వాయు మహా పురాణము
38 - భువనవిన్యాసో
సూత ఉవాచ:-
అతః పరం ప్రవక్ష్యామి దక్షిణం దిశమాశ్రితాః ।
యాద్రోణ్యః సిద్ధచరితాః శృణుతాహ్యనుపూర్వశః ॥
శిశిరస్యా చలేంద్రస్య పతంగస్యాంతరేణ చ ।
శ్లక్ష్ణ భూమిశ్రియాయుక్తం లతాలింగిత పాదపమ్ ॥
పృధుక్షే పోచ్చశిఖరైః పాదపైరుప శోభితమ్ ।
ఉదుంబరవనం రమ్యం పక్షి సంఘ నిషేవితమ్ ।
పక్వైర్విద్రుమ సంకాశైర్మధు పూర్ణైర్మనోరమై ।
జ్వలితం తద్వనం భాతి మహాకూభోపమైః ఫలైః ॥
తత్ సిద్ధయక్ష గంధర్వాః కిన్నరా ఉరగాస్తథా ।
విద్యాధరాశ్చ ముదితా ఉపజీవన్తి నిత్యశః ॥
సూతుడు పలికెను:- ఆ తఱువాత దక్షిణ దిక్కున నున్నవియు సిద్ధులు చరించినవి యునైన ద్రోణులు అనగా కొండపల్లములు పసులువేయుకంచెలు ఉన్నవి. అను పూర్వముగా వానిని వినుడు-1. శిశిరమను పర్వత శ్రేష్ఠమునకును పతంగ పర్వతము నకును మధ్యన గొప్ప వస్తువుల గలిసియున్న భూమి సంపదచే కూడియున్నదియు, తీవలల్లుకొన్న వృక్షములు గలదియు-2. విశాలముగా దూసుకొని పోయినట్లున్న యున్నత శిఖరములు గల వృక్షములతో బ్రకాశించి నదియు, పక్షిసంఘములు నివసించినది యు నై మనోహరమైన ఉదుంబర మేడిచెట్ల వనముగలదు-3.ఆ వనము పగడపు వన్నెతో పండి తేనెలు నిండినట్లు తీయనై మనోహరములై, పెద్దకడవలవంటి పండ్లతో మండినట్లు ప్రకాశించినది-4, సిద్దులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, ఉరగులు, అట్లే విద్యాధరులును సంతసించినవారై యావనము నాశ్రయించి జీవింతురు-5.
ప్రసన్న స్వాదుసలిలాస్తత్రనద్యో బహూదకాః ।
సురసామల తోయాస్తా: సరాంసి చ సమన్తతః॥
తత్రాశ్రమం భగవతః కర్దమస్య ప్రజాపతేః ।
రమ్యం సురగణాకీర్ణం సర్వతశ్చిత్ర కాననమ్ ॥
తామ్రవర్ణస్య శైలస్య పతంగస్యాంతరేణ తు ।
శతయోజన విస్తీర్ణం ద్వీయోజన శతాయుతమ్॥
తరుణాయతసంకాశైః పుండరీకైః సమస్తతః
సహస్ర పత్రైర్విక చైర్మహాపద్మై రలంకృతమ్॥
తథాభ్రమరసం లీనైః శతపత్రైః సుగంధిభిః ।
ప్రపుల్లైః శోభితజలం రక్తనీలైర్మహోత్పలైః ॥
సరోవరం మహాపుణ్యం దేవదానవ సేవితమ్।
మహోరగైర ధ్యుషితం నీలజాల విభూషితమ్ ॥
అచట నిర్మలమై తీయనైన జలములు గల నదులున్నవి. బహు జలములు గలవై సరసస్వచ్చ జలములు గల యా సరస్సులు అచట నంతటను గలవు-6. అచట కర్దమ ప్రజాపతియొక్కయాశ్రమము గలదు. అది రమ్యమైనది. దేవగణముచే నీండినది. దానియంతట చిత్రమైన వనముకలదు. ఆవనము ఆశ్రమముచుట్టుగా నూరు యోజనములు వ్యాపించినదీ-7. తామ్ర వర్ణ పర్వతమునకును పతంగ పర్వతమునకును మధ్యన నూరుయోజనముల విశాలమై రెండుయోజనముల పొడవైన మహాపుణ్య సరోవరము గలదు-8. అచట లేతనై విశాలమై చక్కని కాంతిగల తెల్లకమలముల చేతను, వేయిదళముల వికసించిన మహాపద్మముల చేతను, అంతట అలంకరింపబడినదియు-9. అట్లే తుమ్మెదలునిండి సుగంధముగల నూరు దళముల కమలముల చేతను, ఎరుపు నలుపు రంగులుగలిగి వికసించిన పెద్దకలువలచేతను ప్రకాశింపబడినదియు నైన-10. మహాపుణ్య వంతమై దేవ దానవ సేవితమై మహోరగులు నివసించినదియు. నల్లని జాలములతో (జలజంతువులతో) బ్రకాశించినదియు నైన యొక సరోవరము గలదు-11.
