1 - గరుడ పురాణము - ఆచార కాండము
108, 109 - బృహస్పతి ప్రోక్త నీతిసారం
నైమిషారణ్యంలో శౌనకాచార్యుని జిజ్ఞాస మేరకు అర్థశాస్త్రంపై ఆధారపడిన నీతిసారాన్ని, ఒకప్పుడు ఇంద్రునికి బృహస్పతి ఉపదేశించిన దాన్ని ఇలా బోధించసాగాడు సూతమహర్షి.
“శౌనకాది మహామునులారా! ఇది రాజులు - అనగా పరిపాలకులు, వ్యాపార సామ్రా జ్యాధినేతలు, వారి గురువులైన మునులు, బ్రాహ్మణులు ఇలా అందరూ తెలుసు కోవలసిన విషయము.
పురుషార్థ చతుష్టయాన్ని, అనగా ధర్మార్ధ కామమోక్షాలను సిద్ధించుకోదలచుకున్న వాడు సజ్జనులతోనే చెలిమిచేయాలి. దుర్జన సాంగత్యంలోనే బతికేసేవాడు ఇహపరాలు రెండింటికీ చెడతాడు.
సద్భిఃసంగం ప్రకుర్వీత సిద్ధికామః సదానరః ।
నాసద్భిరిహలోకాయు పరలోకాయ వాహితం ॥ (ఆచార..108/ఽ)
క్షుద్రునితో సంభాషణా, దుష్టుని దర్శనమూ, శత్రు సేవకునిపై ప్రేమా, మిత్రునితో విరోధమూ, మూర్ఖునికుపదేశమూ, దుష్ట స్త్రీ నుండి సహాయ స్వీకరణమూ ప్రమాదకర ములు, దుఃఖదాయకములు. కాలవైపరీత్యం వల్ల మీత్రునితో శత్రుత్వమూ, శత్రువుతో మిత్రత్వమూ తెలుపవలసి వచ్చినపుడు అది శాశ్వతంకాదని మనసులో గట్టిగా అనుకుంటూ జాగ్రత్తగా నిర్వహించాలి.
కాలం బహుశక్తివంతం. దానిని గెలుచుట కష్టసాధ్యం. అది దురతిక్రమణీయం. అదే ప్రాణులను పరిపాలిస్తుంది, సంహరిస్తుంది, ప్రాణులు నిద్రిస్తున్నా అది నిద్రించదు. కాలమే మానవ జీవితంలోని అన్ని ఘట్టాలనూ నిర్ణయిస్తుంది.
ఋషులారా! బృహస్పతి బోధనలవల్లే ఇంద్రాది దేవతలు నీతిజ్ఞులు కూడ అయినారు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు:
స్థితిమంతులంతా అశ్వమేధయాగం చెయ్యాలి. దేవుళ్ళను పూజించినంత భక్తిశ్రద్ధలతోనే బ్రాహ్మణులనూ రాజర్షులనూ పూజించాలి.
ఉత్తమైః సహసాంగత్యం పండితైః సహ సత్కథాం ।
అలుభైః సహమిత్రత్వం కుర్వాణో నావసీదతి ॥ (ఆచార...108/1ఽ)
ఉత్తమ ప్రకృతి గల మంచివారితో కలిసి తిరగడం, పండితులతో మాట్లాడుతూ వారికీ సల్లాపంబునందుల్లాసంబు కలిగింపజేసి ఉత్తమ కథలను విశేషాలను వినడం, లోభులు కాని వారితో స్నేహం చేయడం - వీటిని పాటించే బుద్ధిమంతుడు సుఖపడతాడు.
ఇతరులను నిందించుట, పరుల ధనాన్ని అపహరించుట, మగనాభితో సరసాలాడుట, తనది కాని ఇంటిలో నుండుట - ఎన్నడూ చేయరాదు. మనకీ మేలు చేసేవాడు పరుడైనా బంధువే; మనకీ కీడు చేసేవాడు బంధువైనా పరుడే అని గ్రహించాలి.
