1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

193 - బుద్ధి శుద్ధకరౌషధి, అభ్యంగాలు, ఉపయోగకర చూర్ణాలు విరేచక ద్రవ్యాలు

శివ మహాదేవా! పలాండు, జీరక, కుష్ఠ, అశ్వగంధ, అజమోదక, వచ, త్రికటుక, లవణాలను కలిపీ నూగి బ్రాహ్మీ రసంలో తడిపీ ముద్ద చేసి తేనెతోనూ వెన్నతోనూ కలిపి ఒక వారం రోజులపాటు తింటే మనిషి మస్తిష్కం అన్ని విధాల బాగుపడి మేధావి అవుతాడు (అవుతుంది).

సిద్ధార్థక, వచ, హింగు, కరంజ, దేవదారు, మంజిష్ఠ, త్రిఫల, విశ్వ, శిరీష ద్వివీధరజని, ప్రియంగు, నీంబ, త్రికటులను మెత్తగా నూరి గోమూత్రంతో కలిపి నశ్యంగా గాని, పట్టీగా గాని, లేపనంగా గాని వాడితే అరీచి కేకలు పెట్టి ఆందోళనవల్ల ఏడ్పులు పెడబొబ్బలు పెట్టు మానసిక రోగము* విషప్రభావం, మానసికోద్రేకంతో మతి తప్పిన స్థాయి, బక్కచిక్కిపోవుట, చర్మంపై మచ్చలు, చర్మం రంగు మారుట వంటి విభిన్నరోగాలన్నీ విరిగిపోతాయి. అంతేకాక విష్ణునామం జపించుచూ పూసుకుంటే దుష్టగ్రహపీడ దూరమైపోయి రాజద్వార ప్రవేశం, సమ్మానం కూడా కలుగుతాయి.

(*హిస్టీరియా)

నింబ, కుష్ఠ, ద్వీవిధ హరిద్ర, శిర్రు సర్షపజ, దేవదారు, పటోల, ధన్యలను మజ్జిగతో కలిపి ముద్దచేసి రోగి తలపై కాస్త నూనెను చిలకరించి పై ముద్దను లేపనం వలె మృదువుగా పూస్తే అన్ని విధాల చర్మపు చెక్కుడులు, కుష్టులు, దురదలు నశిస్తాయి.

సముద్రపు ఉప్పు, గెడ్డలుపు, క్షార రాజిక, విడలవణ, కటు, ఇనుపధజను, త్రివృత, సువర్ణకాలను సమపాళ్ళలో తీసుకొని పెరుగు, గోమూత్రం, పాలు ఉంచిన గిన్నెలో వేసి తక్కువ సెగలో వేడి చేసి చల్లార్చి చూర్ణం చెయ్యాలి. దీనిని అగ్ని బలచూర్ణమంటారు. దీనిని భోజనానంతరం వేడినీటితో కలిపి తాగితే వెంటనే కొంచెం వెన్నను తింటే అన్ని రకాల అజీర్ణరోగాలూ, బొడ్డు బాధలూ, మూత్రనాళ సంబంధిత అవస్థలూ, ప్లీహ వ్యాకోచమూ నశిస్తాయి.

ఆయాసానికి దగ్గుకీ, అభయ, ఆమలక, ద్రాక్ష, పిప్పలి, కంటకారిక, శృంగి, పునర్నవ, సౌంటిల మిశ్రమం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. జ్వరానికి అభయ, అమలక, ద్రాక్ష, పాఠ, విభీటక, పంచదారలను సమానపాళ్ళలో కలిపి చేసిన మందు శీఘనివారకం. త్రిఫల, బదర, ద్రాక్ష, పిప్పలి మిశ్రమం తీసుకున్నా, హగీతకిని వేడి నీటితో కలిపి ఉప్పేసుకుని త్రాగినా జాడించి విరేచనమవుతుంది.

పైన చెప్పిన మందులన్నీ ఆయా రోగాలనే చెట్లకు పిడుగుపాట్ల వంటివి. మందునిచ్చువారు, తీసుకొని వేసుకొనువారు హరినామస్మరణను గానీ, విష్ణు స్తోత్రాన్ని గానీ ఆయా సమయాల్లో చేస్తూ వుండాలి. దైవబలం పుంటేగాని రోగాలు తగ్గపు.