వాయు మహా పురాణము
56 - పితృవర్ణనం
శాంశపాయన ఉవాచ:-
అగాత్కథ మమావాస్యాం మాసి మాసి దివం నృపః ।
ఐలః పురూరవాః సూత కథం వా తర్పయత్పితతౄన్ ॥
సూత ఉవాచ:-
తస్య చాహం ప్రవక్ష్యామి ప్రభావం శాంశపాయన ।
ఐలస్యాదిత్య సంయోగం సోమస్య చ మహాత్మనః॥
అపాం సారమయస్యేందోః పక్షయోః శుక్లకృష్ణయోః ।
హ్రసవృద్దీపితృమతః పక్ష్యస్య చ వినిర్ణయ॥
సోమాచ్చైవామృతప్రాప్తిః పితౄణాం తర్పణం తథా ।
కావ్యాగ్నే శ్చాత్త సోమానాం పితృణాం చైవ దర్శనమ్॥
యథాపురూరవాశ్చైల స్తర్పయామాస వై పీతౄన్ ।
ఏతత్సర్వం ప్రవక్ష్యామీ పర్వాణి చ యథా క్రమమ్॥
యదా తు చంద్రసూర్యౌతా నక్షత్రేణ సమాగతౌ ।
అమావాస్యాన్నివసత ఏకరాత్రైక మండతే॥
స గచ్చతి తదా ద్రష్టుం దివాకర నిశాకరౌ ।
అమావాస్యామమావాస్యా మాతామహపితామహౌ॥
అభివాద్య తదా తత్ర-కాలా పేక్షః ప్రతీక్ష్యతే॥
ప్రసీదమానాత్ సోమాచ్చ పిత్రర్థం తత్పరిస్రవాత్ ।
ఐలః పురూరవా విద్వాన్ మాసి మాసి ప్రయత్నతః॥
ఉపాస్తే పితృమంతం తం ససోమం స దివాస్థితః॥
ద్విలవం కుహుమాత్రం తు తే ఉభే తు విచార్య సః ।
సినీవాలీ ప్రమాణేన సినీవాలీముపాసకః॥
కుహూమాత్రం కలాం చైవ జ్ఞాత్వోపాస్తే కుహుం పునః ।
స తదా భానుమత్యేక కాలావేక్షీ ప్రపశ్యతి॥
సుధామృతం కుతః సోమాత్ ప్రస్రవేన్మాసతృప్తయే ।
దశభిః పంచభిశ్చైవ సుధామృత పరిస్రవైః ॥
కృష్ణపక్షే తదా పీత్వా దుహ్యమానం తథాంశుభిః ।
సద్యః పక్షరతా తేన సౌమ్యేన మధునా చ సః॥
నిర్వాపణార్థం దత్తేన పిత్రేణ విధినా నృపః ।
సుధామృతేన రాజేంద్రస్త ర్పయామాస వై పితౄన్॥
సౌమ్యా బర్హిషదః కావ్యా అగ్నిష్వాత్తా స థైవ చ।
ఋతురగ్నిస్తు యః ప్రోక్తః స తు సవంత్సరో మతః ।
జజ్ఞిరే హృతవస్తస్మాదృతుభ్యశ్చార్త వాశ్చయే॥
ఆర్తవాహ్యర్థ మాసాఖ్యాః పితరోహ్యబ్దసూనవః ।
ఋతుః పితామహా మాసా ఋతుశ్చైవాబ్ద సూనవః ॥
ప్రపితామహాస్తు వై దేవాః పంచాబ్దా బ్రహ్మణః సుతాః।
సౌమ్యాస్తు సౌమ్యజా జ్ఞేయాః కావ్యాః జ్ఞేయాః కవేః సుతాః ॥
ఉపహూతాః స్మృతాః దేవాః సోమజాః సోమపాస్తథా ।
ఆజ్యపాస్తు స్మృతాః కావ్యా స్తృప్యన్తి పితృజాతయః ॥
కావ్యా బర్హిషదశ్చైవ అగ్నిష్వాత్తాశ్చ తేత్రిథా ।
గృహస్థా యే చ యజ్వానా ఋతుర్బర్షిషదో ధ్రువమ్॥
గృహస్థాశ్చాపి యజ్వానా అగ్నిష్వాత్తా స్తథా ర్తనాః ।
అష్టకా పతయః కావ్యాః పంచాబ్దాస్తాన్నిబోధత ॥
శాంశపాయనుడనెను:- ఓ సూతా! ఇలా పుత్రుడైన పురూరవుడను రాజు ప్రతి నెలలో నమావాస్యనెట్లు పొందెను? పితురులకెట్లు తర్పణము జేసెను?
