53 -  జ్యోతిః సన్నివేశో

శాంశపాయన ఉవాచ: -

ఏతచ్ఛృత్వా తు మునయః పునస్తే సంశయాన్వితాః

 పప్రచ్చు రుత్తరం భూయస్తదా తే లోమహర్షణమ్

ఋషయ ఊచు:-

యదేవదుక్తం భవతా గృహాణ్యేతాని విశ్రుతమ్

 కథం దేవగృహాణి స్యుః కథం జ్యోతీంషి వర్ణయ

ఏతత్సర్వం సమాచక్ష్య జ్యోతిషాం చైవనిశ్చయమ్

 శ్రుత్వా తు వచనం తేషాం తదా సూతః సమాహితః

అస్మిన్నర్థే మహాప్రాజ్ఞై ర్యదుక్తం జ్ఞానబుద్దిభిః

 తద్వోఽసం ప్రవక్ష్యామి సూర్యాచంద్రమసో ర్భవమ్

అతఃపరం త్రివిధాగ్నేర్వక్షేఽహం తు సముద్భవమ్

దివ్యస్య భౌతిక స్యాగ్నే రథాగ్నేః పార్థివస్య చ

వ్యుష్టాయాం తు రజన్యాం వై బ్రహ్మణోఽ వ్యక్తజన్మనః

అవ్యాకృతమిదం త్వాసీ న్నై శే న తమసాఽవృతమ్

 చతుర్భూతావశిష్టేఽస్మిన్ పార్థివః సోఽగ్నిరుచ్యతే

యశ్చాదౌ తపతే సూర్యే శుచిరగ్నిస్తు స స్మృతః

 వైద్యుతాఖ్యస్తు విజ్ఞేయస్తేషాం వక్షేఽథ లక్షణమ్

 వైద్యుతో జాఠరః సౌరో హ్యపాంగర్భాస్త్రయోఽగ్నయః

 తస్మాదపః పిబన్ సూర్యోఽపిగోభిర్దిప్యత్యసౌ దివి

 వైద్యుతేన సమావిష్టో వా క్షోనాద్భిః ప్రశామ్యతి

 మానవానాం చ కుక్షిస్థో నాద్భిః శామ్యతి పావకః

 అర్చిష్మాన్ పరమఃసోగ్నిః ప్రభావో జాఠరః స్మృతః

 యశ్చాయం మండలీ శుక్లో నిరూష్మా సంప్రకాశతే

శాంశపాయనుడనెను:- ఇది విని మునులు మరలసంశయము గలవారైరి. అపుడు వారు లోమహర్షణుని (తమప్రశ్నకు) మరల సమాధానమునడిగిరి. ఋషులనిరి మీరు ఈ గృహములు ప్రసిద్దమని చెప్పితిరి. అవియే విధముగ దేవగృహములగును. అవి జ్యోతిస్సులేట్లుగును- తెలుపుడు. ఇదియంతయు జెప్పుడు జ్యోతిస్సుల యొక్క నిశ్చయ(సరూప) మును జెప్పుడు అపుడు వారి మాటలను విని సూతుడు ఏకాగ్రచిత్తుడయ్యెను. ఈ విషయములో జ్ఞానబుద్ధులైన మహాప్రాజ్ఞులచే జెప్పబడిన సూర్య చంద్రుల పుట్టుకను నేను మీకు జెప్పబోవుచున్నాను. ఇచట దేవ గృహములు సూర్యచంద్రుల గృహమెట్లయ్యెను? అను విషయము జెప్పబోవుచున్నాను. తరువాత, ఆకాశమునకు సంబంధించినట్టియు, భూతములకు సంబంధించినట్టియు, పృథివికి సంబంధించినదియునై మూడు విధములైన అగ్నియొక్క పుట్టుకను జెప్పెదను. రాత్రి తెల్లవారగనే అవ్యక్తజన్ముడైన బ్రహ్మయొక్క మూలప్రకృతిగానున్న యీ జగము రాత్రి చీకటిచే నావరింపబడినదయ్యెను. ఆకాశాదులైన నాలుగు భూతములకు మిగిలినదైన యీ భూమియందలియగ్ని పార్థివాగ్నియనబడును. మొదటి సూర్యునియందు తపించునది. శుచియను నగ్నియనబడును. వైద్యుతమును (విద్యుత్తు, (మెఱుపు) వల్లవచ్చునగ్నిని గూడ తెలియవలె. ఇక ఆయగ్నుల లక్షణమును జెప్పెదను. వైద్యుతము (మెఱుపువల్ల వచ్చునది) జాఠరము(అన్నజీర్ణకారియై కడుపులో నున్నయగ్ని), సౌరము సూర్యుని నుండి వచ్చు నగ్ని) అని జలగర్భములైనయగ్నులు మూడు కావుననే నీరు ద్రావుచు నీ సూర్యుడు ఆకాశమున వెలుగుచున్నాడు. విద్యుత్తుతోనావేశింపబడిన వృక్ష సంబంధమైన యగ్ని నీటితో జల్లారదు. మానవుల కడుపులో నున్న జాఠరాగ్నియు నీటితో జల్లారదు. మంటలతోగాని వెలుగుతోగానియున్నయగ్ని (సౌరాగ్ని) పరమమైనది. జాఠరాగ్ని (వెలుగులేక) ప్రభావముగలదియనబడినది. మండలాకారమున వేడిలేనిది శుక్లమై (తెల్లనై) ప్రకాశించును.

