2 - ద్వాదశ వార్షిక సత్రము

శుక ఉవాచ:-

 ప్రత్యబ్రువన్ పునః సూతమృషయస్తే తపోధనాః

కుత్ర సత్రం సమభవత్ తేషామద్భుత కర్మణామ్

 కీయంతం చైవ తత్కాలం కథం చ సమవర్తత

 ఆచచక్ష పురాణం చ కథం తేభ్యః ప్రభంజనః

ఆచక్ష్య విస్తరేణేదం పరం కౌతూహలం హి నః

 ఇతి సన్నోదితః సూతః ప్రత్యువాచ శుభం వచ

శుకుడిట్లు పలికెను: - తపస్సే ధనముగా గల ఆ ఋషులు సూతునితో మరల నిట్లు పలికిరి: ఆశ్చర్యమును గొలిపే కర్మలనాచరించు ఆ మహర్షులు సత్రయాగము నేచట చేసిరి?. ఎంత కాలము చేసిరి? ఆ యాగము జరిగిన విధమెట్టిది? వారికి వాయుదేవుడు పురాణమును చెప్పిన విధమెట్టిది?. ఈ విషయములను విస్తరముగా చెప్పుము. మాకు కుతూహలము అధికముగానున్నది. ఇట్లు ప్రేరితుడై సూతుడు శుభకరములగు పలుకులను ఇట్లు పలికెను.

శృణుధ్వం యత్ర తే ధీరా ఈజిరే సత్రముత్తమమ్

 యావంతం చాభవత్ కాలం యథా చ సమవర్తత

సిసృక్షమాణా విశ్వం హి యత్ర విశ్వసృజ: పురా

సత్రం హి ఈజిరే పుణ్యం సహస్రం పరివత్సరాన్

 తపోగృహ పతిర్యత్ర బ్రహ్మా బ్రహ్మాఽభవత్ స్వయమ్

 ఇలాయా యత్ర పత్నీత్వం శామిత్రం యత్ర బుద్ధిమాన్

 మృత్యుశ్చక్రే మహాతేజాస్తస్మిన్ సత్రే మహాత్మనామ్

 విబుధా ఈజిరే తత్ర సహస్రం ప్రతివత్సరాన్

 భ్రమతో ధర్మచక్రస్య యత్ర నేమిరశీర్యత

కర్మణా తేన విఖ్యాతం నైమిషం మునిపూజితమ్   

బ్రహ్మవేత్తలగు ఈ ఋషులు శ్రేష్ఠమగు సత్రయాగము నాచరించిన స్థలమును, ఆ యాగము జరిగిన కాలమును, జరిగిన విధమును వినుడు. పూర్వము జగత్తును సృష్టించిన ఆ ఋషులు జగత్తును సృష్టించాలనే కోరిక గలవారై వేయి సంవత్సరములు పవిత్రమగు సత్రయాగమును చేసిరి. దాని యందు సూర్యుడు యజమాని, బ్రహ్మ స్వయముగా బ్రహ్మత్వమును చేపట్టెను. భూమి యజమాని పత్ని. మహాత్ములగు ఋషుల ఆ సత్రము నందు బుద్ధిమంతుడు, మహాతేజశ్నాలి యగు యముడు శమితగా నుండెను. వారా సత్రయాగమును నైమిషారణ్యము నందు వేయి సంవత్సరములు అనుష్ఠించిరి. పరుగిడుచున్న ధర్మచక్రము యొక్క అంచు (నేమి) ఒక ప్రదేశములో శిథిలమయ్యెను. ఆ స్థానమునకు నైమిషము అను పేరు వచ్చును. ఆ స్థలమును ఋషులు పవిత్రముగా భావింతురు.

