వాయు మహా పురాణము
49 - భువనవిన్యాసో
సూత ఉవాచ :-
ప్లక్షద్వీపం ప్రవక్ష్యామి యథావదివ(హ) సంగ్రహాత్ ।
శృణుతేమం యథాతత్త్వం బ్రువతో మే ద్విజోత్తమాః ॥
జంబూద్వీపస్య విస్తారాద్ద్వి గుణస్తస్య విస్తరః ।
విస్తారాత్త్రిగుణశ్చాస్య పరిణాహ స్సమస్తతః ॥
తత్ర పుణ్యా జనపదాశ్చిరాచ్చ మ్రియతే ప్రజా ।
కుత ఏవ హి దుర్భిక్షం జరావ్యాధి భయం కుతః ॥
తత్రాపి పర్వతాః శుభైః సప్తైవ మణిభూషణాః ।
రత్నాకరాస్తథా నసద్య స్తాసాం నామాని వచ్మి భోః ॥
ప్లక్షద్వీపాదిషు తేషు సప్తసప్తసు సప్తసు ।
ఋజ్వాయతాః ప్రతిదిశం నివిష్టాః సర్వతాః సదా ॥
సూతుడనెను:- ఓ బ్రాహ్మణోత్తములారా ప్లక్షద్వీపమును గూర్చి ఉన్నది యున్నట్లు సంగ్రహముగా జెప్పెద వినుడు. జంబుద్వీపవిస్తారమునకన్న దీని విస్తారము రెండింతలైనది. ఆ విస్తారమునకన్న మూడింతలు దీనియంతటి వైశాల్యము. అచటి గ్రామములు పుణ్యములు ప్రజలు చిరకాలమునకు జత్తురు. అట కరువు ఎక్కడిది (లేదు) ముదిమి యొక్కయు రోగముల యొక్కయు భయము ఎక్కడిది? (లేదు). అచట గూడ సముద్రములు, నదులు వాని పేర్లను చెప్పెద వినుడు. ప్లక్షద్వీపాదులైన వానిలో ప్రతియేడింటియందును పర్వతములు చక్కగా పొడవైనవై ప్రతిదిశలోను బ్రవేశించినవి.
ప్లక్షద్వీపే తు వక్ష్యామి సప్తద్వీపాన్ మహాచలాన్ ।
గోమేదకోఽత్ర ప్రథమః సర్వతో మేఘసన్నిభః ॥
ఖ్యాయతే తస్య నామ్నా వై వర్షం గోమేదకం తు తత్ ॥
ద్వితీయః పర్వతశ్చంద్రః సర్వౌషధి సమన్వితః ।
అశ్విభ్యామమృతస్యార్థే ఓషధ్యస్తత్ర సంస్థితాః ॥
తృతీయో నారదో నామ దుర్గశైలో మహోచ్ఛ్రయః ।
తత్రాచలే సముత్పన్నౌ పూర్వం నారద పర్వతౌ ॥
చతుర్థస్తత్ర వై శైలో దుందుభిర్నామ నామతః ।
శబ్దమృత్యుః పురా తస్మిన్ దుందుభిస్తాడితః సురైః ॥
పంచమః సోమకో నామ దేవైర్యత్రామృతం పురా ।
సంభృతం చ హృతం చైవ మాతురర్థే గరుత్మతా ॥
షష్ఠస్తు సుమనా నామ స ఏవర్షభ ఉచ్యతే ।
హిరణ్యాక్షో వరాహేణ తస్మిన్ శైలే నిషూదితః ॥
వైభ్రాజస్సప్తమస్తత్ర భ్రాజిష్ణుః స్ఫాటికో మహాన్ ।
యస్మాద్విభ్రాజతేఽర్చిర్భి ర్వైబ్రాజస్తేన సస్మృతః ॥
ప్లక్షద్వీపమునందలి సప్తద్వీపములను సప్తమహాచలములను గూడ జెప్పెద. ఇచట మొదటి పర్వతము గోమేదకము. అది మేఘముతో సమానమైనది. (రంగులో) ఆ వరము (దేశము) గూడ గోమేదకమను పేరనే పిలువబడుచున్నది. రెండవ పర్వతము చంద్ర పర్వతము. అది సమగ్రౌషధులతో గూడియున్నది. అశ్వినీ దేవతలచేత అమృతము కొరకై యచట ఓషధులుంచబడినవి. మూడవది నారదమను పర్వతము అది మహోన్నతమై పోనలవికానిది. ఆ పర్వతముననే పూర్వము నారదపర్వతులు బుట్టిరి. అచట నాల్గవ పర్వతము దుందుభియను - పేరు గలది. ఇచట శబ్ద మృత్యువైన దుందుభి రాక్షసుడు పూర్వము దేవతలచే చావగొట్టబడెను. ఐదవది సోమకమను పర్వతము ఇచట పూర్వము దేవతలచే అమృతము సంపాదింపబడినది. అది మాతృదాస్య విముక్తికై గరుడునిచే నపహరింపబడినది. ఆరవది సుమనాయను పర్వతము. అదియే ఋషభమని చెప్పబడినది. దీనియందు పూర్వము వరాహావతారమెత్తిన విష్ణువుచే హిరణ్యాక్షుడను రాక్షసుడు చంపబడెను. ఏడవ పర్వతము వైభ్రాజమనునది. అది బాగుగా ప్రకాశించునది స్ఫటికమణిమయమైన మహాపర్వతము. జ్వాలలచే నది విభ్రాజించినది. (ప్రకాశించినది) కావున వైభ్రాజమనబడినది.
తేషాం వర్షాణి వక్ష్యామి నామతస్తు యథాక్రమమ్ ।
గోమేదం ప్రథమం వర్షం నామ్నా శాంతభయం స్మృతమ్ ॥
చంద్రస్య శిఖరం నామ నారదస్య సుఖోదయమ్ ।
ఆనందం దుందుభేర్వర్షం సోమకస్య శివం స్మృతమ్ ॥
క్షౌమకం ఋషభస్యాపి వైభ్రాజస్య ధ్రువం తథా ॥
ఏతేషు దేవగంధర్వాః సిద్ధాశ్చ సహ చారణైః ।
విహరన్తి రమన్తే చ దృశ్యమానాస్తు తైః సహ ॥
తేషాం నద్యశ్చ సప్తైవ ప్రతివర్షం సముద్రగాః ।
నామతస్తాః ప్రవక్ష్యామి సప్తగంగా మహానదీ ॥
అభిగచ్ఛన్తి తా నద్యస్తాభ్యశ్చాన్యాః సహస్రశః ।
బహూదకాశ్చౌఘవత్యో యతో వర్షతి వాసవః ॥
తాః పిబన్తి సదా హృష్టా నదీర్జనపదా స్తు తే ।
శుభాః శాంతవహాశ్చైవ ప్రమోదా యే చ తే శివా ॥
ఆనందాశ్చ ధ్రువశ్చైవ క్షేమకశ్చ శివైః సహ ।
వర్ణాశ్రమాచారయుక్తా ప్రజాస్తేష్వథ సర్వశః ॥
సర్వేష్వరోగాః సుబలాః ప్రజాస్త్వామయవర్జితాః ।
అధఃసర్పిణీ న తేష్వస్తి తథై వోత్సర్పీణీ న చ ॥
న తత్రాస్తి యుగావస్థా చతుర్యుగకృతా క్వచిత్ ।
త్రేతాయుగసమః కాలః సర్వదా తత్ర వర్తతే ॥
ప్లక్షద్వీపాదిషు జ్ఞేయః పంచస్వేతేషు సర్వశః ।
దేశస్యానువిధానేన కాలస్యానువిధాః స్మృతాః ॥
పంచవర్షసహస్రాణి తేషు జీవన్తి మానవాః ।
సురూపాశ్చ సువేషాశ్చ అరోగా బలినస్తథా ॥
సుఖమాయుర్బలం రూపమారోగ్యం ధర్మ ఏవ చ ।
ప్లక్షద్వీపః పృథుః శ్రీమాన్ సర్వతో ధనధాన్యవాన్ ॥
దివ్యౌషధిఫలోపేతః సర్వౌషధి వనస్పతిః ॥
ఆవృతః పశుభిః సర్యైర్గ్రామారణ్యైః సహస్రశః ।
జంబూవృక్షేణ సంఖ్యాతస్తస్య మధ్యే ద్విజోత్తమాః ॥
ప్లక్షోనామ్నా మహావృక్షస్తస్య నామ్నా స ఉచ్యతే ॥
స తత్ర పూజ్యతే స్థాణుర్మధ్యే జనపదస్య హి ।
సచాపీక్షురసోద్దేశః ప్లక్షద్వీప సమావృతః ।
ప్లక్షద్వీపస్య చైవేహ వైపుల్యాద్విస్తరేణ తు ॥
ఇప్పుడు యథాక్రమముగా పేరులతో వానియొక్క వర్షములను (దేశములను) చెప్పెదను అందులో గోమేదము అన్నది మొదటి దేశము. అది భయము శమించిన దేశమనబడినది. చంద్రమునకు శిఖరమనునది దేశము నారద ద్వీపమునకు సుఖోదయము దేశము ఆనందమన్నది దుందుభియొక్క దేశము. సోమకమునకు శివమనునది దేశము. ఋషభమునకు క్షేమకమన్నది దేశము వైభాజమునకు ధ్రువమన్నది దేశము. ఈ దేశములందు దేవగంధర్వులు, చారణులతోడి సిద్ధులను విహరింతురు. వారితోగూడి కనబడుచున్నవారై క్రీడింతురు. వానియొక్క నదులు గూడ ప్రతీదేశమునకును ఏడే! అవి సముద్రమును జేరునని పేరున వాటిని సప్తగంగయైన మహానది అని చెప్పెద. ఆ నదులు ప్రవహించును వాటి నుండి వేల కొలది యితర నదులు ప్రవహించును. అవి బహూదకములు సమూహములు గలవి. ఇంద్రుడు వర్షించు వైపునకు బ్రవహించునవి. ఆ గ్రామములు మాత్రము సంతుష్టములై యెల్లప్పుడా నదీ జలములనే ద్రావుదురు. అవి (జనపదములు) శుభములు, శాంతవహములు, ప్రమోద్రములు, అవియే శివములు. ఆనందములు ధ్రువములు శ్రీవముతోగలపి క్షేమకములు (ఇందలి జనులు ఆ నదీజలముల ద్రోవుదురు) వీనియందలి ప్రజలంతటను వర్ణాశ్రమాచార ధర్మములు గలిగినవారు. ఈయన్నింటియందును ప్రజలు ఆరోగులు, సుబలులు, ఏయనారోగ్యములు లేనివారు. వారిలో అధోగతి లేదు అట్లే ఉద్గతియును లేదు. అచట ఎక్కడగూడ కృత త్రేతాది చతుర్యుగ కృతమైన యుగదశలేదు. ఎల్లప్పుడు త్రేతాయుగముతో సమానమైన కాలమే యుండును. ప్లక్షద్వీపము మొదలు ఈఐదు ద్వీపములలో నంతటను త్రేతాయుగమమగు కాలమే యుండును. దేశము యొక్క అనువిధానమును బట్టి కాలము యొక్క అనువిధులు గూడ నుండునని చెప్పుదురు. ఆ దేశములలో మానవులు సూరూపులై సువేషములు గలవారై, అరోగులై, బలవంతులై ఐదువేల యేండ్లు జీవింతురు. సుఖము, ఆయువు, బలము, రూపము, ఆరోగ్యము, ధర్మమును ప్లక్ష ద్వీపము మొదలు శాకద్వీపము వరకు చక్కగా వర్తిల్లును. ప్లక్షద్వీపము విశాలమైనది, శ్రీమంతము, అంతట ధనధాన్యములు గలది దివ్యౌషధి ఫలములతో గూడినది. సరౌషధి వనస్పతులు గలది. వేలకొలది పశువులచేతను, గ్రామముల చేతను, అరణ్యములచేతను జుట్టబడినది. ఓ బ్రాహ్మణోత్తములారా! ఆ ద్వీప మధ్యమున జంబూవృక్షముచే బిలువబడిన ప్లక్షమను (జువ్విచెట్టు) మహావృక్షము గలదు. కావున ఆ వృక్షము పేరనే ప్లక్షద్వీపమని పిలువబడినది. ఆ జనపదము యొక్క మధ్యన ఆ రుద్రుడు పూజింపబడును. అదియును చెఱకురసము గల ప్రదేశము. అది ప్లక్షద్వీపముచే చుట్టబడినది. ఇదియంతయు ప్లక్షద్వీపము యొక్క వైపుల్యము విస్తరముగా జెప్పబడినది.
