వాయు మహా పురాణము
54 - నీలకంఠస్తవో
ఋషయ ఉవాచ:-
కస్మిన్ దేశే మహాపుణ్యమేతదాఖ్యాన ముత్తమమ్।
వృత్తం బ్రహ్మపురోగానాం కస్మిన్ కాలే మహాద్యుతే॥
ఏతదాఖ్యాహి నః సమ్యక్ యథావృత్తం తపోధన॥
సూత ఉవాచ:-
యథా శ్రుతం మయా పూర్వం వాయునా జగదాయునా ।
కథ్యమానం ద్విజశ్రేష్ఠాః సత్రే వర్షసహస్రకే॥
నీలతా యేన కంఠస్య దేవ దేవస్య శూలినః ।
తదహం కీర్తయిష్యామి శృణుధ్వం సంశితవ్రతాః ॥
ఉత్తరే శైలరాజస్య సరాంసి సరితో హ్రదాః ।
పుణ్యోద్యానేషు తీర్ధేషు దేవతాయతనేషు చ।
గిరిశృంగేషు తుంగేషు గహ్వరోపవనేషు చ ॥
దేవభక్తా మహాత్మానో మునయః సంశితవ్రతాః
స్తువన్తి చ మహాదేవం యత్ర యత్ర యథావిధి॥
ఋగ్యజుః సామవేదైశ్చ నృత్యగీతార్చనాదిభిః ।
ఓంకారేణ నమస్కారైరర్చయన్తి సదాశివమ్॥
ప్రవృత్తే జ్యోతిషాం చక్రే మధ్యవ్యాప్తే దివాకరే ।
దేవతా నిశ్చయాత్మానంః సర్వే తిష్ఠన్తి తాం కధామ్॥
అథ నియమ ప్రవృత్తాశ్చ ప్రాణశేష వ్యవస్థితాః ॥
నమస్తే నీలకంఠాయ ఇత్యువాచ సదా గతిః ।
తచ్ఛృతా భావితాత్మానో మునయః సంశితవ్రతాః ॥
వాలఖిల్యేతి విఖ్యాతాః పతంగ సహచారిణః॥
అష్టాశీతి సహస్రాణి మునీనామూర్ధ్వ రేతసామ్ ।
తస్మాత్పృచ్ఛన్తి వై వాయుంవాయు పర్ణాంబుభోజనాః ॥
ఋషులనిరి:- ఓ మహాకాంతివంతుడా సూతా! బ్రహ్మ మొదలైన యేకాలములోను, ఏ దేశములోను ఈ పుణ్యమైన యాఖ్యానము జరిగినది. ఓ తపోధన దీనిని జరిగినది జరిగినట్లు చక్కగా మాకు జెప్పుడు-.
సూతుడనెను:- ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! వేయి యేండ్లయాగమందు జగత్తునకాయువైన వాయువుచే జెప్పబడుచుండగా పూర్వము నేను విన్నది విన్నట్లు చెప్పెదను వినుడు-2. ఓ స్తుతింపబడిన వ్రతములు గల మునులారా! కావున దేవదేవుడైన శివుని కంఠమునకు నలుపెందులకో నేను జెప్పెదను వినుడు-3. శైలరాజైన హిమాలయము యొక్కయుత్తరమున సరస్సులును, నదులును, మడుగులును గలవు. పవిత్రమైన యుద్యానములలోను, తీర్థములతోను, దేవాలయములలోను ఎత్తైన పర్వత శిఖరములలోను గుహలలోను వానియుపనములలోను, దేవభక్తులును మహాత్ములునై స్తుతింపబడిన వ్రతములు గలవారైన మునులు అచ్చటచ్చట యథావిధిగా మహాదేవుని స్తుతింతురు. ఋగ్వేద యుజర్వేద సామవేదములతోను, నృత్యములతోను, గీతములతోను, మొదలగు పూజలతోను, ఓంకారముతోను నమస్కారములతోను సదాశివుని నర్చింతురు-6, జ్యోతిశ్చక్రము బాగా తిరుగగా సూర్యుడు మధ్యమున వ్యాపించినవాడు గాగా నిశ్చయాత్ములై దేవతలందరు ఆ కధను వినుటకై కూర్చుందురు. తరువాత నియమములోనుండుటచే ప్రాణశేషులై యుండిరి-7. వాయువు నమస్తే నీలకంఠాయ అనెను. అది విని యాత్మభావము గలవారును, స్తుతింపబడిన వ్రతములు గలవారును సూర్యునితోడుగా చరించువారును వాలఖిల్యులును ప్రసిద్దిజెందిన మునులుండిరి-8. వారు ఎనుబది యెనిమిది వేలు ఊర్థ్వరేతస్కులు కావున ఆకులు, జలము, వాయువు వీనిని మాత్రమే భుజించువారై వాయువునడుగుదురు.
ఋషయ ఉవాచ:-
నీలకంఠేతి యత్ప్రోక్తం త్వయా పవనసత్తమ ।
ఏతద్గుహ్యం పవిత్రాణాం పుణ్యం పుణ్యకృతాం వరాః ॥
తద్వయంశ్రోతుమిచ్ఛామ స్త్వత్ప్రసాదాత్ప్రభంజన ।
నీలతా యేన కంఠస్య కారణే నాంబికాపతేః ॥
శ్రోతుమిచ్ఛామహే సమ్యక్ తవ వక్త్రాద్విశేషతః ।
యావద్వాచః ప్రవర్తన్తే సార్థాస్తాశ్చత్వయేరితాః ॥
వర్ణస్థానగతే వాయౌ వాగ్విధిః సంప్రవర్తతే ।
జ్ఞానం పూర్వమధోత్సాహస్త్వతో వాయో ప్రవర్తతే ॥
త్వయి నిష్పండమానే తు శేషావర్ణ ప్రవృత్తయః ।
యత్ర వాచో నివర్తన్తే దేహబంధాశ్చ దుర్లభాః ॥
తత్రాపి తేఽస్తి సద్భావః సర్వగస్త్వలం సదా ।
నాఽన్యః సర్వగతో దేవస్త్వదృతేఽ స్తి సమీరణ॥
ఏష వై జీవలోకస్తే ప్రత్యక్షః సర్వతోఽ నిల ।
వేత్థ వాచస్పతిం దేవం మనోనాయక మీశ్వరమ్॥
బ్రూహి తత్కంఠదేశస్య కిం కృతారూపవిక్రియా ।
శ్రుత్వా వాక్యం తతస్తేషా మృషీణాం భావితాత్మనామ్॥
ప్రత్యువాచ మహాతేజా వాయుర్లోక నమస్కృతః॥
ఋషులనిరి:- ఓ వాయు పండితోత్తమా! నీవు "నీలకంఠ" యన్నది ఓ పుణ్యకార శ్రేష్టులారా! రహస్యమైనదియు, పవిత్రమైన వానిలో పుణ్యమైనది-10. కావున, ఓ వాయుదేవా! పార్వతీపతియైన శివుని యొక్క కంఠమందలి నలుపునకు కారణమేమో! నీయనుగ్రహమున వినదలచితిమి” విశేషించి నీ ముఖమునుండియే చక్కగా వినదలచితిమి. నీవు చెప్పిన మాటలు సారవంతమైన యర్థములు గలవై వెలువడినంతవరకు వినదలచితిమి-11,12. వాయువు మానవుని వర్ణస్థాన (వర్ణోత్పత్తి స్థానములందుండగా మాటల ప్రక్రియ చక్కగా నడుచుచుండును. ఓ వాయుదేవా! మానవులలో నీ వల్లనే మొదట జ్ఞానము, తరువాత ఉత్సాహమును గలుగును-13. నీవు కదులుచుండగనే తక్కిన వర్ణముల యుచ్చారణలు జరుగును. వాక్కులు బయలు వెడలక వెనుకకే వెళ్ళినపుడు దేహబంధములు (దేహమునకున్నయవయవ బంధములు) దుర్లభములగును-14. ఓ వాయుదేవా! అచటగూడ నీ చక్కని యునికి గలదు. నీవు అంతటనుండు వాడవు గదా. ఓ వాయుదేవా! నీవుదక్క అంతటనుండు దేవుడు మరొకడు లేడు-15. ఓ వాయుదేవా! నీ యీ జీవలోకమంతటను ప్రత్యక్షము. నీవు బ్రహ్మదేవుని దెలియుదువు. మనోనాయకుడైన యీశ్వరుని గూడ దెలియుదువు-16. కావున ఈశ్వరుని కంఠదేశమున గలిగిన రూపవికారమునకు (నలుపుదనము) దేనివల్ల జరిగినది? భావితాత్ములైన యా ఋషుల మాటవినిన తరువాత లోక నమస్కృతుడైన మహాతేజస్వియైన వాయువు మారుపలికెను.
