1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

192 - వివిధ స్నేహపాకాలద్వారా రోగచికిత్స స్మరణ - మేధాశక్తి వర్ధక బ్రాహ్మీ ఘృతాది నిర్మాణ విధి

ర్వేశ్వరాదులారా! ఇప్పుడొక సర్వాజీర్ణ బాధా నాశనమగు ఒక మందు నెలా చేయాలో ఆలకించండి ఎనిమిదిపాళ్ళ చిత్రక, పదహారుపాళ్ళ సూరణ, నాలుగు సొంటి, రెండు మరిచ, మూడు పిప్పలమూల, నాలుగు విడంగ, ఎనిమిది ముషాలిక, నాలుగు త్రిఫల వీటన్నిటీ పరిమాణంకీ రెట్టింపుగా బెల్లంలతో మోదకాన్ని తయారుచేసి దాచుకోవాలి. ఇది అజీర్ణానికి, కామెర్లకీ, తాపజ్వరాలకీ, విరోచనాలకీ, జీర్ణకోశ వ్యాధులకీ, ప్లీహ వ్యాకోచానికీ తిరుగులేని మందు.

ఈ క్రింది ఓషధులను ఒక్కొక్కటీ పది పళాలు తూచి తీసుకోవాలి : బిల్వ, అగ్ని మంథ, శ్యోనాక, పాటల, పారిభద్రక, ప్రసారణి, అశ్వగంధ, బృహతి, కంటకారిక, బల, అతిబల, రాస్న, శ్వదంష్ట్ర, పునర్నవ, ఎరండ, శారీవ, పర్ణి, గుడూచి, కపికచ్ఛుక. వీటిని నిర్మలజలంలో పోసి మూడొంతులు ఆవిరైపోయేదాకా మరిగించాలి. ఆ మిగిలిన ఒక వంతును మూకుట్లో పోసి మరల వేడిచేయాలి. ఒక పది నిమిషాలు మరిగిన తరువాత మిగిలిన దానికి నాలుగింతలు మేకపాలను గాని ఆవు పాలనుగాని చేర్చి మొత్తం ద్రవానికి సమాన దవ్యరాశిగల శతావరినీ సైంధవాన్ని చేర్చాలి. దీన్ని దాచుకొని గుండె నొప్పి, పార్శ్వశూల, గండమాల, కంతి, *మనసులో బెంగ ప్రవేశించి కేకలు, ఏడ్పులు వచ్చే జబ్బు, వాత రక్త రోగాలకు విరుగుడుగా, అప్పటికప్పుడు శతపుష్ప, దేవదారు, బల, పర్ణి, వచ, అగరు, కుష్ఠమాంసి, సైంధవ, పునర్నవలను మిశ్రితం చేసి వాడాలి. అవసరాన్ని బట్టి దీన్ని తాగడం గాని, పీల్చడం గాని, పూయడం గాని చేయవచ్చు. శృంగార సామర్థ్యం కోసం కూడ దీనిని వాడతారు. పురుడు సులువుగా రావడానికి, వాతరోగాలకూకూడాదీనిని ఉపయోగిస్తారు.

(* దీనిని ప్రస్తుత భాషలో హిస్టీరియా అంటున్నారు.)

అవనూనెను హింగ, తుంబురు, సౌంటీలతో ఉడికించి తయారుచేసిన తైలం చెవి చుక్కలుగా వాడితే కర్ణసంబంధిత రోగాలన్నీ తగ్గిపోతాయి. ఎండుమూలక, సౌంటిలను భస్మంచేసి, హింగులా, నాగరలతో కలిపి, వీటీకీ నాలుగింతలు మజ్జిగతో కలిపి బాగా కుదిపి చెవిలో వేస్తే చెవుడు, దుర్వాసనతో కూడినలాడీ కారుట, చెవిపోటు తగ్గిపోతాయి. అలాగే పొడి మూలక, సొంటి, హింగుల, నాగర, శతపుష్పి, వచ, కుష్ఠ, చారు, శిర్రు, రసాంజన, సౌవర్చల, యవక్షారసముద్రపుటుప్పు, గ్రంథిక, వీరముష్ట, తేనె, నాలుగింతలుశుక్త, మాతులుంగ, కదలీరసాలతో చేయబడిన తైలం కూడా చెవి సమస్యలను తుడిచిపారేస్తుంది. ముఖ్యంగా చెవుడు, చెవిలో రణగొణధ్వనులు, దుర్వాసన, కారుట, క్రీములు అను చెవి సమస్యలన్నీ ఈ తైలాన్ని వాడితే నశిస్తాయి. ఈ ఆవనూనెకు క్షారతైలమని పేరు. ఇది నోటి లోనూ, దంతాలమధ్యా వుంటే క్రీములను కూడా తొలగించగలదు.

