1 - గరుడ పురాణము - ఆచార కాండము
115 - నీతిసారం
వివేకవంతుడు, నీతిజ్ఞుడు అయినవాడు గుణహీన పత్నినీ, దుష్టమిత్రునీ, దురాచారియైన రాజనీ, కుపుత్రునీ, గుణహీనకన్యనీ, కుత్సిత దేశాన్నీ దూరం నుండే పరిత్యజిస్తాడు.
కలియుగంలో ధర్మం మానవ సమాజం నుండి దూరంగా పారిపోతుంది. తపస్సులో స్థిరత వుండదు; మానవుల హృదయాలకు సత్యం దూరమైపోతుంది. మనుష్యులు కపట వ్యవహారమగ్నులై బతికేస్తుంటారు; బ్రాహ్మణులు ఆశపోతులైపోయి ధనదాహంతో మసలుతుంటారు; పురుషులు స్త్రీల అడుగులకు మడుగులొత్తడమే తమ జీవిత పరమార్థంగా భావిస్తారు; స్త్రీలు తమ మనస్సును, బుద్ధిని స్థిరంగా పెట్టుకోలేకపోయినా తెలివితేటల, అందచందాల ఆసరాతో లోకాన్నే ఒక ఆట ఆడిస్తుంటారు.
కాబట్టి ఈ కలికాలంలో నీచ ప్రవృత్తి గల వారే పెద్ద పెద్ద పదవులలోకి వచ్చి దేశాన్నేలుతూ మొత్తం లోకాన్నే భ్రష్టు పట్టించడంతో సుజనులకు సామాన్య జీవనం కూడా మిక్కిలి కష్టసాధ్యమైపోతుంది. పోయినవాళ్ళే ధన్యులనిపిస్తుంది. ఉన్నవాళ్ళు పోయిన వారికి తీపి గురుతులు కాకుండా చేదు జ్ఞాపకాలుగా మిగులుతారు. ఎప్పటికప్పుడే ‘ఆహా! మృతులెంత అదృష్టవంతులో కదా! ఈ అరాచకాన్నీ, ఈ దేశం ముక్కలైపోడాన్ని, ఈ సమాజం సర్వభ్రష్ఠత్వాన్ని, పరాసక్తలైన పత్నులనీ, దురాచారాసక్తులైన పుత్రులనీ చూడకుండానే పోయారు. వారు ఏ లోకంలో వున్నా ఈలోకంలోని మనకంటే సుఖంగానే వుండివుంటారు. అని వృద్ధులంతా తమలో తాము, తమతోతాము సంభాషించుకొంటుంటారు.
కొడుకు చెడిపోతే తల్లిదండ్రులకు దానికి మించిన నరకయాతన లేదు. అలాగే దురాచారిణియైన స్త్రీకి ప్రేమ వుండదు. కాబట్టి ఆ కుటుంబంలో ఒక్కరికీ సుఖమూ వుండదు. దుర్జనుడైన మిత్రుని ఎలాగూ నమ్మలేము కదా! నమ్మకం లేని చోట సుఖమెట్లా వుంటుంది? ఇక రాజ్యంలో దుష్టులంతా కలిసి దుష్టశాసనాలనే ప్రజలపై రుద్దుతూ పోతుంటారు కాబట్టి ప్రభుత్వం చేత ప్రేమింపబడుతున్న ఏ పాతికశాతం మందో సుఖపడతారు. వారే ఈ శాసనకర్తలను నిలబెడతారు కూడ. మిగతావాళ్ళు ఈ దేశంలో పుట్టించినందుకు దేవుణ్ణి తిట్టుకుంటూ ఎలాగో బతికేస్తుంటారు. ఎక్కువమంది ఇతరులపై ఆధారపడి బతికేస్తుంటారు. పరాన్నభుక్కు ఇంద్రుడైనా సరే వాని ఐశ్వర్యం చేజారిపోతుంది.
పరాన్నంచ పరస్వంచ పరశయ్యాః పరస్త్రియః ।
పరవేశ్మని వాసశ్చ శక్రాదపి హరే చ్ఛ్రియం ॥ (ఆచార... 115/5)
ఒక కుండలోని నీటిని ఇంకొక కుండలోని నీటితో కలిపినట్లు అంటురోగం కన్నను వేగంగా పాపం ఒకరినుండి ఒకరికి అంటుకుంటుంది. పాపితో నిత్యం మాట్లాడుతూ, శరీరాన్ని తగులతూ, కలిసి తిరుగుతూ, తోడుగా భోంచేస్తూ, ఒకే ఆసనంపై, శయ్యపై మెలగుతూ ఒకే చోటికి వస్తూ పోతూ మంచివారెవరైనా ఎందరైనా సహజీవనం చేయవలసివస్తే ఆ పాపాత్ముడు మంచివాడు కాడు గానీ ఈ పుణ్యాత్ములతా పూర్తిగా చెడిపోయి దురాత్ములై పోతారు. ఈ రకమైన సహజీవనం కలియుగంలో తప్పనిసరి.