సూతుడనెను:- ఓ శాంశపాయనా! ఆపురూరవుని ప్రభావమును జెప్పెదను అట్లే ఇలా పుత్రుడైన పురూరవునియొక్కయు ఆదిత్యునియొక్కయు సంయోగమును అట్లే పురూరవుని యొక్కయు మహాత్ముడైన సోముని (చంద్రుని) యొక్కయు యోగమును దెలిపెదను. నీటిసారమై యమృతమునుండి చంద్రుని యొక్కయు వృద్దులు, కృష్ణశుక్ల పక్షములు, పితృపక్ష నిర్ణయము. చంద్రుని నుండి యమృతములభించుట పితురుల తర్పణము. అట్లే కావ్యాన్ని నుండి (శుక్రాగ్ని నుండి) పొందిన సోమరసముగల పితరుల దర్శనము. ఇలా పుత్రుడైన పురూరవుడు పితృతర్పణము జేసిన విధము ఇదంతయు జెప్పెదను. వరుసగా ఆ పర్వములను గూడ జెప్పెదను. చంద్ర సూర్యులోకే నక్షత్రమున (తో) ఒక రాత్రి- ఒక మండలమునందు కలిసియున్నపుడు అమావాస్యలో నివసింతురు. అపుడా పురూరవుడు సూర్యచంద్రుల జూడబోవును. అపుడచట అభివాదనము జేసీ (నమస్కరించి) కాలమున పేక్షించినవాడై వేచియుండును. ఇలాపుత్రుడై విద్వాంసుడైన పురూరవుడు పితృదేవతలకై (యమృతమును పరిస్రవించుచు) క్షీణించుచున్న చంద్రుని నుండి (కృష్ణపక్షమున) యమృతము స్రవించుటవలన పితృమంతుడైన చంద్రునిని పురూరవుడు పగటిలోనున్నవాడై ప్రతిమాసమున నుపాసించును. రెండు లవములకాలము (లవమనగా కనరెప్పపాటు కాలములో నాఱవ వంతుకాలము) చంద్రకళలేని (కుహువు) అమావాస్యనంతయు ఆ చంద్రసూర్యులనిద్దరిని విచారించి యాతడు (పురూరవుడు) సినీవాలి (చంద్రకళతో గూడిన యమావాస్య) ప్రమాణముతో సినీవాలినుపాసించువాడయ్యెను. కుహువు విషయముననైతే అమావాస్యగామాత్రము చంద్రకళను దెలిసికొని (చంద్రకళలేని యమావాస్యనుగా దెలిసికొని) కుహువునే యుపాసించును. అపుడాతడు (పురూరవుడు) సూర్యునియందే (చంద్రసూర్యులను) ఏకకాలమున జూడదలచి బాగుగా జూచును చంద్రుని నుండి పదియైదు (శుక్లపక్ష దినముల) సుధామృత పరిసవములచే మాస తృప్తికొరకు సుధామృతమెందులకు (ఎక్కడినుండి) ప్రసవించును?. కృష్ణపక్షమున ఆ విధముగా (సూర్య) కిరణములచే పితుకబడుచున్న చంద్ర సుధామృతమును త్రాగి వెంటనే యా చంద్రసంబంధమైన మధువుచే (యాశుక్ల పక్షమునందు (కుజేయుటకు) ఆసక్తి గలుగును (కావున సుధామృతము ప్రసవించును. ఆ రాజశ్రేష్ఠుడు నిర్వాపణమునకై పైతృకవిధితో నీయబడిన సుధామృతముతో పితురులను తర్పణములతో సంతృప్తిపరచుచుండును. సోమసంబద్దులైన బర్హిషదులను (దర్భలపై గూర్చుండు వారిని) కావ్యాన్నిష్వాత్తులను గూడినట్లే తృప్తిపరచుచుండెను. అగ్నియని చెప్పబడిన ఋతువు సంవత్సరముగా సమ్మతమైనది. దానినుండి ఋతువులు జనించినవి. ఋతువులనుండి యార్తవములు బుట్టినవి. ఆర్తవములు అర్థమాసములనబడునవి. పితరులు సంవత్సరపుత్రులు. ఋతువు పితామహులైన మాసములు ఋతువే సంవత్సర పుత్రులు-15. ప్రపితామహులు దేవతలు. ఐదు సంవత్సరములు బ్రహ్మయొక్క కుమారులు సోమునకు బుట్టినవారు సౌమ్యులు. కవి కుమారులు కావ్యులు. ఉపహూతులు దేవతలనబడిరి. ఆజ్యవులు (నేయిద్రావువారు) కావ్యులనబడిరి. ఈ పితృజాతులందరును తృప్తిబొందుదురు. ఆ పితృజాతులు కావ్యులనియు బర్హిషదులనియు అగ్నిష్వాత్తులనియు మూడు విధములుగానున్నారు. యజ్వానులైన గృహస్థులు ఋతువయి నిశ్చయముగా బర్హిషదులగుదురు. యజ్వానులైన గృహస్థులు, అగ్నిష్వాత్తులు, అట్లే యార్తవులు, అష్టకాపతులు, కావ్యులును పంచాబ్దులు వారిని గూర్చి వినుడు.
ఏషాం సంవత్సరో హ్యగ్ని సూర్యస్తు పరివత్సరః ।
సోమ ఇద్వత్సరః ప్రోక్తే వాయుశ్చైవానువత్సరః ॥
రుద్రస్తు వత్సర స్తేషాం పంచాబ్దా యే యుగాత్మకాః ।
లేఖాశ్చైవోష్మపాశ్చైవ దివాకీర్తాశ్చ తే స్మృతాః॥
ఏతే పిబంత్యమావాస్యాం మాసి మాసి సుధాం దివి ।
తాం స్తేన తర్పయామాస యావదాసీత్పురూరవాః॥
వీటికి అగ్ని సంవత్సరము సూర్యుడు పరివత్సరము. సోముడు ఇద్వత్సరము. వాయువు అనువత్సరము అనబడినారు. యుగాత్మకములైన యైదు అబ్దములకు రుద్రుడు వత్సరము. వారు లేఖులు (దేవతలు) అగ్నులును దివాకీర్త్యులు (పగలు కీర్తింపదగినవారు) అనబడినారు. వీరు ప్రతిమాసమున నాకాశమునందు అమావాస్యగా అమృతము ద్రావుదురు. ఆ కారణముచేత పురూరవుడు తానున్నంతవరకు వారినమృతముచేత తృప్తిజెందజేయుచుండెను.