వాయురువాచ :-
పురా కృతయుగే విప్రో వేదనిర్ణయతత్పరః ।
వసిష్ఠో నామ ధర్మాత్మా మానసో వై ప్రజాపతేః ॥
పప్రచ్చ కార్తికేయం వై మయూరవర వాహనమ్ ।
మహిషాసురనారీణాం నయనాంజనతస్కరమ్ ॥
మహాసేనం మహాత్మానం మేఘస్తనితనిః స్వనమ్ ।
ఉమామనః ప్రహర్షేణ బాలకం ఛద్మ రూపిణమ్॥
క్రౌంచజీవితహర్తారం పార్వతి హృదినందనమ్ ।
వసిష్ఠః పృచ్ఛతే భక్త్యా కార్తికేయం మహాబలమ్ ॥
వాయుదేవుడనెను:- పూర్వము కృతయుగమున బ్రహ్మమానస పుత్రుడును, బ్రాహ్మణుడును, వేద నిర్ణయ తత్పరుడును, ధర్మాత్ముడునైన వసిష్ఠుడను వాడుండెను-18. ఆతడు మయూరవాహనుడును, మహిషాసుర భార్యల మాంగళ్య చిహ్నమైన కంటికాటుకను దొంగిలించినవాడును (మహిషాసురుని జంపి వాని భార్యలను విధవలను జేసినవాడును, కృత్తికా పుత్రుడైన కుమారస్వామిని నడిగెను-19. (దేవ) మహాసేనుడు, మహాత్ముడు మేఘగర్జనము వంటి కంఠధ్వని గలవాడును, ఉమాదేవియొక్క మనస్సంతోషముచే బాలకరూపమును ధరించినవాడును-20. క్రౌంచ పర్వతము జీవితమును హరించువాడును పార్వతీ హృదయనందనుడును, మహాబలుడునునైన కార్తికేయుని (కుమారస్వామిని) వసిష్ఠుడు భక్తితో నడుగుచున్నాడు.
వసిష్ఠ ఉవాచ:-
నమస్తే హరనందాయ ఉమాగర్భ నమోఽస్తుతే ।
నమస్తే అగ్ని గర్భాయ గంగాగర్భ నమోఽస్తుతే॥
నమస్తే శరగర్భాయ నమస్తే కృత్తికాసుత ।
నమోద్వాదశనేత్రాయ షణ్ముఖాయ నమోఽస్తుతే॥
నమస్తే శక్తిహస్తాయ దివ్యఘంటాపతాకినే ।
ఏవం స్తుత్వామహాసేనం ప్రపచ్చ శిఖివాహనమ్॥
యదేతద్దశ్యతే వర్ణం శుభం శుభ్రాంజన ప్రభమ్ ।
తత్కిమర్థం సుముత్పన్నం కంఠే కుందేందు సంప్రభే॥
ఏత దాప్తాయ భక్తాయ దాంతాయ బ్రూహి పృచ్చ తే ।
కథాం మంగళం సంయుక్తాం పవిత్రం పాపనాశినీమ్॥
మత్ప్రియార్థం మహాభాగ వక్తుమర్హత్య శేషతః ॥
శ్రుత్వా పాక్యం తతస్తస్య వసిష్ఠస్య మహాత్మనః ।
ప్రత్యువాచ మహాతేజాః సురా బలసూదనః॥
శ్రుణుష్వ వదనాం శ్రేష్ఠ కథ్యమానం వచో మమ ।
ఉమోత్సంగవిస్టేన మయా పూర్వం యథాశ్రుతమ్॥
పార్వత్యా సహ సంవాదః శర్వస్య చ మహాత్మనః ।
తదహం కీర్తయిష్యామి త్వత్ప్రియార్థం మహామునే॥
వషిష్ఠుడనెను:- హరుని కుమారుడవగు నీకు నమస్కారము. ఉమాదేవి యొక్క గర్బస్వరూపుడవైన నీకు నమస్కారము. అగ్నియొక్క గర్భస్వరూపుడవైన నీకు నమస్కారము. గంగా గర్భస్వరూపుడవైన నీకు నమస్కారము-22. రెల్లు గడ్డికి గర్భ స్వరూపుడవైన నీకు నమస్కారము. కృత్తికానక్షత్ర గణస్వరూపులైన షట్కృత్తికల సుతుడవైన నీకు నమస్కారము. పండ్రెండు నేత్రములు గలవానికి నమస్కారము ఆరు ముఖములు గల నీకు నమస్కారము-23. శక్తియను సాయుధమును చేత ధరించిన వానికి నమస్కారము. దివ్యమై ఘంటధ్వజముగా గలవానికి నమస్కారము. అని యీ విధముగా మహాసేనుడగు కుమారస్వామిని స్తుతించి యా నెమలి వాహనమైన కుమారస్వామిని వసిష్ఠుడడిగెను-24. శుభ్రమైన కాటుక కాంతిగలిగి కనబడుచున్న యీ(నల్లని) వర్ణము మల్లెపూవుతోను చంద్రునితోను సమానమైన శివుని కంఠమునం ఎందు పుట్టినది?-25. ఈ విషయములకును ఆప్తుడును, భక్తుడును, ఇంద్రియ దమనశక్తిగలవాడనై నిన్నడుగుచున్న నాకు (ఓ కుమారస్వామి) చెప్పుము మంగళముతో గూడినదియు, పవిత్రమైనదియు, పాపముల నశింపజేయునదియు నైన యీ నీలకంఠ కథను నా ప్రీతికై పూర్తిగా జెప్పదగియున్నావు-26. తరువాత, మహాత్ముడైన వసిష్ఠుని యొక్క మాటను విని మహాతేజస్వియై రాక్షసబలముల జంపు కుమారస్వామి మారుపలికెను-27. ఓ ప్రవక్తలలో శ్రేషా(వశిష్ఠునేను జెప్పుమాటలు వినుము. పూర్వము ఉమాదేవి యొక్కయొడిలో గూర్చొని మహాత్ముడైన శివునకు పార్వతితో జరిగిన సంవాదమును ఓ మహామునీ! నీ ప్రీతికై నేను విన్నది విన్నట్లుగా జెప్పెద వినుము.