స్త్రియో నశ్యంతిరూపేణ తపః క్రోధేన నశ్యతి ।
గావో దూర ప్రచారేణ శూద్రా న్నేన ద్విజోత్తమః ॥ (ఆచార... 115/7)
అందం వల్ల ఆడది చెడగా, క్రోధం వల్ల తపస్సు తగలబడిపోతుంది. దూర ప్రయాణాల వల్ల గోవులు దూరం కాగా, *శూద్రాన్నంవల్ల ఎంతటి ద్విజోత్తములైనా దిగజారిపోతారు.
(*ఇక్కడ శూద్రాన్నం అంటే ఏ వెనుకబడిన కులంవారో, ఇప్పటి భాషలో, వండి పెట్టిన అన్నం కాదు. అది మూర్ఖపుటాలోచన. మడీ, తడీ, శుచీ శుభ్రతా లేని అన్నమే అప్పటి భాషలో శూద్రాన్నము. గొడ్డుకారము, గుప్పెడు ఉప్పు కలిసినది శూద్రాన్నము. నీచుతో నిండినది శూద్రాన్నము. అలాగే ద్విజులనగా బ్రాహ్మణులు మాత్రమే కాదు. ఇలా ఎందుకు చెప్పవలసివస్తుందంటే ఈ ‘శూద్ర’ శబ్దాన్ని చూపించి పరదేశీయులు, వారి మానసపుత్రులు కపట వ్యూహరచన చేసి ఒక పథకం ప్రకారం గ్రంథాలు వ్రాసి, ఉపన్యాసాలిస్తూ ఇప్పటికే ఈ సమాజాన్ని విడగొట్టేయడంలో చాలావరకు విజయం సాధించారు.)
పిల్లలు, శిష్యులపట్ల బాధ్యతకు బదులుగా అతి గారాబం, స్వార్థం, చోటు చేసుకోవడం వల్ల కలియుగంలో తల్లిదండ్రుల, గురువుల ప్రవర్తన కారణంగా యువతరానికి సరైన దిశా నిర్దేశం లేకపోతుంది. వృద్ధాప్యంలో మానవులకి నడక ఎక్కువవుతుంది. స్త్రీకి సంభోగం లుప్తమవుతుంది. పర్వతాలకు నీటి దెబ్బ తగులుతుంది. బట్టలు ఎక్కువ కాలం ఎండలో వుండడం వల్ల చివికిపోతాయి.
నీచుడైన వ్యక్తి ఇతరులతో గొడవ పడడానికే ప్రయత్నిస్తుంటాడు. మధ్యముడు ఎక్కువగా సంధికోసమే ప్రయత్నిస్తుంటాడు. ఉత్తముడు గొడవపడడు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాడు. మహాపురుషులకు మానమే ధనముకదా! సన్మానమే వుంటే ఇక ధనమెందుకు? మానమూ దర్పమూ నశించినవానికెంత ధనముండి ఏమి లాభము? వాడు జీవించుట మాత్రము దేనికి? మాన, స్వాభిమాన యుగళము లేక ధన, ఆయుర్యుగళ ముండీ లేనట్లే కదా!
నీచ ప్రకృతి గలవాడు ధనాన్నే కోరుకుంటాడు. మధ్యముడు ధన, మానాలు రెండూ కావాలంటాడు. ఉత్తముడు గౌరవాన్ని మాత్రమే అభిలషిస్తాడు.
అధమాధన మిచ్ఛంతి ధనమానౌహి మధ్యమాః ।
ఉత్తమా మానమిచ్ఛంతి మానోహ మహతాం ధనం ॥ (ఆచార... 115/13)
అడవిలోని సింహానికెంత ఆకలేసినా ఇతర జంతువులచే చంపబడిన జంతు లేక నరమాంసాన్ని తినదు. ఉత్తమ వర్ణుడైన వ్యక్తి ధనహీనుడైపోయినా నీచకర్మను చేపట్టడు. వనంలో సింహాన్ని అభిషేకించకపోయినా అది మృగరాజే. సమాజంలో ఉత్తమునికి గౌరవ మర్యాదలూ అలాగే లభిస్తాయి.
నాభిషేకో న సంస్కారః
సింహస్య క్రియతే వనే ।
నిత్య మూర్జిత సత్త్వస్య
స్వయమేవ మృగేంద్రతా ॥
బద్ధకస్తుడైన వర్తకుడు, అహంకారియైన సేవకుడు, కటువుగా మాట్లాడే వేశ్యా తమ వృత్తులలో రాణించలేరు.
