1 - గరుడ పురాణము - ఆచార కాండము
178-181 - గర్భసంబంధి, దంత - కర్ణ శూల, రోమాది రోగాలకు చికిత్స
బ్రహ్మదండి, వచ, కుష్ఠ, ప్రియంగు, నాగకేసరలను కలిపి మెత్తని పొడిగా చేసి తాంబూలంతో కలిపి ఓం నమోనారాయణ్యై స్వాహా అనే మంత్రాన్ని పదే పదే పఠిస్తూ తను వలచిన వానికిచ్చి, అతడు నమలుతుండగా ఓం హరిః హరిః స్వాహా అనే మంత్రాన్ని మననం చేసే స్త్రీకి ఆ తాంబూలాన్ని వేసుకున్నవాడు పూర్తిగా బానిసైపోతాడు అంటే వశమై పోతాడు.
(స్త్రీలను వశపజచుకోవడానికీ, రెండు వందల యేళ్ళు బ్రతకడానికీ శత్రువులను వామాచార ప్రయోగం ద్వారా చంపివేయడానికీ కొన్ని మార్గాలిక్కడ గరుడ పురాణంలో సూచింపబడినాయి. అనివార్య కారణాల వల్ల వాటిని అనువదించడంలేదు)
ఆవుపల్లు, హరితాల, కాకి నాలుక - లను గుండకొట్టి ఒక వ్యక్తి తలపై వేయడం ద్వారా వానిని పూర్తిగా వశం చేసుకొనవచ్చును. అయితే, ఆ వ్యక్తి ఇంటిలో తెల్ల ఆవపూలదండ ఉంటే మాత్రం ఈ మందు పనిచెయ్యదు. విభీతక, సాఖొటక వేళ్ళను, ఆకులను ఒక ఇంటి గుమ్మం వద్ద పడవేస్తే ఆ ఇంటిలోని వారు నిరంతరం దెబలాడుకుంటూనే వుంటారు.
అగరు, గుగ్గిలం, నీలోత్పలం, బెల్లంలతో శరీరమంతటా ధూపం వేసుకొనేవారు రాజగృహంలో అందరికీ ఇష్టులౌతారు. (ఇప్పటి భాషలో చెప్పాలంటే పరపతీ, పలుకుబడీ ఎక్కువగా వుంటాయి.) తెల్ల అపరాజితనీ రోచననీ కలిపి గుండ చేసి తిలకంలో ధరిస్తే రాజభవనంలోని వారందరూ ఇష్టసఖులుగా మారిపోతారు.
సంభోగ సమయంలో బ్రహ్మదండిని నోటిలో పెట్టుకుంటే మంచిది. జయంతి వేరుని పెట్టుకున్నా మంచిదే. భృంగరాజ మూలాలను పిండికొట్టి వీర్యంతో కలిపి కాటుక వలె పెట్టుకున్న, రమణికి, ఆమె రమణుడు చేతిలోనే వుంటాడు. తమల పాకులను అపరాజిత, నీలోత్పల లతో కలిపి తినిపించడం ద్వారా ఎవరినైనా వశం చేసుకోవచ్చు.
శృంగార సంబంధితములైన కళాస్థానాలు (వీటిని చంద్రకళలని కూడా అంటారు) ప్రతి మనిషికీ వుంటాయి. అక్కడ మృదువుగా స్పృశించడం ద్వారా వారిలో కామ వికారాన్ని కలిగించవచ్చు. ఆ స్థానాలు ఇవి. కాలి బొటన వ్రేలు, పాదాలు, మడమలు, మోకాళ్ళు, తొడల సందులూ, బొడ్డు, వక్షం, నడుము, చంకలు, గొంతు, బుగ్గలు, పెదవులు, కనులు, నుదురు, తల పురుషులకు కుడివైపు, స్త్రీలకు ఎడమవైపు ఈ స్థానాలుంటాయి. అందరికీ అన్ని కళాస్థానాలలో మదన వికారం కలుగకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానంలో తీవ్రత ఎక్కువగా వుండవచ్చు. గట్టి కౌగలింత స్త్రీని ఎక్కువగా మదన వికారాల పాలుజేస్తుంది. సంభోగ శృంగారానికి సంబంధించి అరువది నాలుగు కామకేళీ సంబంధి కళలు చెప్పబడ్డాయి. దాని ద్వారా భార్యాభర్తలు మాత్రమే సుఖించాలనేది నియమం. ఈ నియమాన్ని పాటించినంతవఱకే సమాజంలో సుఖసంతోషాలుంటాయి.
