1 - గరుడ పురాణము - ఆచార కాండము
213 - సదాచార శౌచాచారాలు
శౌనకాదులారా! శ్రీహరి ద్వారా బ్రాహ్మణాది వర్గాల వారి సదాచారాలనూ శౌచాచారాలనూ విన్న బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి వినిపించిన వివరాలివి.
మనిషి శ్రుతి (వేదం) స్మృతులను (ధర్మశాస్త్రాలు) లను బాగా అధ్యయనం చేసి వాటిలో ప్రతిపాదింపబడిన కర్మను ఆచరించాలి. నిజానికి, వేదమే సకల కర్మలకూ మూలము. అయితే, అందులో అర్థం కానివి చాలా వున్నాయని ఆనాటి మహరులు స్పష్టతకోసం ధర్మశాస్త్రాలను ప్రసాదించారు. కాలక్రమాన కొన్ని ధర్మసందేహాలు వాటిపై కూడా కలిగాయి. అప్పుడు పాలకులు, పండితులు సదా చారాన్నాశ్రయించి కొత్త సమస్యలను పరిష్కరించారు. అయితే ఈ సదాచారానికి కూడా శ్రుతి, స్మృతులే మూలము. కర్మ మార్గ దర్శనానికి కావలసిన రెండు కనులు ఈ శ్రుతి స్మృతులు. సనాతన ధర్మంలో శ్రుతి, స్మృతీ, శిష్టాచారమూ (అంటే సదాచారమే) ప్రధానపాత్రను వహిస్తాయి.
సత్యం, దానం, దయ, నిర్లోభత, విద్య, యజ్ఞం, పూజ, ఇంద్రియ దమనం - ఈ ఎనిమిదీ శిష్టాచారం యొక్క పవిత్ర లక్షణాలు. పూర్వకాలంలో మానవుల శరీరాల, ఇంద్రియాలూ కూడా సత్త్వగుణ ప్రధానాలై తేజోమయంగా వుండేవి. అందువల్ల నీటిలోనే నిరంతరం నివసిస్తూ నీటిబొట్టునొక దానిని కూడా తనపై నిలుపుకోని అంటని కమల పత్రం లాగా మానవులు పాపమంటని పవిత్ర జీవనులుగా వుండేవారు. సత్త్వగుణ వికాసానికై సనాతన ధర్మం (వర్ణాశ్రమ ధర్మం, సదాచారం కూడా) పాలింపబడాలి. దీనికి యుగవిశేషం, స్థానవిశేషం ముఖ్యం. అంటే యుగాన్ని బట్టి, దేశాన్ని బట్టి కూడా ధర్మాన్ని అన్వయించుకోవాలి.
సత్యం, యజ్ఞం, తపం, దానం - ఇవి ధర్మం యొక్క లక్షణాలు. దానం, అధ్యయనం, జపం, విద్య, ధనం, తపస్సు, పవిత్రత, నిరోగత, సంసారిక, బంధనాల నుండి విముక్తి, ఇతరుల ద్రవ్యాన్ని వారు పూర్తిగా ఇష్టపడి ఇస్తేనే స్వీకరించుట - వీటన్నిటికీ మూలం ధర్మాచరణమే. ధర్మం వల్ల సుఖమూ తత్త్వజ్ఞానమూ లభిస్తాయి. తత్త్వజ్ఞానం వల్లనే మోక్షం ప్రాప్తిస్తుంది. సామాన్య ధర్మాలు, ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారి బాధ్యతలు, అవశ్య కర్మలు సనాతన కాలం నుండి వస్తున్న యజ్ఞ, అధ్యయన దానాలే. సదాచారాన్ననుసరించియే ఈ మూడు ధర్మాలూ పాటింపబడాలి. అవి విశుద్ద, అధీకృత వ్యక్తులనుండే స్వీకరింపబడాలి. వర్ణాలకు చెప్పబడిన ధర్మాలే జీవికకు పనికి వచ్చే వృత్తులయ్యాయి. ముఖ్యంగా యజ్ఞం చేయడం, అధ్యయనం, దానం బ్రాహ్మణ వర్ణానికి ధర్మాలయినాయి. అలాగే స్త్రోపజీవులై ప్రాణులను రక్షించుట క్షత్రియ ధర్మం కాగా పశుపాలన, కృషి కర్మ, వ్యాపారం వైశ్యవృత్తి ధర్మాలయినవి. ఎవరి మాట ఎవరు వినాలి, ఎవరి సలహాను పాటించాలి అనే విషయంలో ఋషులొక మాట చెప్పారు. క్షత్రియులు బ్రాహ్మణుల మాటనూ, వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియుల సూచనలనూ శూద్రులు పై మూడు ద్విజవర్ణాలనూ గౌరవిస్తూ అనుసరిస్తూ జీవించాలి.
గురువుగారి ఆశ్రయంలో, ఆశ్రమంలో జీవించడం, అగ్నిహోత్రాది విధులను నిర్వర్తిస్తూ స్వాధ్యాయం కూడా చేసుకోవడం బ్రహ్మచారి యొక్క ధర్మాలు. అతడు త్రిసంధ్యల్లోనూ స్నానం చేసి సంధ్యావందన నియమాలను పాటించిన అనంతరం భిక్షాయాచనకు వెళ్ళాలి. హృదయపూర్వకంగా మొక్కవోని భక్తిశ్రద్ధలతో చిత్తశుద్ధితో గురువుగారిని సేవించుకోవాలి. నైష్ఠికుడైన బ్రహ్మచారి మూంజిని వడ్డాణంగా ధరిస్తాడు. జటనూ దండాన్నీ ధరిస్తాడు. ఆశ్రమంలోని ఆచారం ముండకేశమైతే అదేచేస్తాడు. ఎల్లప్పుడూ ఆశ్రమంలోనే వుంటాడు. గురువుగారు బయటీకేదైనా పనిమీద పంపితే పోయి వేగంగా మరలివస్తారు.