తస్య మధ్యే జనపదోహ్యాయతః శతయోజనః।
త్రింశద్యో జనవిస్తీర్ణో రక్తధాతు విభూషితః॥
తస్యోపరి మహారమ్యా ప్రాంశు ప్రాకారతోరణా ।
నరనారీ గణాకీర్ణా స్ఫీతా విభవవిస్తరైః ॥
వలభీ కూటనిర్వ్యూహై మణిభక్తి విచిత్రతైః ।
రత్న చిత్రార్పితతలై శ్లక్ష్ణ చిత్రోత్తరచ్చదైః ॥
మహాభవన మాలాభిర్మహా ప్రాంశుభిరుత్తమై ।
విద్యాధరపురం తత్ర శోభతే భ్రాజయచ్ఛుభమ్॥
ఆ సరోవర మధ్యన ఒక జనపదము కలదు. అది నూరుయోజనముల పొడవై ముప్పదీ యోజనముల వెడల్పు గలది. ఎఱ్ఱనీ ధాతువులచే శిలా వికారములచే నలంకరింప బడినది-12. దాని పైన గొప్ప మనోహరమై పొడవైన కోటగోడయు పెద్ద స్తంభములచే నేర్పడిన ద్వారమును గలది. నరనారీగణములు నిండినది. విస్తారమై భవములచే బలిసినది-13. కొణిగెల తోడి రహస్య వ్యూహముల చేతను, మణుల పట్టీలచే విచిత్రముగా నున్నవియు, రత్నములచే బొమ్మలు చిత్రించిన నేలలు గలవియు, ఆకర్షనీయ చిత్రములు గల కప్పులు గలవియు నైన గొప్ప భవనపంక్తులచే పొడవై మంగళమును ప్రకాశింపచేయుచు శోభిల్లినది-15.
విద్యాధర పతిస్తత్ర పులోమా తత్ర విశ్రుతః ।
చిత్రవేషధరః స్రగ్వీ మహేంద్ర సదృశద్యుతిః ।
దీప్తానాం చిత్రవేషాణాం సూర్యప్రతివ తేజసామ్ ।
విద్యాధర సహస్రాణామనేకేషాం సరాజరాట్ ॥
అచట విద్యాధరపతి పులోముడు ప్రసిద్ధుడు, చిత్రవేషములు ధరించువాడు, మాలలు ధరించువాడు, మహేంద్రునితో సమానమైన తేజముకలవాడు-16 దీప్తులు, చిత్రవేషములుగలవారు, సూర్యునితో సమానమైన తేజసము గలవారును అయిన వేలకొలది యనేకవిద్యాధరులకు ఆతడు రాజరాజు-17.
