వాయు మహా పురాణము
32 - యుగ ధర్మనిరూపణం
వాయురువాచ:-
అత ఊర్థ్వం ప్రవక్ష్యామి ప్రణవస్య వినిశ్చయమ్ ।
ఓంకారమక్షరం బ్రహ్మ త్రివర్ణం చాదితః స్మృతమ్॥
యోయో యస్య యథావర్ణో విహితో దేవతాస్తథా ।
ఋచో యజూంషి సామాని వాయురగ్నిస్తథా జలమ్॥
తస్మాత్తు అక్షరాదేవ పునరన్యే ప్రజజ్ఞిరే ।
చతుర్దశ మహాత్మానో దేవానాం యే తు దైవతాః ॥
తేషు సర్వగతశ్చైవ సర్వగః సర్వయోగవిత్ ।
అనుగ్రహాయ లోకానామాది మధ్యాన్త ఉచ్యతే॥
సప్తర్షయస్త థేంద్రా యే దేవాశ్చ పితృభిః సహ ।
అక్షరాన్నిః సృతాః సర్వే దేవదేవాన్మహేశ్వరాత్॥
వాయువు పలికెను:- ఆ పైన ప్రణవము (ఓంకారము) యొక్క నిశ్చయ స్వరూపమును జెప్పబోవు చున్నాను. ఓంకారము అక్షర రూపమై నశింపని బ్రహ్మము. మొదటి నుండియు అది మూడు వర్ణములు గలది అని చెప్పబడినది-1. ఏ యోంకారమునకు సంబంధించినదిగా యేయే వర్ణము ఎట్లు (జన్మించునదిగా) చెప్పబడినదో అట్లే దేవతలు, ఋక్కులు యజస్సులు, సామములు ఋగ్యజుస్సామ వేదముల మూడు) వాయువు, అగ్ని, జలము (అనుమూడు భూతములు)-2. ఆయక్షరమైన ఓంకారము నుండీయే పుట్టినవి. అట్లే మరికొందరు దేవతలకును దేవతలైన పదునాలుగురు మహాత్ములు గూడ బుట్టిరి-3. వారిలో నందరిలో నున్నవాడు తక్కినియంతట నున్నవాడు సమస్త యోగములను దెలిసినను యా మహాదేవుడు లోకముల ననుగ్రహించుటకై ఆదియైన వాడనియు, మధ్యయైనవాడనియు, అస్తమైనవాడనియు జెప్పబడుచున్నాడు-4. దేవదేవుడైన మహేశ్వరాత్మకమై నశింపని యా ఓంకారాక్షరము నుండి సప్తర్షులు, పితృదేవతలతో గూడిన దేవతలును బయలువెడలిరి.
ఇహాముత్ర హితార్థాయ వదన్తి పరమం పదమ్ ।
పూర్వమేవ మయోక్తస్తే కాలస్తు యుగసంజ్ఞిత: ॥
కృతం త్రేతా ద్వాపరం చ యుగాది: కలినా సహ ।
పరివర్తమానై స్తై రేవ భ్రమమా ణే షు చక్రవత్॥
ఇహ పరలోకముల హితము కొఱకే పరమ పదమును జెప్పుదురు. యుగముల పేరులతో గుర్తింపబడిన (పేరిడబడిన) కాలమునకు పూర్వమే నాతో చెప్పబడినది-6, చక్రమువలె తిరుగుచున్నవానియందు తిరుగుచుండు కృత-త్రేత-ద్వాపర కలియుగములచే కాలము గుర్తింపబడినది.
దేవతాస్తు తదోద్విగ్నా: కాలస్య వశమాగతాః ।
న శకువన్తి తన్మానం సంస్థాపయితు మాత్మనా॥
తదా తే వాగ్యతా భూత్వా ఆదౌ మన్వంతరస్య వై ।
ఋషయశ్చైవ దేవాశ్చ ఇంద్రశ్చైవ మహాతపాః ॥
సమాధాయ మనస్తీవ్రం సహస్ర పరివత్సరాన్ ।
ప్రసన్నాస్తే మహాదేవం భీతాః కాలస్య వై తదా॥
అయం హి కాలో దేవేశశ్చ తుర్మూర్తిశ్చతుర్ముఖః ।
కోఽస్యవిద్యన్మహాదేవ అగాథస్య మహేశ్వర ॥
అపుడు దేవతలు కాలమునకు వశులై భయము జేందిరి. తమతో కాలమును కొలువలేకపోయిరి-8. అపుడు మన్వంతరాదిలో వారు మౌనము వహించిరి. అపుడు కాలమునకు భయపడినవారై ఋషులు, దేవతలు, మహాతపస్వియైన యింద్రుడును-9, వేయి సంపూర్ణ సంవత్సరములు మనస్సును తీవ్రముగా సమాధిలోనుంచి మహాదేవుని శరణుబొందిరి-10. ఈ కొలుడు దేవేశుడు నాలుగు మూర్తులు (ఆకారములు) గలిగి నాలుగు ముఖములు గలవాడు. ఓ మహాదేవ! ఓ మహేశ్వర! లోతైన యీ కాలము నెవరు తెలియగలరు?