ఇత్యేష సన్నివేశో వః ప్లక్షద్వీపస్య కీర్తితః ।
ఆనుపూర్వ్యా సమాసేన శాల్మలం తన్నిబోధత ॥
తతస్తృతీయం ద్వీపానాం శాల్మలం ద్వీపముత్తమ్ ।
శాల్మలేన సముద్రస్తు ద్వీపేనేక్షురసోదకః ॥
ప్లక్షద్వీపస్య విస్తారాద్ద్విగుణేన సమావృతః ॥
తత్రాపి పర్వతాః సప్త విజ్ఞేయా రత్నయోనయః ।
రత్నాకరాస్తథా నద్యస్తేషు వర్షేషు సప్తస్తు ॥
ప్రథమః సూర్యసంకాశం కుముదో నామ పర్వతః ।
సర్వధాతుమయైః శృంగై శిలాజాలసముద్గతైః ॥
ద్వితీయః పర్వతస్తప్య ఉన్నతో నామ విశ్రుతః ।
హరితాలమయై శృంగైర్దివ మావృత్య తిష్ఠతి ॥
తృతీయః పర్వతస్తస్య బలాహక ఇతి శ్రుతః ।
జాత్యంజనమయైః శృంగైర్దివమావృత్య తిష్ఠతి ॥
చతుర్థః సర్వతో ద్రోణో యత్రౌషధ్యో మహాబలాః ।
విశల్యకరణీచైవ మృతసంజీవనీ తథా ॥
కంకస్తు పంచమస్తత్ర పర్వతః సుమహోదయః ।
దివ్యపుష్ప ఫలోపేతో వృక్షవీరుత్సమావృతః ॥
షష్ఠస్తు పర్వతస్తత్ర మహిషో మేఘసన్నిభః ।
యస్మిన్ సోఽగ్నిర్నవసతి మహిషో నామ వారిజః ॥
సప్తమః పర్వతస్తత్ర కకుద్మానామ భాష్యతే ।
తత్ర రత్నాన్యనేకాని స్వయం వర్షతి వాసవః ॥
ప్రజాపతి ముపాదాయ ప్రాజాపత్యే విధిస్త్యయమ్ ॥
ఇత్యేతే పర్వతాః సప్త శాల్మలే మణిభూషితాః ।
తేషాం వర్షాణి వక్ష్యామి సప్తైవ తు శుభాని వై ॥
కుముదాత్ప్రథమం శ్వేతమున్నతస్య తు లోహితమ్ ॥
బలాహకస్య జీమూతం ద్రోణస్య హరితం స్మృతమ్ ।
కంకస్య వైద్యుతం నామ మహిషస్య తు మానసమ్ ॥
కకుదః సుప్రభం నామ సప్తైతాని తు సప్తధా ।
వర్షాణి పర్వతాంశ్చైవ నదీస్తేషు నిబోధత ॥
పాని(న)తోయా వితృష్ణా చ చంద్రా శుక్రా విమోచనీ ।
నివృత్తిః సప్తమీ తాసాం ప్రతివర్షం తు తాః స్మృతాః ॥
తాసాం సమీపగాశ్చాన్యాః శతశోఽథ సహస్రశః ।
అశక్యాః పరిసంఖ్యాతుం శ్రద్దేయాస్తు బుభూషతా ॥
ఇత్యేష సన్నివేశో వః శాల్మలస్యాపి కీర్తితః ।
ప్లక్షవృక్షేణ సంఖ్యాత స్తస్య నామ్నా స ఉచ్యతే ।
శాల్మలిస్తు సముద్రేణ సురోదేవ సమన్తతః ॥
అని, ఆను పూర్వితోను, సంగ్రహముగను ఈ ప్లక్ష ద్వీపము యొక్క సన్నివేశము చెప్పబడినది. శాల్మలద్వీపమునకు సంబంధించిన యాసన్నివేశమును వినుడు. తఱువాత ద్వీపమునకు సంబంధించిన యా సన్నివేశము వినుడు. తరువాత ద్వీపములలో మూడవదైన శాల్మల ద్వీపము ఉత్తమమైనది. శాల్మలద్వీపముతో సముద్రము చెఱుకు రసము జలముగా గలదైనది. ప్లక్ష ద్వీపమునకన్న రెండింతలైన విస్తారముతో జుట్టబడినది. అచట గూడ రత్నములు బుట్టు స్థానములై పర్వతములు గూడను ఏడేయని తెలియవలె. మొదటిది సూర్యునితో సమానమైన కుముదమను పర్వతము అన్నిధాతువులతో నిండి శిలాజలముల నుండి పైకి లేచిన శిఖరములతో నలంకరింపబడినది. దానియొక్క రెండవ పర్వతము ఉన్నతమని ప్రసిద్దిజెందినది. హరిదళము నిండిన శిఖరములతో నాకాశమునావరించి యున్నది. దానియొక్క మూడవ పర్వతము బలాహకమని ప్రసిద్ధమైనది. గాఢనీలమైన శిఖరములతో నాకాశమావరించి నిలచియున్నది. దాని నాలుగవ పర్వతము ద్రోణ పర్వతము. దానియందు మహాబలములైన యోషధులు గలవు. విశల్యకరణి (తీసివేయదగిన) ఎముకను దీసివేయు నోషధియు, అట్లే మృతసంజీవని (చచ్చినవానిని బ్రతికించునది) అగు ఓషధియు దానియందు గలవు. అచట కంకమన్నది ఐదవ పర్వతము. గొప్పయెత్తైనది. దివ్యపుష్పఫలములతో గూడినది. చెట్లతో తీగలతో జుట్టబడినది. అచట ఆరవ పర్వతము మహిషమను పేరుగలది. అది మేఘంవలె నల్లనైనది. అచట నీటబుట్టిన మహిషమను. నగ్ని గలదు. అట కకుద్మాక అను పర్వతము ఏడవదిగా జెప్పబడును. ఇటచ ఇంద్రుడు స్వయముగా ననేక రత్నములను వర్షించును. ప్రజాపతిని (బ్రహ్మను) దీసికొని వచ్చి ప్రాజాపత్య యాగమును జేయించును. అను ఈ ఏడు పర్వతములు శాల్మల ద్వీపమున మణులచే నలంకరిపంబడినవి. ఆ పర్వతములకున్న యేడు శుభములైన వర్షములను (దేశములను) చెప్పెదను. కుముద పర్వతము నుండి మొదటిది శ్వేతదేశము. 'ఉన్నతము'నకు లోహిత దేశము. బలాహకమునకు జీమూతదేశము ద్రోణమునకు హరితదేశము. కంకమునకు వైద్యుత దేశము. మహిషమునకు మానసదేశము. కకుద్మంతమునకు సుప్రభదేశము ఏడింటికి ఏడు దేశములు గలవు. వానిలో నదులను వినుడు. అచటి నదులు పాని(న) తోయా, వితృష్ణ, చంద్ర శక్ర, విమోచనీ, ఏడవది నివృత్తి అని ప్రతిదేశమునకు ఒకటిగా నదులు చెప్పబడినవి. ఆ నదులకు సమీపముగా బోవు ఇతర నదులు నూర్లు వేలును గలవు. వాని లెక్కింప నలవికాదు. అచట నుండ దలచినవాని చేత శ్రద్ధగా తెలిసికొనదగినవి. అని యది శాల్మల ద్వీపము యొక్క సన్నివేశముగూడ చెప్పబడినది. ప్లక్షవృక్షముతో సంఖ్యలో సమానముగా శాల్మలద్వీప మధ్యమున మహాశాల్మలి (బూరుగు) వృక్షము గలదు. అది విశాలమైన స్కంధములు గలది. ఆశాల్మలి వృక్షరాజలము సురాజలముతో గల సముద్రమునంతట జుట్టబడి ఆ సురాసముద్రము శాల్మలవృక్ష విస్తారమునకు అంతట సమముగా నున్నది.
