వాయు మహా పురాణము
34 - జంబూద్వీపవర్ణనం
ఋషయ ఉచు:-
ఏవం ప్రజాసన్నివేశం శ్రుత్వా ఋషిపుంగవః ।
పప్రచ్ఛ నిపుణః సూతం పృథివ్యాయాయ విస్తరౌ॥
కతి ద్వీపా: సముద్రా వా పర్వతాశ్చ కతి ప్రభో ।
కియన్తి చైవ వర్షాణి తేషు నద్యశ్చ కాః స్మృతాః॥
మహాభూత ప్రమాణం చ లోకాలోకౌ తథైవ చ ।
పర్యాయపారిమాణ్యం చ గతిశ్చంద్రార్క యోస్తథా॥
ఋషులనిరి:- ఈ విధముగా ప్రజా సన్నివేశమును విని నిపుణ ఋషి శ్రేష్టుడు పృథ్వివి యొక్క పొడవు, వెడల్పులను గూర్చి సూతునడిగెను?. ద్వీపములెన్ని? సముద్రములెన్ని? పర్వతములు గూడ ఎన్ని? ఓ ప్రభో! వర్షములు (దేశములు) ఎన్ని? వానిలో నదులు ఏవి చెప్పబడినవి?-2. మహాభూతముల ప్రమాణమేమి? లోకా లోకములను పర్వతములెవ్వి? వాని యొక్క క్రమపరిమాణమేమి? అట్లే చంద్ర-సూర్యులగతియు వాని క్రమపరిణామమును ఎట్టివి? -3.
సూత ఉవాచ:-
అత ఊర్థ్వం ప్రవక్ష్యామి పృథివ్యాయామ విస్తరమ్ ।
సంఖ్యాశ్చైవ సముద్రాణాం ద్వీపానాం చైవ విస్తరమ్॥
యావన్తి చైవ వర్షాణి తేషు నద్యశ్చ యాః స్మృతాః ।
మహాభూత ప్రమాణం చ లోకాలోకౌ తథైవ చ॥
పర్వాయపారిమాణ్యం చ గతిశ్చంద్రార్కయో స్తథా॥
ద్వీపభేద సహస్రాణి సహస్రాణి సప్తస్వంతర్గతాని వై ।
న శక్యన్తే ప్రమాణేన వక్తుం వర్షశతైరపి॥
సప్తద్వీపం తు వక్ష్యామి చంద్రాదిత్య గ్రహైః సహ ।
యేషాం మనుష్యాస్తర్కేణ ప్రమాణాని ప్రచక్షతే॥
అచింత్యాః ఖలు యే భావాః న తాంస్తర్కేణ భావయేత్।
ప్రకృతిభ్యః పరం యచ్చ తన్నిత్యం చ ప్రచక్షతే॥
సూతుడనేను:- ఆ పైన పృథివి యొక్క పొడవు వెడల్పులను, సముద్రముల సంఖ్యలను, ద్వీపముల యొక్క విస్తరమును-4, వర్ణములు (దేశములు) ఎన్నియో? వానిలోని నదులెన్నియో? మహాభూతముల ప్రమాణము, లోకాలోక(పర్వత)ములు వాని క్రమ పరిమాణము, అట్లే చంద్రసూర్యుల గమనములు-వీనినన్నింటిని జెప్పెదను-5. సప్తద్వీపములలో నున్న వేల ద్వీపముల భేదములను ప్రమాణముతో నూరేండ్లకైనను జెప్పనలవికాదు-6, మనుష్యులు తర్కముతో (ఊహతో) ప్రమాణములను జెప్పునట్టి సప్తద్వీపమును గూర్చి చంద్రసూర్యగ్రహములతో బాటు చెప్పెదను-7. చింతింపరాని భావములను ఊహించి భావింపరాదు. ప్రకృతులంటె నేది పరమైనదో! దానిని నిత్యమనేదరు-8.
నవవర్షం ప్రవక్ష్యామి జంబూద్వీపం యథాతథా ।
విస్తరాన్మండలాచ్చైవ యోజనైస్తన్ని బోధత॥
శతమేకం సహస్రాణాం యోజనానాం ప్రమాణతః ।
నానాజన పదాకీర్ణై: పురైశ్చ వివిధైః శుభైః ॥
సిద్ధచారణ గంధర్వ పర్వతైరుప శోభితమ్ ।
సర్వధాతు నిబద్దైశ్చ శిలాజాల సముద్భవైః॥
పర్వత ప్రభవాభిశ్చ నదీభిః పర్వతై స్తథా॥
జంబూద్వీపః పృథుః శ్రీమాన్ పర్వతః పరివారితః ।
వవభిశ్చావృతః సర్వైర్భువనైర్భూత భావనై: ॥
లావణేన సముద్రేణ పర్వతః పరివారితః॥
క్రొత్త దేశమైన జంజూ ద్వీపముననున్నది యున్నట్లుగా జెప్పెద. అట్లే ఎన్ని యోజనముల విస్తారమున్నదో! ఎన్ని యోజనముల మండలాకారమున్నదో చెప్పెద వినుడు-9. ప్రమాణమును బట్టి యది నూట ఒక్క యోజనములు గలది. అనేక జనపదముల గ్రామ సమూహములతోను, సిద్ద చారణగంధర్వులు గల పర్వతములతోను, వివిధములైన శుభములైన పట్టణములతోను కూడినది. అన్ని ధాతువులతో కట్టబడినట్లున్న శిలలగుంపుల నుండి యేర్పడిన పర్వతములచేతను నదుల చేతను ప్రకాశించునది. జంబూద్వీపము విశాలమైనది. చక్కని శోభాసంపదలచే జుట్టబడిన-10-11. బ్రహ్మ (విష్ణు) స్వరూపములైన తొమ్మిది భువనములచే (జలములచే) జుట్టబడినది. అట్లే ఉప్పు సముద్రముచే నంతటను జుట్టబడినది-12.