దరిద్రుడై వుండీ దాత కావాలనే కోరికా, ధనికుడై యుండీ పీనాసితనమూ, అతి గారాబం చేసి కొడుకుని చెడగొట్టుకోవడమూ, మంచివాడై వుండి దుష్టులను సేవించడమూ, ఇతరులకి కీడు చేస్తూ చనిపోవడమూ మనిషిని దుశ్చరిత్రుని చేసే పంచలక్షణాలు.
దాతా దరిద్రః కృపణో - ర్థయుక్తః పుత్రో - విధేయః కుజనస్యసేవా ।
పరాపకారేషు నరస్య మృత్యుః ప్రజాయతే దుశ్చరితాని పంచ ॥
కాంతా వియోగః స్వజనాప మానంఋణస్యశేషః కుజనస్యసేవా ।
దారిద్ర్య భావాద్విముఖాశ్చ మిత్రా వినాగ్నినా పంచదహంతి తీవ్రాః ॥
(ఆచార... 115/17,18)
అలాగే అగ్ని అవసరం లేకుండానే మనిషిని తీవ్రంగా దహించి పడవేసేవి. అయిదుంటాయి. అవి పత్నీవియోగం, స్వజనులే చేసే అవమానం, మిగిలిపోయిన ఋణం, దుర్జనులను సేవించవలసిరావడం, ధనహీనత వల్ల మిత్రులు పెడమొగమై పోవడం.
మనిషికి అనేక సహస్ర చింతలుంటాయి గానీ వాటిలో నాలుగు మాత్రం తీక్ష్ణమైన కత్తివాదరలాగా మనసును కోసివేస్తుంటాయి. అవి నీచుడిచే అవమానింపబడడం, ఆలి ఆకలి, అనురాగం లేని ఆలు, ముఖ్యమైన ప్రాణాధార కార్యాలకు కలిగే అవరోధాలు.
అనుకూలురైన కొడుకులు, ధనాన్ని సమకూర్చిపెడుతున్న విద్య, ఆరోగ్యం చెడని శరీరం, సత్సంగినీ మనోఽను కూలావశవర్తినీయైన భార్య ఈ పంచ భాగ్యాలూ పురుషుని దుఃఖాలన్నిటినీ దూరం చేస్తాయి.
లేడి, ఏనుగు, కీటకం, తుమ్మెద, చేప - ఈ అయిదూ క్రమంగా శబ్ద, స్పర్శ, రూప, గంధ, రసాలను ప్రమాదకరస్థాయిలో ఇష్టపడి సేవించి పీకలమీదికి తెచ్చుకుంటాయి. ఈ సంగతి తెలిసి కూడా ఈ అయిదింటినీ ఇంద్రియ నిగ్రహం లేకుండా సేవించి సర్వజ్ఞుడనని చెప్పుకునే మనిషి కూడా నష్టపోతుంటాడు.
కురంగమాతంగ పతంగ భృంగ
మీనా హతాః పంచభిరేవ పంచ ।
ఏకః ప్రమాదీ స కథం నఘాత్యో
యః సేవతే పంచభిరేవ పంచ ॥ (ఆచార - 115/ఽ1)
బృహస్పతితో సమానంగా చదువుకున్న బ్రాహ్మణులైనా ఈ అయిదుపనులనూ చేయరాదు. అవి ఏవనగా ధైర్యాన్ని కోల్పోవడం, కటువుగా ధుమధుమలాడుతూ వుండడం, గమ్యం లేకుండా జీవించడం, మలిన వస్త్రాలనే ధరించడం, అనాహూతంగా అంటే ఎవరూ పిలవకపోయినా సంబరాలకూ పెళ్ళిళ్ళకూ పోవడం. ఈ పనులలో ఒక్కటీ చేసినా బ్రాహ్మణునికీ పూజించేవారూ, గౌరవించేవారూ మిగలరు.
ఆయువు, కర్మ, ధనం, విద్య, మృత్యువు ఈ పంచాంశాలూ మనం పుట్టినపుడే నిశ్చితమైపోతాయి. మనం చేయవలసినదల్లా వాటిని మెరుగుపరుచుకొని జీవించడమే. భగవంతుని దయవుంటే మృత్యువు అనాయాసం కావచ్చు. ఆయువు ఆరోగ్యమయం కావచ్చు.
ఆయుః కర్మ చ విత్తం చవిద్యా నిధనమేవచ ।
పంచైతాని వివిచ్యంతే జాయమానస్య దేహినః ॥ (ఆచార - 115/ఽ3)
మబ్బునీడ, దుష్టుని ప్రేమ, పరనారితోడు, యౌవనం, ధనం - ఈ అయిదూ అస్థిధాలు. మనిషికి సంబంధించినవన్నీ, ధర్మకీర్తులు తప్ప, అస్థిరాలే.