అథ దృష్ట్యా మహాదేవస్తం తు కాలం చతుర్ముఖమ్ ।
న భేతవ్యమితి ప్రాహ కో వః కామః ప్రదీయతామ్॥
ఆ తరువాత మహాదేవుడు ఆ నాలుగు ముఖములుగల కొలుని చూచేను. భయపడవలదనెను. మీ కోరిక యేమియో తీర్చబడుగాక- అనెను–12.
తత్కరిష్యామ్యహం సర్వం న వృధాఽయం పరిశ్రమః ।
ఉవాచ దేవో భగవాన్ స్వయం కాలః సుదుర్జయ: ॥
యదేతస్య ముఖం శ్వేతం చతుర్జిహ్వం హి లక్ష్యతే ।
ఏతత్కృతయుగం నామ తస్య కాలస్య వైముఖమ్॥
అసౌ దేవః సురశ్రేష్ఠో బ్రహ్మా వైవస్వతో ముఖః॥
యదేతద్రక్తవర్ణాభం తృతీయం వః స్మృతం మయా ।
త్రిజిహ్వం లేహానంత ఏతత్త్రేతాయుగం ద్విజా: ॥
అత్ర యజ్ఞప్రవృత్తిస్తు జాయతే హి మహేశ్వరాత్ ।
తతోఽత్ర ఇజ్యతే యజ్ఞే స్తిస్రోజిహ్వాస్త్ర యోఽగ్నయ:॥
ఇష్ట్యా చైవాగ్నయో విప్రాః కాలజిహ్వా ప్రవర్తతే ।
యదేతద్వై ముఖం భీమం ద్విజిహ్వం రక్తపింగలమ్॥
ద్వీపాదోఽత్ర భవిష్యామి ద్వాపరం నామ తద్యుగమ్॥
యదేతత్కృష్ణవర్ణాభం తురీయం రక్తలోచనమ్ ।
ఏకజిహ్వం పృథుశ్యామం తేలీహానం పునః పునః ॥
తతః కలియుగం ఘోరం సర్వలోక భయంకరమ్ ।
కల్పస్య తు ముఖం హ్యేతచ్చతుర్థం నామ భీషణమ్॥
న ముఖం నాపినిర్వాణం తస్మిన్భవతి వై యుగే ।
కాలగ్రస్తా ప్రజా చాపి యుగే తస్మిన్ భవిష్యతి॥
అదియంతయు చే(ముదును (నెరవేర్తును) ఈ పరిశ్రమ వ్యర్థముగాదు. భగవంతుడైన (మహా) దేవుడు అనెను. కాలుడు (కాలము) జయింప నలవికానివాడు-13. ఈతని ముఖము తెల్లనిదై నాలుగు నాలుకలు గలదియై కనబడును. కృతయుగమన్నది ఇది. ఇది ఆ కాలుని యొక్క ముఖము. (ప్రారంభము) ఈతడు దేవతా శ్రేష్ఠుడైన బ్రహ్మ, యముడు ముఖము-14. ఏదైతే నాచే ఎజ్జనీకాంతిగల మూడవదిగా ఓ ద్విజులారా! మీకు జెప్పబడినదో అది మూడు నాలుకలు గలిగి (పెదవులను) నాకుచున్నట్లుగా గనబడునది త్రేతాయుగము-15. ఇచట మహేశ్వరుని వలన యజ్ఞప్రవృత్తి జరుగును. అందువలన ఇచట యజ్ఞము నిర్వహింపబడును. మూడు నాలుకలు, మూడర్నులు ఓ బ్రాహ్మణులారా! అగ్నులు వేల్వబడి కాలజిహ్వ ప్రవర్తించును-16. ఈ భయంకరమై, రెండు నాలుకలుగలిగి, యెరుపుగోరోచనమువంటి రంగుగలిగిన ముఖమునందు రెండు పాదములు గలవాడనై నేనుందును. కావున నది ద్వాప(ద)రమనుయుగము-17. ఈ నల్లనై, యెఱ్ఱని కన్నులు గలిగి, ఒక నాలుక గలిగి, విశాలమై శ్యామమై మాట మాటికి పెదవుల నాకుకొనుచున్న-18, ముఖమునుండి ఘోరమై సర్వలోక భయంకరమైన కలియుగమేర్పడినది. ఈ కలియుగకల్పమునకు ఇది నాల్గవదియై భయంకరమైన ముఖము-19, ఆయుగమున ముఖము (ప్రారంభము) గాని అంతముగాని యుండదు. ఆయుగమున ప్రజ గూడ కాలగ్రస్తయగును-20.
