1 - గరుడ పురాణము - ఆచార కాండము
96 - వర్ణసంకర జాతుల ప్రాదుర్భావం - గృహస్థధర్మం, వర్ణ ధర్మం, ముప్పదేడు ప్రకారాల అనధ్యాయం
బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ కన్యను పెండ్లాడి ఆమెకు కనిన పుత్రునితో మూర్ధావసిక్త అనే సంకరజాతి ప్రారంభమైంది. అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరంలో అంబష్ఠ, బ్రాహ్మణ శూద్ర సంకరంలో పారశమనిషాద జాతుల పుట్టుకొచ్చాయి. దీనిని అనులోమ సంకరమన్నారు.
పురుష స్త్రీ సంకరజాతి పేరు
క్షత్రియ వైశ్య మాహిష్య
క్షత్రియ శూద్ర మ్లేచ్ఛ1
వైశ్య శూద్ర కరణ2
క్షత్రియ బ్రాహ్మణ సూత
వైశ్య బ్రాహ్మణ వైదేహక
శూద్ర బ్రాహ్మణ చాండాల
వైశ్య క్షత్రియ మాగధ
శూద్ర క్షత్రియ క్షత్తా
శూద్ర వైశ్య ఆయోగవ3
మాహిష్య కరణ రథకార
(1.యాజ్ఞవల్క్య స్మృతిలో మ్లేచ్ఛ పదానికి బదులు ‘ఉగ్ర’ యను పదం వాడబడింది.)
(2.మూర్ధవసిక్త, అంబష్ఠ, నిషాద, మాహిష్య, ఉగ్ర, కరణ - ఈ ఆరు సంకరజాతులనూ అనులోమజలన్నారు.)
(3.సూత, వైదేహక, చాండాల, మాగధ, క్షత్తా, ఆవయోగ జాతులను ప్రతిలోమజలన్నారు.)
సంకరం వల్ల చెడిన వర్ణం మరల పాతదశకు రావాలంటే ఆరు తరాలు పడుతుంది. అంటే బ్రాహ్మణునికీ శూద్రునికీ పుట్టిన సంతానాన్నీ నిషాదులన్నాము కదా. ఆ నిషాదుని కొక కూతురు పుట్టి, దానినొక బ్రాహ్మణుడు పెండ్లాడి, వారికొక కూతురు పుట్టి, దానినీ బ్రాహ్మణుడేమనువాడి... అలా నిషాద, బ్రాహ్మణ వివాహం ఆరు తరాల బాటు కొనసాగితే ఏడవతరం నిషాదునికి కూతురు పుట్టి అమెను కూడా బ్రాహ్మణుడే పెళ్ళిచేసుకుంటే అప్పుడు వారికి పుట్టిన పిల్లలు ఏడవతరం వారవుతారు కదా! వారికి శుద్ధ బ్రాహ్మణ వర్ణాన్ని శాస్త్రాలు ప్రసాదిస్తున్నాయి. అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరమైన అంబష్ఠ జాతిలో అయిదవత రానికి పుట్టినవారు అనగా ఆరవ తరంవారు శుద్ధ బ్రాహ్మణులవుతారు. అలాగే మూర్ధావసిక్త జాతిలో అయిదవ తరంవారు శుద్ధబ్రాహ్మణులౌతారు. ఇదే విధంగా ఉగ్రా, మాహిష్యా జాతులలోనూ ఏడవ ఆరవ తరాలలో శుద్ధ క్షత్రియులుద్భవిస్తారు. అదే విధంగా కరణనామక సంకరజాతిలో ఆరవతరంలో శుద్ధ వైశ్యులుద్భవిస్తారు. అనగా సంకరదోషం పితృవర్ణ బీజం ఆరేడుతరాల పాటు అనుస్యూతంగా ప్రవహిస్తే గాని కడుక్కుపోదు.