అభ్రచ్ఛాయాఖలే ప్రీతిః పరనారీషుసంగతిః ।
పంచైతే హ్యాస్థిరాభావా యౌవనాని ధనానిచ ॥
అస్థిరం జీవితం లోకే అస్థిరం ధనబోపనం ।
అస్థిరం పుత్ర దారాద్యం ధర్మః కీర్తిర్యశః స్థిరం ॥ (ఆచార - 115/ఽ5, ఽ6)
నూరేళ్ళ జీవితం గొప్పనుకుంటాం కానీ ఈ నూరేళ్ళూ దేనికీ చాలదు. ఇందులో సగభాగం నిద్రలోనే గడచిపోతుంది కదా! మిగిలిన దానిలో సగభాగం వ్యాధి, దుఃఖం, వృద్ధాప్యం లచే తినివేయబడుతుంది. ఇక మిగిలిన దానిలోనే బాల్యము, ఇష్టజన వీయోగ దుఃఖము లాంటి వన్నీ వుంటాయి కదా! ఇక జీవిక అనగా కొలుపు. తిండికోసం పనిచేసే సమయం, దానిలోని సాధకబాధకాలు ఆ మిగతా సమయాన్ని మింగివేస్తాయి. కాబట్టి మనకీ ఉన్న సమయంలోనే ధర్మాన్ని దైవకర్మాన్ని ఆచరించాలి. అంతేకాని, దానికి చాలా వేళ వుందిలే’ అనుకోకూడదు. అని ఊరుకోకూడదు. సర్పం వాయువుని మింగేస్తున్నట్టు మృత్యువు ప్రతిక్షణం ఆయువును తినేస్తుంటుంది. అందుకనే మనం వయసు పెరుగు తోందని సరదాపడిపోకుండా ఆయువు తరుగుతోందని జాగ్రత్తపడాలి. యవ్వనవేళ’ లోనే ఆధ్యాత్మికత వైపు మళ్ళాలి.
మనిషికీ పశువుకీ గల ముఖ్యమైన తేడా ఏమిటంటే నడుస్తున్నా, అగివున్నా, మేలు కొనివున్నా, నిద్రలోనైనా లోకహితాన్ని గురించే ఆలోచించడం మనిషి ధర్మం, ఆ ప్రసక్తే లేనిది పశుధర్మం. తన తిండీ తాను తింటూ తన కోసం, తన పరిధిలోని జనాలకోసం మాత్రమే ఆలోచిస్తూ బతికేవాడికీ పశువుకీ పెద్దగా తేడా వుండదు. పశువు కూడా పిల్లలకి
పాలిస్తుందిగా!
గచ్ఛ తస్తిష్ఠతో వాపి జాగ్రతః స్వపతో నచేత్ ।
సర్వసత్త్వ హితార్థాయ పరివ విచేష్టితం ॥
హితమేదో కానిదేదో తెలియకుండానే గొప్ప వాడైపోయి, వేద, పురాణ, శాస్త్ర చర్చలవేళల్లో తర్క - వితర్కాలను రెచ్చిపోయి చేసేస్తూ, తన కడుపు నిండగానే తనివితీరి పోయిందనుకునే వాడీకీ పశువుకీ ఏమీ తేడా వుంది? వీడు వాగుతాడు, అది వాగలేదు. వీనిలో ఏ వైశిష్ట్యమున్నదని వీనిని పశువుకంటే భిన్నుడనుకోవాలి.
పరాక్రమం, విద్య, అర్జలాభములతో బాటు తపస్సు, దానబుద్ధి కూడా గలవాడై ప్రపంచంలో కీర్తి సంపాదించనినాడు ఆ మనిషికీ అతని మాత విసర్జించే మలానికీ, సమాన ప్రయోజనమే వుంటుంది. విజ్ఞానము, పరాక్రమం, యశము, అక్షుణ్ణ సమ్మానయుక్తమునగు జీవితాన్నెవడైతే ఒక ఏడాదిపాటైనను గడపగలడోవాడే మనిషిగా బతికినట్లు విజ్ఞులు గుర్తిస్తారు. వానిది భాగ్యవైభవము, వాని దవంధ్య జీవనము అంటూ కవులు కీర్తిస్తారు.
కాకీవలే బతికీ ఏమి లాభం? హంస వలె గానీ సింహమువలె గానీ జీవించవలె. కాకీ పెంటను తిని బతుకుతుంది. ఎన్నేళ్ళయినా వుంటుంది. ధర్మంగా ధనాన్ని సంపాదించి గురువులనూ, భృత్యులనూ ధనంతో కంటే ప్రేమతో కట్టిపడవేయ గలిగినవానిదే మానవ జీవనమవుతుంది. మనిషికీ ముందు తన పట్ల తనకీ గౌరవ భావముండాలి. ఆత్మాభిమాన ముండాలి గాని అహంకారముండకూడదు. భూతదయ లేనివాడు, మిత్రులకు మంచి పనులలో పెద్ద మనసుచేసుకొని సాయపడనివాడు ఎంత ధనవంతుడైనా సరేవాడు పోయిన నాడు ఊరి ప్రజలు ‘మొన్న ఒక కాకి పోయింది. నేడు ఈయన పోయాడు. ఊరికీ ఒరిగిందీ లేదు తరిగిందీ లేదు’ అనుకుంటే వాడి పుట్టుకలోనే అర్థం లేదు.
