1 - గరుడ పురాణము - ఆచార కాండము
138 - సూర్యవంశవర్ణన
రుద్రదేవా! ఇక భరతఖండాన్నేలిన మహారాజ వంశాలను వర్ణిస్తాను. ముందుగా సూర్యవంశ వర్ణన గావిస్తాను.
విష్ణు భగవానుని నాభికమలం నుండి బ్రహ్మ, ఆయన అంగుష్ఠ భాగము నుండి దక్షప్రజాపతి ఉద్భవించగా దక్షపుత్రిగా దేవమాత అదితి జనించింది. అదితి నుండీ వివస్వతుడను పేర సూర్యుడు, ఆయనకు వైవస్వతమనువు జనించారు. మనువునకు తొమ్మండుగురు కొడుకులు. వారు ఇక్ష్వాకువు, శర్యాతి, నృగుడు, ధృష్ట, పృషధ్రుడు, నరిష్యంతుడు, నభగుడు, దిష్ట, శశకుడు (కరషుడు).
మనువుకు ఇల యనుకూతురూ, సుద్యుమ్నుడను కొడుకు కూడా కలిగారు. ఇలకు బుధుని వల్ల పురూరవ మహారాజూ, సుద్యుమ్నునికీ అతని పత్ని ద్వారా ఉత్కళ, వినత, గయనామకులయిన పుత్రులూ జనించారు.
గోవధ చేసిన పాపానికీ మనుపుత్రుడు పృషధ్రుడు శూద్రుడైపోయాడు. కరుషుని నుండి క్షయుల ఉత్పత్తి జరిగింది. వారు కారుషులగా విఖ్యాతి నంచారు. దిష్టపుత్రుడైన నాభాగుడు వైశ్యుడైనాడు. అతని కొడుకు పేరు భలందనుడు. వాని వంశమున వరుసగా వత్స ప్రీతి, అతనికీ పాంశు నీత్రులు, ఖనిత్రునికీ భూపుడు, అతనికీ క్షుపుడు, అతనికీ వింశుడు, అతనికి వివింశకుడు కలిగారు.
వీవీంశకుని వంశములో వరుసగా ఖనినేత్రుడు, వీభూతి, కరంధముడు, అవీక్షితుడు, మధుతు, నగిష్యంతుడు, తముడు, రాజవద్దనుడు,సుధృతి,నరుడు, కేవలుడు, బంధుమానుడు జనించారు.
బంధుమానుని వంశంలో వరుసక్రమంలో వేగవానుడు, బుధుడు, తృణబిందువు, విశాలుడు, హేమచంద్రుడు, చంద్రకుడు, ధూమ్రాశ్వుడు, సృంజయుడు, సహదేవుడు, కృశాశ్వుడు, సోమదత్తుడు, జనమేజయుడు కలిగారు.
వీరంతా వైశాలక రాజులని పిలువబడ్డారు. వీరిలో తృణబిందువుకీ అలంబుష అనే అప్సరస ద్వారా ఇలవిలాయను కూతురు కూడా కలిగింది.
వైవస్వత మనుపుత్రుడు శర్యాతికీ సుకన్యయను కూతురు పుట్టింది. ఆమె చ్యవన మహర్షిని పెండ్లాడింది. శర్యాతి వంశంలో వరుసగా అనంతుడు, రేవతుడు, రైవతుడు జనించారు. రైవతుని కూతురు రేవతి.
వైవస్వత మనుపుత్రుడు ధృష్ణునికి ధార్ష్ట నామకపుత్రుడు జనించాడు. అతడు వైష్ణవుడైనాడు. మనుపుత్రుడైన నభగుని వంశంలో క్రమంగా నేదిష్ట, అంబగిష, విరూప, పృషదక్ష (శ్వ) రథనరులు జనించారు. వీరంతా వాసుదేవ భక్తులు.
మనుపుత్రుడైన ఇక్ష్వాకునికీ వికుక్షీ, నిమి, దండకులని ముగ్గురు కొడుకులు. వికుక్షి యజ్ఞేయ శశకము(కుందేలు)ను భక్షించి, శశాదనామంతో విఖ్యాతుడైనాడు. అతని కొడుకులు పురంజయుడు, కకుత్స్థుడు. ఈ రెండవవాని కొడుకు వేనుడను పేరు గల అనేనసుడు. అతని పుత్రుడేవిష్ణువు అంశగల పృథుచక్రవర్తి. ఆ తరువాత వంశపారంపర్యంగా విశ్వరాతుడు, ఆర్రుడు, యువనాశ్వుడు, శ్రీవత్సుడు, హదశ్వుడు, కువలాశ్వుడు, ధృధాశ్వుడు పుట్టారు. దృథాశ్వ చక్రవర్తి ధుంధుమారుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత ఆ వంశంలో దృథాశ్వ కుమారులు చంద్రాశ్వుడు, కపిలాశ్వుడు, హర్యశ్వుడు అను వారలలో హర్యశ్వుని వంశంలో వరుసగా నీకుంభుడు, హితాశ్వుడు, పూజాశ్వుడు, యువనాశ్వుడు, మాంధాత జన్మించారు. మాంధాతకతని పత్ని బిందుమతి ద్వారా ముచుకుందుడు, అంబరీషుడు (‘రి’ కి దీరం పెట్టకూడదు) పురుకుత్సుడు అను ముగ్గురు కొడుకులూ, యాభైమంది కూతుళ్ళూ పుట్టారు. మాంధాత కూతుళ్ళందరినీ సౌభరి మహాముని పెండ్లాడాడు.
అంబరీషుని కొడుకు యువనాశ్వుడు, అతని కొడుకు హరితుడు. పురుకుత్సునికి నర్మద ద్వారా త్రసదస్యువు పుత్రుడుదయించాడు. అతని వంశంలో క్రమంగా అనరణ్యుడు, హర్వశ్వుడు, వసుమనుడు, త్రిధన్వుడు, త్రయ్యారుణుడు, సత్యరతుడు (త్రిశంకువు) హరిశ్చంద్రుడు, రోహితాశ్వుడు, హరీతుడు, చంచు, విజయుడు, రురుకుడు, వృకుడు, బాహువు, సగరుడు ఉద్భవించి చక్రవర్తులైనారు.
సగరునికి సుమతి అను పత్ని ద్వారా అరవైవేలమంది పుత్రులు కలిగారు. కాని వారిలో నెవరూ మిగలలేదు. పాతాళంలో కపిల మహర్షిని దూషించి, కొట్టిన పాపానికీ, వారి పాపాగ్నిలో వారే కాలి బూడిదైపోయారు.
సగరుని రెండవపత్ని కేశినికి అసమంజసుడు, అతనికి అంశుమంతుడు, అతనికి దిలీపుడు,ఆయనకు భగీరధుడు జనించారు. ఈ భగీరథుడే దివిజ గంగను భువీకీ తెచ్చిన మహనీయుడు. ఆయననుండీ సూర్యవంశక్రమం ఇలా పరంపరగా తామర తంపరగా కొనసాగింది. భగీరథుని తరువాత వరుసగా శ్రుతుడు, నాభాగుడు, అంబరీషుడు, సింధు ద్వీపుడు,అయుతాయువు, ఋతుపర్ణుడు, సర్వకాముడు, సుదాసుడు, సౌదాసుడు (మిత్ర సహుడు) కల్మాషపాదుడు, అశ్వకుడు, మూలకుడు, దశరథుడు, బిలబిలుడు, విశ్వసహుడు, ఖట్వాంగుడు, దీర్ఘబాహువు, అజుడు, దశరథుడు చక్రవర్తులైనారు.ఈ దశరథపుత్రులే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు.
శ్రీరామచంద్రుని పుత్రులు కుశలవులు, భరతునికీ తార్క్ష పుష్కరులూ, లక్ష్మణునికీ చిత్రాంగద చంద్రకేతువులూ, శత్రుఘ్నునికీ సుబాహు శూరసేనులూ జనించారు. కుశమహా రాజు వంశం ఈ విధంగా వర్ధిల్లింది.
(* (ఎవరి పేరిటనైతే ఈ వంశాన్ని రఘువంశమని వ్యవహరిస్తారో ఆ రఘుమహారాజు పేరు కనబడకపోవడం చింత్యం) అయితే ఈ పురాణంలోనే 143వ అధ్యాయంలో అజుడు రఘుపుత్రుడని చెప్పబడింది. అంటే ఈ అధ్యాయంలో పేర్కొనబడిన దీర్ఘబాహువే రఘుమహారాజని తెలుస్తోంది.)
కుశుడు, అతిధి, నిషధుడు, నలుడు, నభస్సు (నభుడు) పుండరీకుడు, క్షేమధన్వుడు, దేవానీకుడు అహీనకుడు, గురుడు, పాగిత్రుడు, ఉలుడు,చలుడు, ఉక్తుడు, వజ్రనాభుడు, గణుడు, ఉషితాశ్వుడు, విశ్వసహుడు, హిరణ్యనాభుడు, పుష్పకుడు, ధ్రువసంధి, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, పద్మవర్ణుడు, శీఘ్రుడు, మరుడు, సుశ్రుతుడు, ఉదావసుడు, నందివర్థనుడు, సుకేతువు, దేవరాతుడు, బృహదుక్తుడు, మహావీర్యుడు,సుధతి, ధృష్టకేతువు, హర్యశ్వుడు, మధుడు, ప్రతీంధకుడు, కృతిరథుడు, దేవమీఢుడు, విబుధుడు, మహాధృతి, కీర్తిరాతుడు, మహాధోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, సీరధ్వజుడు.
సీరధ్వజునికి సీత యను పేరుగల పుత్రిక, కుశధ్వజుడనే తమ్ముడు ఉన్నట్టు తెలుస్తోంది. సీరధ్వజుని పుత్రుడైన భానుమంతుని వంశంలోక్రమంగా శతద్యుమ్నుడు, శుచి, ఊర్ణుడు, సనద్వాజుడు, కులీ, అనంజనుడు, కులీజిత్తు, ఆధీనేమికుడు, శ్రుతాయువు సుపార్వుడు, సృంజయుడు, క్షేమారి, అనేనుడు, రామరథుడు, ఉపగురువు, ఉపగుపుడు, స్వాగతుడు, స్వవరుడు, సువర్చుడు, సుపాగ్యుడు, సుశ్రుతుడు, జయుడు, విజయుడు, ఋతుడు, సునయుడు, వీతిహవ్యుడు, ధృతి, బహులాశ్పుడు, కృతి, జనకుడు రాజులైనారు.
ఈ జనక మహారాజు రెండు వంశాలవాడని తెలుస్తోంది. ఆయన రాజయోగిగా యోగమార్గాన్ని అనుసరించి దానిని అభివృద్ధి చేశాడు.
