1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

177 - నేత్రాది ఇతరాంగాలకు కరవాలాది దెబ్బలకు చికిత్స

శోభాంజన పత్ర రసాన్ని తేనెతో కలిపి తయారుచేసిన నేత్ర బిందువులు అన్ని కంటి జబ్బులనూ మాన్పుతాయి.

ఎనభై నువ్వు పువ్వులనూ, జాతిపూలనూ ఉపనింబ, అమల, సొంటి, పిప్పలి, తండులీయకాలతో కలిపి ముద్దచేసి దానిని నీడలో ఆరబెట్టి బియ్యపు కడుగుతో తడిపి మరల ఆరబెట్టి కాటుక వలె కంటిలో పెట్టుకుంటే కంటి సమస్యలన్నీ, ముఖ్యంగా చీకట్లు కమ్ముట కుదురుతాయి.

ఒకవంతు గడ్డ ఉప్పు, రెండు వంతులు మనశ్శిల, నాలుగు వంతులు శంఖలను కలిపి ముద్దచేసి నీడలో ఆరబెట్టి మాత్రలుగా చేసి దాచి, కాటుక వలె కంటీకీ పెడితే నేత్ర తిమిర, పటల, పింజట రుగ్మతలు పోతాయి.

విభీటక, శంఖనాభి, మనశ్శిల, వేపాకులు, మిరియాలు కలిపి బాగా పిండి చేసి మేకమూత్రంలో వేసి ముద్ద చేసి కంటికి రాస్తే రెప్పల సమస్యలు, తిమిర, రేచీకటి, 1కొలకు బాధలు పోతాయి. త్రికటు, త్రిఫల, కరంజఫల, గెడ్డ ఉప్పు, పింజట, పుసులు, రెండు రకాల 2రజని - హరిద్ర + దారుహరిద్ర, గజనిలను భృంగరాజ రసంతో కలిపి బాగా నూరి కాటుకలా తయారుచేఇస పెడితే కంటి బాధలు నశిస్తాయి. ఆటరూషక వేళ్ళను బాగా నూరి పుల్లగంజితో కలిపి కంటి చుట్టూ దిట్టంగా రాస్తే అన్ని కంటినొప్పులూ పోతాయి. అలాగే శతద్రు, బదరిమూల కషాయం కూడా త్రాగినా కంటి నొప్పులు కదిలిపోతాయి. అపామార్గ వేరుని ఆవనూనెతో కలిపీ గుండ చేసి తడిపి ముద్దజేసి దానిని రాగి పాత్రలో వేసి ఉప్పు గెడ్డనూ, పాలనూ, పుల్లం బలినీ కలిపి వేడిచేసి చల్లార్చి కాటుకగా మార్చి వాడితే పింజట రోగం పోతుంది. కాటుకను పెడుతూ ఈ క్రింది మంత్రాన్ని చదివితే ఆద్యాలను పేరుగల నవదుర్గలు వశమవుతారు.

(1.పుసులు)

(2.హరిద్ర, దారుహరిద్ర)

ఓం దద్రుసర క్రోం హీం ఠాః ఠాః దద్రు

సర హ్రీం హ్రీం ఓం ఉంఉం సర క్రీం క్రీం ఠాఃఠాః

నేత్ర తిమిర రోగం బిల్వకాన్ని నీలివేరునీ కలిపి తయారుచేసిన మందుని కంటి కంటిస్తే పటాపంచలైపోతుంది. వత్తినిగాని పుల్లనిగాని పిప్పలి, తగర, హరిద్ర, ఆమలక, వచ, ఖదిరలను బాగా నూరి తయారుచేసి కాల్చి ఆ బూడిదను కాటుకలాగ పెడితే కంటి కురుపులు నశిస్తాయి. వాత జన్యములైన కంటి కురుపులకు ఎరండ (తెల్ల) ఆకులనూ వేళ్ళనూ కలిపి నూరి మేకపాలలో వేసి ముద్ద చేసి రాయడం చక్కని విరుగుడు. కంటి కురుపులకు మరొక మందు చందనం, ఉప్పుగడ్డ, వృద్ధపలాశ, హరీతకి, పాటలపుష్పాలు, నీలి, చక్రికాలను పొడిచేసి కాటుకగా రాయడం.

ఇక పచ్చకామెర్ల విషయానికొస్తే, ఘోశపండు వాసన చూస్తే, రసం తాగితే, కామెర్లు తగ్గుతాయి. వెండి కడ్డీని శరీరమంతటా ప్రయోగిస్తూ, రాగి, బంగారం పొడిని ముద్దచేసి ఒంటికి పట్టించడం ద్వారా కామెర్లని అదుపుచేయవచ్చును. దాడిమ పుష్పరసం, దూర, అలక్తక, హరీతకిలను పొడుంగా దంచి ముక్కుతో పీల్చితే అక్కడి రక్తపు పొక్కులు, వాతరక్తదోషాలు నశిస్తాయి.