వర్ణసంకరమంటే వివాహ విషయంలో మాత్రమే చేయబడేదని కాదు. వృత్తి విషయంలో కూడా జరుగుతుంది. యాజన, అధ్యయన, అధ్యాపనాలను చేయవలసిన బ్రాహ్మణుడు పరిస్థితుల ప్రభావం వల్ల ఆ వృత్తి ద్వారా జీవించలేక, బతుకు గడవక క్షత్రియ, వైశ్య లేదా శూద్రవృత్తి నవలంబించవచ్చు. ఇలా ఏ వర్ణం వారు మరొక వర్ణం పనిని చేసినా అది కర్మ వ్యత్యయమవుతుంది. అదీ వర్ణ సంకరంవంటిదే. అయితే పరిస్థితులు మెరుగు పడగానే ఎవరి అసలు పనిలోకి వాళ్ళు వెళ్ళకుండా తమ వర్ణం కన్నా హీనవర్ణానికి చెందిన కర్మను నిర్వహిస్తూ వుండి పోతే వారు వర్ణసంకరులుగానే పరిగణించబడతారు. వారు క్రమంగా ఏడవ, ఆరవ, అయిదవతరంల దాకా ఆ హీనవృత్తిలో వుండిపోవలసినదే.
ఇక సంకరజాతులను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి సంకర, సంకీర్ణ, సంకర, వర్ణ సంకీర్ణ సంకర విభాగాలు.
అనులోమజులు, ప్రతిలోమజులు అనగా నిదివఱకు చెప్పబడిన మూర్ధవసిక్త నుండి ఆనయోగ జాతి దాకా గల పన్నెండు రకాలవారూ సంకరజాతి విభాగానికి చెందినవారు.
ఈ సంకరజాతిలో మరల సంకరం జరుగగా పుట్టినవారు - అనగా మాహిష్య -కరణ సంయోగం వల్ల పుట్టిన పథకార జాలి వంటి వారు సంకీర్ణ సంకరజాతి వారవుతారు.
మరింత లోతైన సంకరం జరిగిన చోట వర్ణ సంకరజాతి వారు పుడతారు. ఉదాహరణకి మూర్ధావసిక్త స్త్రీకి క్షత్రియ, వైశ్య లేదా శూద్ర పురుషుని ద్వారా పుట్టినవారు, అంబష్ఠ స్త్రీకి వైశ్య లేదా శూద్ర పురుషుని ద్వారా కలిగినవారు అలాగే పారశవ నిషాద స్త్రీకి శూద్రుడు కన్న పిల్లలూ ఈ జాతిలోకి వస్తారు. వీరిని అధరప్రతిలోమజుంటారు.
ఇటువంటి సంకరజాతి స్త్రీలకే బ్రాహ్మణ బీజం ద్వారా కలిగినవారు, మాహిష్య, ఉగ్రజాత్యాది స్త్రీలకు బ్రాహ్మణ లేదా క్షత్రియ పురుషుని ద్వారా పుట్టినవారు, కరణజాతి స్త్రీయందు అగ్రవర్ణుని ద్వారా కలిగినవారు ఇటువంటి వారిని ఉత్తర ప్రతిలోమజులంటారు. వీరినే అధర - అసత్, ఉత్తర - అసత్ వర్ణ సంకీర్ణ జాతుల వారని వ్యవహరిస్తారు.
ఇక గృహస్థధర్మాన్ని గూర్చి మాట్లాడుకుందాం.