చంద్రశేఖరా! ఇక చందన తైలాన్ని గూర్చి ఆలకించు. చందన, కుంకుమ, మాంసి, కర్పూర, జాతిపత్రిక, జాతీఫలాలు, కకోల, పూగ, లవంగ, అగురు, కుష్ణ, కస్తూరి, తగర పాదిగ, గోరోచ, ప్రియంగు, బల, నఖి, సరల, సప్తపర్ణ, లాక్ష, ఆమలకీ, పద్మకాలను ఆవనూనెలో వేసి తయారుచేసే ఈ చందన తైలం అతి చెమటనూ, శరీర దుర్వాసననూ, దురదలనూ, సర్వచర్మరోగాలనూ కుదురుస్తుంది. స్త్రీలకు వంధ్యత్వాన్ని పోగొడుతుంది. పురుషులలో శక్తిని పెంచుతుంది.

వెన్నతో చేసే చిత్రకఘృతం మొలలనూ, ప్లీహవ్యాకోచాన్నీ,కురుపులనీ (లోపలి) నశింపచేసి, జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఒక ప్రస్థ వెన్ననూ ఎనిమిది ప్రస్థల నీటినీ తీసుకొని అందులో చిత్రక, యమాని, ధన్య, త్రయూషణ, జీరక, సౌవర్చల, విడంగ, పిప్పలి మూల, రాజికాలను వేసి బాగా ఉడికించి చల్లార్చితే చిత్రకఘృతం తయారౌతుంది.

ఒక ప్రస్థ ఆవనూనెను ఎనిమిది ప్రస్థల గోమూత్రంతో కలిపి మట్టిపాత్రలో గాని ఇనుప దబరాలో గాని పోసి సన్నటి సెగలో మరిగిస్తూ ఈ క్రింది మందులను ఒక్కొక్క దానినీ ఒక కర్షప్రమాణంలో అందులో వేయాలి. మరిచ, త్రివృత, కుష్ఠ, హరితాల, మనశ్నిల, దేవదారు, ద్వివిధ హరిద్ర, మాంసి, చందన, విశాల, కరవీర, పాలుగారుతున్న అర్క ఆవుపేడ రసంతో కలిపిన అరపళం విష. ఈ తైలాన్ని ఒంటికి పూస్తే పామరోగం, విచర్చిక, బద్దెపురుగు దుర్వాసన వచ్చే అన్ని కురుపులూ అదృశ్యమైపోతాయి. చర్మానికొక కొత్తమెరుపు, నునుపు ఏర్పడతాయి. శ్విత్ర వంటి చర్మరోగాలూ, చికిత్స నివారణ అసాధ్యమనిపించే చిరకాలపు శ్వేతకుష్ఠ కూడా తగ్గుతాయి.

గజ్జి కురుపులకూ, ఎప్పటికీ చితకని సెగగడ్డలకూ దధికృతమైన మందొకటుంది. పటోల పత్ర, కటుక, మంజిష్ఠ, శారీబ, నిశ, జాతి, శమి, నింబపత్ర, మధుకలను వెన్నతో కలిపి ఉడికిస్తే ఆ మందు తయారవుతుంది.