హే వృషభధ్వజా, *నీలలోహితా! జింగిని వేళ్ళను నూరి జింగిని రసంతోనే ముద్దగా చేసి ఎండబెట్టి నస్యంగా వాడినా ముక్కులోని రక్తపు పొక్కులు పోతాయి.

(*ఇది శివుని విష్ణువు సంబోధించిన తీరు.)

పెదవులపై పొక్కులు లేచినా, పెదవుల చివరలు చీలినట్లయినా ఆవునేతినీ, సర్జరస, ధన్యాక, ఉప్పుగడ్డలనూ, ధత్తూరక, గైరికలతో కలిపి ఉడికించి చల్లార్చి గుండజేసి దానికి అన్నమునూ నూనెనూ కలిపి ముద్దగా చేసి అముద్దను పెదవులపై రాస్తే ఆ బాధలు నశిస్తాయి. నోటిపూతా, పొక్కులూ జతీపర్ణాలను బాగా నమిలి కొంతసేపు అలాగే నోట్లో వుంచుకుంటే నశిస్తాయి. దంతాలు కదిలిపోతుంటే కోశ విత్తనాలను కొంతసేపు నమిలి మ్రింగితే పంటి కదలికలు ఆగుతాయి.

నోటి దుర్వాసన ముష్టక, కుష్ట, ఎలాయష్టిక, బాలక, ధన్యాకలను తేనెతో కలిపి నమిలితే నశిస్తుంది. సొంటిని నమిలితే కఫరసాలు స్రవిస్తాయి. మాతులుంగ ఆకులు, ఎలా, యష్టి, మధు, పిప్పలి, జాతి చెట్టు ఆకులు - వీటన్నిటినీ కలిపి నమిలినా ఆరోగ్య కరమైన కఫస్రవంతులు ఊరతాయి. శెపాలిక మొలకలను నమిలితే కంతి పోతుంది. గుంజవేరు తినడం వల్ల దంతాలలో నున్న క్రిములు నశిస్తాయి. కాక జంఘ, స్నుహి, నీలిలను తేనెతో కలిపి కషాయం చేసుకొని తాగితే మొత్తం నోటిలో పుట్టిన లేదా చేరిన క్రిములన్నీ నశిస్తాయి. అలాగే పాలలో కర్కటను కలిపి తేర్చి ఆ ముద్దకు నేతిని జోడించి పండ్లు తోమినా, కాళ్ళు రుద్దినా రెండూ బలపడతాయి. శిరీష విత్తనాలను వాటికి నాలుగింతలు పరిణామంలో గల హరిద్రంతో కలిపి ఉడికించి ఒక నస్యాన్ని తయారుచేసి పీలిస్తే తలనొప్పి, గొంతు బాధ శీఘ్రంగా తగ్గుతాయి. నిజానికి, కర్కటపాద అనే మందుతో పళ్ళను తడిమినా చాలు. జ్యోతిష్మతి పండ్లను నీటిలో నానబెట్టి అలా ఇరవై ఒక్క రోజులుంచిన పిమ్మట వాటిని తెల్ల అభయ ముద్దతో కలిపి ముద్దజేసి దానితో దంతాలను తోమితే వాటి పైనున్న నల్లటి మచ్చలు, మరకలు పోయి ధగధగలాడతాయి. లోధ్ర, కుంకుమ, మంజిష్ఠ, లోహ కాలేయక, యవ, బియ్యపు గింజ, యష్టి మధులను కలిపి గుండజేసి నీరు కలిపి మృదువుగా ముఖానికి రాస్తే అది మిలమిలలు తళతళలతో వర్ధిల్లుతుంది. ఇది స్త్రీలకు బాగా పనిచేస్తుంది. ఒక్కొక్క కర్షక (ఒక కొలత) రక్తచందన మంజిష్ఠ, లక్కగానీ యష్టి మధు, కుంకుమలను గాని తీసుకొని దానినొక ప్రస్థ (బరువుకొలత) తైలం, రెండు ప్రస్థల మేకపాలు గల పాత్రలో వేసి బాగా ఉడికించి తీసి చల్లార్చి రోజుకొక మారుగా వారం రోజుల పాటు రాస్తే, ఎనిమిదవ రోజు కల్లా ముఖం అద్భుతకాంతితో ప్రకాశిస్తుంది.