కైలాసశిఖరే రమ్యే నానాధాతు విచిత్రితే ।
నానాద్రుమలతాపర్ణే చక్రవాకోప శోభితే॥
షట్పదోద్గీతబహుళే ధారాసంపాత నాదితే ।
మత్తక్రౌంచ మయూరాణాం నాదైరుద్ఘుష్ట కందరే॥
అప్సరో గణ సంకీర్ణే కీన్నర్చైప శోభితే ।
జీవం జీవకజాతీనాం వీరుద్భిరుప శోభితే॥
కోకిలారావమధురే సిద్ధచారణసేవితే ।
సౌరభేయీ నినాదాడ్యే అధస్తనితనిః స్వనే॥
వినాయకభయోద్విగ్నే కుంజరైర్యుక్త కందరే ।
వీణావాద్రి త్రనిర్ఘోషైః శ్రోత్రేంద్రియ మనోరమైః ॥
దోలాలంబిత సంపాతే వనితా సంఘ సేవితే ।
ధ్వజైర్లంబిత దోలానాం ఘంటానాం నినదాకులే॥
ముఖమర్దలవాదిత్రై ర్బలినాం స్పోటితైః స్తథా ।
క్రీడారవవిచారాణాం నిర్ఘోషైః పూర్ణమందిరే॥
హాసైః సంత్రాసజననైర్వికరాల ముఖైస్తథా ।
దేహగంధైర్విచిత్రైశ్చ ప్రక్రీడితగణేశ్వరైః ॥
వజ్రస్ఫటిక సోపాన చిత్రపట్టి శిలాతలైః ।
వ్యాఘ్ర సింహముఖైశ్చాన్యై గజవాజిముఖై స్తథా॥
బిడాలవదనైశ్చోగ్రైః క్రోష్టుకాకార మూర్తిభిః ।
హ్రస్వైర్దీర్ఘైః కృశైః స్థూలైర్లంబోదర మహోదరైః ॥
హ్రస్వజం ఘైశ్చలంబో ష్టైస్తాలజంఘై స్తథాపరైః ।
గోకర్ణైరేకకర్ణైశ్చమహాకర్ణైరవకర్ణైకైః ॥
బహుపాదై ర్మహాపాదైరేకశీర్షైర శీర్షకైః ।
బహు శీర్షైర్మహా శీర్షైరేక శీర్షైర శీర్షకైః ॥
బహునేత్రైర్మహానేత్రైరేకనేత్రైర నేత్రకైః ।
ఏవం విధైర్మహాయోగి భూతైర్భూతపతీర్వృతః ॥
విశుద్దముక్తామణి రత్నభూషితే శిలాతలే మేమమయే మనోరమే।
సుఖోపవిష్టం మదనాంగనాశనం ప్రోవాచ వాక్యం గిరిరాజపుత్రః ॥
కైలాస శిఖరము రమ్యమైనది. అనేక ధాతువులచే విచిత్రమైనది. అనేక వృక్షలతలచే వ్యాపించినది. చక్రవాక పక్షులతో బ్రకాశించినది-30. తుమ్మెదల గానములతో నిండినది. జడివానల చప్పుడులతోను, జలధారాపాతములతోను ప్రతిధ్వనిత మైనది, మదించిన క్రౌంచ పక్షులయొక్కయు నెమళ్ళయొక్కయు నాదములతో బ్రతిధ్వనించిన గుహలుగలది-31. అప్సరోగణములతో వ్యాపించినది, కిన్నరులతో ప్రకాశించినది, జీవంజీవకములనెడు వృక్షముల యొక్కయు జాజి వృక్షముల - యొక్కయు తీవలచే ప్రకాశించినది-32. కోకిల ధ్వనులచే మధురమైనది, సిద్ద-చారణులు నివసించినది, గోవులయం బొరవములచే నొప్పనది, క్రిందిగా మేఘగర్జన ధ్వనులు గలది?-33. వినాయకుని భయముచే నుద్విగ్నమైనది. ఏనుగలతో గూడిన గుహలు గలది. వినసొం పైన వీణా వాదిత్ర ధ్వనులతో గూడినది-34. ఊయలలో నూగు జనసమూహముగలది, స్త్రీ సంఘములు నివసించినది, ధ్వజములతో వ్రేలాడిన గంటల నాదములు నిండినది. ముఖములతోను మద్దెలలతోను, వైద్యవిశేషములతోను బలవంతుల చేతులు చజచుటలతోను, ఆటలలో చరించు ధ్వనులతోను నిండిన భవనములు గలది-36. నవ్వులతోను, భయము బుట్టించు వికటములైన ముఖములతోను, విచిత్రములైన దేహగంధములతో పీడింపబడిన గణపతులతోను-37. వజ్రములు స్పటికములు వీనితో నిర్మింపబడిన మెట్ల పైని చిత్రములైన పట్టికలుగల శిలల పైభాగములతోను చుట్టబడినది. పులి ముఖములు గల వారితోను, సింహము ముఖములు గలవారితోను, మరి యితరములైన యేనుగు యొక్కయు గుజ్జములయొక్కయు ముఖములు గలవారితోను-38. పిల్లి ముఖము గలవారితోను, క్రూరములైన నక్కల యాకార నిర్మాణముగల వారితోను, పొట్టివారితోను, పొడుగువారితోను బక్కచిక్కిన వారితోను, బలిసిన వారితోను, వ్రేలాడు పొట్టలుగలవారితోను, పెద్ద పొట్టలు గలవారితోను-39 పొట్టి పిక్కలు గలవారితోను, వ్రేలాడు పెదవులు గలవారితోను, తాడిచెట్టు వలన పెద్దవైన పిక్కలుగలవారితోను, అట్లే మటి గోవు చెవులవారితోను, ఒక చెవిగలవారితోను, పెద్ద చెవులు గల వారితోను, చెవులే లేనివారితోను, అనేక పాదములు గలవారితోను, పెద్ద పాదములు గలవారితోను, పాదములే లేనివారితోను. పెక్కు తలలు గలవారీతోను, పెద్ద తలలు గలవారితోను, ఒకే తలగల వారితోను, తలయే లేని వారితోను-41, పెక్కు కన్నులు గలవారితోను, పెద్ద కన్నులుగల వారితోను, ఒకే కన్నుగలవారితోను, కన్నులేలేని వారితోను, ఈ విధముగానున్న మహాయోగి భూతులైన (భూతములైన) వారిచే భూతపతియైన శివుడు చుట్టబడినాడు-42. అపుడు, పరిశుద్ధములైన ముత్యములు, మణులు మణులు వీనిచే నలంకరింపబడి బంగారుమయమైన మనోహరమైన శిలాతలమున సుఖముగా గూర్చొని యున్న మన్మథ శరీరమును దహించిన శివుని గూర్చి గిరిరాజపుత్రియైన పార్వతి పలికెను.