జంబూద్వీపస్య విస్తారాత్ సమేన తు సమంతతః ।
ప్రాగాయతాః సుపర్వాణః షడిమే వర్షపర్వతాః॥
అవగాఢ ఉభయతః సముద్రౌ పూర్వపశ్చిమౌ॥
హిమప్రాయశ్చ హిమవాన్ హేమకూటశ్చ హేమవాన్ ।
తరుణాదిత్య వర్ణాభో హైరణ్యో నిషధః స్మృత: ॥
చాతుర్వర్ణస్తు సౌవర్ణో మేరుశ్చోచ్చతమః స్మృతః ।
ప్లుతాకృతి ప్రమాణశ్చ చతురస్త్రః సముచ్ఛ్రితః॥
నానావర్ణస్తు పార్శ్వేషు ప్రజాపతి గుణాన్వితః ।
నాభిబంధన సంభూతో బ్రహ్మణోఽవ్యక్త జన్మనః॥
పూర్వత: శ్వేత వర్ణోజ్సౌబ్రహ్మణ్యస్తస్య తేన తత్ ।
పీతశ్చ దక్షిణే నాసౌ తేన వైశ్యత్వ మిష్యతే॥
భృంగపత్ర నిభశ్చాసౌ పశ్చిమేన మహాబలిః ।
తేనాస్య శూద్రతా దృష్టా మేరోర్నానార్థ కారణాత్॥
పార్వముత్తరతస్తస్య రక్తవర్ణం స్వభావతః ।
తేనాస్య క్షత్రతా చ స్యాదితివర్ణాః ప్రకీర్తితాః ॥
వ్యక్తః స్వభావతః ప్రోక్తో వర్ణతః పరిమాణత: ॥
నీలశ్చ వైదూర్యమయః శ్వేతశృంగో హిరణ్మయః ।
మయూరబర్హ వర్ణస్తు శాతకౌంభస్తు శృంగవాన్॥
జంబూద్వీపము అంతట సమానముగా విస్తరించినది. అందులో తూర్పునకు విస్తరించినవి. ఈ యాటు వర్ష పర్వతములు. ఇవి. తూర్పు పడమరసముద్రములను రెండువైపులను జొచ్చుకొని పోయినవి-13. హిమవత్పర్వతము మంచుతో నిండినది. హేమ కూటపర్వతము బంగారముగలది. బాలసూర్యుని వలే లేత యెఱుపు గలిగి బంగారు నీండినది నీషధ పర్వతమని తలపబడినది-14. నాలుగు వర్ణములు గలిగి సువర్ణ(బంగార)మైన మేరు పర్వతమన్నింటికన్న ఎత్తైనదిగా తలంపబడినది. గుజ్జపుగంతు వేయునాకారము గలది. పొడవువెడల్పు సమముగా నుండి మిక్కొలి యెత్తైనది-15. ప్రక్కలయందు అనేక వర్ణ(జాతి రంగు) ములుగలదై బ్రహ్మ యొక్క సృష్టిగుణముగలది. (చాతుర్వర్ణ్యసృష్టిచేసినది.) అవ్యక్త జన్ముడైన బ్రహ్మయొక్క(పుట్టు స్థానమైనవిష్ణువుయొక్క) నాభి(కమల) బంధనము నుండి యీ నానా వర్ణ సమూహము బుట్టినది-16. తూర్పు వైపున నీ మేరువు శ్వేత(తెలుపు) వర్ణముగలది. దాని చేతనది (మేరు పర్వతము) బ్రహ్మణ్యము (బ్రాహ్మణజాతికి చెందినది) ఐనది. అట్లే యీ మేరువు దక్షిణము వైపున పీతము పసుపు పచ్చనిది. దానిచేత వైశ్యవర్ణము మేరువునకు జెప్పబడినది-17.ఈ మేరువు పశ్చిమపు వైపున (గుంటగలచేరు) ఆకు పచ్చని వర్ణముతో మహాబలిష్టమైనది. దానిచేత మేరువు యొక్కశూద్ర జాతీత్వము గనబడినది. దీనికి అనేక ప్రయోజనములు కారణములు-18, మేరువుయొక్క ఉత్తరపు వైపున సహజముగా నెరుపు వర్ణముగలదు. దానిచేత మేరుపర్వతమునకు క్షత్రియత్వము వ్యక్తమగును. ఈ విధముగా మేరు పర్వతము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రవర్ణములు చెప్పడినవి. అవి మేరుపర్వతము యొక్క ఆయావైపుల స్వభావమును బట్టి రంగును బట్టియు, పరిమాణమును బట్టియు వ్యక్తమైనవి-19. నీలమను పర్వతము వైఢూర్యమణి శిలామయము. శ్వేతశృంగపర్వతము బంగారు నిండినది. నెమలి పింఛపు రంగు గలిగి బంగారు నిండినది శృంగపర్వతము.
ఏతే పర్వతరాజానః సిద్ధచారణ సేవితాః ।
తేషామంతర విష్కంభో నవసాహస్ర ముచ్యతే॥
మధ్యేత్విలావతం యస్తు మహామేరోః సమస్తతః ।
నవైవ తు సహస్రాణి విస్తీర్ణః పర్వతస్తు స: ॥
మధ్యే తస్యమహామేరోర్నిర్దూమ ఇవ పావకః॥
వేద్యర్ధం దక్షిణం మేరోరుత్తరార్థం తథోత్తరమ్ ।
వర్షాణి యాని సప్తాత్ర తేషాం యే వర్షపర్వతాః॥
ద్వే ద్వే సహస్రే విస్తీర్ణా యోజనాని సముచ్ఛ్రయాత్॥
ఈ పర్వత రాజములు సిద్దులచేతను చారణులచేతను నివసింపబడినవి. వీని యొక్క మధ్య శ్వాసము తొమ్మిదివేలు (యోజనములు?) ఇది మహామేరువు శిరము మధ్యన పొగలేని యగ్నివలె నుండును-22. మేరువునకు దక్షిణమున వేది సగభాగము, ఉత్తర భాగమున తక్కిన సగభాగమున గలవు. ఇచట ఏడు వర్షములు (దేశములు)గలవు. వాని యొక్క పర్వతములే వర్షపర్వతములు అవి యెత్తులో రెండేసి వేలయోజనములు విస్తీర్ణము గలవి-23.