గృహస్థు అగ్నిహోత్ర ధర్మాన్ని నిర్వర్తిస్తూనే తన వర్ణ విహిత కార్యాల ద్వారా ధనార్జన చేస్తూ కుటుంబాన్నీ, అతిథులను పోషించుకుంటూ జీవించాలి. ధర్మపత్నీ సంగమం నుండి దేవతా, పితృకర్మలదాకా విధ్యుక్తంగా నిర్వహిస్తూ తనకీ సమాజానికీ పనికిరావాలి.
వానప్రస్థికి జటాధారణ, అగ్నిహోత్రపాలన, పృథ్వీశయనం, వననివాసం, కందమూలాలను, పాలను, నీవార ధాన్యాన్ని మాత్రమే భక్షించడం విధ్యుక్త ధర్మాలు. మూడు సందెలలో స్నానం, అతిథి, దేవపూజనం, బ్రహ్మచర్యవ్రతపాలనం కూడా వానప్రస్థికి తప్పనిసరి.
సన్యాసాశ్రమం మానవ జీవితంలో చివరిమెట్టు. సన్యాసి అన్నిటినీ త్యజించాలి. భిక్షాటన ద్వారా వచ్చినదే తినాలి. చెట్టు నీడలోనే నివసించాలి. ఎవరి నుండీ దేనినీ స్వీకరించరాదు. ఏ ప్రాణిపైననూ కోపించరాదు. హింసనిషిద్ధం. సర్వప్రాణులను తనతో సమానంగా ప్రేమించాలి. అప్రియులు లేనివాడు, సుఖదుఃఖాలకు అతీతుడే నిజమైన సన్యాసి. సన్యాసాశ్రమపాలకుడు లోనా, బయట కూడా శుద్ధిగానే వుండాలి. మాటలో సంయమనం, ఇంద్రియ నిగ్రహం, పరమాత్మ ధ్యానం, భావశుద్ధి సన్యాసాశ్రమంలో నున్న వాని ప్రధాన లక్షణాలు.
అహింసా సూనృతావాణీ సత్యశాచేక్షమాదయా ।
వర్ణినాం లింగినాం చైవ సామాన్యోధర్మ ఉచ్యతే ॥ (ఆచర.. ఽ13/ఽఽ)
అన్ని వర్ణాలవారికీ అన్ని ఆశ్రమాలలోనూ అహింస, ప్రియ మరియు సత్యవచనాలు, పవిత్రత, క్షమ, దయ అనేవి సామాన్యధర్మాలు, అవశ్యాచరణీయాలు. శాస్త్రవిహితంగా తమతమ వర్ణాలకు చెందిన ధర్మాలను పాటిస్తూ జీవించేవారు దేహాంతంలో మోక్షప్రాప్తి నొందుతారు.
శౌనకాదులారా! ఇపుడు ఉత్తమ గృహస్థు దినచర్యను వినండి. అతడు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రను త్యజించి ధర్మార్థాల విషయమై బాగా చింతించి, ఆరోజు పడవలసినపాటు, వేదోక్త కర్మ, దాని తాత్పర్య తత్త్వాసులను విచారించుకోవాలి. వెంటనే లేచి శౌచాదికాలను1ముగించుకొని స్నానమాచరించి నిరాలసభావంతో 2సమాహీత చీతుడై సంధ్యోపాసన చేయాలి.
(1మలమూత్రాలను పగటివేళ ఉత్తరం వైపు తిరిగి, రాత్రిపూట దక్షిణాభీముఖమై విసర్జించాలి. గోమయం, నివురుగప్పిన నిప్పు, చెదలు, పుట్టుకన్నము, పచ్చటి పొలం, నీరు, పవిత్రస్థలాలు, రహదారి, పలుప్రాణులకాశ్రయమైన చెట్టునీడ వీటిలో మలమూత్ర విసర్జన చేయరాదు.
2నిరాలస లేదా నిరలస అనగా చురుకుదనం.)
శౌచానంతరం మట్టితో కాలుసేతులను శుభ్రపఱచుకొనడానికి నీటినుండి గాని, దేవాలయ, స్మశాన, అగ్న్యాదులనుండి గాని మట్టిని ఉపయోగించరాదు. మూత్ర విసర్జననాంతరం లింగంపై నొకమారు, రెండుచేతులపై రెండేసిమార్లు మట్టిని పూసుకొని కడుక్కుంటే శుద్ధి అవుతుంది. మలవిసర్జన చేసినపుడు గుదమును రెండుమార్లూ, ఎడమచేతిని పదిపర్యాయములూ, కుడిచేతిని కూడా పదిసార్లూ, కాళ్ళను అయిదు విడతలుగా మట్టితో నీటితో శుద్ధిచేసుకోవాలి. పగటివేళలోని శుద్ధి కార్యంలోని అర్ధభాగం రాత్రివేళలో సరిపోతుంది. ఆరోగ్య కారణాల వల్ల కూర్చుని మలమూత్ర విసర్జన చేయలేని వారు కూడా శుద్ధికార్యంలో సగం చేసుకుంటే చాలు.