గృహస్థు ప్రతిదినం స్మార్తకర్మా, వైశ్వదేవాది అగ్నికార్యాలూ సంపన్నం చేయాలి. దీనికి వివాహాగ్నిని కానీ సంపద్విభాగసమయంలో స్వయంగా తానే తెచ్చుకున్న సుసంస్కృతమైన అగ్నిని కానీ ఆరాధించాలి. శ్రౌతకర్మానుష్ఠానానికి అగ్నిహోత్రం వైతానాగ్ని (ఆహవనీయ మున్నగు అగ్నులలో నేదో ఒకటి) తో సంపన్నం చేయాలి. శరీర చింతలను (విసర్జనాలను) ఉదయసాయం కాలాలలో శాస్త్రోక్తంగా తీర్చుకోవాలి. గంధలేపనివృత్తి పర్యంత శుద్ధిని పొంది దంతధావన, స్నానాదికములను గావించి ప్రతి ద్విజుడూ ప్రాతఃకాల సంధ్యో పాసనను ముగించి అగ్నిహోత్ర కార్యాన్ని నిర్వర్తించుకోవాలి. హవనం చేసి సమాహిత చిత్తంతో సూర్యమంత్రాలను, అనగా ఉదుత్యం జాతవేదసం... మున్నగు వాటిని జపించాలి. తరువాత వేదార్థాలనూ - అనగా - నిరుక్త వ్యాకరణాదులనూ ఇతర శాస్త్రాలనూ అధ్యయనం చేయాలి. యోగ క్షేమాది సిద్ధికై ఈశ్వరో పాసనను కూడా చేయాలి.
గృహస్థధర్మంలో మరొక ముఖ్యమైన అంశంతర్పణాలు. ప్రతి గృహస్థూప్రతిరోజూ దేవతలకూ పితరులకూ స్నానానంతరం తర్పణాలివ్వాలి. పూజకూడా చేయాలి. వేదపురాణేతిహాసాలలో కొంతమేర, యథాశక్తి, పారాయణం చేయాలి. జపంచేసుకొని భూత, పితర, దేవ, బ్రహ్మ, మనుష్య జాతులకు బలికర్మ*ను గావించాలి.
(*భూతయజ్ఞం, స్వధా - పితృయజ్ఞం, హోమ - దేవయజ్ఞం, స్వాధ్యాయ -బ్రహ్మయజ్ఞం, అతిథి సత్కారం - మనుష్యయజ్ఞం. ఈ యజ్ఞాలన్నిటినీ బలికర్మగా వ్యవహరిస్తారు.)
తరువాత స్వధా, హోమ, స్వాధ్యాయ, అతిథి సత్కారాలు చేయాలి. దేవతలనుద్దేశించి అగ్నిలోహవనాలిచ్చి కుక్కలు, చండాలుడు, కాకులు మున్నగు ప్రాణలకై వండిన అన్నాన్ని భూమిపై వేయాలి. పితృగణాలకూ మనుష్యులకూ అన్నంతో బాటు జలదానం కూడా చేయాలి. అన్నమును తన కుటుంబమునకు మాత్రమే సరిపడనంత వండుట సరికాదు. పక్వాన్న ఎల్లప్పుడూ అవసరానికి ఎక్కువగానే ఇంట్లో వుండాలి. స్వవాసిని, (పెళ్ళయినా కూడా ఏవోకారణాలవల్ల ఆనాటికి పుట్టింట్లో వున్న స్త్రీ) వృద్ధులు, గర్భిణులు, వ్యాధి పీడితులు, కన్యలు, అతిథులు, భృత్యులు - వీరందరికీ భోజనాలు పెట్టాకనే ఇంటీ యిల్లాలు, ఇంటి యజమాని అగ్నిలో పంచప్రాణాహుతులనిచ్చి అన్నానికి గౌరవ భక్తి ప్రపత్తులతో నమస్కరించి భోజనం చెయ్యాలి. భోజనానికి ముందూ వెనకా అవపోసన పట్టాలి.
ద్విజులు అమృతతుల్యమైన భోజనాన్ని పాత్రలో ఆకుమూతపెట్టి వుంచినదాన్ని తినాలి. అతిథికోసం భోజనం ఎప్పుడూ కూడా ఎంత సాయంకాలమైనా సిద్ధంగావుండాలి. రోజులో ఎప్పుడైనా ఇంటికి వచ్చిన అతిథి అన్నంతినకుండా పోరాడు. బ్రహ్మచారులకూ సన్యాసులకూ (వారులభిస్తే వాళ్ళు దొరకడమే అదృష్టం) రోజూ భిక్షవేయాలి. స్నాతకులనూ, ఆచార్యులనీ, రాజునీ ప్రతియేటా పూజించాలి. అలాగే మిత్రులూ, అల్లుళ్ళూ, ఋత్విజులూ ప్రతి వర్షమూ ఆతిథ్య పూజలకు అర్హులు. బాటసారిని అతిథయనీ వేదపారంగతుని శ్రోత్రియుడనీ అంటారు. బ్రహ్మలోక ప్రాప్తిని కోరుకొనేవారు ఈ రెండు రకాల వారిని పూజించాలి.
