1 - గరుడ పురాణము - ఆచార కాండము
167 - వాత రక్త - నిదానం
సుశ్రుతా! ఆరోగ్యాన్ని చెడగొట్టే తిండిని తినేవారు, క్రోధులు, పగలు నిద్రిస్తూ రాత్రి జాగారం చేసేవారు, సుకుమారులమని చెప్పుకుంటూ అతి ఎక్కువ ఆహారాన్ని స్వీకరించేవారు శ్రమను త్యజించి స్థూలకాయులయ్యేవారు, సుఖజీవనులు తమ చేతులారా తామే రక్తాన్ని కుపితం, కలుషితం చేసుకుంటారు. వీరిలో ముందుగా వాయువు చెడుతుంది. దీన్ని వాతం ప్రకోపించడం అంటారు. వాత దోషం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన వాయువు వృద్ధి చెంది ముందు రకాన్నీ, తరువాత మాంసాన్నీ, పిమ్మట ధాతువులనీ పాడు చేస్తుంది. సంపూర్ణ శరీరంలో వ్యాపించి మోకాళ్ళు, జంఘలు, తొడలు, కటి, భుజాలు, కాలుసేతులు, సంథి స్థానాల్లో దురదలనూ, కోరికలనూ, సూదులతో పొడుస్తున్నట్లుండే బాధనూ, బరువునూ కలిగిస్తుంది. ఈ బాధలన్నీ తగ్గుతుంటాయి. మరల మరల వస్తుంటాయి. బాగా ముదిరాక రోగికి కాళ్ళు కదలడం ఆగిపోతుంది.
వాత - రక్త దోషంలో వాతాధిక్యత గల రోగికి అన్ని అంగాల్లో అత్యధిక శూల, గుండెదడ, శరీరకంపం, ఎముకలు విరుగుతున్నంత బాధ కలుగుతాయి. చర్మంపై పొక్కులు పుట్టుకొచ్చి అవి పెద్ద కురుపులై సలుపు, పోటు పెడుతుంటాయి. కొన్నాళ్ళకి నల్లగా మారి మాడిపోయినట్లయి మళ్ళా పెరుగుతుంటాయి. ధమనులు నొక్కబడి వ్రేళ్ళ సందులు కుంచించుకుపోయి, అంగగ్రహమేర్పడి, దుస్సహవేదన కలుగుతుంది. శీత పదార్థాలను సేవిస్తే అరుచి, వాపు, కొయ్యబారుటలు, కంపనము, ఇంద్రియాలు చురుకు తగ్గుటలు ఏర్పడతాయి.
వాత - రక్త దోషంలో రక్తాధిక్య రోగిని కురుపులు యమ బాధపెడతాయి. ఒళ్ళంతా సూదులతో పొడుస్తున్న బాధలేర్పడతాయి. ఈ కురుపులు రాగి రంగులో వుంటాయి. నీరు కారుతుంటాయి. చిమచిమలాడుతుంటాయి. దురద పెడుతుంటాయి. ఏ మందు పూసినా శాంతి లభించదు. ఈ రోగంలో పిత్త దోషం కూడా కలిస్తే మంట, చెమట, మత్తు, మూర్ఛ, దాహం, నొప్పి, కురుపులు పగిలి రక్తం కారుట, మిక్కుటంగా వేడి చేయుట - అనే లక్షణాలు బయటపడతాయి. కఫ దోషం చేరి పెరిగితే శరీరం కఠినమగుట, బరువెక్కుట, శూన్యమైనట్లుండుట, చలి, జిడ్డెక్కుట, దురద, మందపీడ మున్నగు లక్షణాలు బయట పడతాయి. త్రిదోష జన్యమైతే మాత్రం వాత రక్త దోషాన్ని నిర్మూలించడం అసాధ్యం. వాతమూ రక్తమూ రెండూ పూర్తిగా చెడిపోతే రోగి బ్రతకడు.
