1 - గరుడ పురాణము - ఆచార కాండము
176 - పలితకేశ, కర్ణశూలలకు ఉపచారాలు
వెంట్రుకలన్నీ రాలిపోయిన వానికి ఏడు రాత్రులపాటు ఏనుగు దంతాన్ని కాల్చిన బూడిదను గసాంజనంతో మేకపాలతో కలిపి నెత్తికి పట్టించి వుంచితే ఎనిమిదవ రోజు తెల్లారేసరికి జుట్టు మొలిచివుంటుంది. పెరుగుతుంటుంది కూడ.
ఒక పావు వంతు భృంగరాజరసానికి పూర్తి (ఒక భాగం) నూనెనూ గుంజ భస్మాన్నీ కలిపి రాస్తే జుత్తు బాగా పెరుగుతుంది. చంద్రుప్త (బట్టతల)ను ఎలా (ఒక ఔషధం), మాంసి, కుష్ఠ, మురాల ముద్దతో బాగా రాపిడి చేసి దాని నిండా గుంజా ఫలాన్ని పూతగా పూస్తే వెంట్రుకలు మరల పుట్టి పెరుగుతాయి. మామిడి టెంకలను పొడిగా చేసి తలపై పూసుకుంటే జుత్తు బలపడీ, అందంగా తయారవుతుంది. కరంజ, ఆమలక, ఎల, లాక్షలను తలకి రాసుకుంటే ఎఱ్ఱబడిన జుత్తు మరల నల్లబడుతుంది.
విడంగ, గంధ పాషాణ, మనశ్శిలను మందుకోసం శుద్ధి చేసిన నూనెతో కలిపి దానికి నాలుగింతల పరిమాణం గల గోమూత్రంలో వేసి బాగా కలియబెట్టి తలపై చిలకరిస్తే పేలు, చుండ్రు నశిస్తాయి.
అప్పుడే కాల్చిన శంఖం బూడిదనీ సీసపు రజనునీ నీటితో కలిపి ముద్దజేసి తలకి పట్టిస్తే జుత్తు నున్నగా, నల్లగా నిగనిగలాడుతూ వుంటుంది. భృంగరాజ, ఇనుపరజను, త్రిఫల, బీజపూరక, నీలి, కరవీరలను సమపాళ్ళలో తీసుకుని ఆ మొత్తానికి సమాన పరిమాణంలో బెల్లం కూడా గైకొని బాగా ఉడికించి ఒక ముద్ద (ఈ ముద్దకు పర్యాయపదం ప్రస్తుత భాషలో పేస్టు) తయారుచేసి తలకి రాసుకుంటే తెల్లబడిపోయిన జుత్తంతా మరల నలుపును సంతరించుకుంటుంది. అలాగే మామిడి టెంక, త్రిఫల, నీలి, భృంగరాజ, కాల్చిన ఇనుపరజను, కంజికల మిశ్రమం కూడా వెండి జుత్తును నల్లగా మారుస్తుంది.
చక్ర మర్దక బీజాలు, కుష్ఠ, ఎరండ వేళ్ళు కలిపి బాగా వేడిచేసియున్న కంజిక (గంజి) ఇనుపరజనుల మిశ్రమంతో కలిపి ముద్ద చేసి తలపైగాని నుదుటిపై గాని మృదువుగా రాస్తే ఎలాటి తలనొప్పయినా పోతుంది.
గెడ్డఉప్పు, వచ, హింగు, కుష్ఠ, నాగేశ్వర, శతపుష్ప, దేవదారు మూలికలను నూనెలో వేసి ఉడికిస్తే ఒక ఔషధీయ తైలం తయారవుతుంది. ఇందులో పావు వంతు ఆవు పేడను పిండగా వచ్చిన పలుచటి నీటిని కలిపి ఒక చుక్క చెవిలో రాల్చితే ఎలాటి చెవిపోటైనా అదృశ్యమైపోతుంది. చెవి దుర్వాసన, లాడికారుట, పురుగులు చేరుట వంటి సమస్యలు గెడ్డలుపును మేక మూత్రంలో కరిగించి చెవిలో పోస్తే పూర్తిగా నశిస్తాయి. ఉత్త గోమూత్రాన్ని చెవిలో రెండు చుక్కలు వేసినా, మాలతి పూల, ఆకుల రసాన్ని వేసిననూ దుర్వాసన కలిగించే లాడి చెవినుండి కారుట ఆగిపోతుంది. కుష్ఠ, మాశ, బృహతి, అశ్వగంధ మరీచ, తగర, పిప్పలి, అపామార్గ, శ్వేత, సర్షప, యవ, తిలల ముద్దను గెడ్డలుప్పు తేనెతో కలిపి శిశ్నంపై రాస్తే దానిలో చురుకుదనం పుడుతుంది. చేతులపై రాస్తే అక్కడే పక్షవాతం పోతుంది. చెవులపై రాస్తే అవి పెరిగి వినికిడి కూడా పెరుగుతుంది. అవనూనెను భల్లాటక, బృహతి, దాడిమ, ఏదైనా బెరడులతో కలిపి ఉడికించిన ముద్దను బాగా చల్లార్చి గోరువెచ్చగా వుండగా శిశ్నానికి రాస్తే దాని పొడవు పెరుగుతుంది.