ఎవరైనా మిక్కిలి వినయంగా, ఆదరంగా, గౌరవంతో ఆహ్వానిస్తేనే బ్రాహ్మణుడు, ఒకరియింటి పక్వానాన్ని స్వీకరించాలి. గృహస్థు మితంగాభుజించాలి. నోటిని అనవసరంగా వాడకూడదు. ఏ విషయంలోనూ అతిచాంచల్య చాపల్యాలు కూడదు. అతిథులను సగౌరవంగా ఊరిపొలిమేరదాకా దిగబెట్టి సముచితంగా వీడ్కోలు పలకాలి.
తనకు ఇష్టులైన మిత్రులతో విద్వత్సంపన్నులతో గోష్ఠులు సలుపుతుండాలి. సాయంకాలం మరల సంధ్యవార్చి అగ్నిహోత్రం పనిచూసుకొని భోంచేయాలి. భోజనం తరువాత బుద్ధిమంతులైన భృత్యులతో ఇంటి వ్యవహారాలనూ, రాబోయే కార్యాలనూ ముచ్చటించాలి.
వైశ్యులకూ, క్షత్రియులకూ కూడా యజ్ఞానుష్ఠానమూ, అధ్యయనమూ, దానమూ ముఖ్య విహిత కర్మలే. బ్రాహ్మణునికీ యజ్ఞమునుచేయించుట, అధ్యాపనం, దానగ్రహణం అనేవి అదనపు ధర్మ కర్మలు.
క్షత్రియునికి ప్రజాపాలనమేప్రధానధర్మము. వైశ్యవర్ణులకుఅప్పులిచ్చుట, వ్యవసాయము, వాణిజ్యము, పశుపాలన ముఖ్య కర్మలుగా విధింపబడ్డాయి. శూద్ర వర్ణం వారు పై మూడు వర్గాల వారికీ సాయపడాలి. ద్విజులు యజ్ఞాదికర్తవ్యాలను మానరాదు. అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియ సంయమనం, దమం, క్షమ, సరళత, దానం - మానవులందరికి అవశ్యాచరణీయ ధర్మాలు. అందరూ కుటిల, దుష్టప్రవృత్తులను పరిత్యజించాలి.
ప్రధానం క్షత్రియం కర్మ ప్రజానాం పరిపాలనం ॥
కుసీదకృషి వాణిజ్యం పశుపాల్యం విశః స్మృతం ।
శూద్రస్యద్విజ శుశ్రూషా ద్విజోయజ్ఞాన్ నహాపయేత్ ॥
అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియ సంయమః ।
దమం క్షమార్జవం దానం సర్వేషాం ధర్మసాధనం ॥
ఆచరేత్ సదృశీం వృత్తమజిహ్మామశఠాం తథా । (ఆచార..96 (ఽ7-30))
మూడేళ్ళకు సరిపడునంత బియ్యమును పండించి దాచగలిగినవాడు సోమరసపానానికి అర్హతను సంపాదించుకుంటాడు. ఒక్కయేడాది అన్నానికి సరిపడు బియ్యం లేదా ధాన్యమును దాచగలిగిన వారు ముఖ్యంగా సోమయాగం యొక్క ప్రాక్ క్రియను చేయవలసి వుంటుంది. అనగా సోమయాగానికి పూర్వం చేయవలసిన అగ్నిహోత్ర, దర్శపూర్ణమాస, ఆగ్రాయణ, చాతుర్మాస్యాది కర్మలను అనుష్ఠించాలి.