సౌంటి, పిప్పలిరుండ, గుడూచి, కంటకారికలను నీటిలో పోసి మరగించి త్రాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. వాతదోషం వల్ల వచ్చే నొప్పులు తగ్గుతాయి. కరుజ కర్కట, ఉశీర, బృహతి, కటురోహిణి, గోక్షురాలు కలిపి కషాయం చేసుకొని తాగితే తలత్రిప్పు, మూర్ఛ, మంట, పిత్తజ్వరం, అతి నీరసం తగ్గిపోతాయి.

పిప్పలిపొడిని పాలు, నెయ్యి, తేనెలతో కలిపి కషాయం తీసి తాగితే గుండెదడ, దగ్గు, తీవ్ర మధ్యంతర జ్వరాలు (తగ్గిపోయి మరల వచ్చి మరల తగ్గి మరలి వచ్చే జ్వరాలు) తగ్గుతాయి. ఈ జ్వరాలను విషమజ్వరాలని కూడా అంటారు.

ఆవు పేడనుండి నీటిని వేరుచేసి కాకజంఘరసంతో కలిపి పాలు పోసుకొని తాగినా విషమజ్వరం మరి రాదు. సొంటిని పాలలో వేసి మరగించి చల్లార్చి త్రాగినా విషమ జ్వరం కుదురుతుంది.

యష్టిమధు, ముస్త, ఉప్పుగడ్డ, బృహత్ఫలాలను మెత్తగా నూరి నస్యం వలె చేసి పీల్చితే కమ్మగా నిద్రపడుతుంది. దానిని మిరియాలు, తేనెలతో కలిపి తింటే మరింత బాగా పనిచేస్తుంది. కాకజంఘ వేరుని తలచుట్టూ కట్టుకొని పడుకుంటే నిద్రపడుతుంది. నూనెతో పుల్లంబలిని తయారుచేసి సర్జరసాన్ని కూడా కలిపి చల్లని నీటిలో వేసి శరీరానికి పూస్తే వేడి, మంట, రక్తంలో మలినాలు, వీటికి కారణమైన జ్వరం నశిస్తాయి. శైలి, శైవల, అగ్నిమంత, సొంటి, పాషాణ భేదక శోభాంజనాలను గాని గోక్షుర, వరుణ, ఛన్న, శోభాంజనపు వేగులను హింగు, యవక్షారాలతో గాని కషాయం చేసుకొని తాగితే పిత్త, వాయువులు దారిలోకొస్తాయి. కషాయం ఎప్పుడైనా ఒక అర్ధ కర్ష ప్రమాణంలోనే తీసుకోవాలి. రోగి వయసును బట్టి మోతాదును మార్చాలి.

 పిప్పలి, పిప్పలి వేరు, భల్లాటకాలను నీటిలో మరగించి తాగితే అజీర్ణము వల్ల వచ్చే మూర్ఛరోగాలు నశిస్తాయి.

ఊగుస్తంభ (తొడల కదలిక ఆగిపోవుట) రోగానికి అశ్వగంధ, మూలకములను చీమలపుట్ట పై నుంచి తెచ్చిన మన్నుతో కలిపి పట్టీ వేస్తే మంచి ఫలితముంటుంది. అనగా తొడలు మరల కదులుతాయి. అలాగే సంఘాతవాతం కూడా బృహతీక వేరుని గుండ జేసి నీటిలో కలుపుకొని తాగితే పోతుంది. తుఫాను వల్ల చెట్టు కూలిపోయినట్టు ఆర్ద్రక వేరు, తగరలను కలిపి మజ్జిగతో తాగితే జింజినీ వాతమనే మొండిజబ్బు కూలిపోతుంది.

అస్థి సంహారమనే ఓషధిని రోజూ అన్నంలో కలుపుకొని తిన్నా, అంబలి లేదా జావతో కలిపి తాగినా వాయుదోషం, ఎముకల పగుళ్ళు నశిస్తాయి. పాదాలు పీకితే, నొప్పి పెడితే వాటికి వేచిన ధాన్యాన్ని గుండజేసి మేకపాలతో నేతితో రంగరించి పూస్తే శాంతి లభిస్తుంది. తేనె, నెయ్యి, ఉప్పుగడ్డ, సిక్థ (అన్నం), బెల్లం, గైరిక, గుగ్గిలం, సర్జరసాలను ముద్దజేసి ఛాతీకి పూస్తే ఊపిరితిత్తులకు సోకిన రోగాలు నశిస్తాయి. అరి పాదాల బాధలు ఆవనూనెను రాసి పొగరాని నిప్పుపై వెచ్చగా కాచితే ఉపశమిస్తాయి. శరీరంపై పగుళ్ళు, కాలిన గాయాలు నేతిని సర్జరసం, జీరక, హరీతకి ముద్దకు కలిపి పూస్తే తగ్గిపోతాయి. వేడినూనెను యవ భస్మంతో కలిపి పూసినా ఆ బాధలు తగ్గుతాయి.

