1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

148 - 152 - రక్త, పిత్త, కాస, శ్వాస, హిక్కా రాజయక్ష్మ రోగ నిదానాలు

 రక్తపిత్త రోగంలో పిత్తం రక్తాన్ని కలుషితం చేస్తుంది. పిత్తం ఆందోళన చెందడానికి ప్రధానకారణం విపరీతమైన, బలమైన తిండి (ఉదా  ॥ కోద్రవ, ఉద్దాలకాది ధాన్యాలు) మిక్కిలి వేడి, పుల్లని, కారపు, ఘాటైన ఇతర చిక్కటి వాసనలు, రుచులుగల పదార్థాలను తినుట వల్ల పిత్తం పాడవుతుంది. ఈ రోగంలో శరీరం నుండి బయటికి వచ్చే ద్రవాలూ, రసాల ఎఱ్ఱగా రక్తపు వాసననే కలిగియుండడం వల్ల ఈ రోగానికి ఆయుర్వేదంలో రక్త  పిత్త రోగమని పేరు పెట్టబడింది. ఈ ద్రవాలూ, రసాలూ, రక్త నాళాల్లోంచి, కాలేయం నుండీ, క్లోమం ద్వారానూ స్రవిస్తాయి.

 ఈ జ్వరం చేసే రక్త స్రావక దురాక్రమణ, చాలా లక్షణాల ద్వారా సూచించబడుతుంది. తల బరువు, ఆకలి లేకపోవడం, చల్లని వస్తువులు తినాలనిపించడం, దృష్టి పొగలు గ్రమ్మడం, పుల్లవాసనలతో వాంతులు, అసహ్యత, వెక్కుళ్ళు, ఊపిరందకపోవడం, తల తిరగడం, గ్లాని, ఎఱ్ఱరంగుని భరించ లేకపోవటం, జ్వరం తగ్గినప్పుడల్లా, నోటిలోంచి చేపల వాసన రావడం, కనులలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ ఛాయలు ఏర్పడడం, బయట కనిపించే రంగులలో తేడా తెలియకపోవడం, పిచ్చెక్కిపోయినట్లు కలలు రావడం - ఈ లక్షణాలు.

 తారుమారైన, కలుషితమైన రక్తం శరీరంపైకి ప్రవహించినపుడు ముక్కు కన్ను, నోరు, చెవుల ద్వారానూ, క్రిందికి వచ్చినపుడు లింగ, యోని, గుదాల ద్వారానూ బయటికి వస్తుంది. శరీరమంతటా వున్న రోమకూపాల నుండి కూడా చిమ్ముతుంది.

ఈ రోగ చికిత్సలో రక్తాన్ని నిరోధించడం కంటే ప్రక్షాళన చేయడమే మంచిది. కఫం ఉన్నచోట ప్రక్షాళన చికిత్స ద్వారా మొత్తం శరీరమంతా స్వచ్చమై పోతుంది. వగరైన తియ్యనైన ఓషధుల ద్వారా కఫమును ఉత్పత్తి చేయవచ్చును. పులుపు, ఘాటు, వగరు గల మందులలో కఫాన్ని ఉత్పత్తి చేసే వాటిని కూడ వాడవచ్చును. రక్తస్రావం శరీరపు క్రింది భాగాలలో వుంటే రోగి పరిస్థితి ప్రమాదకరంగా వుంటే మంగకాయను వాడాలి. ముందు కొంచెంగా పిత్త పీడక ఔషధాన్ని కూడా వాడితే రోగికి బలం చేకూరుతుంది. అటువంటి రోగికి వగరుగా, తియ్యగా వుండే పదార్థాలను తినిపించడం అవసరం. అయితే పాడైపోయిన పిత్తంతో బాటు వాత, కఫ దోషాలు కూడా కలిసి వున్న రోగిని కాపాడడం అసాధ్యం. ఊర్ధకాయంలో అత్యధిక రక్తస్రావం కలిగిన వారిని ప్రక్షాళించినా ప్రయోజన ముండదు. అసలు ప్రక్షాళనే జరుగదు.