ఉత్తరేషు తు ధర్మఙ్ఞా ద్వీపేషు శృణుత ప్రజాః ।
యథాశ్రుతం యథాన్యాయం బ్రువతో మే నిబోధత ॥
కుశద్వీపం ప్రవక్ష్యామి చతుర్థం తం సమాసతః ।
సురోదకః పరివృతః కుశద్వీపేన సర్వతః ॥
సప్తైవగిరయస్తత్ర వర్జ్యమానాన్ని బోధత ।
శాల్మలస్య తు విస్తారాద్ద్విగుణేన సమన్తతః ॥
కుశద్వీపే తు విజ్ఞేయః పర్వతో విద్రుమోచ్చయః ।
ద్వీపస్య ప్రథమస్తస్య ద్వితీయో హేమపర్వతః ॥
తృతీయో ద్యుతిమానాయ జీమూతసదృశో గిరిః ।
చతుర్థః పుష్పవాన్నామ పంచమస్తు కుశేశయః ॥
షష్ఠో హరిగిరి ర్నామ సప్తమో మందరః స్మృతః ।
మన్దా ఇతి హ్యపాం నామ మందరో దారణాదపామ్ ॥
తేషామంతర విష్కంభో ద్విగుణః పరివారితః ।
ఉద్భదం ప్రథమం వర్షం ద్వితీయం వేణుమండలమ్ ॥
తృతీయం స్వైరథాకారం చతుర్థం లవణం స్మృతమ్ ।
పంచమం ధృతిమద్వర్షం షష్ఠం వర్షం ప్రభాకరమ్ ॥
సప్తమం కపిలం నామ సప్తైతే వర్షపర్వతాః ॥
ఏతేషు దేవగంధర్వాః ప్రభాస్తు జగదీశ్వరాః ।
విహరన్తి రమనే చ దృశ్యమానాస్తు వర్షశ ॥
న తేషు దస్యవః సన్తి మేచ్చజాత్యస్త ధైవ చ ।
గౌరప్రాయో జనః సర్వః క్రమాచ్చ మ్రియతే తథా ॥
తత్రాపి నద్యః సప్తైవ ధుతపాపాః శివాస్తథా ।
పవిత్ర సంతతిశ్చైవ ద్యుతిగర్భామహీ తథా ॥
అన్యాస్తాభ్యః పరిజ్జాతాః శతశోఽథ సహస్రశః ।
అభిగచ్ఛన్తి తాః సర్వా యతూ వర్షతి వాసవః ॥
ఘృతోదేన కుశద్వీపో బాహ్యతః పరివారితః ।
విజ్ఞేయః సతు విస్తారాత్ కుశద్వీప సమేన తు ॥
ఇత్యేష సన్నివేశో వః కుశద్వీపస్య వర్ణితః ।
క్రౌంచద్వీపస్య విస్తారం వక్ష్యామ్యహమతః పరమ్ ॥
ఉత్తర ద్వీపములలో ప్రజలు ధర్మజ్ఞులు వినుడు. నేను విన్నట్లుగా న్యాయమును గుణముగా జెప్పెద వినుడు. నాలుగవదైన యాకుశ ద్వీపమును సంగ్రహముగా జెప్పెద వినుడు. కుశద్వీపము చేత సురాజలమంతట జుట్టబడినది అచట ఏడే పర్వతములు. వానిని వర్ణించెద వినుడు. శాల్మలద్వీపవిస్తారముకంటె నంతటను రెండింతలు గలదు. కుశద్వీపమున పగడముల యెత్తెన రాశిగానున్న పర్వతము కుశద్వీపము యొక్క మొదటి పర్వతము. రెండవది హేమ పర్వతము. మూడవది ద్యుతిమాన్ అను పర్వతము. అది మేఘమువంటి పర్వతము. నాలుగవది పుష్పవాన్ అను పర్వతము. ఐదవది కుశేశయమను పర్వతము, ఆరవది హరిగిరియన్నది ఏడవది మందరమనబడినది. మందా అనగా నీరు ఆ నీటిని జీల్చుటచే మందరమైనది. వానియొక్క లోపలి విరివి రెండింతలుగా జుట్టబడినది . మొదటి వర్షము (దేశము) ఉద్భిదమన్నది. రెండవది వేణు మండలము మూడవది స్యైరథాకారము. నాలుగవది లవణమనబడినది. ఐదవ దేశము ధృతిమాన్. ఆఱువది ప్రభాకరమను దేశము. ఏడవది కపిల మనునది. ఈ యేడును వర్షపర్వతములు. వీనిలో దేవ గంధర్వులు జగదీశ్వరులై కాంతిమయులై చూడబడుచు ప్రతిదేశక్రమమున విహరింతురు క్రీడింతురు. ఆ దేశములలో దొంగలు లేరు. అట్లే మేచ్చ జాతీయులు లేరు. జనమంతయు తెల్లని వర్ణముగలది. అట్లే ఒక క్రమమున జత్తురు. అచట గూడ నదులు ఏడే! అవి స్వేతర పాపముల గడిగివేసినవి. మంగళకరములైనవి. అచటి సంతతి పవిత్రమైనది. అట్లే భూమి కాంతి గర్బిత. ఆ నదుల నుండి బయలుదేరినవి నూర్లు వేలు, అవి యన్నియు ఇంద్రుడు వర్షించు చోట్లకు జేరును. కుశద్వీపము వెలుపల నేతి నీటితో జుట్టబడినది. ఆ ఘృతోదము విస్తారమున కుశద్వీపముతో సమానము. అనీ యిది కుశద్వీపము యొక్క సన్నివేశము వర్ణింపబడినది. ఆ తరువాత నేను క్రౌంచ ద్వీపముయొక్క విస్తారమును జెప్పెదను.
కుశద్వీపస్య విస్తారాత్ ద్విగుణః స తు వై స్మృతః ।
ఘృతోదక సముద్రా వై క్రౌంచద్వీపేన సంవృతః ॥
తస్మిన్ ద్వీపే నగశ్రేష్ఠః క్రౌంచస్థః ప్రథమో గిరిః ।
క్రౌంచాత్పరో వామనకో వామనాదంధకార కః ॥
అంధకారాత్పరశ్చాపి దివావృన్నామ పర్వతః ।
దివావృతః పరశ్చాపి దీవిందో గిరిచ్యతే ॥
గోవిందాత్పరతశ్చాపి పుండరీకో మహాగిరిః ।
పుండరీకాత్పరశ్చాపి ప్రోచ్యతే దుందుభిస్వనః ॥
ఏతే రత్నమయాః సప్త క్రౌంచద్వీపస్య పర్వతాః ।
బహువృక్షఫలోపేతా నానావృక్షలతావృతాః ॥
పరస్పరేణ ద్విగుణా విష్కంభాద్వర్ష పర్వతాః ।
వర్షాణి తత్ర వక్ష్యామి నామతస్తు నిబోధత ॥
క్రౌంచస్య కుశలీ దేశో వామనస్య మనోఽనుగః ।
మనోఽనుగాత్పర శ్చోష్ణస్తృతీయో దేశ ఉచ్యతే ॥
ఉష్ణాత్పరః ప్రావరకః ప్రావరాదంధకారకః ।
అంధకారకదేశాత్తు మునిదేశః పరః స్మతః ॥
మునిదేశాత్పరశ్చైవ ప్రోచ్యతే దుందుభిస్వనః ।
సిద్ధచారణ సంకీర్ణో గౌరప్రాయోజనః స్మృతః ॥
తత్రాపి నద్యః సప్తైవ ప్రతివర్షం స్మృతాః శుభాః ।
గౌరీకుముద్వతీ చైవ సంధ్యా రాత్రిర్మనోజవా ॥
ఖ్యాతిశ్చ పుండరీకా చ గంగా సప్తవిధా స్మృతా ॥
తాసాం సముద్రగాశ్చాన్యా నద్యో యాస్తు సమీపగాః ।
అనుగచ్ఛన్తి తాః సర్వా విపులాః సుబహూధకాః ॥
క్రౌంచద్వీపః సముద్రేణ దధిమండోదకేన తు ।
ఆవృతంః సర్వతః శ్రీమాన్ క్రౌంచద్వీప సమేన తు ॥
ప్లక్షద్వీపాదయో హ్యేతే సమాసేన ప్రకీర్తితాః ।
తేషాం నిసర్గో ద్వీపానామానుపూర్వేణ సర్వశః ॥
న శక్యం విస్తరాద్వక్తుమపి వర్షశతైరపి ।
నిసర్గోఽ యం ప్రజానాం తు సంహారో యశ్చ తాసు వై ॥
ఆ క్రౌంచ ద్వీపము కుశద్వీప విస్తారమునకన్న రెండింతలనబడినది. నేతి జల సముద్రము క్రౌంచ ద్వీపముతో జుట్టబడినది. ఆ ద్వీపమున శ్రేష్ఠపర్వతమైన మొదటి పర్వతము క్రౌంచస్థము. క్రౌంచమునకు పరమైనది వామనకము. వామముకన్న పరమైనది అంధకారకము. అంధకారమునకన్న పరమైనది దివావృత్ అనునది. దీవావృత్తుకన్న పరమైనది గోవిందగిరి. గోవిందమునకన్న పరమైనది పుండరీకమను మహాగిరి. పుండరీకమునకన్న దుందుభిస్వనము. ఈ రత్నమయములైన యేడు క్రౌంచ ద్వీపము యొక్క పర్వతములు బహువృక్షఫలములతో గూడినవి. అనేక వృక్షఫలములతో జుట్టబడినవి. వర్ష పర్వతము విష్కంభము నుండి యొండొరుల రెండింతలైనవి. అచట దేశముల పేర్లతో జెప్పెద వినుడు. క్రౌంచమునకు కుశలియనుదేశము, వామనమునకు మనోగమను దేశము, మనోనుగమున కంటే పరమైనదేశము ఉష్ణదేశము. ఇది మూడవ దేశమనబడినది. ఉష్ణమునకన్నపరమైనది ప్రావరకము, ప్రావరముకన్న పరము అంధకారకము. అంధకారక దేశమునకన్న పరమైనది. మునిదేశమనబడినది. మునిదేశమునకన్న పరమైనది దుందుభి స్వనమనబడినది. సిద్దచారణులతో సంకీర్ణమైన యచటి జనముసామాన్యముగ వర్ణముగలది. అచట గూడ త్రిదేశమున నదులు శుభములై ఏడే. యనబడినవి. గౌరీ, కుముద్వతి, సంధ్య రాత్రి, మనోజవో, ఖ్యాతి, పుండరీక అను గంగ ఏడు విధములనబడినది. వానిలో సమీపముగా బోవునపై సముద్రమున జేరు నదులు వేరుగానున్నవి. అవి యన్నియు విశాలములై బహుజలములు గలవై తోడుగా బోవును. క్రౌంచ ద్వీపము పెరుగు మీగడవంటి జలసు గలిగి క్రౌంచ ద్వీపసమముగానున్న సముద్రముచేత ఆ శ్రీమంతమగు క్రౌంచ పర్వతము చుట్టబడినది. ప్లక్షద్వీపము మొదలగు నీ ద్వీపములు సంగ్రహముగా జెప్పబడినవి. ఆ ద్వీపములయొక్క స్వభావముగూడ మొదటి నుండియు వరుసగా మొత్తవ గా జెప్పబడినది. ఇచటి ప్రజల సృష్టిసంహారములు వివరముగా నూరేండ్లలో గూడ జెప్పనలవిగానివి.
