1 - గరుడ పురాణము - ఆచార కాండము
105 - ప్రాయశ్చిత్తాలు-కృష్ట్ర పరాక, చాంద్రాయణాది వ్రతాలస్వరూపాలు
విహితస్యాననుష్ఠానాన్నింది తస్యచసేవనాత్ ।
అనిగ్రహాచ్చేంద్రియాణాం నరః పతన మృచ్ఛతి ॥ (ఆచార - 105/1)
చేయవలసిన పనులను చేయకపోవడం, చేయకూడని పనులను చేసేయడం, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోవడం - ఈ మూడిటిలో ప్రతీది మానవుని అధోగతి పాల్చేసే శక్తిని కలిగి వుంటుంది. కాబట్టి ఆత్మశుద్ధికై ప్రతి ఒక్కరూ తాను తెలిసోతెలియకో చేసిన దుష్కర్మకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవలసిందే. అలా చేసుకున్న వారి అంతరాత్మా ప్రసన్నమపుతుంది. లోకం వారిని ప్రసన్నతాదృక్కులతో చూడడమూ జరుగుతుంది. ప్రాయశ్చిత్తం వల్ల పాపాలునశిస్తాయి. పశ్చాత్తాపం నరకాన్ని దూరం చేస్తుంది.
అలాకాకుండా ‘నేను ప్రాయశ్చిత్తం చేసుకోను. నాకు పశ్చాత్తపింపవలసిన అగత్యం లేదు’ అని మొండికేసిన వాని కోసం, ఇదిగో, ఈ క్రింద చెప్పబడిన నరకాలన్నీ సిద్ధంగా వుంటాయి.
మహారౌరవం, దాని కన్నను మహాభయంకరములైన తామిస్ర, లోహశంకు, పూతిగంధ, హంసాభ, లోహితోద, సంజీవన, నదీపథ, మహా నిలయ, కాకోల, అంధతామిస్ర, తాపన నరకాలే అవి.
బ్రాహ్మణ హంతకుడు, తాగుబోతు, బ్రాహ్మణుని బంగారాన్ని దొంగిలించినవాడు, గురుపత్నిని కామించినవాడు, వీరితో తిరిగేవారు - ఈ మహాపాపులంతా అవీచి, కుంభీపాకమను పేర్లుగల నగరాలలో పడతారు. అవే అత్యంత భయంకర నరకాలు.
గురువునీ వేదాన్నీ నిందించడం కూడా బ్రహ్మహత్యతో సమానమైన పాతకమే. నిషిద్ధ పదార్థాలను తినుట, కుటిలతతో నిండిన ప్రవర్తన, రజస్వలయగు స్త్రీని పెదవులపై చుంబించుట,మద్యపానం ఒకేరకమైన పాపాలు. అశ్వ, రత్న, స్వర్ణ చౌర్యాలు సమానపాపాలు. మిత్రపత్ని, తనదికాని ఉత్తమ జాతి స్త్రీ, చండాలి, సోదరి, కోడలు వంటి స్త్రీలతో రమించుట కూడ గురుపత్నీ గమనంతో సమానమైన మహాపాపాలే. అలాగే పిన్ని, అత్త, ఆచార్యపుత్రి, ఆచార్యపత్నీ కూతురు వరుస స్త్రీలతోడి రమింపు కూడ గురుపత్నీ గమనంతో సమానమైన మహాపాతకాలే..
ఇలాంటి మహాపాపులకు ముందుగా లింగభేదనం చేసి కొంతకాలమాగి అప్పుడు వారిని వధించాలి. ఇటువంటి పాపంలో పాలు పంచుకుని ఇష్టపూర్వకంగా వ్యభిచరించిన స్త్రీనికూడ క్రమక్రమంగా వధించాలి.