యస్మాత్ప్రస్రవ తే సోమాన్మాసిమాసి నిబోధత ।
తస్మాత్సుధామృతం తద్యై పితౄణాం సోమపాయినామ్॥
ఏవం తదమృతం సౌమ్యం సుధా చ మధుచైవహ ।
కృష్ణపక్షే యథాచేంధోః కలాః పంచదశక్రమాత్॥
పిబంత్యంబుమయీర్దేవా స్త్రయస్త్రింశత్తు ఛందజాః ।
పీత్వా చ మాసం గచ్ఛని, చతుర్దశ్యాం సుధామృతమ్॥
ఇత్యేవం పీయమానస్తు దేవతైశ్చ నిశాకరః ।
సమాగచ్ఛదమావాస్యాం భాగే పంచదశే స్థితః ॥
సుషుమ్నా ప్యాయితం చైవ అమావాస్యాం యథాక్రమమ్ ।
పిబన్తి ద్వికలం కాలం పితరస్తే సుధామృతమ్ ॥
తతః పీతక్షయే సోమే సూర్యోఽసావేక రశ్మినా ।
ఆప్యాయయత్సుషుమ్నేన పితౄణాం సోమపాయినామ్॥
నిఃశేషాయాం కలాయాన్తు సోమమాప్యాయ యత్పునః ।
సుషుమ్నాప్యాయమానస్య భాగం భాగమహః క్రమాత్॥
కలాః క్షీయన్తి తాః కృష్ణాః శుక్లాశ్చాప్యాయయన్తి చ॥
ఏవం సూర్యస్య వీర్వేణ చంద్రస్వాప్యాయితం తనుః ।
దృశ్యతే పౌర్ణమాస్యాం వై శుక్లః సంపూర్ణమండలః ॥
సంసిద్ధిరేవం సోమస్య పక్షయోః శుక్లకృష్ణయోః॥
ఇత్యేష పితృమాన్ సోమః స్మృత ఇద్వత్సరః క్రమాత్ ।
క్రాంతః పంచదశైః సార్థం సుధామృతపరిస్రవైః ॥
ప్రతి మాసమున సోముని (చంద్రుని) నుండి స్రవించుటవలన అది సోమపాయులైన పితరులకు సుధామృతమైనది . ఈ విధముగా సోమ సంబంధియైన యాయమృతమును సుధా, మధువును కృష్ణపక్షమున పదియైదు చంద్రకళలవలె వరుసగా చంద్రమునబుట్టి జలమయులైన ముప్పది ముగ్గురు దేవతలు ద్రాగుదురు. ఆ విధముగా నెలరోజులు సుధామృతమును ద్రావి చతుర్దశినాడు వెళ్లుదురు. ఈ విధముగా దేవతలచే ద్రాగబడుచు చంద్రుడు పదియైదవ భాగముననున్నవాడై యమావాస్యను జేరును. ఆ పితరులు సుషుమ్నయను సూర్యకిరణములచే తనివి జెందిన (నిండిన) సుధామృతమును యథా క్రమముగా అమావాస్యయందు (గా) ముప్పదియారు రెప్పపాట్ల కాలము ద్రావుదురు. తరువాత చంద్రుడు త్రాగబడి క్షీణింపగా ఈ సూర్యుడు సోమపాయులుగా (చంద్రుని ద్రాగు) పితరులకై సుషుమ్నమనునొక కిరణముచేత సుధను నింపి సంతృప్తిపరచెను. (చంద్ర) కళనిఃశేషముగా మరల చంద్రుని (సుధాకళలతో) నింపి సంతృప్తి పరచెను. దినక్రమమునుబట్టి ప్రతిభాగము సుషుమ్నమను సూర్యకిరణములతో నమృతకళలు నింపబడుచున్న చంద్రుని శుక్ల పక్షకళలు నింపబడుచున్నవి. ఆ కృష్ణపక్షకళలు క్షీణించుచున్నవి. ఈ విధముగా సూర్యుని వీర్య (బల)ముచే చంద్రుని శరీరము (సుధాకళలతో) నిండి సంతృప్తిజెందబడినదగును. కావున పూర్ణిమయందు తెల్లనివాడై నిండిన మండలము (బింబము) గలవాడై కనబడును. శుక్ల కృష్ణపక్షములలో చంద్రుని సంసిద్ది యీవిధముగా నుండును. అని యీ చంద్రుడు పితృమంతుడుగా (పితృదేవతలుగలవాడుగా) జెప్పబడినాడు. పదీయైదు సుధామృత పరిసవములచేత క్రమముగా జేరినవాడై ఇద్వత్సరముగ గూడ జెప్పబడినాడు.