ద్విజుడు ప్రతియేటా సోమయాగం, పశుయాగం, చాతుర్మాస్యయాగం, ఆగ్రయణేష్ఠి (అనగా కొత్తగా ధాన్యపుగింజలు కనబడగానే చేయుయాగం) లను ప్రయత్న పూర్వకంగా శ్రద్ధగా చేయాలి. ప్రతియేటా చేయలేనివారు రెండుసంవత్సరాలలో ఒకమారు అదే వేళకు వైశ్వానరీ యిష్టిని చేయాలి.
ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలందుకొని మోక్ష ప్రాప్తిని కోరు బ్రాహ్మణుడు జీవించవలసిన విధానం వేరు. స్వాధ్యాయ విరోధియైన అర్థ సంపాదనం చేయరాదు. ఎవరి వద్దా ధనమును పుచ్చుకొనరాదు. చిన్న చిన్న పనులకూ వ్రతాలకూ ప్రతి ఫలాన్ని స్వీకరించరాదు. నృత్య గీతాదుల ద్వారా కూడా ధన సంపాదన చేయరాదు. శూద్రుని చేత యజ్ఞాన్ని చేయించి డబ్బును పుచ్చుకున్న బ్రాహ్మణుడు మరుజన్మలో చండాలునిగా పుడతాడు. యజ్ఞం కోసం తీసుకువచ్చిన అన్నాన్ని దానంచేసుకున్నవాడు కోడి, గ్రద్ధ, కాకి యోనుల్లో పుడతాడు.
ఆధ్యాత్మికాశయాలను కలిగి శరీరాన్ని ధర్మమోక్షాలకొక సాధనంగా వాడుకోదలచిన బ్రాహ్మణుడు రెండు మూడు రోజులకు సరిపడు బియ్యాన్ని మాత్రమే ఉంచుకోవాలి. మోక్ష సాధకునికి అన్నిటికంటే *శిలోంఛవృత్తి పరమ శ్రేష్ఠము.
(*శీలవృత్తి అనగా పంట కోతలైనాక పొలములో మిగిలియున్న ధాన్యపు గింజల నేరుకొని వాటితోనే అన్నం వండుకొని కడుపు నింపుకొనుట, ఉంఛవృత్తి యనగా ధాన్యపు బస్తాలనుండి రహదారిపై రాలిన ఒక్కొక్క గింజ నేరుకొని తెచ్చుట. ఈ రెండిటినీ కలిపి శిలోంఛవృత్తి అని వ్యవహరిస్తారు.)
అతనిని గుర్తించి రాజుగానీ, శిష్యుడుగానీ, యజ్ఞాలను నిత్యకృత్యంగా చేయించే యజమానిగాని ముందుకివచ్చి పోషణ భారాన్ని వహిస్తే అంగీకరించవచ్చును అప్పుడయినా ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసంమే తినాలిగాని భోగద్రవ్యాలను స్వీకరించుట తగదు.
ఇక అనధ్యయన సందర్భాలను అనగా ఎట్టి సందర్భాలలో వేదాలనూ శాస్త్రాదులనూ చదువుకోకూడదో చర్చిద్దాం.
వేదం చదువుకోవడాన్ని ధర్మశాస్త్రాలు1 చెప్పుకోవడాన్ని శ్రవణ నక్షత్రయుక్త శ్రావణ పూర్ణిమనాడు గాని హస్త నక్షత్రయుక్త పంచమి నాడుగాని లేదా పుష్యమాసంలో రోహిణీ నక్షత్రం వున్నరోజున గానీ గ్రామానికి వెలుపల జలాశయ సమీపాన గృహ్యసూత్రాను సారం ప్రారంభించాలి.