గోహత్య, వ్రాత్యత (వడుగు చేసుకోక పోవడం) బ్రాహ్మణ స్వర్ణ లేదా తత్సమానద్రవ్యా పహరణ, అప్పునెగ్గోట్టుట, దేవపితృఋషి ఋణాలను తీర్చకుండుట, అధికారి అయివుండీ అగ్నికార్యం చేయకుండుట, అమ్మకూడని లవణాదులను అమ్ముకొనుట, పెద్దన్నకు పెళ్ళీకాకుండానే తాను చేసుకొనుట, అధ్యయనాధ్యాపనములకు డబ్బును వాడుట, తమ్మునికీ వివాహం చేసి తాను పెండ్లిని మానుకొనుట, పరస్త్రీ గమనము, చక్రవడ్డీలను గుంజుకొనుట, లవణం తయారీ, స్త్రీ వధ, శూద్రవధ, నిందితధనంతో జీవనం గడుపుట,
నాస్తికత, వ్రతలోపం, కొడుకును అమ్ముకొనుట, మాతాపితలను పరిత్యజించుట, చెఱవులనూ తోటలను అమ్ముకొనుట, కన్యపై అపవాదు వేసి దూషించుట, తనకోసం మాత్రమే భోజనమును వండుకొనుట, మద్యపానం చేసే స్త్రీతో సంబంధం పెట్టుకొనుట, స్వాధ్యాయ, అగ్ని, పుత్ర బంధు - ఈ నాల్గింటినీ పరిత్యజించుట, అసత్ శాస్త్రాలను చదువుట, భార్యనూ తననూ అమ్ముకొనుట - ఇవన్నీ ఉపపాతకాలు,
మునులారా! ఇక వీటీకీ ప్రాయశ్చిత్తాలను వినండి.
తెలియక బ్రహ్మహత్యచేసినవాడు ఒక కపాలాన్ని చేత బట్టుకొని మరొక కపాలాన్ని కర్రకు గుచ్చి ధ్వజాన్ని వలె మోస్తూ భిక్షాటన చేస్తూ యమ నియమాలు పాటిస్తూ పన్నెండేళ్ళపాటు తిరుగుతునే వుండాలి. తెలిసి చేసినవాడు (బ్రహ్మహత్యయని) లోమభ్యః స్వాహా ఇత్యాది మంత్రాలతో తన శరీరాంగాలకు ప్రతీకలుగా విభిన్న శాస్త్ర విహిత ద్రవ్యాలను అగ్నికి ఆహుతి చేసి చివరగా తన శరీరాన్ని కూడా నిర్దిష్ట విధానం ద్వారా అగ్నికి ఆహుతి చేయాలి. బ్రాహ్మణుని రక్షించడం కోసం తన ప్రాణాన్ని అర్పించినా కూడా బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి కలుగుతుంది. ఇవే కాకుండా ప్రాణత్యాగమక్కరలేని ప్రాయశ్చిత్తాలున్నాయి. అవి ఇంచు మించు ప్రాణం పోయడమంత కష్టo.
అత్యధికంగా కష్టపెడుతున్న, దుస్సహమైన, బహుకాల వ్యాపితమైన రోగంతో గాని అంతకన్న ప్రాణములనార్చివేసేటంత భయంవల్ల గాని చెప్పలేనంత బాధపడుతున్న బ్రాహ్మణుని గాని గోవుని గాని, చేరదీసి ఆదరించి సేవచేసి సంరక్షణ చూసి, సంపూర్ణారోగ్య వంతులను గావించినచో కూడా బ్రహ్మ హత్యాపాతకం పోతుంది.