అతః పర్వాణి వక్ష్యామి పర్వణాం సంధయస్తథా ।
గ్రందిమన్తి యథా పర్వాణీక్షువేణ్వోర్బవన్త్యుత॥
తథార్థమాసపర్వాణి శుక్లకృష్ణాని వై విదుః ।
పూర్ణిమావాస్యయోర్భేదైర్గ్రంథిర్యా సంధయశ్చ వై॥
అర్థమాసాస్తు పర్వాణి తృతీయా ప్రభృతీని తు॥
అగ్న్యాధానక్రియా యస్మాత్ క్రియతే పర్వసంధిషు ।
సాయాహ్నే ప్రతిపచ్చైవ సకాలః పౌర్ణమాసికః ॥
వ్యతీపాతే స్థితే సూర్యే లేఖోర్థ్యం తు యుగాన్తరే ।
యుగాన్తరోదితే చైవ లేఖోర్వం శశినః క్రమాత్॥
పౌర్ణమాసే వ్యతీపాతే యదీక్షేతే పరస్పరమ్ ।
యస్మిన్ కాలే ససీమాన్తే సవ్యతీపాత ఏవ తు॥
కాలం సూర్యస్య నిర్దేశం దృష్ట్యా సంఖ్యా తు సర్పతి ।
స వై పథం క్రియాకాలః కాలాత్సద్యో విధీయతే॥
పూర్ణేందోః పూర్ణపక్షే తు రాత్రిసంధిషు పూర్ణిమా ।
యస్మాత్తామనుపశ్యన్తి పితరో దైవతైః సహ ॥
తస్మాదనుమతిర్నామ పూర్ణిమా ప్రథమా స్మృతా॥
అత్యర్థం భ్రాజతే యస్మాత్ పౌర్ణమాస్యాం నిశాకరః ।
రంజనాచ్చైవ చంద్రస్య రాకేతి కవయో విదుః ॥
అమా వసేతాః ఋక్షే తు యదా చంద్రదివాకరౌ ।
ఏకాంపంచదశీం రాత్రిమమావాస్యా తతః స్మృతా ॥
తతోఽపరస్య తైర్వ్యక్తః పౌర్ణమాస్యాం నిశాకరః ।
యదీక్షతే వ్యతీపాతే దివాపూర్ణే పరస్పరమ్॥
చంద్రార్కాపరాహ్ణే తు పూర్ణాత్మానౌతు పూర్ణిమా॥
విచ్ఛిన్నాం తామమావాస్యాం పశ్యతశ్చ సమాగతౌ ।
అన్యోన్యం చంద్రసూర్యౌ తౌ యదా తద్దర్శ ఉచ్యతే ॥
ద్వౌ ద్వౌలవావమావాస్యాం యః కాలః పర్వసంధిషు ।
ద్వాక్షరం కుహుమాత్రం తు ఏవం కాలస్తు సంగతా ॥
ఇక, చెఱకును వెదురునకును గ్రంథులు (ముడులు) గల సర్వములు (కునుపులు) ఉండినట్లు, పర్వములను అట్లే పర్వసంధులను జెప్పెదను. అర్థమాసపర్వములు శుక్ల-కృష్ణ పక్షములుగా పెద్దలు తెలియుదురు. పూర్ణిమా. అమావాస్య అనునవి గ్రంథులు సంధులును అనబడును. అర్ధమాసములు పర్వములు. అవి తృతీయా తిథి మొదలుకొని (పూర్ణిమ అమావాస్యల వరకున్న భాగము) యుండును. సాయంకాలమునను ప్రతిపత్తిథియందును పర్వసంధులందు అగ్న్యాధానక్రియ చేయబడునుగాన ఆకాలము పౌర్ణమాసికము. వ్యతిపాతమున సూర్యుడుండగా యుగాంతరమున చంద్రునకు లేఖోర్థమగును. సూర్యుడు యుగాంతరోదితుడైనను చంద్రునకు లేఖోర్ధ్వమగును-35. వ్యతీపాతమున పూర్ణిమయందు చంద్రసూర్యులు పరస్పరము జూచుకొన్నపుడు ఆకాలము సీమాన్తమున వ్యతీపాతమేయగును. సూర్యుని జెప్పు కాలమానమును జూచీ సంఖ్యముందుకు బోవును. అది క్రియాకొలము. అది కాలమువలన వెంటనే విధింపబడును. పూర్ణ (శక్ల పక్షమున పూర్ణచంద్రుని రాత్రిసంధులలో పూర్ణిమ యుండును. పితరులు దేవతలతోబాటు ఆ పూర్ణిమను జూతురు. కావుననే మొదటి పూర్ణిమ అనుమతి యనబడినది. (చతుర్దశితో గూడిన పూర్ణిమయనుమతి) పూర్ణిమయందు చంద్రుడు మిక్కిలి ప్రకాశించును. చంద్రునియొక్క రంజనమువలన (కళలచే పూర్ణముగానుండే పూసినట్టుగా నుండి నందున కవులు ఈ సర్వ కళాసంపూర్ణుడైన చంద్రుడు గల పూర్ణిమ 'రాకా' యని తెలియుదురు. చంద్ర సూర్యులు గూడి యొకే నక్షత్రమందు ఒక పదియైదవ (పంచదశి)రాత్రియంతయు నున్నందున అది యమావాస్యయనబడినది-40. ఇక తరువాతి (శుక్ల) పక్షము యొక్క పూర్ణిమయందు (అన్ని) కళలతో చంద్రుడు వ్యక్తుడగును వ్యతీపాతమున పగటియందు పూర్ణమై యున్నప్పుడును అపరాష్ట్రమునందును చంద్రసూర్యులు పూర్ణాత్ములై పరస్పరము జూచుకొన్నప్పుడు పూర్ణిమ యగును. చంద్రసూర్యులు ఒకచోటజేరి పరస్పరముగా విచ్చిన్నమైన యాయమావాస్యను జూచినపుడు అది 'దర్శ' (సూర్యేందు సంగమము) మనబడును. పర్వసంధుల యమావాస్యలో రెండేసి లవముల (ముప్పదియాఱుకనురెప్పపాట్లు) కాలము రెండక్షరములుగా ‘కుహు’ (చంద్రకళలేని యమావాస్య)గా జెప్పబడినది. చంద్రుడులేని యమావాస్య (కుహువు) మధ్య సూర్యునితో గలిసియుండును.
