1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

232 - కులామృతస్తోత్రం

మహామునులారా! కులామృతమను శ్రేష్ఠమైన స్తోత్రాన్ని మీకిప్పుడు వినిపిస్తాను. ఒకప్పుడు దేవర్షినారదుడు పరమేశ్వరుని ఇలా ప్రార్థించాడు.

హే భగవాన్! మనుష్యులందరూ పుట్టిననాటినుండీ మంచివారుగా వుండడం జరుగదు కదా! వారిలో కొందరు దుర్మతులుంటారు. పరిస్థితుల ప్రభావం కొందరిని దుష్టులనుగా మారుస్తుంది. వారు కామ - క్రోధ, శుభాశుభద్వంద్వాలలో పడి కొట్టు మిట్టాడుతూ శబ్దాది విషయ బంధాలచే కట్టువది బ్రతుకుతూ ఎప్పటికో మేల్కొని పశ్చాత్తాపపడి భగవద్ధ్యానంలోనే శేషజీవితాన్ని గడపాలనుకుంటారు గానీ దానికి సమయం లేదని మథనపడుతుంటారు. అలాటి వారి నుద్ధరించడం ఎలా?

లోక కల్యాణ కర్తలూ, జగదానంద కారకులూ శివకేశవులే అయినా ఆ కల్యాణాన్నీ ఆనందాన్నీ లోకులదాకా తీసికెళ్ళి పంచేవాడు నారదుడు. శివుడతనిని ప్రసన్నంగా చూసి ఇలా బోధించాడు.

‘ఓ ఋషి శ్రేష్ఠా! భవబంధాలను తొలగించేదీ సర్వదుఃఖాలనూ నశింపజేసేదీ అగు పరమరహస్యమైన విషయమొకటుంది విను. గడ్డిపరకనుండి బ్రహ్మ దాకా గల ఈ సృష్టిలో విష్ణుమాయలోపడి చరాచరములన్నీ ఒక రకమైన నిద్రలో చేరి జోగుతుంటాయి. ఆ నిద్ర నుండీ విష్ణుభగవానుని దయవల్ల ఎవరు మేలుకోగలరో వారే ఈ భవబంధాలను తొలగించుకోగలరు. భవసాగరాన్ని దాటిపోగలరు. ఈ మాయ జగము దేవతలను కూడా భ్రమింపచేసి వ్యామోహంలో పడవేయగలదు. అడవి నుండి సముద్రస్నానానికి వచ్చిన ముసలి ఏనుగుల్లాగా వ్యామోహంలో పడ్డ జనులు బయటికి రాలేదు. హరి కీర్తనను చేయనివారు నూతిలో కప్పలవలె ఈ భవ సాగరంలోనే అలాగే వుండిపోతారు. కాబట్టి ప్రసన్నచిత్తులై పశ్చాత్తప్తులై ఈ సంసారమును కాదనుకొని ఈ క్రింది స్తోత్రాన్ని పఠిచేవారు ముక్తులౌతారు.

యస్తు విశ్వమనాద్యంత నిష్ప్రపంచం నిరామయం

మజ మాత్మని సంస్థితాం । వాసుదేవం గురుం విష్ణుం

సర్వజ్ఞ మచలం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే ।

సదా ధ్యాయేత్ సముచ్యతే । సర్వాత్మకం చవైయావత్

దేవం గర్భోచితం విష్ణుం ఆత్మచైతన్య రూపకం ।

సదాధ్యానన్ విముచ్యతే । శుభమే కాక్షరం విష్ణుం

అశరీరం విధాతారం సదాధ్యాయన్ విముచ్యతే ॥

సర్వజ్ఞాన మనోరతిం ॥ వాక్యాతీతం త్రికాలజ్ఞం

అచలం సర్వగం విష్ణుం విశ్వేశం లోక సాక్షిణం ।

సదాధ్యాయస్ విముచ్యతే సర్వ స్మాదుత్తమం విష్ణుం

నిర్వికల్పం నిరాభాసం సదాధ్యాయన్ విముచ్యతే ॥

బ్రహ్మాది దేవ గంధర్వై సదా ధ్యాయన్ విముచ్యతే ॥

ర్మునిభిః సిద్ధచారణైః । సంసార బంధనాత్ కోఽపి

యోగిభిః సేవితం విష్ణుం ముక్తి మిచ్ఛన్ సమాహితః ।

సదా ధ్యాయన్ విముచ్యతే ॥ అనంత మవ్యయం దేవం

సంసార బంధనాన్ముక్తిం విష్ణుం విశ్వ ప్రతిష్ఠితం ॥

ఇచ్ఛల్లోకో హ్యశేషతః । విశ్వేశ్వర మజం విష్ణుం ।

స్తుత్వైవం వరదం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే ॥

మహర్షులారా! శివుడు సెలవిచ్చినది ప్రత్యక్షర సత్యము. నిరంతరము ఆ అక్షయుడు, నిష్కలుడు, సనాతనుడు, అవ్యయుడు, బ్రహ్మస్వరూపుడునగు విష్ణువును ధ్యానించేవారు నిస్సందేహంగా ఆయన శాశ్వతపదాన్ని పొందగలరు. వేలకొద్దీ అశ్వమేధాలూ, మరింతగా వాజపేయాలు చేయగా వచ్చే పుణ్యం తదేక చిత్తంతో సర్వం మఱచి విష్ణుధ్యానం ఒక్కనిముషం చేస్తే వచ్చే పుణ్యంలో పదహారవవంతు కూడా వుండదు.

మహాదేవుడే ఉపదేశించిన ఈ స్తోత్రం దివ్యం. దీనిని నిత్యం పఠించేవారు గత వేయి జన్మాల పాప ఫలాన్నీ దగ్ధం చేసుకోగలరు. అమృతత్త్వస్థాయి అనగా వైష్ణవ పరమపదాన్ని ఈ శ్లోకసంహిత ద్వారా మానవులందుకోగలరు.