బ్రాహ్మణుల కడుపున పుట్టాడన్న మాటే గాని ఏ గుణమూ వీడు బ్రాహ్మణుడు అని చెప్పడానికి వీలులేకుండా వున్న వానిని పొరపాటున చంపినా కూడా అది బ్రహ్మ హత్యే అవుతుంది దానికీ ప్రాయశ్చిత్తం ఇది :
అడవిలోనికి పోయి మంత్రాలతో ఐతరేయ బ్రాహ్మణాది అంగాలతో సహా వేదాన్ని పూర్తిగా మూడుమార్లు పారాయణ చేయాలి లేదా వేదవిద్యకై తన జీవితాన్ని ధారపోస్తూ తన ధనాన్నంతటినీ యోగ్య పాత్రులకు సమర్పించి వేయాలి. సోమయాగం చేసిన లేదా చేస్తున్న క్షత్రియుని గానీ వైశ్యునిగానీ చంపినా బ్రహ్మ హత్యకు విధింపబడిన ప్రాయశ్చిత్తాన్నే చేసుకోవాలి. ప్రాయశ్చిత్త కర్మలో మరొక విశేషమేమనగా హత్యాప్రయత్నం చేయడమే తప్పు అవతలి వ్యక్తి మరణించినా, ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయి బతికి బయటపడినా హత్యకీ చెప్పబడిన ప్రాయశ్చిత్త కర్మను చేసుకోకతప్పదు. అంటే అవతలి వాడు చావకపోయినా హత్యా ప్రయత్నంచేసిన వానికీ హత్యాపాపమే అంటుకుంటుంది.
మదిరాపానానికి ప్రాయశ్చిత్తం అగ్నివలె వేడెక్కి పొగలు గ్రక్కుతున్న మద్యాన్ని గానీ, సలసలమరుగుతున్న గోమూత్ర, గోదుగ్గ, గోఘృతాలలో నొకదానిని గాని ఆపకుండా ఆగకుండా భగవన్నామస్మరణ చేస్తూ త్రాగుట. నీరనుకొని మద్యం - పొరపాటున - తాగేసినవారు జడలు పెంచుకొని మలిన వస్త్రాలను కట్టుకొని మరుగుతున్న చేతిని త్రాగుతూ బ్రహ్మహత్యకు గల ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. తరువాత తన వర్ణానికీ తగిన సంస్కారాన్ని చేసుకోవాలి.
వీర్య పానం, సురాపానం, మూత్రపానం, చేసే బ్రాహ్మణి సద్గతి నందకపోగా క్రమంగా గద్ద, కుక్క పంది యోనుల్లో పుడుతుంది. బ్రాహ్మణుని బంగారాన్ని అపహరించిన వానికి ప్రాయశ్చిత్త కర్మ మేమనగా వాడొక రోకలిని మోసుకొని రాజ సభలోకీ (న్యాయస్థానం అప్పట్లో అదే పోయి తాను చేసిన పాపాన్ని ప్రకటించి రాజు విధించినన్ని దెబ్బలు ఆ రోకటి తోనే తినాలి. ఈ శిక్షాక్రమంలో వాడు మరణించినా, శిక్షానంతరం జీవించినా పవిత్రుడే అవుతాడు. తెలుగిళ్ళలో ఒక మాటుంది. రాజదండనవుంటే ఇక యమదండన వుండదని. ఇలా చేయనివారు తమ తప్పునొప్పుకొని తమయెత్తు బంగారాన్ని ఆ బ్రాహ్మణునికి సమర్పించుకున్నా ఆ పాపం పోతుంది.
గురుపత్నితో గమించినవాడు ఎఱ్ఱగా కాలుతున్న ఇనుప స్త్రీ విగ్రహాన్ని కౌగలించుకొని ప్రాణత్యాగం చేయాలి లేదా తన లింగాన్నీ, అండకోశాల్ని తానే కత్తిరించుకొని నైరృత్య దిశవైపు విసిరేయాలి). ఈ మహా పాపానికీ ఇంకా రెండు రకాల ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి. పశ్చాత్తపించిన వాడు మూడు సంవత్సరాల పాటు ప్రాణాపాత, కృచ్చవ్రత పాలనను చేయాలి లేదా మూడు మాసాల పాటు చాంద్రాయణ వ్రతం చేస్తూ ఏకదీక్షగా వేదసంహితను పఠిస్తూ వుండాలి. దీక్షపూర్తయితే పాపం పోతుంది.
గోవధచేసిన పాపీ పంచగవ్యాలను మాత్రమే స్వీకరిస్తూ ఒక నెలపాటు మునివలె ఏ వికారాలూ లేకుండా గోశాలలోనే జీవిస్తూ గోసేవ చేయాలి. మాసాంతంలో యథాశక్తిగా గోదానం చెయ్యాలి.
