1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

218 - పార్వణ శ్రాద్ధవిధి

(సపాత్రకమనీ అపాత్రకమనీ శ్రాద్ధం రెండు విధాలు. విశ్వదేవ, పితర స్థానాల్లో మహానుభావులైన పవిత్ర బ్రాహ్మణులను కూర్చుండబెట్టి శ్రాద్ధకర్మను గావిస్తారు. దానికి సపాత్రక శ్రాద్ధమని పేరు. కలియుగంలో అంతటి భూదేవతలు దొరకటం కష్టం కాబట్టి ఆ స్థానాల్లో కుశదర్భలను పెట్టి శ్రాద్ధవిధిని నడిపిస్తున్నారు. దీనికి అపాత్రక శ్రాద్ధమని వ్యవహారము)

బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి చెప్పిన గరుడపురాణ - ఆచార కాండను సూత మహర్షి కొందరు మహామునుల జీవిధంగా ప్రవచిస్తున్నాడు.

ఈ కార్యం వల్ల ‘ఇక్కడ’ భోగం ‘అక్కడ మోక్షం అబ్బుతాయి. శ్రాద్ధమును పెట్టువాడు (శ్రాద్ధకర్త} శ్రాద్ధాదినమునకొక రోజు ముందే స్వయంగా వెళ్ళి బ్రాహ్మణులను ఆహ్వానించాలి. ముఖ్యంగా ఈ పనికి బ్రహ్మచారిని పెట్టుకుంటే విశేషఫల ముంటుంది. సవ్యంలో (అనగా జందెమును సవ్యముగా వుంచుకొని) విశ్వదేవులనూ, అపసవ్యంలో పితరులనూ, ఆవాహన చేయాలి. ఓంస్వాగతం భవద్భిః లేదా భవద్భిః స్వాగతం స్వీక్రియతాం అని విశ్వదేవులనూ ప్రతినిధులనూ ఆహ్వానిస్తే వారి ప్రతినిధులైన బ్రాహ్మణులు ప్రవేశిస్తారు. అప్పుడు శ్రాద్ధకర్త*

 ‘ఓం విశ్వేభ్యోదేవేభ్య ఏతత్వాదోదకమర్ఘ్యం స్వాహా’అంటూ దేవతలకు బదులుగా నిలబడ్డ బ్రాహ్మణుల పాదాలను దేవతీర్థంతో కుశలతో కడగాలి. తరువాత జందెము నపసవ్యం చేసుకొని దక్షిణం వైపు తిరిగి తండ్రి తాతల గోత్ర నామాలను ఉచ్చరిస్తూ పితరులకు బదులుగా నిలబడ్డ బ్రాహ్మణుల చరణాలను ఓం ఏతత్పాదోదక మర్ఘ్యం స్వధా అనే మంత్రం ద్వారా నీటితో పూలతో కుశలతో కడగాలి. మాతా మహాదుల శ్రాద్ధ కర్మలో కూడా ఇలాగే చేయాలి. తరువాత ఓం ఏతదాచమనీయం స్వాహా అంటూ బ్రాహ్మణుల చేతికి నీటినీ ఓం ఏషవ్కోఽర్ఘ్యం అంటూ ఆర్ఘ్యాన్నీ పూలనూ ఇవ్వాలి. ‘సిద్ధమిద మాసనం గృహ్యాతాం’ అంటూ వారిని అసనంపై గౌరవంతో కూర్చోబెట్టాలి. వారుకూడా ‘ఇహసిద్ద మిద మాసనం’ అని ప్రసన్నంగా చెప్పిన తరువాత ఓం భూః ఓం భువః ఇత్యాది సప్తవ్యాహృతులను పఠిస్తూ దేవ - బ్రాహ్మణులు తూర్పువైపూ పితర - బ్రాహ్మణులు ఉత్తరాభిముఖంగానూ కూర్చున్నారో లేదో చూసుకొని ఈ క్రింది మంత్రాన్ని మూడు మార్లు జపించాలి.