 రక్త పిత్త రోగుల్లో ప్రతిలోమ (పైకి) రక్తస్రావమున్న వారికి మంగకాయ (నక్స్ వా మికా), ప్రక్షాళన మాత్రమే చికిత్స మార్గములు. అన్ని శారీరక ద్రవాలూ పాడయినపుడు మంగకాయ చికిత్స ఒక్కటే అనుసరింపబడాలి. సాధారణంగా ఈ రోగులకు తొలిరోజు నుండే తీవ్రస్థాయికి చెందిన బాధలు బయటపడుతుంటాయి. కాబట్టి రోగం కచ్చితంగా కుదురుతుందని మాత్రం చెప్పలేము.

 కాస (దగ్గు) లోపల్లోపల వేగంగా వ్యాపించే రోగానికి సంకేతం. ఇది వాత, పిత్త, కఫ దోషాలతో బాటు శరీరంలోపల చేయబడిన గాయాల వల్ల లోనికి పోయిన ద్రవ్యాలవల్ల కూడా సోకుతుంది. వాత దోషం వల్ల తీవ్రంగానూ క్రమంగా ఇతరాలలో కాస్త తక్కువ గానూ దగ్గు కనిపిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే శరీరం పూర్తిగా వేగంగా పాడవుతుంది. ఈ రోగం సోకిందనడానికి గొంతు దురద, మంట, అన్నద్వేషం సంకేతాలు.

  వాతదోషం వల్ల వచ్చే దగ్గు రుగ్మతలో గొంతు నోరులు బీటలు వేసినట్లవుతాయి. చెవి పొరలు పొడిదేరిపోతాయి. శరీరం లోపల వుండే వాయువులు పైకెగసి ఛాతీలోకి దూసుకుపోయి కంఠనాళమును ఒత్తుతుంటాయి. అన్ని అంగాలలోకి ఆ వాయువు దూరడంతో ఒళ్ళంతా బూరటిల్లినట్టుంటుంది. కనుగ్రుడ్డు పైకి ఉబికి వచ్చినట్లుంటాయి. గొంతులోంచి ఇనుప రేకులను విరిచిన ధ్వని వస్తుంది. ఛాతీ, పక్కలు, తల, తొడలు నొప్పెడతాయి. ఉద్రేకము, మూర్చ వస్తాయి. రోగి మాట్లాడలేక పోతుంటాడు. పొడిదగ్గు బాధిస్తుంది. దగ్గినప్పుడు శరీరమంతా విపరీతంగా నొప్పి పుడుతుంది. ఆ దగ్గు ధ్వని పెద్దదిగా వుంటుంది. ఒళ్ళంతా గగుర్పాటులకు లోనవుతుంది. అతి కష్టం మీద ఎంతో కొంత పొడి కఫాన్ని ఉమ్మితే కాస్త తేలికగా అనిపిస్తుంది.

పిత్త ద్రవ ప్రకోపం వల్ల వచ్చే దగ్గుకీ ఈ లక్షణాలుంటాయి. కళ్ళు పచ్చబడతాయి. నోరు చేదుగా వుంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తల తిప్పుతుంది. వాంతిలో రక్తం పడుతుంది. దాహం వుంటుంది, గొంతు పెగలదు. చూపు మబ్బేసినట్లుంటుంది, మత్తు ఆవరిస్తుంది, దగ్గినపుడు గొంతుపై అగ్నివృత్తాలు కనిపించి, పోతుంటాయి. కఫదోషం వల్ల వచ్చే ఛాతినొప్పి, తలనొప్పి, తిమ్మిరి, గుండె బరువు వుంటాయి. గొంతునిరంతరం కఫం ముద్దలతో గరగరమంటూనే వుంటుంది. ముక్కు దిబ్బడ, వాంతి వస్తున్నట్లుండడం, తిండి అంటే చిరాకు, ఒళ్ళు గగుర్పాటు కలుగుతాయి.

