1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

21 -  23 - పంచవక్త్ర పూజనం - శివార్చన విధి

ఋషులారా! ఇప్పుడు పంచముఖ శివుని పూజా విధానాన్ని విన్నవిస్తాను. ఇది సాధకునికి భుక్తినీ ముక్తినీ ప్రసాదిస్తుంది. ముందుగా ఈ క్రింది మంత్రంతో పరమాత్మను అవాహనం చేయాలి.

‘ఓం భూర్విష్ణవే ఆది భూతాయ

సర్వాధారయ మూర్తయే స్వాహా’

తరువాత సద్యోజాత విశేషణధారియైన పరమాత్మ కళను ఈ క్రింది మంత్రంతో ఆవాహనం చేయాలి.

‘ఓం హాం సద్యోజాతాయ నమః’

ఈ సద్యోజాత శక్తిలో ఎనిమిది కళలుంటాయి. అవీ సిద్ధి, బుద్ధి, ధృతి, లక్ష్మీ, మేధ, కాంతీ స్వధ, స్థితి. వీటన్నిటినీ, ఓంకార ప్రతిసర్గతో షష్ఠీ వీభక్తితో ‘నమః’ ను చేర్చి పూజించాలి. (ఉదా ॥ సిద్ధిని ‘ఓం సిద్ధ్యై నమః” అనే మంత్రంతో పూజించాలి.)

తరువాత సాధకుడు

ఓం హీం వామదేవాయ నమః

(కొన్నిచోట్ల హ్రీం బదులు హీం వుంది)

అంటూ వామదేవుని పూజించాలి. ఈ శివ స్వరూపానికి పదమూడు కళలు. అవి రజ, రక్ష, రతి, పాల, కాంతి తృష్ణ, మతి,క్రీయ,కామ,బుద్ధి,రాత్రి,త్రాసని,మోహిని అనేవి.

అలాగే అఘోర స్వామికీ ఒక మంత్రమూ ఎనిమిది కళలూ వుంటాయి. (ఎందుచేతనో గాని మంత్రమూ బీజాక్షరమూ చెప్పబడలేదు) ఆ కళలు ఇవి: మనోన్మనీ, అఘోర, మోహ, క్షుధ, నిద్ర, మృత్యు, మాయ, భయంకర.

ఈ కళలను కూడ ఓం, నమః ఆదులను చేర్చి పూజించాక శివుని నాలుగవ వక్త్ర రూపమైన తత్పురుషుని ఓం హైం తత్పురుషాయ నమః అనే మంత్రంతో ఆరాధించాలి. ఈ స్వామి కళలు అయిదు. అవి నివృత్తి, ప్రశిష్ట, విద్య, శాంతి, సంపూర్ణ. ఈ కళలను కూడా పూజించాక సాధకుడు పంచముఖేశుని ఈశాన దేవరూపాన్ని ఓం హౌం ఈశానాయ నమః అనే మంత్రంతో పూజించాలి. ఈ స్వామి కళలు ఆరు. అవి నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మరీచి, జ్వాలిని. అన్ని కళలనూ ‘ఓం, షష్టి, నమః” అను చేర్చి పూజించాలి. అప్పుడే పూజ పూర్ణమౌతుంది.

 ఋషులార! ఇపుడు శివార్చన విధిని వినిపిస్తాను. పన్నెండం గుళాల మేర శివమూర్తిని, బిందు ద్వారా నిర్మించాలి. అది శాంత, సర్వగత, నిరాకార చింతన చేయడానికి దోహదం చేసేలా వుండాలి. శివుని ముఖం వైపు అయిదు బిందువులుండాలి. మూర్తికి దిగువ భాగంలో ప్రతి ఆరవబిందువూ విసర్గ వుండాలి. అది అస్త్ర (హస్తన్యాస)ము. దానితో బాటు ‘హౌంఅనే బీజాక్షరాన్ని కూడా వ్రాయాలి. ఇది మహామంత్ర బీజం. సంపూర్ణార్థ ప్రదాయకం. తరువాత సాధకుడు శివమూర్తి ఊర్ధ్వ భాగం నుండి చరణ పర్యంతమూ చేతులతో స్పృశిస్తూ మహాముద్రను చూపిస్తూ తదుపరి సంపూర్ణాంగ కరన్యాసం చేయాలి.