దివాసార్ధన రాత్య్రర్ధం సూర్యం ప్రాప్య తు చంద్రమాః ।
సూర్యేణ సహసా ముక్తిం గత్వా ప్రాతస్తనోత్సవౌ॥
ద్వౌ కాలౌ సంగమశ్చైవ మధ్యాహ్నే నిష్పతేద్రవిః ॥
ప్రతిపచ్చుక్లపక్షస్య చంద్రమాః సూర్యమండలాత్ ।
నిర్యుచ్య మానయోర్మధ్యే తయోర్మండలయో స్తు వై॥
స తదా హ్యాహుతేః కాలో దర్శస్య చ వషట్క్రియా ।
ఏతదృతుముఖం జ్ఞేయ మమావాస్యాస్య పర్వణః॥
దివాపర్వణ్యమావాస్యాం క్షీణేందౌ బహులే తు వై ।
తస్మాద్దివా హ్యమావాస్యాం గృహ్యతేఽసౌ దివాకరః॥
గృహ్యతే వై దివా హ్యస్మాదమావాస్యాం దివి క్షయైః ।
కలానామపి వై తాసాం బహుమాన్యా జడాత్మకైః ।
తిథీనాం నామధేయాని విద్వద్భిః సంజ్ఞితాని వై॥
దర్శయే తాథాఽన్యోన్యం సూర్యచంద్రమ సావుభౌ ।
నిష్క్రామత్యథ తే నైవ క్రమశః సూర్యమండలాత్॥
ద్విలవేన హ్యహోరాత్రం భాస్కరం స్పృశతే శశీ ।
స తదా హ్యాహుతేః కాలో దర్శస్య చ వషట్క్రియా॥
కుహేతి కోకిలీ నో క్తో యః కాలః పరిచిహ్నితః ।
తత్కాలసంజ్ఞితా యస్మాదమావాస్యాకుహుః స్మతా॥
సినీవాలీ ప్రమాణేన క్షీణశేషో నిశాకరః ।
అమావాస్యాం విశత్యర్కం సినీవాలీ తతః స్మృతా॥
పర్వణః పర్వకాలస్తు తుల్యౌ వై తు వషట్క్రియా।
చంద్రసూర్యవ్యతీపాతే ఉభౌ తే పూర్ణిమే స్మృతే॥
ప్రతిపత్పంచదశ్యోశ్చ పర్వకాలో ద్విమాత్రకః ।
కాల కుహు సినీవాల్యోః సముద్రో ద్విలవః స్మతః ॥
అర్కాగ్నిమండలే సోమే పర్వకాలః కలాశ్రయః ।
ఏవం సశుక్లపక్షో వై రజన్యాః పర్వసంధిషు॥
సంపూర్ణమండలః శ్రీమాంశ్చంద్రమా ఉపరజ్యతే ।
యస్మాదాప్యాయతే సోమః పంచదశ్యాం తు పూర్ణిమా॥
దశభిః పంచభిశ్చైవ కలాభిర్దివస క్రమాత్ ।
తస్మాత్కలాపంచదశీ సోమేనాస్తి తు షోడశీ ॥
తస్మాత్సోమస్య భవతి పంచదశ్యాం మహాక్షయః॥
ఇత్యేతే పితరో దేవాః సోమపాః సోమవర్థినః ।
ఆర్తవా ఋతవో యస్మాత్ తే దేవా భావయన్తి చ॥
చంద్రుడు రాత్రి సగముతోగూడిన పగటితో సూర్యునిబొంది, వెంటనే సూర్యునితో విముక్తిని బొంది ప్రాతఃకాలోత్సవము గలవారగుదురు. వారిసంగమము రెండు కాలములు. రవి మధ్యాహ్నమున బడును. శుక్లపక్షము యొక్క ప్రతిపత్తు (తిథి) సూర్యమండలమునుండి మొదటి విడిపడుచున్న మండలముల మధ్యనున్న చంద్రుడు అగును. అప్పుడది సూర్యేందు సంగమరూపమైన దర్శ (అమావాస్య) యొక్క కాలము. వషత్రియయు అగుచున్నవి. దీనిని ఋతువు యొక్క ముఖము (ప్రారంభము) గా దెలియవలెను. అది యీ పర్వదినము యొక్క అమావాస్యా రూపమైనది-46. క్షీణచంద్రుడు గల బహుల పక్షమున పగటి పర్వమునందు అమావాస్యను గ్రహింతురు. కావుననే సూర్యుడు పగలే యమావాస్యను గ్రహించును. ఇందువలననే దేవతలచేత నమావాస్యను గూర్చి పగలే గ్రహింపబడుచున్నది. ఆకళలయొక్క స్థితి బహుమానింపదగినది. అజడాత్మకులైన పండితులచే తిథులయొక్క నామధేయములు గూడ జేయబడినవి. సూర్యచంద్రులిద్దరు పరస్పరము జూచుకొందురు. తరువాత క్రమముగా చంద్రుడు సూర్యమండలము నుండి బయల్వెడలును-49. చంద్రుడు రాత్రింబవళ్లు ద్విలవముతో చంద్రుని సూర్యుని స్పృశించును. ఆకాలము దర్శ(అమావాస్య) యొక్క యాహుతికాలము వషత్రియయును, కోకిల కూతకు సమానమైన కాలముతో గుర్తింపబడినందున యమావాస్య కుహు అనబడినది. సినీవాలే ప్రమాణముతో చంద్రుడు క్షీణశేషుడుగా నుండి యమావాస్యలో సూర్యుని బ్రవేశించుటచే సినీవాలి యనబడినది. పర్వము యొక్క పర్వకాలము వషత్రియయు సమానులు. చంద్రసూర్యవ్యతీ పాతములు రెండును పూర్ణిమలనబడినవి-53. ప్రతి పత్సంచదశులలో ద్విమాత్రికలము పర్వకాలము. కుహుసినీవాలుల సముద్రము రెండు లవములు గలది. అరాగ్ని మండలమైన సోమునందు పర్వకాలము కలాశ్రయమైనది. ఈ విధముగా రాత్రియొక్క పర్వసంధులలో శుక్లపక్షము. దీనిలో చంద్రుడు సంపూర్ణమండలుడై రాహువుచే గ్రహింపబడును (గ్రహణమేర్పడును). శుక్ల పక్షపు పదియైదవ దీనమున దివస క్రమున పదియైదు కళలచే చంద్రుడు సంపూర్ణకళామతుడుగా జేయబడును గాన పూర్ణిమయనబడినది. కావున పదియైదవ కళ చంద్రుని యందుండును. పదియాఱవ కళయుండును. కావుననే పంచదశి (అమావాస్యయందు చంద్రునకు మహాక్షయము గలుగును. ఈ విధముగా పితృదేవతలు సోమ (చంద్రు)ని ద్రావుతారు. సోముని వృద్ధిజెందించువారును. కావున ఆ పితృదేవతలే ఋతువులును ఋతువులకు సంబంధించినవారును (ఈ విధముగా) ఆ దేవతలు భావింతురు.