బ్రహ్మకృతయుగే పూజ్య(స్తేతాయాం యజ్ఞ ఉచ్యతే ।
ద్వాపరే పూజ్యతే విష్ణురహం పూజ్యశ్చతుర్ష్వపి॥
బ్రహ్మవిష్ణుశ్చ యజ్ఞశ్చ కొలస్యైవ కలాస్త్రయః ।
సర్వే ష్వేవ హి కాలేషు చతుర్మూర్తి ర్మహేశ్వరః ।
అహం జనో జనయతో (వః) కాలఃకాల ప్రవర్తకః ।
యుగకర్తా తథా చైవ పరంపర పరాయణః॥
కృతయుగమున బ్రహ్మ పూజ్యుడు. త్రేతాయుగమున యజ్ఞము పూజ్యము, ద్వాపరయుగమున విష్ణువు పూజ్యుడు. నాలుగు యుగములలోను నేను పూజ్యుడను-21. బ్రహ్మ, విష్ణువు, యజ్ఞము ఇవి కాలము యొక్క మూడు కళలు. అన్ని కాలములయందును చతుర్మూర్తియై మహేశ్వరుడును-22. నేను జనుడను (జనించినవాడను) పుట్టించు వాడను, కాలస్వరూపుడను. కాలమును ప్రవర్తింప జేయువాడను. అట్లే యుగకర్తను. అన్నిటికంటే పరుడైన పరాత్పర స్వరూపుడను. అన్నిటికంటే నుత్కృష్ణులైన వారియందు సక్తుడను-23. .
తస్మాత్కలియుగం ప్రాప్య లోకానాం హితకారణాత్ ।
అభయార్థం చ దేవానాముభయోర్లోక యోరపి ॥
తదా భవ్యశ్చ పూజ్యశ్చ భవిష్యామి సురోత్తమాః ।
తస్మాద్భయం న కార్యం చ కలిం ప్రాప్య మహౌజస: ॥
ఏవముక్తాస్తతః సర్వదేవతా ఋషిభిః సహ।
ప్రణమ్య శిరసా దేవం పునరూచుర్జగత్పతిమ్॥
కావున ఓ సురోత్తములారా! కలియుగమునుబొంది లోకముల హితమును కారణముగాజేసికొని, దేవతల అభయము కొఱకు దేవమానవలోకముల రెంటిని-24. భవ్యుడను (శుభమైనవాడను) పూజింపదగినవాడను గూడనగుదును. ఓ మహాతేజోవంతులారా కలియుగమునుబొంది భయపడరాదు-25. ఈ విధముగా జెప్పబడిన యాదేవతలందరును ఋషులతో గూడి తలలు వంచి నమస్కరించి యా జగత్పతియైన మహాదేవునితో నిట్లనిరి-26.
దేవర్షయ ఊచ:-
మహాతేజా మహాకాయో మహావీర్యో మహాద్యుతిః ।
భీషణః సర్వభూతానాం కథం కాలశ్చతుర్ముఖః॥
దేవతలును ఋషులును అనిరి:- మహాతేజుడు మహాకాయుడు మహావీర్యు(బలు)డు మహాకాంతి మంతుడు సర్వభూతములకు భయంకరుడు అయిన కాలుడు (సమయము) నాలుగు ముఖములు గలవాడెట్లు?
