వాయు మహా పురాణము
ఉపోద్ఘాత పాదము
ఇత్యేష ప్రథమః పాదః ప్రక్రియార్థః ప్రకీర్తితః ।
శ్రుత్వా తు సంహృష్టమనాః కాశ్యపేయస్సనాతనః ॥
సంబోధ్య సూతం వచసా పప్రచ్చాథోత్తరాం కథామ్ ।
అతః ప్రభృతి కల్పజ్ఞ ప్రతిసంధిం ప్రవక్ష్వ న: ॥
సమతీ తస్య కల్పస్య వర్తమానస్య చోభయోః ।
కల్పయోరంతరం యచ్చ ప్రతిసంధిర్యతస్తయోః ॥
ఏతద్వేదితు మిచ్ఛామః అత్యంత కుశలో హ్యసి ॥
ఇట్లు ప్రక్రియా అను మొదటి పాదము కీర్తింపబడినది. దానిని విని సంతోషముతో నిండిన మనస్సు గలవాడై, కాశ్యపేయ మహర్షి, సూతుని సంబోధించి, తరువాతి గాథను చెప్పుమని కోరెను. కల్పములను యెరింగిన ఓ మహర్షీ! మాకు ఇప్పుడు గడచిన కల్పమునకు, గడచుచున్న కల్పమునకు మధ్యగల కాలము (ప్రతిసంధి) ను గూర్చి చెప్పుము. మాకు ఈ ప్రతి సంధిని గూర్చి తెలియు కోరిక గలదు. నీవు దీనిని వర్ణించుటలో నిపుణుడవు.
లోమహర్షణ ఉవాచ :-
అత్ర వోఽహం ప్రవక్ష్యామి ప్రతిసంధిం చ యస్తయోః ।
సమతీ తస్య కల్పస్య వర్తమానస్య చోభయోః ॥
మన్వంతరాణి కల్పేషు యేషు యాని చ సువ్రతాః ।
యశ్చాయం వర్తతే కల్పోవారాహస్సాంప్రత శ్శుభ: ॥
అస్మాత్కల్పాచ్చయం కల్పం పూర్వోఽతీతస్సనాతనః ।
తస్య చాస్య చ కల్పస్య మధ్యావస్థాం నిబోధత ॥
లోమహర్షణుడిట్లు పలికెను:- ఈ యజ్ఞశాలలో మీకు నేను గడిచిన, గడుచుచున్న కల్పములకు మధ్య గల ప్రతిసంధిని వివరించెదను. మరియు, గొప్ప యజ్ఞమును చేయుచున్న ఓ ఋషులారా! ఏయే కల్పములలో ఏయే మన్వంతరములు గలవో చెప్పెదను. ప్రస్తుతము గడచుచున్న మంగళ ప్రదమగు వారాహ కల్పమును గురించి కూడా చెప్పెదను. ఈ కల్పమునకు పూర్వమందలి కల్పమును, దానికి దీనికి మధ్య గల కాలమును తెలియుడు.
ప్రత్యాహృతే పూర్వకల్పే ప్రతిసంధిం చ తత్రవై ।
అన్యః ప్రవర్తతే కల్పో జనాల్లోకాత్ పునః పునః ॥
వ్యుచ్చిన్నాత్ ప్రతిసంధేస్తు కల్పాత్ కల్పః పరస్పరమ్ ।
వ్యుచ్ఛిద్యంతే క్రియాస్సర్వాః కల్పాంతే సర్వశస్తదా ॥
తస్మాత్ కల్పాత్తు కల్పస్య ప్రతిసంధిర్నిగద్యతే ।
మన్వంతర యుగాఖ్యాన మప్యుచ్ఛిన్నాశ్చ సంధయ ॥
పరస్పరాః ప్రవర్తంతే మన్వంతరయుగైస్సహ ।
ఉక్తా యే ప్రక్రియార్థేన పూర్వకల్పా స్సమాసత: ॥
పూర్వకల్పము పూర్తికాగానే ప్రతిసంధి, మరియు తరువాతి కల్పము జనలోకము నుండి మరల మరల ప్రవర్తిల్లును. ఒక కల్పమునకు మరియొక కల్పముతో సంబంధమును కలిపేది కాలము, ప్రతి సంధి యనబడును. కల్పము పూర్తికాగానే సర్వకర్మలు అంతమగును. ఒక కల్పమునకు మరియేక కల్పముతో సంబంధమును కలిపే ప్రతి సంధియే గాక, మన్వంతరములకు, యుగములకు మధ్య కూడా సంధులు గలవు. వాటి యందు కూడా కర్మలు అంతమగును. ప్రక్రియా పాదములో సంగ్రహముగా చెప్పబడిన కల్పములు మన్వంతరములతో, యుగములతో కూడి ప్రవర్తిల్లు చుండును.
తేషాం పరార్ధ కల్పానాం పూర్వోహ్యస్మాత్తు యః పరః ।
ఆసీత్ కల్పో వ్యతీతో వై పరార్ధన పరస్తు సః ॥
అన్యా భవిష్యా యే కల్పా అపరార్ధాద్గుతే ద్విజా ॥
యస్మిన్ పూర్వపరార్ధే తు ద్వితీయే పర ఉచ్యతే ।
ఏతావాన్ స్థితికాలశ్చ ప్రత్యాహారస్తతః స్మృతః ॥
అస్మాత్ కల్పాత్తు యః పూర్వం కల్పోఽతీతస్సనాతనః ।
చతుర్యుగ సహస్రాంతే అహో మన్వంతరైః పురా ॥
బ్రహ్మగారి ఆయుర్దాయము పరము. దానిలో సగము పదార్ధము. మొదటి పదార్ధములోని అంతిమ కల్పము గడచినది. ఓ ద్విజులారా! ద్వితీయ పదార్దములోని మొదటి కల్పము ప్రస్తుతము నడచుచున్నది. మిగిలిన కల్పములు క్రమముగా రాగలవు. పూర్వ పదార్ధము, ద్వితీయ పదార్ధము కలిసి పరము అగును. ఇంత వరకు స్థితి కాలము. తరువాత ప్రలయము సంభవించును. వేయి మహాయుగములు, పదునాలు మన్వంతరములు కల పూర్వకల్పము గడచిపోయినది.