దేవ్యువాచ:-
భగవన్ భూతభవ్యేశః గోవృషాంకిత శాసన ।
తవ కంఠే మహాదేవ! భ్రాజతేఽ బుజసన్నిభమ్॥
నాఽత్యుల్బణం నాతి శుభ్రం నీలాంజనచయోసమమ్ ।
కిమిదం దీవ్యతే దేవ కంఠే కామాంగనాశన॥
కో హేతుః కారణం కిం చ కంఠే నీలత్వమీశ్వర ।
ఏతత్సర్వం యథాన్యాయం బ్రూహి కౌతూహలం హిమే॥
శ్రూత్వా వాక్యం తతస్తస్యాః పార్వత్యాః పార్వతీప్రియః ।
కథాం మంగల సంయుక్తాం కథయాయాస శంకరః ॥
మధ్యమానేఽ మృతే పూర్వం క్షీరోదే సురదానమైః ।
అగ్రే సముత్థితం తస్మిన్ విషం కాలానలప్రభమ్॥
తం దృష్ట్యా సురసంఘాశ్చ దైత్యాశ్చైవ వరాననే ।
విషణ్ణవదనాః సర్వే గతాస్తే బ్రహ్మణోఽన్ తికమ్॥
దృష్ట్వా సురగణాన్ భీతాన్ బ్రహ్మోవాచ మహాద్యుతిః ।
కిమర్థం భో మహాభాగా భీతా ఉద్విగ్నచేతసః॥
మయాష్టగుణమైశ్వర్యం భవతాం సంప్రకల్పితమ్ ।
కేనవ్యావర్తితైశ్వర్యా యూయం వై సురసత్తమాః ॥
త్రైలోక్యస్యేశ్వరాయూయం సర్వే వై విగతజ్వరః ।
ప్రజాసర్గేన సోఽస్తీహ ఆజ్ఞాం యో మే నివర్తయేత్॥
విమానగామినః సర్వే సర్వే స్వచ్ఛందగామినః ।
అధ్యాత్మేచాధిభూతే చ అధిదైవేచ నిత్యశః॥
ప్రజాః కర్మవిపాకేన శక్తా యూయం ప్రవర్తితుమ్।
తత్కి మర్థం భయోద్విగ్నాః మృగాః సింహార్దితా ఇవ ॥
కిం దుఖం కేన సంతాపః కుతో వా భయమాగతమ్।
ఏతత్సర్వం యధాన్యాయః శీఘ్రమాఖ్యాతు మర్హథ॥
పార్వతి యనెను:- భూత భవిష్యత్తులకు ప్రభువై, వృషభధ్వజుడవైన, యోభగవంతుడవైన మహాదేవా! నీ కంఠమున కమలముతో సమానమైనదియు-44. అంతగా మసకగానిదియునై, అంతగా స్పష్టము గానిదియు, నల్ల కాటుక సమూహముతో బోలినదియు కాదు ఓ సంహారకా! దేవా! నీ కంఠమున యిది యేమి ప్రకాశించుచున్నది?-45. ఓ యీశ్వర! కంఠమునందు నలుపునకు గారణమేమి? ఇది యంతయు న్యాయానుసారముగ జేప్పుడు. నాకు కుతూహలమెక్కువగానున్నది-46. అంత పార్వతీప్రియుడైన శివుడు ఆ పార్వతి మాటను విని శంకరుడు మంగళముతో కూడిన కథను చెప్పసాగెను-47. పూర్వము దేవదానవులచేత పాల సముద్రము మథింపబడుచుండగా దానిలో మొదట ప్రళయకాలాగ్ని కాంతిగల విషము బయలు వెడలినది-48. దానిని జూచి, సంఘములును, రాక్షసులును విషాదముతో గూడిన ముఖములు గలవారై యందరును శ్రేష్ఠమైన ముఖము గలదానా! బ్రహ్మ సమీపమునకు వెళ్ళిరి. మహాతేజస్వియైన బ్రహ్మ భయపడిన దేవగణములను జూచి, ఓ మహాభాగులారా! మీరెందుకు భయపడి ఉద్వేగముజెందిన చిత్తములు గలవారైతిరి?-49,50. నేను మీకు ఎనిమిదింతల యైశ్వర్యమును కల్పించి యిచ్చితిని. ఓ దేవశ్రేష్ఠులారా! మీరే కారణముచేత పోయిన టైశ్వర్యములు గలవారైతిరి! (మీ యైశ్వర్యములు పోయినవి?)-51. మీరు ముల్లోకముల కీశ్వరులు. మీరందరు జ్వరములేనివారు నేను సృజించిన సృష్టిలో నాయాజ్ఞను తిరస్కరించిన వాడులేడు-52. అందరు విమానములలో బోవువారు. అందజును స్వేచ్చగా చరించువారు. ఆధ్యాత్మికమునందును ఆత్మకు సంబంధించిన విషయమునందును) ఆధి భౌతికమునందును (పాంచ భౌతికముగా శరీరమునకు సంబంధించిన విషయమునందును, ఆధి దైవికమునందును దైవ వశమున తటస్థించిన విషయమునందును) మీరు కర్మవిపాకముతో ప్రజలను ప్రవర్తింపజేయుదురు-53. కావున, సింహముతో పీడింపబడిన లేళ్ళవలే మీరెందులకు భయపీడితులగుచున్నారు? మీదుఃఖమేమి? దేనిచేత మీకు సంతాపము గలిగినది? మీకు భయమెక్కడి నుండి వచ్చినది? ఇదియంతయు న్యాయముననుసరించి శీఘ్రముగా జెప్పదగియున్నారు.
