వాయు మహా పురాణము
42 - భువనవిన్యాసో
సూత ఉవాచ:-
సరోవరేభ్యః పుణ్యోదా దేవనద్యో వినిర్గతాః ।
మహౌఘతోయా నద్యశ్చ తాః శృణుధ్వం యథాక్రమమ్॥
ఆకాశాంభోని ధేర్యోఽసౌ సోమఇత్యభిధీయతే ।
ఆధారః సర్వభూతానాం దేవానామ మృతాకరః ॥
తస్మాత్ప్రవృత్తా పుణ్యోదా నదీహ్యాకాశ గామినీ ।
సప్తమేనా నిలపథా ప్రయాతా విమలోదకా ॥
సా జ్యోతిషి నివర్తన్తీ జ్యోతిర్గణ నిషేవితా ।
తారా కోటి సహస్రాణాం నభసశ్చ సమాయతా ॥
మాహేంద్రేణ గజేంద్రేణ ఆకాశ పథయాయినా ।
క్రీడితాహ్యంత రాలే యా సా విక్షోభితోదకా ॥
నైకైర్వి మానసంఘాతైః ప్రక్రమద్భిర్న భస్థలిమ్ ।
సిద్ధైరుప స్పృస్టజలా మహాపుణ్యజలా శివా ॥
వాయునా ప్రేర్యమాణా చ అనేకా భోగగామినీ ।
పరివర్తత్యహరహర్యథా సూర్యస్తథైవ సా॥
చత్వార్యశీతిః ప్రతతా యోజనానాం సమన్తతః ।
వేగేన కుర్వతీ మేరుం సా ప్రయాతా ప్రదక్షిణమ్ ॥
సూతుడనెను:- సరోవరముల నుండి పుణ్య జలములు గల నదులు బయలు వెడలినవి. అవి పెల్లుబికిన మహా జలములు గలవి. వరసగా ఆ నదులను (గూర్చి) వినుడు-1. ఆకాశమను(వంటి) సముద్రమునుండి వెలువడి సోముడని పిలువబడునీ చంద్రుడు సర్వభూతములకాధారమై దేవతల యమృతమునకు నిధియైన వాడు-2. అతని నుండి బయలు వెడలినదియు, పుణ్యజలములు గలదియు, నైన నదీ ఆకాశ గామిని యైనది. అది యేడవ వాయువు మార్గమున విమల జలయై బయలు దేరినది-3,4. అది (నది) జ్యోతిస్సు నందు మరలుచున్నదై జ్యోతిర్గణ ములచే సేవింప బడినది. కోటి వేల తారలు గల యాకాశము నుండి మిక్కిలి పొడవైనదై ఆకాశ మార్గమున వెడలు మహేంద్రుని గజమైన ఐరావతము చేత నాకాశ మధ్యనే జలక్రీడలు సలపబడినదై విక్షోభితమైన జలములు గలది ఆకాశ తలమున నెగిరి పోవుచున్న యనేక విమాన సమూహములు గల సిద్దుల చేత ఆచమించిన జలములు గలదై, మహపుణ్యజలములు గలదై మంగళ స్వరూమైనదీ-5,6. వాయువుచే ప్రేరేపింప బడుచున్నదై అనేక విస్తారములలో పయనించునదై-సూర్యునివలె ప్రతిదినము పరివర్తన (భ్రమణము) జేయును 7. అది వేగముగా మేరువును ప్రదక్షిణముగా. జుట్టి వైచి యంతటను ఎనుబదినాలుగు యోజనములు విస్తరించినది-8.
