1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

175 - జ్వర చికిత్స

శుశ్రుతా! ఏ జ్వరానికైనా ముందు లంఘనం (లంఖణం) చేయించాలి. అంటే ఆహారస్వీకరణను ఆపాలి. రోగిని చలిగాలి, ఈదురుగాలి లేనిచోట వుంచాలి. కాచి చల్లార్చిన నీరే త్రాగించాలి. నొప్పి ఎక్కువై వచ్చే జ్వరం కాపడం పెట్టడం వల్ల పోతుంది. చాలవఱకు వాత జ్వరాలన్నీ గుడూచి, ముస్తకాలను కషాయం కాచి ఇస్తే పోతాయి.  ।

దురాలభ కషాయం పిత్త జ్వరానికి మంచి మందు. కఫ దోషజనిత జ్వరానికి సొంటి, పర్పట, ముస్త, బాలక, ఉశీర, చందనం, నెయ్యి, దురాలభలతో చేసిన కషాయాన్నివ్వాలి. పిత్త జ్వరానికి తిక్తక, ఎరండ, గుడూచి, సొంటి, ముస్తకాలు కలిపిన కషాయాన్నివ్వాలి. సాధారణ జ్వరాలన్నీ బాలక, సౌంటి, పర్పటల కషాయానికి లొంగుతాయి.

బాలక, ఉశీర, పాఠ, కంటకారి, ముస్తక, సురదారులను కలిపి కషాయం చేసి దానిని ధన్యాక, నింబ, ముస్తల ముద్దతో కలిపి తేనెతో రంగరించి తీసుకుంటే ఏ జ్వరమైనా తగ్గుతుంది. త్రిఫల, పటోలపత్ర, గుడూచిల కషాయం అన్ని జ్వరాలనూ తగ్గించడమేకాక వాత ప్రకోపం వల్ల వచ్చే బాధలను కూడా తగ్గించి, ఆకలిని పెంచుతుంది.

హరీతకి, పిప్పలి, ఆమలి, చిత్రకలను పొడిచేసి నాలిక పై వేసుకున్నా జ్వరం తగ్గుతుంది. తగ్గకపోతే అప్పుడా పొడికి ధన్యాక, ఉశీర, పర్పట లేదా ఆమలకి, గుడూచి, చందనాల కషాయాన్ని కలిపి నీటిలో మరగించి వడకట్టి నీరు పోగా మిగిలిన ముద్దను తేనెతో కలిపి తీసుకుంటే ఎంతటి మొండి జ్వరమైనను తగ్గవలసినదే.

సన్నిపాత అనగా త్రిదోష జన్య జ్వరానికి హరిద్ర, నింబ, ముస్తక, త్రిఫల, దేవదారు, కటురోహిణి, పటోల పత్ర ఓషధుల మిశ్రిత కషాయాన్ని వాడాలి. దగ్గు, ఆయాసము గలవారికి నాగబల, కంటకారి, నాగర, గుడూచి, పుష్పగలను కలిపి గుండ జేసి ఇస్తే జ్వరంతోబాటు ఈ బాధలు కూడా తగ్గిపోతాయి.

కఫ, వాత జ్వరాలతో బాధపడుతున్న వారికి దాహం వేస్తే వెచ్చని నీరే తాగాలి. విశ్వ, పర్పటక, ఉశీర, ముస్త, చందనాలను మరగించి చల్లార్చి వడగట్టగా మిగిలే నీటిని ఇవ్వాలి. దాని వల్ల దాహం, జ్వరం, మంట, వాంతులు తగ్గుతాయి. వాతజన్య జ్వరానికి పంచమూల, బిల్వ, కషాయం బాగా పనిచేస్తుంది.

పిప్పలి వేరు ఆకలి పెరగడానికి దోహదం చేస్తుంది. వాత జ్వరానికి గుడూచి విశ్వల కషాయం కూడా బాగా అడ్డుకట్టవేస్తుంది. పిత్త జ్వరాన్ని పర్పట, నింబ కషాయంతో తేనె అనుపానంగా అమరిన మందు అదుపులోకి తెచ్చి పారద్రోలగలదు. తిక్త, పాట, పటోల, విశాల, త్రివృత, త్రిఫలాల కషాయం పాలతో కలిపి తీసుకుంటే ఏ జ్వరమైనా దిగిపోతుంది.