ఎవరు మనను పోషిస్తారో వారే మాతాపితలు. శరీరం నుండి పుట్టినదే అయినా వ్యాధిని తగిలేయడానికే చూస్తాము కదా! ఎక్కడో అడవిలో పుట్టినదైనా మందుని మనలో కలుపుకుంటాము కదా!
పరోఽపి హితవాన్ బంధుర్బంధు రప్యహితః పరః ।
అహితో దేహజో వ్యాధిర్హిత మారణ్య మౌషధం ॥
సబంధురోహితే యుక్తః సవితా యస్తు పోషకః ।
తన్మిత్రం యత్ర విశ్వాసః సదేశోయత్ర జీవ్యతే ॥ (ఆచార...108/14,15)
చూసేవాడే నేస్తం, మానింది మందు, బతికింది ఊరు అని పెద్దలంటారు కదా!
చెప్పిన పనిని అక్షరాలా మనసా చేసేవాడే సేవకుడు, మొలకెత్తే విత్తనమే విత్తనం, ప్రియంగా సంభాషించేదే భార్య, తండ్రినీ తల్లినీ, వృదులైనా పూజించి పోషించేవాడే కొడుకు, గుణవంతునిగా ధర్మప్రవృత్తితో బతికేవాడి బతుకే నిజమైన బతుకు. ఇలా కానీ వాళ్ళు బతకడం భూమికి బరువు.
సాభార్యా యా గృహేదక్షా సాభార్యా యా ప్రియం వదా ।
సాభార్యా యా ప్రతి ప్రాణా సా భార్యా యా పతివ్రతా ॥ (ఆచార..108/18)
ఇలాంటి పతివ్రతయు, పైగా సుందరి, మంగళప్రదకార్యాలు చేయునది, ధర్మపరాయణ, శృంగార సుఖం కోసం కాకుండా పుత్ర సంతానం కోసం మాత్రమే సంగమాన్ని కోరుకొనేది యగు భార్య లభించినవాడు దేవేంద్రుని వలె వెలుగొందుతాడు.
అలాకాకుండా ఎగుడుదిగుడు కన్నులది, పాపిని, కలహప్రియ, పరపురుషులపై ఆసక్తి కలదియైన భార్యకు దొరికిపోయినవాడు ఎన్ని వున్నా, అన్నీ వున్నా దరిద్రుడే. ఇలాంటి వాడు పెళ్ళయిన స్వల్పకాలంలోనే వృద్ధావస్థను చేరుకుంటాడు.
దుష్టపత్ని, దుష్టమిత్రుడు, పొగరుబోతుభృత్యులు గలవాడు సర్పమున్న గృహంలో నివసిస్తున్నట్లే లెక్క వానికీ సుఖం వుండదు. శాంతీ వుండదు.
దుష్టసాంగత్యాన్నొదిలేసి, మంచివారితో కలసిమెలసి తిరుగుతూ రాత్రింబవళ్ళు వీలైనంతవఱకు పుణ్యాన్నే సంపాదిస్తూ భగవంతుని నిత్యత్వాన్నీ మనయొక్క అనిత్యత్వాన్నీ తలుస్తూనే జీవించాలి.
వేశ్యాలంపటంలో పడరాదు. అల్పమైన చదువున్నవాడూ బలహీనుడూ మహాశక్తిశాలిగా రూపొందవచ్చు, పచ్చికృతఘ్నుడని ప్రజలంతా అనేవాడు కూడా మంచివాడై పోయి నమ్మదగిన వ్యక్తిగా పేరొందవచ్చు. అగ్ని చల్లగా కావచ్చు. మంచుని ముట్టుకుంటే వేడిగా తగలవచ్చు. కాని వేశ్యకు పురుషునిపై ప్రేమ రాదు.
సూతుడిగా కొనసాగించాడు. నీతిసారాన్ని మునులకీయసాగాడు. ధనాన్ని సంపాదించాలి కాని, దాన్ని తనకూ, స్త్రీలకూ, పిల్లలకూ ఆపడవచ్చినపుడు వాడుకోవడానికి చాలినంతవఱకే దాచుకోవాలి.