పోరాటాలలో వ్యాయామాలలో అజాగ్రత్తగా, శక్తికి మించి పాల్గొంటే ఛాతి లోపలి భాగంలో గాయాలై వాత, పిత్త, కఫాలు మూడూ ప్రకోపిస్తాయి. కఫం రక్తంతో కలసి ముడులు కడుతుంది. అది పసుపు పచ్చ లేదా మలిన రంగులో వుంటుంది. రోగి దగ్గుతూ కఫాన్ని ఉమ్ముతున్నపుడు ఛాతీ విరిగిపోతుందేమో అన్నంత బాధ కలుగుతుంది. శరీరమంతా సూదులతో పొడుస్తున్నట్లుంటుంది. తరువాత బల్లెంతో పొడుస్తున్నట్లుంటుంది. మోచేతుల, మోకాళ్ళ (సంధుల) నొప్పులు, జ్వరపు వేడితో బాటు పెరుగుతుంటాయి. దాహం, ఊపిరాడక ఆయాసపడుతుండడం, గొంతు క్షీణించడం, వణుకు, పావురం వలె గుడగుడ ధ్వనులు, ఉమ్మీనా వాంతి చేసుకున్నా బోలెడు కఫం రావడం, జ్వరం కాస్త ముదిరితే మూత్రంలో రక్తం పోవడం, వెన్నునొప్పి ఇవన్నీ వుంటాయి. ఇవన్నీ క్షతకాస లక్షణాలు. ఈ దశలో వాతం ప్రకోపించి శరీర ధాతువులన్నీ తీవ్రంగా దెబ్బతింటే రాజయక్ష్మ జ్వరం ప్రవేశిస్తుంది.

 అప్పుడు రోగి దగ్గినపుడు పడే కఫం ఆకుపచ్చగా, పసుపుపచ్చగా, ఎఱ్ఱని చారలతో నిండి బహిర్భూమి సందర్భంలోని దుర్వాసన వేస్తుంటుంది. చీము కూడా పడుతుంటుంది. నిద్ర పోవడానికి ఎంత ప్రయత్నించినా నొప్పి వల్ల కుదరదు. గుండెను ఎవరో మూకుడులో పెట్టి వేయిస్తున్నట్లుంటుంది. అకస్మాత్తుగా వేడిగా ఒకమారు చల్లటిదొక మారు తినాలని పిస్తుంది. ఎంత తిన్నా చాలదనిపిస్తుంది. నీరసం ఎక్కువవుతుంది.

 ఉన్నట్టుంటి ముఖం కాంతివంతంగా, గాజువలె నున్నగా అవుతుంది. కనులలో మెరుపు కనబడుతుంది. అయినా రోగబాధలన్నీ పెరుగుతుంటాయి. బలహీనులను ఈ జ్వరం పూర్తిగా వంచివేస్తుంది. బలవంతులలో గాయాల వల్ల వచ్చిన దగ్గు అయితే చికిత్స ప్రారంభ దశలో వుండగానే తగ్గిపోతుంది. జాగ్రత్తగా చికిత్స చేస్తే వృద్ధులను కూడా తొలిదశలలోనైతే రోగవిముక్తులను చేయవచ్చు. దగ్గు, మందాగ్ని, క్షయ, కడుపులో తిప్పు, వాంతి మున్నగు రోగలక్షణాలు కనబడగానే నిర్లక్ష్యం చేయకుండా చికిత్సకుని సంప్రదించాలి. లేకుంటే అవి చాలా వేగం ముదిరి పోతాయి.

శ్వాసనిరోధక  రోగం దగ్గు బాగా ముదిరితే వస్తుంది. శరీరంలోని ద్రవాలను ఉద్రిక్తపఱచడం వల్ల కూడా ఇది రావచ్చు. అతిసారం (చీము విరేచనం) వమనం, పచ్చకామెర్లు, ధూళి అసహ్యత, పొగ, గాలి తెరలలో చిక్కుకొనుట, మంచు కరిగిన నీరు, విషతుల్యరసాలు, సంధులపై హింస్రకదాడులు కూడా శ్వాస నిరోధక జ్వరాలను కలిగిస్తాయి. ఇందులో క్షుద్రక, తమక, చిన్న, మహా, ఊర్థ్వ అని ఐదు రకాలున్నాయి. కఫం పేరుకుపోవడం వల్ల గాలికి అడ్డంకి ఏర్పడుతుంది. శరీరంలో నిరంతరం పరిభ్రమించే వాయువులు ఒకచోట నిరోధింపబడితే చుట్టూ తిరుగుతూ మెత్తటి ప్రధాన కణజాలాలపై నాళాలపై గుండెపై, బలమైన ఒత్తిడిని కలుగజేసి ఆయా భాగాలను పాడు చేస్తాయి. నడుము లోపలి అంగాలను కూడా ప్రభావితం చేస్తాయి.