అత ఊర్థం ప్రవక్ష్యామి శాకద్వీపస్య యో విధిః ।
శాకద్వీపస్య కృత్స్నస్య యథావదిహ నిశ్చయాత్ ॥
శృణుధ్వవై యథా తత్తం బ్రువతో మే యథార్థవత్ ॥
క్రౌంచద్వీపస్య విస్తారాద్ద్విగుణస్తస్య విస్తరః ।
పరివార్య సముద్రం స దధిమండోదకం స్థితః ॥
తత్ర పుణ్యాజనపదా శ్చిరాచ్చ మ్రియతే జనః ।
కుత ఏవ తు దుర్భిక్షం జరావ్యాధిభయం కుతః ॥
తత్రాపి పర్వతాః శుభ్రాః సప్తైవమణి భూషితాః ।
రత్నాకరాస్తథా నద్యస్తాసాం నామాని మే శృణు ॥
దేవర్షి గంధర్వయుతః ప్రథమో మేరురుచ్యతే ।
ప్రాగాయతః ససౌవర్ణ ఉదయోనామ పర్వతః ॥
తత్ర మేఘాస్తు వృష్ట్యర్థం ప్రభవన్తి చ యాన్తి చ ।
తస్యాపరేణ సుమహాన్ జలధారో మహాగిరిః ॥
తస్మాన్నిత్యముపాదత్తే వాసవః పరమం జలమ్ ।
తతో వర్షం ప్రభవతి వర్షకాలే ప్రజాస్విహ ॥
తస్యాపరే రైవతకో యత్ర నిత్యం ప్రతిష్ఠితా ।
రేవతీదేవి నక్షత్రం పితామహకృతో గిరిః ॥
తస్యాపరేణ సుమహన్ శ్యామో నామ మహాగిరిః ।
తస్మాత్ శ్యామత్వమాపన్నా ప్రజాఃపూర్వమిమాః కిల ॥
తస్యాపరేణ రజతో మహానస్తోగిరిః స్మృతః ।
తస్యాపరేణాంబికేయో దుర్గః శైలో హిమాచితః ॥
ఆంబికేయాత్పరో రమ్యః సర్వౌషధిసమన్వితః ।
స చైవకేశరీత్యుక్తా యతో వాయుః ప్రవాయతి ॥
శృణుధ్వం నామ తస్తాని యథావదనుపూర్వశః ।
ఉదయస్యోదయం వర్షం జలదం నామ విశ్రుతమ్ ॥
ద్వితీయం జలధారస్య సుకుమారమితి స్మృతమ్ ।
రైవతస్యలు కౌమారం శ్యామస్య తు మణీచకమ్ ॥
అస్తస్యాపి శుభం వర్షం విజ్ఞేయం కుసుమోత్తరమ్ ।
ఆంబికేయస్య మోదకం కేసరేషు మహాద్రుమమ్ ॥
ద్వీపస్య పరిమాణం చ హ్రస్వదీర్ఘత్వమేవ చ ।
శాకద్వీపేన విఖ్యాతస్తస్య మధ్యే వనస్పతిః ॥
శాకో నామ మహావృక్ష స్తస్య పూజాం ప్రయుంజతే ॥
ఏతేన దేవగంధర్వాః సిద్ధాశ్చ సహచారణైః ।
విహరన్తి రమనే చ దృశ్యమానాశ్చ తైః సహ ॥
తత్ర పుణ్యా జనపదా శ్చాతుర్వర్ణ సమన్వితాః ।
తేషు నద్యశ్చ సప్తైవ ప్రతివర్షం సముద్రగాః ॥
విద్ధి నామశ్చ తాః సర్వాగంగాస్తాః సప్తధా స్మృతాః ॥
ప్రథమాసు కుమారీతి గంగా శివజలా తథా ।
అనుతప్తాచ నామ్నైవనదీ సంపరికీర్తితా ॥
కుమారీ నామతః సిద్ధా ద్వితీయా సా పునః సతీ ।
నందా చ పార్వతీ చైవ తృతీయా పరికీర్తితా ॥
శివేతికా చతుర్థి స్యాత్ త్రిదివా చ పుణః స్మృతా ।
ఇక్షుశ్చ పంచమో జ్ఞేయా తథైవ చ పునః క్రతు ॥
ధేనుకా చ మృతా చైవ షష్ఠీ సంపరికీర్తితా ।
ఏతాః సప్త మహాగంగాః ప్రతివర్షం శివోదకాః ॥
భావ యన్తి జనం సర్వం శాకద్వీప నివాసినమ్ ।
అనుగచ్ఛన్తి తాస్త్వన్యా నదీర్సద్యః సహస్రశః ॥
బహూదక పరిస్రావా యతో వర్థతి వాసవః ।
తాసాం తు నామధేయాని పరిమాణం తధైవ చ ॥
న శక్యం పరిసంఖ్యాతుం పుణ్యాస్తాః సరిదుత్తమాః ।
తాః పిబంతి సదా హృష్టా నదీర్జనపదాస్తు తే ॥
శంశపాయన విస్తీర్ణో ద్వీపో సా చక్ర సంస్థితః ।
నదీజలైః ప్రతిచ్ఛన్నః పర్వతైశ్చాభసన్నీభైః ॥
సర్వధాతువిచిత్రైశ్చ మణివిద్రుమభూషితైః ।
పురైశ్చ వివిధాకారై స్ఫీతైర్జనపదైరపి ॥
వృక్షైః పుష్పఫలో పేతైః సమన్తాత్ ధనధాన్యవాన్ ।
క్షీరోదేన సముద్రేణ పర్వతః పరివారితః
శాకద్వీపస్తు విస్తారాత్ సమేన తు సమన్తతః ॥
తస్మిన్ జనపదాః పుణ్యాః పర్వతాన్తరితే శుభాః ।
వర్ణాశ్రమసమాకీర్ణా దేశాస్తే సప్త వై స్మృతాః ॥
న సంకరశ్చ తేష్వస్తి వర్ణాశ్రమకృతం క్వచిత్ ।
ధర్యస్యచావ్యభీచారాదేకాన్తసుఖితాః ప్రజాః ॥
న తేషు లోభో మాయా వా ఈర్ష్యాసూయాఽధృతిః కుతః ।
విపర్యయో న తేషస్తి ఏతత్ స్వాభావికం స్మృతమ్ ॥
కరోత్పత్తిర్నజేష్వస్తి న దండో న చ దండకాః ।
స్వధర్మేణైవ ధర్మజ్ఞా స్తే రక్షన్తి పరస్పరమ్ ॥
ఏతావదేవ శక్యం వై తస్మిన్ ద్వీపే నివాసినామ్ ।
పుష్కరం సప్తమం ద్వీపం ప్రవక్ష్యామి నిబోధత ॥
ఆ తరువాత శాకద్వీపమున్న విధానమును జెప్పెదను. మొత్తము శాక ద్వీపమున్నదియున్నట్లు జెప్పెదను దాని యథార్థతత్యమును నిశ్చయముగా జెప్పెద నా నుండి వినుడు. దాని విస్తారము క్రౌంచ ద్వీపము విస్తారమునకన్న రెండింతలు పెరుగు మీగడ వంటి నీరు గల సముద్రమును జుట్టి యది యున్నది. అచటి జనపదములు గ్రామములు పుణ్యములు జనులు చాల కాలము జీవించి మరణింతురు. అచట కరువెక్కిడిది? రోగ భయమెక్కడిది?. అచట గూడ పర్వతములు ఏడే! అవి శుభ్రములు మణులచే నలంకరింపబడినవి. అట్లే సముద్రములును నదులును గలవు. వాని నామములను వినుడు. అందులో మొదటిది దేవర్షులతోను గంధర్వులతోను కూడినదై మేరువని చెప్పబడుచున్నది. తూర్పునకు పొడవై బంగారు వర్ణము గల యది ఉదయమను పర్వతము, అచట మేఘములు వర్షము కొరకై పుట్టును. పోవును, దానికి పైగా గొప్పనై జలధారమను మహాగిరి కలదు. దాని నుండి యింద్రుడు ఉత్తమమైన జలమును స్వీకరించును. తరువాత వర్షకాలమున ప్రజలకు ఇచట వర్షము కలుగును. దానికి పైగా రైవతకమను పర్వతముగలదు. అచట రేవతీదేవి యను నక్షత్రము నిత్యము ప్రతిష్ఠితమైయున్నది. ఆ గిరి బ్రహ్మచే జేయబడినది. దానికి పైగా గొప్పవైన శ్యామమను మహాపర్వతము గలదు. పూర్వమీ ప్రజలు దానివల్లనే నలుపుదనమును బొందిరట. దానికి పైగా ఆంబికేయమను పర్వతము గలదు. అదీ మంచుచేగప్పబడి దుర్గమై (పోనలవికాని) శైలము. ఆంబికేయ పర్వతమునకు పైగా రమ్యమై సర్వేషధులతో గూడిన కేశరియను పర్వతముగలదు. దానినుండి వాయువు వీచును. ఇక యథా పూర్వకముగా వాని దేశ నామములను వినుడు. ఉదయపర్వతమునకు ఉదయదేశము జలదమని ప్రసిద్ధిగాంచినది. రెండవ జలధారపర్వతమునకు సుకుమను రెండవదేశము చెప్పబడినది. రైవతకమునకు కౌమారదేశము శ్యామపర్వతమునకు మణీచకమనుదేశము. అస్తపర్వతమునకు శుభమను దేశము పూవులతో మిక్కిలి యెత్తైనది. ఆంబికేయపర్వతమునకు మోదాక మనుదేశము. కేశరములలో మహాద్రుమమను దేశము. ద్వీపము యొక్క పరిమాణము శాకద్వీపముతో సమానముగా పొట్టపొడుగులుండును. దానియొక్క మధ్యన శాకమను మహావృక్షము గలదు. అచట జనులు దానికి పూజలు చేయుదురు. దీనితోనే దేవగంధర్వులు చారణులతోడి సిద్ధులును విహరింతురు. వారితో సహచూడబడుచున్న వారై క్రీడింతురు. అచట పుణ్యములైన జనపదములు (గ్రామ నగరములు) చతుర్వర్ణములతో గూడి యుందురు. వానిలో గూడ నదులు ఏడే! ప్రతివరము (ఏడు) సముద్రమును జేరునవి. వాని నామముల దెలియుము. అవి యన్నియు గంగలే ఏడుగా జెప్పబడినవి. మొదటిది సుకుమారీయనునది. ఇది గంగ, శ్రీవజల, అనుతప్త, అను పేర్లతోనున్న నదిగా బిలువబడినది. కుమారియను పేరుగల గంగరెండవది. అది మరల సతి (యనబడినది) నంద అనియు పార్వతియనియు పేరు గలది మూడవదిగా జెప్పబడినది. శివేతికయనునది నాల్గవది. అది త్రిదివాయని కూడ అనబడినది. ‘ఇక్షు’ అనునది యైదవది. అది మరల క్రతువనబడినది. ధేనుకయని మృతయని ఆరవ (ఏడవ) గంగ(లో) చెప్పబడినవి. ఇవి యేడు మహాగంగలు. శివములైన (మంగళములైన) జలములు గలవి. ఇవి శాక ద్వీపనివాసులైన జనమును అందరిని సేవించును. ఆ నదులనువేరైన వేలకొలది నదులు అనుసరించును. ఇంద్రుడు వర్షించినవైపున నెక్కువ జలముతో స్రవించును. దాని పేర్లను పరిమాణములను పరిగణించి చెప్పుటకు సాధ్యముగాదు. అవి నదీ శ్రేష్ఠములు ఆ జనపదములు (తద్వాసులు) సంతుష్టులై యా నదులనే (జలములనే) ద్రాగుదురు ఓ శంశపాయన! ఈ ద్వీపము విస్తీర్ణము చక్రమునందున్నది. నదీ జలములచే గప్పబడినది. మేఘములవంటివియు. సమస్తధాతువులచే చిత్రములైనవియు, మణులచేతను పగడములచేతను అలంకరింపబడినవియు నైన పర్వతములచే గప్పబడినది. అనేకాకారములు గలవియు, విశాలములైనవియునైన జనపదములచేతను అంతట ఫలములతోగూడిన వృక్షములచేతను ఆ పర్వతము ధనధాన్యవంతమైనది. పాలవంటి జలములు గల సముద్రముచేతనంతటను జుట్టబడినది. శాకద్వీపము విస్తారమువలన సమానముగా పై వానిచే నంతటను జుట్టబడినది. పర్వతాంతరాళమైన యా ద్వీపమున జనపదములు పుణ్యములు, శుభములు, వర్ణాశ్రమముల నిండిన యా దేశములు ఏడుగానే జెప్పబడినవి. జనులలో వర్ణాశ్రమములవల్ల వచ్చిన సాంకర్యమెక్కడను గూడ లేదు. ధర్మమునకు వ్యభిచారము (విరోధ ప్రవృత్తి) లేనందున ప్రజలు దుఃఖము లేశములేని సుఖములననుభవించిరి. వారిలో లోభముగాని, మాయగాని లేదు. ఈర్ష్యా, అసూయ, అధైర్యము ఇవెక్కడివి? (లేవు) వారిలో విపర్యయము ధర్మాది వ్యతిరేకముగా (బోవుట) లేదు. అది వారిలో స్వాభావికముగా దలపబడినది. వారికి పన్నులవేత లేదు. శిక్షగాని శిక్షించువాడు గాని లేరు. ధర్మజ్ఞులైన యాజనులు తమ ధర్మముచేతనే యొండొరుల రక్షించుచుండిరి. ఆ ద్వీపమున నుండు వారికి సంబంధించినదింత మాత్రమే చెప్పసాధ్యము ఏడవదైన పుష్కర మును గూర్చి చెప్పెద వినుడు.