విభిద్యమాన సలిలై స్తైజసేనానలేన చ ।
మేరోరుత్తర కూటేషు పతితాథ చతుర్ష్వపి ॥
మేరుకూట తటాన్ తేభ్య ఉత్కృష్టేభ్యో నివర్తితా ।
వికీర్యమాణ సలిలా చతుర్దా సంస్కృతోదకా ॥
షష్టియోజన సాహస్రం నిరాలంబన మంబరమ్ ।
నిపపాత మహాభాగ మేరోస్తస్య చతుర్దశమ్ ॥
తరువాత నీటి చేతను, తైజసమైన వాయువు చేతను బ్రద్దలగుచున్నదై మేరువు యొక్క యుత్తర కూటముల నాల్గింటిపై పడినది-9. అంతఎత్తైన మేరు శిఖరముల యొడ్డుల చివరల నుండి మరలినదై, నీటిని వేదజల్లు చున్నదై, నాలుగు విధములుగా స్రవించు జలములు గలదై-10. అఱువది వేల యోజనములు నిరాధారమైన యాకాశమున మేరువు యొక్క నలుదెసలబడెను.11
సా చతుర్ష్వ భీతశ్చైవ మహాపాదేషు శోభనా ।
పుణ్యామందర పూర్వేణ పతితా హి మహానదీ ॥
పూర్వేణాంశేన దేవానాం సర్వసిద్ధ గణాలయమ్ ।
సువర్ణ చిత్రకటకం నైకనిర్ఘర కందరమ్ ॥
ప్లావయన్తీ సశైలేంద్రం మందరం చారు కందరమ్ ।
వప్రప్రతాప శమనై రనేకైః స్ఫాటికోదకైః ॥
ఆమంగళకరమైన పుణ్యమైన మహానది యాపర్వత మహాపాదముల నాల్గింటి యందంతట మందరమునకు పూర్వగా బడినదీ-12. దేవతల యొక్క పూర్వాంశగా సర్వసిద్ధ గణముల కాలయమైనదియు, చక్కని చిత్రములైన మధ్యప్రదేశములు గలదియు, అనేకములైన సెలయేరులు గల గుహలుగలదియు-13. పర్వతశ్రేష్టమైన సుందర గుహలు గల మందర పర్వతమును చుట్టి కొండనెత్తముల ప్రతాపమును జల్లార్చు స్పటికము వలె తెల్లని నిర్మలజలములచే యాయాకాశ మహానది ప్రవహించుచుండును-14.
తథా చైత్రరథం రమ్యం ప్లావయన్తీ ప్రదక్షిణమ్ ।
ప్రవిష్టాహ్యంబరనదీ హ్యరుణోద సరోవరమ్ ॥
అరుణోదాన్ని వృత్తాథ శీతాఽన్తే రమ్యనిర్ఘరే ।
శైలే సిద్ధగణావాసే నిపపాత సుగామినీ॥
అట్లే రమ్యమైన కుబేరుని తోటయగు చైత్రరథమును ప్రదక్షిణముగా జుట్టి ప్రవహించుచు ఆయాకాశమహానది అరుణోద (ఎఱ్ఱని జలములుగల) సరోవరమును ప్రవేశించినది-15. ఆ తరువాగ అరుణోద సరోవరమునుండి మరలి చలికాలము చివర మనోహరములైన ప్రవాహములు గలిగి సిద్దగణములకావాసమైన శైలమునందు చక్కని నడకగలదై పడేను-16.
సీతా నామ మహాపుణ్యానదీనాం ప్రవరా నదీ ।
సా నికుంజనిరుద్దా తు అనేకా భోగగామినీ॥
శీతాన్తా శిఖారాద్భ్రష్టా సుకుంజే వరపర్వతే ।
నిపపాత మహాభాగా తస్మాదపి సుమంజసమ్॥
తస్మాన్మాల్యవతం శైలం భావయన్తీ వరాపగా ।
వైకంకం సుమగను ప్రాప్తా వైకం కాన్మణి పర్వతమ్॥
మణి పర్వతాన్ మహాశైలం ఋషభం నైకకందరమ్॥
సీతయను నది మహాపుణ్యమై నదులలో శ్రేష్టమైన నది. అదియనేకములైన పొదలతో అడ్డుకొనబడినదై అనేకములైన విశాల స్థలముల మీదుగా బోవునదై-17. శీతమస్తముగాగలదై శిఖరము నుండి జారినదై సుకుంజమను శ్రేష్ఠపర్వతమునందు బడినది. మహాభాగ్యవంతమైన యానది యాసుకుంజపర్వతము నుండి సమంజసపర్వతమునుండి మాల్యవంతపర్వతమును భావించుచున్నదై యా శ్రేష్ఠనది వైకంకమను పర్వతమును జేరి దాని నుండి మణిపర్వతమును. దానినుండి యనేకగుహలుగల ఋషభపర్వతమును జేరినది-19.