ఉపపాతక శుద్ధి చాంద్రాయణ వ్రతం వల్ల సిద్ధిస్తుంది. ఒక మాసం దాకా పాలను మాత్రమే స్వీకరిస్తూ ‘పరాక’ నామక వ్రతం చేసినా అదే ఫలముంటుంది.
క్షత్రియవధను చేసినవాడు ఒక ఎద్దునూ వేయి ఆవులనూ దానంచేయాలి లేదా బ్రహ్మహత్యకు నిర్దేశింపబడిన ప్రాయశ్చిత్తాన్ని మూడేళ్ళ పాటు చేసుకోవాలి. వైశ్యుని
వధించిన వాడు వంద గోవులను దానం చేయాలి లేదా బ్రహ్మ హత్యాపాతక ప్రాయశ్చిత్త వ్రతాన్ని ఒక యేడాది పాటు చేయాలి. శూద్రుని హత్యచేసినవాడు గాని స్త్రీని వధించిన వాడు గాని బ్రహ్మహత్యా పాతక ప్రాయశ్చిత్త వ్రతాన్ని ఆరునెలల పాటైనా ఆచరించాలి లేదా సత్పాత్రునికీ పది సవత్సపయస్వినీ గోవులను దానమైనా ఇవ్వాలి. ఇవన్నీ తెలియకగాని అజ్ఞానవశానగాని అప్రయత్నంగా గాని, చేసిన హత్యలకు ప్రాయశ్చిత్తాలు.
పిల్లీ, ముంగిస, ఉడుము, కప్పు, సాధారణ పశువులు - వీటిని చంపడం కూడా పాపమే. ఈ పాపము చేసినవాడు మూడు రాత్రులు గడిచే దాకా పాలను మాత్రమే స్వీకరిస్తూ పాదకృచ్ఛ్భత పాలనము చేయాలి. ఏనుగును వధించినవాడు అయిదు నీలవృష భాలను పేరుగల విశిష్టలక్షణాలున్న ఎద్దులను సత్పాత్రునికి దానం చెయ్యాలి. చిలుకనుగాని రెండేళ్ళ వయసున్న దూడని గానీ క్రౌంచపక్షిని గాని వధించిన వాడు మూడేళ్ళ వయసున్న దూడను దానం చేయాలి. గాడిద, మేక, గొఱ్ఱ లలో నొక దానిని చంపీనవాడొక ఎద్దును దానంచేయాలి. వృక్ష, గుల, లతాడులను నరికి వేసిన ద్విజుడు నూగుమార్లు గాయత్రిని జమీంచాలి.
తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టంలేకున్నా మధు, మాంసాలను సేవించినవాడు కృచ్ఛవ్రతాన్నీ అన్యశేష వ్రతాల్నీ ఆచరిస్తే ఆ పాపం శాంతిస్తుంది. గురువుగారు చెప్పిన పనిని చేస్తూ గాని మార్గంలోగాని శిష్యుడు మృతి చెందితే ఆ పాపం గురువును ముట్టు కుంటుంది. గురువు దానికి ప్రాయశ్చిత్తంగా మూడు కృచ్చవ్రతానా చరించాలి. గురువు గారిని అసంతృప్తికి గురిచేసిన శిష్యునికీ మాత్రం ఆ గురువుగారిని ప్రసన్నుని, సంతృప్తుని (సంతుష్టుని చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. గురువుగారిని బాధించిన పాపం పోవాలంటే ఆ గురు ప్రసన్నతే తప్ప మరో దారిలేదు.
నిర్దోషులనూ, అమాయకులనూ పాపులని దూషించి దొంగబుజువులతో నిరూపించే ప్రయత్నం చేసేవాడు మహాపాపి. వీనికి ప్రాయశ్చిత్తం జితేంద్రియుడై, ఒక నెలపాటు మంచి నీళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ పాపమోచన మంత్రమును జపించుట.