యో వాత్సలీహ నగురౌ నచ భృత్యవర్గే
దీనే దయాం నకురుతే నచ మీత్ర కార్యే ।
కిం తస్య జీవిత ఫలేన మనుష్యలోకే
కాకో - పి జీవతి చిరం చ బలించ భుంక్తే ॥
స్వాధీన వృత్తేః సాఫల్యం న పరాధీన వర్తితా ।
యే పరాధీన కర్మాణే జీవంతో - పీ చతే మృతాః ॥
స్వాతంత్ర్యమే స్వర్గలోకం. పరాధీనులై జీవించువారు మృతకల్పులు (ఆచార - 125/35, 37)
ఈ సమాజంలో ఒక క్షణంలో పుట్టి మరొక క్షణానికే కనబడక మాయమైపోయే క్షణభంగురాలు చాలానే వున్నాయి. వాటిని నమ్ముకొనరాదు.
ఆకాశాన్ని కమ్ముకునే మబ్బునీడా, గడ్డిమంటా, నీచుడి సేవాభావం, దారిలో కనిపించే నీరూ,వేశ్యలకు ప్రేమా, దుష్టుని మనసులో పుట్టే ప్రీతీ ఈ అరూ క్షణభంగురాలు. మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకోరాదు. అలాగే మిగతా వాటినీ నమ్మరాదు.
అభ్రచ్ఛాయా తృణా దగ్నిర్నీచసేవా పథోజలం ।
వేశ్యారాగః ఖలే ప్రీతిః షడేతే బుద్బుదోపమాః ॥ (ఆచార - 115 - 39)
బాల్యం తీరిన తరువాత నోరుపెట్టినా ఎవరూ పడరు. గౌరవం నోటిని బట్టి రాదు. బాలురకు మాత్రం రోదనమే బలం.నిర్బలులకు రాజే బలం. మూర్శనకు మౌనం బలం. దొంగకీ అసత్యమే బలం. మనిషి శాస్త్రజ్ఞానాన్ని సంపాదిస్తున్న కొద్దీ వాని బుద్ధి వికసిస్తూ వుంటుంది. మరింత జ్ఞానాన్ని సంపాదించాలనిపిస్తుంది. అలాగే మనిషి జగత్కల్యాణం వైపు మనసును మళ్ళించగానే కొన్ని పనులు చేయడం ద్వారా కీర్తి లభించి, మనసు విశాలమై మరిన్ని మంచిపనులు చేయాలనిపిస్తుంది. అందుకే మంచి పని చేయాలనే ఆలోచన వచ్చిన ఉత్తరక్షణంలోనే దానిని అమలులో పెట్టెయ్యాలి.
యథాయథా హి పురుషః శాస్త్రం సమధి గచ్ఛతి ।
తథా తథా స్యమేధా స్యాద్వి జ్ఞానంచాస్య రోచతే ॥
యథా యథా హీ పురుషః కల్యాణే కురుతే మతిం ।
తథా తథా హీ సర్వత్ర శ్లేష్యతే లోక సుప్రియః ॥ (ఆచార - 115/4ఽ, 43)
లోభం ఎలాగూ మంచిదికాదు. ఒక్కొక్కప్పుడు చిన్నపొరపాట్లు, గట్టి నమ్మకము కూడా ప్రమాదిస్తాయి. కాబట్టి ఈ మూడింటి విషయంలో జాగ్రత్త అవసరం. భయం కూడా అలాటిదే. ఏదైనా ఆపద వస్తుందేమోనని భయపడి జాగ్రత్తగా వుండడం మంచిదేకాని ఆపద వచ్చేశాక మాత్రం భయాన్ని పూర్తిగా పరిత్యజించి ఆపదను ధైర్యంగా ఎదుర్కోవాలి.
ఋణశేషం అగ్నిశేషం వ్యాధిశేషం ఉంచిన కొద్దీ ఋణాగ్ని వ్యాధులు పెరిగిపోతునే వుంటాయి. కాబట్టి వాటిని పూర్తిగా తుడిచిపెట్టాలి.
ఋణశేషం చాగ్నిశేషం వ్యాధిశేషం తథైవచ ।
పునః పునః ప్రవర్ధంతే తస్మాచ్ఛేషం న కారయేత్ ॥ (ఆచార - 115/46)
మనతో కలిసి వుండి మిత్రుని వలె నటిస్తూ మన పరోక్షంలో మన పనులన్నిటినీ తన స్వార్థం కోసం చెడగొట్టేవానిని అసలు విషయం తెలియగానే తన్ని తగిలెయ్యాలి. మాయావియైన శత్రునివలె.