(1.యజ్ఞవల్క్యమితాక్షర, ఆచారాధ్యాయం, 146)
శిష్య, ఋత్విజ, గురు, బంధు - బాంధవులలో ఎవరైనా మరణిస్తే ఆ క్షణం నుండి మూడురోజుల పాటు అనధ్యయనమే. అలాగే స్వశాఖ శ్రోత్రియ బ్రాహ్మణుడు మరణించినా మూడురోజుల పాటు చదవకూడదు. సంధ్యా సమయంలో ఉరుములు వినబడినపుడు, ఆకాశంలో మెరుపులు కనబడినపుడు, భూకంప, ఉల్కాపాత సమయాలలోనూ అధ్యయనాన్ని ఆపివేయాలి. వేద, ఆరణ్యక అధ్యయన సమాప్తి జరిగిన తరువాత పూర్తిగా ఒక పగలూ ఒక రాత్రి సెలవిచ్చెయ్యాలి.
అష్టమి, చతుర్దశి, అమావాస్య, పున్నం, చంద్ర సూర్య గ్రహణాలు, ఋతు సంధులలో పాడ్యమి, శ్రాద్ధ భోజనాలు - ఈ వేళల్లో చదువుకి సెలవు... పూర్తిగా ఒక రోజు. అయితే ఏకోద్దిష్ట శ్రాద్ధానికి భోజనం లేదా ప్రతిగ్రహ సమయాల్లో మూడురాత్రులు గడిచేదాకా అనధ్యయనాన్ని పాటించాలి.
ఉత్సవాలకీ, శక్రధ్వజందిగినపుడూ, ఏడుపులూ పెడబొబ్బలూ దగ్గర్లోనే వినబడు తున్నపుడూ, శవం లేచినపుడూ తాత్కాలిక అనధ్యయనముంటుంది. అపవిత్ర దేశంలో, అపవిత్రావస్థలో, మాటిమాటికీ నింగి మెరుస్తుంటేనూ, మధ్యాహ్నం పన్నెండు గంటలలోపల పలుమార్లు ఉరుములు వినబడినపుడూ జలమధ్యంలో, అర్ధరాత్రి వేదశాస్త్రాలను చదువరాదు. ఎవరైనా విశిష్టవ్యక్తి వచ్చినప్పుడు అధ్యయనాన్ని ఆపాలి.
పరుగెడుతూ కానీ మద్యం వాసనవస్తున్న వ్యక్తి పక్కనేవున్నపుడుగానీ, గాడిద, ఒంటె, గుఱ్ఱం, నౌక, చెట్టు, పర్వతంమున్నగు వానిపై కూర్చున్నపుడుగానీ ప్రయాణిస్తున్నపుడు గానీ, దొంగలు రాజులు గ్రామానికి ఉపద్రవాన్ని తెచ్చినపుడు గానీ వేదశాస్త్రాలను చదువరాదు.
ఇక విద్యార్థులు, గురువులు, బ్రాహ్మణాది ద్విజులు సంఘంలో పాటించవలసిన నియమాలను చూద్దాం. దేవతామూర్తి, ఋత్విజుడు, స్నాతకుడు, ఆచార్యుల, రాజుల, పరస్త్రీల నీడలు, రక్తం, మూత్రాది విసర్జకాలు దారిలో వున్నపుడు దాటుకొనిపోరాదు. ఆగిగాని, పక్కకి తొలగిగాని వెళ్ళాలి. మంచిపేరుగల బ్రాహ్మణుని, రాజుని సర్పాన్ని అవమానించకూడదు. అలాగే తనను తాను అవమానించుకోరాదు. విసర్జనాలను, ఇతరులు కాళ్ళుకడుక్కున్న నీళ్ళను దూరంనుండే చూసి తప్పుకోవాలి.
శ్రుతులలో, స్మృతులలో బోధింపబడిన సదాచారాన్ని పూర్తిగా పాటించాలి. ఒకరి రహస్యాన్ని బట్టబయలు చేసి వారిని బాధించరాదు. ఎవరినీ నిందించుటగాని కొట్టుటకాని దోషము. పుత్రునీ శిష్యునీ అవసరం మేరకు దండించవచ్చు. స్వధర్మాచరణ విషయంలో ఎటువంటి వెసులుబాటు కోసమూ చూడరాదు. దాన్ని తప్పనిసరిగా పూర్తిగా చేయవలసినదే. ధర్మ విరుద్ధమైన పనులను చేయరాదు. గృహస్థు తన తల్లిదండ్రులతో, అతిథితో, ధనికులతో వాదించరాదు.