జంబూద్వీపస్య విస్తారాత్తేషామాయామ ఉచ్యతే ।
యోజనానాం సహస్రాణి శతే ద్వే మధ్యమే గిరీ॥
నీలశ్చ నిషదశ్చైవ తాభ్యాం హీనాయేఽపరే ।
శ్వేతశ్చ హేమకూటశ్చ హిమవాన్ శృంగవాంశ్చ యః॥
నవతి ర్ద్వావశీతిర్ద్వౌ సహస్రాణ్యాయతా స్తు యే ।
తేషాం మధ్యే జనపదాస్తాని వర్షాణి సప్త వై॥
జంబూ ద్వీపముయొక్క విస్తారము వలన పర్వతముల పొడవు చెప్పబడుచున్నది. వేయి రెండు వందల (100) యోజనములుగల మధ్య నున్న రెండు పర్వతములు నీల పర్వతము మరియు నీషధపర్వతములనునవి. వాని కన్న మిగిలినవి శ్వేతము, హేమకూటము, హిమవంతము, శృంగవంతము-అనునవి(నాలుగు నీలనిషధములతో గూడినచో ఆఋ) అవి తొంబదిరెండు ఎనుబది రెండు వేల యోజనముల పొడవు గలవి (లేదా, వరుసగా తొంబది, రెండు ఎనుబది, రెండు వేల యోజనములు గలవి) వాని మధ్యలో జనపదములు (జనావాసదేశములు) గలవు. ఆవర్షములు (దేశములు) ఏడు-26.
సంపాత విషమైస్తైస్తు పర్వతైరావృతాని చ ।
సంతతాని నదీభేదైరగమ్యాని పరస్పరమ్॥
వసంతి తేషు సత్త్యాని నాజాతీని భాగశః॥
ఒకచో గుమిగూడి నట్లుండుటచే ఎగుడు దిగుడులుగా నున్న పర్వతములచే జుట్టబడినవి. నదుల యొక్క కోతలచే వ్యాపించి పరస్పరముగా (ఒకదాని నుండి మరోక దాని పైకి) పోనలవిగానివి. వానిలో భాగములుగా జేసికొని అనేకములైన ప్రాణులు నివసించును-27.
ఇదం హైమవతం వర్షం భారతం నామ విశ్రుతమ్ ।
హేమకూటం పరం తస్మాన్నామ్నా కింపురుషం స్మృతమ్॥
నైషధం హేమకూటం తు హరివర్షం తదుచ్యతే ।
హరివర్షాత్పరం చైవ మేరోశ్చ తదిలావృతమ్॥
ఇలావృతపరం నీలం రమ్యకం నామవిశ్రుతమ్ ।
రమ్యాత్పరతరం శ్వేతం విశ్రుతం తద్ధిరణ్యకమ్॥
హిరణ్మయాత్పరం చాపి శృంగవాంస్తు కురు స్మృతమ్॥
ధనుః సంస్థే చ విజ్ఞేయే ద్వే వర్షే దక్షిణోత్తరే ।
దీర్ఘాణి తత్ర చత్వారి మధ్యమంతది లావృతమ్॥
అర్వాక్ చ నిషధస్యాథ వేద్యర్థం దక్షిణం స్మృతమ్ ।
పరం నీలవతో యచ్చ వేద్యర్థం తు తదుత్తరమ్॥
వేద్యర్థం దక్షిణే త్రీణి వర్షాణి త్రీణి చోత్తరే॥
తయోర్మధ్యే తు విజ్ఞేయం మేరు మధ్యమిలావృతమ్ ।
దక్షిణేన తు నీలస్య నిషధష్యోత్తరేణ తు॥
ఇది హైమవతమను వర్షము (పర్వతము, దేశము) భారత వర్షమని ప్రసిద్ధి జెందినది. దాని తరువాత పైది హేమ కూటము దానిని కింపురుషవర్షమందురు-28. హేమకూటము కంటే పైది నైషధము అది హరివర్షమనీయనబడును. హరివర్షము తరువాత మేరువు పైది ఇలా వృతము-29. ఇలా వృతము పైది నీలము అదీ రమ్యకమని ప్రసిద్ది జెందినది. రమ్యము నుండి యింకను పైది శ్వేతము (పర్వతము) అది హిరణ్యకమని పేరుగాంచినది. హిరణ్మయముకంటె తరువాత శృంగవంతము అది 'కురు' అనబడినది-30. ధనువు వలె నున్నవి. రెండు వర్షములు. ఒకటీ దక్షిణపుది రెండవది ఉత్తరపుది. అక్కడ పొడవుగానున్నవి నాలుగు వర్షములు మధ్యనున్నది. ఇలావృతవర్షము-31. నిషధమునకు పడమటి క్రిందన నున్న సగము వేది (వేది చదునై చతురస్రమైన భూమి-దానిలో సగము) దక్షిణము (వేది) యనబడినది. నీలవంతమునకు పైగా నున్న సగము వేది ఉత్తరము (వేది) యనబడినది. దక్షిణ వేద్యర్ధమున మూడు వర్షములు ఉత్తర వేద్యర్ధమున మూడు వర్షములును గలవు-32. ఆరెంటి మధ్యన మేరుమధ్యమైన యిలా వృతము గలదని తెలియవలెను. అది నీల వర్షమునకు దక్షిణముగను నిషధ వర్షమున కుత్తరముగను ఉన్నది-33.