పుష్కరేణ తు ద్వీపేన వృతః క్షీరోదకో బహిః ।
శాకద్వీపస్య విస్తారాద్ద్విగుణేన సమన్తతః ॥
పుష్కరే పర్వతః శ్రీమానేక ఏవ మహాశిలః ।
చిత్రే మణిమయైః శీతైః శిఖరైస్తు సముచ్ఛ్రితైః ॥
ద్వీపస్య తస్య పూర్వార్ధే చిత్రసానుః స్థితో మహాన్ ।
పరిమండల సహస్రాణి విస్తీర్ణం పంచవింశతిః ॥
ఊర్థ్వం చైవ చతుస్త్రింశత్సహస్రాణి సమాచితః ।
ద్వీపార్ధస్య పరిస్తోమః పర్వతో మానసోత్తమః ॥
స్థితో వేలా సమీపే తు నవచంద్ర ఇవోదితః ।
యోజనానాం సహస్రాణి ఉర్థ్యం పంచాశదుచ్ఛ్రిత ॥
తావదేవ సవిస్తీర్ణం పర్వతః పరిమండలః ।
స ఏవం ద్వీపపశ్చార్ధే మానసః పరిమండలః ॥
ఏకేవ మహాసానుః సన్నివేశాబ్ద్విధా కృతః ।
స్వాదూదకేనోదధినా సర్వతః పరివారితః ।
పుష్కరద్వీపవిస్తారా ద్విస్తీర్ణోఽసౌ సమన్తతః ॥
తస్మిన్ ద్వీపే స్మృతా ద్వౌ తు పుణ్యే జనపదౌ శుభౌ ।
అభితో మాన స్యాథ పర్వతస్యాను మండలౌ ॥
మహావీతం తు యద్వర్ణం బాహ్యతో మానసస్య తత్ ।
తస్యైవాభ్యంతరే యత్తు ధాతకీఖండముచ్యతే ॥
దశవర్ష సహస్రాణి తత్ర జీవన్తి మానవాః ।
ఆరోగ్యసుఖభూయిష్ఠా మానసీం సిద్ధిమాస్థితా ॥
సమమాయుశ్చ రూపం చ తస్మిన్ వర్షద్వయే స్థితమ్ ।
అధమోత్తమౌ న తేష్వాస్తాం తుల్యాస్తే రూపశీలతః ॥
న తత్ర వంచకో నేర్ష్యా నస్తేనా న భయం తథా ।
నిగ్రహో న చ దండోఽస్తి న లోభో న పరిగ్రహః ॥
సత్యానృతం న తత్రాస్తి ధర్మాధర్మౌత థైవ చ ।
వర్ణాశ్రమాణాం వార్తా వా పాశుపాల్యం వణిక్రియా ॥
త్రయీవిద్యా దండనీతిః శుశ్రూషా శల్యమేవ చ ।
వర్షద్వయే సర్వమేతత్ పుష్కరస్య న విద్యతే ॥
న తత్ర నద్యో వర్షం చ శీతోష్ణం వా న విద్యతే ।
ఉద్భిజ్జా న్యుదకాన్యత్ర గిరి ప్రస్రవణాని చ ॥
ఉత్తరాణాం కురూణాం చ తుల్యకాలో జనః సదా ।
సర్వత్ర సుసుఖస్తత్ర జరాక్లమ వివర్జితః ॥
ఇత్యేష ధాతకీఖండో మహావీతే తథైవ చ ।
ఆనుపూర్వ్వాద్విధిః కృత్స్నః పుష్కరస్య ప్రకీర్తితః ॥
స్వాదూదకేనోదధినా పుష్కరః పరివారితః ।
విస్తరాన్మండలాచ్చైవ పుష్కరస్య తథైవ చ ॥
పుష్కర ద్వీపముతో వెలుపల క్షీరోదక సముద్రము చుట్టబడినది. అది శాకద్వీప విస్తారమున కన్ననంతటను రెండింతలు. పుష్కరద్వీపమున శ్రీమంతమైన పర్వతము ఒకటే. అది మహాశిలామయము. మణిమయములైన శిలలచేతను ఉన్నతములైన శిఖరములచేతను, చిత్రమైన యా ద్వీపముయొక్క పూర్వార్థమున ఒక గొప్ప చిత్రసానువు గలదు. (చిత్రమైన చరియ కలదు) ఇరువదియైదు పరిమండల (అంతట గుండ్రని తనము) సహస్రముల విస్తీర్ణము. ముప్పదినాలుగు వేల (పరిమండలముల) యెత్తుగలదై యా పర్వతమేర్పడినది. ద్వీపసగభాగమునకు ఆ పర్వతము ఏనుగకు గపు బొంతవలె నున్నది. అది మానసోత్తమము. అది సముద్రవేలా సమీపమున నుదయించిన నూతన చంద్రునివలే నున్నది. ఏబదియైదు వేల యోజనముల పైకి యెత్తుగా వ్యాపించినది. అంతే అంతట గుండ్రని తనముతో విశాలమైనది. ఇట్లు ద్వీపముయొక్క పడమటి సగభాగమున మానసమను పర్వతము గలదు. ఒకే మహాసానువు (చరీయ) అచట నుండుటచే రెండుగా జేయబడినది. తీయని నీరుగల సముద్రముచే నంతట చుట్టబడినది. పుష్కర ద్వీపవిస్తారము వలన నిది (పర్వతము) యంతటను వ్యాపించినది. ఆ ద్వీపమున రెండు శుభములైన జనపదములు గలవు. అవి మానస పర్వతముచుట్టును అనుసరించిన మండలాకారములైయున్నవి. మానస పర్వతముయొక్క వెలుపలగనబడు వర్ణము మహావీతము. (మహావీతము?) దానియొక్క లోపలిది ధాతకీ ఖండమనబడును. ధాతకీ కుసుమఖండము) (అరెమ్రాకు). అచట మానవులు పదివేలయేండ్లు జీవింతురు. ఆరోగ్య సుఖములతో నిండినవారై మానసీ సిద్ధిని పొందియుందురు. ఆ రెండు దేశములలోను ఆయువు రూపము సమానములు. వారిలో అధమోత్తములు లేరు. రూపశీలములో వారు సమానులు. అచట మోసగాడు లేడు. ఈర్ష్య లేదు. దొంగలు లేరు. భయము లేదు. రాజ నిర్బంధము లేదు. దండము లేదు. లోభము లేదు. దానము తీసికొనుట లేదు. అచట సత్య- అనృతములు లేవు. అట్లే ధర్మాధర్మములు లేవు. వర్ణాశ్రమముల వార్త (ఉనికి) లేదు. పశుపాలన వృత్తియు వైశ్యవృత్తియు లేవు. ధర్మాధర్మములు తెలియజేయు త్రయీ విద్య, నయానయములు తెలియజేయు దండనీతివిద్య, సేవనము, బాణవిద్య (వైద్యములోని ఎముకలను గూర్చిన విద్య), ఇవి యన్నియు పుష్కరద్వీపమునందలి రెండు దేశములలో లేవు. అచట నదులు, వర్షము, శీతోష్ణములును లేవు. భూమిని భేదించుకొని పుట్టు వృక్షలతాదులు, జలములు కొండ సెలయేరులును లేవు. జనమెల్లప్పుడు ఉత్తరకురు దేశవాసులకు సమానమైన కాలముగలవారు. అచట అంతట మంచి సుఖము గలవారు, ముసలితనము అలసటయు (శ్రమయు) లేనివారు. అని యిది మహావీతమున ధాతకీ ఖండము. మొత్తము పుష్కరము యొక్క విధానము ఆనుపూర్వీతో చక్కగా జెప్పబడినది. పుష్కర ద్వీపము తీయని జలముగల సముద్రముచే చుట్టబడినది. పుష్కర ద్వీపము యొక్క విస్తారము నుండియు మండలము నుండియునట్లే తీపి సముద్రముచే జుట్టబడినది.