అసత్ ప్రతి గ్రహం అనగా అపసవ్య దానమును పుచ్చుకొనుట కూడా పాపమే. దీనికి ఒక మాస పద్యంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పయోవ్రతం అనగా పాలనే ఆహారంగా తీసుకొనే వ్రతమును చేస్తూ పశువులపాలలో నివాసముంటూ సదా గాయత్రిమంత్రాన్ని జపిస్తూ గడపడం ప్రాయశ్చిత్తంగా చెప్పబడింది.
వ్రాత్యుని కుపనయనం చేసి యజ్ఞం చేయించిన వాని కంటుకొనే పాపం మూడు కృచ్ఛ వ్రతాలను ఆచరించడం వల్ల నశిస్తుంది. అభిచారకహోమం (మంత్రం ద్వారా
అపకారం) వల్ల వచ్చే పాపానికీ ఇదే ప్రాయశ్చిత్తం*. *వేదప్లావి ఒక సంవత్సరం పాటు యవలనే తిని బతకాలి.
(*యాజ్ఞవల్క్య స్కృతిలోని 28వ శ్లోకానికి చేయబడిన వీతాక్షర వ్యాఖ్యలో ప్రకృతంలో విప్లవ శబ్దానికి మూడర్థాలు చెప్పబడ్డాయి 1. వేదాన్ని రక్షించవలసిన బాధ్యత గలవాడు దానికి తగ్గ సామర్థ్యముండి కూడా ఆ పనిని చేయకపోవడం వేద విప్లవం. 2 అనధ్యయన లేదా అనధ్యాయ కాలంలో వేదాన్ని అధ్యయనం చేయడం అధ్యయన విప్లవం 4. వేదాధ్యయన సమర్దుడూ, వేదాధ్యయనం చేసి గొప్ప స్థాయికి తానుపోయి వేదాన్నిగొని పోగలిగే చక్షుడూ అయినవానికి సరిగ్గా చదువు చెప్పకుండా నిరుత్సాహానికీ వానిని గురిచేయడం విప్లవం. ఈ మూడు దోషాల్లో దేనికి పాల్పడినా ఆ దోషి వేదస్లావి అనబడతాడు.
*వేదమూధర్మము క్షుణ్ణంగా తెలిసిన ముగ్గురు లేదా నలుగురు బ్రాహ్మణులతో ఎక్కడిక్కడ ప్రాయశ్చిత్త పరిషత్తులను ఏర్పాటు చేసుకోవచ్చు. మరీ చిన్న గ్రామాలలో నైతే వేదమూ, ధర్మ శాస్త్రమూ బాగా తెలిసిన బ్రహ్మవేత్తయగు ఒక బ్రాహ్మణునే పరిషత్తుగా నిర్ణయించుకొని ఆయనకే సర్వాధీకారాలనూ సమర్పించవచ్చు. ఈ విషయం యాజ్ఞవల్క్యస్మృతి, ఆచారాధ్యాయం, 9వ శ్లోకంలో నిర్దేశింపబడింది.)
శరణని వచ్చి ఆశ్రయించిన వానికి దక్షత వుండీ కూడా శరణివ్వని వాడి పాపానికీ ఇదే తగిన ప్రాయశ్చిత్తం.
గాడిదపైగాని ఒంటెపైగాని ప్రయాణించేవాడు మూడు ప్రాణాయామాలు చేయాలి. తెలియక, అనగా అవి పాపములని తెలియక, చేసిన నగ్నస్నానము, నగ్నశయనము, పగటిపూట రతి అనే పాపాలు కూడా మూడు ప్రాణాయామాల ద్వారా నశిస్తాయి. గురుజను లను ‘నీవు’ అని సంబోధించరాదు. అట్టి పాపము ఆ గురు జనుల ప్రసన్నతవల్ల పోతుంది. బ్రాహ్మణుని కొట్టడానికి వెళ్ళడమే పాపం. దానికి కృచ్చ వ్రతమే ప్రాయశ్చిత్తం. క్రోధంలో ఒళ్ళు మరచిపోయి బ్రాహ్మణుని కొట్టిన పెనుపాపము అతి కృచ్ఛవ్రతమున గాని తీరదు.