నది, సెలయేరు, పుష్కరిణి, చెఱువులలో స్నానంచేయాలి. ఇతరుల సరోవరంలో స్నానంచేయడానికి ముందు అనుమతిని పొంది, అయిదు మట్టి ముద్దలను బయటికి తీసి ఒడ్డున పెట్టి వెళ్ళాలి.
ఇతరుల శయ్యపై పడుకొనరాదు. దేశం ఆపదలో నున్నపుడు మనం మాత్రం ప్రసన్నంగా భోంచెయ్యరాదు. ఏదో తినాలి కాబట్టి తినాలి.
కృపణుడు, బందీ, దొంగ, అగ్నిహోత్రం చెయ్యని బాపడు, వెదురుతో పని చేయువాడు, న్యాయస్థానంలో నేరం ఋజువైనవాడు (దోషిగా నిరూపింపబడినవాడు) వడ్డీ వ్యాపారి, వేశ్య, సామూహిక దీక్షలనిచ్చేవాడు, చికిత్సకుడు, రోగి, క్రోధి, నపుంసకుడు, నటన - నాట్యాల ద్వారా వేదికలపై పొట్టపోసుకొనే వాడు, ఉగ్రుడు, నిర్దయుడు, పతితుడు, డాబులు కొట్టేవాడు, శాస్త్రవిక్రేత, స్త్రీ వశుడు, గ్రామంలో దేవతలకు శాంతి పూజలు చేయించేవాడు. నిర్దయుడైన రాజు, అబద్ధాల కోరు, మద్యవిక్రేత, బంగారం పనివాడు, వండి - వీరి యింటి భోజనమును చేయరాదు.
పాసిపోయిన, చలిది, నిలువయుండిన, రంగు మారిన, కుక్క ముట్టిన, పతితునిచే చూడబడిన రజస్వల ముట్టిన, 1సంఘష్ట 2పర్యాయాన్న భోజనమును సర్వదా త్యజించ వలెను.
(1.భోజనం మిగిలిపోయింది. వచ్చితినేస్తారా... అంటూ పెట్టే అన్నం.)
(2.ఒకరికోసం సిద్ధం చేసి వారు స్వీకరించకపోతే మనకి పెట్టునది.)
శూద్రాన్నమును భుజించవచ్చును. ఐతే, ఆ శూద్రుడు కొన్ని తరాలుగా మన వృత్తిలో సహాయపడుతున్న వారి కుటుంబం వాడై వుండాలి. మనస్సు, మాట, శరీరం, కర్మ - వీటన్నింటినీ పరిశుద్ధంగా వుంచుకొని భగవదర్పణ బుద్ధితో మెలిగే వాడై వుండాలి.
తిలతండులమిశ్రిత పదార్థాలనూ, అప్పాలు, పాయసం, పండివంటలు - ఇట్టి వాటిని దేవతలకో, అతిథులతో సమర్పించాకనే మనంతినాలి.
నీరుల్లి, వెల్లుల్లి వంటి ఉగ్రపదార్థాలు ఉన్న వారికి చాంద్రాయణ వ్రతం చేస్తే కాని ఆ దోషంపోదు. మితంగా తింటూ, హితంగా వుంటూ, చిన్న, తెలియని దోషాలకు భగవంతుని క్షమాపణ కోరుకుంటూ, జీవితాన్ని భగవత్ప్రసాదంగా భావించి ప్రతి కర్మనీ భగవంతునికే సమర్పిస్తూ ఆయననే ప్రార్థిస్తూ జీవించేవాడు ఆయననే చేరుకుంటాడు.