విశాఖ స్యాచలేంద్రస్య పతంగస్యాంతరేణ చ ।
సరసస్తా మ్రవర్ణస్య పూర్వేతర పరిశ్రుతమ్॥
పంచేషు క్షేపగైర్విద్ధం సుశాఖం వర్ణశోభితమ్ ।
సర్వకాలఫలం తత్ర స్పీతంచామ్రవనం మహత్॥
ఫలై కనకసంకాశైః మహాస్వారైః సుగంధిభిః ।
మహాకుంభ ప్రమాణైశ్చాతను శాఖైః సమంతత ॥
గంధర్వకిన్నరా యక్షానాగా విద్యాధరాస్తథా ।
పిబంత్యామ్రరసం తత్ర సుస్వాగుం హ్యమృతోపమమ్॥
తాత్రాశ్రుర సపీతానాం ముదితానాం మహాత్మనామ్ ।
శ్రూయన్తే హృష్టపుష్టానాం నాదాస్తస్మిన్ మహావనే ॥
విశాఖ పర్వత శ్రేష్ఠమునకును పతంగ పర్వతమునకును మధ్యన తామ్రవర్ణ సరస్సు యొక్క పూర్వ తీరమున ప్రసిద్ధి జెందిన గొప్ప ఆమవనము (మామిడితోట) గలదు-18. అది పంచబాణుని(మన్మథుని)బాణములైన మామిడి పూలచే గుచ్చబడినదా యన్నట్లు (విరగబూసిన మామిడి పూత గల) చక్కని మామిడి పూగొమ్మలు గలది. చక్కని మామిడి పూలవర్ణము గలది. వసంత కాలములోనే కాక యన్ని కాలములలోను మామిడి పండ్ల నిచ్చునది-19. ఆ పండ్లు బంగారు వన్నె గలవి. మిక్కిలి రుచిగలవి. సువాసనగలవి. పెద్ద కుండలంతటివి. ఆ మామిడి చెట్ల కొమ్మలు విశాలములై యంతట వ్యాపించియున్నవి-20. గంధర్వులు, కిన్నరులు, యక్షులు, వాగులు, విద్యాధరులు అమృతమువంటి తీయని హమామిడి పండ్ల రసమును అచట త్రాగుదురు-21. మామిడి పండ్ల రసమును ద్రాగి హృష్టపుష్టులైన మహాత్ముల నాదములు ఆ మామిడి వనములో వినబడుచుండును-22.
సుమూలస్యాచలేంద్రస్య వసుధారస్య చాంతరే ।
సమాసురభి పూర్ణాఢ్యా విహంగైరుప శోభితా॥
త్రింశద్యోజన విస్తీర్ణా పంచాశద్యోజ నాయతా ।
తత్ర బిల్వస్థలీ విప్రాః శుద్ధా నిమ్న ఫలద్రుమాః॥
సుస్వాదైర్విద్రుమనిభైః ఫలైర్బిల్వైర్మహోపమైః ।
శీర్యమాణెర్విశీర్ణైశ్చ ప్రక్లిన్నతల మృత్తికాః ॥
తాం స్థలీ ముపజీవన్తీ యక్షగంధర్వ కిన్నరాః ।
సిద్ధానాగాశ్చ బహుశో నిత్యం బిల్వఫలాశినః ॥
ఓ విప్రులారా! : - సుమూల పర్వత శ్రేష్ఠమునకును వసుధార పర్వతమునకును మధ్యన బిల్వస్థలి కలదు. అది సమముగా, సుగంధము నిండినదై పక్షులతో గూడుకొన్నదై ముప్పది యోజనముల విస్తీర్ణము ఏబది యోజనముల పొడవైనదై యొప్పినది. అచట బిల్వ వృక్షములు క్రింది కందుబాటులోనున్న ఫలశాఖలు గలవి-24. వాని పండ్లు రుచిగలిగి పగడపువన్నెగలవి. అందులో కొన్ని పగులుచున్నవి. కొన్నిపగిలినవి. అట్టి బిల్వఫలములచేత అచటి భూమి పై భాగమంతయు తడసినది-25. యక్ష గంధర్వ- కిన్నర- సిద్ధ-నాగులు నిత్యము ఆబిల్వఫలములు దినువారై యాబిల్వస్థలినాశ్రయించి జీవింతురు-26.