విఖ్యాతమైన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని గురుజనులు అనగా పరిషత్తు నిర్ణయాన్ని బట్టి కూడా చేయవచ్చు.
విఖ్యాతం కాని పాపాలకు గుప్త రూపంలోనే ప్రాయశ్చిత్త నిర్ణయం చేయబడాలి. దీని భావమేమనగా ఒక వ్యక్తి బ్రహ్మహత్య చేసినట్లు అతనికే తరువాత తెలిసిందనుకుందాం. ఊరిలో ఇంకెవరికీ తెలియదనుకుందాం. అప్పుడా వ్యక్తి పరిషత్తులో నొకనిని కలుసుకొని తనకి తెలియకుండానే తనవల్ల జరిగిన బ్రహ్మహత్యకు పాపమంటకతప్పదు కాబట్టి ప్రాయశ్చిత్తాన్ని వేడితే అయన చెప్పేది గుప్త రూపంలో నున్న ప్రాయశ్చిత్త మనబడుతుంది. ఈ ప్రాయశ్చిత్తాలలో కొన్ని ఇలావుంటాయి.
బ్రహ్మహత్య చేసిన పాపి మూడు రాత్రులు గడిచేదాకా ఉపవాసం చేసి విశుద్ధ జలాల మధ్య అనగా నదీ సరోవరాదులలో పీకల దాకా మునిగి అఘమర్షణ మంత్రాన్ని జపించాలి. మూడు రాత్రులు దాటాక వచ్చే పగటిపూట ఒక పాలిచ్చే అవును సత్పాత్రునికి దానమివ్వాలి. ఈ విధంగా తపించి, జపిస్తే అజ్ఞానవశాన తన చేత జరిగిన బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. దీనికే మరొక ప్రాయశ్చిత్తం కూడా చెప్పబడింది. బ్రహ్మహత్య కర్త ఒక పగలూ ఒక రాత్రి వాయుభక్షణ మాత్రమే చేస్తూ శుద్ధ జల మధ్యలో అలా నిలబడే వుండిపోయి తెల్లవారగానే బయటికి వచ్చి లోమభ్యస్వాహా మున్నగు ఎనిమిది మంత్రాలనూ ఘోషిస్తూ ఒక్కొక్క దానితో అయిదేసి ఆహుతులను యథావిధానంగా అగ్నిలో వ్రేల్చాలి*.
(*ఈ మంత్రాలుయాజ్ఞవల్క్యస్మృతిలో 247వ శ్లోకంలో కనిపిస్తాయి.)
మద్యపానం తెలియక చేసి తెలిశాక పశ్చాత్తాపము నొందినవాడు జలమధ్యంలో నిలబడి రుద్రదేవ మంత్రాన్ని జపిస్తూ మూడు రోజులు ఉపవాసంతో గడిపి ఆ మరునాడు గుమ్మిడి ముక్కలను (కుష్మాండీబుచా) నేతిలోముంచి అగ్నికి ఆహుతులనిస్తే అత్మశుద్ధి కలుగుతుంది. గురుపత్నీగమనం చేసిన పాపీ ఇలాగే చేస్తూ రుద్రదేవమంత్రానికి బదులు సహస్ర శీర్షా... మంత్రాన్ని జపించాలి.
మిగిలిన పాపాలకు నూరుమార్లు ప్రాణాయామం చేయడం లేదా త్రైకాలిక సంధ్యో పాసన, బ్రాహ్మణునిచే పదకొండాహుతులనిపించి రుద్రానువాకములు జపించుట మున్నగునవి ప్రాయశ్చిత్త విధానాలు. బ్రహ్మహత్య తప్ప మిగతా పాపాలన్నీ వాయుభక్షణం మాత్రమే చేస్తూ దీనమంతా సూర్యరశ్మి పడే చోట జలంలోవుండి రాత్రంతా కూడా అక్కడే వుండి వేయిమార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే నశిస్తాయి.