వాతము పంచాత్మక వాయు సమూహము. ఆ ప్రచవాయువు లేవనగా ప్రాణ, వ్యాన, సమాన, అపాన ఉదానములు.
మనిషిలో రూక్షత, చంచలత, లంఘనం, అతిశయాహారం(బ్రూకరింపు తిండి) కృత్రిమ వేగం, అనవసరమైన ఆయాసపాటు పెరిగితే ప్రాణవాయువు ప్రకోపించి పంచేంద్రియాలను దెబ్బ కొడుతుంది. పీనసం, మంట, దాహం, దగ్గు, ఊపిరాడక పోవుట అనే రోగాలు పుట్టుకొస్తాయి. అదే ఉదానవాయువు కుపితమైతే అది గెడ్డాన్నీ, నుదుటినీ ఆశ్రయించి కంఠావరోధ, మలభేద, అరుచి, పీనస, గలగండాదిక దోషాలకు జన్మనిస్తుంది.
అత్యధిక దూరంలో వున్న వాటికి పలుమార్లు యాత్రలు చేయడం, బహుస్నానాలు, మరీ అడ్డగోలుగా వీషయ వాంఛలను తీర్చుకోవడం, ఎక్కువగా భోగాలను అనుభవించడం, అపథ్యం, కోపం, అతిగా హర్ష విషాదాలకు స్పందించడం మున్నగు కారణాలవల్ల వ్యక్తిలోని ‘వ్యాన’ వాయువు దూషితమవుతుంది. దీనివల్ల ముందుగా పురుషునిమగతనం దెబ్బ తింటుంది. దానితో అతనిలోని ఉత్సాహం నశిస్తుంది. ఇక శోకానికి అతి స్పందన నిచ్చే వ్యక్తి కాబట్టి అతి రోదనం వల్ల జ్వరం, పొడవబడుతున్నవేదన, రోమాంచం, స్పర్శ శూన్యత, కుష్టు, విసర్పం, సర్వాంగపీడ కలుగవచ్చును.
‘సమాన’ వాయువు అజీర్ణ కారకము, శీతలము, సంకీర్ణ దోషయుక్తము నగు తిండివల్లనూ, వేళాపాళాలేని నిద్ర, జాగరణల వల్లనూ కుపితమవుతుంది. ఈ సమాన వాయు ప్రకోపకారణాన శూలనొప్పులు, గుల్మాలు, గ్రహణి మున్నగు థకృతజన్య మరియు కామాశ్రిత రోగాలు వస్తాయి.
అపానవాయువు చాలా ముఖ్యమైనది. దీనిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బిరుసుగానూ, బరువుగానూ వున్న అన్నాన్ని తినడం, మలమూత్రాలను ఆపుకోవడం, ఎక్కువ బరువులను మోయడం, వాహనాలపైనే రోజంతా తిరగడం అంటే కాలు క్రింద పెట్టకపోవడం, మదిరాపానంచేయడం, ఎక్కువకాలం నిలబడే వుండిపోవడం, వీలు చేసుకొని మరీ ఎక్కువగా ఊరిమీద తిరగడం వంటి పనులు చేస్తే అది ప్రకుపితమవుతుంది. అప్పుడది పక్వాశయము నాశ్రయించి సమస్తరోగాలనూ పుట్టిస్తుంది. అంతేకాక మూత్ర, మల, అర్శ(మొలలు), వీర్య, మలవిరోధి సంబంధమైన ఎన్నో వ్యాధులనూ కలిగిస్తుంది.
ఉదానవాయు ప్రకోపంలో తంద్ర, స్తిమిత, బరువెక్కుట, జిడ్డుకారుట, బద్ధకం, ఒక్భుచల్లబడుట, అగ్నిమాంద్యం, రూక్ష మరియు కటు పదార్థాలను తినాలని వుండుట మున్నగు రోగలక్షణాలు కనిపిస్తే దానిని ఆమసదృశ లేదా సామవాయుదోష మంటారు. వీటికి వ్యతిరేకంగా అత్యుష్ణాది లక్షణాలు కనిపిస్తే ‘నిరామ’ వాయు దోషమని వ్యవహరిస్తారు.