బాగా వేచి పొడిచేసిన నువ్వులను గేదె వెన్నతోనూ భల్లాటంతోనూ నస్యంగా చేసి పీలిస్తే గుండెలో కలిగిన అడ్డంకులు తొలగుతాయి. ఇదే మిశ్రమాన్ని పొక్కులకీ, కురుపులకీ పూసినా మంచి గుణం గోచరిస్తుంది. కత్తి వంటి వాటివల్ల కలిగిన గాయాలకు కర్పూరాన్ని ఆవుపాలనుండి తీసిన వెన్ననీ పెట్టి శుభ్రమైన తెల్లని గుడ్డతో కట్టు కడితే నొప్పి వెంటనే ఆగిపోతుంది. గాయం చీము పట్టదు. వాసన వుండదు. కత్తికోతలు శరపుంఖ, లజ్జాలుక, పాఠవేళ్ళనూ ఆకులనూ (లేదా బెరడులనూ) పిండిగా చేసి నీటితో తడిపి రాస్తే వెంటనే మానిపోతాయి. అపామార్గ వేరుని నీటిలో నూనెలో మరగించి ఆ మిశ్రమంలో కలిపిన గుడ్డతో కాపడం పెడితే ఏ దెబ్బ వల్ల కలిగిన నొప్పియైనా మాయమవుతుంది.

అభయ మూలికను ఉప్పుగడ్డ, సౌంటిలతో కలిపి నూరి నీటితో కలిపి తాగితే అజీర్ణము నుండి విముక్తి లభిస్తుంది.

ఒక విచిత్రం వింటావా విశాలక్షీ నాథా! వేషవేళ్ళను నడుముకి చుట్టుకుంటే కంటినొప్పులు, ఎంత తీవ్రంగా బాధిస్తున్నా, వెంటనే పొతాయి.

 శణ(శణ = జనుపనార, గోగునార) వేరుని తాంబూలంలో కలుపుకొని తింటే మూత్రసంబంధి రోగాలూ, వీర్యము కారుటలో ఇబ్బందులూ తొలగుతాయి. బియ్యం, ఆవవేరు (తెల్లఆవ) మాతులుంగ గింజలు తీసుకొని ఆవిరితో ఉడికించి మధ్యలో హరిద్రం వేసి తీసి చల్లార్చి శరీరానికి పూసుకుంటూ వుంటే వారం రోజులలోనే శరీరానికి నునుపు, కాంతి వచ్చిచేరుతాయి.

శ్వేత అపరాజిత, వేప ఆకుల రసాన్ని గాని గురిగింజ రసాన్ని (వేరు) గాని నస్యంలా వాడితే డాకిని, బ్రహ్మరాక్షసి, భూతప్రేతాది దురదృష్టాలు పట్టవు.

ఎలుగుబంటి పాలను రోహిత చేప మాంసంతో నూనెలో పోసి మరగించి ఒంటికి రాసుకుంటే అన్ని జబ్బులూ తగ్గుతాయి. ఆ నూనెతోనే అభ్యంగన స్నానం చేస్తే మరీ మంచిది. చందన జలం నుండి నస్యాన్ని చేసి పీలిస్తే రాలిపోయిన రోమాలు మరల మొలుస్తాయి. లాంగలిక గోళాన్ని చేతిలో పట్టుకుని దానితో శరీరమంతటినీ రుద్దితే వరిబీజం (వృషణాలవాపు) తగ్గిపోతుంది. క్రూర విషసర్పాలను పుట్టలో వుండగానే నెమలి రక్తమును పోయుట ద్వారా చంపవచ్చు.

పుష్య నక్షత్ర మండలంలో చంద్రుడు ప్రవేశించినపుడొక సుదర్శన మూలాన్ని తెచ్చి ఇంటి మధ్యలో ఉంచుకుంటే ఆ గృహానికి పాములు రావు. పిల్లి మాంసాన్ని మల మూత్రాలను హరితాలనూ మేక పాలలో ఉడికించి ఒక ఎలుకను పట్టుకొని దాని ఒంటికి పూర్తిగా పట్టించి వదిలేస్తే అచోట నున్న ఎలుకలన్నీ పారిపోతాయి. త్రిఫల, అర్జునపుష్ప, భల్లాటక, శిరీషక, లాక్షసర్జరస, విడంగ, గుగ్గుల ముద్దను బాగాకాల్చి ఆ పొగలను ఇంటినిండా వ్యాపింపజేస్తే అన్ని ఈగలూ, దోమలూ నశిస్తాయి.