 అపుడు అస్త్రమంత్రం ఓం ఫట్ నుచ్చరిస్తూ కుడి పిడికిలితో స్పర్శ, శోధనలను గావించాలి. తరువాత చిటికెన వేలితో మొదలెట్టి మహామంత్ర బీజంతో చూపుడు వేలి దాకా న్యాసం చేయాలి.

 ఇక బాహ్యపూజ, మానసిక పూజలు రెండూ ఒకేసారి చేయబడతాయి. హృదయమును కమలంగా అందులోని మధ్యభాగాన్ని కర్ణికగా భావించుకొని ఆ కర్ణికలో ధర్మజ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను అర్చించాలి. ఆవాహన, స్థాపన, పాద్య, ఆచమన, అర్ఘ్య, స్నానము లను అర్పించి అన్య వివిధ మానస ఉపచారాలను గావించాలి.తరువాత అగ్నిలో ఆహుతుల నివ్వాలి. అదెలాగంటే సాధకుడు పూజాస్థలంలోనే అగ్నిని రగిల్చి వుంచడానికి ముందే ‘ఓం ఫట్ అనే అస్త్ర మంత్రంతో ఒక కుండాన్ని నిర్మించాలి. ఆపై ‘ఓం హూం అనే కవచ మంత్రంతో ఆ కుండంపై అభ్యుక్షణ చేయాలి. అనగా నీళ్ళు చిలకరించాలి. అప్పుడు మానసిక రూపంతో దానిలో శక్తిని విన్యాసం చేయాలి. తరువాత సాధకుడు ముందు తన హృదయంలో, ఆపై ఈ శక్తి కుండంలో జ్ఞానరూపియైన తేజాన్నీ అగ్నినీ విన్యాసం చేయాలి. (అంటే వుంచాలి) ఈ అగ్నిలో నిష్కకృతి - సంస్కారాన్ని తప్పు మిగతా అన్ని సంస్కారాలనూ చేసుకోవాలి. అన్నిటి తరువాత సమస్త ఆంగిక దేవులతో సహా మానసిక రూపంతో శివునికి అహుతులివ్వాలి.

తరువాత కమలాంకిత గర్భయైన ఆ మండలంలో నీలకంఠుని పూజించాలి. దాని అగ్నీ కోణంలో అర్ధచంద్రాకార యుక్తమైన ఒక మంగళమయ అగ్ని కుండాన్ని నిర్మించాలి. అప్పుడు అగ్నిదేవుని అస్త్రయుక్తంగా హృదయాదులలో న్యాసం చేయాలి. తరువాత మండలంలో నున్న కమల కర్ణికపై సదాశివునికీ దిశలలో అస్త్రాలకీ పూజచేయాలి. అంతట పంచతత్వాలలో నుండు పృథ్వీ, జల తత్త్వ శక్తులకు విడివిడిగా వంద వంద ఆహుతులను అయిదేసిమార్లు అర్పించి ప్రసన్నతాపూర్వకంగా త్రిశూలధారియైన శివుని ధ్యానించాలి.

 అనంతరం ప్రాయశ్చిత్తశుద్ధికై ఎనిమిదిమార్లు ఆహుతులివ్వాలి. ఈ ఆహుతులను అస్త్రబీజమైన ‘హుంఫట్’ అనే మంత్రంతో అగ్పించడం శ్రేష్ఠం. ఈ ప్రకారంగా సంస్కారాన్ని శుద్ధిని సాధించిన సాధకుడు సాక్షాత్తు శివస్వరూపుడే కాగలడు.