వర్ణం కోసమొక వ్యక్తినీ, గ్రామం రక్షించబడవలసి వస్తే తప్పనిసరైతే ఒక కుటుంబాన్నీ, మహానగరాన్ని కాపాడవలసి వస్తే జనపదాన్నీ త్యాగం చేయవచ్చు. ఆత్మరక్షణ కోసమైతే గ్రామం, నగరం, దేశం, దేనినైనా పరిత్యజించవచ్చును.
త్యజేదేకం కులస్యార్దే గ్రామస్యార్దే కులం త్యజేత్ ।
గ్రామం జనపదస్యాస్ధ ఆత్మార్ధ పృథివీం త్యజేత్ ॥ (ఆచార...109/ఽ)
దుష్టచరిత్రుని ఇంటిలో నుండడం కన్నా నరకంలో నుండుటయే మేలు. ఎందుకంటే నరకం పాపాలను దగ్ధం చేస్తుంది.
బుద్ధిమంతుడెపుడూ ఒక పాదాన్ని పూర్తిగా స్థిరంగా మోపిన తరువాతే రెండో కాలెత్తుతాడు. నేల విడిచి సాము చేయడు. అంటే ఒక చోటుని వదలిపోవునపుడు ఇంకొక దానిని సిద్ధం చేసుకొన్నాకనే కదలాలి.
దుష్టజనులచే పరివ్యాప్తమైన దేశాన్నీ, ఉపద్రవగ్రస్తమైన నివాసభూమినీ, మాయావి యైన మిత్రునీ ఏ మాత్రం సంకోచించకుండా, ఆలస్యం చేయకుండా వదిలేయాలి.
పీనాసివాడి చేతిలో పడిన ధనమూ, అత్యంత దుష్టుడూ, కోపిష్టి వద్ద నున్న జ్ఞానమూ, గుణంగానీ శౌర్యంగానీ లేనివానికీ గల సౌందర్యమూ, ఆపద వేళలో మొగం చాటేసే మిత్రుడూ ఎందుకూ పనికిరారు.
అధికారంలో వున్నవాడికైతే సాయపడడానికి అపరిచిత వ్యక్తులు కూడా అత్యుత్సాహంతో ముందుకు వస్తారు. చిటికెలో మిత్రులయి పోతారు. అదే వ్యక్తి పదవీచుత్యుడైతే, అసమర్థుడని తేలిపోతే పరిచయస్తులు కూడా పలకరించరు. స్వంతవారే శత్రువులా చూస్తారు. తరువాత తెలుగులో వచ్చిన - అధికారాంతమునందు చూడవలెగా ఆయయ్య సౌభాగ్యముల్ - అనే సుభాషితానికి గరుడపురాణమే మూలం కావచ్చు.)
నిజమైన మిత్రుడెవరో ఆపదవచ్చినప్పుడే తెలుస్తుంది. అలాగే యుద్ధంలో వీరత్వమూ, ఏకాంతంలో శుచితా, వైభవం క్షీణించినపుడు పన్నీ, దుర్భిక్షంలో అతిథి ప్రియత్వం నిగ్గు తేలతాయి. అనగా వారి అసలు రంగులు బైట పడతాయి.
వృక్షం క్షీణఫలం త్యజంతి విహగాః
శుష్కం సరః సారసా నిర్ధ్రవ్యం
పురుషంత్యజంతి గణికా భ్రష్టం నృపం మంత్రిణః ।
పుష్పం పర్యుషితం త్యజంతి మధుపాః
దగ్ధం వనాంతం మృగాః సర్వః కార్యవశా
జ్జనోహిరమతే కస్యాస్తి కో వల్లభః ॥
ఎవరికి యెవరు? చివరికి యెవరు? పళ్ళ కాపు ఆగిన చెట్టుని పిట్టలు వదిలిపోతాయి. సరస్సు ఎండిపోవడం మొదలవగానే అక్కడ వాలేవి ఇక వాలవు. వేశ్యలు ధనాన్ని పిండేసిన తరువాత విటుని ఇక తమ గుమ్మం తొక్కనివ్వరు. వాడిన, మాడిన పూలపై తుమ్మెదల వాలడం మానుకుంటాయి. కాలిన అడవిని జంతువులన్నీ త్యజిస్తాయి. ఇవన్నీ వేరే ఆశ్రయాలను వెతుక్కుంటూ పోతాయి. కాబట్టి మునులారా! ఈ వ్యావహారిక జగత్తులో ఎవరూ ఎవరికీ ఏమీ కారు.