మహాదేవ ఉవాచ:-
ఏష కాలశ్చతు ర్మూర్తిశ్చతుర్దంష్ట్ర శ్చతుర్ముఖః ।
లోకసంరక్షణార్థాయ అతిక్రామతి సర్వశః॥
నాఽసాధ్యం విద్యతే చాస్య సర్వస్మిన్ స చరాచరే ।
కాలః సృజతి భూతాని పునః సంహరతి క్రమాత్॥
సర్వే కాలస్య వశగాః న కాలః కస్యచిద్వశే ।
తస్మాత్తు సర్వభూతాని కాలః కలయతే సదా॥
మహాదేవుడనెను:- ఈ కాలస్వరూపుడు నాలుగాకారములు గలవాడు. నాలుగు కోరలు గలవాడు. నాలుగు ముఖములు గలవాడు. లోకసంరక్షణము కొఱకు అంతట సంచరించును-28. చరాచరమైన ప్రపంచ మందంతటను ఈతని కసాధ్యము లేదు. కాలము భూతములను సృజించును మరల క్రమముగా సంహరించును-29. అందరును కాలమునకు వశులై నడుచుకొందురు. కాలమెవ్వరి వశమున నుండదు. కావున నెల్లప్పుడు కాలము సమస్త భూతములను తమ తమ పనులలో బ్రవర్తింపజేయును-30.
విక్రమస్య పదాన్యస్య పూర్వోక్తాన్యేకసప్తతిః ।
తాని మన్వంతరాణీహ పరివృత్త యుగక్రమాత్॥
ఏకం పదం పరిక్రమ్య పదానామేకసప్తతిః ।
యదా కాలః ప్రక్రమతే తదా మన్వన్తరక్షయః॥
ఈతని వీరోచితమైన నడకలో పూర్వము చెప్పబడిన పదములు డెబ్బదియొక్కటి. కాలము నడచుచు గడచినప్పుడు మన్వంతరక్షయమగును-32.
ఏవ ముక్త్యా తు భగవాన్ దేవర్షి పితృదానవాన్ ।
నమస్కృతశ్చతైః సర్వై స్త త్రైవాంతరధీయత॥
ఏవం స కాలే భగవాన్ దేవర్షి పితృదానవాన్ ।
పునః పునః సంహరతే సృజతే చ పునః పునః॥
అతో మన్వంతరే చైవ దేవర్షి పితృదానవైః ।
పూజ్యతే భగవానీశో భయాత్కాలస్య తస్య వై॥
భగవంతుడీ విధముగా దేవర్షి పితృదానవులకు జెప్పి, వారందరిచే నమస్కరింపబడి యటచనే యంతర్థాన మందెను 33. ఈ విధముగా ఆ భగవంతుడు కాలమున దేవర్షి- పితృ-దానవులను మరల మరల సంహరించును. మరల మరల బుట్టించును-34. అందువలన మన్వంతరమున గూడ భగవంతుడైన యీశుడు కాలభయమున దేవర్షి-పితృ-దానవులచే పూజింపబడును-35.
తస్మాత్ సర్వప్రయత్నేన కలౌ కార్యాత్తపో ద్విజః ।
ప్రపన్నస్య మహాదేవం తస్య పుణ్యఫలం మహత్॥
తస్మాద్దేవాదివం గత్వా అవతీర్య చ భూతలే॥
ఋషయశ్చైవ దేవాశ్చ కలిం ప్రాప్య సుదారుణమ్ ।
తప ఇచ్ఛన్తి భూయిష్టం కర్తుం ధర్మపరాయణాః ।
అవతారాన్ కలిం ప్రాప్య కరోతి చ పునః పునః॥
కావున బ్రాహ్మణుడు అన్ని విధముల ప్రయత్నముతో మహాదేవునిగూర్చి తపము జేయవలె. మహాదేవుని శరణుబొందిన దానికి గొప్పపుణ్యఫలము లభించును. కావున దేవతలు స్వర్గమునకు వెళ్ళి భూతలమున దిగి-36, యా దేవతలును ఋషులును అతిభయంకరమైన కలిని బొంది ధర్మపరాయణులై మిక్కిలి తపము జేయగోరుదురు. కలినిబొంది మరల మరల అవతారములను జేయుదురు-37.