ఏవం ద్వీపాః సముద్రైస్తు సప్త సప్తభిరావృతాః ।
ద్వీపస్యానంతరో యస్తు సముద్రస్తు సమన్ తతః ॥
ఏవం ద్వీపసముద్రాణాం వృద్ధిర్జ్ఞేయా పరస్పరాత్ ।
అపాం చైవ సముద్రేకాత్ సముద్రో ఇతి సంజ్ఞితాః ॥
ఋషయో నివసన్ త్య స్మిన్ ప్రజాయస్మాచ్చతుర్విధాః ।
తస్మాద్వర్ష మితిప్రోక్తం ప్రజానాం సుఖదం తు తత్ ॥
ఋష ఇత్యేవ ఋషయః వృషః శక్తి ప్రబంధనే ।
ఇతి ప్రబంధనాత్ సిద్ధం వర్షత్వం తేన తేషు తత్ ॥
శుక్లపక్షే చంద్రవృద్ధౌ సముద్రః పూర్యతే తదా ।
ప్రక్షీయమాణే బహులేఽక్షీయతేఽ స్తమితే ఖగే ॥
అపూర్యమాణే ఉదధిః స్వతఏవాభిపూర్వతే ।
తతోఽ పక్షీయమాణేఽపి స్వాత్మనైవాపకృష్యతే ॥
ఉఖాస్థమగ్నిసంయోగాత్ జలముద్రిచ్యతే యథా ।
తథా మహోదధిగతం తోయ ముద్రిచ్యతే తతః ॥
అన్యూనాహ్యతి రిక్తాశ్చ వర్థన్త్యాపో హ్రసన్తి చ ।
ఉదయాస్తమితైశ్చందోః పక్షయోః శుక్లకృష్ణయోః ॥
క్షయవృద్ధిరేవముదధేః సోమవృద్ది క్షయాత్పునః ॥
దశోత్తరాణి పంచైవ అంగులీనాం శతాని తు ।
అపాం వృద్ధిక్షయోదృష్టః సముద్రాణాం తు పర్వసు ॥
ద్విరాషత్వాత్ స్మృతా ద్వీపాః సర్వతశ్చోదకా వృతాః ।
ఉదకస్యాధానం యస్మాచ్చ తస్మాదుదధిరుచ్యతే ॥
అపర్వాణస్తగిరయః పర్వభిః పర్వతాః స్మృతాః ।
ప్లక్షద్వీపే తు గోమేధః పర్వత స్తేన చోచ్యతే ॥
శాల్మలిః శాల్మలద్వీపే పూజ్యతే చ మహాద్రుమః ।
కుశద్వీపే కుశస్తంభస్తస్య నామ్నా స ఉచ్యతే ॥
క్రౌంచద్వీపే గిరిః క్రౌంచో మధ్యే జనపదస్య హ ।
శాకద్వీపే ద్రుమః శాకః స్తస్య నామ్నా స ఉచ్యతే ॥
న్యగ్రోధః పుష్కరద్వీపే తత్ర తైః సనమస్కృతః ।
మహాదేవః పుష్కరే తు బ్రహ్మా త్రిభువనేశ్వరః ॥
తస్మిన్నివసతి బ్రహ్మా సాధ్యైః సార్ధం ప్రజాపతిః ।
ఉపాసతే తత్ర దేవాః స్త్రయస్త్రింశన్మ హర్షిభిః ॥
స తత్ర పూజ్యతే చైవ దేవైర్దేవోత్తమోత్తమః ॥
ఈ విధముగ ద్వీపములు ఏడేడు సముద్రములచే జుట్టబడినవి. ద్వీపమునకుఎడములేని సముద్రమంతట నుండును. ఈ విధముగ బండారులవలన ద్వీప సముద్రముల వృద్ధిని తెలియజేయవలెను. నీటియొక్క సముద్రేకమువలన సముద్రములని పిలువబడినవి. దీనియందు ఋషులు నివసింతురు. ఏ కారణమున ప్రజలు నాలుగు విధములో ఆ కారణమున వర్షమని చెప్పబడినది. ఆ వర్షము ప్రలజకు సుఖమునిచ్చునది. ఋషమంటేనే ఋషులు. వృషధాతువు శక్తి ప్రబంధమను నర్థమున ప్రయోగించబడును. ఈ విధముగ (మానవాదులను) ప్రబంధించుట వలన దేశమునకు వరత్వము సిద్ధించినది. దానివలన ఆ దేశములందు వరత్వము సిద్ధించినది. శుక్ల పక్షమున చంద్రుడు వృద్ధిజెందునపుడు సముద్రము నింపబడును. (ఉప్పొత్తము) బహుల పక్షమున చంద్రుడు క్షీణించునపుడును అస్తమించినపుడును (సూర్యునిలో గలిసి యగుపించనపుడు) సముద్రము క్షీణించును. సముద్రమున నింపబడుచున్నపుడు తనంతట తానే నింపబడును. తరువాత క్షీణించునపుడు తనంతట తానే క్షీణించును. వంట కుండలోని జలము అగ్ని సంయోగమున ఉద్రేకమునందినట్లు (మసలి యుప్పొంగునట్లు) మహాసముద్రములోని జలము గూడ (చంద్రకాంతికి) ఉద్రేకము జెందును (ఉప్పొంగును). శుక్ల కృష్ణపక్షములలో (పూర్లిమామావాస్యలలో చంద్రుని యొక్క యుదయాస్తమయములచేత సముద్రజలము తగ్గకుండను హెచ్చకుండను ఉప్పొంగును. చల్లారును. (సముద్రపు ఆటుపోటులలో సముద్రజలముల హెచ్చుతగ్గులు లేకయే పొంగి చల్లారును). ఈ విధముగ చంద్రుని వృద్ది క్షయముల వలన సముద్రము యొక్క వృద్ధి క్షయములేర్పడును. పూర్లిమామావాస్య పర్వములందు సముద్రజలముల యొక్క వృద్ది క్షయములు ఐదువందల పది (510) అంగుళములుగా కనుగొనబడినది. రెండు వైపుల జలములున్నవి గాన ద్వీపములైనవి. అంతట జలములచే జుట్టబడినవి గూడ ద్వీపములనబడును. ఉదకము యొక్కయునికి యున్నందున ఉదధియనబడినది. పర్వములు (కణుపులు) లేనివి గిరులు. పర్వములున్నవి పర్వతములు. ప్లక్షద్వీపమున గోమేదము పర్వములు గలది గాన పర్వతమనబడినది. శాల్మలద్వీపమున శాల్మలియను (బూరుగ) మహావృక్షము పూజింపబడును. గాన నా నామముచే నా ద్వీపము: పిలువబడినది. క్రౌంచద్వీపమున జనపదమధ్యమున క్రౌంచగిరియున్నందున క్రౌంచద్వీపమయినది. శాకద్వీపమున శాకమను వృక్షము గలదు. గాన శాకద్వీపమనబడినది. పుష్కరద్వీపమున మఱ్ఱిచెట్టు మహావృక్షముగ నచటివారిచే పూజింపబడినది. ఆ పుష్కర ద్వీపమున మహాదేవుడయి ముల్లోకములకీశ్వరుడైన బ్రహ్మయుండును. ప్రజాపతియైన బ్రహ్మ తన సాధ్య దేవతలతో గూడియుండును. అచట దేవతలు ముప్పదిముగ్గురైన మహర్షులతోగూడి బ్రహ్మనుపాసింతురు. దేవోత్తమోత్తముడైన యా బ్రహ్మయచట దేవతలచేత పూజింపబడును.
జంబూద్వీపాత్ప్రవర్తన్తే రత్నాని వివిధాని చ ।
ద్వీపేషు తేషు సర్వేషు ప్రజానాం హి క్రమాస్త్యిహ ॥
సర్వశో బ్రహ్మచర్యేణ సత్యేన చ దమేన చ ।
ఆరోగ్యాయుః ప్రమాణాద్ధి ద్విగుణం చ సమంతతః ॥
ఏతస్మిన్ పుష్కరద్వీపే యదుక్తం వర్షకద్వయమ్ ।
గోపాయతి ప్రజాస్తత్ర స్వయం సజ్జనమండితాః ॥
ఈశ్వరో దండముద్యమ్య బ్రహ్మా త్రిభునేశ్వరః ।
సవిష్ణుః సశివో దేవః సపితా సపితామహః ॥
భోజనం చాప్రయత్నేన తత్ర స్వయముపస్థితమ్ ।
షడ్రసం సుమహావీర్యం భుంజతే చ ప్రజాః సదా ॥
జంబూద్వీపము నుండి యనేకవిధములైన రత్నములు బయలు దేరును. ఆ ద్వీపములన్నిటియందును ప్రజల యొక్క క్రమములిట జెప్పబడుచున్నవి. అంతటను బ్రహ్మచర్యముతోను, సత్యముతోను దమముతోను ప్రజలుందురు. ఆరోగ్యము ఆయుః ప్రమాణములంతటను రెండింతలు. ఈ పుష్కరద్వీపమున రెండు దేశములున్నవి వానిని నచటి సజ్జనాలంకృతులైన ప్రజలను. ఈశ్వరుడు దండమునెత్తి రక్షించును. త్రిభువనములకీశ్వరుడైన బ్రహ్మయు రక్షించును. విష్ణువుతో గూడియు, శివునితో గూడియునున్న యా దేవుడై బ్రహ్మ వారికి తండ్రి. ప్రయత్నము లేకయే వచ్చినదియు, షడ్రసములు గలదై మహాబలమైన భోజనమునచటి ప్రజలెల్లప్పుడు భుజింతురు.