(*ఇక్కడ సుస్వాగతం అనే మాట ఈయబడింది కాని ఆ మాట వ్యాకరణ బద్దం కాదు. కాబట్టి చేర్చబడుట లేదు.)

ఓం దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవచ ।

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ భవంతు తే ॥

తరువాత మాసం, పక్షం, తీక్ష, దేశం, పిత, పితామహుల నామగోత్రాలతో సంకల్పం చెప్పుకొని దానిని విశ్వేదేవ పూర్వకం శ్రాద్ధం కరిష్యే అని ముగించి, ఓం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహా మంత్రాన్నుచ్చరించాలి. పిమ్మట ఓం విశ్వేదేవానావాహయిష్యే అను మంత్రముతో ప్రార్థించి ఓం ఆవాహయ అని బ్రాహ్మణులాజ్ఞాపించగానే

ఓం విశ్వేదేవా... ఓం ఓషధయః....

ఆగచ్ఛంతు మహాభాగా విశ్వేదేవా మహాబలాః ।

యే అత్ర విహితాః శ్రాద్ధే సావధానా భవంతుతే ॥

ఇత్యాది మంత్రాలతో శ్రాద్ధకర్త విశ్వేదేవుల నావాహన చేసి ఓం అపహతాసురా రక్షా సి వేదిషదః అనే మంత్రాన్ని మూడు మార్లు చదివి యవలను జల్లాలి. ఓం పాత్రమహం కరిష్యే అని బ్రాహ్మణులవైపు చూసి వారి అనుజ్ఞను పొందే వారి చేత ఓం కురుష్వ అనిపించుకొని అగ్రభాగయుక్తాలైన రెండు కుశదర్భలను తీసుకోవాలి. వాటి పొడవు శ్రాద్ధకర్త బొటన వేలికీ చూపుడు వేలికీ మధ్య రెండూ బాగా సాగదీసినపుడున్నంత పొడవుండాలి. (ఈ పొడవునే శ్రాద్ధ పరిభాషలో ప్రదేశమంటారు) ఓం పవిత్రే స్థో వైష్ణవ్యా... ఇత్యాది మంత్రాలను చదువుతూ ఒక దర్భతో ఇంకో దర్భను భేదించాలి. ఓం విష్ణుర్మనసా పూతేస్థ అంటూ వాటి పై నీటిని చల్లి మరో దర్భను కలిపి వాటిని చుట్టి అర్ఘ్య పాత్రలో వేసి వుంచాలి. ఓం శం నో దేవీ రభిష్టయ... అనే మంత్రాన్నుచ్చరిస్తూ ఆ పాత్రలో జలాన్ని పోసి ఓం యవోసి..... మంత్రంతో యవలనూ ఓం గంధద్వారాం దురాధర్షా........ ఇత్యాది మంత్రంతో చందనాన్నీ వేయాలి. అపుడు ఓం యాదివ్యా ఆపః పయసా... ఓం ఏష్యోఽనమః అనే మంత్రాలను చదువుతూ అర్ఘ్యపాత్రలోని నీటిని బ్రాహ్మణుల చేతిలో పోయాలి. కొంత జలాన్ని మిగిల్చి పవిత్రకాన్ని వేసి ఆ పాత్రను బ్రాహ్మణుల కుడి పక్కన పెట్టాలి. (ఊర్థ్వముఖ కుశలపై పెట్టాలి}