ప్రభా తు సౌరీ పాదేన హ్యస్తం యాతి దివాకరే

 అగ్నిమావిశతే రాత్రౌ తస్మాద్దూరాత్ప్రకాశతే

 ఉద్యన్తం చ పునః సూర్యమౌష్ణ్యమాగ్నేయమా విశత్

పాదేన పార్థివస్యాగ్నే స్తస్మాదగ్నిస్తపత్యసౌ

 ప్రకాశశ్చ తధేష్ణ్యం చ సౌరాగ్నే యే తు తేజసీ

 పరస్పరానుప్రవేశా దాప్యాయేతే దివానిశమ్

 ఉత్తరే చైవ భూమ్యర్ధే తస్మాదస్మింశ్చ దక్షిణే

 ఉత్తిష్ఠతి పునః సూర్యే రాత్రిరావిశతే త్యపః

తస్మాత్తామా భవన్ త్యాపో దివారాత్రి ప్రవేశానాత్

అస్తం యాతి పునః సూర్యే అహర్వై ప్రవిశత్యపః

తస్మాన్నక్తం పునఃశుక్లా ఆపో విశ్యన్తి భాస్కరే

 ఏతేన క్రమయోగేనర్థే భూమ్యర్థే దక్షిణోత్తరే

ఉదయాస్తమయే నిత్యమహోరాత్రం విశత్యపః

యశ్చాసౌ తపతే సూర్యేపిబిన్నంభో గభస్తిభిః

పార్థివోఽహి విమిశ్రోఽసౌ దివ్యః శుచిరితి స్మృతః

సహస్రపాదః సోగ్నిస్తు వృత్తః కుంభనిభః శుచిః

 ఆదతే తత్తు రశ్మీనాం సహస్రేణ సమన్ తతః

నాదేయీశ్చైవ సాముద్రః కాప్యాశ్చైవ సధాన్వనీః

స్థావరజంగమాశ్చైవ యశ్చ సూర్యో హిరణ్మయః

తస్య రశ్మిసహస్రం తు వర్షశీతోష్ణనిః స్రవమ్

తాసాం చతుః శతాథానాడ్యో వర్షన్తి చిత్రమూర్తయః

వందనాశ్చైవ వంద్యాశ్చ ఋతవా నూతనా స్తథా

అమృతానామతః సర్వా రశ్మయో వృష్టిసర్జనాః

 హిమవాహాశ్చ తాభ్యోఽ న్యా రశ్మయః స్త్రిశతాః పునః

 దృశ్యా మేధ్యాశ్చ వాహ్యాశ్చ హ్రదిన్యో హి మసర్జనాః

చంద్రాస్తానామతః సర్వాః పీతాభాస్తు గభస్తయః

 శుక్లాశ్చకకుభశ్చైవ గావో విశ్వభృతస్తధా

శుక్లాస్తా నామతః సర్వాస్త్రిశతి ఘర్మసర్జనాః

సమం బిభర్తి తాభిస్తు మనుష్య పితృదేవతాః

మనుష్యానౌషధేనేహ స్వధయా చ పితౄనపి

అమృతేన సురాన్ సర్వాం స్త్రీంస్త్రిభిస్తర్పయత్యసౌ

 వసన్తే చైవ గ్రీష్మే చ సతైః సుతపతే త్రిభిః

వర్షాస్వ థో శరది చ చతుర్భిః సంప్రకర్షతి

హేమన్తే శిశిరే చైవ హిమం ససృజతే త్రిభిః

ఓషధీషు బలం ధత్తే స్వధయా చ పితౄనషి

 సూర్యోఽమరత్వమమృతత్రయం త్రిషు నియచ్చతి

ఏవం రశ్మిసహస్రం తత్ సౌరం లోకార్థసాధకమ్

 భిద్యతే ఋతుమాసాద్య జలశీతోష్ణ నిఃస్రవమ్

 ఇత్యేతన్మండలం శుక్లం భాస్వరం సూర్యసంజ్ఞితమ్

 నక్షత్రగ్రహసోమానాం ప్రతిష్ఠాయోనిరేవ చ

 ఋక్షచంద్రగ్రహాః సర్వే విజ్ఞేయాః సూర్యసంభవాః

సూర్యుడస్తమించగనే-సూర్యకాంతియొక్క పావుభాగము అగ్నినావేశించును. కావున రాత్రియందది దూరమునుండి ప్రకాశించును. అగ్ని యొక్క వేడి మరల నుదయించు సూర్యునావేశించును. ఆకారణమున పార్థివాగ్నియొక్క పావుభాగముచే ఈయగ్ని తపించును. కాంతియు వేడియును సూర్యాగ్నుల తేజస్సులు, అవి పరస్పరముగా బ్రవేశించుటచే పగటిని రాత్రిని సంతసింపజేయును. ఉత్తరపు దైనభూమిసగభాగమునను, దానినుండి యీ దక్షిణ(అర్థ) భాగమునను మరల సూర్యుడుదయించుచుండగా, జలములను రాత్రిప్రవేశించును. రాత్రిప్రవేశము వలన జలములు తామ(ఎఱుపు) వర్ణముగలవగును. సూర్యుడు మరలనస్తమించుచుండగా పగలు జలములలో బ్రవేశించును. ఆ కారణమున రాత్రియందైతే తెల్లని జలములు సూర్యునిలో బ్రవేశించును. ఈ క్రమయోగముతో భూమియొక్క దక్షిణోత్తరార్ధ భాగములందు ఉదయాస్తమయములలో నిత్యము పగలు రాత్రియు జలములను బ్రవేశించును, తపించు (ఎండగాయు) చున్న సూర్యునియందు కిరణములచే జలమును ద్రాగుచున్న పార్థివాగ్ని దివ్యమై విమిశ్రమై శుచియనబడును. వేయి కిరణములు గల యాయగ్ని గుండ్రనిదై కుండవంటిదై శుచి యను పేరుగలది. అది తన వేయికిరణములచే నంతట (జలమును) దీసికొనును. ఆశుచియను దివ్యాన్ని నదీ జలములను, సముద్రజలములను, కూపజలములను మెట్టనేలలోని జలములను దీసికొనును. ఆ సూర్యుడు హిరణ్మ (తేజోమ)యుడు. ఆతని వేయికిరణములు వర్షమును, చలిని, వేడిని స్రవింపజేయునవి. ఆరశ్ములలో నాలుగువందలనాడులు చిత్రమూర్తులై వర్షించును. వందనములు (నమస్కారరూపములు) వంద్యములు (నమస్కరింపదగినవి. ఋతవములు (ప్రాచీనములు7) నూతనములు, అమృతములు-ఈ పేరులుగల సమస్తకిరణములును వృష్టిని గలుగజేయునవి. మంచునుప్రవహింపజేయునవియా రశ్ములకంటే వేరైనవి. అవి మూడు వందలు అవి చూడదగినవి. పవిత్రమైనవి. ప్రవహింపజేయునవి. గర్జనములు మెఱుపులు-ప్రవాహములును గలవి. మంచును సృష్టించునవి. చంద్రులను పేరనున్న రశ్ములన్నియు పచ్చని కాంతిగలకిరణములు. శుక్లములు కకుభములు గోవులు, విశ్వభృత్తులు. అనుకిరణములు అన్నియు పేరునకు శుక్లములు. అవి మూడువందలు, వేడిని సృష్టించునవి. ఆ కిరణములచే (ఆశుచియనునగ్ని మనుష్య పితృదేవతలను సమానముగా భరించును. ఔషధములచే మనుష్యులను, స్వధచేత పితరులను, అమృతముచేత దేవతలను ముగ్గురిని మూటిచేత సూర్యుడు తృప్తిబొందజేయును. వసంతగ్రీష్మఋతువులలో ఆ మూడు రకముల కిరణములచేత సూర్యుడు తపించును. వర్ష ఋతువు నందును శరదృతువునందును నాలుగింటిచే లాగును. హేమంత శిశర-ఋతువులలో మూటిచే హిమమును సృజించును. ఓషధులందు బలమును గలుగజేయును. స్వధచేత పితరులను తృప్తిపరచుచు సూర్యుడు అమరత్వమును, అమృతత్రయమును మూటిలో నియమించును. ఈ విధముగా సూర్యసంబంధమైన యావేయి కిరణములు లోకార్థసాధకములు. ఋతువును బొంది జలమునందలి శీతోష్ణ ప్రవాహమును గలుగజేయును-27. ఈ విధముగ తెల్లనైప్రకాశించు మండలము సూర్యుడను పేరుగలది. నక్షత్రములకు, గ్రహములకు, చంద్రునకును నిలచుటకు కారణమైనది. నక్షత్రములు, చంద్రుడును గ్రహములును సూర్యునినుండి బుట్టినవనీ తెలియవలెను.