మనిషి శరీరంలో పన్నెండు మలాలు లేదా మాలిన్యాలుంటాయి. అవి: వస, శుక్ర, రక్త, మజ్జ (ఎముకగుజ్జు) లాగ (దొంగ), విష్ఠ, మూత్ర, కర్ణామల గులిమి) కఫ, అశ్రు, నేత్రము (పుసులు) స్వేదాలు.
బాహ్యమనీ ఆభ్యంతరికమనీ శుద్ధి రెండురకాలు. మట్టిలోనగు వానితో చేయబడునది బాహ్యమైతే భావనల ద్వారా జరిగేది ఆంతరికం. శుద్ధిలోని ప్రముఖ అంగం ఆచమనం. దీనిని మూడుమార్లు చేయాలి. తరువాత రెండుసార్లు మామూలు నీటితో ముఖం కడుక్కొని బొటన వేలి మూలంతో ముఖాన్ని తోముకొని అరచేతితో మూడు మార్లు ముఖాన్ని స్పృశించాలి. తరువాత బొటన, చూపుడు వేళ్ళతో ముక్కునీ, బొటన అనామికలతో కనులనీ చెవులనీ స్పృశించాలి. ఆపై బొటన, చిటికెన వేళ్ళతో బొడ్డును ముట్టుకొని మొత్తం అరచేతితో గుండెను నిమురుకోవాలి. తరువాత అన్ని వేళ్ళతో తలనీ వాటి కొనలతో రెండు భుజాలనూ తాకాలి.
ఈ స్పర్శల వలని ఫలమేమనగా ముమ్మారు నీటితో ఆచమనం చేయడం వల్ల ఋగ్యజుస్సామ వేదాలు ప్రసన్నమవుతాయి. ముఖ ప్రక్షాళనం ద్వారా అథర్వ వేదం, బ్రాహ్మణులు బృహస్పతీ ప్రసన్నులవుతారు. ముఖభాగాన్ని స్పృశించడం వల్ల ఆకాశం, ముక్కు ద్వారా వాయువు, నేత్రం ద్వారా సూర్యుడు, చెవుల స్పర్శ ద్వారా అన్ని దిక్కులూ సంతృప్తి చెందుతాయి. ముఖ, నాసికాదులను యథావీధి, స్పృశించడం వల్ల ఈ అంగాలలో ఇతిహాస, పురాణ, వేదాంగాలు (అనగా శిక్షా, కల్ప, వ్యాకరణ, నిరుక్ష, ఛంద, జ్యోతిషాలు! ప్రతిష్టితాలవుతాయి. నాభిస్పర్శ ప్రాణగ్రంథినీ హృదయస్పర బ్రహ్మదేవునీ ఆనందింప చేస్తాయి. మూర్ధస్పర్శరుద్రునీ శిఖాస్పర్శ ఋషులనీ దగ్గరచేస్తాయి. రెండు బాహువులనీ పూర్తిగా నిమరడం వల్ల యముడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, పృథ్వీ, అగ్నిదేవతల సాన్నిధ్యం లభిస్తుంది. చరణ జలాభ్యుక్షణ విష్ణు భగవానునీ, ఇంద్రదేవునీ, హస్తజలప్రోక్షణ విష్ణువు యొక్క అంశలనీ దగ్గర చేస్తాయి.
ధార్మిక విధానంలో నేలను నీటితో తడపడం వల్ల వాసుకి మున్నగు నాగులు ప్రసన్నులౌతారు. నీటి బిందువులు పడడం వల్ల భూత సమూహం తృప్తి నొందుతుంది. అంగుళుల (వేళ్ళ) పర్వాలపై అగ్ని, సూర్య, వాయు, చంద్రులూ, పర్వతసమూహాలూ నివాసం చేస్తారు. ద్విజుని హస్తరేఖలలో గంగాది పవిత్ర నదులుంటాయి. హస్తతలంపై సర్వతీర్థాలు సోమునితో బాటు ఉంటాయి. అందుచేతనే వారు చెయ్యెత్తి దీవించినా, తలపై చేతిని ఉంచి ఆశీర్వదించినా చాలమంచిది.
ఉషోదయానికే ద్విజుడు లేచి శౌచక్రియను మొదలుపెట్టి వేయాలి. దంతధావనం చేసుకొని స్నానం చేయాలి. పాచిముఖమంత అశుచి అపవిత్రమూ మరి లేవు. దంతధావనా చాలా ముఖ్యమే. అయినా అమావాస్య, షష్ఠి, నవమి, పాడ్యమి తిథుల్లోనూ, ఆదివారంనాడూ పుల్లలేకుండానే ఓషధీయుక్త జలాలను పన్నెండు (12) మార్లు పుక్కిలించి ఉమ్మివేయడం ద్వారా నోటిని శుభ్రపఱచుకోవాలి.
స్నానం వల్ల దృష్టాదృష్ట ఫలాలెన్నో వున్నాయి. శుద్ధాత్ముడైన వ్యక్తి తొలి సందెకల్లా స్నానం చేసి వేస్తే అతడు ఐహిక పారలౌకిక సుఖాలనిచ్చే అన్ని క్రియలనూ చేయడానికి అధికారి అవుతాడు. అన్ని జపాలకీ అర్హుడవుతాడు.