అంతరే వసుధారస్య రత్నధారస్య చాంతరే ।
త్రింశద్యోజన విస్తీర్ణ మాయతం శతయోజనమ్ ॥
సుగంధ కింశుకవనం నిత్యం పుష్టిత పాదపమ్।
పుష్పలక్ష్మ్యావృతం భాతి ప్రదీప్తమివ సర్వతః ॥
యస్య గంధేన దివ్యేన వాస్యతే పరిమండలమ్।
సమగ్రం యోజనశతం కాననాని సమన్తస్తతః ॥
తత్ సిద్దచారణ గణైరప్సరోభిశ్చ సేవితమ్ ।
రమ్యం తత్ కింశుకవనం జలాశయ విభూషితమ్॥
తత్రాదిత్యస్య దేవస్య దీప్తమాయతనం మహత్ ।
మాసేమాసేవ తరతి తత్ర సూర్యః ప్రజాపతిః॥
తత్ర కాలస్య కర్తారం సహస్రాంశుం సురోత్తమమ్ ।
సిద్దసంఘ నమస్వన్తి సర్వలోక నమస్కృతమ్॥
పంచకూటస్య శైల స్యకైలాస స్యాంతరేణతు ।
షట్త్రిం శద్యోజనాయామం విస్తీర్ణం శతయోజనమ్ ॥
క్షుద్ర సత్త్వైరనాధృష్యం సర్వతోహంస పాండురమ్ ।
ద్రష్టారం సర్వసత్త్వానాం దుర్గమం లోమహర్షణమ్ ॥
వసుధార పర్వతమునకు రత్నధార పర్వతమునకును మధ్యన ముప్పది యోజనములు విస్తీర్ణము నూరు యోజనముల పొడవును గల కింశుక (మోదుగు) వనము గలదు-27. అది నిత్యము పుష్పించిన వృక్షములు గలదై చక్కని సుగంధముగలది. యగును. పుష్పలక్ష్మీచే నావరింపబడినదై యది యంతటను మంటలచే మండు చున్నట్లుండును-28. దాని దీవ్వగంధముచే చుట్టుమండల మంతయు సువాసితమగును. పూర్తి నూరుయోజనముల యడవులందంతట సువాసన నీండును-29. అది సిద్ద చారణ గణముల చేతను అప్సరసల చేతను నివాసిత ము, ఆ రమ్యమైన కింశుకవనము జలాశయములచే నలంకరింపబడినది-30 . అచట దేవుడైన యాదిత్యునకు పెద్ద మందిరము గలదు. అచట ప్రతి మాసమునను ప్రజాపతియైన సూర్యుడు అవతరించును-31. కాలమునకు కర్తయు, వేయికిరణములు గలవాడు, దేవోత్తముడు. సర్వలోకములచే నమస్కరింపబడువాడు నైన యాసూర్యునకు అచట సిద్దసంఘములు నమస్కరించును-32. పంచకూట పర్వతమునకును కైలాస పర్వతమునకును మధ్యన మప్పదియాఱు యోజనముల విస్తీర్ణము గలదియు నూరు యోజనముల పొడవు గలదియునగు నొక సరస్సు గలదు-33 అది క్షుద్రజీవుల కందరానిది. అంతటను హంసలతో తెల్లనైనది. సర్వప్రాణులకును దాటరానిది ప్రవేశింపనలవి కానిది. చూచిన వెంటనే సంభ్రమాశ్చర్యాదులచే గగుర్పాటు గలుగజేయునది-34.
ఇత్యేతాహ్యంతర ద్రోణ్యోదక్షిణే పరికీర్తితాః ।
యథానుపూర్వ మఖిలాః సిద్ధసంఘ నిషేవితా ॥
పశ్చిమాయాం ధీః తథా యేఽన్తర ద్రోణివిస్తరాః ।
తాన్వర్ణ్యమానాం స్తత్వేన శృణుతేమాన్ ద్విజోత్తమాః ॥
అంతరాలే గిరౌతస్మిన్ సువక్షః శిథి శైలయోః ।
సమన్తా ద్యోజనశతమేక భూమం శిలాతలమ్ ॥
నిత్యతప్తం మహాఘోరం దుః స్పర్శం రోమహర్షణమ్ ।
అగమ్యం సర్వసత్త్వానా మీశ్వరాణాం సుదారుణమ్॥
మధ్యే తస్యాం శిలాస్థల్యాం త్రింశద్యోజన మండలమ్।
జ్వాలా సహస్రకలిలం వహ్నిస్థానం సుదారుణమ్ ॥
అనింధన స్తత్ర సదా జ్వాలామాలి విభావసుః ।
జ్వలత్యేష సదా దేవః శశ్వత్తత్ర హుతాశనః ॥
అధిదేవకృతే యో సావగ్నేర్భాగోఽ విధీయతే।
స తత్ర జ్వలతే నిత్యం లోకసంవర్తకోఽనలః ॥
ఈ విధముగా దక్షిణమున నున్న యివి పూర్వది దిక్కుననుసరించిన అంతర ద్రోణులు (కొండపల్లములు) గా జెప్పబడినవి. అవి సిద్ధ సంఘములచే నివసింపబడినవి-35. అట్లే పశ్చిమ దిక్కున గూడ అంతర ద్రోణుల విస్తరములు గలవు. ఓ ద్విజోత్తములారాః వానిని వర్ణించేద వినుడు-36. సువక్ష శిఖశైలముల మధ్యన అంతటను నూరు యోజనములు గలిగి ఒకే విశాలమైన రాతి నేల గలదు-37. అది యెల్లప్పుడు తపించ(కాచబడిమిక్కిలి భయంకరమై తాకనలవి కానిదై భయముతో ఒళ్లు జలదరింప జేయునట్టిదై యుండును. అచటికి ఏ ప్రాణులు గాని ప్రభువులు గాని పోలేరు-38. ఆ రాతినేల మధ్యన ముప్పది యోజనముల విశాల మండలము గలదు. అది వేలకొలది అగ్ని జ్వాలలచే చోరరాని మిక్కలి భయంకరమైన యగ్నియొక్క స్థానము-39. అచటి యగ్నిదేవుడు మండుసాధనమైన కట్టెలు మొదలగునవి యేమియు లేకయే యెడతెగని మంటలవరుసలతో ఎల్లప్పుడును మండుచునే యుండును-40. అధిదేవతగా నగ్ని యొక్క భాగమేది(బ్రహ్మచే) విధింపబడెనో ఆ భాగరూపమైన యగ్నియే సంవర్త కాగ్నియై(ప్రళయాగ్నియై) యచట నిత్యము మండుచుండును-41.