లుబ్దమర్థ ప్రదానేన శ్లాఘ్యమంజలి కర్మణా ।
మూర్ఖం ఛందాను వృత్త్యా చ యథాత థ్యేన పండితం ॥
సద్భావేన హీ తుష్యంతి దేవాః సత్పురుషాః ద్విజాః ।
ఇతరేఖాద్యపానేన మానదానేన పండితాః ॥ (ఆచార..109/10,11)
లోభికి ఏదోరూపంలో ధనాన్నిస్తే తెగ ముచ్చటపడిపోతాడు. ఆ రకంగా వాడి మనసును గెలుచుకోవచ్చును. అలాగే అజలించి ఉదారచిత్తులనూ, పొగడ్తలతో మూర్జులనూ, తాత్త్వికచర్చ ద్వారా విద్వాంసులనూ, మంచి మనసు చేత ఉన్నతాలోచనల చేత దేవతలనూ సజ్జనులనూ ద్విజులనూ మంచి చేసుకోవచ్చును. అన్నపానాలతో సామాన్యులనూ, మాన సమ్మానాలతో పండితులనూ ఆకట్టుకోగలము.
నదిని నమ్ముకొని ఒక చోట వుండిపోవాలనుకోవడం తెలివైన పనికాదు. అది అతిగా నిండినా పూర్తిగా ఎండీనా ముప్పు తప్పదు. అలాగే గోళ్ళతో కొమ్ములతో వుండే జంతువు లనూ ఆయుధాన్ని ధరించి తిరిగేవారినీ, రాజ పరివారాన్నీ విశ్వసించి ఉండిపోకూడదు.
నదీనాంచనఖీ నాంచ శృంగిణాం శస్త్రపాణి నాం ।
విశ్వాసోనైవ కర్తవ్యః స్త్రీ షు రాజకులేషు చ - (ఆచార..109/14)
*అర్థనాశం మనస్తాపం గృహేదుశ్చరితానిచ ।
వంచనం చాపమానం చ మతిమాన్ న ప్రకాశయేత్ ॥ (ఆచార..109/15)
(*అవమానమును, ధన నష్టమును ప్రకాశము చేయరాదందురు అనే నీతిచంద్రిక సూక్తికి కూడ గరుడ పురాణమే మూలం)
ఈ ప్రపంచంలో దోషం లేని వంశం, రోగ పీడితులు కాని మనుషులు, దుఃఖితులు కాని వారు, అహంకారాన్ని గెలువగలిగిన ధనవంతులు, దుర్జనుల వల్ల దెబ్బతిననివారు ఉండదు.
ఎచ్చోటనైతే వ్యక్తికీ గౌరవం లభించదో, ఆదరించేవారుండరో, బంధుబాంధవులు లేరో, విద్యా లాభ అవకాశమే వుండదో అచ్చోటును వీలైనంత వేగం వదలిపోవాలి.