ఇపుడిక వాయువు దేనిచేత ఆవృతమైతే ఎలాటి రోగలక్షణాలు బయటపడతాయో చూద్దాం. పిత్త దోషంచే ఆవృతమైన వాత వికారం శరీరంలో నేర్పడిన వ్యక్తికి మంట, దాహం, శూలనొప్పులు, భ్రమ, కనులు చీకట్లు కమ్ముట అను రుగ్మతలు కలుగుతాయి. చేదుగా గాని వేడిగా గాని పులుపైన గాని ఉప్పునివి గాని రోగి చేత పదార్థాలను సేవింపచేస్తే ఒకమారు వేడిగా ఒకమారు చల్లగా నుండే పదార్థాలను తినాలనే కోరికను వెల్లడిస్తాడు. కఫావృత వాతరోగి శీత, ఉష్ణరూక్ష భోజనాన్ని వాంఛిస్తాడు. అతనికి చలువలు కమ్ముట, ఒళ్ళు బరువెక్కులు, శూలం, లంఘన, అగ్నిదాహ, అధిక తృష్ణాది రుగ్మతలు కలుగుతాయి. కఫావృత వాయురోగికి కటుఘృత యుక్త ముఖదోషం కూడా తగులుతుంది. ప్రతి అంగం దురద, అరుచి, వాంతులు కూడా ఉంటాయి.
రక్తావృత వాత రోగికి చర్మంలో మాంసంలో మంటలు పుడుతున్నట్లుంటుంది చర్మంపై ఎఱ్ఱని కురుపులు పుడుతుంటాయి. గుండ్రని మచ్చలేర్పడుతుంటాయి. వాయువు మాంసాశ్రితమైన రోగికి ఈ కురుపులు బాగా పెద్దవై సలుపుతూ రసికారుతూ వుంటాయి. మేదావృత (పొట్టలోని) వాతదోషంలో వేసే కురుపులు ముట్టుకుంటే వేడిగా తగులుతాయి. పై పొర తొలగిస్తే చల్లగా వుంటాయి. మజ్జావృత వాత దోషంలో ఈ కురుపులు విశాలంగా, పెళుసుగా వుండి బాగా నొప్పెడుతాయి. వాటిని మృదువుగా నిమిరితే నొప్పి తగ్గినట్లనిపిస్తుంది.
శుక్రంలో వాయువు చేరితే స్కలనం చాలా నెమ్మదిగా జరుగుతుంది. అన్నకోశంలో చేరితే తినగానే కడుపునొప్పెట్టి అరుగుతున్న కొద్దీ తగ్గుతుంటుంది. వాయువు మూత్రంలో చేరితే దాని ప్రవాహమాగిపోయి, పొత్తికడుపు తీవ్రంగా నొప్పెడుతుంది. పురీషంలో చేరితే మల ద్వారం వద్ద చిన్న చేరంపము (ఱంపము)తో కోస్తున్నట్లు బాధపుడుతుంది. రోగి వీలైనంతవేగం నేలపై పడుకొని మూర్ఛితుడైపోతాడు. మలం అతి కష్టం మీద బయటి కొస్తుంది.