శివుని యొక్క విశేషపూజలో సాధకుడు మొదట

ఓం హాం ఆత్మ తత్త్వాయ స్వాహా

ఓం హీం విద్యాతత్త్వాయ స్వాహా

ఓం హూం శివతత్త్వాయ స్వాహా

అని ఉచ్చరిస్తూ ఆచమనం చేయాలి. తరువాత మానసిక రూపంతో కర్ణేంద్రియాలను స్పర్శించాలి. భస్మధారణ చేసి తర్పణాది క్రియలను ఈ మంత్రాలతో చేయాలి.

‘ఓం హాం ప్రపితా మహేభ్యః స్వధా,

‘ఓం హాం మాతా మహేభ్యః స్వధా”

ఓం హాం నమః సర్వ మాతృభ్యః స్వధా’

ఇలాగే తన పితరులందరికీ తర్పణాలిచ్చుకొని సాధకుడు ప్రాణాయామం చేసి ఆచమన, మార్జనలనాచరించి ఈ క్రింది శివగాయత్రి మంత్రాన్ని జపించాలి.

‘ఓం హాం తన్మహేశాయ విద్మహే,

వాగ్విశుద్దాయ ధీమహి

తన్నోరుద్రః ప్రచోదయాత్ ।’

(అనుబంధం - 2 చూడండి)

పిమ్మట ఈ క్రింది మంత్రాలను జపించాలి.

ఓం హోం హీం హూం హైం హౌం హః

శివ సూర్యాయ నమః ।

ఓం హం ఖఖోల్కాయ సూర్యమూర్తయే నమః ।

ఓం హ్రాం హ్రీం సః సూర్యాయ నమః ।

  ఈ మంత్రాలను సూర్యోపస్థానం చేసి, సూర్య మంత్రాలతోనే సూర్యరూపుడైన మహేశ్వరుని పూజించడంలో భాగంగా జపించాలి.

తరువాత దండీ, పింగళాది భూత నాయకులను ఓం దండినే నమః, ఓం పింగళాయ నమః మున్నగు మంత్రాల ద్వారానూ, అనంతరం ఆగ్నేయాది కోణాలలో ఓం విమలాయై నమః, ఓం ఈశానాయై నమః అంటూ శక్తి స్వరూపాలను వారి వారి మంత్రాల ద్వారానూ స్థాపించి, స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపాసకులకు సకల సుఖాలూ ప్రాప్తిస్తాయి.

మహాశక్తులను బీజమంత్ర యుక్తంగా ఆయా దిశల్లో ఇలా జపించాలి.

ఓం రాం పద్మాయై నమః - ఆగ్నేయం

ఓం ధీం దీప్తాయై నమః - నైరృత్యం

ఓం రూం సూక్ష్మాయై నమః- వాయవ్యం

ఓం రేం జయాయై నమః - ఈశాన్యం

ఓం రైం భద్రాయై నమః - తూర్పు

ఓం రోం విభూత్యై నమః - దక్షిణం

ఓం రౌం విమలాయై నమః - పశ్చిమం

ఓం రం అమోఘికాయై నమః - ఉత్తరం

ఓం రం విద్యుతాయై నమః - ఉత్తరం

ఓం రం సర్వతోముఖ్యై నమః - మండలమధ్యం

తరువాత శివస్వరూపమున్న సూర్య ప్రతిమను సూర్యాసనంపై స్థాపించి హ్రాం హ్రూం (లేదా హ్రీం)సః అనే మంత్రంతో ఆ దేవుని అర్చించి క్రింది మంత్రాలతో న్యాసం చేయాలి.

‘ఓం ఆం హృదర్కాయ నమః’

‘ఓం భూర్భువః స్వః శిరసే స్వాహా’

‘ఓం భూర్భువః స్వః శిఖాయై వౌషట్’

‘ఓం హ్రం జ్వాలిన్యై నమః ‘

‘ఓం హ్రుం కవచాయ హుం’

‘ఓం హ్రూం అస్త్రాయ ఫట్’

‘ఓం హ్రాం ఫట్ రాజ్ఞ్యై నమః ‘

‘ఓం హ్రాం ఫట్ దీక్షితాయై నమః’

అంగన్యాసానంతరము సాధకుడు ఈ దిగువ నీయబడిన మంత్రాలతో సూర్యాది నవగ్రహాలకు ‘మానసీపూజ’ను సంపన్నం గావించాలి.