తరువాత ఓం విశ్వేభ్యో దేవేభ్య ఏతాని గంధపుష్ప ధూప దీప వాసోయుగ్మ యజ్ఞో పవీతాని నమః అంటూ విశ్వేదేవులకు గంధాదులను సమర్పించి వాటి పూర్ణతను కోరుకుంటూ గంధాది దానమచ్చిద్రమస్తు అని ప్రార్థించాలి. అపుడు విశ్వేదేవుల ప్రతినిధులైన బ్రాహ్మణులు, తరువాత ఋత్విజుడైన బ్రాహ్మణుడు ఓం అస్తు అని, ప్రతినిథులు స్వీకరిస్తారు. అంతట శ్రాద్ధకర్త ‘పితృపితామహ ప్రపితా మహానాం మాతా మహ ప్రమాతా మహా వృద్ధ ప్రమాతా మహానాం సపత్నీకానాం శ్రాద్ధ మహం కరిష్యే’‘ అంటూ శ్రాద్ధాన్ని పెట్టడాని కనుమతిని వేడగా బ్రాహ్మణులు కురుష్వ అని దానిని ప్రసాదించగా శ్రాద్ధకర్త ఓం దేవతాభ్యః పితృభ్యశ్చ.......అనే మంత్రాన్ని ముమ్మారు జపించాలి.

తరువాత పితరుల నామగోత్రాలనుల్లేఖిస్తూ ఇదమాసనం స్వధా అని చెప్పి ఓం పితృన్ ఆవాహయిష్యే వాక్యం ద్వారా బ్రాహ్మణుల అనుజ్ఞను పొంది వారు ఓం ఆవాహయ అని చెప్పాక ఓం ఉశంతస్త్వా....., ఆయాంతు నః పితరః ... ఇత్యాది మంత్రాలతో పితరులను ఆవాహన చేయాలి. ఓం అపహతాసురా రక్షా సి వేదిషదః అనే మంత్రాన్ని పఠిస్తూ తిలలను వికరణ* చేయాలి. పూర్వం స్థాపించిన అర్ఘ్యపాత్రలో అదే క్రమంలో నీటినిపోసి ఓం తిలోసి సోమదేవత్యో... ఇత్యాది మంత్రాలతో తిలాదానం గావించాలి. తరువాత రెండు చేతులతోనూ గంధపుష్పాలను సమర్పించి పితృపాత్రను పైకి లేపి ఓం యా దివ్యా..... అనే మంత్రాన్ని పఠించి పిత్రాదుల గోత్ర నామాలను చెప్పి ఏష తేర్ఘ్యః స్వధా, ఓం పితృభ్యః స్థానమసి అనే మంత్రాలతో పవిత్రీ సహితంగా అర్ఘ్య పాత్రను బోర్లించి పెట్టి ఓం శంధంతాం లోకాః పితృసదనా ... అనే మంత్రం చదువుతూ దానిని స్పృశించాలి.

(*వికరణ = వెదజల్లుట)

అనంతరం పితృతీర్ణంతో పిత్రాదుల ఆసనాలకు గంధ, పుష్ప, వస్త్రయుగ్మాదులనూ యజ్ఞోపవీతాదులనూ ధారవోసి గోత్రనామోచ్చారణ పూర్వకంగా సపత్నీకులైన

 

పితృపితామహ ప్రపితామహులకు ‘ఏతాని గంధపుష్ప ధూపదీప వాసో యుగ్మసోత్తరీయ యజ్ఞోపవీతాని వఃస్వధా’ అనే మంత్ర వాక్యాన్ని చదివి పితృతీర్థం నుండి నీళ్ళు వదిలెయ్యాలి. గంధాది దానం అక్షయ్యం అస్తు అని శ్రాద్ధకర్త అనగానే బ్రాహ్మణులు సంకల్ప సిద్ధిరస్తు అని దీవిస్తారు. ఇలాగే మాతామహాదులకూ కూడా ఈ కర్మను చేసి ఈ దీవెనను పొందాలి. ఓం యా దివ్యా.. అనే మంత్రంతో నేలను అలికి నేతిని కలిపిన అన్నాన్ని చేతబట్టుకొని సవ్యుడై శ్రాద్ధకర్త ఓం అగ్నౌ కరణమహకరిష్యే అంటూ అనుమతికై బ్రాహ్మణుల వంక చూడాలి. పీతర బ్రాహ్మణులు ఓం కురుష్వ అంటూ అనుజ్ఞ నివ్వగనే ఓం అగ్నయేక వ్యవాహనాయ స్వాహా అనే మంత్రంతో పితర ప్రతినిధి బ్రాహ్మణుల చేతుల్లో రెండేసి ఆహుతులను ఇవ్వాలి. మిగిలిన అన్నాన్ని పిండాలుగా చేసి ఒక సగాన్ని పితృపాత్రలోనూ మరొక సగాన్ని మాతృపాత్రలోనూ ఉంచాలి.