అతః పితౄన్ ప్రవక్ష్యామి మాసశ్రాద్దభుజస్తు యే ।
తేషాం గతిం చ సత్త్వం చ గతిం శ్రాద్ధస్య చైవ హి ॥
న మృతానాం గతిః శక్యా విజ్ఞాతుం పునరాగతిః ।
తపసాపి ప్రసిద్ధేన కిం పునర్మాంస చక్షుషా॥
శ్రాద్ధదేవాన్ పితౄనేతాన్ పితరో లౌకికాః స్మృతాః ।
దేవాః సౌమ్యాశ్చ యజ్వానః సర్వే చైవ హ్యయోనిజాః ॥
దేవాస్తే పితరః సర్వే దేవాస్తాన్ భావయన్ త్యుత ।
మనుష్యాః పితరశ్చైవ తేభ్యోఽన్యే లౌకికాః స్మృతాః॥
పితా పితామహశ్చైవ తథైవ ప్రపితామహః ।
యజ్వానో యే తు సోమేన సోమవన్త స్తుతే స్మృతాః ॥
యే యజ్వానః స్మృతా స్తేషాం తే వైబర్హిషదః స్మృతాః ।
కర్మ స్వేతేషు యుక్తాస్తే తృప్యంత్యాదేహ సంభవాత్॥
అగ్నిష్వాత్తాః స్మృతాయాస్తేషాం హోమినో యాజ్యయాజనః ।
యేవాప్యాతు మధర్మేణ ప్రస్థానేషు వ్యవస్థితాః ॥
అనే చ నైవ సీదన్తి శ్రద్ధాయుక్తేన కర్మణా ।
బ్రహ్మచర్యేణ తపసా యజ్ఞేన ప్రజయా చ వై॥
శ్రద్ధయా విద్యయా చైవ ప్రదానే న చ సప్తథా ।
కర్మస్వేతేషు యే యుక్తా భవన్త్యాదేహపాతనాత్॥
దేవైస్తైః పితృభిః సార్థం సూక్ష్మకైః సోమపాయకైః ।
స్వర్గతా దివి మోదన్తే పితృమన్ తముపాసతే ॥
ప్రజావతాం ప్రశంసైవ స్మృతా సిద్దా క్రియావతామ్ ।
తేషాం నివాపదత్తాన్నం తత్కుత శ్చ బాంధవైః॥
మాసం శ్రాద్ధభుజస్తృప్తిం లభన్తే సోమలౌకికాః ।
ఏతే మనుష్యాః పితరో మాసి శ్రాద్ధభుజస్తు తే ॥
తేభ్యోఽపరే తు యేచాఽన్యే సంకీర్ణాః కర్మయోనిషు ।
భ్రష్టాశ్చా శ్రమధర్మేభ్యః స్వధా స్వాహా వివర్జితాః॥
భిన్నదేహాదురాత్మనః ప్రేతభూతాయ వై క్షయే ।
స్వకర్మాణ్యేవ శోచన్తి యాతనాస్థానమాగతాః ॥
దీర్ఘాయుషోఽ తిశుష్కాశ్చ వివర్ణాశ్చ వివాససః ।
క్షుత్పిపాసా రీతాశ్చ విద్రవన్తి ఇతస్తతః ॥
సరితరస్తడాని వాపిశ్చైవ జలేప్సవః ।
పరాన్నాని చ లిప్సంతే కంపమానాస్తతస్తతః॥
స్థానేషు పాచ్యమానాశ్చ యాతా యాతేషు తేషు వై ।
శాల్మలౌ వైతరణ్యాం చ కుంభీపాకేషు తేషు చ॥
కరంభవాలుకాయాం చ అసిపత్రవనే తథా ।
శిలాసంపేషణే చైవ పాత్యమానాః స్వకర్మభిః॥
తత్రస్థానాని తేషాం వై దుఃఖానామప్యనాకవత్ ।
తేషాం లోకాంతరస్థానాం వివిధై ర్నామగోత్రతః॥
భూమ్యాపసవ్యదర్భేషు దత్త్వా పిండత్రయం తు వై ।
పతితాం స్తర్పయన్తే చ ప్రేతస్థానేష్వధిష్ఠితాః ॥
అప్రాప్తా తయాతనస్థానం సృష్టి యే భువి పంచధా ।
పశ్వాదిస్థావరాన్తేషు భూతానాం తేషు కర్మసు॥
నానారూపా సుజాతీషు తిర్యగ్యోనిషు జాతిషు ।
తస్మింస్తస్మింస్తదాహారం శ్రాద్దదత్తోపతిష్ఠతి॥
కాలే న్యాయాగతం పాత్రం విధినా ప్రతిపాదితమ్ ।
ప్రాప్నోత్యన్నం యథా దత్తం బంధుర్యత్రావ తిష్ఠతే॥
యథా గోషు ప్రనష్టాసు వత్సో విందతి మాతరమ్ ।
తథా శ్రాద్ధే తదిష్టానాం మంత్రః ప్రాపయతే పితౄన్ ॥
ఇక మాసశ్రాద్దమును భుజించు వారైన పితరులను గూర్చియు, వారి గతిని గూర్చియు, బలమునుగూర్చియు, శ్రాద్ధమార్గమును (విధిని) గూర్చియు జెప్పెదను. మరణించిన వారి పోకయును, మరల రాకయును, ప్రసిద్ధమైన తపస్సుతో గూడ తెలియనలవి కాదు. మాంసముతో నేర్పడిన కన్నుతో దెలియ సాధ్యమగునా?. ఈ పితరులను శ్రాద్ధ దేవులనుగా దేలియవలెను. పితరులు లౌకికులుగా జెప్పబడినారు. దేవతలు సౌమ్యులు యాగము జేయువారు యోనినుండి జనించని యందరును. ఆ దేవతలు పితరులు. దేవతలందు పితరులను