అంతరే శైలవరయో ర్దేవావాపి తయోః శుభాః ।
మాతులుంగస్థలీ తత్ర హ్యాయామాద్దశ యోజనా ।
మధువ్యంజన సంస్థానైః సురసైః కనకప్రభైః ।
ఫలైః పరిణతైః సర్వా శోభితా సా మహాస్థిలీ॥
తత్రాశ్రమం మహాపుణ్యం సిద్ధసంఘ నిషేవితమ్ ।
బృహస్పతేః ప్రముదితం సర్వకామ గుణైర్యుతమ్॥
ఆ రెండు పర్వత శ్రేష్ఠముల మధ్యనున్న దేవతలు గూడ శుభులు. అచట పదియోజనముల వైశాల్యముగల మాతులుంగ (మాదీఫల) వృక్షములుగల) స్థలికలదు-42. వ్యంజనముగా తినదగిన తేనెలకు నెలవైనవి, మంచిరసముగలవియు, బంగారు వన్నెగలవియునై బాగుగా పండిన ఫలములచేత ఆ మహాస్థలియంతయు శోభితమైనది-43. అచట మహాపుణ్యమై, సిద్ధసంఘములనీవాసమై సర్వకామగుణములతో కూడినదై ఆనందమైన బృహస్పతియాశ్రమము కలదు -44.
తథైవ శైలవరయోః కుముదాంజన యోరపి ।
అన్తరే కౌసరద్రోణీ హ్యనేకాయామ యోజనా॥
ద్విబాహుపరిణా హైస్తై స్త్రిహస్తాయత విస్తృతైః ।
చంద్రాంశువర్ణై ర్వాకోశైర్మత్త షట్పదనాదితైః ॥
మధుసర్పిరజః పృక్తైర్మహా గంధైర్మనోహరైః।
శబలం తద్వనం భాతి కుసుమైః సర్వకాలజైః ॥
తత్ర విష్ణోః సురగురో ర్దీప్త మాయతనం మహత్ ।
ప్రకాశం త్రిషు లోకేషు సర్వలోక నమస్కృతమ్॥
అట్లే శైల శ్రేష్ఠములైన కుముద-అంజన పర్వతముల మధ్యన కేసర ద్రోణియను కొండపల్లము గలదు. అది యనేక యోజనముల పొడవు గలది-45. రెండు చేతుల వైశాల్యము(వెడల్పు)తో మూడు చేతుల పొడవుతో విస్తరించినదియు చంద్రకిరణముల వలె తెల్లనైనవియు, వికసించినవియు, మదించిన తుమ్మెదల నాదములు గలవియు-46. తేనె జలము పుప్పొడి-వీనిచే నంటియున్నవియు, గొప్ప సువాసనగలనియు, మనోహరములైనవియు అన్నికాలములలోను బూయునవియు నైన పూవులచే ఆ వనము చిత్రవర్ణముగలదై ప్రకాశించును-47. అచట దేవగురువైన విష్ణువు యొక్క గొప్పమందిరము గలదు. అది ముల్లోకములలో ప్రసిద్ధిజెందినది. సర్వలోకములచే నమస్కరింపబడినది-48.