ఏవం శైల సహస్రాణి వారయన్తీ మహానదీ ।
పతితాథ మహాశైలే జఠరేసిద్ద సేవితే ॥
తస్మాదపి మహాశైలం దేవకూటం తరంగిణీ ।
తస్య కుక్షి సముద్రాన్తా క్రమేణ పృథివీం గతా ॥
సైవం స్థలీ సహస్రాణి శైలరాజ శతాని చ ।
వనాని చ విచిత్రాణి సరాంసి వివిధాని చ ॥
స్రావయన్తీ మహాభాగా విస్పోరేష్వతలీ కదా ।
నదీ సహస్రానుగతా ప్రవృత్తా చ మహానదీ ॥
భద్రాశ్వం సుమహాద్వీపం ప్లావయన్తీ వరాపగా ।
ప్రవిష్టా హ్యర్ణవం పూర్వం పూర్వే ద్వీపే మహానదీ ॥
ఈ విధముగా వేల పర్వతములను చీల్చుకొనుచు మహానది మహాశైలమున సిద్దసేవితమైన జఠరభాగమున బడినది 20. అటనుండి కూడ ఆ నది దేవకూటమైన మహాశైలమును జేరినదై, దాని కడుపున సముద్రము చివరగలదై క్రమముగా పృథివిని జేరినది-21. ఆ నది యీ విధముగ వేయి స్థలములము నూర్లపర్వత శ్రేష్ఠముల మీదుగా, విచిత్రవనముల మీదుగా వివిధములైన సరస్సుల మీదుగా-22, మహాభాగ్యవంతమైన యానది. విశాలప్రదేశములలో ఒడుదుడుకులు లేక ప్రవహించునదై వేలనదులను గలుపుకొన్నదై మహానదియైనది-23. ఆ శ్రేష్ఠనది భద్రాశ్వమను మహాద్వీపమున ప్రవహించుచున్నదై తూర్పుసముద్రమున బ్రవహించి యామహానది తూర్పు ద్వీపమును జేరెను-24.
దక్షిణేఽపి ప్రపన్నా యా శైలేంద్రే గంధమాదనే ।
చిత్రైః ప్రపాతై ర్వివిధైర్నైక విస్పాలతోదకా॥
తద్గంధ మాదనవనం నందనం దేవనందనమ్ ।
ప్లావయన్తీ మహాభాగా ప్రయాతా సా ప్రదక్షణమ్॥
నామ్నా హ్యలకనందేతి సర్వలోకేషు విశ్రుతా ।
ప్రవిశత్యుత్తరసరో మానసం దేవమానసమ్ ॥
మానసాచ్చైల రాజానం రమ్యం త్రిశిఖరం గతా ।
త్రికూటాచ్చైల శిఖరాత్ కలింగ శిఖరం గతా॥
కలింగ శిఖరాద్భ్రష్టా రుచకే నీపపాత సా ।
రుచకాన్నిషధం ప్రాప్తా తామ్రాభం నిషధాదపి॥
తామ్రాభ శిఖరాద్భ్రష్టా గతా శ్వేతోదరం గిరిమ్ ।
తస్మాత్సుమూలం శైలేంద్రం వసుధారం చ పర్వతమ్॥
హేమకూటం గతా తస్మాద్దేవశృంగే తతో గతా ।
తస్మాద్గతా మహాశైలం తతశ్చాపి పిశాచకమ్ ॥
పిశాచకాచ్చైలవరాత్ పంచకూటం గతా పునః ।
పంచకూటాత్తు కైలాసం దేవావాసం శిలోచ్చయమ్ ॥
తస్య కుక్షిషు విభ్రాన్తా నైకకందర సానుషు ।
హిమవత్యుత్తమ నదీ నిపపాత చలోత్తమే ॥
దక్షిణను జేరిన యానది గంధమాదన పర్వత శ్రేష్ఠమును జేరినది. అచట చిత్రములైన జలపాతములలో అనేక విధముగ విప్పారిప్రవహించు జలములుగలదై-25, దేవతల కానందమునిచ్చు గంధమాదన పర్వతవనమైన నందనవనవనమున బ్రవహించు మహాభాగ్యవంతమై దక్షిణముగా బ్రవహించినది-26. దాని పేరు అలకనందయని యన్ని లోకములలో ప్రసిద్ధము. అది యటనుండి దేవతల మనస్సువంటిదైన మానసరోవరమున బ్రవేశించును-27. మానస సరస్సునుండి శైలశ్రేష్ఠమై సుందరమైన మూడు శిఖరములు గల త్రికూటపర్వతమును జేరును. త్రికూటము నుండి కలింగ శిఖరమును జేరును-28. కలింగశిఖరమునుండి జారినదై రుచకపర్వతమునబడును. రుచకము నుండి రాగి కాంతి గల నిషధ పర్వతమును జేరును. నిషధ పర్వతమునుండి కూడ-29. జారినదై శ్వేతోదరగిరిని జేరును. అటనుండి చక్కని మూలము గల వసుధారపర్వత శ్రేష్ఠమును జేరును-30. అటనుండి హేమకూట పర్వతమును జేరినదై యటనుండి దేవ శృంగమును జేరును. అటనుండి పిశాచకమను మహాశైలమును జేరును-31. ఆ పిశాచక పర్వతము నుండి పంచకూట పర్వతము జేరును. పంచకూటము నుండి దేవ నివాసమైన కైలాస పర్వతమును జేరును-32. దాని గర్భములలో అనేకములైన గుహల లోను చరియల లోను తిరుగుచు పర్వత శ్రేష్ఠమైన హిమవత్పర్వత మునబడినదీ-33.