శివాదులారా! ఇక బ్రాహ్మీమృతాన్ని గూర్చి వినండి. ఒక ప్రస్థ వెన్నను, కంటకారి రసాన్నీ పాలనూ ముద్ద చేసి వుంచి దానికి ఒక అక్ష బరువున్న బ్రాహ్మి, శంఖపుష్పి, వచ, సోమ, వృక్ష, సువర్చల, అభయ, గుడూచి, ఆటగూషక, వాగు జిల మిశ్రమాన్ని కలిపి ఉడికిస్తే బ్రాహ్మీఘృతం తయారవుతుంది. దీనిని సేవిస్తే తెలివితేటలూ, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

అగ్నిమంథ, వచ, వాస, పిప్పలుల మిశ్రమాన్ని తేనెతో సైంధవంతో కలిపి వారంరోజులపాటు పుచ్చుకుంటే గొంతు పరిశుద్ధమై కిన్నరులంత బాగా పాడగలిగే శక్తివస్తుంది. అపామార్గ, గుడూచి, కుష్ఠ, శతావరి, వచ, శంఖపుష్ప, అభయ, విడంగల మిశ్రమాన్ని వెన్నతో కలుపుకొని మూడురోజులు వాడితే ఎనిమిది వందల పుస్తకాలలోని విషయాన్ని కూడా ధారణలో వుంచుకోగలరు. వచని నీరు, పాలు లేదా వెన్నతో కలిపి నెలరోజులపాటు తింటే గ్రాహకశక్తి, బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఒక పళం వచను పాలతో సూర్య లేదా చంద్రగ్రహణ వేళలో తాగితే తెలివితేటలు బాగా పెరుగుతాయి.

భూనింబ, నింబ, త్రిఫల, పర్చట, పటోలి, ముస్తక, వాసకలను నీటితో బాగా మరిగించివాడితే రాచపుండు మాడిపోతుంది. ఎంత కలుషితమై పోయిన రక్తమైనా శుభ్రపడిపోతుంది. శంఖ, కేతకఫల, వచ, సైంధవ, త్రయూషణం, ఫెన, రసాంజన, వీరంగ, మనశ్నిల, తేనెలతో చేసిన కాటుక కనులలోని మసకలను, గుడ్డితనాన్ని, రెప్పల వెనుక నల్లని చారలను కుదుర్చుతుంది.

ఒక ద్రోణం పరిమాణంగల నీటిలో రెండు ప్రస్థల మాషకాన్ని వేసి మూడు వంతులు అవిరైపోయేదాకా మరిగించి తీసి దానికి ఒక ప్రస్థ నూనెనూ ఒక ఆఢక కొలతలో పుల్లంబలినీ చేర్చి మరల మరిగించి తీసి ఈ మందుకి పునర్నవ, గోక్షుర, సైంధవ, త్రయూషణ, వచ, లవణ, సురదారు, మంజిష్ఠ, కంటకారికలను కలిపి తైలాన్ని తయారుచేసి గాని నశ్యంగా మార్చి గాని చెవిలోవేసినా పీల్చినా ఎంత దారుణమైన చెవిపోటైనా చిటికెలో మాయమైపోతుంది.

ఒక ప్రస్థ నూనెను  రెoడు పలoల సైంధవం, అయిదు పలముల శుంఠి, అంతే చిత్రిక, అయిదు ప్రస్థల సౌవీరతో కలిపి బాగా మరిగించి దించి చల్లార్చి సేవిస్తే వాతదోషాలన్నీ నశిస్తాయి. ప్లీహ వ్యాకోచమూ తగ్గుతుంది. ఉదుంబర, వట, పక్ష, రెండు రకాల జంబు, అర్జున, పిప్పల, కదంబ, పలాశ, లోధ్ర, తిందుక, మధూక, ఆమ, సర్జ, ఐదర, పద్మకేసర, శిరీషబీజ, కేతకలను కలిపి కషాయం చేసి దానిని నూనెలో మరిగించి తయారుచేసిన మందు సర్వ చర్మరోగ నివారిణి. ఎప్పటినుండో బాధిస్తున్న మచ్చలు, కురుపులు, వాటివల్ల నొప్పులూ కూడా ఈ మందుపూస్తే నశిస్తాయి.