రోచన, సువాసనతో నిండిన పూలు, వేపపూలు, ప్రియంగు, కుంకుమ, చందనాలను ముద్ద చేసి నుదుటిపై ఆరారా పూసుకుంటూ ఈ క్రింది మంత్రాన్ని నిత్యం జపించేవారిని లోకం పూజిస్తుంది.
ఓం హ్రీం గౌరీ దేవి,
సౌభాగ్యం పురుష వశ్యాది దేహిమే
ఓం హ్రీం లక్ష్మీదేవి
సౌభాగ్యం సర్వం త్రైలోక్య
మోహనం దేహి మే ।
మధు యష్టి, కంటకారిక, ఆవుపాలు, వీటిని సమపాళ్ళలో గైకొని, నీటిలో పోసి మూడు వంతులు ఆవిరైపోయేదాకా మరగించి మిగిలిన ఒక వంతు కషాయాన్ని తాగగలిగినంత వేడిగా త్రాగితే స్త్రీ వేగం గర్భధారణాది పనులలో కృత కృత్యురాలౌతుంది. అలాగే మాతులుంగ విత్తనాలను శుద్ధి చేసి పాలతో మరగించి తాగినా వేగం గర్భవతి అవుతుంది. మగపిల్లడు పుట్టాలని కోరుకునే మహిళ మాతులుంగ విత్తనాలనూ, ఎరండ వేళ్ళనూ నేతిలో కలుపుకొని తాగాలి.
పురుడు సులువుగా రావాలంటే అశ్వగంధాన్ని పాలలో మరగించి ముద్ద చేసి దానికి నేతిని కలిపి గర్భవతి చేత తినిపించాలి. (గర్భం రాకుండా వుండాలంటే ఏంచేయాలో కూడా గరుడపురాణంలో చెప్పబడింది)
బాగా వగరుండేలా తయారుచేసిన హరీతకీ కషాయంతో పళ్ళను బాగా కడుక్కొని, హరితాల, యవక్షార, పత్రాంగ, రక్తచందన, జాతి, హింగులక, లాక్షల ముద్దను వేడిచేసి దానిని పలువరుసపై పూసి వీలైనంతసేపుంచితే అవి ఎఱ్ఱవాకుగా పరమసుందరంగా శోభిల్లుతాయి.
మూలక ఓషధిని తక్కువ సెగలో ఆవిరితో ఉడికించి తీసి దానినుండి రసాన్ని పిండివేసి ఒక చుక్కను చెవిలో వేస్తే దుర్వాసన, లాడికారుట ఆగిపోతాయి.
అర్క ఆకులతో అలాగే తయారుచేసిన రసపు చుక్క ఎంతటి చెవిపోటునైనా అంతమొందించగలదు.
పొడి భావన మూలకసూ సొంటినీ కలిపి కాల్చి భస్మం చేసి దానిని హింగు, మహౌషధ, శతపుష్ప, వచ, కుష్ఠ, దారు, శిగ్రులు, ముద్దకు అద్దుకొని తింటే శక్తి, చైతన్యం, ఉత్సాహం వర్ధిల్లుతాయి.
నూనెను మందుకోసం శుద్ధిచేసిన సౌవర్చల, యవక్షార, సర్జక, సైంధవ, గ్రంథి, విడం, ముస్త, నాలుగు గీతల తేనె మాతులుంగ రసం, కదలీ రసాలతో కలిపి పచనము చేసి తింటే శరీరంలోని దుర్వాసనల్నీ నశిస్తాయి. దానిని సృష్టించే అనారోగ్యకర విసర్జక రసాలూ ఆగుతాయి. ఆవనూనెను చెవిలో వేసుకుంటే క్రిములు నశిస్తాయి.
హరిద్ర, వేపాకులు, పిప్పలి, మిరియం, విడంగభద్ర, ముస్త, విశ్వభేషజ, మందులను గుండజేసి దానికి గోమూత్రాన్ని కలిపి మాత్రలను లేదా ఉండలను తయారుచేసుకొని ఇంట్లో దాచుకుంటే ఒక దివ్యౌషధం దగ్గర వున్నట్లే. ఇది ఒక్క మాత్ర చాలు. అజీర్ణాన్ని అంతం చేయడానికి, రెండు బిళ్లలు లేదా గుళికలు చాలు విషూచి(కలరా) లాటి మొండి జబ్బును పారద్రోలడానికి ఈ బిళ్ళను తేనెతో కలిపి తీసుకుంటే కంటిలోని చికాకులు పోతాయి. గోమూత్రంతో కలిపి గైకొంటే ఎక్కడి కురుపులైనా మాడిపోతాయి.