అంతరే శైలవరయోః కృష్ణపాండురయో రపి ।
త్రింశద్యోజన విస్తీర్ణం నవత్యాయత యోజనమ్ ॥
శ్లక్ష్ణమేకశిలం దేశం వృక్షవీరుద్వి వర్జితమ్ ।
మధ్యే తు సరసస్తస్య రమ్యాతుస్థల పద్మినీ ।
సహస్ర పత్రైర్వ్యాకోశై ఛత్రమాత్రైరలంకృతా॥
పుండరీకైర్మహా పద్మైరుచిరైర్గంధ శాలిభిః ।
శతపత్రైశ్చ వికచైరుత్ప లైర్నీలపత్రకైః॥
మదోత్కటైర్మధుకరై ర్భ్రమరైశ్చ మదోత్కటైః ।
మృదుగద్గద కంఠానాం కిన్నరానాం చ నిస్వనైః ॥
ఉపగీత పద్మఖండాడ్యా విస్తీర్ణా స్థలపద్మినీ ।
యక్షగంధర్వ రచితా సిద్ధచారణ సేవితా॥
మధ్యే తస్యాశ్చ పద్మిన్యాః పంచయోజన మండలః ।
న్యగ్రోధో బహుళస్కంధో హ్యనేకారోహి మండితః ॥
తత్ర చంద్రప్రభః శ్రీమాన్ పూర్ణచంద్ర నిభాననః ।
సహస్ర వదనోదేవో నీలవాసాః సురారిహా॥
పద్మమాల్య ధరస్థల్యాం మహాభాగోపరాజితః ।
ఇజ్యతే యక్షగంధర్వైర్విద్యా ధరగణైః సదా ॥
తస్మిన్నాయతనే సాక్షాదనాది నిధనో హరిః ।
పద్మోపహారై ర్వివిధై రిజ్యతే సిద్ధచారణైః ॥
తదనన్త సదోనామ సర్వలోకేషు విశ్రుతమ్।
పద్మమాలా వలంబాభిర్మాలాభి రుపశోభితమ్॥
కృష్ణ-పాండుర(నలుపుతెలుపు) తైలముల రెంటి మధ్యన గూడ ముప్పది యోజనముల వెడల్పు, తొంబదియోజనముల పొడవును గల-49. దట్టమైన ఒకే రాతి నేలగల దేశముగలదు. అచట వృక్షములు తీవలును లేవు. సుఖముగా కాలినడకతో సంచరింపదగినది. ఎగుడుదిగుడులు లేనిది-50. (ఇది ఒక సరస్సుగా బోలు?) ఆ సరస్సుయొక్కమధ్యన మనోహరమైన స్థలపద్మిని (నీరులేక పద్మముల బూయు) ప్రదేశము గలదు. అది ఛత్రములంతటి ప్రమాణము గల వికసించిన నూరు దళములు గల కుశేశయముల చేతను, నీల దళములు గల కలువల చేతను-52. మృదువై గద్గదములైన కంఠములు గల కిన్నరుల యొక్క గాన నాదముల చేతను, మదముతో విజృంభించిన తేనెటీగల చేతను తుమ్మెదల చేతను, గానము చేయబడి, పద్మ సమూహముల తోను ఒప్పినదై యా స్థల పద్మిని (మెట్టదామర వనము గులాబివనము) వ్యాపించియున్నది. యక్ష గంధర్వులచే రచింపబడి సిద్దచారణులచే) సేవింపబడినది-53,54. ఆ మెట్టతామర (స్థలపద్మిని) ప్రదేశము యొక్క మధ్యన ఐదుయోజనముల మండలము (చుట్టు) గలదియు, అనేకములైన బోదెలు గలదియు అనేకములైన చెట్టుకొమ్మల చివరల వరకు బ్రాకు తీగల చేతను జంతువుల చేతను అలంకరింప బడినదియు నైన మఱ్ఱిచెట్టు గలదు-55. అచటి చంద్రకాంతి గలిగి పూర్ణచంద్రుని బోలు ముఖము గలిగి, లక్ష్మీయుతుడై (శ్రీమంతుడై) వేయిముఖములు గలిగిన దేవుడును. నీలవస్త్రము ధరించినవాడును, దేవశత్రువులైన రాక్షసుల జంపువాడును.56 పద్మమాలల ధరించిన వాడును, పరాజయము లేని మహాభాగుడు నైన హరి యెల్లపుడు ఆ స్థలిలో యక్షగంధర్వుల చేతను, విద్యాధర గణముల చేతను పూజింపబడును-57. ఆ మందిరమున ఆద్యంతములు లేని హరి సిద్దచారణులచే ననేక విధములైన పద్మమాలలచే సాక్షాత్తుగా పూజింపబడును-58. అది అనన్తసదమని సర్వలోకములలో ప్రసిద్ధికెందినది. పద్మమాలలచే వ్రేలాడు పొడవైన దండలచే ప్రకాశితమైనది-59.
