1 - గరుడ పురాణము - ఆచార కాండము
185 - గణపతి మంత్రం- ఔషధిక యోగం శోథ, అజీర్ణ విషూచిక, పీనసాదిరోగాలకు చికిత్స
గణపతి మహామంత్రమైన ఓంగం గణపతయే నమః సర్వగణాలకీ సార్వభౌముడైన విఘ్నేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి జపించబడే మంత్ర రాజము. ఇది విద్యనూ ధనాన్నీ కూడా ప్రసాదించగలదు. దీనినొక వందమార్లు జపిస్తే మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఎనిమిదివేల మార్లు జపించి వెళితే ఏ ప్రయత్నంలో నైనా విజయం తథ్యం.
ఈ మంత్రాన్ని వెయ్యీయెనిమిది (1008) మార్లు పఠిస్తూ (1008 ఆహుతులు) అదే సంఖ్యలో నల్లనువ్వులను వెన్నలో ముంచుతూ ఆహుతులను వ్రేలిస్తే మూడు రోజులలోనే ఆ ప్రాంతపు రాజు వశుడౌతాడు. శుక్ల అష్టమి, చతుర్దశి రోజులలో ఉపవాసముండి గణేశుని వీధ్యుక్తంగా పూజించి వెయ్యీయెనిమిది (1008)మార్లు తిలలను, ధాన్యపు గింజలను ఆహుతులిస్తే ఆ సాధకుడు ఏ యుద్ధంలోనైనా అజేయుడౌతాడు. ఎంతటి వారైనా అతనిని సేవించుకోవాలనుకుంటారు. హీం కారాన్నీ, విసర్గనీ, ఒక స్త్రీ నుదుటిమీద వేలితో వ్రాసి ఈ మంత్రాన్ని జపిస్తే ఆ స్త్రీ అతని వశంలో వుంటుంది.
సహదేవి భృంగరాజ, శ్వేతపారిజాత, వచలను కలిపి ముద్దజేసి తిలకంగా నిత్యం నుదుట ధరించేవాడు ముల్లోకాలనూ తన ఆజమాయిషీలో నుంచుకోగలడు. ఎడమచేతి చిటికెన వ్రేలితో గోరోచన, మీనపిత్తలనుండీ చేయబడిన పుల్లలతో తిలకాన్ని దిద్దుకునేవాడు కూడా ముల్లోకాలనూ అదుపులో ఉంచుకోగలడు. తన మలిన రక్తంతో గోరోచనాన్ని కలిపి తిలకాన్ని చేసి నుదుట ధరించే స్త్రీ ఎవరివైపైనా గట్టిగా చూస్తే చాలు, వాడామె వలలో వెంటనే తలమునకలుగా పడిపోతాడు.
కాకజంఘమూలాన్ని పాలలో కలుపుకొని తాగితే శోథరోగం (మలీనరక్తం వల్ల వచ్చే కురుపులు, బొడిపెలు) కుదురుతుంది.
అశ్వగంధ, నాగబల, బెల్లం, మాశల మిశ్రమాన్ని రోజూ తినేవారికి వయసు పెరిగినా జవసత్వాలు తగ్గవు.
త్రిఫల చూర్ణమును ఇనుపరజనుతో కలిపి గాని, కలపకగాని తేనెతో రంగరించి తీసుకున్నా, శంబూక క్షారకాన్ని నీటిలో వేసి మరగించుకొని తాగినా పరిణామ శూలయను అజీర్ణవ్యాధి నశిస్తుంది. లేడి కొమ్మును మంటలో కాల్చి బూడిద చేసి దానిని ఆవు వెన్నతో కలిపి తీసుకుంటే హృదయసంబంధ వ్యాధులూ, వీపునొప్పీ అంతరిస్తాయి. హింగు, సువర్చలు, శుంఠిలను మహౌషధతో కలిపి నీటిలో మరగించి తాగితే అన్ని రకాల కడుపు నొప్పులూ కడముట్టుతాయి. అపామార్గపు వేరుని సముద్రపు ఉప్పుతో కలిపి తీసుకుంటే అజీర్ణమూ కడుపునొప్పీ తగ్గుతాయి. వట మొలకలను బియ్యపు మడుగులో శుద్ధి చేసి మజ్జిగలో పోసుకుని తాగితే విరేచనాలు తగ్గుతాయి. అంకోట వేళ్ళను అర్ధకర్ష పరిమాణంలో తీసుకొని నూరి బియ్యం కడుగులో పోసుకుని తాగితే అతిసార, నీళ్ళవిరేచనాలు కడతాయి. అలాగే మరిచ, సౌంటీ, కుటజ బెరడుపొడి, బెల్లం ఒకటి, రెండు, నాలుగు, ఎనిమిది పాళ్ళలో క్రమంగా తీసుకొని కషాయం చేసి తాగినా అతిసార జబ్బు అంతరిస్తుంది.
తెల్ల అపరాజిత వేళ్ళు, హరిద్ర, వండిన బియ్యం (అన్నం) అపామార్గ, త్రికటుక లను ముద్దగా చేసి గుళికలను తయారుచేసి వేసుకుంటే విషూచి నశిస్తుంది. మూత్ర సంబంధ రుగ్మతలన్నీ త్రిఫల, గురు, శిలాజితు, హరీతకీలను వేరు వేరుగా చూర్ణం చేసి అయిదేసి నిముషాల వ్యవధిలో వేరువేరుగా తేనెతో రంగరించి తింటే పోతాయి. విభీటకాన్ని భస్మం చేసి తేనెతో కలిపి తింటే పడిశం పారిపోతుంది.
త్రికటు, త్రిఫల, అలక్త, నువ్వులనూనె, మనశ్శిల, వేపాకులు, జాకీసుమాలు, శంఖ నాభి, చందనాలను కలిపి బాగా మేకపాలతో, మేకమూత్రంతో పచనం చేసి మల తీసి పొడిగా చేసి కాటుకలా వాడితే రేచీకటి, తెల్లగోడవలె కనబడుట, కంటి క్రింద నలుపు మున్నగు నేత్ర రోగాలు నశిస్తాయి.
పిప్పలి, త్రిఫలచూర్ణం, తేనె, సైంధవాల మిశ్రమం అన్ని రకాల జ్వరాలనూ, పడీశాన్నీ, దగ్గునీ, క్షయనీ పూర్తిగా క్షీణింపజేస్తుంది. దేవదారు పొడిని మేకమూత్రంలో ముంచితీస్తూ అలా ఇరువది యొక్క మార్లు శుద్ధిచేసి ఆపై కాటుకగా మార్చి కంటికి పెట్టుకుంటే రేచీకటి, కంటిచుట్టూ నలుపు, కనురెప్పల సమస్యలు తగ్గుతాయి. పిప్పలి, కేతకి, హరిద్ర, ఆమలక, వచలను పాలతో పచనం చేసి కాటుకవలె పూస్తే కూడా కళ్ళ జబ్బులు కడముట్టుతాయి.
కాకజంఘ, శిగ్రు వేగ్రుని నోటిలో నుంచుకొని కొంతసేపు నమలితే దంతాలలో, చిగుళ్ళలో వుండే క్రీములన్నీ నశిస్తాయి.