యత్ర సా గోమతీ పుణ్యా సిద్ధ చారణ సేవితా

రోహిణీ సుషువే తత్ర తతః సౌమ్యోఽ భవత్ సుతః

 శక్తిర్జ్యేష్ఠః సమభవద్వసిష్ఠస్య మహాత్మనః

 అరుంధత్యాః సుతా యత్ర శతముత్తమ తేజసః

 కల్మాషపాదో నృపతిర్యత్ర శప్తశ్చ శక్తినా

యత్ర వైరం సమభవద్విశ్వామిత్ర వసిష్ఠయోః

అదృశ్యంత్యాం సమభవన్ము నిర్యత్ర పరాశరః

 పరాభవో వసిష్ఠస్య యస్మిన్ జాతేఽ వ్యవర్తత

 తత్ర తే ఈజిరే సత్రం నైమిషే బ్రహ్మవాదినః

నైమిషే ఈజిరే యత్ర నైమి షేయాస్తతః స్మృతాః 

నైమిషము నందు సిద్దుల చేత, చారణుల చేత సేవింపబడే పవిత్రమగు గోమతీనది గలదు. రోహిణి అచటనే సౌమ్యుడను కుమారుని కనెను. మహాత్ముడగు వసిష్ఠునకు అచటనే జ్యేష్ఠ కుమారుడగు శక్తి జన్మించెను. నైమిషము నందు అరుంధతికి గొప్ప తేజశ్శాలురగు వందమంది కుమారులు జన్మించిరి. అచటనే శక్తి కల్మష పాద మహారాజును శపించెను. అచటనే విశ్వామిత్ర వసి ష్ఠులకు వైరము కలిగెను. ఆ నైమిషము నందే అదృశ్యంతికి పరాశరుడు జన్మించెను. పరాశరుడు జన్మించినప్పటికీ, వసిష్ఠునకు (పుత్ర వినాశరూపమగు) పరాభవము తప్పలేదు. అట్టి నైమిషము నందు బ్రహ్మవాదులగు ఆ మహర్షులు సత్రయాగమును చేసిరి. నైమిషము నందు సత్రయాగము ననుష్ఠించుటచే, ఆ మహర్షులకు నైమి షేయులు అను పేరు కలిగేను.

తత్సత్ర మభవత్తేషాం సమాద్వాదశ ధీమతామ్

పురూరవసి విక్రాంతే ప్రశాసతి వసుంధరామ్

 అష్టాదశ సముద్రస్య ద్వీపానశ్నన్పురూరవాః

తుతోష నైవ రత్నానాం లోభాదితి హి నః శ్రుతమ్

 ఉర్వశీ చకమే యం చ దేవహూతి ప్రణోదితా

 ఆజహార చ తత్సత్రం స్వర్వేశ్యా సహ సంగత:

మహర్షుల ఆ సత్రయాగము జరుగుచుండగా పన్నెండు సంవత్సరములు గడిచెను. అపుడు పరాక్రమియగు పురూరవసుడు భూమిని పాలించుచుండెను. పురూరవసునకు రత్నములయందు లోభము మెండు. ఆతడు సముద్రము లోని పద్దెనిమిది ద్వీపములను తన వశము చేసుకొనెను. అయిననూ, ఆతని రత్నకాంక్ష తీరలేదని మేము వింటిమి. దేవహూతి చేత ప్రేరేపించబడిన ఊర్వశి పురూరవసుని కామించెను. ఆతడు దేవవేశ్యతో కూడి ఆ సత్రమునకు వచ్చెను.

తస్మిన్నరప తౌ సత్రం నైమి షేయాః ప్రచక్రి రే  

యం గర్భే సుషువే గంగా పావకాద్దీప్త తేజసమ్

తదుల్బం పర్వతే న్యస్తం హిరణ్యం ప్రత్యపద్యత

హిరణ్మయం తతశ్చక్రే యజ్ఞవాటం మహాత్మనామ్

  విశ్వకర్మా స్వయం దేవో భావయన్ లోకభావనమ్

 బృహస్పతి స్తతస్త త్ర తేషామమిత తేజసామ్

ఐల: పురూరవా భేజే తం దేశం మృగయాం చరన్

 తం దృష్ట్యా మహదాశ్చర్యం యజ్ఞవాటం హిరణ్మయమ్

ఆ మహారాజు సన్నిధిలో నైమిషీయుల సత్రయాగము కొనసాగు చుండెను. పూర్వము అగ్ని వలన గంగ గర్భమును దాల్చి, గర్భమునందలి తేజోమయమగు పిండమును పర్వతమునందు విడువగా, అది బంగారమాయెను. ఆ మహర్పుల యాగ వేదిక ఆ బంగారముతో నిర్మింపబడెను. ధీమంతుడగు విశ్వకర్మ లోక క్షేమమును గోరి, స్వయముగా ఆ యజ్ఞవాటికను మహాతేజశ్శాలురగు, ఆ ఋషులయాగము కొరకు నిర్మించెను. ఇలా కుమారుడగు పురూరవసుడు అడవిలో వేటాడుతూ ఆ స్థలమునకు వచ్చి, అచట బంగరు యజ్ఞవాటికను చూచి, గొప్ప ఆశ్చర్యమును పొందెను.