నక్షత్రాధివతిః సోమో గ్రహరాజో దివాకరః

శేషాః పంచగ్రహాజ్ఞేయా ఋశ్వరాః కామరూపిణ

 పర్వతే చార్నిరాదిత్య జౌదకశ్చంద్రమాః స్మృతః

 శేషాణాం ప్రకృతిం సమ్యగ్వర్ణ్యమానాం నిబోధత

 సురసేనాపతిః స్కందః పఠ్యతేఽ గారకో గ్రహః

 నారాయణం బుధం ప్రాహుర్దేవం జ్ఞాన విదోవిదుః

రుద్రో వైవస్వతః సాక్షాద్ధర్మో లోకే ప్రభుః స్వయమ్

 మహాగ్రహోద్విజశ్రేష్ఠో మందగామి శనైశ్చరః

 దేవాసురగురూ ద్వౌతు భానుమన్ తౌ మహాగ్రహో

 ప్రజాపతిసుతా వేతావేతావుభౌ శుక్రబృహస్పతీ

 దైత్యో మహేంద్రశ్చ తయోరాధిపత్యే వినిర్మితౌ

 ఆదిత్యమూలమఖిలం త్రిలోకం నాత్ర సంశయః

 భవత్యస్య జగత్ కృత్స్నం సదేవాసురమానుషమ్

చంద్రుడు నక్షత్రాధిపతి సూర్యుడు గ్రహములకు రాజు, తక్కిన యైదుగ్రహములు కామరూపులగు నీశ్వరులుగా దెలియవలెను-29. అగ్నిఆదిత్యు (అదితి పుత్రుడని పఠింపబడుచున్నది. జలసంభవుడు చంద్రుడనబడినాడు.నారాయణుని బుధగ్రహముగా జెప్పుదురు. జ్ఞానవిదులు ఆతనిని దేవునిగా దెలియుదురు-31. రుద్రుని శనిగను దెలియవలె. అతడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు. లోకమున స్వయముగా ప్రభువు మహాగ్రహమై ద్విజశ్రేష్ఠుడై మెల్లిగా బోవువాడు. శనైశ్చరుడు- 32. దేవ-అసురులకు గురువులైన గురు-శుక్రులు కాంతి కిరణములు గలవారై మహాగ్రహములు బ్రహ్మయొక్క పుత్రులు ఈ శుక్రగురువులు. దైత్యుడు దితిపుత్రుడైన రాక్షసుడు) మహేంద్రుడును ఆశుక్ర గురువులు. దైత్యుడు (దితిపుత్రుడైన రాక్షసుడు) మహేంద్రుడును ఆశుక్రగురులకు అధిపతులుగా నిర్మింపబడిరి-33. సమస్త త్రిలోకములు సూర్యుడు మూలముగా గలవి. ఇచట సంశయము లేదు. దేవ-రాక్షసమనుష్యాత్మకమైన జగమంతయు ఈ సూర్యునిదే యగును.

రుద్రేంద్రో పేంద్రచంద్రాణాం విపేందాస్త్రిదివౌకసామ్

 ద్యుతీర్ద్యుతిమతాం కృత్స్నా యత్తేజః సార్వలౌకికమ్

 సర్వాత్మాసర్వలోకేశో మూలం పరమదైవతమ్

 తతః సంజాయతే సర్వం తత్రచైవచ ప్రలీయతే

 భావాభావౌహి లోకానామాదిత్యాన్నిః సృతౌపురా

 జగద్ జ్ఞేయోగ్రహోవిప్రా దీప్తిమాన్ సుగ్రహో రవిః

 యత్ర గచ్చన్తి నిధనం జాయన్తే చ పునః పునః

క్షణముహూర్తా దివసా నిశాః పక్షాశ్చ కృత్స్నశః

 మాసాః సంవత్సరాశ్చైవ ఋతవోఽబ్దిబియుగాని చ

తదాదిత్యాదృతే తేషాం కాలసంఖ్యా న విద్యతే

కాలాదృతే న నిగమో న దీక్షా నాహ్నికక్రమః

 ఋతునామవిభాగశ్చ పుష్పమూలఫలం కుతః

 కుతః సస్యాభినిష్పత్తిర్గుణౌషధి గణాదివా

 అభావో వ్యవహారాణాం దేవానాం దివి చేహ చ

 జగత్ప్రతాపనమృత భాస్కరం వారి తస్కరమ్

సర్వలోకములలో వ్యాపించియున్న యే(రవి)తేజముగలదో అది రుద్ర-ఇంద్ర-ఉపేంద్ర(విష్ణువు)-చంద్రులయొక్కయు, స్వర్గవాసులైన దేవతలయొక్కయు, కాంతిమంతములైన మరి యితరముల యొక్కయు సమస్తమైన కాంతియే-35. సూర్యుడు సర్వాత్ముడు, సర్వలోకములకీశుడు, సర్వమునకును మూలమైన పరమదైవతమా ఆతనినుండియే సర్వము బుట్టును, ఆతనీయందే లీనమగును-36. పూర్వము లోకముల యొక్క కలిమి లేములు సూర్యుని నుండియే బయలు వెడలినవి. ఓ బ్రాహ్మణులారా! జపముచేదెలియదగినవాడై కాంతిమంతమైన గ్రహము సుగ్రహమైన రవియే-37. ప్రాణులు సూర్యునియందు మృతిజెందుదురు. మరలమరల బుట్టుదురు. గూడను క్షణములు, ముహూర్తములు, దివసములు, (పగళ్ళు), రాత్రులు, పక్షములు, మొత్తమును. నెలలు, సంవత్సరములు, ఋతువులు, సంవత్సరములు, యుగములును వీనికి సూర్యుడు లేనిచో కాలగణనముండదు. కాలములే కున్న, వేదము లేదు, దీక్షలేదు, ఆహ్నికక్రమము లేదు-39. ఋతువుల నామవిభాగమును లేదు. ఇక పుష్పములు మూలమైన ఫలము లుండునా? పంటలు పండుటయుండునా? గుణవంతము లైనమౌషధిగణములుమొదలైనవుండునా?-40. జగమును తపింప జేయునీటి దొంగ (జలమునెండజేయు) సూర్యుడు లేకున్న స్వర్గమర్త్యలోకములలోను దేవతల వ్యవహారములే యుండవు.