శ్రుత్వా వాక్యం తతస్తస్య బ్రహ్మణో వై మహాత్మనః ।
ఊచుస్తే ఋషిభిః! సార్థం సురదైత్యేంద్ర దానవాః ॥
సురాసురైర్మథ్యమానే పాథోధౌచ మహాత్మభిః ।
భుజంగ భృంగసంకాశం నీలజీమూత సన్నిభమ్।
ప్రాదుర్భూతం విషం ఘోరం సంవర్తాగ్ని సమప్రభమ్॥
కాలమృత్యురివోద్భూతం యుగాన్తాదిత్య వర్చసమ్ ।
త్రైలోక్యోత్సాది సూర్యాభం ప్రస్ఫురంతం సమంతతః ॥
విషేణోత్తిష్ఠమానేన కాలానలసమత్విషా ।
నిర్దగ్ధో రక్తగౌరాంగః కృతకృష్ణా జనార్దనః ॥
దృష్ట్యాతం రక్తగౌరాంగం కృతకృష్ణం జనార్దనమ్ ।
భీతాః సర్వే వయం దేవాస్త్వామేవ శరణం గతాః ॥
సురాణామసురాణాం చ శ్రుత్వా వాక్యం పితామహః ।
ప్రత్యువాచ మహాతేజా లోకానాం హితకామ్యయా॥
శృణు ధ్వం దేవతాః సర్వే ఋషయశ్చ తపోధనాః ।
యత్తదగ్రే సముత్పన్నం మధ్యమానే మహోదధౌ ॥
విషం కాలానల ప్రఖ్యం కాలకూటేతి విశ్రుతమ్ ।
యేన ప్రోద్భూతమాత్రేణ కృతకృష్ణో జనార్దనః ॥
తస్య విష్ణురహం చాపి సర్వే తే సురపుంగవాః ।
న శక్నువంతి వై సోడుం వేగమన్యే తు శంకరాత్॥
ఇత్యుక్త్యా పద్మగర్భాభః పద్మయోనిరయోనిజః ।
తతః స్తోతుం సమారబ్ధో బ్రహ్మాలోక పితామహః ॥
తరువాత మహాత్ముడైన బ్రహ్మయొక్క మాటను విని ఋషులతోబాటు దేవతలు దైత్యేంద్రులు, దానవులును పలికిరి-55. మహాత్ములైన దేవదానవులచే పాల సముద్రము మథింపబడుచుండగా కాలసర్పముతోను తుమ్మెదలోను సమానమైనదియు నీలమేఘముతో సమానమైనదియు, ప్రళయకాల సంవర్తాగ్నితో సమానమైన కాంతిగలదియునై ఘోరమైనదియు విషము బయలు వెడలినది-56. అది కాలమృత్యువువలే బయలువెడలినది. యుగానకాలసూర్యకాంతి గలది. ముల్లోకముల నశింపజేయు సూర్యుని వంటిది. అంతటను వెలుగుల విరజిమ్ముచున్నది-57. ఆ విధముగా కాలాగ్ని కాంతితో పైకి లేచుచున్న విషముచే తెల్లని శరీరముగల జనార్దనుడైన విష్ణువు దహింపబడి నల్లని వాడయ్యెను-58. ఎఱుపు తెలుపు శరీరము గల యా విష్ణువును నల్లనైనవానిగా జూచి మేము దేవతలమందరము భయపడినవారమై నిన్నే శరణు బొందితిమి-59. అవి ఈ దేవరాక్షసుల మాటనువిని మహాతేజస్వియైన బ్రహ్మ లోకముల హితమును గోరి మారుపలికెను-60. ఓ సమస్త దేవతలారా! ఋషులారా! మునులారా! వినుడు. పాల సముద్రము మథింపబడుచుండగా మొదట బుట్టినది (ప్రళయ) కాలాగ్ని సమమై కాలకూటమని ప్రసిద్ధిజెందినది. అది పుట్టినంత మాత్రముననే దానిచే, విష్ణువు నల్లగా చేయబడినాడు-62. ఆ విషమును విష్ణువు, నేనును, ఆ సమస్త దేవతా శ్రేష్టులును ఒక్క శంకరుడు దక్క తక్కిన యెవ్వరును సహింపలేదు-63. అని చెప్పి పద్మగర్భమువంటి పసిడికాంతిగలవాడును, పద్మమున బుట్టి యయోనిజుడైన లోకపితామహుడైన బ్రహ్మ శివుని స్తుతింప మొదలిడెను.
నమస్తుభ్యం విరూపాక్ష నమస్తేఽనేకచక్షుషే ।
నమః పినాకహస్తాయ వజ్రహస్తాయ వైనమః ॥
నమస్తైలోక్య నాథాయ భూతానాం పతయే నమః ।
నమః సురారి సంహర్త్రే తాపసాయ త్రిచక్షుషే ॥
బ్రహ్మణే చైవ రుద్రాయ విష్ణవే చైవ తే నమః ।
సాంఖ్యాయ చైవ యోగాయ భూతస్రావాయ వై నమః ॥
మన్మథాంగ వినాశాయ కాలకాలాయ వై నమః ।
రుద్రాయ చ సురేశాయ దేవదేవాయ తే నమః॥
కపర్దినే కరాలాయ శంకరాయ కపాలినే ।
విరూపాయైకరూపాయ శివాయ వరదాయ చ ॥
త్రిపురఘ్నాయ వంద్యాయ మాతౄణాం పతయే నమః ।
బుద్ధాయ చైవ శుద్ధాయ ముక్తాయ కేవలాయచ॥
నమః కమలహస్తాయ దిగ్వాసాయ శిఖండినే ।
లోకత్రయవిధాత్రే చ చంద్రాయ వరుణాయ చ॥
అగ్రాయ చైవ చోగ్రాయ విప్రాయానేక చక్షుషే ।
రజసేచై వ సత్త్వాయ తమసేఽవ్యక్త యోనయే॥
నిత్యాయనిత్యరూపాయ నిత్యానిత్యాయ వై నమః ।
వ్యక్తాయ చైవావ్యక్తాయ వ్యక్తా వ్యక్తాయవై నమః ॥
చిన్త్యాయ చైవా చింత్యాయ చింత్యా చింత్యా వై నమః ।
భక్తానామార్తినాశాయ నరనారాయణాయ చ ॥
ఉమాప్రియాయ శర్వాయ నందిచక్రాంకితాయ చ ।
పక్షమాసార్ధమాసాయ నమః సంవత్సరాయచ॥
బహురూపాయ ముండాయ దండినేఽ థ వరూధినే ।
నమః కపాలహస్తాయ దిగ్వాసాయ శిఖండినే॥
ధ్వజినే రథినే చైవ యమినే బ్రహ్మచారిణే ।
ఋగ్యజుః సామవేదాయ పురుషాయేశ్వరాయచ॥
ఇత్యేవమాదిచరితై స్తుభ్యం దేవనమోSస్తుతే॥
ఓ విరూపాక్షా (మూడు కన్నులు గలవాడా!) నీకు నమస్కారము. అనేక నేత్రములు గల నీకు నమస్కారము. పినాకధనువు చేతియందుగలవానికి నమస్కారము. వజ్రము చేతియందు గల వానికి నమస్కారము-65. ముల్లోకముల యధిపతికి నమస్కారము. భూతముల పతికి నమస్కారము. రాక్షస సంహారకునకు నమస్కారము. తాపసునకు నమస్కారము. ముక్కంటికి నమస్కారము-66. బ్రహ్మవైన నీకు నమస్కారము. రుద్రుడవైన నీకు నమస్కారము. విష్ణువైన నీకు నమస్కారము. సాంఖ్యతత్వరూపునకు నీకు నమస్కారము యోగతత్యరూపునకు నమస్కారము. భూతములకు శిలారూపుడవైన నీకు నమస్కారము-67. మన్మథశరీరమును భస్మముజేసిన వానికి నమస్కారము. (మార్కండేయ రక్షణకై యమునకు గూడ యముడవైన నీకు నమస్కారము. రుద్రరూపునకు నీకు నమస్కారము. దేవేంద్రరూపునకు నీకు నమస్కారము దేవతల దేవునకు నమస్కారము-68. జటాజూటము గల నీకు నమస్కారము క్రూర స్వరూపునకు నమస్కారము. శంకరునకు నమస్కారము. ఏకరూపుడవైన నీకు నమస్కారము. శివునకు నమస్కారము. వరదునకు నమస్కారము-69. త్రిపురాసురుల త్రిపురములను భస్మము జేసిన నీకు నమస్కారము. అందరికి వందనము జేయదగిన నీకు నమస్కారము. సప్తమాతృదేవతల పతికి నమస్కారము. జ్ఞానస్వరూపునకు నమస్కారము. శుద్ద స్వరూపునకు