సైవం శైలసహస్రాణి దారయన్తీ మహానదీ ।
స్థలీ శాతాన్యనేకాని ప్లావయన్త్యాశుగామినీ ॥
వనానాం చ సహస్రాణి కందరాణాం శతాని చ ।
స్రావయన్తీ మహాభాగా ప్రయాతా దక్షి ణోదధిమ్ ॥
ఆ నది యీ విధముగా వేల పర్వతములను జీల్చుచు మహానదియై వేగముగా ప్రవహించునదై నూర్ల స్థలులమీదుగా ప్రవహించుచు-34. వేలవనములమీదుగా, నూర్ల గుహలలోనుండియు బ్రవహించుచు మహాభాగ్యవంతురాలై దక్షిణ సముద్రము జేరును-35.
రమ్యా యోజన విస్తీర్ణా శైలకుక్షిషు సంవృతా ।
యాధృతా దేవదేవేన శంకరేణ మహాత్మనా॥
పావనీ ద్విజశార్దూల ఘోరాణామపి పాప్మనామ్ ।
శంకరస్యాంగ సంస్పర్శా న్మహాదేవస్య ధీమత ॥
ద్విగుణం పవిత్రసలిలా సర్వలోకే మహానదీ ॥
అనుశైలం సమన్తాచ్చ నిర్గతా బహుభిర్ముఖైః ।
అధోఽన్యేనాభి ఘాతేన ఖ్యాతా నద్యః సహస్రశః॥
తస్మాద్దిమవతో గంగా గతా సా తు మహానదీ ।
ఏవం గంగేతి నామ్నాది ప్రకాశా సిద్దసేవితా॥
ధన్యాస్తే సత్తమాదేశాః యత్ర గంగా మహానదీ ।
రుద్రసాధ్యాఽనిలాదిత్యై ర్జుష్టతోయా యశస్వినీ ॥
సుందరమై, ఒక యోజనము వెడల్పుగలదై, పర్వత గర్భములలో దిరుగుచున్నదైన యా గంగా మహానది మహాత్ముడైన శంకరుని చేత ధరింపబడినది-36. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ శంకరుని చేత ధరింపబడిన యా నది భయంకరము లైన పాపములను పవిత్రము జేయును. శంకర శరీర స్పర్శచే రెట్టింపుగా పవిత్రమైన జలములు గలదై సర్వ లోకములలో బ్రసిద్ది జెందినది-37. పర్వతముననుసరించి యనేక ముఖములుగా నంతటను బయలు వెడలనిదై, క్రింద ఇతర పర్వతము చేత గొట్టబడుటచే దాని వేల నదులు ప్రసిద్ధి చెందినవి-38. ఆ మహానది యైన గంగ ఆ హిమవత్పర్వతము నుండి ‘గంగా’ అను పేరుతో మొదట ప్రకాశించినదై, సిద్ధులచే సేవింపబడినది-39. మహానదియైన గంగ ప్రవహించిన దేశములన్నియు ధన్యములు. అది రుద్రుని చేత సాధ్యులచేతను, అనిలుల చేతను ఆదిత్యులచేతను సేవింపబడిన జలములు గలదై తాను ప్రవహించిన దేశములు ధన్యముల జేసినది-40.