ఏవం కాలాన్తరే సర్వే యేఽతీతా వై సహస్రశః ।
వైవస్వతేఽన్తరే తస్మిన్ దేవరాజర్షయ స్తథా॥
దేవాపిః పౌరవో రాజా మనుశ్చక్ష్వాకు వంశజః ।
మహాయోగ బలోపేతాః కాలాన్తర ముపాసతే ॥
క్షీణే కలియుగే తస్మింస్తిష్యే త్రేతాయుగే కృతే ।
సప్తర్షిభిశ్చైవ సార్థం భావ్యే త్రేతాయుగే పున: ॥
గోత్రాణాం క్షత్రియాణాం చ భవిష్యాస్తే ప్రకీర్తితాః ॥
ద్వాపరాంతే ప్రతిష్ఠాంతే క్షత్రియా ఋషిభిః సహ ।
కృతే త్రేతాయుగే చైవ తథా క్షీణే చ ద్వాపరే॥
నరాః పాతకినో యే వై వర్తన్తే తౌ కలౌ స్మృతాః॥
ఈ విధముగా కాలాన్తరమున వేలకొలది గతించినవారందరు వైవస్వత మన్వంతరమున దేవర్పులు రాజర్షులును అగుదురు. ఆవిధముగనే-38, పురువంశరాజైన దేవాషియు, ఇక్ష్వాకువంశమునబుట్టిన మనువును మహాయోగబలముతో గూడిన వారై కాలాన్తరమును జేరియుండిరి-39. ఆ కలియుగము క్షీణింపగా, కలియుగము కృతయుగముగా జేయబడగా, మరల సప్తర్షులతోబాటు త్రేతాయుగము తప్పక రానుండగా, క్షత్రియవంశములకుజెందినవారు (మరల) రాగలవారుగా జెప్పబడిరి-40. (కృతవ్రేతల ప్రతిష్టాంతమైన ద్వాపరాన్తమునను ఋషులతోబాటు క్షత్రియులు రాగలరు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగమును గడచిపోగా కలియుగమున వారందరు పాతకులైన నరులుగానే యుందురని చెప్పబడినదీ-41.
మన్వన్తరాణాం సప్తానాం సంతానార్థాశ్రుతిః స్మృతిః ।
ఏవమేతేషు సర్వేషు యుగక్షయ క్రమస్తథా॥
పరస్పరం యుగానాం చ బ్రహ్మక్షత్రస్య చోద్భవః ।
యథా వై ప్రకృతిస్తేభ్యః ప్రవృత్తానాం యథాక్షయమ్ ॥
జామదగ్న్యేన రామేణ క్షత్రే నిరవశేషితే ।
క్రియన్తే కులటాః సర్వా క్షత్రియై ర్వసుధాధిపైః॥
దివంగతానహం తుభ్యం కీర్తయిష్యే నిబోధత॥
ఏడు మన్వన్తరముల యొక్క సంతానమే శ్రుతికి స్మృతికిని అర్థము. ఈ విధముగా నీ యందటియందును యుగము లక్ష యక్రమములుండును అట్లే-42. పరస్పరముగా యుగములలో బ్రహ్మక్షత్రియుల పుట్టుక జరుగును. క్షయము ననుసరించి వారినుండి ప్రవర్తిల్లిన ప్రకృతి (స్త్రీలు మొదలగువారి ప్రకృతి యెట్లుండునో తెలియును-43. జమదగ్ని పుత్రుడైన పరశురామునిచే క్షత్రము (జాతి) నిశ్శేషముగా వసుధాధిపులైన (రాజులైన) క్షత్రియులచేత (వారు చంపబడుటచేత) వారిస్త్రీలందరు కులటలు (వ్యభిచారిణులు)గా జేయబడిరి. ఆ విధముగా స్వర్గమునుబొందిన (చనిపోయిన) వారిని నేను మీకు జెప్పెదను వినుడు44.