లోభేన హతవిజ్ఞాన స్తదాదాతుం ప్రచక్రమే

నైమీ షేయాస్తతస్తస్య చుక్రుధుర్నృపతేర్భృశమ్

నిజఘ్నుశ్చాపి సంక్రుద్దాః కుశవజ్రైర్మనీషిణః

తతో నిశాంతే రాజానం మునయో దైవనోదితాః

 కుశవ జ్రైర్వినిష్పిష్టః స రాజా వ్యజహాత్తనుమ్

ఔర్వశేయం తతస్తస్య పుత్రం చక్రుర్నృపం భువి

నహుషస్య మహాత్మానం పితరం యం ప్రచక్షతే

స తేషు వర్తతే సమ్యగ్ ధర్మశీలో మహీపతి:         

లోభము వలన నశించిన వివేకము గల ఆ మహారాజు బంగరు యజ్ఞ వేదిని తన అధీనము చేసుకొనుటకు యత్నించగా, నైమి షేయులగు ఋషులకు తీవ్రమగు కోపము కలిగెను. కుద్దులగు ఆ మహర్పులు దైవముచే ప్రేరితులై, ఉదయ సమయములో ఆ రాజును దర్భలనే వజ్రములతో కొట్టిరి. దర్భ వజ్రములచే కొట్టబడిన ఆ రాజు దేహమును చాలించెను. అపుడు, ఆ రాజునకు ఊర్వశి యందు జన్మించిన కుమారునీ చక్రవర్తిని చేసిరి ఆతని కుమారుడే నహుషుడు. ఆ మహాత్ముడగు రాజు ధర్మబుద్ధి గలవాడై, ఆ మహర్షుల యందు యోగ్యమగు వర్తనము కలిగియుండెను.

ఆయురారోగ్య మత్యుగ్రం తస్మిన్స నరసత్తమః

సాంత్వయిత్వా చ రాజానం తతో బ్రహ్మవిదాం వరాః 

సత్రమారేభిరే కర్తుం యథావద్దర్మ భూతయే

 బభూవ సత్రం తత్తేషాం బహ్వాశ్చర్యం మహాత్మనామ్

విశ్వం సిసృక్షమాణానాం పురా విశ్వసృజామివ

 వైఖానసైః ప్రియసఖైర్వాల ఖిల్యైర్మరీచికై:

 అన్యైశ్చ మునిభిర్దుష్టం సూర్యవైశ్వానరప్ర భైః

 పితృదేవాప్సర సిద్ధైర్గంధర్వోరగ చారణైః          

ఆతని పేరు ఆయుషుడు. శక్తి శాలియగు ఆ మహారాజును బ్రహ్మవేత్తలగు మునులు ఓదార్చిరి. అపుడా మహర్షులు ధర్మము యొక్క అభివృద్ధి కొరకు యథా శాస్త్రముగా యజ్ఞమును మరల కొనసాగించిరి. మహాత్ములగు వారి ఆ సత్రయాగము గొప్ప విస్మయమును కలిగించెను. జగత్తుని సృష్టించగోరి పూర్వము జగత్ స్రష్టలగు మహరుల యాగము వలె ఆది భాసించెను. ఆ యాగమునందు వారి ప్రియమిత్రులగు వైఖానస, వాలఖిల్య, మరీచిక మహర్షులు, సూర్యునితో, అగ్నితో సమమగు తేజస్సు గల ఇతర ఋషులు, పితృదేవతలు, దేవతలు, అప్సరసలు, సిద్ధులు, గంధర్వులు, నాగులు, చారణులు కూడా పాల్గొనిరి.