ధనసంచయం చేసేవాడు దానినెంత వఱకు రక్షించగలడో కూడా ఆలోచించుకోవాలి. రాజులు, చోరులు దాని జోలికి రాకుండా కాపాడుకోగలగాలి. అప్పుడైనా ప్రాణాలను పణంగా పెట్టి కొండొకచో అన్యాయానికి ఒడిగట్టి సంపాదించిన సొమ్ము వానితో పరలోకానికి వెళ్ళదు కానీ తత్సంపాదనకై వాడుచేసిన పాపాలు వానిని నరకం దాకానూ మరుజన్మల లోనూ కూడా అనుసరిస్తాయి. కాబట్టి అధర్మం, లోభం పనికిరావు. సాధారణంగా ఇటువంటి అధార్మికులూ, లోభులే మరుజన్మలో కడుపారగ కూడుగానీ తలదాచగ గూడు కానీ చలినాపగవలువలుగానీ లేని దరిద్రులుగా, రోగులుగా జీవనాన్ని గడుపుతుంటారు. వీరంతా దానం,ధర్మం లేని ఒకనాటి శ్రీమంతులే. మనం ఇటువంటి వారు మనను యాచిస్తున్నపుడు మనకొక హెచ్చరిక చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. "ఓయి మానవులారా. మీరు అన్యాయాలు చేసి, దానాలు చేయకుండా బతికేస్తే వచ్చే జన్మలో మాలాగే అడుక్కుతినాలి’
శిక్షాయంతి చయాచంతే దేహీతి కృపణా జనాః ।
అవస్థీయమదానస్య మా భూదేవం భవానపి ॥ (ఆచార 109/ఽ5)
పీనాసివాని ధనం యజ్ఞాలకు ఉపయోగపడదు (వాడు చేయడు కాబట్టి) బ్రాహ్మణులను చేరదు (వాడివ్వడు కాబట్టి) చివరికది చేరేది రాజును (లాక్కుంటాడు కాబట్టి) లేదా దొంగను.(దోచుకుంటాడు కాబట్టి).
విద్యను నిరంతరం అధ్యయనమో, అభ్యాసమో చేసుకుంటూ వుండకపోతే దానిని మరిచిపోతాం. శక్తి కూడా అంతే.
దొంగని క్షమించడంగాని చిన్న శిక్ష వేసి ఊరి మీదికీ వదలి వేయడంగానీ కూడదు. వానికి సరైన శిక్ష మరణదండనే.దుష్టుడైన మిత్రుని దూరంగా వుంచాలి.ఎదురైతే పలకరించి ఎలాగో పారిపోవాలి. అదే వానికీ శిక్ష. స్త్రీకి సరైన శిక్ష ఆమెను తన శయ్యపై కాకుండా వేరే ఒంటరిగా పడుకోబెట్టడం. బ్రాహ్మణునికి శిక్ష వానిని దేనికీ పిలవక పోవడమే.
పనిని పెంచడం ద్వారా భృత్యునీ, దుఃఖం కలిగించే సంఘటన వచ్చినపుడు బంధు బాంధవులనూ, వీపత్కాలంలో మిత్రునీ, ఐశ్వర్యం నష్టమైపోయినపుడు స్త్రీనీ జాగ్రత్తగా గమనించక్కరలేకుండానే వారి రంగులు బైటపడతాయి.
జానీయాత్ ప్రేషణే భృత్యాన్
బాంధవాన్ వ్యసనాగమే ।
మిత్రమాపది కాలే చ
భార్యాంచ విభపక్షయే ॥
స్త్రీకి పురుషుని కన్నా రెండింతలు ఆహారమూ, నాల్గింతలు బుద్ధీ, అగింతలు ఓపికా, ఎనిమిది రెట్లు కామ వాంఛా వుండాలనీ, వుంటాయనీ పెద్దలంటారు.
స్వప్నం వల్ల నిద్రపై విజయం లభింపదు. అనగా కలల వల్ల నిద్ర చెడుతుందే గానీ శీరదు. కామంతో స్త్రీని గెలుచుకొనుట అసాధ్యం. ఇంధనంతో అగ్నిని తృప్తిపలచలేము. మద్యంతో దాహాన్నీ తీర్చలేము. స్త్రీకి సౌకర్యాలను కలిగిస్తున్నకొద్దీ అమెకు కోరికలు పెరిగిపోతుంటాయి. కట్టముక్కలను వేస్తున్న కొద్దీ అగ్నీ మరింత రాజుకుంటుంది కదా! నదులు తనలో కలుస్తున్న కొద్దీ సముద్రునికీ దాహమూ అలాగే పెరిగిపోతుంటుంది.
ప్రియవచనాలు, కోరికల సిద్ది, సుఖాలు, పుత్రులు - ఇలాంటివన్నీ వస్తున్నకొద్దీ
ఇంకా కావాలనే అనేవారే తప్ప ఇక చాలు అనేవారుండరు.