ఐడమిక్ష్వాకు వంశస్య ప్రకృతిం పరిచక్షతే ।
రాజానః శ్రేణిబంధాత్తు తథాన్యే క్షత్రియా భువి॥
ఐడవంశఽథ సంభూతా యథాచేక్ష్వాకవో నృపాః ।
తేభ్య ఏవ శతం పూర్ణం కులానామభి షేచితమ్॥
తావదేవ తు భోజానాం విస్తరో ద్విగుణః స్మృతః ।
భోజం తు త్రిశతం క్షత్రం చతుర్థా తద్యథాదిశమ్॥
తేష్వతీతాస్తు రాజానో బ్రువతస్త్రాన్నిబోధత ।
శతం వై ప్రతివింధ్యానాః హైహయానాం తథా శతమ్॥
ధార్తరాష్ట్రాస్త్వేకశతం అశీతిర్జనమేజయాః ।
శతం వై బ్రహ్మదత్తానాం కులానాం వీర్యిణాం శతమ్॥
తతః శతం తు పౌలానాం శతం కాశికుశాదయః ।
తథాపరం సహస్రం తు యేఽతీతాః శశబిందవః ॥
ఇజానాస్తేఽశ్వ మేధైస్తుసర్వే నియుత దక్షిణైః॥
ఇక్ష్వాకు వంశమునకు ఐడుడను వానిని మూలముగా జెప్పుదురు. వరుస గట్టుట వలన భూలోకమున నితరక్షత్రియులు రాజులుగా నుండిరి-45. తరువాత ఐడుని వంశమున బుట్టినవారు ఇక్ష్వాకు రాజులు. వారి నుండి వచ్చిన వేవంద కులములు రాజ్యాభిషేకము జేయబడినవి-46. భోజులను రాజవంశములు గూడ వందరాజ్యము నందభి షేకింపబడినవి. వాని విస్తారము రెండింత లైనవి. భోజక్షత్రియ వంశము మూడు వందలైనవి. అది దిక్కులననుసరించి (వాని ప్రకారము) నాలుగు విధములైనవి 47. వారిలో గతించిన రాజులను జెప్పెద వినుడు. ప్రతి వింధ్యులకు సంబంధించినవారు వంద (గతించిరి) అట్లే హైహయులు వంద (గతించిరి)-48. ధృతరాష్ట్రునకు సంబంధించిన వారు నూట ఒక్కటీ (గతించిరి) జనమేజయులు ఎనుబది బ్రహ్మ దత్తలకు సంబంధించినవారు వంద. వీర్యవంతులైనవారికి సంబంధించిన కులములు వందయు గతించిరి-49. తరువాత పౌలులకు సంబంధించినవారు వంద, కాశీకుశాదులు (కాశీ-కుశదేశమునకు సంబంధించినవారు) వంద గతించిరి. అట్లే గతించిన శశబిందువులు వేయికి మించి యుండిరి. వారందరు లక్ష దక్షిణలతో గూడిన యశ్వమేధ యజ్ఞములు జేయు చుండిన వారే-50.
ఏవం సంక్షేపతః ప్రోక్తా న శక్యా విస్తరేణ తు ।
వక్తుం రాజర్షయః కృత్స్నా యేజ్తీతాస్తైర్యుగైః సహ॥
ఏతే యయాతి వంశస్య బభూవుర్వంశవర్ధనా ।
కీర్తితాద్యుతి మన్తస్తే యే లోకాన్ ధారయన్తి వై॥
లభంతే చ వరాన్ పంచ దుర్లభాన్ బ్రహ్మలౌకికాన్ ।
ఆయుః పుత్రా ధనం కీర్తిరైశ్వర్యం భూతిరేవ చ॥
ధారణచ్చ్రవ నాచ్చైవ పంచవర్గస్య ధీమతామ్ ।
తథోక్తా లౌకికాశ్చైవ బ్రహ్మలోకం వ్రజంతి వై॥
చత్వార్యాహుః సహస్రాణి వర్షాణాం చ కృతం యుగమ్ ।
తస్య తావచ్ఛతీ సంధ్యా సంధ్యాంశశ్చ తథావిధః॥
కృతే వై ప్రక్రియాపాద శ్చతుః సాహస్ర ఉచ్యతే ।
తస్మాచ్చతుః శతం సంధ్యా సంధ్యాంశశ్చ తథావిధ: ॥
త్రేతాదీని సహస్రాణి సంఖ్యయా మునిభిః సహ ।
తస్యాః త్రిశతీ సంధ్యా సంధ్యాంశస్త్రిశతః స్మృతః॥
అనుషంగ పాదస్త్రేతాయాసాహస్రస్తు సంఖ్యయా ।
ద్వాపరే ద్వే సహస్రేతు వర్షాణాం సంప్రకీర్తితమ్॥
తస్యాఽపి ద్విశతీ సంధ్యా సంధ్యాం శో ద్విశతస్తథా ।