సకలశ్చాగ్నిశ్చ ద్వాదశాత్మా ప్రజాపతిః

 తపత్యేష ద్విజశ్రేష్ఠాః స్త్రైలోక్యం సచరాచరమ్

 స యే తేజసాం రాశిః సమస్తః సార్వలౌకికః

 ఉత్తమం స్వర్గమాస్థాయ వామోర్బాభిరిదం జగత్

 పార్వమూర్థ్వమధశ్చైవ తాపయత్యేష సర్వశః

రవే రశ్మిసహస్రం యత్ ప్రాఙ్మయా సముదాహృతమ్

 తేషాం శ్రేఅహ్ఠాఃపునః సప్తరశ్మయో గ్రహయోనయః

 సుషుమ్నహరికే శశ్చ విశ్వకర్మా తథైవచ

 విశ్వశ్రవాః పునశ్చాన్యః సంపద్వసురతః పరమ్

 అర్వావసుః పునశ్చావ్యోమయాచాత్ర ప్రకీర్తితః

సుషుమ్నః సూర్యరశ్మిస్తు క్షీణం శశిన మేధయన్

 తిర్యగూర్ధ్వృభావో సౌసుషుమ్నః ప్రకీర్త్యతే

హరికేశః పురస్త్యాద్యాఋక్షయోనిః ప్రక్రీర్త్యతే

 దక్షిణే విశ్వకర్మా తు రశ్శిర్వర్థయతే బుధమ్

 విశ్వశ్రవాస్తు యః పశ్చాత్ శుక్రయోనిః స్మృతోబుధైః

 సంపద్వసుశ్చ యో రశ్మిః సాయోని ర్లోహితస్య చ

 షష్ఠస్త్వర్వావ సూరశ్మిర్యోనిస్తు సబృహస్పతేః

శనైశ్చరంపునశ్చాపిరశ్మిరాప్యాయతే స్వరాట్

 ఏవం సూర్యప్రభావేణ గ్రహనక్షత్ర తారకాః

వర్షన్తే విదితాః సర్వావిశ్వం చేదం పునర్జగత్

 న క్షీయన్తే పునస్తాని తస్మాన్నక్షత్రతా స్మృతా

ఆ సూర్యుడే కాలము, అగ్ని, ద్వాదశాత్ముడు (పండ్రెండు రూపములుగలవాడు), ప్రజాపతి(బ్రహ్మ), ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! చరాచరములతోనున్న ఈ మూడు లోకములను (స్వర్గమర్త్యపాతాళములను) ఎండగాసి తపింపజేయును-42. ఆయీరవియే సర్వలోకములకు సంబంధించిన తేజస్సులరాశి. వాయువుయొక్క కాంతులచే జగత్తునను, ఉత్తమమైన స్వర్గమునను నిలిచి, ప్రక్కభాగమును, పైభాగమును, క్రింది భాగమును నంతట తపింపజేయును-43. నేనిదివరకే సూర్యుని వేయికిరణములను గూర్చి చెప్పితిని. వానిలో మరి శ్రేష్ఠములైన యేడుకిరణములు గ్రహముల(జన్మల)కు కారణములు 44. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వశ్రవము, సంపద్వసువు, ఆర్వావసువు, (స్వరాట్)-అనియే యేడు కిరణములిట జెప్పబడినవి-45. సుషుమ్నమను సూర్యరశ్మి క్షీణించిన చంద్రుని వృద్ధిజెందించుచు, తిర్యక్ (అడ్డముగను) ఊర్ధ (పైభాగమునను) ప్రభావముగలదై యిది సుషుమ్నమనబడును-46. హరికేశమను సూర్యరశ్మి ముందుగనే (తూర్పున యుండి నక్షత్రము (పుట్టుక)లకు కారణమనబడినది. దక్షిణమున విశ్వకర్మయను సూర్యకిరణము బుధునివృద్ధి బొందించును 47. పశ్చిమమున విశ్వశ్రవమను సూర్యకిరణము శుక్రగ్రహజన్మకు కారణమని పండితులతో జెప్పబడినది. సంపద్వసువను సూర్యరశ్మి అంగారకగ్రహజన్మకు కారణమైనది-48. ఆరవదైన యర్వావసువను సూర్యరశ్మి గురుగ్రహజన్మకు గారణమైనది. స్వరాట్ అనుసూర్యరశ్మి శనిగ్రహమును దృప్తిపరచును-49. ఈ విధముగ సూర్య ప్రభావమున (సూర్యకాంతిచే) గ్రహములు, నక్షత్రములు, తారకలు అన్నియు తెలియబడినవై వృద్ధిజెందును. ఈ విశ్వమును, ఈ జగమును వృద్ధిజెందును. మరియవి క్షీణింపవు. కావున అవి నక్షత్రములనబడినవి.