నమస్కారము. ముక్త స్వరూపునకు నమస్కారము (కేవల) ఏకస్వరూపునకు నమస్కారము-70. కమలము(వంటి) హస్తములుగల నీకు నమస్కారము. దిగంబరునకు నమస్కారము. నెమలి పింఛము (మాయాకిరాతడై) ధరించినవానికి నమస్కారము. వరుణ స్వరూపునకు నీకు నమస్కారము 71. అగ్రునకు (అందరికన్న ముందుండువానికి) నమస్కారము. ఉగ్ర స్వరూపునకు నమస్కారము. విప్ర స్వరూపునకు నమస్కారము. అనేకములైన కండ్లు గలవానికి నమస్కారము. రజోగుణ స్వరూపునకు నమస్కారము. సత్యగుణ స్వరూపునకు తమస్స్వరూపునకు నమస్కారము. జన్మములేనివానికి నమస్కారము-72. (పరమాత్మగా) నిత్యస్వరూపునకు నమస్కారము. (జీవాత్మగా) అని నిత్యస్వరూపునకు నమస్కారము (కావున) నిత్యానిత్య స్వరూపుడవైన నీకు నమస్కారము. (జగముగా) వ్యక్తస్వరూపునకు నీకు నమస్కారము. (జగదతీతముగా) అవ్యక్తస్వరూపునకు నమస్కారము-73. (విశ్వవ్యాప్తుడుగా) చింతింప (ధ్యానింప దగినవానికి నమస్కారము. (విశ్వాతీతుడుగా) ధ్యానమునకు మించినవానికి నమస్కారము. (కావున) చింత్యాచింత్య స్వరూపునకు నమస్కారము. భక్తుల బాధల నశింపజేయువానికి నమస్కారము. నరనారాయణ స్వరూపునకు నమస్కారము 74. ఉమాదేవీ ప్రియునకు నమస్కారము. శర్వునకు ప్రళయమున భూతములనశింపజేయువానికి) నమస్కారము. నంది చక్రములు చిహ్నములుగా గల వానికి (హరిహర స్వరూపునకు) నమస్కారము. పక్షము ఒకటిన్నర మాసము మాసము వీని స్వరూపునకు నమస్కారము. సంవత్సర స్వరూపునకు నమస్కారము-75. బహురూపములు గలవానికి నమస్కారము. బోడితల గలవారికి నమస్కారము. దండముగలవానికి నమస్కారము. కవచము గలవానికి నమస్కారము. కపాలము చేతగలవానికి నమస్కారము. దిగంబర స్వరూపునకు నమస్కారము. నెమలి పింఛము ధరించినవానికి నమస్కారము-76. ధ్వజము గలవానికి నమస్కారము. రథముగలవానికి నమస్కారము. బ్రహ్మచారికి (ఆత్మ బ్రహ్మయందు చరించువానికి) నమస్కారము. ఋగ్వేద స్వరూపునకును యజుర్వేద స్వరూపునకును సామవేద స్వరూపునకును నమస్కారము. (సాంఖ్య పురుష స్వరూపునకు నమస్కారము. (ఈశ్వర సాంఖ్య) ఈశ్వర స్వరూపునకు నమస్కారము. అని యీ మొదలగు నీ చరితములచే ఓ దేవా! నీకు నమస్కారము.
శ్రీమహాదేవ ఉవాచ :-
ఏవంస్తుతస్తతో దేవైః ప్రణిపత్య వరాననే॥
జ్ఞాత్వా తు భక్తిం మమ దేవదేవో గంగాజలాప్లావిత కేశదేశః॥
సూక్ష్మాతియోగా ఆశయాదచింత్యో న హి ప్లుతో వ్యక్తము పైతి చంద్రః ॥
ఏవం భగవతా పూర్వం బ్రహ్మణా లోకకర్తృణా ।
స్తుతోఽహం వివిధైస్తోత్రై ర్వేదవేదాంగ సంభవైః॥
తతః ప్రీతోఽ హం తస్మై బ్రహ్మణే సుమహాత్మనే ।
తతోఽ హం సూక్ష్మయా వాచా పితామహ మథాబ్రువమ్॥
భగవాన్ భూతభవ్యేశ లోకనాథ జగత్పతే ।
కిం కార్యం తే మయా బ్రహ్మన్ కర్తవ్యం వద సువ్రత॥
శ్రుత్వా వాక్యం తతో బ్రహ్మా ప్రత్యువాచాం బుజేక్షణః ।
భూతభవ్యభవన్నాథ శ్రూయతాం కారణేశ్వర॥
సురాసురైర్మథ్యమానే పయోధావంబు జేక్షణ ।
భగవన్మేఘసంకాశం నీలజీమూత సన్నిభమ్॥
ప్రాదుర్భూతం విషం ఘోరం సంవర్తాగ్ని సమప్రభమ్ ।
కాలమృత్యురివోద్భూతం యుగాన్ తాదిత్య వర్చసమ్ ॥
త్రైలోక్యోత్సాది సూర్యాభం విస్ఫురంతం సమంతతః ।
అగ్రే సముత్థితం తస్మిన్ విషం కాలానల ప్రభమ్॥
తం దృష్ట్వా తు వయం సర్వే భీతాః సంభ్రాంత చేతసః ।
తత్ పిబస్వ మహాదేవ లోకానాం హితకామ్యయా॥
భవానగ్య్రస్య భోక్తా వై భవాంశ్చైవ వరః ప్రభుః ॥
త్వామృతఽన్యో మహాదేవ విషం సోడుం న విద్యతే ।
నాస్తి కశ్చిత్పుమాన్ శక్తి స్త్రైలోక్యేషు చ గీయతే ॥
మహేశ్వరుడనెను:- ఓ పార్వతీ! ఈ విధముగా దేవతలచే నమస్కరించి శివుడు స్తుతింపబడెను. బ్రహ్మనగు నా భక్తిని దెలిసి దేవదేవుడైన శివుడు గంగాజలముతో స్నానముచేసి శివము గలవాడును మిక్కిలి యోగాతిశయముచే, సూక్ష్ముడును ధ్యానాతీతుడు నయ్యెను శిరమున దడిసిన చంద్రుడు గూడ గనబడుట లేదు-79. ఈ రీతిగా పూర్వము భగవంతుడై లోక కర్త యైన బ్రహ్మచే వేదముల నుండియు వేదాంగములైన శిక్షాదుల నుండియు బుట్టిన వివిధ స్తోత్రములచే స్తుంతింపబడిన నేను-80. ఆ మహాత్ముడైన బ్రహ్మను గూర్చి సంతసించిన వాడనైతిని తరువాత నేను చిన్న మాటతో బ్రహ్మతో నిట్లంటినీ 81. ఓ భగవంతుడా! భూతభవిష్యత్కాలములకు ప్రభువైనవాడా! లోకనాథ! జగత్పతే! బ్రహ్మా! నీ కొరకు నేనేమి జేయవలెను ఓ సువ్రతుడా! చెప్పుము-82. ఈ మాటవిని కమలముల వంటి కన్నులు గల బ్రహ్మ మారు పలికెను. భూత భవిష్యవర్తమాన కాలముల కధిపతియై జగత్కారణుడవైన యీశ్వరా! వినుము-83. అంబుజేక్షణుడవైన యో భగవంతుడా! దేవదానవులచే సముద్రము మథింపబడుచుండగా మేఘము వంటిదియు, నల్లనిమేఘము వంటిదియు-84. ప్రళయాగ్ని వంటిదియు నైన భయంకరమైన విషము ఉద్భవించినది. అది అకాల మృత్యువు వలె బుట్టినది. యుగాన సూర్యునివలె ప్రకాశించునది-85. ముల్లోకముల నశింపజేయు సూర్యుని వలే వెలుగుచున్నది. అన్ని వైపులా బ్రకాశించునది దాని కొసలో కాలాన్ని కాంతిగల విషము బయలువెడలినది-86. దానిని చూచి మేము భయపడి యాశ్చర్యము జెందితిమి. కావున ఓ మహాదేవ! లోకహితమును గోరి యీ విషమును ద్రాగుము. నీవే యా మొదటి సముద్ర ఫలమును భుజించువాడవు. నీవే దానికి శ్రేష్ఠమైన సమర్థుడవు 87. ఓ మహాదేవా! నీవు దక్క యా విషమును సహించువాడు లేడు. ముల్లోకములలో దీనికి సమర్థుడైన పురుషుడెవ్వడును లేడు అని చెప్పబడుచున్నది.