ఈ శరీరమత్యంత మాలిన్యభూయిష్టము. నవరంధ్రాలూ అలా ఎంతో కొంత మాలిన్యపస్తునే వుంటాయి. ఈ దేహాన్ని - అది జీవించి ఉన్నంతకాలం అందుచేత శరీరశుద్ధికీ మనఃప్రశాంతతకీ, రూపసౌభాగ్యాలకీ ప్రాతఃస్నానం అత్యంతావశ్యకం. పైగా ఇది శోక, దుఃఖవినాశకరం కూడ. కాబట్టి ప్రాతఃస్నానమెక్కడ చేసినా గంగాస్నానంతో సమానమే.
జ్యేష్ట శుక్లదశమి హస్తనక్షత్రయుక్తమైతే ఆ తిధికి దానికి దశవిధ పాపాలను పోగొట్టే శక్తి వుంటుంది. ఆ పాపాలేవనగా బాగా సొమ్ముతో బలసివుండీ దానం చేయకపోవడం, స్వధర్మాన్ని నిర్లక్ష్యం చేయడం, ఇతరుల భార్యలతో తప్పు చెయ్యడం, కటువుగా మాట్లాడడం, అబద్దాలాడడం, చాడీలు చెప్పడం, అసంబద్ధ ప్రలాపం, పరద్రవ్యాపహరణం, మానవజాతిని మొత్తంగా మనసులో ద్వేషించే మంటమారి తనం. ఇటువంటి పనులను తెలియకగాని, పూర్వజన్మలో గాని చేసివుంటే అచర్యల వలని పాపము నశించుటకై స్నానం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. బ్రహ్మచారి *సకృత్ స్నానాన్ని చేయాలి. ఇతరులు కొంత తడయవచ్చును.
(*సకృత్ స్నానో దండవత్! అనగా కర్రను నీటిలో ముంచి తీసినట్లుగా చెయ్యాలి. గురువుగారు చూపించిన నీటి చెలమ బాగుంది కదాని తన శతమర్కట లక్షణాన్ని చూపిస్తూ జలకాలాడరాదు. పరిశుభ్రంగా వుంటూనే వేగం స్నానాన్ని ముగించాలి. బ్రహ్మచారి రెండు సండెలలోనూ అగ్నిహోత్రకార్యాన్ని తప్పనిసరిగా నిర్వర్తించాలి కాబట్టి స్నానం తప్పనిసరి. (మనుధర్మశాస్త్రం- 2/176} కల్లూక భట్టుని టీక)
ఏ ద్విజుడైన ఆచమనం చేసి నీటిలోకి తీర్థాలను ఆవాహన గావించి, అవ్యయ భగవానుడైన మహావిష్ణువుని స్మరిస్తూ స్నానం చేయాలి. మందేహ నామకులైన రాక్షసులు మూడు కోట్ల మంది వున్నారు. ఆదురాత్ములు ఉదయిస్తున్న సూర్యుని మింగి వేయాలనుకుంటూ వుంటారు. మనము సందె వేళలో ఆ నలభై అయిదు నిమిషాలపాటు చేసే పూజాదికముల వల్ల పవిత్రీకరింపబడిన అర్ఘ్యపు జల్లులు అగ్నిజ్వాలలై ఆ మందేహులను దహించి వేస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది. ద్విజులు సంధ్యాకాలం పూర్తి కాగానే యథాధికారం హననం చేయాలి లేదా చేయించాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం, స్వయంగా హవనం చేయడం వల్ల వచ్చే ఫలమే ఎక్కువ. శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారమైతే ఋత్విక్కు పుత్రుడు, గురువు, సోదరుడు, మేనల్లుడు, అల్లుడు. వీరిలో ఎవరైనా ఒక వ్యక్తీ తరుపున హవన కార్యాన్ని చేయవచ్చును. అదీ వ్యక్తి స్వయం హవనంతో సమానం. గార్హపత్యాగ్ని బ్రహ్మ స్వరూపం. దక్షిణాగ్ని శివస్వరూపం. ఆ హవనీయాగ్ని విష్ణు మరియు కుమార *స్వరూపం. యథోచితంగా సమయానికీ హవనం చేసి సూర్యజపం చేయాలి. తరువాత అదే ఏకాగ్రచిత్తతతో సావిత్రినీ ఓంకారాన్నీ జపించాలి. ప్రణవం, సప్తవ్యాహృతి, త్రిపద సావిత్రి మంత్రం - వీటిని నిరంతరం యథాసమయంగా, నియతరూపంలో చేయువారు ఈ ప్రపంచంలో దేనికీ భయపడక్కరలేదు. ప్రాతఃకాలంలో నిత్యగాయత్రి జపాన్ని చేసే సాధకుడు పాపుల మధ్యనే జీవిస్తూ కూడ, నీటిలోనే వుంటూ అది అంటని కమలపత్రం వలె, అనఘుడై వుంటాడు.
*ఇక్కడ కుమారయనగా హవనకర్తయగు నైష్ఠిక బ్రహ్మచారి.)
దేమీనుపాసించువారికీ గాయత్రియే గాయత్రీ మాతగా దర్శనమిస్తుంది. ఇలా:
శ్వేత వర్ణా సముద్దిష్టా కౌశేయవసనా తథా ।
అక్షసూత్ర ధరా దేవీ పద్మాసన గతా శుభా ॥
ఈ క్రింది యజుర్వేద మంత్రంతో గాయత్రి నావాహన చేసి ఉపాసించాలి.