ఇందాక బోర్లించిన పాత్రపై ఇపుడు అన్నాన్ని వేస్తూ (అంతకుముందే ఓం పృథివీ తేషాత్రం .. తో నీళ్ళు జల్లాలి.} ఓం ఇదం విష్ణుర్విచక్రమే..అనే మంత్రాన్ని చదవాలి. అన్నం మధ్యలోకీ బొటన వేలిని క్రింది పెట్టి విష్ణో హవ్యం రక్షస్వ అనాలి. ఓం అపహతాసురా రక్షాసి వేదిషదః. మంత్రంతో మూడుమార్లు యవలనూ, ఓం నిహమ్ని సర్వం...... అనే మంత్రంతో పసుపుపచ్చని ఆవాలనూ వికరణం చేయాలి. అపుడు ధూరిలోచన సంజ్ఞకే భ్యోదేవేభ్య ఏతదన్నం, సఘృతం సపానీయం సవ్యంజనంస్వాహా అనుచు విశ్వేదేవులకు అన్నాన్ని నివేదించి దానిపై సజల కుశపత్రాలనుంచి ఓం అన్నమిదం అక్షయ్యం అస్తు అని శ్రాద్ధకర్తా, ఓం సంకల్ప సిద్ధిరస్తు అని ప్రతినిధి బ్రాహ్మణులూ చెప్పాలి.

తరువాత జందెము నపసవ్యం చేసుకొని పిత్రాదిపాత్రలో నేతితో కలిపిన అన్నాన్ని వ్యంజన సహితంగా కలిపి దానిపై ఇంతకుముందు భూమిని శుభ్రపఱచి వుంచిన కుశలను వేయాలి. తరువాత పాత్రను స్పృశిస్తూ ఓం పృథివీతే పాత్రం... అనే మంత్రాన్నీ, బొటన వేలితో అన్నాన్ని ముట్టుకుంటూ ఓం ఇదం విష్ణుర్విచక్రమే... మరియు ఓం విష్ణోః కవ్యం రక్షస అనే మంత్రాలనూ పఠించాలి. ఓం అపహతాసురా రక్షా సి వేదిషదః అనే మంత్రంతో అన్నంపై నువ్వులను జల్లి ఎడమ మోకాలిని నేలకి తగిలించి కూర్చుని ఈక్రింది మంత్రాన్నుచ్చరిస్తూ సపత్నీకులైన పితృపితామహాదుల నామగోత్రాలను శబ్దిస్తూ వారికీ అన్నమును నివేదించాలి.

అముక గోత్రేభ్యః అస్మత్ పితృపితామహేభ్యః సపత్నీకేభ్యః ఏతదన్నం సఘృతం సపానీయం సవ్యంజనం ప్రతిషిద్ధ వర్జితం స్వధా.