పరేణ పుష్కరస్యాథ ఆవృత్యాయః స్థితో మహాన్ ।
స్వాదూదకం సముద్రస్తు సమన్తాత్పరివేష్ఠితః ॥
పరేణ తస్య మహత్ దృశ్యతే లోకసంస్థితిః ।
కాంచనీ ద్విగుణా భూమిః సర్వా చైకశిలోపమా ॥
తస్మాత్పరేణ శైలస్తు మర్యాదస్తే తు మండలమ్ ।
ప్రకాశశ్చాప్రకాశశ్చ లోకాలోకః స ఉచ్యతే ॥
ఆలోకస్తస్య చార్వాకు నిరాలోకస్తతః పరమ్ ।
యోజనానాం సహస్రాని దశతస్యోచ్ఛ్రయః స్మృతః ॥
తావాంశ్చ విస్తరస్తస్య పృథివ్యాం కామగశ్చ సః ।
ఆలోకే లోకశబ్దస్తు నిరాలోకేఽ సలోకతా ॥
లోకార్థం సమ్మతో లోకో నిరాలోకస్తు బాహ్యతః ॥
లోకవిస్తారమాత్రం తు ఆలోకః సర్వతో బహిః ।
పరిచ్ఛిన్నం సమన్తాచ్చ ఉదకేనావృతశ్చ సః ॥
నిరాలోకాత్పరశ్చాపి అండమావృత్య తిష్ఠతి ॥
అండస్త్యాన్ తస్త్వి మే లోకాః సప్తద్వీపా చ మేదినీ ।
భూర్లోకోఽథ భువర్లోకం స్వర్లోకోఽథ మహస్తథా ॥
జనస్త పస్తథా సత్యఏతావాన్ లోకసంగ్రహః ।
ఏతావానేవ విజ్ఞేయో లోకాన్త శ్చైవ తత్పరః ॥
కుంభస్థాయీ భవేద్యాదృక్ ప్రతీచ్యాం దిశి చంద్రమాః ।
ఆదితః శుక్లపక్షస్య వుపురండస్య తద్విధమ్ ॥
అండానామీదృశానాం తు య కోట్యో జ్ఞేజేయాః సహస్రశః ।
తిర్యగూర్థ్వమధస్తాచ్చ కారణస్యావ్యయాత్మనః ॥
కారణోః ప్రాకృతైస్తత్ర హ్యావృతం ప్రతిసప్తభిః ॥
దశాధిక్యేన చాన్యోన్యం ధారయన్తి పరస్పరమ్ ।
పరస్పరావృతాః సర్వే ఉత్పన్నాశ్చ పరస్పరాత్ ॥
అండస్యా స్య సమన్తాత్తు సన్ని విష్టో ఘనోదధిః ।
సమన్తాద్యేన తోయేన ధార్యమాణః స తిష్ఠతి॥
తరువాత పుష్కరద్వీపమునకు పైగా నావరించియున్న మహాసముద్రము కలదు. అది తీయని నీరు గలది. అంతట జుట్టి యున్నది. దానికి పైన గొప్పలోక స్థితి కలదు. అచటి భూమి బంగాపుదై రెండింతలైనది. భూమియంతయు నేక శిలవలె నుండును. దాడికంటె పైన పర్వతము దాని పొలిమేర చివర నొక మండలమును గలవు. ఆ పర్వతము ప్రకాశమును (కాంతిమంతమై కనబడునదియు) ఆ ప్రకాశమును (కాంతిలేక కనబడనిదియు) పైలోకాలోక పర్వతమను పేర జెప్పబడును. ఆ పర్వతము క్రిందివైపున వెలుగు, దానికి చీకటియు నుండును. దానియెత్తు పదివేల యోజనములనబడినది. అంతీయ (పదివేల యోజనములె) దాని విస్తారము. అది భూమి పైన నిష్టము వచ్చినట్లు పోవునది కూడను. ఆ లోకమున కనబడునది యను నర్థముగల లోక శబ్దమున్నది. నిరాలోకమున కనబడువారితో కూడనిదియను నర్థమునిచ్చు అసలోకత యున్నది (ఆలోకమనగా కనబడునది నిరాకమనగా కనబడనిది) చూడబడు జనముగల మానవాదిలోకము కొరకై అంతఃకాంతిగలలోకము (పర్వతము) సమ్మతమైనది. నిరాలోకమన్నదో కనబడని (కాంతిలేని) విధముగా బహిర్బాగమున చీకటిగల అదే పర్వతము (అలోక పర్వతము)గా సమ్మతమైనది. (లోకాలోక పర్వతము అంతర్భాగమున సూర్యకిరణములచే బ్రకాశించుననియు బహిర్భాగమున చీకటితో నుండుననియు గురు బాల ప్రబోధికయను అమరకోశవ్యాఖ్యాత చెప్పినాడు). లోక పర్వతపు సమస్త విస్తారము (అంతర్భాగము) వెలుగు నిండినది. వెలుపలనంతటను పరిచ్చిన్నమై యది (పర్వతము) నీటితో నావరింపబడియున్నది. అది నిరాలోకము (వెలుగులేనిది) ఆ వెలుగలేని అలోక పర్వతమునకు పై భాగమున ఒక అండమావరించియున్నది. ఆ యండము లోపల నీలోకములును, ఏడుద్వీపములు గల భూమియు గలదు. లోకములు భూర్లోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనోలోకము తపోలోకము, సత్యలోకము అనునవి సంగ్రహముగా నేడు దాని పైన లోకాన్తము గూడనింతయని తెలియవలె, శుక్లపక్షము మొదటి నుండి పడమటి దిశలో కుంభమున నున్న చంద్రునివలే నాగుడ్డు శరీరము తెల్లగా నుండెను. సృష్టికారణభూతుడైన అవ్యయాత్ముని నుండి (బ్రహ్మ నుండి) వచ్చిన యిటువంటి యండములు అడ్డముగను, ఊర్ధ్వ భాగమునను అధోభాగమునను వేల కోట్లు గలవు. అచట ఏడు ప్రాకృత కారణములచేత నది యావరింపబడినది. పరీకన్నమించియే యనియు, ఒకటి నుండి యొకటి పుట్టినవై ఒకటి నొకటి చుట్టినవై ఒండొరుల ధరించుచున్నవి. ఈ యండమంతటను గొప్ప సముద్రము ప్రవేశించినది. ఆ సముద్ర జలముచే ధరింపబడుచున్నదై నిలచి యున్నది.
బాహ్యతో ఘనతో యస్య తిర్యగూర్థ్వాను మండలమ్ ।
ధార్యమాణం సమన్తాత్తు తిష్ఠతే ఘనతేజసా ॥
అయోగుడనిభో వహ్నిః సమస్తాన్మండలాకృతిః ।
సమన్తద్ఘనవాతేన ధార్యమాణః స తిష్ఠతి ॥
భూతాదిశ్చ తథాకాశం భూద్యంచావ్యసౌ మహాన్ ।
మహాన్ వ్యాప్తోహ్యనన్తేన అవ్యక్తేన తు ధార్యతే ॥
అనంతమపరివ్యక్తం దశధా సూక్ష్మ ఏవ చ ।
అనన్తమకృతాత్మానమనాది నిధనం చ తత్ ॥
అతీత్య పరతో ఘోరమనాలంబమనామయమ్ ।
నైకయోజన సాహస్రం విప్రకృష్టం తమోవృతమ్ ॥
తమ ఏవ నిరాలోకమమర్యాదమ దేశికమ్ ।
దేవానామప్యవిదితం వ్యవహార వివర్జితమ్ ॥
ఘనజలముయొక్క వెలుపల, అడ్డముగను నిలువునను నున్న మండలములకనుగుణముగా నంతటను, ఘనతేజస్సుచే ధరింపబడుచు అది నిలిచియున్నది. ఇనుము, బెల్లములవలే నున్న యగ్ని అంతటను మండలాకారమును దాల్చినదై యంతటను ఘనహాయువుచే ధరింపబడుచున్నదై యది (అండము) నిలచియున్నది. పంచభూతములలో నాదియైనది యాకాశము. పంచభూతములకాదియైనది మహాన్ ఈ మహాన్ అననమైన యవ్యక్తముచే వ్యాపింపబడినదై ధరింపబడుచున్నది. ఈ యనంతమైన యపరివ్యక్తము (అవ్యక్తము) పది విధములై సూక్ష్మమైనది. అంతములేనిది, ఆత్మనిగ్రహము గలది, చాపుపుట్టుకలు లేనిది. ఆపైన మించి, భయంకరమైనదియు, ఆధారములేనిదియు, అరోగమైనదియు, అనేక సహస్ర యోజనముల యెడముగలిగినదై చీకటితో నావరింపబడినదియు. అయిన చీకటియే నిరాలోకము (వెలుగు లేమితనము) అది పొలిమేరలు లేనిది, దేశవిభాగము లేనిది, దేవతలకు గూడ తెలియనిది, ఏ వ్యవహారములు లేనిది.
తమసోఽన్తే చ విఖ్యాత మాకాశాన్తే చ భాస్వరమ్ ।
మర్యాదాయామతస్తస్య శివస్యాయతనం మహత్ ॥
త్రిదశానామగమ్యం తు స్థానం దివ్యమితి శ్రుతిః ।
మహతో దేవదేవస్య మర్యాదాయాం వ్యవస్థితమ్ ॥
చంద్రాదిత్యావతత్తేస్తు యే లోకాః ప్రథితా బుధైః ।
తే లోకా ఇత్యభిహితా జగతశ్చ న సంశయః ॥
రసాతలతలాత్ సప్త సప్తైవోర్ద్వతలాః క్షితౌ ।
సప్తస్కంధాస్తథా వాయోః సబ్రహ్మసదనాద్విజాః ॥
ఆపాతాలాద్దివం యావదత్రపంచవిధా గతిః ।
ప్రమాణమేతజ్జగత ఏష సంసార సాగరః ॥
చీకటి చివరను ఆకాశము చివరను సమ్మాన్యమై ప్రసిద్దమై ప్రకాశించునొక గొప్ప శివాలయము గలదు. ఆ దివ్య స్థానము దేవతలకు గూడ పోనలవిగానిది అని వేదము (వినికిడి) అది మహాదేవుని యొక్క మర్యాదలో స్థాపింపబడినది. చంద్రసూర్యులచే తపింపబడినవిగానే లోకములు ప్రసిద్ధిజెందినవో నివి జగత్తుయొక్క లోకములుగా జెప్పబడినవి. సంశయము లేదు. పాతాళ ప్రదేశమునుండియు నట్లే భూమి పై నుండియు వాయువునకు ఏడేడు స్కంధములు (అంతరములు) గలవు. ఓ ద్వీజులారా! అవి బ్రహ్మ నివాసములతో గూడినవి. పాతాళమునుండి స్వర్గమువరకు ఐదువిధముల మార్గము గలదు. ఇది జగత్తు యొక్క ప్రమాణము. ఇది సంసార సాగరము.
