1 - గరుడ పురాణము - ఆచార కాండము
173 - మధుర, అమ్ల, తిక్తాదుల (ద్రవ్యాల) ఔషధీయ ఉపయోగాలు
శుశ్రుతా! తీపి, పులుపు, చేదు రుచులుండే ద్రవ్యాలను వాటిని ఔషధాలుగా వాడే పద్ధతులను అవధరించు. మధురాది ద్రవ్యాలలో శాలి, షష్టిక, గోధుమ, పాలు, నెయ్యి, ఫలరసాలు, తేనె, మజ్జ, శృంగాటక, కశేరు, ఇర్వరు, గోక్షుర, గంభీం, కలువగింజలు, ద్రాక్ష, ఖర్జూరం, బల, కొబ్బరి, చెఱకు, ఆత్మగుప్త, విదారి, ప్రియాలక, మధూక, తాల, కుసుమంద (కుసుమాండ) లు పేర్కొనదగినవి. వీటిలో ప్రతిఒక్కటీ మూర్ఛ, మంటలను పోగొట్టుటలో ఉపయోగపడుతుంది. జ్ఞానేంద్రియాలకు ఓదార్పునిస్తుంది. కాని, వీటిని అతిగా తీసుకుంటే క్రిములు పుడతాయి. కఫానికి సంబంధించిన రోగాలు వస్తాయి. వీటినుండి వచ్చిన మందులను కూడా అవసరమైతేనే వాడాలి. (తప్పకపోతేనే)
తీయగా నున్న వాటిని, మందులనైనా సరే ఎక్కువగా తింటే దగ్గు, పడిసెం, నోటిలో తీపు, పొక్కులు, కురుపులు, కంతి, బోధకాలు, దళసరి నాలుక, గుడలేపా సమస్యలు వస్తాయి.
దాడిమ, ఆమలక, ఆమ్ర, కపిత్థ, కరమర్దక, మాతులుంగ, ఆమ్రాతక, బదర, తింతిడి, పెరుగు, మజ్జిగ, కంజీక, లకుచ, అమ్ల వెట(త)స, లొణాలు పుల్ల మందులు. వీటిని సొంటితో కలిపితే గొప్ప జీర్ణకాలు, ఆకలిని పుట్టించెడి ఔషధాలు తయారవుతాయి. ఇది వాయువును, చీముతో కూడిన స్రవాలను సృష్టించగలవు. రతి సామర్థ్యాన్ని పెంచే శక్తి కూడా వీటికుంటుంది.
అలాగని ఎక్కువగానో అనవసరంగానో వాడేస్తే మాత్రం ఇవి హాని చేస్తాయి. అవయవాలు వదులై జాగిపోవడం, గొంతు బిరుసెక్కిపోవడం, గుండె అదరడం, నోరు పొక్కడం, గాయాలను, లోపలి కురుపులను సృష్టించడం వంటి సమస్యలనుత్పన్నం చేస్తాయి.
క్షార ద్రవ్యాలు (సైంధవ, సువర్చల) యవక్షార, సర్జికాల వంటివి. వీటిని లవణ బృందమనవచ్చును. ఇవి విరేచనం కోసం, అరుగుదల కోసం, చీము రసాల స్రావం కోసం, స్వేదకారకాలుగానూ వాడతారు. వీటి శక్తి శరీరమంతటా శరవేగంతో ప్రాకుతుంది.
వీటినెక్కువగా వినియోగించడం వల్ల శరీరంలో నాళాలకు అవరోధాలేర్పడి దురదలు, కురుపులు పుట్టుకొస్తాయి. చర్మం వివర్ణమవుతుంది. రక్తపాతం పిత్త రక్తం ప్రకోపింప బడతాయి. పుంస్త్వం తగ్గవచ్చును.
ఇక చేదు ద్రవ్యాల బృందంలోనివిగా వ్యోష, శిగ్రు, మూలక, దేవదారు, ముష్ట (ముస్త) కుష్ఠక, లశున, వల్గుజీఫల, గుగ్గులు, లాంగల్యాదులు పరిగణింప బడుతున్నాయి. ఇవి ఆకలిని పెంచుతాయి, క్షాలకాలుగా పనిచేస్తాయి కాని కఫానికి ఇబ్బంది కలిగిస్తాయి. కుష్టునీ దురదలనీ పోగొడతాయి. బలుపునూ, అనవసర కొవ్వునూ, బడలికనూ, ఆయాసాన్నీ, క్రిములనూ తొలగిస్తాయి. వీర్యాన్ని కూడా అదుపుచేస్తాయి. కానీ అతిగా వినియోగిస్తే తలతిప్పు, మంట కలుగుతాయి.
ఇక తిక్త లేదా వగరుగా వుండే ఓషధీగుణాలున్న ద్రవ్యాలు కృతమాల, కరీర, హరిద్ర, ఇంద్రయవ, బృహతి, శంఖిని, గుడూచి, ద్రవంతి, త్రివృత, మండూక పర్ణి, కారవెల్లక, వార్తాకు, కరవీరక, వాసన, రొహిణి, శంఖపుష్పి, కర్కొటి, జయంతిక, జాతి, వరుణక, నింబ, జ్యోతిష్మతి, (ష్మ) పునర్నవాలు. కంటక, వేత్రాలు కొంతసేపు నమిలితే తియ్యగా తగులుతాయి. ఇవి తిణ్వా (తిక్వా) లను అనగా రస స్రవంతులను పారిస్తాయి. శరీరం తేలిక పడేలా చేస్తాయి. జీర్ణాన్ని మెరుగుపరుస్తాయి. ఆకలిని కలిగిస్తాయి. నాళాలను శుద్ధిచేసి, జ్వరాన్నీ, దాహాన్నీ తొలగించి దురదలను పోగొట్టి, మూర్ఛను నివారిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం మలమూత్రాలు పొడిబారిపోయి స్రావకాలు తగ్గుతాయి. జాగ్రత్తగా వాడితే పక్షవాతం, మెడవాలిపోవడం, ప్రేగు కురుపులు, తలనొప్పి వంటి అసాధ్యరోగాలు కూడా నిమ్మళిస్తాయి.