సంభారైస్తు శుభేర్జుష్టం తైరేవేంద్ర సదో యథా

 స్తోత్ర సత్రగ్ర హైర్దేవాన్ పితౄన్ పిత్ర్యైశ్చ కర్మభి:

 ఆనర్చుశ్చ యథాజాతి గంధర్వాదీన్ యథావిధి

 ఆరాధయితు మిచ్చంతస్తతః కర్మాంతరేష్వథ

 జగుస్సామాన గంధర్వా ననృతుశ్చాప్సరో గణాః

వ్యాజహ్రుర్మునయో వాచం చిత్రాక్షరపదాం శుభమ్

మంత్రాదితత్త్వ విద్వాంసో జగదుశ్చ పరస్పరమ్

వితండా వచనాశ్చైకే నిజఘ్ను: ప్రతివాదినః            

ఆ యాగశాల పవిత్రమగు సంభారములతో ఇంద్రసభ వలె విరాజిల్లుచుండెను. మహర్షులు దేవతలను స్తోత్రములతో, గ్రహము (సోమమును నింపే చెక్కపాత్ర) లతో ఆరాధించిరి. పితృకర్మలతో పితృ దేవతలను ఆరాధించిరి. గంధర్వులు మొదలగు వారిని శ్రద్ధతో యథావిధిగా ఆరాధించిరి. కర్మల మధ్యలో, గంధర్వులు సామగానము చేసిరి. అప్సరసల గణములు నృత్యము చేసినవి. మునులు చిత్రములగు పదములతో కూడిన మంగళాశీస్సులను పలికిరి. మంత్రములు మొదలగు వాటి స్వరూపము నెరింగిన విద్వాంసులు పరస్పరము సంభాషించుకొనిరి. వితండవాదులు (స్వీయపక్షము లేకుండగనే వాదించువారు ప్రతివాదులను ఓడించిరి.

ఋషయస్తత్ర విద్వాంసః సాంఖ్యార్థ న్యాయకోవిదాః

 న తత్ర దురితం కించిద్విదధుర్భ్రహ్మ రాక్షసా:

 న చ యజ్ఞహనో దైత్యా న చ యజ్ఞముషోఽసురాః

 ప్రాయశ్చిత్తం దురిష్టం వా న తత్ర సమజాయత

శక్తి ప్రజ్ఞా క్రియా యోగైర్విధిరాసీత్ స్వనుష్ఠితః

ఏవం వితేనిదే సత్రం ద్వాదశాబ్దం మనీషిణః

 భృగ్వాద్యా, ఋషయో ధీరా జ్యోతిష్టోమాన్ పృథక్ పృథక్

చక్రిరే పృష్ఠగమనాన్ సర్వానయుత దక్షిణాన్             

సాంఖ్య, న్యాయాది శాస్త్రములలో పండితులైన మహర్షులు ఆ యాగములో నుండిరి. అచట బ్రహ్మరాక్షసులు పాపముల నాచరించుట గాని, దైత్యులు యజ్ఞమునకు హాని చేయుట గాని, అసురులు యజ్ఞసంభారములను అపహరించుట గాని లేదు. ఆ యజ్ఞములో ప్రాయశ్చిత్తము గాని ఇతరులకు హాని కలిగించే కర్మగాని లేదు. ఈ విధముగా, ఆ మహర్షులు తమ శక్తిని, విద్వత్తును, కర్మ సామర్థ్యమును కలబోసి, సత్ర యాగమును పన్నెండు సంవత్సరములు యథా విధిగా అనుష్ఠించిరి-35. జ్ఞానులగు, భృగు - ఆది మహర్షులు అయుతము (10,000) దక్షణగా గల జ్యోతిష్ణోమ యాగములను వేర్వేరుగా ఒక దాని తరువాత మరియొకటి అనుష్ఠించిరి.