మహాపాదం ప్రవక్ష్యామి మేరోఽపి హి పశ్చిమమ్ ।
నానారత్నాకరం పుణ్యం పుణ్యకృద్భిర్ని షేవితమ్॥
విపులం శైలరాజానం విపులో దర కందరమ్ ।
నితంబ కుంజ కటకైర్విమలైర్మండి తోదరమ్ ॥
అపి యా త్ర్యంబకస్యైషా త్రిదశైః సేవితోదకా ।
వాయువేగా గతా భోగా లతేవ భ్రమితా పునః ॥
మేరుకూట తటాద్భ్రష్టా ప్రహతైః స్వాదితోదకా ।
విస్తీర్యమాణ సలిలా నిర్మలాంశుక సన్నిభా ॥
ఇక మేరు పర్వతము యొక్క పశ్చిమమైన మహాపాదమును జెప్పెదను. అది యనేక రత్నములకు నెలవైనది. పుణ్యమైనది. పుణ్యము జేసినవారిచే సేవింపబడినదీ-41. విశాలమైనది. పర్వతరాజము విశాలమైన గర్బము గుహలును గలది. మధ్య ప్రదేశములలో పొదళ్ల చేతను స్వచ్ఛమైన కటకముల చేతను (నడిమి భాగములచేతను) అలంకరింప బడిన గర్భము గలది-42. ఆ యీ ముక్కంటి యొక్క నది. దేవతలచే సేవింపబడిన జలములు కలది. వాయు వేగము గలది. వైశాల్యము లేక సన్ననైనది. కావున తీతవలె మలుపులు తిరిగినది-43. మేరుకూటతటమునుండి జారిపడినది. ఆ దెబ్బలచే తీయనైన జలములు గలది. వ్యాపించుచున్న జలములుగలది. నిర్మలమైన కొంగువలె తెల్లనైనది-44.
తస్య కూటేంఽబరనదీ సిద్ధచారణ సేవితా ।
ప్రదక్షిణ మథావృత్య పతితా సా తు గామినీ ॥
దేవభ్రాజం మహాభ్రాజం స వైభ్రాజం మహావనమ్ ।
ప్లావయన్తీ మహాభాగా నానాపుష్ప ఫలోదకా ॥
ప్రదక్షిణం ప్రకుర్వాణా నానావన విభూషితా ।
ప్రవిష్టా పశ్చిమసరః సితోదం విమలోదకమ్ ॥
సాసితోదాద్వినిష్క్రాన్తా సుపక్షం పర్వతం గతా ।
సుపక్షతస్తు పుణ్యోదాత్తతో దేవర్షిసేవితా॥
సుపక్షకూటతటగా తస్మాచ్చ సంశితోదకా ।
నిపపాత మహాభాగా రమణ్యం శిఖిపర్వతమ్॥
శిఖేశ్చ పర్వతాత్ కంకం కంకాద్వైదూర్య పర్వతమ్ ।
వైదూర్యాత్కపిలం శైలం తస్మాచ్చ గంధమాదనమ్ ॥
తస్మాద్గిరి వరాత్ప్రాప్తా పింజరం వరపర్వతమ్ ।
పింజరాత్ సరసంయాతా తస్మాచ్చ కుముదాచలమ్ ॥
మధుమంతం జనం చైవ ముకుటం చ శిలోచ్చయమ్ ।
ముకుటాచ్చ శైలశిఖరాత్ కృష్ణం యాతా మహాగిరిమ్ ॥
మేరుకూటమున నది ఆకాశనది(గంగ) సిద్ధచారణులచే సేవింపబడినది. తరువాత నా నది ప్రదక్షిణముగా తిరిగి పడినదై ప్రవహించుచు-45. దేవతలతో ప్రకాశించునదియు, మహాకాంతిగలదై, దేవవనమైన మహావనమును తననీటిచే తడుపుచు మహా భాగ్యవంతురాలై అనేక పుష్పఫల ఉదకములు గలదై-46, ప్రదక్షిణముగానే తిరుగుచు నానా వనములచే నలంకరింపబడి నదై తెల్లని విమల జలము గల పశ్చిమ సరస్సును ప్రవేశించును-47. తరువాత నది సితోద సరస్సు నుండి వెలువడి సుపక్షమను పర్వతమును జేరును. పుణ్యోదకము గల సుపక్షము నుండి దేవరులచే సేవింపబడినదై సుపక్షకూట తటమును జేరును. దానినుండి స్తుతింపబడిన జలము గలదై రమణ్యమైన శిఖపర్వతము పై బడును-49. శిఖి (నెమళ్ళ) పర్వతము నుండి కంక (కొంగ(రాపులుగు)ల) పర్వతమును, కంక పర్వతము నుండి వైదూర్య పర్వతమును, వైదూర్య పర్వతము నుండి కంపిల పర్వతమును, దాని నుండి గంధమాదన పర్వతమును-50, దాని నుండి శ్రేష్టమైన పింజర పర్వతమును, పింజర పర్వతము నుండి సరస్సును జేరును. దానినుండి కుముదాచలమును-51, అటనుండి మధుమంతము జనము ముకుటము-అను పర్వతములు జేరును. ఆ ముకుట పర్వతము నుండి మహాపర్వతమైన కృష్ణపర్వతమును జేరును-52.