  ఈ రుగ్మతలో కనిపించే తొలి బాధలు ఛాతీలో నొప్పి, శ్వాసలో తేడా, మలబద్ధకం, కణతల వద్ద పగుళ్ళు వేస్తున్నంత నొప్పి, అతిగా తినడం వల్ల ఆయాసం. లోలోన ఉద్రేకించిన వాయువులు శ్వాస నాళాలలో వెనుకకూ ముందుకూ పరుగిడుతూ కఫాన్ని రెచ్చగొడతాయి. దానివల్ల కలిగే శ్వాసలో శ్రమను, క్షుద్ర శ్వాస రుగ్మత అంటారు. అది తలను, మెడను, గుండెను పిడికిట బట్టి వాటి పక్కలలో అతి నొప్పిని కలిగిస్తుంది. గొంతులో పిల్లికూతలు, వెక్కిళ్ళు, పడిశము, ముక్కు వాపు వస్తాయి. కఫం పైకి పోయినపుడు ఒళ్ళంతా నొప్పెడుతుంది. కాని అది పోగానే కాసింతసేపు ఊపిరాడుతుంది.

 పడుకుని వుంటే ఊపిరాడదు. కూర్చుంటే కాస్త నయం. నిలబడితే బాగా ఊపిరాడుతుంది. దీనివల్ల రాత్రిళ్లు కాళరాత్రులవుతాయి. తల పైకెత్తితే నుదురంతటా చెమట్లు పట్టి కణతల వద్ద నొప్పి పుడుతుంది. ఊపిరి తీయడం కోసం అవస్థ పడుతున్న రోగి వణకుతుంటాడు. వేడిగా ఏదైనా తాగాలనుకుంటాడు. ఇది తమక దశ. బలమైన అంగాలు కలవారిలో ఈ రుగ్మతను చికిత్స ద్వారా కుదర్చవచ్చును. తీక్ష్ణమైన జ్వరం, కంపనం వున్నవారిని చలవద్వారా రోగముక్తులను చేయలేము.

 మహాశ్వాస రోగంలో బాధితులకు ఊపిరందదు. దానికై గట్టిగా ప్రయత్నిస్తే సర్వాంగాలూ బద్ధలైనంత నొప్పి పుట్టుకొస్తుంది. చెమటలు పడతాయి. తెలివి తప్పు తుంటుంది. నడుముకి లోపలంతా మండుతుంటుంది. కళ్ళుపైకెత్తి చూడలేరు. అవి గిరగిర తిరిగిపోతున్నట్ల నిపిస్తాయి. ఒక కన్ను బాగా ఎఱ్ఱబడిపోతుంది. మలబద్దక ముంటుంది. నోరంతా పొడిగా వుంటుంది. అతి వాగుడు, పలవరింతలు, తెలివితప్పుట ఒక దాని వెంట నొకటి వస్తుంటాయి. ముఖం పాలిపోతుంది. లేపి కూర్చోబెడితే శ్వాస తీసుకున్నపుడు శబ్దాలు వస్తుంటాయి. అవి ఎద్దు ఱంకెల్లా వుంటాయి.

 తరువాతి దశలో రోగికి స్పర్శ కూడా తెలియదు. కనులలో ముఖంలో ఏదీ అర్ధం కానప్పుడు కలిగే గాబరా కనిపిస్తుంది. మలమూత్రాలాగిపోతాయి. మాట పడిపోతుంది.