తరువాత అన్నసంకల్పం చేసి ఓం ఊర్జం వహంతీ రమృతం.. అనే మంత్రాన్నుచ్చరిస్తూ దక్షిణం వైపు తిరిగి నీటిని ధారపోయాలి. అంటే అన్నాన్ని ధారపోసినట్టే) ఓం శ్రాద్ధమిదమచ్ఛిద్రమస్తు, ఓం సంకల్పసిద్ధిరస్తు అని శ్రాద్ధకర్తా, బ్రాహ్మణులూ ఘోషించాలి. అప్పుడు శ్రాద్ధకర్త ఓం భూర్భువఃస్వః ... అనే వ్యాహృతి మంత్రయుక్త గాయత్రిని ఉచ్చగించి దాన్ని విసర్జించాలి. ఆ తరువాత ఓం మధువాతా... మంత్రాన్ని పఠించి మధు శబ్దాన్ని మూడుమార్లు ఉచ్ఛరించాలి. నేతిని కలిపిన అన్నంతో పిండాన్ని చేసి ఓం అముక గోత్ర అస్మత్పిత.. ఇత్యాది వాక్యములతో కుశలపై పితరులకు పిండ ప్రదానం చేయాలి. పిండ సమీపంలో కొంత అన్నాన్ని జల్లి ఓం లేపభుజః పితరః ప్రియంతాం అని చదువుతూ పీడాధారకుశలపై చేతో నిమరాలి. ప్రక్షాళిత పిండజలంతో ఓం అముక గోత్ర అస్మత్పితః మున్నగు వాక్యాలతో పిండాల పై నీటిని చిలకరించాలి. పిండపాత్రను క్రిందికి వంచి దానికి చేతులు జోడించి నమస్కరిస్తూ ఓం పీతరో మాదయ ధ్వం.... అనే మంత్రాన్ని జపించాలి. తరువాత నీటిని పట్టుకొని ఎడమవైపు నుండి నీటిని గుండ్రంగా తిప్పుకొని జల్లుతూ ఉత్తరం వైపు తిరగాలి. మూడు మార్లు ఊపిరిని బలంగా పీల్చి ఓం షడ్భ్యఋతుభ్యోనమః అనే మంత్రాన్ని పఠించాలి.

తరువాత ఎడమవైపునుండి దక్షిణం వైపు గుండ్రంగా (వామావర్త) తిరుగుతూ భోజన పాత్రలో పూలనూ అక్షతంచారిష్టం చాస్తు........ అనే మంత్రం చదువుతూ అక్షతలనూ వేయాలి. పైబట్టను తీసి చేతపట్టుకొని అమీమదంతః పితరో యథాభాగ మావృషాయిత అనే మంత్రం చదువుతూ చేతులు జోడించి ఓం నమోవః పితరోనమోమః ... అనే మంత్రాన్ని జపించాలి. నలువైపులా కలయజూసి గృహాన్నః పీతరోదత్త అనాలి. సదావః పితరో ద్వేష్మః అని చెప్పాలి. ఏతద్వః పితరోవాస అని ప్రార్థించి అముక గోత్ర పితః ఏతత్తే వాసః స్వధా అనే వాక్యాన్ని చదువుతూ పిండంపై దారపు పోగుసుంచాలి.

పిమ్మట నీటి పాత్రను ఎడమచేతిలోకి తీసుకొని ఊర్ణం వహంతీ.. అనే మంత్రంతో పిండంపై నీటిని పోయాలి. ఇదివఱకు పాత్రలో పెట్టిన పిండాలను కూడా తడపాలి. తరువాత పిండాలపై గంధాన్నీ కుశలనూ వేసి అక్షన్న మీమదంత... ఇత్యాది మంత్రాన్ని ముమ్మారు పఠించాలి. మాతామహాదుల ప్రతినిధి బ్రాహ్మణులచే ఆచమనం చేయించాలి. ఓం సుప్రోక్షిత మస్తు అంటూ శ్రాద్ధభూమిని బాగుగా కడిగి అపాం మధ్యే స్థితా దేవా సర్వమప్పు....... మరియు శివా ఆపః సంతు అని చెప్తూ బ్రాహ్మణుల చేతుల్లో నీళ్ళుపోయాలి. లక్ష్మీసరస్వతి... మున్నగు మంత్రాలను పఠించి ఓం సౌమనస్యమస్తు అనే మంత్రోచ్చాటనతో బ్రాహ్మణుల చేతులలో పూలనుంచాలి. తరువాత అక్షతం చాస్తు...