కృష్ణాత్ శ్వేతం మహాశైలం మహానగ నిషేవితమ్ ।
శ్వేతాత్సహస్ర శిఖరం శైలేంద్రం పతితాపుణ: ॥
అనేకాభిః స్రవన్తీభిరాప్లాయితజలా శివా ।
ఏవం శైలసహస్రాణి సాదయన్తీ మహానదీ ॥
పారిజాతే మహాశైలే నిపతాశు గామినీ ॥
ఆ కృష్ణ పర్వతము నుండి మహానగములచే సేవింపబడిన శ్వేత మహాపర్వతమును, ఆ శ్వేత పర్వతము నుండి వేయి శిఖరములు గల పర్వత రాజము నందు బడును-53. అనేక నదులచే నిండారిన జలములు గలిగి మంగళకరమై, యీ విధముగా వేయి పర్వతముల మీదుగా వేగముగా బ్రవహించుచు ఆ మహానది పారిజాతమను మహాపర్వతమున బడును-54.
అనేక నిర్ఘరనదీ గుహాసానుషు రాజతే ।
తస్య కుక్షిష్యనేకాసు భ్రాంతతోయా తరంగిణీ ॥
వ్యాపాన్యమాన సంవేగా గండశైలైరనేకశః ।
సంవిద్య మాన సలిలా గతా చ ధరణీతలే ॥
ఆ మహానది పారిజాత పర్వతము పైన అనేకములగు సెలయేళ్ళు-నదులు గల గుహల లోను చరియల లోను ప్రకాశించును. ఆ పర్వతము యొక్క అనేక కుక్షులలో భ్రమించిన జలములుగలదై యా మహానది-55. కొట్టబడుచున్న వేగము గలదై, యనేక గండశిలలచే అనేక పర్యాయములు భేదింపబడుచున్న జలములు గలదై భూతలమునకు జేరును-56.
సువర్ణచిత్రపార్శ్వే తు సుపార్శ్వేఽప్యుత్తరే గిరౌ ।
మేరోశ్చిత్ర మహాపాదే మహాసత్త్వ నిషేవితే ॥
మేరుకూట తటాద్భ్రష్టా పవనేనేరితోదకా ।
అనేకా భోగ వక్రాంగీ క్షిప్యమాణా నభస్తలే ॥
షష్టియోజన సాహస్రే నిరాలంబేంఽబరే శుభే ।
వికీర్యమాణా మాలేవ నిపపాత మహానదీ॥
బంగారు వర్ణముచే చిత్రమై చక్కని ప్రక్కలు గలదియు గొప్ప ప్రత్యంత పర్వతములు(కొండ తిప్పలు) గలదియు, అనేక ప్రాణులచే సేవింపబడినది యునైన ఉత్తర గిరి యందు-58, మేరు కూట తటము నుండి జారిన యా మహానది వాయువుచే ప్రేరేపింపబడిన జలములు గలదై, అనేకములగు విరజిమ్ముటచే యా కాశమున వంకరలు తిరిగి పడుచున్నదై, ఆఱువది వేల యోజనముల నిరాధారమై శుభమైన యాకాశమున వేదజల్లబడుచున్నదై ఒక మాలవలె యామహానది పడెను. (మహాజలపాతముగా బడెను)-60.
