1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

54 - భువనకోశ వర్ణన ప్రియవ్రత మహారాజు వంశం

మనుపుత్రుడైన ప్రియవ్రతునకు పదిమంది కొడుకులు కలిగారు. వారు అగ్నీధ్రుడు, అగ్నిబాహువు, వపుష్మాన్, ద్యుతిమాస్, మేధ మేధానిధి, భవ్యుడు, శబలుడు, పుత్రుడు, జ్యోతిష్మాన్.

వీరిలో మేధ, అగ్నిబాహువు, పుత్రుడు అనువారు గొప్ప యోగీశ్వరులు. జాతిస్మరులు (అనగా పూర్వజన్మజ్ఞానం కలవారు), మహా సౌభాగ్య (అంటే ధనంకాదు) శీలురు. రాజ్యం పట్ల గానీ ఇతర సాంసాగిక విషయాలపై గాని వారు ఏ మాత్రమూ ఆసక్తి చూపక పోవడంతో ప్రియవ్రతుడు మీగతా ఏడుగురికీ సప్తద్వీపసమన్వితమైన పృథ్వీని పంచేశాడు.

యాభైకోట్ల యోజనాల్లో విశాలంగా పలచుకొని వున్న ఈ పృథ్వి నదిలో తేలియాడే నౌకలాగా అశేషజలరాశిపై బంతి వలె తేలియాడుతున్నది.

జంబూ, ప్లక్ష, శాల్మల, కుశ, క్రౌంచ, శాక, పుష్కర - అనునవి సప్తద్వీపాలు. ఇవి లవణ, ఇక్షు, సుధా, ఘృత, దధి, దుద్ద, జల - అనే సప్తసముద్రాలచే చుట్టబడియున్నవి. ఈ ద్వీపాలు, సముద్రాలు మనం చెప్పుకుంటున్న క్రమములోనే ఒకదానికీ తరువాతిది రెండింతల విస్తీర్ణంలో వున్నాయి.  

జంబూ ద్వీపంలో మేగువను పేరు గల పర్వతమొకటుంది. అది ఒక లక్ష యోజనాలు విస్తీర్ణంలో పఱచుకొనివున్నది. దాని యెత్తు ఎనభై నాలుగు వేల యోజనాలు. అది పదహారు వేల యోజనాల క్రిందికీ భూమిలో పాతుకుపోయి వుంది. మేరు పర్వత శిఖర విస్తృతి ముప్పది రెండు వేల యోజనాలు.

(మేరు పర్వతం గూర్చి బాగా విపులంగా భవిష్యపురాణంలో చెప్పబడింది)

కర్ణిక పదహారు వేల యోజనాలు.

మేరువుకి దక్షిణంలో హిమాలయం,

హేమకూటం, నిషధం; ఉత్తరం

లో నీలం, శ్వేతం, శృంగి - అను వర్ష పర్వతాలున్నాయి.

హే నీలకంఠా! ప్లక్షాది ద్వీపాల్లో నివసించేవారికి మృత్యువుండదు. ఏ యుగం వచ్చినా ఏ యుగం పోయినా తేడా వుండదు.

జంబూ ద్వీపాన్ని పాలించిన అగ్నీధ్ర మహారాజుకి తొమ్మండుగురు కొడుకులు. వారు: నాభి, కింపురుష, హరివర్ష ఇలావృత, గమ్య, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాల, నామధేయులు. తండ్రి వారికిచ్చిన రాజ్యభాగాలు వారి పేళ్ళతోనే ప్రసిద్ధమయ్యాయి. నాభి మహారాజుకి మేరుదేవి యను పత్నిద్వారా ఋషభుడను పుత్రుడు కలిగాడు. ఋషభ పుత్రుడైన (మొదటి) భరతుడు శాలగ్రామ తీర్థంలో నిత్యవ్రతరతుడై వుండేవాడు. అతని తరువాత వంశంలో తైజసుడు, ఇంద్రద్యుమ్నుడు, పరమేష్ఠి, ప్రతీహారుడు, ప్రతిహర్త, ప్రస్తారుడు, విభుడు, నక్తుడు, నరుడు, విరాటుడు, ధీమాన్, భౌవన్, త్వష్ట, విరజుడు, రజుడు, శతజితుడు, విష్వగ్ జ్యో తి అనేవారు పితృపుత్ర పరంపరగా జనించారు.