ఉదగాయతో మహాశైలో మాల్యవాన్నామ పర్వతః ।
యోజనానాం సహస్రోరురానీల నిషధాయత:॥
ఆయామతశ్చ తు స్త్రింశత్సహస్రాణి ప్రకీర్తితః॥
తస్య ప్రతీచ్యాం విజ్ఞేయః పర్వతో గంధమాదనః ।
ఆయామాదథ విస్తారాన్మాల్యవానితి విశ్రుతః॥
పరిమండల యోర్మధ్యే మేరురుత్తమ పర్వతః ।
చతుర్వర్ణః సుసౌవర్ణశ్చతురస్రః సముచ్చ్రితః।
అవ్యక్తా ధాతవః సర్వే సముత్పన్నా జలాదయ: ॥
అవ్వక్తా త్పృధీవీ పద్మం మేరుపర్వత కర్ణికమ్ ।
చతుష్పథం సముత్పన్నం వ్యక్తం పంచగుణం మహత్॥
తతః సర్వాః సముత్పన్నా వృత్తయో ద్విజసత్తమాః ।
నైకకల్పార్జితైః పుణ్యైర్వివిధైః ప్రాగుపార్జితైః॥
కృతాత్మభిర్వినీతాత్మా మహాత్మా పురుషోత్తమః ।
మహాదేవో మహాయోగీ జగజ్యేష్ఠో మహేశ్వరః॥
సర్వలోకగతోఽనంతో హ్యమూర్తి త్వాదజాయత॥
న తస్య ప్రాకృతీ మూర్తిర్మాం సమేదో స్థిసంభవా ।
యోగాచ్చై వేశ్వరత్వాచ్చ సర్వాత్మగత ఏవ స: ॥
తన్నిమిత్తం సముత్పన్నం లోకపద్మం సనాతనమ్ ।
కల్పశేషస్య తస్యాదౌ కాలస్య గతిరీదృశీ ॥
తస్మిన్ పద్మే సముత్పన్నో దేవదేవశ్చతుర్ముఖః ।
ప్రజాపతి పతిర్బ్రహ్మా ఈశానో జగతః ప్రభుః ॥
తస్య బీజాని సర్గో హీ పుష్కరస్య యథార్థవత్ ।
కృత్ప్నః ప్రజానిసర్గేణ విస్తరేణేహ కథ్యతే॥
యదబ్జం వైష్ణవం కార్యం తతస్తన్నా భితోఽభవత్ ।
పద్మాకారా సముత్పన్నా పృథివీ సవనద్రుమా॥
తదస్య లోకపద్మస్య విస్తరేణ ప్రకాశితమ్ ।
వర్ణ్యమానం విభాగేన క్రమశః శృణు తద్విజాః॥
మాల్యవంతమను పర్వతము ఉత్తరముగా విశాలమైన మహాపర్వతము. వేయి యోజనముల విశాలమైనది. పూర్తిగా నల్లనిది. నిషధ పర్వతమువలె పొడవైనది. దాని పొడవు ముప్పది నాలుగు యోజనములు అని చెప్పబడినది-34. దాని పడమట వైపున గంధమాదన పర్వతమును తెలియవలె, పోడవువల్లను విస్తారము వల్లను మాల్యవంతమనియే ప్రసిద్ధమైనది-35. పరిమలములుగా (అంతటను గుండ్రము (గోళము)గానున్న రెంటి (పర్వతముల) మధ్యనున్న మేరువు ఉత్తమ (మిక్కిలి యెత్తెన) పర్వతము. నాలుగు వర్ణములు గలది. మంచి బంగారువన్నె గలది. చతురస్ర (నాలుగు వైపులు) సమముగానున్నది. చక్కగా నున్నతమైనది. జలము మొదలగు ధాతువులన్నియు అట్టి అవ్యక్తములై పైకి కనబడనివై యుత్పన్నమైనవి-36. ఆయవ్యక్తమునుండి మేరుపర్వతము కర్ణిక(నడిబొడ్డు బీజముగలది) గాగల పృథివి యనెడు పద్మము బుట్టినది. అది నాలుగు మార్గములు గలది. ఐదుగుణములు గలది. (సూక్ష్మముగాక) మహత్తైనది-37. ఓ ద్విజసత్తములారా! అక్కడినుండి సమస్తములైన వృత్తులు (కృషి-పశుపాలనము-వాణిజ్యము-సేవమొదలగునవి) పుట్టినవి. పూర్వము అనేక కల్పములనుండి యుపార్జితములై అనేక విధములైన పుణ్యములు గలిగి-38. ఆత్మనిగ్రహము గలవారిచే వినీతమైన (చక్కగా పొందింపబడిన) ఒక స్టూలస్వరూపముగలవాడు, సర్వవ్యాపియైన యాత్మగలవాడు, సర్వపురుషులకాదోపురుషుడై పురుషశ్రేష్ఠుడైన విష్ణుస్వరూపుడు, మహాదేవుడు, మహాయోగి. జగత్తునకు జ్యేష్ఠుడు, సర్వలోకములందువాడు, నాశములేని వాడును ఐన మహేశ్వరుడు అవ్యక్తుడై యంతటనున్నను వ్యక్తముగా నొకమూర్తిగలవాడై పుట్టెను-39. ఆతని యొక్క ప్రాకృతికమైన మూర్తిమనవలె మాంసము. మేదస్సు-ఎముకలు-వీని వలన బుట్టినదికాదు. యోగము వలనను ఈశ్వరుడై నందువలనను ఆతడు సర్వాత్మలలో నున్నవాడే 40. ఈతని కారణముగా కల్పశేషము మొదట సనాతనమైన (భూ)లోకమనెడి పద్మము బుట్టినది. కాలగతి యిట్టిది-41. ఆ పద్మమున దేవదేవుడైన నాలుగుముఖములుగల దేవుడు పుట్టెను. ఆతడు ప్రజాపతి, బ్రహ్మ, జగమునకీశ్వరుడైన ప్రభువు 42. కమలమునకువలె ఆ పద్మోద్భవుని బీజములు సర్గము (సృష్టిని సర్గ (సహజ)మైన మొత్తము ప్రజా సృష్టి యిట విస్తరముగా జెప్పబడుచున్నది-43. విష్ణుసంబద్దమై కార్యరూపమై (విష్ణు) నాభినుండి కమలనాలము బుట్టినది. దాని నుండి వనవృక్షములతో గూడి పద్మాకారమైన పృధివి పుట్టినది-44. ఓ ద్విజులారా! ఆ లోకపద్మము యొక్క విస్తారప్రకాశమును నేను చెప్పెద వినుడు. అది విభాగముతో క్రమముగా వర్ణింపబడును-45.