ఓం సః సూర్యాయ నమః

ఓం సోం సోమాయ నమః

ఓం మం మంగలాయ నమః

ఓం బుం బుధాయ నమః

ఓం బృం బృహస్పతయే నమః,

ఓం భం భార్గవాయ నమః,

ఓం శం శనైశ్చరాయ నమః,

ఓ రం రాహవే నమః,

ఓం కం కేతవే నమః,

ఓం తేజశ్చండాయ నమః ।

 ఈ విధంగా సూర్య దేవాదులను పూజించి ఆచమనం చేసి ఆపై ఈ క్రింది మంత్రా లతో చిటికెన వ్రేలితో మొదలెట్టి అన్ని వేళ్ళతో కరన్యాస, అంగన్యాసాలను చేయాలి..

ఓం హాం హృదయాయ నమః,

ఓం హీం శిరసే స్వాహా,

ఓం హూం శిఖాయై వౌషట్,

ఓం హైం కవచాయ హుం,

ఓం హౌం నేత్రత్రయాయ వౌషట్,

ఓం హః అస్త్రాయ ఫట్ ।

 తరువాత భూతశుద్ధి గావించి మరల న్యాసం చేయాలి. అర్ఘ్యస్థాపన చేసి ఆ జలాన్ని తన శరీరంపై జల్లుకోవాలి. తరువాత శివునితో పాటు నందీశ్వరాదులను పూజించాలి. ఓం హౌం శివాయ నమఃఅనే మంత్రంతో పద్మస్థితుడైన పరమశివుని పూజించిన పిమ్మట నంది, మహాకాల, గంగ, యమున, సరస్వతి, శ్రీవత్స, వాసుదేవత, బ్రహ్మ గణపతిలనూ తదుపరి తన గురుదేవునీ సాధకుడు అర్చించాలి.

తరువాత పద్మమధ్యంలో నున్న శక్తి అనంతదేవులనూ, పద్మ పూర్వ దళంలో ధర్మాన్నీ, దక్షిణంలో జ్ఞానాన్నీ, పశ్చిమంలో వైరాగ్యాన్నీ, ఉత్తరంలో ఐశ్వర్యాన్నీ, ఆగ్నేయంలో అధర్మాన్నీ, నైరృత్యంలో అజ్ఞానాన్నీ, వాయవ్యంలో అవైరాగ్యాన్నీ, ఈశాన్యంలో అనైశ్వర్యాన్నీ పద్మకర్ణికపై వామా, జ్యేష్ఠాశక్తులనూ మరల తూర్పుతో మొదలు పెట్టి రౌద్రీ, కాలీ, శివా, అసితాది శక్తులనూ పూజించాలి.

తరువాత శివుని కెదురుగా నున్న పీఠంపై ప్రతిష్టింపబడిన కలవికరిణీ, బలవికరిణీ, బలప్రమథినీ, సర్వభూతదమనీ, మనోన్మనీ అనే మహాశక్తులను ఈ దిగువ నీయబడిన మంత్రాలతో పూజించాలి.