క్షేత్రాణ్యేతాని వై పూర్వమాపతన్తి గభస్తిభిః

తేషాం క్షేత్రాణ్యథా దత్తే సూర్యో నక్షత్రతాం గతః

 తీర్ణానాం సుకృతేనేహ సుకృతాన్తే గ్రహాశ్రయాత్

 తారాణాం తారకాహ్యేతాః శుక్లత్వాచ్చైవ తారకాః

 దివ్యానాం పార్థివానాంచ నైశానాం చైవ సర్వశః

ఆదానాన్నిత్య మాదిత్యస్తమసాం తేజసాం మహాన్

సువతి స్పందనార్థే చ ధాతురేష విభావ్యతే

 సవనాత్తేజసోఽపాం చ తేనాసౌ సవితా మతః

 బహ్వర్థశ్చంద్రఇత్యేష హ్లదనే ధాతురిష్యతే

 శుక్లత్వేచామృతత్వే చ శీతత్వే చ విభావ్యతే

సూర్యాచంద్రమసోర్దివ్యే మండలే భాస్వరే ఖగే

 జ్వలత్తేజోమయే శుక్లే వృత్తకుంభ నిభే శుభే

 ఘనతేయాత్మకం తత్ర మండలం శశినః స్మృతమ్

 ఘనతేజోమయం శుక్లం మండలం భాస్కరస్య తు

 విశన్తి సర్వదేవాస్తు స్థానాన్యేతాని సర్వశః

 మన్వంతరేషు సర్వేషు ఋక్షసూర్య గ్రహాశ్రయాః

 తాని దేవగృహాణ్యేవ తదాఖ్యాస్తే భవన్తి చ

 సౌరం సూర్యోవిశస్థానం సౌమ్యం సోమస్తథైవ చ

 శౌక్రం శుక్రో విశస్థానం షోడశార్చిః ప్రతాపవాన్

 బృహద్బృహస్పతిశ్చైవ లోహితశ్చైవ లౌహితః

 శనైశ్చరం తథాస్థానం దేవశ్చైర శనేశ్వరః

ఆదిత్యరశ్మి సంయోగాత్ సంప్రకాశాత్మికాః స్మృతాః

 నవయోజనసాహస్రో విష్కంభః సవితుః స్మతః

 త్రిగుణస్తస్యవిస్తారో మండలశ్చ ప్రమాణతః

ద్విగుణః సూర్యవిస్తారాద్విస్తారః శశినః స్మృతః

తుల్యస్తయోస్తు స్వర్భానుర్భూత్వాధస్తాత్ప్ర సర్పతి

 ఉద్ధృత్యపార్థివచ్ఛాయాం సనిర్మితో మండలాకృతిః

 స్వర్భానోస్తు బృహత్ స్థానం నిర్మితం యత్తమోమయమ్

 ఆదిత్యాత్తచ్చ నిష్క్రమ్య సోమం గచ్ఛతి పర్వసు

 ఆదిత్య మేతిసోమాచ్చ పునః సోమం చ పర్వసు

 స్వర్భాసానుదతే యస్మాత్తతః స్వర్భానురుచ్యతే

 చంద్రస్య షోడశో భాగో భార్గవశ్చ విధీయతే

 విష్కంభాన్మండలాచ్చైవ యోజనాగ్రాత్ప్రమాణతః

 భార్గవత్పాదహీనస్తు విజ్ఞేయో వై బృహస్పతిః

 బృహస్పతేః పాదహీనౌమజసౌరావుభౌస్మృతౌ

 విస్తారన్మండలాచ్ఛైవ సాదహీనస్తయోర్బుధః

తారా నక్షత్రరూపాణి స్వవపుష్మన్తీహ యాని వై

 బుధేన సమతుల్యాని విస్తారాన్మండలాదథ

 ప్రాయశశ్చంద్రయోగాని విద్యాదృక్షాణి తత్త్వ విత్

 తారా నక్షత్రరూపాణి హీనాని తం పరస్పరమ్

 శతాని పంచచత్వారి త్రీణి ద్వే చైవ యోజనే

పూర్వాపరనికృష్ణాని తారకామండలాని తు

 యోజనాన్యర్ధమాత్రాణి తేభ్యో హ్రస్వం న విద్యతే

 ఉపరిష్టాత్రయస్తేషాం గ్రహా యే దూరసర్పిణః

 సౌరోఽగిరాశ్చ వక్రశ్చ జ్ఞేయామంద విచారిణః

తేభ్యోఽధస్తాత్తు చత్వారః పునరన్యే మహాగ్రహాః

సూర్యః సోమో బుధశ్చైవ భార్గవశ్చైవ శీఘ్రగాః

యావంత్యస్తారకాకోట్య సౌస్తావద్భక్షాణి సర్వశః

 వీధనాం నియమాచ్చైవ మృక్షమార్గో వ్యవస్థితః

 గతిస్తా స్త్వేవ సూర్యస్య నీచోచ్చత్వే ఽయనక్రమాత్

 ఉత్తరాయణ మార్గస్థో యదా పర్వసు చంద్రమా

 బౌధం బౌధోఽథ స్వర్భానుః స్వర్భానోః స్థానమాస్థితః

 నక్షత్రాణి చ సర్వాణి నక్షత్రాణి విశన్త్యుత

గ్రహాణ్యేతాని సర్వాణి జ్యోతీంషి సుకృతాత్మనామ్

 కల్పాదౌ సంప్రవృత్తాని నిర్మితాని స్వయంభువా

 స్థానాన్యేతాని తిష్ఠన్తి యావదాభూత సంప్లవమ్

 మన్వంతరేషు సర్వేషు దేవతాయతనాని వై

 అభిమానినోజ్వ తిష్ఠన్తి యావదాభూత సంప్లవమ్

పూర్వము కిరణములచేత ఈ క్షేత్రములు పడిపోవును. తరువాత సూర్యుడు నక్షత్రత్వమును బొంది వారిక్షేత్రములను స్వీకరించును-51. ఈ లోకమున, పుణ్యము చేత తరించిన తారలు పుణ్యము క్షీణింపగా గ్రహము నాశ్రయించుటవలనను తెల్లవైనందునను ఇవి(నక్షత్రములు) తారలకు చీకటినుండి తరింపజేయునవైనందునను తారకలైనవి-52. దివ్యములైనవి యు (ఆకాశముననున్నవియు), భూమి పైనున్నవియు రాత్రికి సంబంధించినవియు నైన చీకటులను తేజస్సులను ప్రతినిత్యము ఆదానము (చీకటుల ఖండించుటను, తేజస్సులను స్వీకరించుటను జేయుటచే సూర్యుడు ఆదిత్యుడైనాడు-53. సుధాతువు స్పందనార్థము గలదిగ భావింపబడును. తేజస్సును నీటిని(ఎండచే) కందిలింపజేయుట వలన సూర్యుడు సవిత యనబడును 54. 'చంద్ర' యనుశబ్దము బహ్వర్థకము, చది ధాతువు ప్లదనము (సంతోషమున) తెలుపు దనము అమృతత్వము శీతత్వము ఈయర్థములలో భావింపబడును-55. సూర్యచంద్రులయొక్క మండలములు దివ్యములు (ఆకాశమున నుండునవి), ప్రకాశవంతములు, ఆకాశమున బోవునవి. మండుచున్నతేజముతో నిండినవి. తెల్లనివి, గుండ్రని కుండతో బోలినవి, మంగళకరములైనవి-56. అందులో చంద్రుని మండలఘనీభూతమైన జలరూపమనబడినది. సూర్యుని మండలము ఘనీభూతతేజోరూపము. తెల్లనిది-57. సమస్తదేవతలు ఈ స్థానములందంతటను బ్రవేశింతురు. అన్నీ మన్వంతరములలోను నక్షత్రసూర్యగ్రహములనాశ్రయింతురు-58. అవి దేవగృహములే ఆదేవతల పేరులుగలవి యగును. సౌరమండలము సూర్యుడు ప్రవేశించిన స్థానము చంద్రమండలము అట్లే చంద్రుడు ప్రవేశించిన స్థానము-59. శుక్రమండలము శుక్రుడు ప్రవేశించిన స్థానము ఆతడు పదునాఱువెలుగులుగలవాడై ప్రతాపవంతుడు. గురుమండలము గురువు ప్రవేశించిన స్థానము. అంగారక మండలము అంగారకుడు ప్రవేశించిన స్థానము, శని మండలము శనిదేవుని స్థానము-60. సూర్యకిరణ సంయోగములవలన తక్కిన గ్రహములన్నియు వెలుగుగలవి యనబడినవి. సూర్యుని విష్కంభము(విరివి) వృత్తవ్యాసము) తొమ్మిదివేల యోజనము లనబడినది-61. ఆ సూర్యుని విస్తారము మండలమున్ను పైదానికి మూడింతలు. సూర్యుని విస్తారమునకన్న చంద్రుని విస్తారము రెండింతలనబడినది. రాహువుయొక్క విశాలమైన స్థానము చీకటిమయముగా నిర్మింపబడినది. అది పర్వములలో సూర్యుని నుండి వెడలి చంద్రుని జేరును-64. చంద్రుని నుండి సూర్యుని జేరును. మరల పర్యాయములలో మరల చంద్రుని జేరును. ఆకాశకాంతిచే ప్రేరేపించును గాన స్వర్భానువనబడుచున్నాడు-65, చంద్రుని యొక్క పదునారవ భాగము శుక్రుడని విధింపబడినది. ఈ పదునారవ భాగము వ్యాసమునుండిగాని, మండలమునుండిగాని, యోజనము చివరినుండి గాని ప్రామాణికమని తెలియవలె-66. శుక్రునికంటెగురువు పావుతక్కువవాడు. గురువుకంటే కుజశనులిద్దరును పావుతక్కువ వారనబడిరి. విస్తారమునుండిగాని, మండలమునుండిగాని కుజశనులకంటే పావుతక్కువవాడు. బుధుడు 67. తారానక్షత్ర రూపములై శరీరము (ఆకారము) దాల్చినవన్నియు విస్తారమునుండి గాని మండలమునుండిగాని బుధునితో సమతుల్యములు-68. తత్యజ్ఞానిసామాన్యముగా చంద్రయోగములును విద్యావృక్షములును తారా నక్షత్రరూపములును పరస్పరము తక్కువగా జెప్పును-69. రెండువేల మూడువందల నలుబదియైదువందల (234500) యోజనములు పరస్పరముగ పూర్వాపనికృష్టములైనవి (తక్కువైనవి) మండలములు సగము యోజనములు తక్కువనిగూడగలవు. అంతకు తక్కువని లేవు-70. వానికి పైననుండి దూరముగా బోవునట్టి మూడు గ్రహములు శని, గురువు, వక్రగ్రహమున్ను ఇవి మెల్లెగా చరించునవి 71. వాని కంటే క్రిందవేరైనవి నాలుగు మహాగ్రహములు సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడును ఇవిశీఘ్రముగా (తొందరగా)చరించుగ్రహములు-72. ఎన్నికోట్ల తారకలున్నవో అన్ని కోట్ల నక్షత్రములు అంతటను గలవు. వానికి వీధులనియముగలదు. ఈ రీతిగ నక్షత్రమార్గము వ్యవస్థీకరింపబడినది-73. సూర్యుని యొక్క నీచ-ఉచ్చభావములలో అయనక్రమము ననుసరించి యానక్షత్రవీధులందే గమనముండును. పర్వములందు చంద్రుడు ఉత్తరాయణ మార్గమునందున్నపుడు, బుధుడు బుధస్థానమును, రాహువు రాహుస్థానమును బట్టుకొనియుందురు-74. పుణ్యాత్ములయొక్క నక్షత్రములు అన్ని నక్షత్రములు ప్రవేశించును. పుణ్యాత్ముల యొక్క గ్రహములన్నియు ఈయన్ని జ్యోతిస్సులను బ్రవేశించును-75. బ్రహ్మచే నిర్మింపబడి, కల్పాదియందు ఏర్పడిన యీ స్థానములు భూతప్రళయము వరకును ఉండును 76, అన్నిమన్వంతరములలోను దేవాలయములను అభిమానులు భూతప్రళయము వరకు ఉందురు.