భావింతురు. మనుష్యులు పితరులను వారికంటే వేరైనవారును లౌకికులనబడిరి-62. పితయు, పితామహుడును, ప్రపితామహుడును. సోమునితో యాగము జేయువారును సోమవంతులనబడినారు. యజ్వానులనబడినవారు బర్హిషదులనబడినారు. వారీ కర్మలందు బూనినవారై దేహము బుట్టినప్పటినుండి సంతుష్టి జెందుదురు. వారిలో హోమము జేయువారును యాగము జేయింపదగినవారిని యాగము జేయించువారును అగ్నిష్వాత్తులనబడినారు. వీరు ఆశ్రమధర్మముననుసరించి ప్రస్థానమునందున్నవారు.వీరుచివరకు శ్రాద్ధకర్మతో నశింపరు. బ్రహ్మచర్యము చేతను, తపస్సు చేతను, యజ్ఞముచేతను, సంతానముచేతను, శ్రద్ధచేతను, విద్యచేతను, దానముచేతను-ఏడు విధములుగా దేహ పతనమగునందాక కర్మలలో బూనియుందురు. పితరులతోబాటు సూక్ష్మకులై, సోమపాయకులైన స్వర్గమును బొందినవారై దేవతలతో స్వర్గమున సంతసింతురు, పితృమంతుని (తండ్రిగలవానిని) ఉపాసింతురు. (శ్రాద్ద) క్రియగల సంతానవంతులకు ప్రశంసయే సిద్దమనబడినది. వారి కులమువారి చేతను, బంధువులచేతను వారికి నివాసముగా నీయబడినయన్నముగూడ ప్రశంసింపబడినది. సోమ లౌకికులు ఒక నెల శ్రాద్ధమును భుజించువారై తృప్తిని బొందుదురు. వీరు మనుష్యులైన పితరులు. వారు మాసశ్రాద్ధభుజులు. వారికంటే వేరైనవారు తక్కిన కర్మయోనులలో సంకీర్ణులైనవారును, ఆశ్రమధర్మములనుండి భ్రష్ఠులైనవారును, స్వధా స్వాహలులేనివారును భిన్నదేహులును దురాత్ములును యమునింటిలో ప్రేతులైనవారును, యాతనాస్థానమును (తీవ్రవేదనాస్థానమును) జేరి తాము జేసిన కర్మలకు దుఃఖింతురు. దీర్ఘాయుష్యము గలవారును, మిక్కిలి యెండి క్షీణించినవారును, వర్ణము మారినవారును, వస్త్రములు లేనివారును ఆకలిదప్పులను కొన్నవారునునై ఇటునటు పరుగెత్తుదురు. ఆ తరువాత, నదులు, సరస్సులు, చెఱువులు, బావి-వీనిలో నీటిని గోరువారగుదురు. వణుకుచున్న వారై యితరులయన్నములను పొందగోరుదురు. రాకపోకలుగల యాస్థానములలో వండబడుదురు. శాల్మలి (ముండ్లబూరుగు) చెట్టునందు వైతరణి (నరకమునందలి నిప్పులయేటి) యందు, కుంభీపాకములందును, కరంభవాలుక పేలపు పిండివంటివేడి యిసుక) యందును, అసిపత్రవనము (కత్తియా కులవనము) నందును, శిలలను పిండి చేయుటయందును, వారి వారి పాపకర్మలననుసరించి పడవేయబడుదురు. అచట వారికి స్వర్గభిన్నమైన నరకమునందువలె దుఃఖస్థానములుండును. అవి లోకాన్తరముననున్న వారియొక్క వివిధములైన నామ, గోత్రములను బట్టి యుండును. ప్రేతస్థానములలో నధిష్టించిన వారై భూమిపై యపసవ్యదర్భలందు మూడు పిండములిడి పతితులను తృప్తిబొందజేయుదురు. యాతనా (తీవ్రవేదనా) స్థానమును బొంద లేక యేడు విధములుగా సృజింపబడినవారు భూతము (ప్రాణు)లలో పశువులు మొదలుకొని స్థానములవరకున్న వారియందును, వారి కర్మలందును. అనేకరూపములైన జాతులందును, తిర్యగ్యోనిజాతులందును, యే యాహారములవారౌదురో, ఇచట ఆయా యోనులందు ఆయా చోటునందు ఆయా యాహారమును శ్రాద్ధ దాత చేకూర్చును. బంధువున్నచోట సకాలమున న్యాయముగా వచ్చిన పాత్రను, శాస్త్రీయముగా సమర్పింపబడిన యన్నమును ఇచ్చిన దిచ్చినట్లుగా బొందును. ఆవుల మందలో కనబడకుండగా దిరుగుచున్న తల్లియావును పిల్లదూడ తెలిసికొనునట్లు మంత్రము, శ్రాద్ధమున నీయబడిన పదార్థములను కర్తకిష్టులుగా సంకల్పించిన పితరులను జేర్చును.