ఊర్థ్వ శ్వాసరోగికి నిశ్వాసం ఉండదు. ఊపిరి పీలుస్తున్నట్టే వుంటాడు. అదీ లోపలికి గాలి వెళుతున్నట్టే వుంటుంది. పైకి రాదు. కణతలు, తల తీవ్రమైన నొప్పికి లోనవుతాయి. గొంతు తడారిపోతుంది. నోరు, చెవులు కఫాన్నీ చీమునీ కలిగి నిండిపోయినట్లుంటాయి. వాయు ప్రకోపం వల్ల రోగి అటూ ఇటూ ఏదో, ఎటో తెలియనట్లుగా తిరుగుతుంటాడు. సంధులు నొప్పెడుతున్నాయని మూలుగుతాడు. అరుస్తాడు. కాని ధ్వని బయటకు రాదు. ఈ బాధలన్నిటినీ రోగాన్ని కుదర్చడం ద్వారా తొలగించవచ్చు. అదీ మరీ ముదిగిపోకుండా వుంటేనే. ఈ రోగం శీఘ్ర ప్రాణాంతకం.

* హిక్కా ముందుగా ‘గాలి అకలి’ (ఊపిరాడక గట్టిగా ప్రయత్నించి నీరసం తెచ్చుకోవడం) తో సోకుతుంది. ఇందులో భక్ష్యోదృవ, క్షుద్ర, యమలా, మహతీ, గంభీరా అనే రకాలున్నాయి. మొదటి రకం తొందర తొందరగా గట్టి, ఘాటు పదార్థాలను ముందరా వెనకా చూసుకోకుండా మేసెయ్యడం వల్ల వస్తుంది. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి వాతం ఆందోళితంగా వున్నపుడు నోట్లోకి త్రోయబడే గట్టి తిండి ద్రవాలు దీనికి ఉత్పాదకాలు. వాయువు రెచ్చగొట్టబడగానే చిన్నచిన్న ధ్వనులు వస్తాయి. రోగి ఏ కాస్త కష్టించినా వాతం ప్రకోపించి క్షుద్ర హిక్కా వస్తుంది. బోరయెముక నుండి పుట్టే ఈ రోగంలో కొన్నాళ్ళు దాకా వ్యాప్తి, తీవ్రతా వుండవు. తరువాతి రకమైన యమలా జంటలలో కనిపిస్తుంది. అది కూడా తీవ్రంగా వుండదు. అయితే ఈ దశలో ముఖం వణుకుతుంటుంది. తల, మెడ తిరుగుతుంటాయి. ఇది ముదిరితే తెలివిలేని వాగుడు, వాంతులు, విరేచనాలు, కనుగ్రుడ్లు తిరుగుట, కళ్ళు తేలవేయుట, ఆవులింతలు ఇవన్నీ గోచరిస్తాయి. ఇవన్నీ ఎక్కువ కాలం పాటు వుంటే రోగం ముదురుతోందని గ్రహించాలి.

*(హిక్కా అంటే వెక్కిళ్ళు)

 మహతీ వెక్కిళ్ళలో అన్నీ శీవ్రంగానే ఉంటాయి. కనుబొమ్మలన క్రిందికి జారిపోతాయి. కణతలు లోతుకీ పోతాయి, కళ్ళు చెవులకి దగ్గరగా జరుగుతుంటాయి. ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోతుంది. మాటలో స్పష్టత పోతుంది. జ్ఞాపకశక్తి నశిస్తుంది. తెలివి తప్పిపోతుంది. సంధులన్నీ విడిపోతాయి. వెన్నెముక వంగిపోతుంది.

 గంభీర అంటేనే తీవ్రత. ఇది నడుము, నాభిలలో మొదలవుతుంది. తీవ్రమైన నొప్పి, పెద్ద ధ్వనులు, పరమహింస, మిక్కిలి బలం (అంటే మందుకీ లొంగకపోవడం) దీని లక్షణాలు. పెద్దపెద్ద ఆవులింతలూ, అంగాల కుదుపూ వుంటాయి. జాగ్రత్తగా, ఓపీగ్గా చికిత్స చేస్తే దీన్ని రూపుమాపవచ్చు. హిక్కా, క్షయలు ప్రాణాంతకాలు. ఇతర (ఈ అధ్యాయంలో వున్న) రోగాలు కూడా బలహీనుల, త్రాగుబోతుల, అతి తిండిపోతుల, వృద్ధుల, అతి నీరస జీవుల, మలబద్ధక రోగుల విషయంలో ఒక రోజు నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకాలవుతాయి.