వచ, మాంసి, బిల్ప, తగర, పద్మకేశర, నాగపుష్ప, ప్రియంగులను సమపాళ్ళలో తీసుకొని గుండగా చేసి కొన్నాళ్ళపాటు శరీరం మొత్తానికి ధూపం వేయించుకున్న వాడు మన్మథుని వలె అందగాడవుతాడు.(సంభోగ శృంగారానికి సంబంధించి ఇక్కడ రెండు విషయాలీయబడ్డాయి.
ఓం రక్త చాముండే అముకం
మే వశం ఆనయ ఆనయ
ఓం హ్రీం హ్రుం హ్రః ఫట్ - అనే మంత్రాన్ని పదివేల మార్లు పఠించి స్వీయరక్తంతో గోరోచనాన్ని కలిపి తిలకంగా ధరించిన వానికి అందరూ వశవర్తులై అదుపులో వుంటారు.
సైంధవ, కృష్ణలవణ, సౌవీర, మత్స్య పిత్త, తేనె, నెయ్యి, పంచదారలను ముద్దగా చేసి యోనిపై రాసుకునే స్త్రీ యొక్క భర్త కలలోనైనా మరొక స్త్రీవైపు పోడు. శంఖపుష్టి, వచ, మాంసి, సోమరాజి, ఫల్గుకలను గేదె వెన్నతో కలిపి చిన్నచిన్న గుళికలను తయారుచేయాలి. కలువపూవును కాడతో సహా నూరి దానిని పాలతో, నేతితో కలిపి ఒక రసంగా తయారుచేసి ఆ చిన్నచిన్న గుళికలను ఈ రసంతో శుద్ధిచేసి యోనిలో జొనుపుకొనే స్త్రీ పదిమంది పిల్లలను కన్నాక కూడా గొప్ప శృంగార సుఖాన్ని, కన్యవలె ఇవ్వగలదు. ఆమె యొక్క అక్కడి కండరాలు ఎన్నేళ్ళైనా బిగుతుగానే వుంటాయి.
సర్షప, వచ, మదనపండ్లు, పిల్లిమలము, ధత్తూర, స్త్రీ జుత్తులను మిశ్రమం చేసి దానితో ధూపం వేస్తే చతుర్థకజ్వరం, డాకినుల దుష్ప్రభావం వల్ల వచ్చే జ్వరం తగ్గిపోతాయి. అర్జున పుష్పాలు, భల్లాటక, విడంగక, బాల, సర్జరస, సౌవీర, సర్షపాలను కలిపి కాల్చి ధూపం వేస్తే పాములు, ఈగలు, పేలు, దోమలు ఆ ఇంటికి చాలా దూరంగా పారిపోతాయి.
నేయి, తేనె, ఉప్పు, పాలను రాగి పాత్రలో కలిపి వుంచి తాంబూలంతో బాటు వేసుకుంటే కంటినొప్పులు తగ్గుతాయి. హరీతకి, వచ, కుష్ఠ, వ్యోశ, హింగు, మనశ్శిలలను నూరి ఆ గుండకు తేనెనీ నేతినీ కలిపి తీసుకుంటే దగ్గు, వెక్కిళ్ళు, ఆయాసం తగ్గుతాయి. పిప్పలి, త్రిఫల చూర్ణాలను అరచేతిలో వేసుకుని తేనెతో కలిపి నాకితే పడిశం, దగ్గు, వెక్కిళ్ళు తగ్గుతాయి.
నీలోత్పల, మధుక, పద్మకలను సమపాళ్ళలో తీసుకొని బియ్యపు కడుగులో పోసి పంచదార వేసి కలుపుకొని త్రాగితే రక్తంలోని దోషాలన్నీ పోతాయి. సొంటి పొడిని తేనెతో పంచదారతో కలిపి తీసుకుంటే గొంతు బాగుపడుతుంది. హరితాల, శంఖ, అరిటాకు, పొడులను బాగా కలబోసి ఒంటికి రాస్తే ఆ మిశ్రమం రోమనాశకంగా పని చేస్తుంది. అలాగే లవణ, హరితాల, తుంబినపండ్లను లాక్షారసంతో కలిపిన ముద్ద కూడ.
సుధా హరితాల, శంఖచూర్ణము, మనశ్శిల, గరుకుప్పలను మేకమూత్రంతో కలిపి ముద్దచేసి ఒంటికి రుద్దితే అవాంఛిత రోమాలిక మొలవవు. ఉన్నవీ రాలిపోతాయి. శంఖ, అమలక పత్ర, ధాటకీ పుష్పాలను రుబ్బి పాలతో కలిపి నోటిలో కొంతసేపు పెట్టుకోవాలి. అలా ఒక వారం పాటు చేస్తే పళ్ళు అందంగా మెరుస్తాయి.