మహాద్వీపాస్తు విఖ్యాతాశ్చత్వారః పత్రసంస్థితాః ।
తతః కర్ణికసంస్థానో మేరుర్నామ మహాబలః॥
నానావర్ణేషు పార్న్వేషు పూర్వతః శ్వేత ఉచ్యతే ।
పీతం తు దక్షిణం తస్య శృంగం కృష్ణం తథాఽపరమ్॥
ఉత్తరం తస్య రక్తం వై శోభివర్ణ సమన్వితమ్ ।
మేరుస్తు శోభతే శుభ్రోరాజవత్ స తుధిష్ఠితః॥
తరుణాదిత్య వర్ణాభో విధూమ ఇవ పావకః ।
చతురశీతి సాహస్ర ఉత్సేధేన ప్రకీర్తిత: ॥
ప్రవిష్టః షోడశాధస్తాది సృతస్తావదేవ తు ।
స శరావస్థితః పూర్వ: ద్వాత్రింశన్మూర్ద్ని విస్తృతం॥
విస్తరాత్ త్రిగుణశ్చాస్య పరిణాహః సమంతతః ।
మండలేన ప్రమాణేన త్ర్యస్రేఽర్దంతు తదిష్యతే॥
చత్వారింశ త్సహస్రాణి యోజనానాం సమస్తతః ।
అష్టాభిరధికాని స్త్ర్యస్రే మానేప్రకీర్తితమ్॥
చతురస్రేణ మానేన పరిణాహః సమన్ తతః ।
చతుః షష్టి సహస్రాణి యోజనానాం విధీయతే॥
సపర్వతో మహాదివ్యో దివ్యౌషధి సమన్వితః ।
భువనైరావృతః సర్వో జాతరూపమయైః శుభైః॥
తత్ర దేవగణాః సర్వే గంధర్వోరగ రాక్షసాః ।
శైలరాజైః ప్రదృశ్యంతే శుభాశ్చాప్సరసాం గణా:॥
దళములందున్న నాలుగు మహా ద్వీపములని ప్రసిద్ది చెందినవి. తరువాత కర్ణిక యందున్నది మహాబలిష్ఠమైన మేరు పర్వతము-46. అనేక వర్ణములు గల దాని ప్రక్కభాగములలో తూర్పువైపున (శృంగము) శ్వేతమన బడును. దక్షిణపు వైపున శృంగము పసుపు వర్ణము, పశ్చిమపు వైపుననున్నది. (శృంగము) నల్లనిది-47. ఉత్తరపు వైపున నున్నది శోభించు ఎఱుపువర్ణముతో గూడినది. అది మేరుపు, శుభ్రమై రాజువలె నిలచి ప్రకాశించును-48. లేతసూర్యుని వర్ణమువంటికాంతి కలదై, పొగలేని యగ్నివలెనుండును. ఎనుబది నాలుగు వేల యోజనముల యెత్తు గలదిగా జెప్పబడినది-49. క్రింద పదునారు (యోజనములు) లోతుగా భూమిలో ప్రవేశించినది. అంతియే (16 యోజనములు) విస్తరించినది-50. దీని యొక్క చుట్టు వైశాల్యము విస్తారము (16 వే. యోజనముల) కంటే మూడింతలు. (48 వేల యోజ) మండల ప్రమాణముతోనది త్రికోణములో సగముండుననబడినది-51. త్రికోణమానమునందది చుట్టును. నలుబదీయేనిమిదివేల యోజనములనబడినది-52. చతురస్రమానముతో నంతటి (మొత్తం) వైశాల్యము అటువది నాలుగు వేల యోజనములు అనబడినది-53. ఆ పర్వతము గొప్పనై దివ్యమైనది. (దేవశక్తిగలది) దివ్యౌషధులతో గూడినది. అది మొత్తము బంగారుతోనిండిన(మయమైన) శుభములైన లోకములతో జుట్టబడినది. అక్కడ గంధర్వులు ఉరగులు రాక్షసులు మొ. సమస్త దేవగణములున్నవి. మంగళ కరములైన యప్సరోగణములు అనేక పర్వతరాజములతోబాటు కనబడును-55.
స తు మేరుః పరివృతో భువనైర్భూత భావనః ।
చత్వారో యస్య దేశా వై నానాపార్శ్వేష్వధిష్ఠితాః॥
భద్రాశ్వో భరతశ్చైవ కేతుమాలశ్చ పశ్చిమః ।
ఉత్తరాః కురవశ్చైవ కృతపుణ్య ప్రతిశ్రయా:॥
కర్ణికా తస్య పద్మస్య సమన్తాత్పరి మండలా ।
యోజనానాం సహస్రాణి నవతి: షట్ ప్రకీర్తితాః॥
చత్వారశ్చాప్య శీతిశ్చ అంతరాంతర ధిష్ఠితాః॥
ప్రతిశతం చ సహస్రాణి యోజనానాం ప్రమాణతః ॥
తస్య కేశరజాలాని విస్తీర్ణాని సమన్తతః॥
శతసాహస్రికా యామాసాశీతి పృథులాయతా ।
చత్వారి తస్య పత్రాణి యోజనానాం చతుర్దశమ్।
తత్ర యాఽసౌ మయా పూర్వం కర్ణికేత్యభి శబ్దితా ।
తాం వర్ణ్యమానామేకాగ్రాః సమాసేన నిబోధత॥
ఆ మేరువైతే భువనములతో (లోకములతో) జుట్టబడినది. భూతములను బుట్టించి పెంచునది. దాని యనేక పారములలో నాలుగు దేశములు నెలకొని యున్నవి -56. భద్రాశ్వదేశము (తూరుపు) భరతదేశము, (దక్షిణము) పశ్చిమ మైన కేతుమాలదేశము, చేసిన పుణ్యములకాశ్రయములై యుత్తరములైన కురుదేశములు-57. అంతట గుండ్రముగానున్న ఆ (భూ) పద్మముయొక్క నడిబొడ్డు (దుద్దు) తొంబదియాఱువేల యోజనములది దానిలోపలి వైశాల్యములు ఎనుబది నాలుగు వేల యోజనములు-58. చుట్టు వ్యాపించిన దాని కేశరములు కింజల్కముల సమూహములు మున్నూరు వేల ప్రమాణము గలవి-59. నూరు వేల యోజనముల పొడవు గలది. ఎనుబది వేల యోజనముల వెడల్పు గలది. యాకర్ణిక, దాని యొక్క నాలుగు దళములు నాలుగు దిక్కులకు యోజనములకొలది వ్యాపించినవి-60. అక్కడ పూర్వము నేను కర్ణికయని చెప్పితిని. దానిని సంగ్రహముగా వర్ణించెద ఏకాగ్రచిత్తులై వినుడు-61.