ఏవం కూటతటైర్భ్రష్టా నెకైర్దేవర్షి సేవితైః ।
వికీర్య మాణ సలిలా నైకపుష్టోడు పోత్కచా॥
నానారత్న వనోద్దేశ మరణ్యం సవితుర్వనమ్ ।
మహావనం మహాభాగా ప్లావయన్తీ ప్రదక్షిణం ॥
సరోవరం మహాపుణ్యం మహాభాగ నిషేవితమ్ ।
తత్రావివేశ కల్యాణీ మహాభద్రం సితోదకా ॥
భద్రసోమేతి నామ్నా హి మహాపారామహాజవా ।
మహానదీ మహాపుణ్యా మహాభద్రా వినిర్గతా॥
నైకనిర్ఘర వప్రాఢ్యా శంఖకూటతటే తు సా ।
తత్ర కూటే గిరితటే నిపపాతాశు గామినీ ॥
శంకకూటతటాద్భ్రష్టా పపాత వృషపర్వతమ్ ।
వృషపర్వతాద్వత్సగిరిం నాగశైలం తతో గతా॥
తస్మాన్నీలం నగశ్రేష్ఠం సంప్రాప్తా వర్షపర్వతమ్ ।
నీలాత్కపింజలం చైవ ఇంద్రనీలిం చ నిమ్నగా॥
తతఃపరం మహానీలం హేమశృంగం చ సా యయౌ ।
హేమశృంగాద్గతాశ్వేతం శ్వేతాచ్చ సునగం యయౌ॥
సునగాత్ శతశృంగం చ సంప్రాప్తా సా మహానదీ ।
శతశృంగాద్గీతాశ్వేతం పుష్కరం పుష్పమండితమ్ ॥
పుష్కరాచ్చ మహాశైలం ద్విరాజం సుమహాబలమ్ ।
వరాహపర్వతం తస్మాన్మయూరం చ శిరోచ్ఛయమ్ ॥
మయూరాచ్చైకశిఖరం కందరోదర మండితమ్ ।
జారుధిర శైలశిఖరం నిపపాతాశు గారామినీ ॥
ఈ విధముగా, అనేక దేవర్షులచే సేవింపబడిన శిఖరతటములనుండి జారినదై, వెదజల్లబడుచున్న జలములు గలదియు, అనేకములైన పూలతప్ప(మాను)ల నెడి యూర్థ్వకేశములుగలదియై-61. అనేకరత్నవనప్రదేశములుగల యడవియై సూర్యుని వనమైన మహావనమున ప్రదక్షిణముగా బ్రవహించుచు-62. గొప్పవారిచే సేవింపబడి మహాపుణ్యవంతమై మహాపుణ్యమైన యామహానది యటనుండి బయలుదేరినదై-64. అనేకములైన సెలయేరులతో కొండనెత్తములతో నొప్పినదై, వేగముగా బ్రవహించుచు శంఖకూటమను గిరీతటమున బడెను-65. శంఖ కూటతటమునుండి జారినదై వృషపర్వతమునను, వృషపర్వతమునుండి నాగశైలపర్వతమును-66. అటనుండి వర్ష పర్వతమైన నీల పర్వతమును, నీలపర్వతమునుండియానది. కపింజల పర్వతమును ఇంద్రనీల పర్వతమును చేరినది-67. ఆ తరువాత, మహానీలమును హేమశృంగమును ఆ నది చేరినది. హేమశృంగము నుండి శ్వేత పర్వతమును శ్వేతమునుండి సునగమను పర్వతమును చేరినది-68. ఆ మహానది సునగము నుండి శతశృంగమును శతశృంగమునుండి పుష్పాలంకృతమైన పుష్కర మహా శైలమును జేరినది-69. పుష్కరము నుండి బలిష్ఠమైన విరాజమను మహాపర్వతమును వరాహ పర్వతమును అటనుండి మయూర పర్వతమును-70. ఆటనుండి గుహాగర్భముతో నలంకృతమైన ఏకశిఖరమును ఆటనుండి జారుధియనశైలశిఖరమున వేగముగా బడినది-71.