తేజోఽసి తేజోమయి ధేహి వీర్యమాసి
వీర్యం మయి ధేహి బలమసి బలం మయి
దేహో జోఽసోజోమయి దేహి మన్యురసి
మన్యుం మయి ధేహి సహోఽసి సహోమయి దేహి ॥
దేవతలను కనులారా చూడాలనుకునే ఋషిగణం, మంత్రదర్శనం కోరి సాధకులు ప్రాచీనకాలంలో ఈ యజుర్వేద మంత్రాన్నే ప్రయోగించేవారు.
ఇక సాధకులు గాని ఇతరేతరాశ్రమవాసులు గాని పూర్వాహ్ణకాలంలో దేవతలను పూజించాలి. విద్వాంసుడైన వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య భేదాన్ని చూడడు. అందరినీ పూజిస్తాడు.
ఈ విశ్వంలో మంగళకరములు ఎనిమిదున్నాయి. అవి బ్రాహ్మణుడు, గోవు, అగ్ని, బంగారం, నెయ్యి, సూర్యుడు, నీరు, రాజు. వీటిని దర్శించి పూజించి వీలైనంతవఱకు వాటిని (వారిని) తన కుడివైపునే ఉండేలా చూసుకొని, చేసుకొని నడచిపోవాలి. బ్రాహ్మణుడు ముందుగా వేదాధ్యయనం చేసి, ఆపై దానినే చింతించి, అభ్యాసం, జపం చేసుకొని శిష్యులచేత వేదాన్ని అధ్యయనం చేయించాలి. ఇవి వేదాభ్యాస పంచవిధులు,
అవసరమైన నిధులనిస్తూ వేదార్థాన్నీ, యజ్ఞ కర్మ ప్రతిపాదక శాస్త్రాలనూ ధర్మశాస్త్రాలనూ పుస్తకరూపంలో తయారుచేయించిన వారికి వైదికలోకం ప్రాప్తిస్తుంది. ఇతిహాసాలనూ, పురాణాలనూ వ్రాయించి దానమిచ్చిన వారికి బ్రహ్మను గాని వేదాన్ని గాని దానం చేసిన దానికీ రెట్టింపు పుణ్యం లభిస్తుంది. ఇక్కడ బ్రహ్మదానమనగా వేదదానం గాని బ్రహ్మజ్ఞానదానం గాని కావచ్చును.
బ్రాహ్మణుడు గాని ఇతర గృహస్థులు గాని దినంలో మూడవభాగాన్ని, తన పోష్యవర్గం అంటే మాతాపితలూ, గురువు, సోదరులు, ప్రజలు (సంతానం) దీనులు, దుఃఖితులు, *అభ్యాగతులు, అతిథులు, అగ్నులు - వీరియొక్క పోషణ, ఆలన, పాలనలను చూసుకోవాలి. స్వర్గానికీ దీనిని మించిన దగ్గరి దారిలేదు.
(*అభ్యాగతులనగా భోజనాలవేళ అప్పటికప్పుడు ఊడిపడేవారు. అతిథులనగా వారి రాక మనకు ముందే తెలుస్తుంది. వారు కూడా తిథి వార నక్షత్రాలు చూసుకొని రారు.
తిథి పర్వోత్సవాః సర్వేత్యక్తాయేనమహాత్మనా
సోఽతిథః సర్వభూతానాం శేషానభ్యాగ తాన్ విదుః (యమవచనము))
కాబట్టి ఎంత ప్రయత్నం చేసైనా మనిషి తన వారిని తాను పోషించుకోవాలి. అదీ న్యాయార్జితంతోనే చేయాలి. పోష్యవర్గాన్ని పోషించని వాడు బతికున్నా చచ్చినట్టే. తన పొట్టని తాను మాత్రమే అనగా తాను తన పొట్టని మాత్రమే పోషించుకొని బ్రతకడం గొప్పేం కాదు. ఊరకుక్క కూడా అలాగే బ్రతికెయ్యగలదు కదా!
మాతాపితా గురుభ్రతా ప్రజా దీనాః సమాశ్రితాః ॥
అభ్యాగతోఽతిథిశ్చాగ్నిః పోష్య వర్గా ఉదాహృతాః
భరణం పోష్య వర్గస్య ప్రశస్తం స్వర్గ సాధనం ॥
భరణం పోష్య వర్గస్య తస్మాద్యత్నేన కారయేత్
సజీవతి వరశ్చైకో బహుభిర్యోప జీవ్యతి ॥
జీవంతో మృత కాస్త్వన్యే పురుషాః స్వోదరం భరాః ।
స్వకీయోదర పూర్తిశ్చ కుక్కుర స్యాపి విద్యతే ॥
వ్యావహారిక జగత్తులో ధనానికి ప్రాముఖ్యమెక్కువ. అది లేనిదే మనుగడ లేదు. కాబట్టి దాన్ని సంపాదించాలి, పెంచాలి. దీనినే అర్థమన్నారు. అది మన కార్యాలను చాలావఱకు సంపన్నం చేయగల సంపద. దాని ఉపయోగం మనకు అనివార్యం. ఈ దృష్టితో చూస్తే భూమి, రత్నాలు, నిధులు, ధాన్యమూ, పశువులూ, చివరికి స్త్రీ కూడా అర్థంలో భాగాలే. కాబట్టి కష్టపడి న్యాయంగా ధనాన్ని సంపాదించాలి.
డబ్బు మూడు విధాలు. శుక్ల, శబల, కృష్ణ (తెలుపు, కలగలుపు, నలుపు). ఇది కాక సంక్రమించే ధనం. పితృపితామహుల నుండి రావచ్చు. ఇతరులు ప్రేమకొద్దీ ఇచ్చేసి పోవచ్చు. *స్త్రీ ద్వారా రావచ్చు. ఇవి కాక బ్రాహ్మణునికి ధనం వచ్చే ఆధారాలు మూడుంటాయి. అవి: యాజనం (యజ్ఞం వల్ల) అధ్యాపనం (పాఠం చెప్పడంవల్ల) విశుద్ద
(*అంటే వివాహం ద్వారా వచ్చేది మాత్రమే ధర్మబద్ధం}
ప్రతిగ్రహం (సత్పాత్తులు చేసే దానం వల్ల) క్షత్రియులకు కూడా ధన ప్రాప్తికి మూడు మార్గాలుంటాయి. పన్ను ద్వారా నొకటి, దండన ద్వారా నింకొకటి (ఇది అపరాధ రుసుము వంటిది) విజయప్రాప్తి ద్వారా వేరొకటి. వైశ్యునికి పొలం ద్వారానూ, పశుపోషణలోనూ, వ్యాపారం వల్లనూ ధర్మబద్ధంగా ధనం సమకూడుతుంది. శూద్రులు వీరికి సాయపడడం ద్వారా ధనార్జనను చేయాలి.
అన్ని వర్ణాలవారూ వడ్డీ వ్యాపారం ద్వారా జీవితాన్ని గడపవచ్చునని ఋషులు నిర్ణయించారు. అయితే బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రం ఆపత్కాలంలోనే ఈ పద్దతినాశ్రయించాలి. వారు కాలం కలిసిరానపుడు వ్యవసాయం కూడా చేయవచ్చును. విదేశాలకు పోయి ధనాన్ని సంపాదించుకునే అవకాశం వైశ్యులకి మాత్రమే ఈయబడింది.
శాస్త్ర సమ్మతంగా ఆర్జించిన సొమ్ములో కొంత అంశను (లాభాంశ అని దీనినే అంటారు.) వెచ్చించి ప్రతిమనిషీ పితృగణాలనూ,దేవగణాలనూ బ్రాహ్మణులనూ పూజించాలి. దానివల్ల తెలియక చేసిన పాపాలు నశించవచ్చు. వడ్డీ వ్యాపారం ద్వారా వచ్చే ధనంలో ఇరువదవ వంతునీ, పశుస్వర్ణాదుల ద్వారా వచ్చే దానిలో నూరవ వంతునీ రాజుకిచ్చేయాలి. మిగిలిన దానిలో నాల్గవవంతును పెట్టి నిత్యావసర వస్తువులను కొనుక్కొగా మిగిలిన దానిలో సగభాగాన్ని తన భరణ పోషణలకూ నిత్య నైమిత్తిక కార్యాలకు వినియోగించాలి.
విద్య, శిల్పం, వేతనం, సేవ, గోరక్ష, వ్యాపారం, వ్యవసాయం, (కృషి) వృత్తి, *భిక్ష, వడ్డీ అనే పదింటినీ జీవనయాపన సాధనాలుగా ఋషులు పేర్కొన్నారు.
(*వృత్తి అనగా కొన్ని ప్రత్యేకార్హతలున్నవారు పనిచేసినా చేయకపోయినా ప్రభుత్వమిచ్చే నెలసరి దినుసులు.)
బ్రాహ్మణులు శ్రేష్ఠమైన ధనంగా భావించవలసినది ప్రచుర జలరాశిచే పరి పూర్ణమైనదినీ, కూరలనూ, మట్టినీ, సమిధలనూ, కుశలనూ, పలాశదండన్నీ, అగిటాకునీ, అగ్నిదేవుని ఆరాధించడానికి వలసిన ఉపకరణాలనూ బ్రహ్మఘోష అనగా స్వాధ్యాయాన్ని బ్రాహ్మణుడు అయాచిత ధనాన్ని కూడా స్వీకరించవచ్చును. దేవతలిటువంటి ధనాన్ని అమృత సమానమంటారు. ఎవరినుండైనా ధనాన్ని స్వీకరించవచ్చు. అది గురువు ధనాన్ని పెంచడానికో దేవతలనూ అతిథులనూ పూజించడానికే వాడబడే మాటైతే. అలాగే దొంగనుండీ శీలవిహీనుని నుండి కూడా దానాన్ని గ్రహించవచ్చు. అయితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రోజులోని నాలుగవ భాగంలో మట్టి, నువ్వులు, పువ్వులు, కుశాది సామగ్రిని తెచ్చి వాడుతూ ప్రకృతిసిద్ధమైన జలాలలో స్నానం చేస్తే ఈ దోషానికీ శుద్ధీ ప్రాయశ్చిత్తమూ అవుతాయి.
స్నానం ఎనిమిది ప్రకారాలుగా వుంటుంది. ఆ ప్రకారాలు నిత్య, నైమిత్తిక, కామ్య, క్రీయాంగ, మలాపకర్షణ, మార్జన, ఆచమన, అవగాహనలు. స్నానం చేయనిదే జప,అగ్ని, హవనాది కార్యాలకు అధికారం రాదు. ప్రాతః స్నానం పూజా పాథాది ధార్మిక కార్యాలకోసం చేయాలి. దీనినే నిత్యస్నానమంటారు. చండాల, రజస్వల, విష్ణ, శవాదులను స్పృశించినపుడు ఆ దోషం పోవడానికి చేసేది నైమిత్తిక స్నానము. జ్యోతిశ్శాస్తానుసారం పుష్యాది నక్షత్రాలలో చేసేది కామ్యస్నానం. ఏ కోరికా లేకుండా ఈ స్నానమును చేయరాదు. జప, హోమాది కృత్యాలను చేయడానికి సంకల్పించి గాని, దేవతలను, అథలను పూజించడం వంటి పవిత్ర కార్యాలను చేయాలనే ఇచ్చతోగాని వాటికి ముందు చేసే స్నానాన్ని క్రీయాంగస్నానమంటారు. శారీరక మలాన్ని దూరం చేసుకోవడానికి సరోవరం, దేవకుండం, తీర్థం, నది వంటి చోట్ల కావించేది మలాపకర్షణ స్నానమనబడుతుంది. విశిష్టమంత్రాలతో చేసేది మార్జనం. జలాశయంలోకి దూకి వీలైనంతసేపు మంత్రం జపిస్తూ చేసే స్నానం అవగాహనం. ప్రాతఃస్నానం తరువాత అవసరమైనా సమయం కుదరనపుడు నీరు దొరకనపుడు ఆచమనం చేయవచ్చు.
భూమి నుండి ఉబికి వచ్చినది పవిత్రజలం. దాని కన్న సెలయేటి నీరు, దాని కన్న సరోవర జలం. దానికన్న నదీజలం, దాని కన్న పుణ్యతీర్థం లోని నీరు పవిత్రమైనవి. వీటన్నిటికన్న పవిత్రం గంగాజలం. ఇందులో స్నానం చేస్తే జీవితంలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. గయ, కురుక్షేత్ర తీర్థాలలోని జలం అతి పవిత్రమైతే కేవల కాశీగంగాజలము పరమ పవిత్రము, సర్వపుణ్యదాయకము.
భూమిష్ఠాదుర్ధృతం పుణ్యం
తతః ప్రస్రవణోదకం ॥
తతోఽపి సారసం పుణ్యం
తస్మాన్నాదేయ ముచ్యతే
తీర్థతోయం తతః పుణ్యం
గాంగం పుణ్యంతు సర్వతః ॥
గాంగం పయం పునాత్యాశు
పాపమామరణాం తీకం ।
గయాయాంచ కురుక్షేత్ర
యత్తోయం సముపస్థితం ॥
తస్మాత్తు గాంగ మపరం
జానీయాతోయముత్తమం ।
రాత్రి స్నానం పత్రజన్మ విశిష్ట యోగాలు, మకరాది ఘనరాశుల్లో సూర్య సంక్రాంత్రి, చంద్ర, సూర్య గ్రహణాల వంటి ప్రత్యేక సందర్భాలలో చేయడమే ప్రశస్తం. ఉషః కాలంలోనూ, సూర్యోదయం తరువాతనూ, సాయం సంధ్యలోనూ చేసే స్నానాలు ప్రాజాపాత్య యజ్ఞంతో సమానంగా మహాపాతకాలను నశింపజేస్తాయి. శ్రద్ధాపూర్వకంగా ఒక ఏడాది పాటు ప్రాతఃకాల స్నానం చేస్తే పన్నెండేళ్ళు ప్రాజాపత్యం చేసిన ఫలం లభిస్తుంది.
మాఘ, ఫాల్గుణ మాసాల్లో నిత్య ప్రాతః కాల స్నానం చేసే వారికీ సూర్య చంద్రులతో సమానమైన భోగ ప్రతిష్టలు లభిస్తాయి. మాఘమాసమంతా ప్రాతః స్నానం శ్రద్ధగా చేసి హవిష్యాన్నమును భుజించువాని యొక్క అతి ఘోర పాపాలన్నీ నశించిపోతాయి. ఏకాదశినాడు ఉసిరికను సమర్పిస్తే మహావిష్ణువు ప్రసన్నుడవుతాడు. అదే ఉసిరికను నీటిలో కలుపుకొని నిత్యస్నానంగావించే వారిని లక్ష్మీదేవి స్థిరంగా వుండి కాపాడుతుంది.
తైలంతో అభ్యంగన స్నానం చేస్తే గొప్ప ఫలాలు వస్తాయి. సోమవారం చేస్తే కీర్తి... అలాక్రమంగా మంగళాదివారాల్లో అల్పాయు నష్టం లేదా శాపవినాశం, ధనం, మృత్యు, భయనాశనం, ఆరోగ్యం, అభీష్టసిద్ధి కలుగుతాయి. వ్రతదినాల్లో తైలస్నానము చేయరాదు. స్నానానంతరం ప్రతిఒక్కరూ పితృ, దేవ, మానవగణాలకు తర్పణనివ్వాలి. బొడ్డు మునిగేదాకా నీటిలో నిలబడి ఏగాగ్ర చిత్తంతో ఈ విధంగా ఆయా గణాలను ఆవాహన చేయాలి.
ఆగచ్ఛతు మేపితర ఇమం గృష్ణం త్వపోఽoజలిం.
అప్పుడు ఆకాశంలోనూ దక్షిణ దిశలోనూ ఉన్న పితృగణాల వారికీ మూడేసి జలాంజలులివ్వాలి. నీటిలో నిలబడలేని వారు తర్పణాలివ్వాలనుకుంటే పొడిదోవతిని ధరించి సమూలంగా కుశలపై కూర్చుని ఇవ్వవచ్చు. తర్పణలకే దశలోనూ పాత్రను వినియోగించరాదు.
ఈ కర్మకు రాక్షసులడ్డు పడకుండా తర్పణారంభంలోనే ఎడమచేతితో నీటిని తీసుకుని నైరృత్యకోణంలో వదిలేస్తూ ఈ మంత్రాన్ని చదవాలి.
యదపాం క్రూర మాంసాత్తు
యడమేధ్యంతు కీంచన ॥
అశాంతం మలినం యచ్చ
తత్సర్వ మపగచ్ఛతు ।
క్రూరమాంస, అపవిత్రత, తర్పణజలాల్లో అజ్ఞాన వశాన వుండే అశాంతి జనక తత్త్వ, మాలిన్యాల కారణాల వల్ల కలిగే ప్రతిబంధకాలన్నీ దూరమైపోవాలి గాక అని పై విధంగా దేవతలను ప్రార్థించి ఉపసంహారం చేయడానికి మూడు జిలాంజలులను మంత్రానికొకటిగా ఈ క్రింది మంత్రాలను పఠిస్తూ సమర్పించాలి.
నిషిద్ధ భక్షణాద్యత్తు పాపాద్యచ్చ ప్రతి గ్రహాత్ ॥
దుష్కృతం యచ్చమే కీంచీ ద్వాంగ్మనః కాయకర్మభిః
పునాతు మేతదింద్రస్తు వరుణః సబృహస్పతిః ।
సవితాచభగశ్చైవ మునయః సనకాదయః ।
ఆ బ్రహ్మస్తంబ పర్యంతం జగత్ తృప్యత్వాతి బ్రువన్ ॥
తినకూడనివీ తినడం వల్ల, పాత పుట్టుకలలోని పాపాలవల్ల, దానగ్రహణం లోని లోపాలవల్ల, నోరు పారేసుకోవడం వల్ల, కర్మదోషాలవల్ల, ఇతరేతర నిషిద్ధ కర్మాచరణలవల్ల వాటీనుండీ పుట్టిన పాపాల ద్వారా నాలో పెరిగిన అపవిత్రతను బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు దూరం చేయాలి గాక! సూర్యయమాది దేవతలు, సనక సనందనాది ఋషులు, బ్రహ్మనుండీ స్తంబం (కీటకాలు, సూక్ష్మజీవులు, గడ్డి) దాకా గల సమస్త జీవకోటి నా ఈ తర్పణాల వల్ల తృప్తి చెందాలిగాక!
ఈ ప్రకారంగా పితృతర్పణలనిచ్చి ఈర్ష్యాద్వేషరహితుడై, సంయమీయై మనిషి త్రిమూర్త్యాది దేవతలను పూజించాలి. ఇష్టదేవతలను పూజించిన పిమ్మట బ్రాహ్మ, వైష్ణవ, రౌద్ర, సావిత్ర, మైత్రావరుణ మంత్రాలతో అందరు దేవతలకూ నమస్కరించాలి. వారందరికీ వేరు వేరుగా పుష్పాంజలు లివ్వాలి. మరల సర్వ దేవమయులైన విష్ణువునీ సూర్యునీ పూజించాలి. పురుషసూక్తం చదువుతూ విష్ణువునకు జల, పుష్పాంజలులను సమర్పించేవాడు సర్వవిశ్వాన్నీ పూజించినంత పుణ్యాన్ని పొందుతాడు. అన్యతాంత్రిక మంత్రాల ద్వారా కూడా ఈ కర్మను నిర్వహించవచ్చును. జనార్దనునికి అర్ఘ్యప్రదానం చేసి ఆయన విగ్రహానికి సుగంధానులేపనం చేసి పుష్పాదులతో మంత్ర సహితంగా పూజను చేయవచ్చును.
స్నానం తరువాత అంత ప్రముఖమైన పుణ్యకార్యంఅన్నదానం. బ్రాహ్మణునితో మొదలుపెట్టి ఆపై తన మిత్రులకూ అనంతరం గ్రామంలో అందరికీ అన్నం పెట్టేవానికి స్వర్గంలోకానికి వెళ్ళే అధికారం లభిస్తుంది. భోజనంలో మొదట తీపినీ, మధ్యలో ఉప్పన, పుల్లననైన వాటిని, తరువాత చేదు, కారాలనూ, చివర వగరైన వాటిని అన్నంలో కలుపుకొని తినాలి. భోజనం తరువాత పాలు త్రాగాలి. రాత్రి కందమూలాదులను తినరాదు. ఏదో ఒక రసాన్నే ప్రేమించి దానినిఎక్కువగా తినడం మంచిదికాదు.
తాంబూలం వేసుకోవచ్చు. ఇది గృహస్తులే వేసుకోవాలని అన్యత్ర చెప్పబడింది) తాంబూలం లేదా తమలపాకు స్వీకరించిన తరువాత పురాణేతిహాసాలను ఏకాగ్ర చిత్తంతో వినాలి. దినంలో ఆరవ లేదా ఏడవ భాగాన్ని ఈ పుణ్య శ్రవణంలో గడపాలి. తరువాత సాయం సంధ్య వార్చాలి.
మునులారా! ఈ స్నానాదికములు మానవజాతికంతటికీ విధాయకములు. ఈ విధమైన కర్తవ్యపాలనం చేసి సదాచారాన్ని గూర్చి స్వయంగా చదివి గానీ పురోహితుని ద్వారా విని గాని ఆచరించాలి. ఈ సదాచారాన్ని తు.చ. తప్పకుండా పాటించేవాడు స్వర్గలోక నివాస ప్రాప్తి నొందుటయే కాక భూలోకంలో కేశవుని విష్ణువు} వలె పూజలందగలడు.