 రాజయక్ష్మ,  క్షయ రోగాలలో తొలి జబ్బు పాతరోజుల్లో నక్షత్రాలకీ, చంద్రునికీ, రాజులకీ, బ్రాహ్మణులకీ ఎక్కువగా సోకేది కాబట్టి దానికా పేరు పెట్టబడింది. దీనికే క్షయ అనీ రోగరాట్ అనీ శోష అనీ కూడా పేర్లున్నాయి. దీనికి కారణాలు 1) సాహసం అనగా తెగింపు, అతి వ్యాయామం, అతి బలం 2) వేగ సంరోధం అనగా మలమూత్రాలను బలవంతంగా అణచిపెట్టుట 3) శుక్రజ స్నేహ సంక్షయం అంటే వీర్యాన్ని, శక్తినీ, బలాన్నీ వృథా చేయడం 4) అన్నపాన విధి త్యాగం అనగా ఒక నియమమూ, అదుపూ లేకుండా తినడం, త్రాగడం.

పైన చెప్పిన కారణాల వల్ల వాతం ప్రకోపిస్తుంది. పిత్తం చెదరిపోతుంది. అనవసరాలూ హానికరాలునైన పదార్థాలు గడ్డకట్టిపోయి కఫం ఉద్రేకానికి లోనై అది నాళాలలో పేరుకుపోతుంది. సంధులలో చేరుతుంది. కాలువలను అడ్డుతుంది. అపుడు ఈ రోగం కవాటాలను మూసిగాని, వాచేలా చేసి గాని నరాలను చెడగొడు తుంది. అప్పుడు గుండె దానిప్రక్క క్రింది భాగాల్లో తీవ్రమైన నొప్పి పుడుతుంది.

 ఈ రోగ లక్షణాలు (వచ్చిందని సంకేతాలు) పడిశం, ఉష్ణోగ్రత పెరుగుదల, చొంగ కాగుట, నోట్లో తీపీ రుచి, శరీరం నున్నబడుట, తిండి సహించకపోవుట, నడవాలనే తీవ్రవాంఛ, తినాలనే గట్టి కోరిక, ఆ రెండూ చేయలేకపోవడం, స్వచ్ఛతలో అతివ్యగ్రత, ఎంత శుభ్రంగా వున్నదైనా అపరిశుభ్రంగా వుందని అరవడం, తన భోజనపాత్రలో తాగే వాటిలో లేని ఈగలను, తలవెండ్రుకలను గడ్డి పరకలను ఉన్నాయని అనుమానించి ఏరుతుండడం, వెక్కుళ్ళు, అశాంతి, వాంతులు, ఎంత రుచికరమైనవి పెట్టినాబాగు లేవనడం.

 ఈ రోగిలో కొన్ని సందర్భాల్లో శరీరమంతటా కనులతో సహా తెల్లటి మెరుపు రంగు వచ్చి చేరుతుంది. నాలుక, బాహువుతీవ్రంగా నొప్పెడతాయి. స్త్రీ సుఖం కావాలని పిస్తుంది. మద్యమాంసాలూ కావాలనిపిస్తుంది. తీరా వాటిని చూస్తే చిరాకు కలుగుతుంది. విచిత్రమైన కలలు వస్తుంటాయి. నిర్మానుష్య గ్రామాలూ, ఎండిన చెరుపులు, దొరువులు, చాలా కాంతివంతమైన తోకచుక్కలు, చెట్లతో సహా తగలబడిపోతున్న అడవులు, తనపైకి ఉరుకుతున్న ఊసరవెల్లులు, పాములు, కోతులు, పక్షులు - ఇలాటివన్నీ కలలోకి వస్తుంటాయి.

గోళ్ళూ, ఎముకలూ, జుట్టూ అసహజమైన వేగంతో పెరిగిపోతుంటాయి.