అతీతైస్తు సహాతీతాః భావ్యభావ్యైః సురాసురైః

వర్తతే వర్తమానైశ్చ స్థానాని స్యైః సురైః సహ

అస్మిన్మన్వంతరే చైవ గ్రహా వైమానికాః స్మృతాః

 వివస్వానదితేః పుత్రః సూర్యో వైవస్వతేఽ తరే

 త్విషిమాన్ ధర్మపుత్రస్తు సోమదేవో వసుం స్మృతః

 శుక్రో దేవస్తు విజ్ఞేయో బార్గవోఽసురరాజకః

బృహత్తేజా స్మృతో దేవో దేవాచార్యోఽగిరః సుతః

 బుధో మనో హరశ్చైవ త్విషిపుత్రస్తు స స్మృతః

 అగ్నిర్వికల్పాత్ సంజజ్ఞే యువా సౌ లోహితాధిపః

 నక్షత్రఋక్షగామిన్యోయ దాక్షాయణ్యః స్మృతాస్తుతాః

 స్వర్భానుః సింహికా పుత్రో భూతసంతాపనోఽసురః

 సోమక్షగ్రహసూర్యే తు కీర్తితాస్త్వభి మానినః

భావ్యభావ్యులై (ఉండదగినవారు ఉండదగని వారునై) గడచిపోయిన సురాసురులతోబాటు దేవతలు గడచిన వారగుదురు. వర్తమానులైన తమ సురులతోబాటు దేవతలు గడిచిన వారగుదురు. వర్తమానులైన తమ సురులతో బాటువారీ స్థానములును దేవస్థానములు) ఉండును-78. ఈ మన్వంతరమున గ్రహములు వైమానికులనబడిరి. వైవస్వతమన్వంతరమున అదితి పుత్రుడైన వివస్వంతుడు సూర్యుడు-79. త్విషిమంతుడై (కాంతిమంతుడై) ధర్మపుత్రుడైన సోమదేవుడు వసువన బడినాడు. భృగువంశీయుడై దేవుడైన శుక్రుడు రాక్షసరాజగురువు-80. గొప్ప తేజస్సుగలిగిదేవుడైన అంగిరసుని పుత్రుడగు ఆంగిరసుడు (గురువు) దేవగురువన బడినాడు. మనోహరుడైన బుధుడు త్విషి (కాంతికిరణ) పుత్రుడనబడినాడు. వికల్పము నుండి అగ్నిపుట్టెను. యువకుడైన యీ యగ్నియంగారకుడన బడెను. నక్షత్ర - ఋక్షములతో బోవువారు దాక్షాయణులన బడిరి-82. సింహికాపుత్రుడైన రాహువు భూతములను సంతపింపజేయురాక్షసుడు. వీరందరు చంద్ర ఋక్ష గ్రహసూర్యులం దభిమానులుగా జెప్పబడినారు.

స్థానాన్యేతాన్యధోక్తాని స్థానిన్యశ్చైవ దేవతాః

 శుక్ల అగ్నిమయం స్థానం సహస్రాంశోర్వి వస్వతః

సహస్రాంశో స్త్విషః స్థానమమ్మయం శుక్లమేవ చ

అథ శ్యామం మనోజ్ఞస్య పంచరశ్మేర్గృహం స్మృతమ్

 శుక్రస్యాప్యమ్మయం స్థానం సద్మషోడశ రశ్మివత్

 నవరశ్మేస్తు యూనో హి లోహి తస్థానమమ్మయమ్

 హరిశ్చా(చ్ఛా)ప్యం బృహచ్చాపి ద్వాదశాంశో ర్భృహస్పతేః

అష్టరశ్మేర్గృహం ప్రోక్తం కృష్ణం బుద్ధస్య అమ్మయమ్

 స్వర్భానోస్తామసం స్థానం భూతసంతాపనాలయమ్

 విజ్ఞేయా సారకాః సర్వాస్త్యమ్మయాస్త్వేకరశ్మయః

ఆశ్రయాః పుణ్యకీర్తీనాం సుశుక్లాశ్చైవ వర్ణతః

 ఘనతోయాత్మికా జ్ఞేయాః కల్పాదౌ వేదనిర్మితాః

 ఉచ్చత్వాద్దృశ్యతే శీఘ్రమభివ్యక్తైర్గభస్తిభిః

తథా దక్షిణమార్గస్థో నీవివీధీ సమాశ్రితః

ఇక ఈ స్థానములు చెప్పబడినవి. ఆ స్థానములు గల దేవతలు గూడ జెప్పబడినారు. సహస్ర కీరణుడైన వివస్వంతుని యొక్క (సూర్యుని యొక్క) స్థానము శుక్లము (తెల్లనిది) అగ్నిమయముగూడను-84. వేయికిరణములు గల సూర్యుని (యొక్క) కాంతియొక్క స్థానము జలమయము. తెల్లనిదే యైయుండును. తరువాత నల్లనిది మనోహరుడైన పంచరశ్మియొక్క గృహము (ఐదు కిరణములయొక్కగృహము)గా జెప్పబడినది-85. శుక్రుని యొక్క స్థానముగూడ జలమయము. అది షోడశరశ్మివత్తు పదునాలు కిరణములు గలది. తొమ్మిదికిరణములుగల యువకుడైన యంగారకుని యొక్క స్థానము జలమయము. తొమ్మిది కిరణములుగలది-86. పండ్రెండు కిరణములుగల బృహస్పతి(గురువు)యొక్క స్థానము జలమయమును, విశాలమైనదియు, పచ్చనైనదియునగును. ఎనిమిది కిరణములుగల బుద్దునియొక్క గృహము (స్థానము) జలమయమై నల్లనైనది-87. రాహువుయొక్క స్థానము చీకటినిండినదై భూతములను (ప్రాణులను) పీడించుస్థానము తారకలన్నియు జలమయములై ఒకే కిరణముగలవిగా తెలియదగినవి-88. పుణ్యకీర్తులకాశ్రయమైనవి, రంగులో మంచి తెల్లనివి. ఘనీభవించి జలరూపములు, కల్పాదిలోవేదములచే నిర్మింపబడినవి-89. ఎత్తైనందున ప్రకటించినకిరణములచే తొందరగా గనబడును. అట్లే దక్షిణమార్గమునందున్న వాడై (నీవిప్రోకముడి) వీధినాశ్రయించిన వాడట్లే కనబడును.