సమాప్తయజ్ఞాస్తే సర్వే వాయుమేవ మహాధిపమ్

 పప్రచ్చురమితాత్మానం భవద్భిర్యదహం ద్విజాః

ప్రణోదితశ్చ వంశార్థం స చ తానబ్రవీత్ప్రభుః

శిష్యః స్వయంభువో దేవః సర్వప్రత్యక్ష దృగ్వశీ

అణిమాదిభి రష్టాభిరైశ్వర్యైర్యః సమన్వితః

 తిర్యగ్యోన్యాదిభిర్ధర్మైః సర్వలోకాన్ బిభర్తీ యః

 సప్తస్కంధాదికం శశ్వత్ ప్లవతే యాజనాద్వరః

 విషయే నియతా యస్య సంస్థితాః సప్తకా గణాః

వ్యూహాం స్త్రయాణాం భూతానాం కుర్వన్ యశ్చ మహాబలః

 తేజసశ్చాత్త్యు పధ్యానం దధాతీమం శరీరిణామ్                 

ఓ ద్విజులారా: మీరు నన్ను కోరిన విధముగనే, ఆ ఋషులందరు యజ్ఞమును పూర్తి చేసుకొని, మహా ప్రభువు, అనంత స్వరూపుడునగు వాయువును కోరిరి. వారిచే పురాణము కొరకు ప్రేరితుడై వాయుదేవుడు వారికి చెప్పెను. వాయు దేవుడు పరమేశ్వరునకు శిష్యుడు, సర్వమును ప్రత్యక్షముగా చూచువాడు; వశి. ఆయన అణిమ మొదలగు ఎనిమిది ఐశ్వర్యములతో కూడినవాడు. పశుపక్ష్యాది సర్వ ప్రాణులను భరించువాడు ఆయనయే. ఆవహ, ప్రవహ, సంవహ ఉద్వహ, నివహ, పరివహ, పరావహ అనే ఏడు స్కంధములయందు వాయుదేవుడు సదా వేగముగా సంచరించుచుండును. సప్తమరుద్గణములు ఆయన అధీనమునందు ఉండును. మహాబలశాలియగు వాయుదేవుడు పృథివి, జలము, అగ్ని అనే మూడు భూతముల రచనారూపములగు ప్రాణుల శరీరముకు ప్రాణముపోసి, ఆహారమును జీర్ణము చేయుటలో అగ్నికి సహకరించుచూ, ప్రాణులను ధరించుచున్నాడు.

ప్రాణాద్యావృత్తయః పంచ కరణానాం చ వృత్తిభిః

 ప్రేర్యమాణాః శరీరాణాం కుర్వతే యాస్తు ధారణమ్

 ఆకాశయోనిర్హి గుణః శబ్దః స్పర్శ సమన్వితః

 తైజస ప్రకృతిశ్చోక్తోఽప్యయం భావో మనీషిభిః

తత్రాభిమానీ భగవాన్ వాయుశ్చాతి క్రియాత్మకః

వాతారణిః సమాఖ్యాతః శబ్దశాస్త్ర విశారదః

భారత్యా శ్లక్షయా సర్వాన్ మునీన్ ప్రహ్లాదయన్ని వ

 పురాణజ్ఞః సుమనసః పురాణాశ్రయ యుక్తయా

    ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే ద్వాదశ వార్షిక సత్ర నిరూపణం నామ ద్వితీయోఽధ్యాయః

 ఇంద్రియముల వ్యాపారములచే ప్రేరితములైన, ప్రాణాపాన వ్యానోదాన సమానములనే అయిదు వాయువృత్తులు (క్రియలు) ప్రాణుల శరీరధారణమునకు మూలముగ నున్నవి. ఆకాశ గుణమగు శబ్దము, స్పర్శతో గూడి గాలికి గుణములు అగును. ఆకాశము నుండి గాలి పుట్టెను. గాలి నుండి అగ్ని పుట్టెనని విద్వాంసులు చెప్పెదరు. అట్టి గాలికి అభిమాని వాయుదేవుడు. ఆయన క్రియా స్వరూపుడు. వ్యాకరణ శాస్త్రకోవిదుడు. ఆయన సర్వకాలములయందు వీచుచునే యుండును.  పురాణముల నెరింగిన అట్టి వాయు దేవుడు పవిత్రమగు మనస్సు గల మునులనందరినీ సంతోషపెట్టుచున్నవాడై, మధురమగు వాణితో పురాణమును బోధించెను.

శ్రీ వాయుమహాపురాణములో ద్వాదశవార్షిక సత్రవర్ణనము అనే రెండవ అధ్యాయము ముగిసెను.