శతాశ్రమేనం మేనేఽత్రిః సహస్రాశ్రిమృషిర్భృగు: ।
అష్టాశ్రమేనం సావర్ణి శ్చతురస్రం తు భాగురి: ॥
వార్షాయణిస్తు సాముద్రం శరావం చైవ గాలవః ।
ఊర్థ్వవేణీకృతం గార్గ్యః క్రోష్టకిః పరిమండలమ్॥
యద్యద్యస్య హి యత్పార్శ్వం పర్వతాధి పతేరృషిః ।
తత్తదేవాస్యవేదాసౌ బ్రహ్మైనం వేదకృత్స్నశః॥
మణిరత్నమయం చిత్రం నానావర్ణ ప్రభాయుతమ్ ।
అనేక వర్ణనిచయం సౌవర్ణ మరుణ ప్రభమ్॥
కాన్తం సహస్రపర్వాణం సహస్రోదక కందరమ్ ।
సహస్ర శతపత్రం తం విద్ధి మేరుం నగోత్తమమ్॥
మణిరత్నార్పిత స్తంబైర్మణి చిత్రిత వేదికైః ।
సువర్ణమణి చిత్రాంగం తథా విద్రుమతోరణైః ॥
విమానయానైః శ్రీమద్భిః శతసంఖ్యైర్దివౌకసామ్ ।
ప్రభాదీపిత పర్యన్తం మేరు పర్వణి పర్వణి॥
తస్య పర్వసహస్రేఽస్మిన్ నానాశ్రయ విభూషితే ।
సర్వదేశ నికాయానీ సన్నివిష్టాన్యనేకశః॥
ఈ మేరువును అత్రి మహర్షి నూజు అంచులు గలదనెను. భృగుమహర్షి వేయి మంచులు గలదనెను. సావర్ణి ఎనిమిది యంచులు గలదనేను. భాగురి నాలుగువైపుల సమముగా నుండు సమతలము అనికాని నాలుగంచులు గలదనికాని భావించేను-62. వార్షాయణి సముద్రము వలె తరగలు తరగలు నున్నదనెను. గాలవుడు మూకుడు వలె నున్నదనెను. క్రోష్టకి అన్ని వైపుల గుండ్రముగా (గోళముగా) నున్నదనెను-63. ఈ మేరువు యొక్క యే యే ప్రక్కను ఋషి (పైజెప్పిన ఋషులు) చూచెనో ఆయా ప్రక్క భాగమును మాత్రమే యా ఋషి(యట్లు తెలిసికొనెను. ఒక బ్రహ్మ మాత్రమే మేరు పర్వతము మొత్తము దెలియును-64. ఆ మేరుపర్వత శ్రేష్ఠము మణి రత్నమయమైనది. చిత్రమైనది. కావుననే యనేక వర్ణకాంతులచే గూడినది. అనేక వర్ణముల సమూహమొక్కచో జేరినట్లున్నది. బంగారు మయమైనది. ఎట్లనికాంతి గలది-65. మనోహరమైనది. వేయి పర్వత సందులు (పర్వతములు) గలది. వేయి నీటి గుహలు గలది (సరోవర గుహలుగలది) వేయి కమలములు గలది. ఇట్టి దానినిగా మేరు పర్వతమును దెలిసికొనుము-66. మణిరత్నములు పొదిగిన స్తంభములచేతను, మణులతో చిత్రింపబడిన వేదికలతోను, బంగారముతో మణులతోను పగడముల తోరణములతోను, చిత్రమైనది మేరువు-67. స్వర్గవాసులైన దేవతల యొక్క సిరులుగల నూర్లకొలదీ విమానయానములచేతను, వారి కాంతులచేతను, ప్రతి పర్వత ప్రసిద్ధియందును. ప్రకాశింపజేయబడిన చుట్టు ప్రక్కలు గలది మేరువు-68. ఆ మేరువుయొక్క వేయి పర్వము పర్వతసంధు లందు అనేకములైన నివాసభవనములు అలంకరించియున్నవి. వానిలో సమస్తదేవసమూహములు అనేకులుగా నివసించి యున్నారు-69.