మోక్షమనేది వనాలలోనో పర్వతాలపైననో మాత్రమే దొరకదు. తనకు ధర్మశాస్త్రాలు విధించిన కర్మను తత్పరతతో దైవార్పణంగా చేస్తూ, గౌరవంగా బతకడానికీ చాలినంత మాత్రమే ధనానార్జిస్తూ, శాస్త్ర చింతనపై రక్తినీ, తన భార్యపై మాత్రమే అనురక్తినీ పెంచుకుంటూ జితేంద్రియుడై, అతిథిసేవానిరతుడై జీవనాన్ని గడిపే సత్పురుషుడు ఆయువు తీరినంతనే స్వంత ఇంటినుండే మోక్షపదాన్ని చేరుకోగలడు.
స్వర్గం ఎక్కడో అకాశంలో మాత్రమే ఉందనుకోడానికి లేదు. సతర్మ నిరతుడైన పురుషునికి తన లోగిట్లోనే అనుకూలవతి, సుందరి, సముచితాలంకార భూషిత, ఆరోగ్యవంతురాలు అయిన భార్యా, ఎవరినీ యాచించకుండా పీడించకుండా బతుకు జరిగే వెసులుబాటూ వుంటే అదే భాగ్యము, అదే స్వర్గము.
స్వభావసిద్దంగానే ధర్మ విరుద్ధంగా పటికీ ప్రతికూలంగా వుండే స్త్రీలు దానానికీ మానానికీ శాస్త్రాలకీ శస్త్రాలకీ లొంగరు. వారితో బ్రతకవలసిరావడమే నరకం)
న దానేన న మానేన నార్జవనే న సేవయా ।
న శత్రేణ న శాస్త్రేణ సర్వథా విషమాః స్త్రియః ॥ (ఆచార...109/45)
విద్యార్జన, ధనసంగ్రహం, పర్వతారోహణం, అభీష్టసిద్ధి, ధర్మాచరణం, - ఈ అయిదింటినీ ఓపికగా క్రమక్రమంగా సాధించుకోవలసి వుంటుంది.
దేవపూజనాదిక కర్మలూ, బ్రాహ్మణులకిచ్చే దానమూ, సద్విద్య మంచిమిత్రుడూ - ఇవి మానవునికీ జీవిత పర్యంతమూ సహాయకారులవుతాయి. బాల్యకాలంలో విద్యనీ, యువావస్థలో ధనాన్నీ అనుకూలవతియైన పన్నినీ సంపాదించుకోలేని వారు సుఖవంతమైన జీవితాన్ని గడపలేరు.
విద్యార్జన ఒక ఉపాసన. ఆ ఉపాసనా కాలంలో మనిషికి భోజనాన్ని గురించిన ఆలోచనరాకూడదు. విద్య కోసం, అవసరమైతే, గరుత్మంతుని వలె, ఎంత దూరమైనా పోవాలి. వీలైనంత వేగంగా పోవాలి.
శుష్కతర్కం వల్ల ఎవరికీ ప్రయోజనముండదు. సిద్దాంత స్థాపనము కేవలం తర్కమాత్రాన జరగదు. ధర్మం కూడా తర్కము ననుసరించివుండదు. పరిస్థితులను బట్టి ధర్మం మహరులచే ఆదేశింపబడుతుంది.
తర్కేఽప్రతిష్ఠాశ్రుతయో విభిన్నా:
నాసావృషీర్యస్య మతం న భిన్నం ।
ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం
మహాజనోయేన గతః సపంథాః ॥ (ఆచార...109/5ఽ)
ఆకారం, సంకేతం, గతి, చేష్ట మాట, కనులు, ముఖము - మనిషి యొక్క అంతః కరణ వీటి ద్వారా బయటపడిపోతూనే వుంటుంది. వీటిని బట్టి అవతలివానీ అసలు రంగుని కనుగొని అవగతం చేసుకోగలిగిన వాడే నిజమైన విద్వాంసుడు. జంతువులలో గుఱ్ఱనికీ, ఏనుగుకీ ఈ శక్తి కొంత వణుకూ వుంటుంది.