ఏవం గిరిసహస్రాణి జారయన్తీ మహానదీ ।
త్రిశృంగం శృంగకలిలం మర్యాదా పర్వతం గతా॥
త్రిశృంగతట విభ్రష్టా మహాభాగ నిషేవితా ।
మేరుకూట తటాద్భ్రష్టా పవనేనేరితోదకా॥
విరుద్ధం పర్వతవరం పపాత విమలోదకా ।
ప్లావయన్తీ మహాభాగా ప్రయాతా పశ్చిమార్ణవమ్ ॥
ఈ విధముగా నా మహానది వేయి పర్వతములను జీల్చుచు మర్యాదా పర్వతమై మూడు శిఖరములతో నొప్పిన త్రిశృంగ పర్వతమును జేరినది-72. త్రిశృంగతటమునుండి జారినదై గొప్పవారిచే సేవింపబడినదై మేరు కూట తటము నుండి జారినదై గొప్పవారిచే సేవింపబడిన స్వచ్ఛమైన జలములు గలదై విరుద్ధమను పర్వత శ్రేష్ఠమున బడెను-73. అటనుండి భూములపై బ్రవహించుచు నాభాగ్యవంతమహానది పశ్చిమ సముద్రమును జేరినది-74.
సువర్ణభువిపార్శ్వే తు సుపార్శ్వేఽ ప్యుత్తరే గిరౌ ।
మేరోశ్చిత్రే మహాపాదే మహాసత్త్వ నిషేవితే ॥
కందరోదరవిభ్రష్టా తస్మాదపి తరంగిణీ ।
నైకభోగాప పాతోర్వీం చిత్రపుష్టోడు పోత్కచా ॥
ప్లావయన్తీ ప్రముదితా ఉత్తరాన్సా కురూన్ శివా ।
మహాద్వీపస్య మధ్యేన ప్రయాతా స్తోత్తరార్ణవమ్॥
ఏవం తాస్తు మహానద్యశ్చతస్రో విమలోదకాః ।
మహాగిరి తటభ్రష్టాః సంప్రాయాతా శ్చతుర్దిశమ్॥
తత్సేయం కధిత ప్రాయా పృథివీ బహువిస్తరా ।
మేరుశైల మపాకీర్ణాఽవిశచ్చసర్వతో దిశమ్ ॥
చతుర్మహాద్వీపవతీ చతురా క్రీడకాననా ।
చతుష్కేతు మహావృక్షా చతుర్వర సరస్వతీ ॥
చతుర్మహా శైలవతీ చతుర్భుజగ సంశ్రయా ।
అష్టోత్తర మహాశైలా తథాష్ట వరపర్వతా॥
ఇతి శ్రీ మహావాయుపురాణే వాయుప్రోక్తే భువనవిన్యాసో నామ ద్విచత్వారింశోఽధ్యాయః॥
ప్రక్కన సువర్ణ భూములు గలిగి, చక్కని పార్శ్వభాగములుగలిగి, మహాప్రాణులచే సేవింపబడి, చిత్రమైన ప్రత్యంత పర్వతములు గల మేరువుయొక్క యుత్తర గిరియందు-75, గుహాగరమునుండి జాలువారి, బహువైశాల్యముగలదై, చిత్రమైన పూలతెప్పలనెడి యూర్ఖకేశములుగలదియే భూమిని బ్రవేశించినది-76. అటనుండి ప్రవహించు సంతోషముతో మంగళకరమై ఉత్తర కురు దేశములను బ్రవేశించినదై మహాద్వీపమున మధ్యముగా ఉత్తర సముద్రమును జేరినదీ-77. ఈ విధముగా నా నాలుగు మహానదులు నిర్మలజలములు గలవై మహాగిరితటములనుండి జారిపడినవై నలుదెసలను జేరినవి-78. కావున, బహువిశాలమైన పృథివి పై విధములో పూర్తిగా జెప్పబడినట్లే. అది (భూమి) మేరు పర్వతమును జుట్టి వెదజల్లినట్లుగా నన్ని దిక్కులకు వ్యాపించి ప్రవేశించినది-79. అది నాలుగు మహాద్వీపములుగలది. నాలుగు ఉద్యానవనముల వంటి వనములు గలది. నాలుగు ధ్వజములవంటి మహావృక్షములుగలది. నాలుగు శ్రేష్ఠములైన సరోవరములు గలది-80. నాలుగు మహాపర్వతములు గలది. నాలుగు మహాసర్పముల కాశ్రయమైనది. ఎనిమిది ఉత్తరమహాపర్వతములుగలది. ఎనిమిది శ్రేష్ఠ పర్వతములు గలది-81.
ఇది శ్రీవాయుప్రోక్తే మహావాయుపురాణమున భువనవిన్యాసమను నలుబదిరెండవ అధ్యాయము-42.