వేదాభ్యాసం చేసే శాంతి పరాయణుడైన పంచయజ్ఞానుష్ఠాత నుండి పాపమే దూరంగా పారిపోతుంది. యమ నియమాలున్న వానికీ పాపపుటాలోచనలే రావు. బ్రహ్మచర్యం, దయ, క్షమ, భగవద్ధ్యానం, సత్యం, నిష్కాపట్యం, అహింస, అస్తేయం, మాధుర్యం దమం - అనే పదీ యమములు. స్నానం, మౌనం, ఉపవాసం, యజ్ఞం, స్వాధ్యాయము, ఇంద్రియనిగ్రహం, తపస్సు, అక్రోధం, గురుభక్తి, పవిత్రత - ఈ పది నియమాలు.(మౌనం అంటే శాశ్వతంగా మూగబోవడమని కాదు; కొంతకాలం పాటు కొన్ని వ్రతాలలో భాగంగా మాట్లాడకుండా వుండడం).
ఆవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, మయం పంచగవ్యాలు. వీటిని శోదకంతో కలిపీ దానినే అన్నానికి బదులు తినడం క్వచువ్రతమవుతుంది. ఒకరోజంతా దీనిని మాత్రమే స్వీకరించి మరునాడు పగలంతా ఉపవాసముండి రెండవరోజు రాత్రంతా పంచగవ్యాలనే స్వీకరిస్తూ వుంటే దానిని కృచ్ఛసాంతపన వ్రతమంటారు.
తొలిరోజు ఆవుపాలు, మరునాడు ఆవుపెరుగు, మూడవనాడు ఆవునెయ్యి, నాల్గవదినం గో మూత్రం, ఐదవ రోజు గోమయం, ఆరో రోజు కుశోదకం మాత్రమే స్వీకరించి ఏడవరోజు ఏమీ తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తే ఈ మొత్తమంతా కలిపి పరమ పవిత్రమైన ‘మహాసాంతపన’ వ్రతమనబడుతుంది.
పలాశ, గూలర, కమల, బిల్వ పత్రాలలో ఒక్కొక్కరోజు ఒక్కొక్క దాన్ని నీటిలో వేసి ఉడికించి ఆ రోజంతా ఆ నీటినే త్రాగాలి. అలా నాలుగు రోజులు నాలుగాకుల నీరు తరువాత అయిదవ రోజున కుశోదకం మాత్రం త్రాగాలి. అంటే ఈ అయిదు రోజులూ ఇంకేదీ తినకుండా తాగకుండా కృశించాలి. ఈ వ్రతాన్ని పర్లకచ్భుతమంటారు. తొలిరోజు వేడి ఆవుపాలనూ, మలిరోజు వేడి నేతినీ, మూడవరోజు వేడినీటినీ మాత్రమే ప్రాశ్నచేసి అనగా నోట్లో వేసుకొని నాలుగవ రోజు పూర్తిగా ఉపవాసముండి పోవాలి. ఈ వ్రతాన్ని మహాతప్రకృచ్ఛవ్రతమంటారు. ఈ కృచ్ఛ్భతాలు పరమశుద్ధికరాలు, పవిత్రాలు.
కృచ్చవతాలలో మరొకటి పాదకృచ్చవ్రతం. మొదటి రోజు ఏకభుక్తం (మధ్యాహ్నం పన్నెండుకీ భోజనంచేసి మరేమీ తీనకుండా రాత్రి శయనించడం) రెండవ రోజు నక్షవ్రతం (అనగా రోజంతా ఏమీ తినకుండా రాత్రి మాత్రం భోంచేయడం) మూడవ రోజు అయాచితం (ఎవరినీ యాచించకుండా ఇంట్లో వండుకోకుండా ఎవరైనా వచ్చి పెడితే, అదీ ఒకపూట తినడం) నాలుగవ రోజు కటిక ఉపవాసం. ఇదంతా కలిపీ పాదకృచ్ఛవ్రతం అవుతుంది. ఇదే వ్రతాన్ని ఒకే నెలలో మూడుమార్లు చేస్తే దానిని ప్రాజాపత్యవ్రతమంటారు. ఈ వ్రతంలో కూడా భోజనం చేయునపుడు ఒకమారు చేతినిండా పట్టు అన్నాన్ని మాత్రమే రోజంతటిలో తిని నాలుగు రోజులుండగలిగితే దానిని అకృచ్ఛ్భతమంటారు. పన్నెండు రోజులు పూర్ణ ఉపవాసం చేయడాన్ని పరాకవ్రతమంటారు. ఇరవై ఒక్క రోజుల పాటు నీరు లేదా పాలు మాత్రమే తీసుకొని అతి కృచ్ఛవ్రతపాలనం చేయడాన్ని కృచ్ఛాతి కృచ్ఛవ్రతమని వ్యవహరిస్తారు.