భూమిలేఖావృతః సూర్యః పూర్ణామావాస్యయోస్తథా

 న దృశ్యతే యథాకాలం శ్రీఘతోఽస్తము పైతి చ

 తస్మాదుత్తర మార్గస్థో హ్యమావాస్యాం నిశాకరః

 దృశ్యతే దక్షిణే మార్గే నియమాద్దృశ్యతే న చ

జ్యోతిషాం గతియోగేన సూర్యచంద్రమ సావుభౌ

 సమానకాలాస్తమయౌవిషువత్సు స మోదయౌ

 ఉత్తరాసు చ వీథీసువ్యతలాస్తమయోదయౌ

 పూర్ణామావాస యయో ర్జేయౌ జ్యోతిశ్చక్రానువర్తినౌ

 దక్షిణాయనమార్గస్థో యదా భవతి రశ్మివాన్

 తదా సర్వగ్రహాణాం ససూర్యోధస్తాత్ప్రసర్పతి

 విస్తీర్ణం మండలం కృత్వా తస్యోర్ధ్వం చరతే శశీ

 నక్షత్రమండలం కృత్నం సోమాదూర్థ్వం ప్రసర్పతి

 నక్షత్రేభ్యో బుధశ్చోర్ధ్వం బుధాదూర్ధ్వం బృహస్పతిః

 తస్మాచ్ఛనైశ్చరశ్చోర్ధ్వం తస్మాత్సప్తర్షి మండలమ్

ఋషీణాం చైవ సప్తానాం ధ్రువ ఊర్ధ్యం వ్యవస్థితః

 ద్విగుణేషు సహస్రేషు యోజనానాం శతేషు చ

 తారాగ్రహాన్తరాణి స్యుః రుపరిష్టాద్యథాక్రమమ్

 గ్రహాశ్చ చంద్రసూర్యే తు దివి దివ్యేన తేజసా

 నిత్యమృక్షేషుయుజ్యన్తి గచ్చన్తి నియమక్రమాత్

 గ్రహనక్షత్రసూర్యాస్తు నీ చోచ్చ మృద్వవస్థితాః

సమాగమే చ భేదే చ పశ్యన్తి యుగపత్ప్రజాః

 పరస్పరస్థితా హ్యేతే యుజ్య న్తే చ పరస్పరమ్

 అసంకరేణ విజ్ఞేయస్తే యోగస్తు వై బు ధైః

 ఇత్యేష సన్నివేశో వః పృథివ్యాం జ్యౌతిషస్య చ

 ద్వీపానాముదధీ నాంచ పర్వతానాం తథై వచ

 వర్షాణాం చ నదీనాం చ యేషు తేషు వసన్తి వై

 ఏతే చైవగ్రహాః పూర్వం నక్షత్రేషు సముత్థితాః

 వివస్వానదితేః పుత్రః సూర్యో వై చాక్షుషేఽన్తరే

 విశాఖా సుసముత్పన్నో గ్రహాణాం ప్రథమో గ్రహః

 త్విషిమాన్ ధర్మపుత్రస్తు సోమోవిశ్వావసుస్తథా

 శీతరశ్మిః సముత్పన్నః కృత్తికాసు నిశాకరః

షోడశార్చీర్భృగోః పుత్రః శుక్రః సూర్యాదనన్తరమ్

 తారాగ్రహాణాం ప్రవరస్తిష్య క్షత్రే సముత్థితః

 గ్రహశ్చాంగి రసః పుత్రోద్వాదశార్చి బృహస్పతిః

 ఫాల్గునీషు సము త్పన్నః సర్వసు చ జగద్గురుః

 నవార్చిర్లోహితాంగస్తు ప్రజాపతిసుతో గ్రహః

ఆషాఢాస్త్విహ పూర్వాసు సముత్పన్న ఇతిశ్రుతిః

 రేవతీ ష్వేవ సప్తర్చిస్తథా సౌరశనేశ్వరః

రోహిణీషు సముత్పన్నౌ గ్రహౌ చంద్రార్కమర్దనౌ

 ఏతే తారాగ్రహాశ్చైవ బోద్దవ్యా భార్గవాదయః

 జన్మనక్షత్రపీడాసు యాన్తి వైగుణ్యతాం యతః

స్పృశన్తే తేన దోషేణ తతస్తాగ్రహభక్తిషు

భూమియొక్క రేఖతో నావరింప(జుట్ట)బడిన సూర్యుడు పూర్ణిమ అమావాస్యలందు కనబడడు. కాలానుగుణముగా నస్తమించును-91. అందువలన ఉత్తరమార్గమందున్న చంద్రుడు అమావాస్యలో జూడబడడు. కాని దక్షిణమార్గమందున్న చంద్రుడు నియమముగా జూడబడడు-92. విషువద్దినములందు (రాత్రిపగలు సమముగానున్న దినములందు) సూర్యచంద్రు లిద్దరును, జ్యోతిస్సు(నక్షత్రము)లగతి యోగముచే సమానకాలమున నస్తమయమును సమానకాలమున నుదయయును గలవారగుదురు-93. ఉత్తరమార్గములందు అంతరము (భేదము) లేని యస్తమ యాదయములు గలవారై జ్యోతిశ్చక్రము (నక్షత్రచక్రము) ననుసరించు వారగుదురని తెలియవలె-94. సూర్యుడు దక్షిణాయన మార్గమందున్నపుడు ఆ సూర్యుడన్ని గ్రహములకంటె క్రిందుగా చరించును-95. చంద్రుడు విశాలమండలము జేసికొని సూర్యునకు పైన చరించును. సమస్త నక్షత్రమండలము చంద్రునికంటె పైగా చరించును-96. నక్షత్రముల కంటే పైనబుధుడు, బుధునికంటే పైన గురువును గురునకంటే పైన శనియు, శనికంటే పైన సప్తర్షిమండలమును, ఆసప్తర్షిమండలమునకంటే పైనధ్రువుడును నిలువరింపబడి యున్నారు-97. ఊర్ధ్వభాగమున తారాగ్రహముల యంతరములు (మధ్య దూరములు) రెండు లక్షలయోజనములలో యథాక్రమముగ నుండును-98. గ్రహములు, చంద్ర సూర్యులను ఆకాశమున దివ్య తేజస్సుతో నియమ క్రమము ననుసరించి నిత్యనక్షత్రములతోగూడును. అచటికి వెడలును-99. గ్రహములు నక్షత్రములు సూర్యుడును నీచలోను ఉచ్చలోను మార్దవములోను ఉన్నవారై వారికలయికలోను విడువడినప్పుడును ప్రజలను ఒక మారు జూతురు-100. వీరు పరస్పరముగా (ఒకరిస్థానమున మరొకరుగా)నుందరు. పరస్పరముగా గలిసియుందురు. పండితులు వారి సంయోగమును సంకరముగ భావింపరాదు. సహయోగమునే తెలియవలెను-101. అని యీ విధముగా భూమిపై గ్రహనక్షత్ర సూర్యులున్న జ్యోతిస్సుల యొక్కయు ద్వీపముల యొక్కయు, సముద్రముల యొక్కయు, నదుల యొక్కయు, పర్వతముల యొక్కయు అట్లే వర్షముల యొక్కయు, నదుల యొక్కయు, సన్నివేశము మీకు ఓ ముని బ్రాహ్మణులారా! చెప్పబడినది. ఈ గ్రహములే పూర్వము నక్షత్రములందుండి యుదయించిరి- 103. చాక్షుషమన్వంతరమున వివస్వంతుడును. అదితి పుత్రుడును. గ్రహములలో మొదటగ్రహమైన సూర్యుడు విశాఖానక్షత్ర గణమున బుట్టెను-104. త్విషిమంతుడు (కిరణవంతుడు) ధర్మపుత్రుడును. సోముడును విశ్వావసువును, శీతరశ్మియునైన చంద్రుడు కృత్తికానక్షత్రగణమున బుట్టెను-105. పదునారు కిరణములు గలవాడును, భృగుపుత్రుడును, సూర్యుని తరువాత తారా గ్రహములలో శ్రేష్ఠుడును ఐన శుక్రుడు పుష్యమి నక్షత్రమున బుట్టెను-106. ఆంగీరసపుత్రుడును. పండ్రెండు కిరణములు గలవాడును జగద్గురవైన బృహస్పతి గ్రహము ఫల్గునీ నక్షత్రగణములన్నింటను బుట్టినాడు-107. తొమ్మిది కిరణములుగలిగి. ప్రజాపతిసుతుడై, గ్రహమైన అంగారకుడు పూర్వాషాఢ నక్షత్రగణమందు బుట్టెను-108. ఏడు కిరణములు గలిగి, సూర్యపుత్రుడైన శనేశ్వరుడు రేవతీ నక్షత్రగణమందు బుట్టెను. రోహిణీ నక్షత్రగణమందు రాహుకేతుగ్రహములు బుట్టిరి-109. వీనిని తారలు గను (నక్షత్రములుగను) గ్రహములుగను దెలియవలెను. శుక్రాది గ్రహములు జన్మనక్షత్ర పీడలందు పైగుణమును బొందినందున గ్రహభక్తులలో) వారు ఆదోషముతో స్మృశింపబడుదురు.