ఏవం తస్య వచః శ్రుత్వా బ్రహ్మణః పరమేష్ఠినః ।
బాఢమిత్యేవ తద్వాక్యం ప్రతిగృహ్య వరాననే॥
తతోఽ హం పాతు మారబ్దో విషమన్తక సన్నిభమ్ ।
పిబతో మే మహాఘోరం విషం సురభయంకరమ్॥
కంఠఃసమభవత్తూర్ణం కృష్ణో మే వరవర్ణిని ॥
తం దృష్ట్వోత్పలపత్రాభం కంఠే సక్తమివోరగమ్ ।
తక్షకం నాగరాజానం లేలిహానమివ స్థితమ్॥
అథోవాచ మహాతేజా బ్రహ్మాలోక పితామహః ।
శోభసే త్వం మహాదేవ కంఠేనానేన సువ్రత॥
తతస్తస్య వచః శ్రుత్వా మయా గిరివరాత్మజే ।
పశ్యతాం దేవసంఘానాం దైత్యానాం చ వరాననే॥
యక్షగంధర్వ భూతానాం పిశాచోర గరక్షసామ్ ।
ధృతం కంటే విషం ఘోరం నీలకంఠస్తతో హ్యహమ్॥
తత్కాలకూటం విషముగ్రతేజః కంఠే మయా పర్వతరాజపుత్రి।
నివేశయానం సురదైత్యసంఘో దృష్ట్యా పరం విస్మయమాజగామ॥
పమేష్ఠియైన బ్రహ్మయొక్కయు మాటను విని, ఓ శ్రేష్ఠమైన ముఖముగలదానా పార్వతీ! సరియ యని యా బ్రహ్మవాక్యమును స్వీకరించెను-89. తరువాత యమునితో సమానమైన విషమును ద్రాగుటకు ప్రారంభించితిని. దేవభయంకరమైన యా ఘోర విషము ద్రోగుచున్న నా కంఠము ఓ యుత్తమురాలా! వెంటనే నల్లనైనది-90. కలువరేకువలె నున్నదియు, కంఠమున నంటియున్న సర్పమువలె నున్నదియు, నాగరాజైన తక్షకుని నాకుచున్నట్లున్న యా విషమును జూచి లోక పితామహుడైన బ్రహ్మ యిట్లనెను. ఓ సువ్రతుడవైన మహాదేవా! ఈ కంఠముతో శోభించుచున్నావు-91,92. బ్రహ్మ మాటను విని ఓ హిమాలయపుత్రీ! నేనంటిని ఓ వరాననా! యక్షులు, గంధర్వులు, భూతములు, పిశాచులు, ఉరగులు, రాక్షసులు, వీరందరు చూచుచుండగా భయంకరమైన యా విషమును నేను కంఠములో ధరించితిని-93, 94. కావున, ఓ పర్వతరాజపుత్రి! ఉగ్రతేజమైన కాలకూట విషమును కంఠములో బ్రవేశపెట్టుచుండగా (ద్రాగుచుండగా) జూచి దేవదానవ సంఘము మిక్కిలి యాశ్చర్యము జెందెను.
తతః సురగణాః సర్వే సదైత్యోరగ రాక్షసాః ।
ఊచుః ప్రాంజలయో భూత్వా మత్తమాతంగగామిని॥
అహోబలం వీర్యపరాక్రమస్తే అహో పునర్యోగబలం తవైవ ।
అహో ప్రభుత్వం తవదేవ దేవ గంగాజలాస్ఫాలితముక్త కేశ ॥
త్వమేవ విష్ణుశ్చ తురాననస్త్వం త్వమేవ మృత్యుర్వర దస్త్యమేవ ।
త్వమేవ సూర్యో రజనీకరశ్చ త్వమేవభూమిః సలిలం త్వమేవ॥
త్వమేవ యజ్ఞోనియమస్త్యమేవ త్వమేవ భూతం భవితాత్వమేవ ।
త్వమేవ చాదిర్నిధనం త్వమేవ స్థూలశ్చ సూక్ష్మః పురుషస్త్యమేవ ॥
త్వమేవ సూక్ష్మస్య పరస్య సూక్ష్మస్త్యమేవ వహ్నిః పవనస్త్వమేవ।
త్వమేవ సర్వస్య చరాచరస్య లోకస్య కర్తా ప్రలయచే గోప్తా ॥
ఇతీవముక్త్యా వచనం సురేంద్రాః ప్రగృహ్య సోమం ప్రణిపత్య మూర్ధ్నా ।
గతావిమానైరనిగృహ్య వేగైర్మహాత్మనో మేరుముపేత్య సర్వే ॥
ఓ మదించిన యేనుగ నడకల వంటి నడకలు గల పార్వతీ! తరువాత దేవగణములందరు, దైత్యులు ఉరగులు, రాక్షసులును చేతులు జోడించినవారై యనిరి-96. గంగాజలముచే గొట్టబడి విడివడిన తల వెంట్రుకలు గల యో దేవదేవా! నీ యొక్క బలము వీర్యము పరాక్రమమును ఆశ్చర్యకరములైనవి. మణి నీయోగబలము గూడ నాశ్చర్యకరమైనది-97. నీవే విష్ణువు నీవే బ్రహ్మవు, నీవే మృత్యువు. నీవే వరదుడవు. నీవే సూర్యుడవు. నీవే చంద్రుడవు. నీవే భూమివి. నీవే జలము. నీవే యజ్ఞము. నీవే నియమము. నీవే భూతకాలము భవిష్యత్కాలమును నీవే యన్నిటికీని ఆదివి (మొదలు) నీవే మరణము. నీవే స్టూలుడవు. నీవే సూక్ష్ముడవు. నీవే యగ్నివి. నీవే వాయువు. నీవే చరాచరమైన లోకమునకు కర్తవు. ప్రళయమున రక్షించువాడవు- 100. అని యీ విధముగా జెప్పి దేవేంద్రులు అందరును ఉమాసహితుడైన శివుని శిరస్సుతో నమస్కరించి, అడ్డరాని వేగములతో మేరువును జేరి వెళ్ళిరి.