పరోక్షే కార్య హంతారం ప్రత్యక్షే ప్రియవాదినం ।
వర్జయేత్ తాదృశం మీత్రం మాయామయ మరింతథా ॥ (ఆచార - 115/48)
సుందరమైన స్వచ్ఛమైన నీటిలో మాలిన్యాన్ని పోస్తే తాగడానికి పనికిరాకుండా పోతుంది. అలాగే దుష్టునితోడి సాంగత్యం వల్ల మంచివాడు చెడిపోతాడు. {అటునుంచి ఇటుకాదు)
దుర్జనస్యహి సంగేన సుజనోఽపీ వినశ్యతి ।
ప్రసన్నమపి పానీయం కర్దమైః కలుషీకృతం ॥
ధనాన్ని బ్రాహ్మణునికీ దానం చేస్తేనే ఆ ధనం సద్వినియోగ మయిందనుకోవాలి. అంతేగాక సాధ్యమయినంతగా బ్రాహ్మణులను సర్వవిధాలా సన్మానించుకోవాలి. బ్రాహ్మణులు తినగా మిగిలినదానిని తినుటయే ఉత్తమ భోజనకర్మ అనబడుతుంది. పాపము చేయనివాడే బుద్ధిమంతుడు. హితము చెప్పి చేయువాడే మిత్రుడు. దంభరహితంగా, అనగా డాబు డప్పాలతో గొప్పలు చెప్పుకోకుండా ఆచరించే ధర్మమే వాస్తవిక ధర్మాచరణం.
తద్భుజ్యతేయ ద్ద్విజ భుక్తశేషం
సబుద్ధిమాస్ యోన కరోతిపాపం ।
తత్ సౌహృదం యత్క్రియతే పరోక్ష
దంఛైర్వినాయః క్రియతే స ధర్మః ॥
వృద్ధజనులు లేని సభ సభేకాదు. ధర్మోపదేశం చేయని వృద్ధుని వృద్ధునిగా పరిగణిం చరు.సత్యము నిముడ్చుకోని ధర్మము ధర్మమూ కాదు, కపటంతో నిండిన సత్యం సత్యమూ కాదు. కపటసత్యమనగా ఒక మనిషి చేసిన మంచిపనిని మన వాదనా పటిమతో కపట వ్యూహరచనాశక్తితో చెడ్డపనిగా నిరూపించి మనము లాభము పొందునట్టిది. ఇక్కడ మనం చెప్తున్నది సత్యమేకాని వక్రించి చెప్తాం. (ఉదాహరణకీ పరశురాముడు కర్ణుని శపించడం సత్యమే. కాని కర్ణుడు బ్రాహ్మణుడు కాడు కాబట్టి శపించేశాడని చాలనుంది అనేస్తున్నారు. పరశురాముడు బ్రాహ్మణులకే విద్య చెప్తానని బోర్డు పెట్టుకొని కూర్చొనలేదు. భీష్మునికి పరశురాముడే గురుదేవుడు. ఆయన బ్రాహ్మణుడు కాదు కదా! పరశురాముడు కర్ణుని, అబద్దమాడి మోసం చేసి విద్యను సంగ్రహించాడని కోపించి శపించాడు. కర్ణుడు శపింప బడడంసత్యమే. ఆతడు ఇతరులతో చెప్పుకున్నది మాత్రం కపటసత్యం. ఏకలవ్యుని విషయంలో కూడా ఇలాంటి కపట సత్యాలెన్నో జనశ్రుతిలో వున్నాయి. విశ్వనాథ పావని శాస్త్రిగారి ‘ఆచార్య దాక్షిణ్యం’ అనే నాటకం చదివితే ఆ కపట సత్యాలన్నీ కాలి బూడిదై పోశాయి.
నసాసభాయత్ర న సంతివృద్దాః
వృద్ధా నతే యేన వదంతి ధర్మం ।
ధర్మః సనోయత్ర న సత్యమస్తి
నైతత్ సత్యం యచ్ఛలే నానువిద్దం ॥ (ఆచార - 115/5ఽ)
మనుష్యులలో బ్రాహ్మణులు (అంటే కులం కాదు వర్ణధర్మం మాత్రమే) తేజస్సులో ఆదిత్యుడు, శరీరంలో శిరస్సు, వ్రతాలలో సత్యవ్రతం శ్రేష్ఠతమాలు.
మనస్సుకి ప్రసన్నతనిచ్చేదే మంగళకరం, శుభం. ఇతరుల సేవకై సమర్పింపబడేదే నిజమైన జీవనం. ధనం అందరికీ ఉపయోగపడినపుడే దానికి సార్థక్యముంటుంది. సమర భూమీలో శత్రువుకెదురుగా నిలబడిచేసే గర్జనయే వాస్తవిక గర్జన.మదోన్మత్తత లేని స్త్రీయే శ్రేష్ఠవనిత. జితేంద్రియుడే నిజమైన పురుషుడు.