తమావచ్చోర్ద్వతలే దేవదేవశ్చతుర్ముఖిః ।
బ్రహ్మాబ్రహ్మ విదాం శ్రేష్ఠో వరిష్ఠస్త్రి దివౌకసామ్॥
మహాభువన సంపూర్ణైః సర్యైః కామఫలప్రదైః ।
మహాసుర సహస్త్రెస్తం దిక్ష్వనేక సమాకులమ్॥
తత్ర బ్రహ్మ సభా రమ్యా బ్రహ్మర్షి గణసేవితా ।
నామ్నా మనోవతీ నామ సర్వలోకేషు విశ్రుతా॥
తత్రేశానస్య దేవస్య సహస్రాదిత్య వర్చసమ్ ।
మహావిమానం సంస్థాప్య మహిమ్నా వర్తతే సదా॥
తత్ర సర్షి గణాదేవాశ్చతుర్వక్త్రస్య తే తదా ।
తదేవ తేజసాం రాశి ర్దేవానాం తత్ర కీర్త్యతే॥
తత్రాస్తే శ్రీపతిః శ్రీమాన్ సహస్రాక్షః పురందరః ।
ఉపాస్య మానస్త్రి దశైర్మహాయోగైః సురర్షిభిః॥
తత్ర లోకపతేః స్థానమాదిత్య సమవర్చసః ।
మహేంద్రస్య మహారాజ్ఞః సర్వసిద్దైర్న మస్కృతమ్॥
తమింద్రలోకం లోకస్య బుద్ధ్యా పరమయాయుతమ్ ।
దీప్యతే త్వమరశ్రేష్టై స్త్రిదశైర్నిత్యసేవితమ్॥
ద్వితీయ్యేఽప్యంతరతటే వైదిశ్యే పూర్వదక్షిణే ।
నానాధాతుశతైశ్చిత్రైః సురమ్యమతి తేజసమ్॥
నైకరత్నార్థి తతలమనేకస్తంభ సంయుతమ్ ।
జాంబూనద కృతోద్యానం నానారత్న సువేదికమ్॥
కూటాగారైర్వి నిక్షిప్త మనేకైర్భవనోత్తమైః ।
మహావిమానం ప్రథితం భాస్కరం జాతవేదసమ్॥
దేవతలకు వరిష్ఠుడు, దేవతలకే దేవుడైన వాడును, నాలుగు ముఖములు గలవాడును. బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడునైన బ్రహ్మ ఆ మేరు పర్వతమున నివసించి యుండెను-70. గొప్ప లోకములతో నిండి కోరిన ఫలమునిచ్చు వేలకొలది సమస్త రాక్షసుల చేతను దిక్కులందనేకముగా వ్యాకులమైనది-71. అచ్చట బ్రహ్మసభ రమ్యమైనది. బ్రహ్మర్షి గణములచే సేవింపబడినది. మనోవతియను పేరుతో సర్వలోకములందు ప్రసిద్ది చెందినది-72. ఇచట ఈశాన మహావిమానము (భవనము) కలదు. అది నూరుగురు సూర్యులతో సమానమైన తేజస్సుగలది. మహిమ గలది-73. అచట ఋషి గణములతో గూడిన దేవతలున్నారు. వారు బ్రహ్మకు సంబంధించినవారే. బ్రహ్మకున్న తేజోరాశీయట దేవతలకు గూడ నున్నట్లు చెప్పబడినది-74. అచట లక్ష్మీపతియైన విష్ణువు గలడు. సిరిగలిగి సహస్రాక్షుడైన యింద్రుడు దేవతలచేతను మహాయోగముగల దేవర్పుల చేతను ఉపాసింపబడుచుండును-75. అచట లోకపతియు, సూర్యునితో సమానమైన కాంతిగలిగియు, మహారాజైన మహేంద్రుని స్థానముగలదు. అది సర్వసిద్ధులచే నమస్కరింపబడినది-76. అదిలోకమున కింద్రలోకము ఉత్కష్టమైన సంపదతో గూడినది. దేవశ్రేష్ఠులైన దేవతలచే సేవింపబడినదై ప్రకాశించును-77. తూరుపు దక్షిణముల మధ్యన ఆగ్నేయముననున్న రెండవ అంతర (లోపలి) తటమున చిత్రములై నూర్లకొలది యనేక ధాతువులతో చక్కగా మనోహరమైనది. మిక్కిలి తేజస్సుకలది-78. అనేక రత్నములు పొదిగిన ఉపరితలముగలది. అనేక స్తంభములతో గూడినది. బంగారముతో జేయబడిన ఉద్యానవనము అనేక రత్నములచే కట్టబడిన వేదికలు గలది-79. రహస్య మందిరములు గలిగి యుత్తమములైన భవనములు వెలసియున్నది. ప్రసిద్ధమైన అచట భాస్కరమనియు జాతవేదసమనియు (అగ్ని) ప్రసిద్ధమైన మహా విమానము గలదు. (లేదా సూర్యుని వలెను అగ్నివలెను ఉన్న మహావిమానము (భవనం గలదు.)-80.
సా హి తేజోవతీ నామ హుతాశస్య మహాసభా ।
సాక్షాత్తత్ సురశ్రేష్ఠః సర్వదేవ ముఖోఽనల: ॥
శిఖాశత సహస్రాఢ్యో జ్వాలామాలీ విభావసుః ।
స్తూయతే హూయతే చైవ తత్ర సర్పిగణైః సురై: ॥
అధిదైవకృతం విప్రైర్విశేషః స తు ఉచ్యతే ।
సవిభాగం చ తేజశ్చ సర్వ ఏవ న సంశయః ॥
భోగాంతర మనుప్రాప్త ఏకతేజో విభుః స్మృతః ।
పృథక్త్వం చ హి యుక్త్యా తు కార్యకారణ మిశ్రితమ్॥
తమగ్నిం లోకలో కజ్ఞై స్తద్వీర్యైస్త త్పరాక్రమైః ।
మహాత్మభిర్మహా సిద్దైర్మహా భాగైర్నమస్కృతమ్॥
అదీ తేజోవతీ యను అగ్నియొక్క సభ, అక్కడ సురశ్రేష్ఠుడైన సర్వదేవతల ముఖమైన అగ్నియుండును-81. అతడు వేయి జ్వాలలతో నొప్పును. జ్వాలలే మాలలుగా గలవాడు. ప్రభయే ధనముగా గలవాడు. ఈ యగ్ని యచట ఋషిగణముతో గూడిన దేవతలచే స్తుతింపబడి హోమము చేయబడును-82. దేవతా ప్రధానముగా జేయబడినది. (హవిస్సు) బ్రాహ్మణులచే హోమము జేయబడును. అది విశేషముగా జెప్పబడును. అనేక విభాగములతో గూడిన తేజస్సు, నిస్సంశయముగా (తక్కిన) సమస్తము అనుభవము లోనికి జేరి ఏకతేజస్కుడైన ప్రభువనబడెను. యుక్తి చేత కార్యకారణ మిశ్రితమై పృథక్యము గూడ (అతనిలో) నుండును-83,84. ఆ యగ్నిని సమస్త లోకములు దెలిసినవారు, అగ్నియే వీర్యముగా గలవారు. అగ్ని పరాక్రములు ఐన మహాత్ములు మహాసిద్ధులు మహాభాగ్యవంతులును నమస్కరింతురు-85.
