1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

101 -  గ్రహశాంతి

మునులారా! సిరిసంపదలూ, సుఖశాంతులూ కోరుకొనేవారు ముందు తమపై విభిన్న గ్రహాల చూపు’ ఎలావుందో చూసుకొని ‘అది’ బాగులేని చోట జాగ్రత్తపడాలి. అంటే తమతమ జాతకాల్లో నున్న గ్రహదోషాలను ఆయాగ్రహ సంబంధిత యజ్ఞాలను చేయడం ద్వారా పోగొట్టుకోవాలి. మనకీ తొమ్మిది గ్రహాలున్నాయని విద్వాంసులు చెప్తారు. అవి క్రమంగా సూర్య, చంద్ర, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతువులు వీటిని లేదా వీరిని అర్చించడానికి ప్రతిమలను అనగా మూర్తులను క్రమంగా రాగి, స్పటికం, రక్తచందనం, బంగారం, వెండి, ఇనుము, సీసం, కంచు ధాతువులతో తయారు చేయించాలి. ఇక వారి రంగులు క్రమంగా ఎరుపు, తెలుపు, ఎరుపు, పసుపు, పసుపు, తెలుపు, చివరి మూడు గ్రహాలూ నలుపు. వీరి పూజాద్రవ్యాలు కూడా క్రమంగా అవే రంగుల్లో వుంటాయి. ఈ నవగ్రహాలనూ ఒకచోట శాస్త్రోక్తంగా స్థాపించి (లేదా స్థాపింపబడిన చోటికి పోయి) సువర్ణ, వస్త్ర పుష్పాలను నవగ్రహ మండపానికి సమర్పించాలి. గంధ, బలి, ధూప, గుగ్గులాడులను కూడా ఇవ్వాలి. చరు (అనగా హోమంలో పండబడిన అన్నం)ని మంత్రాల ద్వారా ప్రతి ఒక్క గ్రహాన్నీ ఉద్దేశించి సమర్పించాలి. ఆ తరువాత ఈ గ్రహాలనూ ఆయా మంత్రాలతో దిగువనిచ్చిన విధంగా జపించి అర్చించాలి.

ఓం ఆకృష్ణేన రజసా... సూర్య

ఓం ఇమందేవా... చంద్ర

ఓం అగ్నిమూర్ధాదివః కకుత్... మంగళ

ఓం ఉద్బుద్ధస్వ... బుధ

ఓం బృహస్పతే... బృహస్పతి

ఓం అన్నత్పరిశ్రుతం... శుక్ర

ఓం శం నో దేవీ... శని

ఓం కయానశ్చి... రాహు

ఓం కేతుం కృణ్వన్... కేతు

ఈ నవగ్రహాలకు ఇదే క్రమంలో మందార, మోదుగ, కాచు, ఉత్తరేను, రావి, మేడి, శమి, దూర్వ, కుశ సమిధలను నేయి, పెరుగు, తేనెలలో ముంచి హవనం చేయాలి. తరువాత మరల పైన చెప్పబడిన మంత్రాలను చదువుతూ ఈ క్రింది పదార్థాలను ఆహుతులివ్వాలి. సూర్యునికి బెల్లం, చంద్రునికీ ఉప్మా, మంగళునికి పాయసం, బుధునికి బియ్యంతో పరమాన్నం, బృహస్పతికీ పెరుగన్నం, శుక్రునికీ నెయ్యి, శనికి అరిసెలు, రాహువుకు పండ్ల గుజ్జు, కేతువుకి అనేక రంగుల ధాన్యాలతో ఉడికించిన ముద్ద.

ఇదే క్రమంలో అన్నదానం కూడా ప్రతి గ్రహం పేరు పేరునా చేయాలి. తరువాత ప్రతి గ్రహం పేరుతో రకమంగా ధేనువు, శంఖం, ఎద్దు, బంగారం, బట్టలు, గుణ్ణం, నల్లావు, ఆయుధాలు, మేకలను దానంచేయాలి. గ్రహాలు శాచి అనుగ్రహిస్తే జాతకాలను మార్చగలవు. సిరులను కురిపించగలవు; రాజ్యాలనే ఇవ్వగలవు; రోగిని సంపూర్ణారోగ్యవంతునిగా చేయగలవు.