ఎంత గొప్ప రాజ్యైశ్వరాలైనా బ్రాహ్మణుని శాపంతగిలితే నశించిపోతాయి. ఎంత గొప్ప బ్రాహ్మణ తేజమైనా పాపాచార భూయిష్టమైతే నశించిపోతుంది. అశిక్షిత గ్రామంలో
నివసించే బ్రాహ్మణుని సదాచారం సమాప్తమైపోతుంది. అలాగే దుష్ట స్త్రీల వంశం మిగలకుండా షోతుంది.
సంగ్రహానికి క్షయమూ, ఉత్కర్షకి పతనమూ, సంయోగానికి వియోగమూ, జీవనా నికి మృత్యువూ అంతాన్ని తెస్తాయి. మరణమృదంగాన్ని వాయిస్తాయి.
రాజులేని రాజ్యంలోగాని అనేక రాజులున్న రాజ్యంలోగాని నివాసముండకూడదు. అలాగే ఆడ పెత్తనం, బాలురకే అధికారం వున్న అవాసాలూ త్యాజ్యాలే.
పీతారక్షతి కౌమారే
భర్తా రక్షతి యౌవనే ।
పుత్రస్తు స్థవిరే కాలే
నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి ॥ * (ఆచార - 115/63)
(*ఈ శ్లోకానికీ దుష్ట వ్యాఖ్యానాలెక్కువైపోయాయిగానీ, పురాణకారుని ఉద్దేశ్యం కుసుమకోమలాంగియగు స్త్రీకి రక్షణ అవసరమని మాత్రమే.)
డబ్బే ప్రాణమైన వానికి మిత్రులు, బంధువులు మిగలరు. స్త్రీ వ్యసనం కానీ, ఇతర వాంఛలు కానీ వీపరీతంగా నున్న వానికి సిగ్గూ, భయమూ వుండవు. చింతామగ్నునికీ అనగా నిత్యం బాధలూ వాటి ఆలోచనలే గల వానికి సుఖమూ, నిద్రా రావు. ఎంత జిన్నా ఆకలి తీరని వానికి బలం, తేజం నిలబడవు.
అర్థాతురాణాం న సుహృన్న బంధుః
కామాతురాణాం న భయం న లజ్జా ।
చింతాతురాణాం న సుఖం న నిద్రా
క్షుధాతురాణాం న బలం న తేజః ॥ (ఆచార - 115/67)
తన బాధలూ, వాటికి సంబంధించిన ఆలోచనలూ ఉన్నవానికే కాదు దుష్టునికీ ఇతరుల ధనాన్ని అపహరించడంలో విపరీతాసక్తి గలవానికీ కూడా నిద్ర పట్టదు. పరకాంతా సక్తునికీ నిద్రపట్టదు. దోషికీ నిద్రపట్టదు. ఋణమూ, రోగమూ లేనివాడూ, ఆడదాని జోలికే పోనివాడూ మాత్రమే నిద్రనొక భోగంలాగ అనుభవించ గలరు.
కమలానికి జలంలో నిలబడివున్నంత కాలమే వరుణ, సూర్యదేవుల స్నేహం లభిస్తుంది. పడిపోతే ఏమీలేదు. ఎవరూ లేరు. మనిషైనా పదవిలో నున్నప్పుడే అంతా
మిత్రత్వాన్ని పాటిస్తారు.దిగిపోయిన తరువాత ఎవరూ పట్టించుకోరు. ఆ అయ్యగారి సౌభాగ్యాలు అధికారాంతంలో చూద్దామన్నా మీగలవు. పైగా పదవీలో నున్నపుడు ఆయన చేసిన పనులకీ ఇప్పుడు శత్రువులు బయట పడుతుంటారు. కేశములూ, దంతములూ, గోళ్ళూ శరీరంపై నున్నంతకాలమే గదా, వాటికి విలువ!
స్థానా స్థితిని పూజ్యంతే పూజ్యంతే చ పదేస్థితాః ।
స్థానభ్రష్టా న పూజ్యంతే కేశా దంతా నఖా నరాః ॥ (ఆచార - 115/73)
తమ తమ నెలవులు దప్పిన తమ వారే శత్రులగుట తథ్యము కదా!
వర్ణం, వంశం, దేశం, స్నేహం, భోజనం వాటంతటవే తెలుస్తాయి. ఎవరూ ఎవరినీ అడగనక్కరలేదు. ఆచారాన్ని చూసి వర్ణ, వంశాలనూ, భాష, భాషణల తీరును బట్టి దేశాన్ని, మనిషి మరో మనిషిని చూడగానే పలకరించే పద్ధతిని బట్టి వారి మధ్య గల స్నేహాన్ని, శరీరపుష్టిని గమనించి భోజనాన్నీ పోల్చివేయవచ్చు. ఆచారాదులే చెప్తాయి.