తథా సహస్ర శిఖర కుముదస్యాంతరేణ చ ।
పంచాశద్యోజనాయామం త్రింశద్యో జనవిస్తరమ్ ॥
ఇషుక్షేపోచ్ఛ శిఖరం నానావిహగ సేవితమ్ ॥
మహాగంధై ర్మహాస్వాదైర్గజ దేహనిభైః ఫలైః ।
మధుస్రవైర్మహావృక్షై రుపేతం తత్సమంతతః ॥
తత్రాశ్రమం మహాపుణ్యం దేవర్షి గణసేవితమ్ ।
శుక్రస్య ప్రథితం తత్ర భాస్వరం పుణ్యకర్మణః ॥
అట్లే సహస్రశిఖర-కుముదపర్వతముల మధ్యన ఏబది యోజనముల పొడవు ముప్పదియోజనముల వెడల్పునుగల బాణక్షేపమునకు మాత్రమే చోటుగల వాడియై యెత్తైన శిఖరముగలదియు, అనేకపక్షులు నివసించినదియు-60. గొప్ప గంధము రుచియు గలిగి యేనుగలంతటి పండ్లచేతను ఒప్పినదై తేనెలుగారు మహావృక్షములచేత నంతట నిండియున్నది 61. అచట మహాపుణ్యమై, దేవర్షిగణముచే నివసించినదై దివ్యప్రకాశముగలదై పుణ్యకర్ముడై ప్రసిద్ధిగాంచిన శుక్రుని యాశ్రమము గలదు-62.
శంకుకూటస్య శైలస్య వృషభ స్యాంతరేణ చ ।
పురూషకస్థలీ రమ్యాహ్యనేకాయత యోజనా ॥
బిల్వప్రమా ణైశ్చ శుభైర్మహాస్వాదైః సుగంధిభిః ।
ఫలైః ప్రక్లిద్యతే భూమి: పరు షైర్వృంత విచ్యుతై: ॥
తాంస్థలీముపజీవ న్తి కిన్నరోరగసాధవః ।
పురూష కరసోన్మత్తా మానాఢ్యా స్తత్రచారణాః ॥
శంకుకూట-వృషభపర్వతముల మధ్యన పురూషకస్థలియను నొక పల్లపు భూమి స్థలము గలదు. అది రమ్యము. అనేక యోజనముల పొడవైనది-63. బిల్వ ఫలము లంతటివియు, శుభము లైనవియు, గొప్ప రుచిగల వియు సువాసన గలనియు, తొడిమెల నుండి జారిపడినవియు, పరుషములైన పండ్లచే నచటి భూమియంతయు తడుప బడుచుండును-64. కిన్నరులు, ఉరగులు, సాధువులును మానాఢ్యులగు చారణులును పురూషక ఫలరసములచేనున్మత్తులై మానాఢ్యులై యా పురూషక స్థలి నాశ్రయించి జీవింతురు-65.
కపింజలస్య శైలస్య నాగశైలస్య చాంతరే ।
ద్వియోజన శతాయామా విస్తీర్ణా శతయోజనా ॥
స్థలీ మనోహరా సా హి నానావన విభూషితా ।
నానాపుష్పఫలో పేతా కిన్నరోరగ సేవితా॥
ద్రాక్షా వనాని రమ్యాని తథా నాగవనాని చ ।
ఖర్జూరవన ఖండాని నీలాశోక వనాని చ ॥
దాడిమానాం చ స్వాధూనామక్షోటక వనాని చ ।
అతసీ లాకానాం చ కదలీనాం వనాని చ ॥
బదరీణాం చ స్వాధూనాం వనఖండాని సర్వశః ।
స్వాదుశీతాంబు పూర్ణాభిర్నదీభిః శోభితాని చ ॥
కపింజల-నాగ శైలముల మధ్యన రెండు యోజనముల పొడవు నూరు యోజనముల వెడల్పుగల స్థలి (ప్రదేశం) కలదు-66. అది మనోహరము అనేక వనములతో నలంకరింప బడినది. అనేక పుష్ప ఫలములు గలది. కిన్నరుల చేతను ఉరగుల చేతను నివసింపబడినది-67. సుందర ద్రాక్షవనములు, నాగవనములు, ఖర్జూర వన ఖండములును, నల్లని యశోక వనములును, అగిసే తిలక కదళీ వనములును-69, రుచ్యములైన రేగుచెట్లవనములును అచట గలవు. అంతటను తీయని చల్లని నీటితో నిండిన నదులచేత ఆవనములు ప్రకాశించును-70.