ఓం హౌం కలవీకరిణ్యై నమః,

ఓం హౌం, బలవీకరిణ్యై నమః,

ఓం హౌం బల ప్రమథిన్యై నమః,

ఓం సర్వభూత దమన్యై నమః,

ఓం మనోన్మన్యై నమః ।

 తరువాత సాధకుడు ఒక ఆసనం పైకి శివునాహ్వానించి ఆయన మహామూర్తిని స్థాపించాలి. అప్పుడు శివునుద్దేశించి ఆవాహన, స్థాపన, సన్నిధాన, సన్నిరోధ, సకశీకరణాది ముద్రలను చూపించి అర్ఘ్య, పాద్య, ఆచమన, అభ్యంగ, ఉద్వర్తన, స్నానీయ జలాలను సమర్పించాలి. పిమ్మట అరణి - మంథనం చేసి ఆ మహాదేవునికీ వస్త్ర, గంధ, పుష్ప, దీప, 1చరు నైవేద్యాలను సమర్పించాలి. నైవేద్యానంతరము ఆచమనం చేసి ముఖశుద్దికై (ముఖమనగా నోరు) తాంబూలము, కరోద్వర్తనం, ఛత్రం, చామరం యజ్ఞోపవీతం, ప్రదానం చేసి 2పరమీకరణ చేయాలి.

(1 ‘చరు’ అనగా హోమయోగ్యమైన, పక్వం చేయబడిన అన్నము.

2 పరమీకరణమనగా అర్చనీయదేవునిలో సర్వోత్కృష్టత యను భావము గట్టి పఱచుట.)

పిమ్మట సాధకుడు ఆరాధ్య దైవం ఆకారాన్ని ధరించి ఆయనను జపించి వినమ్రతతో స్తుతించాలి. హృదయాదిన్యాసాలను చేసి సంపూర్ణం గావించు ఈ పూజనే ‘షడంగ పూజ’ అని వ్యవహరిస్తారు.

తరువాత దిక్పాలకులనూ, వారి మధ్యలో చండేశ్వరీ దేవిని పూజించాలి.

చివర మరల శివుని ఇలా స్తుతించాలి. క్షమాయాచన చేసి కంకణాన్ని విసర్జించాలి.

గుహ్యాతిగుహ్యగోప్తాత్వం

గృహాణా స్మత్కృతం జపం ।

సిద్ధిర్భవతు మేదేవ త్వత్ప్రసాదాత్ త్వయి స్థితిః ॥

యత్కించిత్ క్రియతే కర్మ సదా సుకృత దుష్కృతం ।

తన్మే శివ పదస్థస్య రుద్ర క్షపయ శంకరః ॥

శీవోదాతా శీవోభోక్తా శివః సర్వమిదంజగత్ ।

శీవోజయతి సర్వత్రయః శివః సోఽహమేవచ ॥

యత్కృతం యత్ కరిష్యామి తత్సర్వం సుకృతం తవ ।

త్వం త్రాతా విశ్వనేతాచనాన్యో నాథోఽస్తి మే శివ ॥(ఆచార కాండం ఽ3/ఽ6-ఽ9)

 ‘హే ప్రభో! నీవు గుహ్యాతిగుహ్యమైన తత్త్వాలకు సంరక్షకుడవు. నేను చేసిన జపాన్ని స్వీకరించు. నాకు సిద్ధిని ప్రాప్తింపజేయి. నీ కృపవల్ల నాకు నీ పట్ల గల ఈ నిష్ఠ శాశ్వతంగా వుండేలా వరమియ్యి. రుద్రదేవా! శంకరా! నా పాపాలను నశింపజెయ్యి. పుణ్యాన్ని కూడా హరింపజేసి నన్ను నీ పాదాల చెంత పడవేసుకో. భక్తులకు సర్వస్వాన్నీ వరంగా ఇచ్చే నీవే సర్వవ్యాపకుడవు. సర్వభర్తవు. నా భవిష్యత్కర్మలన్నీ నీ వైపే పయనించే లాగ నన్ను దీవించు. రక్షకుడవు నీవే. విశ్వనాయకుడవు నీవే. హే పరమశివా! నాకు వేరే దిక్కుగాని దైవంగాని లేదు’ అని ఈ స్తుతి సారము.

ఈ రకంగా శివోపాసనచేయగలిగిన సాధకుడు అకాల మృత్యువాతపడడు. అతి శోతోష్ణాలకూ అతీతుడవుతాడు.

 భగవానుడైన సదాశివుని మంగళమయధ్యాన స్వరూపాన్ని చూడండి.

(అనుబంధం - 3 లో చూడండి)