తృతీయేఽప్యంతరతటే ఏవమేవ మహాసభా ।
వైవస్వతస్య విజ్ఞేయా లోకే ఖ్యాతాసు సంయమా॥
తథా చతుర్థదిగ్దేశే నైరృత్యాధిపతేః సభా ।
నామ్నా కృష్ణాంగనా నామ విరూపాక్షస్య ధీమత:॥
పంచ మేఽప్యంతరతటే ఏవమేవ మహాసభా ।
వైవస్వతస్య విజ్ఞేయా నామ్నా శుభవతీ సతీ॥
ఉదకాధిపతేః ఖ్యాతా వరుణస్య మహాత్మనః ॥
పరోత్తరే తథా దేశే షష్ఠేఽ న్తరతటే శివే ।
వాయోర్గంధవతీ నామ సభా సర్వ గుణోత్తరా॥
సప్తమేఽప్యంత తటే నక్షత్రాధిపతేః సభా ।
నామ్నా మహోదయానామ శుద్ద వైదూర్యవేదికా॥
తథా ష్టమేఽన్తరతటే ఈశానస్య మహాత్మనః ।
యశోవతీ నామ సభా తప్తకాంచన సుప్రభా॥
మూడవ అంతరతటమున నిట్టే మహాసభయుండును. అది వైవస్వతు (యము)నిదిగా తెలియవలెను. అది లోకమున మంచి నిగ్రహము గలదిగా ప్రసిద్ధిచెందినది-86. అట్లే నాల్గవ దిద్దేశమున నైరృత్యదిగధిపతియొక్క సభయున్నది. పేరు కృష్ణాంగన. అది ధీమంతుడైన విరూపాక్షునిది-87. ఐదవయంతర తటమున గూడ నిట్లే మహాసభ కలదు. అది వైవస్వతునిది. పేరు శుభవతియై యున్నది. అది జలాధిపతియై మహాత్ముడైన వరుణునిదని ప్రసిద్ధి చెందినది-88. మిక్కిలి యుత్తమ దేశమై మంగళకరకమైన యాజవయంతర తటమున గంధవతియను పేరు గలిగి సమస్త గుణములచే మిక్కిలి శ్రేష్ఠమైన సభ గలదు-89. ఏడవ యంతర తటమున నక్షత్రాధిపతి (చంద్రుని) యొక్క సభగలదు. పేరు మహోదయ. శుద్దమైన వైడూర్యమణులతో నిర్మించిన వేదికలు గలది-90. అట్లే యెనిమిదవయంతర తటమున మహాత్ముడైన ఈశానునియొక్క యశోవతి యను సభకలదు. అది కాచిన బంగారువంటి మంచి వన్నెగలది-91.
మహావిమానాన్యే తాని దీక్ష్వష్టాసు శుభాని హి ।
అష్టానాం దేవముఖ్యానామింద్రాదీనాం మహాత్మనామ్॥
ఋషిభిర్దేవ గంధర్యై రప్సరో భిర్మహోరగైః ।
సేవితాని మహాభాగై రుపస్థానగతైః సదా॥
నాకప్పష్ఠం దివం స్వర్గమితియైః పరిపఠ్యతే ।
వేదవేదాంగ విద్బిర్హి శబ్దైః పర్యాయవాచకై: ॥
తదేతత్ సర్వదేవానా మధివాసే కృతాత్మనామ్ ।
దేవలోకే గిరౌ తస్మిన్ సర్వశ్రుతిషు గీయతే॥
నియమైర్వివిధైర్యజ్ఞే ర్బహుభిర్ని యతాత్మభిః ॥
పుణ్యైరన్యైశ్చ వివిధై ర్నైకజాతి శతార్జితైః ।
ప్రాప్నోతి దేవలోకం తం సస్వర్గ ఇతిచోచ్యతే॥
ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే జంబూద్వీపవర్ణనం నామ చతుస్త్రింశోఽధ్యాయః॥
ఏడంతస్తులు గల యీ మహాభవనములు ఎనిమిది దిక్కులలో మంగళకరములై యున్నవి. ఇవి దేవతలలో ముఖ్యులై మహాత్ములైన ఇంద్రుడు మొదలుగాగల యెనమండుగురివి-92. ఎల్లప్పుడు, ఋషులచేతను, దేవగంధర్వులచేతను, అప్సర సలచేతను మహోరగులచేతను ఇంకను పై స్థానములలో నున్న మహాభాగులచేతను సేవింపబడినవి (నివసింపబడినవి)-93. నాకపృష్ఠమనియు, దీవమనియు, స్వర్గమనియు పర్యాయవాచక (ఒకే యర్థముగల యనేక శబ్దములయిన శబ్దములచే వేద వేదాంగములు దెలిసిన వారు దేనిని బిలుతురో-94. అదే యీ మేరుపర్వతము ఇది పుణ్యాత్ములైన సర్వదేవతలకు నివాసస్థానము. ఆనాక పృష్టాది శబ్దములతో జెప్పబడుస్వర్గము దేవతలకు లోకముగానున్న యీ మేరు పర్వతమున గలదని సర్వశ్రుతులయందు జెప్పబడినది-95. అనేక విధములైన నియమముల చేతను, బహు యజ్ఞములచేతను, ఆత్మనిగ్రహముగలవారి చేతను పెక్కునూర్ల కొలది జన్మలలో సంపాదించిన పుణ్యములచేతను మరి యితర సత్కార్యములచేతను మానవులు ఈ దేవలోకమును పొందుదురు. దానిని స్వర్గమని కూడ అందురు.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున్ జంబూద్వీపవర్ణనమను ముప్పది నాల్గవయధ్యాయము.