వాయువు శరీరాంతర్గత ధాతువులను ఆవరిస్తే కటి ప్రదేశంలోను వంక్షణ, పీఠాలలోనూ వేదన పుడుతుంది. అది విలోమభావంలో అంటే అపసవ్యంగా లోపల్లోపలే తిరుగుతుంటే గుండె నొప్పి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
పిత్త జన్యమైన దోషం వల్ల చెడిన వాయువు ప్రాణవాయువునావరిస్తే భ్రమ, మూర్ఛ, పీడ (తీవ్రమైన నొప్పి), మంట వస్తాయి. అదే వ్యాన వాయువునైతే పీడ, తంద్ర (పనిపై విరక్తి) స్వరభ్రంశం, ఒళ్ళు మంటలు పుట్టుకొస్తాయి. సమాన వాయువునైతే క్రమంగా అంగచేష్టా, అంగభంగం, వేదనా సహిత సంతాపం, తాప వినాశం, చెమట, బిగుసుకు పోవుట, తీవ్రదాహం దాపురిస్తాయి. అపాన వాయువు విషయంలోనైతే వంటిమంటలు, మలం ముద్ద పసుపురంగులో పడడం జరుగుతాయి. స్త్రీలలోనైతే తాప, అనాహ, ప్రమేహ లక్షణాలు వృద్ధి చెందుతాయి. రజవృద్ధి కూడా అవుతుంది.
ప్రాణవాయువు శ్లేష్మం చేత ఆవరించబడినపుడు నాద ప్రవాహంలో అడ్డంకి, కఫపు గళ్ళలు, అతిచెమట, శ్వాస ద్వంద్వాలలో అసమత ఏర్పడతాయి. కఫం ఉదానవాయువు చుట్టూ చేరితే ఒళ్ళు బరువెక్కుట, అరుచి, మాటమధ్యలోఆగిపోవుట, సత్తువ, మేనిరంగు, రోగనిరోధక శక్తి నశించుట జరుగుతాయి. కఫం వ్యానవాయువు నావరిస్తే కీళ్ళ బందులలో ఎముకల్లో పట్లు పుడతాయి. శరీరం బరువెక్కుతుంది. స్థూలకాయమై పోతుంది. కఫంచే సమానవాయువు ఆవృతమైతే కర్మేంద్రియాలలో అజ్ఞానత, శరీరంలో స్వేదం తగ్గుదల, అగ్నిమాంద్యం కనిపిస్తాయి. అపానవాయువు కఫావృతమైతే మలమూత్రాలు ఎక్కువగా పడతాయి. ఈ విధంగా వాత రక్త రోగాలు ఇరవై రెండున్నాయి.
కొన్ని మందులు సాధారణ సామాన్యరోగాలను నిర్మూలనం చేస్తాయి. కొన్ని మిశ్రమాలు శరీరంలో ఇక ఏ రోగాన్ని ప్రవేశింపనీయవు. శుశ్రుతా! తేనె, నెయ్యి, బెల్లంలతో సంయుక్తమైన త్రిఫల (కరక్కాయ, ఉసిరిక, తాండ్ర) చూర్ణము సర్వరోగ నిరోధిని నివారిణి కూడ. రోజూ ప్రాతఃకాలంలో త్రిఫల చూర్ణాన్ని మంచి నీటిలో కలుపుకొని చిన్నప్పటినుండి త్రాగుతున్న వారికి ఏ జబ్బులూ రావు. జన్మదోషం వల్ల వచ్చే రోగాలు కూడా నశిస్తాయి. శతావరి, గుడూచి, చిత్రక, విడంగాలతో కలిపి ఈ చూర్ణాన్ని సేవిస్తే మరీ మంచిది. వీటితో బాటు అగ్నిమంధ్య, శొంఠి, మూసలి, బల, బృహతి, పునర్నవ, ఆవ, నిర్గుండకి, వేపాకు, భృంగరాజ, వాసకలను కలిపి సేవిస్తే బలహీనుడు కూడా రోజుకి ఏడుమార్లు అతి తక్కువ మోతాదులో కొన్నాళ్ళు సేవించేసరికి వజ్రకాయుడైపోతాడు. ఇప్పటివఱకు చెప్పిన ఓషధుల మూలికలన్నిటినీ చూర్ణం మున్నగు రూపాల్లో సేవించవచ్చు. అను పానాలుగా వైద్యశాస్త్ర నిష్ణాతులు చెప్పిన మోతాదులను కలిపి తీసుకోవాలి.