వగరు, పులుపు కలిసి వుండే త్రిఫల, శల్లకి, జంబు, ఆమాత్రక, వట, తత్సంబంధితాలు, తిందుక, వకుళ, శాల, ముద్గ, చిల్లాకాలు దేనినైనా పీల్చే గుణాన్ని కలిగి వుంటాయి. కాబట్టి వీలైనంత తక్కువగా వాడాలి.
ఇవికాక మిశ్రమ రుచులుగల ఓషధుక ఇరవై వున్నాయి. అవి హరిద్ర, కుష్ఠ, లవణ, మేషశృంగి, రెండు రకాల ‘బల’లు, కచ్ఛుర, శల్లకి, పునర్నవ, శతావరి, అగ్నిమంత, బ్రహ్మదండి, శ్వదంష్ట్ర, ఎరండక, యవ, కొల, కులత్థ, కర్షశి, దశమూల (ఇవొక పదిరకాలుంటాయి) ఈ మందులు ఒక్కటిగా కాని, కొన్ని కలిసి గాని త్రిదోషాలను చక్కగా కుదురుస్తాయి. ముఖ్యంగా అవసరం కంటె నెక్కువగా పెరిగిపోయి, మనిషిని చికాకుపఱచే వాత, కఫ, పిత్త అతిశయాలను తొలగిస్తాయి.
శతావరి, విదారి, బాలక, ఉశీర, చందన, దూర్వ, వట, పిప్పలి, బదరి, శల్లకి, కదలి, ఉత్పల, పద్మ, ఉదుంబర, పటోలక, హరిద్ర, గుడ, కుష్ఠక, శతపుష్పి, జాతి వ్యోష, ఆరగ్వధ, లాంగలి అనే మందులను కఫ - విలంబక ఔషధాలంటారు. శరీరానికి కావలసిన కొవ్వుని ఇవ్వడంలో నెయ్యి, నూనెలు, బలాహారాలు, చిక్కుడు, బటానీల వంటివి సుప్రసిద్ధాలే కాని నీరసించినవారికి, బలం అవసరమై అరిగించు కోగలిగిన పరిమాణంలోనే వీటిని వాడాలి.
తెలివితేటలు, జ్ఞాపకశక్తి, అవగాహన సామర్థ్యము కోరుకునేవారు రోజూ ఎంతో కొంత పరిమాణంలో నేతిని తీసుకోవాలి. పిత్తరోగికి నేతి మందే ప్రశస్తమైనది. వాతరోగికి నేతినే కాస్త లవణంతో కలిపి యివ్వాలి. కఫరోగికీ నేతిని వ్యోష, క్షారములతో కలిపి యివ్వాలి. సెగగెడ్డల వంటి ఎఱ్ఱ కురుపులు, సైనస్, పురుగులు, ఊబకాయము, కఫ - వాత ప్రకోపాలూ కలవారికీ లవణ, క్షార, ఘృత మిశ్రమాలు పనిచేస్తాయి.
మలం, మలద్వారం గట్టిపడినవారికి నూనెతోటి వైద్యం అవసరం. వాతావరణ కారణంగా(ఎండ, వాన, చలి) గాని, బరువులు మోయడం వల్ల గాని,అతి సంభోగ సుఖం వల్ల గాని, అతి వ్యాయామం వల్ల గాని, నీరసించినవారికి కూడ నూనెతో వైద్యం అవసరం. ఇక్కడ నీరసించడమనగా శరీరంలోనే అతి ముఖ్య ద్రవాలలో కణజాలాలలో అలసట.
నెయ్యి గాని నూనె గాని వేడి నీళ్ళతో కలిపి ఒక పద్ధతి ప్రకారం రాయడాన్ని స్నేహకర్మ అంటారు. పిత్తదోషానికి స్నేహకర్మ చికిత్సను తీసుకునేవారు వేడి నీటిని మాత్రమే తాగాలి. (దాహం వేసినపుడు కూడా) మంచి జీర్ణశక్తి (దీప్తాగ్ని) ని కలిగియుండి కూడా వర్చస్నిగ్ధత (నూనె పూసినట్లున్న) గల మల విసర్జించేవానికి త్వరలో వాత ప్రకోపదోషం వస్తుంది. అందుచేత విరేచనంలో తేడా రాగానే వాయు సమానతకి పైని చెప్పిన చికిత్సలలో దేనినైనా చేయించుకోవాలి.
కఫ, వాయు ప్రకోపాలు కలిసి ఒకేసారి శరీరంపై దాడిచేసినా, విడివిడిగా వచ్చినా శ్యామాక, కొరదోష, అన్న, పిన్యాకములతో మజ్జిగను, వేచిన బియ్యపు పిండిని కలిపి డయాఫోరిక్ మెజర్స్ తో చికిత్స చేయాలి.
మాటిమాటికీ బలహీనతవల్ల మూర్ఛితులయ్యేవారికీ, గొంతు బిరుసెక్కిపోయిన వారికీ, అత్యధిక స్థాయిలో బాన పొట్ట గలవారికీ ఈ చికిత్సను చేయకూడదు.