సర్వగ్రహాణామేతేషామాదిరాదిత్య ఉచ్యతే

 తారాగ్రహాణాం శక్రస్తు కేతూనాం చైవ ధూమవాన్

 ధ్రువః కాలో గ్రహాణాం తు విభక్తానాం చతుర్దిశమ్

 నక్షత్రాణాం శ్రవిష్ఠా స్యాదయనానాం తథోత్తరమ్

 వర్షానాం చాపి పంచనామాద్యః సంవత్సరః స్మృతః

 ఋతూనాం శిశిరం చాపి మాసానాం మాఘ ఏవ చ

 పక్షాణాం శుక్లపక్షస్తు తిథీనాం ప్రతిపత్తథా

 అహోరాత్రవిభాగానామహశ్చాపి ప్రకీర్తితమ్

 ముహూర్తానాం తథైవాదిర్ముహూర్తో రుద్రదైవతః

 అక్షోశ్చాపి నిమేషాదిః కాలః కాలవిదో మతః

 శ్రవణాంతం శ్రవిష్ఠాదియుగం స్యాత్పంచవార్షికమ్

 భానోర్గతి విశేషేణ చక్రవత్ పరివర్తతే

 దివాకరః స్మృతస్తస్మాత్కాలస్తం విద్ధిచేశ్వరమ్

 చతుర్విధానాం భూతానాం ప్రవర్తక నివర్తకః

 ఇత్యేష జ్యోతిషామేవ సన్నివేశోఽర్థనిశ్చయాత్

 లోకసంవ్యవహారార్థమిశ్వరేణ వినిర్మితః

 ఉత్పన్నః శ్రవణేనాసౌ సంక్షిప్తశ్చ ధ్రువే తథా

 సర్వతోఽన్తేషు విస్తీర్ణో వృక్షకార ఇతిస్థితిః

 బుద్ధిపూర్వం భగవతా కల్పాదౌ సంప్రకీర్తితః

 సాశ్రయః సోఽభిమానీ చ సర్వస్య జ్యోతిరాత్మకః 

విశ్వరూపః ప్రధానస్య పరిణామోఽయమద్భుతః

 నైవ శక్యం ప్రసంఖ్యాతుం యాథాతథ్యేన కేనచిత్

 గతాగతం మనుష్యేషు జ్యోతిషాం మాంసచక్షుషా

 ఆగమాదనుమానా చ్చప్రత్యక్షాదుపపత్తితః

పరీక్ష్య నిపుణం భక్త్యా శ్రద్ధాతవ్యం విపశ్చితా

 చక్షుః శాస్త్రం జలం లేఖ్యం గణితం బుద్ధిసత్తమాః

 పంచైతే హేతవో జ్ఞేయా జ్యోతిర్గణవిచింతనే

ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే జ్యోతిః సన్నివేశో నామత్రిపంచాశోఽధ్యాయః

 ఈ గ్రహములన్నింటికిని ఆదియైనవాడు ఆదిత్యుడనబడినాడు, తారాగ్రహములకు శుక్రుడు మొదటివాడు. కేతువులకు ధూమకేతువు మొదటివాడు. నలుదిక్కుల విభజింపబడిన గ్రహములకు కాలరూపుడైన ధ్రువుడే మొదటివాడు. నక్షత్రములకు ధనిష్ణానక్షత్రము మొదటిది. ఆయనములకు ఉత్తరాయణము మొదటిది-112. ఐదేండ్లకు సంవత్సరము మొదటిది. ఋతువులకు శిశీఋతువు మొదటిది. మాసములకు మాఘమాసము మొదటిది-113. పక్షములకు శుక్లపక్షము. తిథులకు ప్రతపత్తు రాత్రింబగళ్లకు పగలును మొదటివిగా జెప్పబడినవి-114. ముహూర్తములలో రుద్రదేవతాకమైన ముహూర్తము మొదటిది కనుల రెప్పపాటు కాలము కాలమునకు మొదటిదని కాలవేత్తకు సమ్మతమైనది-115. ధనిష్టా నక్షత్రము మొదలు శ్రవణానక్షత్రమువజకు జంటపంచవార్షిక మగును. అది సూర్యుని గతి విశేషముతో చక్రమువలె దిరుగును. కావున సూర్యుడు కాలమనబడినాడు. కావున సూర్యుని నీశ్వరునిగా దెలియుము. సూర్యుడు నాలుగువిధములైన (ప్రృధివి జల అగ్ని వాయు రూపములైన) భూతములకు పనులలోనుంచువాడును పనులనుండి తీసివేయువాడును అగును-117. ప్రయోజననిశ్చయము వలన ఈజ్యోతిస్సుల సన్నివేశమే లోకవ్యవహారముకై యీశ్వరునిచే నిశ్చయింపబడినది-118. శ్రవణముచే బుట్టిన యితడు ధ్రువునిలో సంక్షిపుడైనాడు. అంతట చివరలకు వ్యాపించిన వాడై వృక్షకారుని గానున్నవాడు-119. బుద్ధిపూర్వకముగా భగవంతునిచే కల్పాదిలో నీవిధముగా జెప్పబడినాడు. ఆతడాశ్రయముగలవాడు. అభిమాని అందరిని జ్యోతిస్వరూపుడు విశ్వరూపుడు, వీడు ప్రధానముగా జెప్పబడినాడు. ఆతడాశ్రయంగ గలవాడు. అభిమాని అందరికిని జ్యోతి స్వరూపుడు. విశ్వరూపుడు, వీడు ప్రధానము (ప్రకృతి)యొక్క యద్భుతపరిణామమైన వాడు-120. మనుష్యులందు జ్యోతిస్సుల (గ్రహనక్షత్రాదుల) రాకపోకలను నిజముగా మాంసనేత్రములతో జూచి లెక్కించి చెప్పుటకు సాధ్యపడదు-121. పండితుడు వేద ప్రమాణము వల్లను ప్రత్యక్ష ప్రమాణము వల్లను అనుమానప్రమాణము వల్లను, హేతువువల్లను నిపుణముగా భక్తితోను పరీక్షించి శ్రద్ధవహింప(నమ్మ) వలెను-122. జ్యోతిర్గణమును విచారించునపుడు కన్ను శాస్త్రము, జలము, వ్రాయదగినది. గణితము, బుద్ధి సత్తములు (మహాబుద్ధిమంతులు) ఈయైదును హేతువులుగా దెలియదగినవి.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున జ్యోతి:సన్నివేశమను నేబదిమూడవ యధ్యాయము.