ఇత్యేతత్పరమం గుహ్యం పుణ్యాత్పుణ్య మహత్తరమ్ ।
నీలకంఠేతి యత్ప్రోక్తం వ్యాఖ్యాతం లోకవిశ్రుతమ్॥
స్వయం స్వయంభువా ప్రోక్తం పుణ్యాం పాపప్రణాశనీమ్ ।
యస్తు ధారాయతే నిత్యమేనాం బ్రహ్మోద్భవాం కథామ్ ।
తస్యాఽహం సంప్రవక్ష్యామి ఫలం వై విపులం మహత్॥
విషం తస్య వరారోహే స్థావరం జంగమం తథా ।
గాత్రం ప్రాప్యచ శుశ్రోణి క్షిప్రం తత్ ప్రతిహన్యతే॥
శమయత్యశుభం ఘోరం దుఃస్వప్నం చాపకర్షతి ।
స్త్రీషు వల్లభతాం యాతి సభాయాం పార్థివస్య చ॥
వివాదే జయమాప్నోతి యుద్ధే శూరత్వ మేవ చ ।
గచ్ఛతః క్షేమమధ్వానం గృహే చ నిత్యసంపదః ॥
శరీరభేదే వక్ష్యామి గతిం తస్య వరాననే ।
నీలకంఠో హరిచ్ఛ్మశ్రుః శశాంకాంకితమూర్ధజః ॥
ప్రత్యక్ష స్త్రిశూలపాణిశ్చ వృషయానః పినాకధృక్ ।
నందితుల్యబలః శ్రీమాన్ నందితుల్య పరాక్రమః ॥
విచరత్యచిరాత్ సర్వాన్ సర్వలోకాన్మయాజ్ఞయా ।
న హన్యతే గత్తిస్తస్య అనిలస్యయథాంబరే॥
మమ తుల్య బలో భూత్వా తిష్ఠత్యాభూత సంప్లవమ్॥
మమ భక్తా వరారోహే యే చ శృణ్వన్తి మానవాః।
తేషాం గతిం ప్రవక్ష్యామి ఇహలోకే పరత్ర చ॥
బ్రాహ్మణో వేదమాప్నోతి క్షత్రియో జయతే మహీమ్ ।
వైశ్యస్తు లభతే లాభం శూద్రః సుఖమవాప్నుయాత్ ॥
వ్యాధితో ముచ్యతే రోగాద్బర్ధో ముచ్యతే బంధనాత్ ।
గుర్విశీలభతే పుత్రం కన్యావిందతి సత్పతిమ్ ॥
నష్టం చలభతే సర్వమిహలోకే పరత్ర చ ॥
గవాం శతసహస్రస్య సమ్యగ్దత్తస్య యత్పలమ్ ।
తత్పలం భవతి శ్రుత్వా విభోర్దివ్యామిమాం కథామ్॥
పాదం వా యదివాప్యర్థం శ్లోకం శ్లోకార్థమేవ వా ।
యస్తు ధారయతే నిత్యం రుద్రలోకం స గచ్ఛతి॥
కథామిమాం పుణ్యఫలాదియుక్తాం నివేద్య దేవ్యాః శశిబద్ధమూర్ధజః ।
వృషస్య పృష్ఠేన సహోమయా ప్రభుర్జగామ కిష్కింధగుహాం గుహప్రియః ॥
క్రాంతం మయా పాపహరం మహాపదం నివేద్య తేభ్యః ప్రదదౌ ప్రభంజనః।
అధీత్య సర్వం త్వఖిలం సులక్షణం జగామ ఆదిత్య పథం ద్విజోత్తమః ॥
ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్త నీలకంఠస్తవో నామ చతుః సంచాశోధ్యాయః ॥
అను నిది పరమ రహస్యము పుణ్యములన్నింటికన్న మహాపుణ్యము. నీలకంఠయను విషయమున జెప్పినది ప్రఖ్యాతమై లోక ప్రసిద్ధమైనది-102. స్వయముగా బ్రహ్మచే జెప్పబడినదియు, పుణ్యమై పాపములనశింపజేయునది నైన బ్రహ్మనుండి బుట్టిన కథను విని జ్ఞప్తియందుంచుకొన్నవానికి లభించు మహాఫలమును గూర్చి విపులముగా జెప్పెదను-103. ఓ చక్కని పిరుదులు గల పార్వతీ! ఈ కథను విని ధారణచేసిన వాని శరీరమును స్థావరమైనదిగా జంగమమైనదిగానియైన విషము చేరిన వెంటనే ప్రభావము జూపక నశించిపోవును-104. భయంకరమైన యశుభము శాంతించును. చెడు స్వప్నములను బోగొట్టును. స్త్రీలకును, సభలో రాజునకును ప్రేమ పాత్రుడగును-105. వివాదములో జయమును బొందును. యుద్దమున శౌర్యమునందును దారిలో బోవువాడు క్షేమమును ఇంటనున్నవాడు నిత్యసంపదలను బొందును-106. ఓ శ్రేష్ఠముఖముగల జన్మాంతరమున గూడ నాతని ప్రాప్తిని జెప్పెదను. వాడు నీలకంఠుడు పచ్చని మీసములు గలవాడును. చంద్రుడలంకరించిన శరీరము గలవాడును-107. ముక్కంటియు, త్రిశూలము చేతగలవాడును, ఎద్దు వాహనము గలవాడును పినాక ధనువు చేతబూనినవాడును, నందీతో సమబలుడు, శ్రీమంతుడును, నందితో సమానమైన పరాక్రమము గలవాడును నై-108, తొందరలోనే (అల్పకాలములోనే) నా యాజ్ఞచే సమస్త లోకములను చరించును. ఆకాశమున వాయునకువలె యాతని గమనమునకు అడ్డుండదు. నాతో సమబలుడై భూతప్రళయము వరకుండును-109. ఈ కథను విన్న నామానసభక్తుల యీ లోకములోని గతిని, పరలోకములోని గతిని ఓ పార్వతీ చెప్పెదను-110. బ్రాహ్మణుడు వేదమును బొందును. క్షత్రియుడు భూమిని జయించును. వైశ్యుడు (తనవ్యాపారమున) లాభమును బొందును. శూద్రుడు సుఖమును బొందును-111. వ్యాధితో బాధింపబడినవాడా వ్యాధినుండి ముక్తుడగును. కారాగారబద్ధుడు బంధనము నుండి విముక్తుడగును. గర్భవతి పుత్రుని బొందును. కన్య మంచి భర్తను బొందును. ఇహపరలోకముల రెండింటను నష్టపోయిన సమస్తమును బొందును-112. లక్ష గోవులను చక్కగా దానముచేసిన వాని ఫలము ఈ ప్రభువైన నీలకంఠుని దివ్య కథను విన్నవానికి లభించును-113. పావు భాగముగాని, సగభాగమునుగాని ఒక శ్లోకమునుగాని, శ్లోకసగభాగమునుగాని నిత్యము(పఠించి) ధరించువాడు రుద్రలోకమును జేరును-114. చంద్రశేఖరుడైన కుమారస్వామికి ప్రియుడైన ప్రభువైన శివుడు పుణ్యఫలములు మొదలగునవి గల యీ కథను దేవియైన పార్వతికి జెప్పి, పార్వతీదేవితో బాటు తన వాహనమైన వృషభము పై కిష్కింధగుహకు వెళ్ళెను-115. నా చేత దాటబడిన పాపహారమైన మహాపదమును(గొప్పస్థానమును) జెప్పి వారికి వాయువాస్థానము నిచ్చెను. తరువాత బ్రాహ్మణోత్తముడైన సూతుడు అఖిలసులక్షణములు గల సమస్తము అధ్యయనముతో బొంది సూర్య మార్గమును జేరెను.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున నీలకంఠస్తవమను ఏబది నాలుగవ యధ్యాయము.