ఉపోద్ఘాత స్తృతీయస్తు ద్వాపరే పాద ఉచ్యతే॥
కలిం వర్ష సహస్రం తు ప్రాహుః సంఖ్యావిదో జనాః ।
తస్యాఽపి శతికా సంధ్యా సంధ్యాంశః శతమేవ చ।
సంహారపాదః సంఖ్యాతశ్చతుర్థో వై కలౌ యుగే ।
స సంధ్యాని సహాంశాని చత్వారి తు యుగాని వై॥
ఏతద్ద్వాదశ సాహస్రం చతుర్యుగమితి స్మృతమ్ ।
ఏవం పాదైః సహస్రాణి శ్లోకానాం పంచ పంచ చ ॥
సంధ్యా సంధ్యాంశకై రేవ ద్వే సహస్రే తథాపరే।
ఏవం ద్వాదశ సాహస్రం పురాణం కవయో విదు: ॥
యథా వేదశ్చతుష్పాదః శ్చతుష్పాదం తథా యుగమ్ ।
యథాయుగం చతుష్పాదం విధాత్రా విహితం స్వయమ్ ।
చతుష్పాదం సురాణాం తు బ్రహ్మణా విహితం పురా॥
ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే యుగధర్మ నిరూపణం నామ ద్వాత్రింశోఽధ్యాయః ॥
ఈ విధముగ యుగములతో బాటు గతించిన రాజర్షులు సంక్షేపముగ జెప్పబడిరి. వారిని పూర్తిగా జెప్పుట సాధ్యము గాదు-51. వీరు యయాతి వంశవర్ధనులుగా నుండిరి లోకములను ధరించిన వీరుద్యుతి మంతులుగ కీర్తింపబడిరి-52. వీరు దుర్లభములై బ్రహ్మలోకమునకు సంబంధించిన యైదువరములు పొందిరి. అవి- ఆయువు, పుత్రులు, ధనము, కీర్తి ఈశ్వర సంబంధమైన భూతి (ఐశ్వర్యము)-53. ఈ పంచవర్గమును ధరించుట వల్లను, వినుట వల్లను బుద్ధిమంతులు బ్రహ్మ లౌకికులై బ్రహ్మలోకమును బొందుదురు-54. కృతయుగము నాలుగు వేలయేండ్లు. దానికి అన్ని వందలే (నాలుగువేలే) సంధ్యలు సంధ్యాంశమును గూడనారీతియే-55. కృతయుగమున ప్రక్రియాపాదము నాలువేలనబడినది, కావున నాలుగువందలు సంధ్యలు. సంధ్యాంశము గూడ నంతియే-56. త్రేతాదియుగములు ఏడు వేలయేండ్లు. దానికి గూడ మూడువందల సంధ్యలు. సంధ్యాంశములు గూడ మూడువందలు- అనబడినవి-57. త్రేతాయుగమున అనుషంగ పాదము మూడువేల యేండ్లు, ద్వాపరమున రెండువేల యేండ్లని చెప్పబడినవి-58. దానికి గూడ రెండువందలు సంధ్యలు, సంధ్యాంశములు గూడ రెండువందలే. ద్వాపరమున ఉపోద్ఘాతమనునది మూడువపాదమనబడును-59. సంఖ్యావేత్తలగు జనులు కలిని వేయి యేండ్లుగనే చెప్పుదురు. దానికిగూడ సంధ్యలు నూరు సంధ్యాంశములు గూడ నూరే-60. కలియుగమున సంహారపాదము నాలుగవదిగా జెప్పబడినది. సంధ్యలతోను సంధ్యాంశలతోను గూడినవి నాలుగు యుగములు-61. ఇది పండ్రెండు వేలయేండ్లుగలది నాలుగు యుగముల సమూహము అని చెప్పబడినది. ఈ విధముగ పాదములతో శ్లోకముల సంఖ్య ఐదు ఐదు వేలు-62. అట్లే సంధ్యా సంధ్యాంశకముల తోనే తక్కినవి రెండు వేలు. ఈవిధముగ కవులు పురాణమును పండ్రెండు వేలదిగా జెప్పుదురు-63. వేదము నాలుగు పాదములుగలదైనట్లే యుగముగూడ నాలుగు పాదములుగలది. యుగము నాలుగు పాదములు గలదిగా బ్రహ్మ స్వయముగా నిర్మించినట్లే దేవతలకు గూడ పూర్వము బ్రహ్మచే నాలుగుపాదములు గలదిగా యుగము చెప్పబడినది-64.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున యుగధర్మనిరూపణమను ముప్పది రెండవ అధ్యాయము.