ఏవం హ్యవికలం శ్రాద్ధం శ్రాద్ధదత్తం తు మంత్రతః ।
సనత్కుమారః ప్రోవాచ పశ్యన్ దివ్యేన చక్షుషా॥
గతాగతిజ్ఞః ప్రేతానాం ప్రాప్తశ్రాద్ధస్య చైవ హి॥
బహ్వీకాశ్చో ష్మపాశ్చైవ దివాకీర్తాశ్చ తే స్మృతాః ।
కృష్ణపక్షస్త్వహస్తేషాం శుక్లః స్వప్నాయ శర్వరీ॥
ఇత్యేతే పితరో దేవా దేవాశ్చ పితరశ్చ వై ।
ఋతార్తవా అనే కేతు అన్యోన్య పితరః స్మృతాః॥
ఏతే తు పితరో దేవా మానుషాః పితరశ్చ యే ।
ప్రీతేషు తేషు ప్రీయన్తే శ్రద్దాయుక్తేన కర్మణా॥
ఇత్యేవం పితః ప్రోక్తాః పితౄణాం సోమపాయినామ్ ।
ఏతత్పితృమతత్వం హి పురాణే నిశ్చయో మతః ॥
ఇత్యర్కపితృసోమానమైలస్య చ సమాగమః ।
సుధామృతస్య చావాప్తిః పితౄణాం చైవ తర్పణమ్॥
పూర్ణిమావాస్యయోః కాలః పితృణాం స్థానమేవ చ ।
సమాసాత్కీర్తితస్తుభ్యమేష సర్గః సనాతనః॥
వైశ్వరూపం తు సర్వస్య కధితం చైకదేశికమ్ ।
న శక్యం పరిసంఖ్యాతుం శ్రద్దేయం భూతిమిచ్ఛతా॥
స్వాయంభువస్య హీత్యేష సర్గః క్రాన్తో మయాత్రవై ।
విస్తరేణానుపూర్వ్యా చ భూయః కిం వర్ణయామ్యహమ్ ॥
ఇతి శ్రీమహాపురాణే వాయు ప్రోక్తే పితృవర్ణనం నామ షట్పంచాశోఽధ్యాయః ॥
ఈ విధముగా శ్రాద్దము, శ్రాద్దములో నీయబడినదియు మంత్రముతో నే లోపము లేక సంపూర్ణమగును- అని సనత్కుమారుడు తన దివ్య దృష్టితో జూచి చెప్పెను. సనత్కుమారుడు ప్రేతలయొక్క గమనాగమనముల దెలిసినవాడు, శ్రాద్ధము ప్రాప్తించిన వాని గమనాగమనములను దెలిసినవాడు. వారు (పితరులు) బహ్వీకులనియు, ఊష్మపులనియు, దివాకీర్త్యులనియు అనబడినారు. వారికి పగలు శుక్లపక్షము వారు పడుకొనుటకు రాత్రి శుక్ల పక్ష పక్షము. ఈ విధముగా పితరులు దేవతలు, దేవతలు పితరులు, ఋతార్తవులైన యనేకులు అన్యోన్యముగా పితరులనబడినారు. వీరు పితృదేవతలు శ్రాద్ధకర్మతో వారు సంతుష్టిజెందినపుడు మనుష్యులైన పితరులు సంతుష్టిజెందుదురు. అని యీ విధముగా పితరులు చెప్పబడినారు. సోమపాయులైన పితరులయొక్క పితృమతత్వము ఇదియే. నిశ్చయము పురాణమున నిశ్చయమైనది. అని యీ విధముగా పితృసోముల యొక్కయు ఇలా పుత్రుని యొక్కయు సమాగమము, సుధామృతప్రాప్తియు, పితరుల సంతృప్తి పరచుటయు-, పూర్లిమామావాస్యల కాలమును, పితరులస్థానమును, మీ కొరకు సంగ్రహముగా జెప్పబడినవి. ఇది సనాతనమైన సృష్టి. ఈ మొత్తము యొక్క ఈ విశ్వరూపత్వం యొక్క చోటనుండినదిగా జెప్పబడినది. దీనిని లెక్కించుట సాధ్యముగాదు. ఐశ్వర్యమును గోరినవాడు దీని విషయమై శ్రద్ధ వహింపవలెను-90. అనునీ స్వాయంభువ సృష్టి యిచట నాచేత విస్తరముతోను ఆను పూర్వితోను దాటబడినది. మణి నేనేమి వర్ణింపవలెను?.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున పితృవర్ణనమను నేబదియాఱవ యధ్యాయము.