అనాద్యన్తా ప్రయత్యేవం నైకజాతి సముద్భవాః(వా) ।
విచిత్రా జగతః సా వై ప్రవృత్తిరసవస్థితా ॥
యథైతద్బౌతికం నామ నిసర్గబహువిస్తరమ్ ।
అతీంద్రియైర్మహాభాగైః సిద్దైరపి న లక్ష్యతే ॥
పృథివ్యాం చాగ్ని వాయూనాం మహతస్తమస స్తథా ।
ఈశ్వరస్య తు దేవస్య అనన్తస్యద్విజోత్తమాః ॥
క్షయో వా పరిమాణం వా అన్తోవాపి న విద్యతే ।
అనన్త ఏష సర్వత్ర సర్వస్థానేషు పఠ్యతే ।
తస్య చోక్తం మయా పూర్వం తస్మిన్నామాను కీర్తనే ॥
య ఏష శివనామ్నా హి తద్వః కార్త్న్యేన కీర్తితమ్ ।
స ఏష సర్వత్ర గతః సర్వస్థానేషు పూజ్యతే ॥
భూమౌ రసాతలే చైవ ఆకాశే పవనేఽనలే ।
అర్ణవేషు చ సర్వేషు దివి చైవ న సంశయః ॥
తథా తపసి విజ్ఞేయ ఏషవ మహాద్యుతిః ।
అనేకథా విభక్తాంగో మహాయోగీ మహేశ్వరః ॥
సర్వలోకేషు లోకేశ ఇజ్యతే బహుధా ప్రభుః ॥
ఈ విధముగా జగత్తు యొక్క ప్రవృత్తి ఆద్యన్తములు లేనిదై యనేక జాతులు పుట్టునట్టిదై నడచును. అది విచిత్రమైన ఒకచోట నిలచునదిగా నుండదు. ఈ భౌతికమనునదీ సహజముగా బహు విస్తారమైనది. అతీంద్రీయులై మహాభాగ్యవంతులైన సిద్ధులచేతగూడ చూడబడదు. భూమి పైన అగ్ని వాయువులకును అట్లే మహాతమస్సునకును అనస్తుడైన దేవుడైన యీశ్వరునకును ఓ ద్విజోత్తములారా!. క్షయముగాని, పరిమాణముగాని అన్తముగాని యుండదు. ఈతడంతట నంతుడు, అన్ని స్థానములయందును అనస్తుడని పఠింపబడును. పూర్వమీ నామానుకీర్తనమున నాచే నాతనిని గూర్చి చెప్పబడినది. అట్టి వీడు శివనామముతో మీకు పూర్తిగా జెప్పబడినాడు. అట్టి యితడు (శివుడు) అంతట నుండువాడుగా నన్నిచోట్లలోను పూజింపబడును. భూమియందును, పాతాళమునందును, ఆకాశమునను, వాయువునందును, అగ్నియందును సమస్త సముద్రములందును, స్వర్గములందును. అట్లే తపస్సునందునను. ఈ శివుడే మహాద్యుతి గలవాడుగా నుండునని తెలిసికొనదగును. అట్లే అనేక విధముల విభజింపబడిన అంగము గలవాడై మహాయోగియైన మహేశ్వరుడు సర్వలోకములలో లోకేశ్వరుడైన శివుడు అనేక విధములుగా పూజింపబడును.
ఏవం పరస్పరోత్పన్నా ధార్యన్తే చ పరస్పరాన్ ।
ఆధారాధేయభావేన వికారాస్తే వికారిణః ॥
పృథ్వ్యాదయో వికారాస్తే పరిచ్ఛిన్నాః పరస్పరమ్ ।
పరస్పరాధికాశ్చైవ ప్రవిష్టాశ్చ పరస్పరమ్ ॥
యస్మాద్విష్టశ్చతేఽ న్యోఽన్యం తస్మాత్ స్థైర్యముపాగతాః ।
ప్రాగాసన్ హ్యవిశేషాస్తు విశేషాన్యోఽన్యవేశనాత్ ॥
పృథివ్యాద్యాశ్చ వాయ్వంతాః పరిచ్ఛిన్నాస్త్రయస్తు తే ॥
గుణాపచయసారేణ పరిచ్ఛేదో విశేషతః ।
శేషాణాం తు పరిచ్ఛేదః సౌక్ష్యాన్నేహ విభావ్యతే ॥
భూతేభ్యః పరస్తేభ్యో హ్యాలోకః పరతః స్మృతః ।
భూతాన్యాలోక ఆకాశే పరిచ్ఛిన్నాని సర్వశః ॥
పాత్రే మహతి పాత్రాణి యథైవాంతర్గతాని తు ।
భవనన్యోఽన్యహీనాని పరస్పర సమాశ్రయాత్ ॥
తధాహ్యాక ఆకాశే భేదాస్త్వంతర్గతా మతాః ॥
కృత్స్నాన్యేతాని చత్వారి అన్యోఽన్యస్వాధికాని తు ।
యావదేతాని భూతాని తావదుత్పత్తి రుచ్యతే ॥
జన్తూనామిహ సంస్కారో భూతేష్వన్తర్గతో మతాః (తః) ।
ప్రత్యాఖ్యాయ చ భూతాని కార్యోత్పత్తిర్న విద్యతే ॥
తస్మాత్పరిమితా భేదాః స్మృతాః కార్యాత్మకాస్తు తే ।
కారణాత్మకాస్తథై వస్యుర్భేదా యే మహదాదయః ॥
ఇత్యేష సన్నివేశో వో మయా ప్రోక్తో విభాగశః ।
సప్తద్వీపసముద్రాయాయాథాతథ్యేన వై ద్విజా ॥
విస్తారన్మండలాచ్చైవ ప్రసంఖ్యా తేన చైవ హి ।
వైశ్వరూపం ప్రధానస్య పరిమాణైక దేశికమ్ ॥
అధిష్ఠనం భగవతో యస్య సర్వమిదం జగత్ ।
ఏవం భూతాగణాః సప్త సన్నివిష్టాః పరస్పరమ్ ॥
ఏతావాన్ సన్నివేశస్తు మయా శక్యః ప్రభావితుమ్ ।
ఏతావదేవ శ్రోతవ్యం సన్నివేశే తు పార్థివ ॥
సప్తప్రకృతయస్త్వేతా ధారయన్తి పరస్పరమ్ ।
తాస్వల్ప పరిమాణేన ప్రసంఖ్యా తు మిహోచ్యతే ।
అసంఖ్యేయాః ప్రకృతయస్తిర్యగూర్ధ్వమధశ్చయాః ॥
తారకాసన్నివేశశ్చ యావద్దివ్యం తు మండలమ్ ।
మర్యాదా సన్నివేశస్తు భూమే స్తదనుమండలమ్ ।
అతః పరం ప్రవక్ష్యామి పృథివ్యాం వై ద్విజోత్తమాః ॥
ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే భువనవిన్యాసో నామైకోన పంచాశోఽధ్యాయః ॥
ఈ విధముగా పరస్పరముగా బుట్టిన (వారు) పరస్పరముగా ధరింపబడును(దురు). ఆధారాధేయ భావమున నవి (వారు) వికారియొక్క వికారములు. వీరివి మొదలైనవి వికారములు. అవి పరస్పరముగా పరిచ్చిన్నములు (భాగములైనవి.) పరస్పర అధికములైనవి. పరస్పరములలో బ్రవేశించినవి. పరస్పరములో బ్రవేశించినందున నవి ఫైర్యమును బొందినవి. విశేషముల యన్యోన్య ప్రవేశము వలన పూర్వము అవి శేషములుండెడివి. పృథివి మొదలు వాయువు వరకు మూడు పరిచ్చిన్నములు. గుణములు(5, 4, 3, 2 పృధివ్యాది భూతములలో) తగ్గుటచే పరిచ్చేదము (భేదము) విశేషించి కలదు. తక్కినవానిలో భేదము సూక్ష్మమగుటచే నిచట విశేషముగ భావింపబడుటలేదు. ఆ పృథివ్యాది భూతములకంటె పరముగా ఆలోకము అనబడినది. భూతములు ఆలో కమగు ఆకాశమున నంతట పరిచ్ఛిన్నములు. పెద్ద పాత్రలో చిన్న పాత్రలంతర్గతమై యిముడునట్లు (పెద్ద గిన్నెలో చిన్న గిన్నె యిమిడినట్లు) పరస్పరసమాశ్రయము వలన పరస్పరముగా తగ్గినవి (లేనివి) అగును. (1టి 2 లో గలిసినచో 1టి ఉండదు అట్లే 2డు 1లో గలిసినచో రెండు ఉండదు. ఈ విధము ఒండరుల ఒండొరులలో గలసినచో నొండొరులు గూడ నుండరు.) అట్లే ఆ లోకమగు నాకాశమున భేదములు అంతర్గతములై పోవును. కనబడవు అని (పెద్దలచే) నంగీకరింపబడినవి. పృథివి మొదలు వాయువు వరకు గల మొత్తము నాలుగు భూతములు పరస్పరముగా నధికములు. ఈ భూతములున్నంతవరకుత్పత్తి జరుగుచుండును. అని చెప్పిబడినది. జస్తువులకు (ప్రాణులకు) ఇట సంస్కారము భూతములలో నంతర్గతమైనదిగా సమ్మతమైనది. భూతములను వదిలి కార్యోత్పత్తి యుండదు. కావున కార్యాత్మక భేదములు గూడనట్లే పరిమితములు. అని సప్తద్వీప సముద్రయగు భూమియొక్క సన్నివేశము విభాగములతోబాటు నాచే వోద్విజులారా! మీకు ఉన్నదియున్నట్లు జెప్పబడినది. ప్రధానము యొక్క (ప్రకృతి యొక్క) విశ్వరూపత్వము విస్తారము వల్లను, మండలము వల్లను, చక్కగా లెక్కింపబడుటచేతను, పరిమాణములో ఏకశికమే. (ఒక భాగమే). ఈ జగమంతయు ఎవ్వనితో ఆ భగవంతుని యొక్క అధిష్ఠానమైనది. ఈ విధముగా ఏడు భూతగణములు పరస్పరముగా చక్కగా ప్రవేశించినది. ఇంతటి సన్నివేశమైతే నాచే భావించుటకు శక్యమైనది. ఓ రాజా! సన్నివేశ విషయమున నింతయే వినదగినది. ఈ యేడు ప్రకృతులు పరస్పరము ధరించును. ఆయల్ప ప్రకృతులలో అల్ప పరిమాణముతోనే లెక్కించుటకు ఇచట జెప్పబడుచున్నది. అడ్డముగను, నిలువుగను, క్రిందుగను ఉన్న ప్రకృతులు లెక్కింపనలవిగానివి. తారకల (చుక్కల) సన్నివేశమైతే దివ్యమైన (స్వర్గమైన) మండలము వరకున్నది. భూమియొక్క మర్యాదా సన్నివేశమైతే మండలము ననుసరించియున్నది. ఓ ద్విజోత్తములారా! ఆ తరువాత భూమియందున్న పై వానిని గూర్చి చెప్పెదను.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువనవిన్యాసమను నలుబది తొమ్మిదవ యధ్యాయము.