సముద్రంలో వాన, బాగా కడుపు నిండిన వానిని భోజనం చేయమంటూ పట్టుదల పట్టడం, అఖిల ఐశ్వర్యవంతునికీ దానమిచ్చుట, నీచునికి చేసే ఉపకారాలు వ్యర్థము.
దూరస్థో ఽపి సమీపస్థో
యోయస్య హృదయేస్థితః ।
హృదయా దపి నిష్కాంత
సమీప స్థోఽపి దూరతః ॥ (ఆచార - 115/76)
గుండెలో గూడు కట్టుకొని కూర్చున్న ప్రాణి ఎంతదూరంలో వున్నా మనకు దగ్గరలో నున్నట్లే అనిపిస్తుంటుంది. హృదయంలోంచి తొలగించబడినవారు కాని హృదయం దాకా రాలేనివారు గాని పొరుగింట్లోనే వున్నా పరాయిదేశంలో నున్నట్లే లెక్క
ముఖంలో వికృతి, గొంతుపూడుకుపోత, దైన్యభావం, చెమటతో తడిసి ముద్దెన శరీరం, అత్యంత భయంకర చిహ్నాలు. అవి సామాన్యమానవుని ఆకృతి పై వాని మృత్యు సమయంలో కనిపిస్తాయి. కాని, బిచ్చమెత్తుకొని బతికేవాని ఆకారం నిరంతరం ఇలాగే వుంటుంది.
మనిషి కుంచించుకుపోవడం, క్రీమీదోషంతో సదా పీడితుడై వుండడం, వాయు వికారగ్రస్తుడై వుండడం, రాజ్యం లేదా గృహం నుండీ తగిలేయబడడం, పర్వత శిఖరంపై
నివసించడం ఇవన్నీ కూడా ముష్టి వానిగా బతకడం కన్నా మంచివే. యాచననే వృత్తిగా స్వీకరించి బతికేయాలనుకోవడం అనుచితం.
జగత్పతిర్హ యాచీత్వా
విష్ణుర్వామనతాం యతః ।
కోన్యోఽధిక తరస్తస్య
యోర్థ యాతి న లాఘవం ॥ (ఆచార - 115/71)
జగత్పతీ, కొండంత దేవుడూనైన శ్రీ మహావిష్ణువే బలిచక్రవర్తిని యాచించడానికీ వెళ్ళినప్పుడు అంతటి ఐశ్వర్యవంతుడూ కుంచించుకుపోయి వామనుడై పోయాడంటే ఇక కడమ వారిని గూర్చి చెప్పాలా?
ఇక విద్య యొక్క గొప్పదనాన్ని గూర్చి వినండి. *
విద్యానామ కురూపరూప మధికం విద్యాతి గుప్తం ధనం
విద్యాసాధుకరీ జనప్రియకరీ విద్యా గురూణాం గురుః ।
విద్యా బంధుజనార్తి నాశనకరీ విద్యా పరం దైవతం
విద్యా రాజసుపూజితాహి మనుజో విద్యా విహీనఃపశుః ॥ (ఆచార - 115/81)
(*తెలుగు వారు భర్తృహరి సుభాషితాలద్వారా దీనిని చిన్నప్పుడే వినేశారు. ఆ భర్భహరికే మూలం గరుడపురాణం)
కురూపికీ కూడా విద్య వుంటే కళ, కాంతి వస్తాయి. రూపాన్నంటే తల్లిదండ్రులివ్వలేక పోవచ్చుగానీ అవకాశముండీ పిల్లలకు మంచి చదువు చెప్పించని వారు ఆ పిల్లలకు శత్రువులకిందే లెక్క వీర్యరూపాన్నిస్తుంది. దాచుకున్న సొమ్ములాగా అక్కరకొస్తుంది. ఎవరి చేతిలోనైతే తాను వుంటుందో వానిని సాధు స్వభావిగా మారుస్తుంది. లోకులందరికీ ప్రీతిపాత్రునిగా చేస్తుంది. గురువులకు కూడా గురువైనది విద్య. అది విద్యావంతుని యొక్క బంధు బాంధవుల కష్టాలను కూడా దూరం చేసి కాపాడగలడు. విద్యయే పరమ దేవత. రాజుల చేత కూడ సామాన్యుడైన విద్యావంతుడు పూజింపబడతాడు. విద్యగల వాడే మనిషి. అది లేనినాడు పశువు. ఎట్టి ద్రవ్యమైనను దొంగలనుండీ సంపూర్ణంగా సురక్షితమనలేము. కాని, విద్య దొంగలచేతికి దొరకని దైవం, ద్రవ్యం. (అనంతర కాలంలో తెలుగులో వెలసిన విద్యా పద్యాలకు - ముఖ్యంగా విద్యలేనివాడు వింతపశువు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము, విద్య నెఱుంగని వాడు మర్త్యుడే - వంటి సుప్రసిద్ధ భావాలకు గరుడపురాణమే మూలము)
