆయన దేవతలందరిలో శ్రేష్టుడగు దేవుడు గనుక, మహాదేవుడనబడును. సర్వలోకములకు ప్రభువగుటచే ఈశ్వరుడనియు, మహాపరిమాణము కలవాడు గనుక బ్రహ్మ అనియు, సత్తా (ఉనికి) రూపుడు గనుక ‘భూతుడు' అనియు చెప్పబడును. క్షేత్రము (విరాట్ దేహము, లేక ప్రాణి దేహము) ను యెరింగినవాడు గనుక క్షేత్రజ్ఞుడనియు, సర్వవ్యాపకుడు గనుక విభుడనియు, దేహము (పురము) నందు నివసించువాడు గనుక పురుషుడనియు బ్రహ్మకు నామములు గలవు. పుట్టుక లేనివాడగుట చేతను, సర్వమునకు ఆది యందుండుట చేతను పరమేశ్వరునకు స్వయంభువు అని పేరు. యజ్ఞములలో ఆరాధింపబడును గనుక యజ్ఞుడనియు, ఇంద్రియ గోచరము కాని తత్త్యమును దర్శించువాడు గనుక కవి యనియు ఆయన కీర్తింపబడును.
క్రమణ: క్రమణీయత్వాత్ వర్ణకస్యాభి పాలనాత్ ।
ఆదిత్య సంజ్ఞః కపిలస్త్వ గ్రజోఽగ్నిరితీస్మృత: ॥
హిరణ్యమస్య గర్భోఽభూద్ధిరణ్యస్యాపి గర్భజః ।
తస్మాద్ధిరణ్య గర్భస్స పురాణేస్మిన్ని రుచ్యతే ॥
స్వయంభువో నివృత్తస్య కాలో వర్షా గ్రజస్తు యః ।
న శక్యః పరిసంఖ్యాతుమపి వర్షశతైరపి ॥
కల్పసంఖ్యా నివృత్తేస్తు పరాభ్యో బ్రహ్మణః స్మృతః ।
తావచ్ఛేపోఽస్య కాలోఽన్యస్తస్యాంతే ప్రతిసృజ్యతే ॥
కోటికోటి సహస్రాణి అంతర్భూతాని యాని వై ।
సమతీతాని కల్పానాం తవచ్చేషాః పరాస్తు యే ॥
బ్రహ్మ జ్ఞానముచే ప్రాజాపత్య స్థానము నతిక్రమించుట సంభవము గనుక ప్రజాపతికి క్రమణుడు అని పేరు. ఈశ్వర స్తుతి రూపములగు వేదములను బ్రహ్మ రక్షించును. ఆయనకు ఆదిత్యుడు, కపిలుడు, అగ్ని, అగ్రజుడు అను నామములు గలవు. బ్రహ్మగారి గర్భమునందు హిరణ్యము (తేజస్సు) ఉండుట వలన, లేదా, ఆయన హిరణ్యము యొక్క గర్భము నుండి జన్మించుట వలన, హిరణ్య గర్భుడు ఆయెనని ఈ పురాణము నిర్వచించుచున్నది. గడచిపోయిన ప్రజాపతుల కాలమును వందల సంవత్సరములలోనైననూ లెక్కించుట సంభవము కాదు. గడచిపోయిన కల్పముల సంఖ్యను బట్టి బ్రహ్మగారి ఆయుర్దాయము (పరము)లో సగభాగము గడచినది. మరియొక సగము ఆయుష్సు మిగిలినది. ఆ తరువాత ప్రలయము సంభవించును. పరములో అంతర్భాగములుగా నుండు కల్పములు కోట్లాది గడచిపోయినవి. ఇంకను అనేక కల్పములు వచ్చుచునే యుండును.
యస్త్వయం వర్తతే కల్పో వారాహం తం నిబోధత ।
ప్రథమః సాంప్రతస్తేషాం కల్పోఽయం వర్తతే ద్విజా ॥
తస్మిన్ స్వాయంభువాద్యాస్తు మనవః స్యుశ్చతుర్దశ ।
అతీతా వర్తమానాశ్చ భవిష్యా యే చ వైపునః ॥
తైరియం పృథివీ సర్వా సప్తద్వీపా సమంతతః ।
పూర్ణం యుగసహస్రం పై పరిపాల్యా నరేశ్వరై: ॥
ప్రజాభిస్తపసా చైవ తేషాం శృణుత విస్తరమ్ ।
మన్వంతరేణ చైకేన సర్వాణ్యే వాంతరాణి వై ॥
భవిష్యాణి భవి ష్యైశ్చ కల్పః కల్పేన చైవ హ ।
అతీతాని చ కల్పాని సోదకాని సహాన్వయైః ॥
అనాగతేషు తద్వచ్చ తర్క: కార్యో విజానతా ॥
ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే సృష్టి ప్రకరణం నామ పంచమోఽధ్యాయః ॥
ఓ ద్విజులారా! ప్రస్తుతములో వారాహ కల్పము గడచుచున్నది అని తెలియుడు. ఇది కల్పములలో మొదటిది. దీని యందు గడచిన, నడుచుచున్న, మరియు రాబోవు మనువులు పదునాలు మంది గలరు. వీరిలో స్వాయంభువ మనువు ఒకడు. ఆ చక్రవర్తులచే ఏడు ద్వీపములతో కూడిన, ఈ భూమి అంతా వేయి యుగముల కాలము పూర్తిగా పాలింపబడును. వారి ప్రజాపాలనమును వారి తపస్సును విస్తరముగా వివరించెదను. వినుడు. ఒక మన్వంతరమును గురించి తెలుసుకున్నచో, రాబోవు మన్వంతరములన్నియూ తెలిసినట్లే యగును. గడచిన కల్పములను, వంశములను వర్ణించెదను. వాటిని తెలుసుకొని, రాబోవు వాటి గురించి తదనురూపముగా ఊహించుకొనవలెను.
శ్రీవాయు మహాపురాణములో సృష్టి ప్రకరణము అను ఐదవ అధ్యాయము ముగిసెను.