శ్వాసకోశానికి సంబంధించి ఈ రోగరాజంలో పదకొండు రుగ్మతలు బయట పడతాయి. పడిశము, శ్వాసకృచ్చ్రము, దగ్గు, గొంతు నీరసించుట, తలనొప్పి, అన్నద్వేషం, ఎగవూపిరి, అంగముల్లో అతి నీరసం (చీపురుపుల్లల వలె అయిపోవుట) వాంతులు, జ్వరం, ఛాతీనొప్పి - ఇవి వచ్చిన తరువాత గొంతులో భరించలేని బాధ, ఉమ్ములో చీము, నెత్తురు, అంగాలు నొక్కుకుపోతున్న బాధ కలుగుతాయి.

 వాత ప్రకోపంవల్ల తల, కణతలు అంగాలు నొప్పెడతాయి. అన్నీ ఒత్తిడికి లోనౌతాయి. గొంతు నొక్కుకు పోతున్నట్లుంటుంది. పిత్త ప్రకోపం వల్ల భుజాలలో మంట, అరికాళ్ళలో, చేతుల్లో మంట, నులుగడుపు, నెత్తుటి వాంతులు, మలంలో దారుణ దుర్వాసన, నోటిదగ్గర దుర్వాసన, జ్వరం, పేలాపన వస్తాయి. కఫం ప్రకోపిస్తే అరుచి, వాంతులు, సగం శరీరం బరువెక్కిన భీతి కలుగుతాయి.

నోటినుండి చొంగకారుట, జలుబు, అజీర్ణం, శ్వాసకృచ్చ్రం, గొంతు బొంగురు కూడా కఫం వల్లనే వస్తాయి. జీర్ణకోశం సరిగా పనిచేయకపోవడం వల్ల మామూలుగా స్రవించే ద్రవాలు పెరిగి కఫం రసాలు అతిగా ఊరి నిలవైపోయి నిల్చిపోయి అన్ని నాళాలపై పూతలాగేర్పడి వాటి ద్వారాలను మూసేస్తాయి. అప్పుడు శరీరంలో ధాతునిర్మాణం ఆగిపోయి మొత్తం అంతటా మంటలు చెలరేగుతున్నట్లుండి మతి చెదరిపోతుంది. మరికొన్ని దారుణ బాధలు కూడా వుంటాయి. క్షయరోగి తీసుకునే ఆహారం హానికర ఆంలాలతో తడిసిపోయి ఇతర ద్రవాలతో కలిసి ఎందుకూ పనికిరాకుండా పోతుంది. అతనికీ బలం చేకూరదు. గసాలేవీ అతని శరీరంలో రక్తాన్నుత్పత్తి చేయవు. దాంతో రోగి క్షీణించి పోయి కాళ్ళూ చేతులూ చీపురుపుల్లల్లాగా అయిపోతాయి. ఈ చీపురుపుల్ల లక్షణం కనిపించే లోపల ఎన్ని రుగ్మతలు బయటపడినా మందుల ద్వారా చికిత్స ద్వారా రోగాన్ని కుదర్చవచ్చు.

దేహంలో జఠరాదిగసాలు పాడైతే కొవ్వు చేరక మనిషి నీరసించిపోతాడు. గొంతు బొంగురు వచ్చి గొంతు బలహీనమై బొంగురుపోయి వణుకుతుంది.

వాత ప్రకోపంలో శరీర కాంతినాశనమగుట, నునుపు పోవుట, వెచ్చదనం మాయమగుట జరిగి గొంతుభాగం బార్లీగింజ రూపంలో రంగులోకి వచ్చేస్తుంది. కఫ ప్రకోపానికి ఈ జబ్బులో ఒక వింతైన గురక, గొంతులో నిరంతరం జిగటగా చీము కదులుతుండడం సూచనలు. పిత్త ప్రకోపం వున్న క్షయ రోగికి గొంతు, తాలువు మండుతున్నట్లుంటాయి. కఫలక్షణాలైన తలతిప్పు, కనులముందు చీకటి తెరలు కూడా కనిపించవచ్చు.

ఏది యేమైనా కాలుసేతులు చీపురు పుల్లలవలె కాక ముందైతే చికిత్స చేయవచ్చు.