ఇత్యాది మంత్రాలను పఠించి అక్షతం చారిష్టం చాస్తు అనే మంత్రోచ్చాటన చేస్తూ యవలనూ, నువ్వులనూ బ్రాహ్మణుల చేతుల్లో పెట్టాలి. ఆ పై ఈ క్రింది మంత్ర వాక్యంతో పిత్రాది బ్రాహ్మణులచేతులలో శిలలనూ నీటినీ పోయాలి. అముక1గోత్రాణా మస్మత్ పితృపితామహ ప్రపితా మహానాం సపత్నీకానా మిదమన్న పానాదిక మక్షయ్యమస్తు. బ్రాహ్మణులు వెంటనే అస్తు అని ఆశీర్వదిస్తారు. ఇలాగే మాతామహాదులకు కూడా చెయ్యాలి. తరువాత ఓం అఘోరాః పితరః సంతు, గోత్రం నో వర్ధతాం.... దాతారో నోభీ వర్ధంతాం... ఇత్యాది మంత్రాలను పఠించాలి.

(1ఈ ఆముక అనే మాట వున్నచోట గోత్రం పేరు చెప్పాలి. ‘అముక’ అనక్కర్లేదు.)

అనంతరం శ్రాద్ధకర్త బ్రాహ్మణుల అనుమతితో 2అర్ఘ్య పాత్రలో పిండకాలకు బదులు పవిత్రకాలనుంచి, కుశనిర్మిత పవిత్రకాలతో పీతర బ్రాహ్మణులను స్పృశిస్తూ ఓం స్వధాం వాచయిష్యే అని స్వధామంత్రాన్ని చదవడానికి అనుమతిని వేడి, పొంది ఓం పితృపీతామహేభ్యోయథానామశర్మ భ్యః సపత్నీ కేభ్యః స్వధా ఉచ్యతాం అన్నపుడు బ్రాహ్మణులు అస్తుస్వధా అంటూ ఆమోదిస్తారు. అంతట శ్రాద్ధకర్త ఊర్జం వహంతీ రమృతం... అంటూ పిండంపై నీరు పోసి విశ్వేదేవా అస్మిన్ యజ్ఞే ప్రీయతాం. అంటూ దేవబ్రాహ్మణుల చేతులలో యవలనూ నీటినీ పోయాలి. వారు వెంటనే ‘తృప్తి చెందాము’ అనే భావాన్ని ఓం ప్రీయంతాం ద్వారా వ్యక్తం చేస్తారు. అపుడు కర్త ఓం దేవతాభ్యః ... అనే మంత్రాన్ని మూడుమార్లు జపించాలి.

శ్రాద్ధకర్త తన ముఖమును బాగా వంచి పిండ పాత్రను కుదిపీ సవ్యుడై ఆచమనం చేసి తూర్పువైపుకి తిరిగి ఓం అముక గోత్రాయ అముక దేవ శర్మణే... ఇత్యాది మంత్రాల నుచ్చరిస్తూ దేవబ్రాహ్మణులకు దక్షిణలివ్వాలి. తరువాత పితృ బ్రాహ్మణుల అనుమతిని *పొంది పిండాలపై పాలను పోయాలి. మరల పిండమును కదిపి తత్సమీపమందున్న అర్ఘ్యపాత్రను చిన్నగా పెట్టాలి. ఓం వాజే వాజే.... అనే మంత్రంతో పిండాధిష్ఠాతలను విసర్జనం చేయాలి. ఆమావాజస్య మున్నగు మంత్రాలతో దేవబ్రాహ్మణులకూ అభిరమ్యతాం మంత్రంతో పితృ బ్రాహ్మణులకూ వీడ్కోలు చెప్పి, వారి అనుమతిని గైకొని పిండాలను ఆవులకూ ఇతరాలకూ ప్రదానం చెయ్యాలి. ఇది శ్రాద్ధవిధి.

(*సౌమనస్యమస్సు, అస్తు అంటూ)

దీనిని చదివినంత మాత్రాననే పాపాలు నశిస్తాయి. పితరులకు దీనివల్ల అక్షయ స్వర్గమూ, బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి.