1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

214 - స్నాన, సంధ్యా తర్పణ విధి*

(*ఈ అధ్యాయంలో ఏదో ప్రతీకమాత్రంగానే మంత్రాలివ్వబడ్డాయి. పూర్తి పాఠం కోసం ‘మంత్రసంహిత’ లను సంప్రదించాలి.)

బ్రహ్మ ఇలా ఉపదేశించాడని సూతమహర్షి మహామునులకు చెప్పసాగాడు. అన్ని క్రీయలూ స్నానమూలకాలే, స్నానం లేనిదే ఏ క్రీయా సఫలం కాదు. స్నానం ద్వారా అర్హుడు కాదలచుకున్నవాడు ముందుగా మట్టి, గోమయం, నువ్వులు, కుశలు, సుగంధితపుష్పాలు. వీటిని ఒకచోట చేర్చుకోవాలి. గంధాది స్నానోపయుకాలైన పదార్థాలను జల సమీపంలో, స్వచ్ఛమైన నేలపై ఉంచుకోవాలి. తరువాత గోమయాన్నీ మట్టినీ మూడేసి భాగాలుగా విడగొట్టి ఒక భాగంతో జలప్రక్షాళన ద్వారా రెండు కాళ్ళనూ రెండు చేతులనూ శుద్ధిచేసుకోవాలి. జందెము నెడమ భుజంపై వేసుకొని పిలకను ముడివేసి మౌనముగా ఆచమనం చేయాలి.

ఓం ఉరుం హి రాజా వరుణశ్చకార

సూర్యాయ పంథానమన్వేత వాఉ ।

ప్రతిధాతాచ వక్తార స్తా హృదయా విపశ్చిత్ ॥

నమో గ్న్యరుణాయా భీష్టుతో వరుణస్యపాశః ।

వరుణాయనమః ॥

ఇత్యాది మంత్రాలను చదువుతూ కుడి భుజంపై నీటిని స్థాపించుకోవాలి. ఈ క్రింది మంత్రంతో ఆ నీటిని అభిమంత్రితం చేయాలి.

ఓం యేతే శతం వరుణయే

సహస్రం యజ్ణియాః పాశావితతా మహాంతః

తేభిర్నో అద్య సవితోత విష్ణు ర్విశ్వే

ముంచతు మరుతః స్వర్కాః స్వాహా ॥

ఈ క్రింది మంత్రం చదువుతు దోసిలితో నీరు తీసుకొని తలపై పోసుకొని మిగిలిన నీటిని పారబోయాలి.

ఓం సుమీత్రియాన ఆప ఓషధయః సంతు

దుర్మిత్రియాస్తస్మై సంతు

య్కోఽస్మిన్ ద్వేష్టి యంచ పయం ద్విషః ॥

తరువాత కాళ్ళకు, జంఘలకు, కటికీ మూడేసి మార్లు మట్టిని పూసుకోవాలి. తరువాత చేతులు కడుక్కొని ఆచమనం చేసి నీటికీ నమస్కారం చేసి ఓం ఇదం విష్ణుర్విచక్రమే... అనే మంత్రాన్ని చదివి ఓం భూః స్వాహా, ఓం భుం:స్వాహా, ఓం స్వః స్వాహా ఇత్యాది మహావ్యాహృతి మంత్రాలతో అచమనాన్నీ ఓం ఇదం విష్ణు... మున్నగు మంత్రాలతో శరీరంపై మట్టితో మర్దనాన్నీ, మార్దనాన్నీ చేసుకోవాలి. పిమ్మట సూర్యునివైపు తిరిగి ఓం ఆపో అస్మాన్... ఇత్యాది మంత్రాలను చదువుతూ నీటిలో మునకలు వేయాలి. శరీరాన్ని బాగా తోముకుని నీటిలో మునిగి తేలి మరల మట్టిని పట్టించి మరల మునిగి తేలాలి.

ఒడ్డుకీ వచ్చి ఓం మానస్తోకే తనయే మాన.... ఇత్యాది మంత్రాలను ముమ్మారు పఠిస్తూ గోమయాన్ని శరీరమంతటా పూసకోవాలి. తరువాత ఓం ఇమంమే వరుణ... అనే మంత్రంతో తలతో మొదలెట్టి క్రమంగా శరీరాన్ని నీటితో అభిషేకించుకోవాలి. ఈ పై మంత్రాలన్నిటినీ మరల చదువుతూ ఆత్మాభిషేకాన్ని గావించుకొని నీటినుండి బయటికి వచ్చి ఆచమనం చేసి ఓం ఆపోహిష్ణా, ఓం ఇదం ఆపో హ విష్మతీ, ఓం దేవీరాప, ఓం ద్రుపదాదివ, ఓం శం నో దేవీ అనే అక్షరాలతో మొదలయ్యే పవమాన మంత్రాలను పూర్తిగా చదువుతూ ఒళ్ళు తుడుచు కోవాలి. స్నానం చేస్తూ ఓంహిరణ్య వర్ణా, ఓం పవమాన సూక్తం, ఓం తరత్నామా, ఓం శుద్ధవత్యః మున్నగు పవిత్ర మంత్రాలనూ, మరిన్ని వరుణ మంత్రాలనూ కూడా, యథాశక్తి చదవడం మంచిది.

స్నానప్రారంభంలోనూ చివరా ఓంకార, వ్యాహతి సమన్వితమైన గాయత్రి మంత్రాన్ని పఠించాలి. జలాశయ మధ్యలో నిలబడి తోముకోవడం, తుడుచుకోవడం సంప్రదాయం. నీటమునిగి మూడు మార్లు అఘమర్షణ మంత్రాలను పఠించాలి.

అలాగే ఓం ద్రుపదా... మున్నగు మంత్రాలను కూడ ముమ్మారు చదవాలి. ఓం ఆయం గౌ..... మున్నగు మూడు ఋగ్వేదమంత్రాలను జపించాలి. తరువాత స్మృతులలో నిర్దేశింపబడిన స్నానాంగములను గానీ గాయత్రిని గానీ ఓంకార మాత్రమును గానీ విష్ణుస్మరణ గానీ చేయాలి. ఓం తద్ విష్ణోః పరమంపదం... అను దానిని పూర్తిగా మననం చేస్తూ వుండాలి. ఇది వైష్ణవ గాయత్రిగా ప్రసిద్ధి చెందింది. ఓం ఇద మాపః ప్రవహతః... ఇత్యాది పవిత్ర మంత్రాలను మననం చేస్తూ ఒంటిపై చేరిన మలాన్ని తుడిచి పారేస్తుంటే శరీరంతో బాటు మనస్సు కూడా నిర్మలమవుతుంది. ఓం తద్విష్ణోః పరమం పదం... ఇత్యాది మంత్రాలను కూడా పఠించాలి.

సంధ్య మరియు తర్పణ క్రియలకు స్నానవిధిని సంపన్నం చేసి బాగా ఉతికిన అఖండిత పవిత్ర వస్త్రాలను ధరించి మరల మట్టితో నీటితో కాలుసేతులను శుద్ధి చేసుకొని ఉపక్రమించాలి. (తరువాత భోజనానికీ ముందు కూడా ఆచమనాలూ, మంత్ర జపాలూ చేయాలి). 

మరల అచమనం చేసి “ద్రుపదాదివ’ మంత్రాన్ని మూడు మార్లు పఠించి నెత్తిపై నీరు జల్లుకోవాలి. మెల్లగా ప్రాణాయామం చేసి సూర్యుని కర్ఘ్యమిచ్చి ఊర్ధ్వ బాహుపై ఓం ఉదుత్వం... ఓం చిత్రం దేవానాం... ఓం తచ్చక్షుర్దేవహితం... ఓం హంస శుచిషద్ మున్నగు మంత్రాలను పూర్తిగా పఠిస్తూ సూర్యదేవుని పూజించి యథాశక్తి గాయత్రి మంత్రాన్ని కూడా జపించాలి. ఆపై ఓం బిభ్రాట్... మున్నగు సూర్యమంత్రాలనూ, సర్వదేవతల ప్రసన్నతకై ఆయా దేవతల మంత్ర జపాలనూ ఈ జపాల సాంగోపాంగ పూర్ణతకై విధ్యుక్తంగా ఆధ్యాత్మ విద్యాజపానొనరించాలి. ఇపుడు జందెమును సవ్యం చేసుకొని మూడుమార్లు ఆచమనం చేసి శ్రీ, మేధా, ధృతి, క్షితి, వాక్, వాగీశ్వరి, పుష్టి, తుష్టి ఉమ, అరుంధతి, శచి, మాతృగణాలు, జయ, విజయ, సావిత్రి, శాంతి, స్వాహా, స్వధ, శ్రేష్ఠ అదితి, ఋషిపత్నులు, ఋషి కన్యలు, అన్య కామ్య దేవతలు - వీరందరికీ తర్పణలివ్వాలి. ఆ తరువాత సమాహిత చిత్తంతో అందరి మంగళాన్నీ కోరుతూ సర్వమంగళాదేవిని తృప్తిపఱచి “ఓం బ్రహ్మ స్తంబ పర్యంతం జగత్ తృప్య త్వితి అనే మంత్రంతో మూడు అంజలులిచ్చి తర్పణ క్రియను ముగించాలి.