ఆరు రోజుల కద్రువ్రతమొకటుంది. నూనెను బాగా స్టీండీ చేసిన ఓమ్మట మిగిలిన నూల పిప్పిని తొలిరోజూ, గంజిని రెండవరోజూ, మజ్జిగను మాత్రమే మూడవదినమూ, కేవలం జలాన్ని నాలుగవనాడూ పేలపిండిని అయిదవరోజూ ఆహారంగా స్వీకరించి ఆరవరోజు కటిక ఉపవాసం చేయడాన్ని సౌమ్యకృచ్ఛ్భతమంటారు. ఈ వ్రతాన్నే కొంచెం అతిశయింపజేసి ఒకరోజు తినే పదార్థాన్ని మూడు రోజులపాటు తింటూ మొత్తం పదిహేను రోజులు చేసి పదహారవనాడు పూరోపవాసం చేస్తే దాన్ని తులాపురుష (సంజ్ఞక) కృచ్ఛ్భతమంటారు.
చాంద్రాయణ వ్రతమనగా చంద్రుని కళలను బట్టి ఆహారాన్ని స్వీకరించడం. అమావాస్యనాడు ఒక నెమలిగుడ్డంత అన్నాన్ని తిని రోజుకొక గుడ్డు ప్రమాణాన్ని
పెంచుకుంటూ పూర్ణిమనాడు సంపూర్ణ భోజనం చేసి, మరునాటి నుండి అదే కొలతలో తగ్గించుకుంటూ పోయి అమావాస్యనాడు మరల నెమలిగుడ్డంత ద్రవ్యాన్నే తిని చేసే వ్రతానికీ చాంద్రాయణ వ్రతమని పేరు. మొత్తం నెలలో రెండు వందల నలభై గ్రాసాల హవిష్యాన్నమును పైన చెప్పిన క్రమంలో తిని వుండి పోవడానికి విశేష వ్రతమని పేరు. పైన చెప్పిన వ్రతాలను అనుష్టిస్తున్న అన్ని రోజుల్లోనూ ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలీన స్నానాలు చేసి పవిత్ర సంజ్ఞక విశేషమంత్రాలను జపిస్తూ గ్రాస పరిమాణంలో అన్నం తినడానికి ముందు ప్రతి గ్రాసాన్నీ గాయత్రితో అభిమంత్రితం చేస్తూ ఒక విధమైన నిరాసక్త, ఆధ్యాత్మిక, ప్రశాంత జీవనాన్ని గడపాలి.
కొన్ని పాపాలకు శాస్త్రంలో ప్రాయశ్చిత్తాలు చెప్పబడలేదు. అటువంటి పాపాలన్నీ చాంద్రాయణ వ్రతం వల్ల నశిస్తాయి. ఏదో పాప ప్రక్షాళన కోసం కాకుండా, పుణ్యుడు మరింత పుణ్య సముపార్జన కోసం చాంద్రాయణ వ్రతాన్ని చేస్తే వాని పుణ్యము పండి దేహాంతంలో చంద్రలోకాన్ని చేరుకుంటాడు. అలాగే ప్రాయశ్చిత్తం కోసం కాకుండా పుణ్యం కోసం కృచ్ఛవ్రతం చేసేవాడు గొప్ప ఐశ్వర్యవంతుడౌతాడు.