తథా పుష్పకశైలస్య మహామేషస్య చాంతరే ।
షష్ఠియోజన విస్తీర్ణా సా భూమిః శతమాయతా ॥
సమాపాణి తలప్రఖ్యా కఠినాపాండురా ఘనా ।
వృక్షగుల్మ లతాగుల్మై స్తృణైశ్చాపి వివర్జితా॥
వర్జితా వివిధైః సత్త్యైర్నిత్యమస్మిన్నిరాశ్రయా ।
సాకాననస్థలీ నామ దారుణా రోమహర్షణా ॥
మహాసరాంసి చ తథా మహావృక్షా స్తథైవచ ।
మహావనాని సర్వాణి కాన్తో నామాని సర్వశః ॥
సరసాం చ వనానాం చ సా స్థలీ చ ప్రజాపతేః ।
క్షుద్రాణాం సరసాం చైవ సంఖ్యా తత్ర న విద్యతే ॥
దశ ద్వాదశ సప్తాష్టౌ వింశస్త్రింశశ్చ యోజనాః ।
స్థల్యో ద్రోణ్యశ్చ విఖ్యాతాః సరాంసి చ వనాని చ ॥
కేచిత్ సన్తి మహాఘోరా శ్యామా పర్వత కుక్షయః ।
సూర్యాంశుజాలై రస్పృష్టా నిత్యం శీతాదురాసదాః ॥
తథాహ్య నలతప్తాని సరాంసి ద్విజసత్తమాః ।
శైలకుక్ష్యంతరస్థానీ సహస్రాణి శతాని చ ॥
ఇతి శ్రీమహాపురాణే వాయుప్రోక్తే భువన విన్యాసో నామ అష్టత్రింశోఽధ్యాయః ॥
అట్లే పుష్పక-మహా మేష పర్వతముల మధ్యన అ ఱువది యోజనముల వెడల్పు నూరు యోజనముల పొడవైన భూమి కలదు-71 అదీ సమమైనది. పాణితలముతో సమానమైనది. ఆకారముగల, కఠినమైనది. తెల్లనైననది. గొప్పనైననది. చెట్లపొదలు తీవపొదలును గడ్డియును లేనిది-72. ఇచట వివిధములైన ప్రాణులు లేవు. ఇది నిరాశ్రయము ఎవరికిని ఆశ్రయము కానిది. ఆ కాననస్థలి భయంకరమై గగుర్పాటు గలుగజేయునది-73. మహాసరస్సులును, మహావృక్షములును, మహావనములును అన్నియు అంతట కాస్తా నామములు (సుందరమైనవి)- 74. సరస్సుల యొక్కయు వనముల యొక్కయు ఆ స్థలియు ప్రజాపతికి సంబంధించినది. అచట చిన్న సరస్సుల సంఖ్య ఇంత యని లేదు. లెక్కకు మించినవి-75. పది పండ్రెండు ఏడు ఎనిమిది ఇరువది ముప్పదియు యోజనములుగల స్థలులును, కొండపల్లపు భూములును సరస్సు వనములును ప్రసిద్ధములైనవి-76. కొన్ని మహాభయంకరములైన నల్లనైన పర్వత కుక్షులు (పర్వతగర్భములైన గుహలు)గలవు. అవి సూర్యకిరణములు జోరనివి. నిత్యము చల్లనైనవి. చేరనలవి కానివి-77. శైలగర్భములలో నున్న వేల నూర్ల సరస్సులు ఓ బ్రాహ్మణోత్తములారా! అగ్నితప్తముసలసల(కాగు) మసలుచున్నవి-78.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువన విన్యాసమను ముప్పదియెనిమిదవ యధ్యాయము.38.