1 - గరుడ పురాణము - ఆచార కాండము
186 - 187 - ప్రమేహ, మూత్ర నిరోధ, శర్కర, గండమాల భగందరాది రోగాల చికిత్స
ప్రమేహ (చక్కెర, మూత్ర) రోగానికి గుడూచి కషాయంతో తేనెను కలుపగా వచ్చే మందు గొప్ప విరుగుడు. గొహాలిక మూలాలను నువ్వు గింజలతో, పెరుగు వెన్నలతో కలిపి పచనం చేసి తీసుకుంటే నీరు కట్టురోగం పోతుంది. ఇదే మందుకి కాస్త సౌవర్చలాన్ని కలిపి సేవిస్తే వెక్కీళ్ళు తగ్గిపోతాయి. గోరక్ష చూర్ణాన్ని కర్కటి మూలంతో కలిపి ఆ మిశ్రమాన్ని వాస్య కడుగులో వేసుకుని మూడురోజులు రెండుపూటలా తాగితే జల్లివేత, కొన్ని మూత్ర సంబంధిత రోగాలు నశిస్తాయి. జల్లివేతకీ, కామెర్లకీ వేసవిలో సంగ్రహించిన మాలతి వేళ్ళను మేకపాలతో ఉడికించి చేసిన మందుకూడా పనిచేస్తుంది. దీనికి అనుపానంగా పందాధను వాడాలి.
ద్విజయష్టిని గుండ చేసి బియ్యం కడిగిన నీటితో ముద్దగా చేసి పట్టీ వేస్తే కంతి, గండమాల, వరిబీజము తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని రసాంజన, హరీతకి చూర్ణాల మిశ్రమంతో కలిపి శిశ్నానికి పూస్తే దానికి సంబంధించిన సమస్యలు మాయమవుతాయి. కరవీర లేదా పూగఫల మూలాలను రాస్తే ‘ఆ’ శక్తీ ఆసక్తీ రెండూ పెరుగుతాయి.
మొలలకు దంతి, హరిద్ర, చిత్రకాల పలాస్త్రి మంచి విరుగుడు. పిల్లి ఎముకను గుండకొట్టి, త్రిఫలను నీటితో కడిగి ఆ నీటితో ముద్దను చేతి రక్తం కాగే చోట పూస్తే రక్తం ఇక కారదు. స్నుహిజలంతో హరిద్రాన్ని పలుమార్లు శుద్ధిచేసి పూతవేస్తే మొలలు తగ్గుతాయి. అలాగే ఘోషాఫల, సైంధవాలను మెత్తగా నూరి పలాస్త్రిని చేసి రాసినా, ఆవువెన్నెలో త్రికటుకని వండి దానికి మూడింతలు పలాశ, క్షార జలాలను (కడిగిన జలాలను) కలుపుకొని తాగినా *మొలలు నశిస్తాయి.
(*ఈ మొలలనే ప్రస్తుత భాషలో పైల్సు అంటున్నారు)
యవక్షార, సొంటిగుండ, బెల్లాలను సమపాళ్ళలో రోజూ పరగడుపునే తింటే అజీర్ణబాధల రానేధావు. జఠగాగ్నీ పెరుగుతుంది. హగీతకి, సైంధవ, చిత్రక, పిప్పలిలను కలిపి పిండి నూరి వేడి నీటిలో కలుపుకొని తాగితే ఆకలి పెరుగుతుంది. పందిమాంసాన్ని వెన్నతో కలిపి తిన్నా ఆకలీ జీర్ణశక్తి పెరుగుతాయి.
హే వృషభధ్వజా! హస్తికర్ణ పలాశపొడిని వందపళంల పరిమాణంలో తింటే అన్ని రోగాలూ కట్టి వేస్తాయి. ఇదొక సర్వరోగనివారిణి. దీనిని పాలలో కలుపుకొని ఏడురోజులపాటు త్రాగితే జ్ఞాపకశక్తితో బాటు దేహదారుడ్యం కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే పదహారు రోజులపాటు త్రాగితే శరీరం చంద్రకాంతులతో మెరుస్తుంది. వయసు వంద దాటినా ఒంటి సొగసు, నునుపు, మెరుపు తగ్గవు. అలా వెయ్యేళ్ళు జీవించవచ్చు. తేనెతో కలిపి తాగినా, తేనె, వెన్నలతో కలిపి తాగినా మరింత గుణముంటుంది.
ఈ హస్తికర్ణ పలాశకున్న గుణాలు ఏ మందుతో పోల్చినా ఎక్కువే. దీనిని పెరుగుతో ఉన్నవారు వజ్రకాయులై మదన సుందరులై నారీజనాభిరాములవుతారు. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. పుల్లంబలితో కలిపి తింటే దీర్ఘాయువు, నల్లగా మిలలాడే జుత్తు వుంటాయి. త్రిఫలతో కలిపి సేవిస్తే శరీరం దివ్యశరీరం వలె కాంతులీనుతూ వుంటుంది. ముడత పడదు. కనులు తేజోవంతాలవుతాయి. శిరోజాలు శాశ్వతసౌందర్యంతో భాసిస్తాయి. దీనిని కాటుకగా చేసి మేకపాలతో అద్ది కంటికి పెట్టుకుంటే అంధత్వంలాటి తీవ్ర సమస్య కూడా వారంరోజులకే పోతుంది.
భృంగరాజ వేళ్ళను ఎంపిక చేసి, దాచి చంద్రుడు పుష్యనక్షత్రంలో వున్నపుడు వాటిని గుండచేసి పెట్టుకొని సౌవీరతో కలిపి ఒక నెలరోజులపాటు రోజూ తింటే వార్ధక్యలక్షణాలైన ముడతలు, తెల్లవెండ్రుకలు నశిస్తాయి. ఏనుగు వలె బలవంతులవుతారు. వినికిడి ఏ మాత్రమూ తగ్గకుండా అయిదువందల యేళ్ళైనా జీవించగలరు.
