1 - గరుడ పురాణము - ఆచార కాండము
6 - ధ్రువ వంశం - దక్ష సంతతి
శివాది దేవతలారా! ఉత్తానపాదునికీ ఇద్దరు భార్యలు; సురుచి, సునీతి. వారిలో సురుచికి ఉత్తముడు సునీతికి ధ్రువుడు పుట్టారు. వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాది దేవుడైన జనార్దను నారాధించి ఆయన దర్శనభాగ్యాన్ని పొందాడు. ఆ తరువాత పెద్దకాలం పాటు మహారాజుగా, మనిషిగా బాధ్యతలను నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచాడు.
ధ్రువుని కొడుకు శ్లిష్టుడు. ఆ తరువాత ఆ వంశంలో పరంపరగా ప్రాచీన బర్హి, ఉదారధి, దివంజయుడు, రిపుడు, చాక్షుషుడు, రురు, అంగుడు, వేనుడు రాజ్యం చేశారు. ఈ వేనుడు నాస్తికుడు, ధర్మభ్రష్ఠుడు, పొగరుబోతు. మహర్షులను, పూజ్యులను దారుణంగా అవమానించేవాడు. దేశంపాడైపోతుండడంతో మరో దారిలేక మహర్షులంతా కుశాఘాతాలతో వానిని చంపివేశారు! రాజ్యం అరాచకం కాకుండానూ, విష్ణుమానస పుత్రుని కోసమూ ప్రయత్నాలు చేయసాగారు.ముందు వేనుని శరీరం కాస్త వెచ్చగా వుండగానే అతని ఊరు భాగాన్ని మంత్ర సహితంగా మంథనం చేయగా ఒక పుత్రుడు దయించాడు. అతడు నల్లగా, అతిచిన్న పరిమాణంలో వుండడంతో, అతనిని ‘ఇక్కడే వుండు’ అనే భావంతో ‘నిషీద’ అన్నారు. ఈ శబ్దం వల్ల అతని పేరు నిషాదుడుగా స్థిరపడిపోయింది. అనంతర కాలంలో అతడు కొండల మీదికి వెళ్ళిపోయాడు. తరువాత మునులంతా కలిసి తమ తపశ్శక్తిని వినియోగించి శ్రీహరిని జపిస్తూ వేనుని కుడిచేతిని మథించగాఅందునుండి విష్ణువే పృథు నామంతో అవతరించాడు. ఆయన ప్రజానురంజకమైన పరిపాలనను చేయడమే కాక వారికోసం పృథ్వీని పిడికి సమస్త ద్రవ్యాలను రాబట్టి ప్రజలను ఐశ్వర్యవంతులను చేశాడు*.
(*వేన చరిత్రలో మనం గమనించవలసినదేంటంటే అప్పట్లో మేధావులు, విద్యావంతులు, తపోధనులైన మహర్షులు రాజెలాగుంటే మనకేం, దేశమేమైపోతే మనకేం అని ఊరుకోలేదు. విపరీతంగా శ్రమించి, తపశ్శక్తిని ధారవోని విష్ణువునే క్రిందికి రప్పించారు. ఇప్పటి మేధావులు, బ్రాహ్మణ శబ్దానికి అర్హులైనవారు అలా చేస్తే స్వర్ణయుగం తప్పక వస్తుంది.)
పృథువు తరువాత వంశానుగతంగా అంతర్ధానుడు, హవీర్ధానుడు, ప్రాచీన బర్షి రాజులయ్యారు. ఈ ప్రాచీన బరిలవణ సముద్ర పుత్రియైన సాముద్రిని పెండ్లాడి పదిమంది పుత్రులను కన్నాడు. వారందరూ ప్రాచేతస నామంతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ణాతులై లోకంలో ధనుర్థారులను తయారు చేశారు. ధర్మాచరణ నిరతులై ప్రజలను కాపాడారు. తరువాత పదివేల సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోరతపస్సు చేసి తత్పలితంగా ప్రజాపతి పదవినీ, వరప్రసాదియైన మారిషయను దివ్యస్త్రీని భార్యగానూ పొందారు. శివుని చేత శపింపబడిన దక్షుడు ఈ మారిషకే కొడుకుగా పుట్టాడు.
దక్షుడు ముందు నాలుగు రకాల మానస పుత్రులను సృష్టించాడు కానీ శివుని శాపం వల్ల వారు అభివృద్ధి చెందలేదు. అప్పుడు దక్ష ప్రజాపతి స్త్రీ, పురుష సంయోగంపై ఎక్కువగా దృష్టిని పెట్టి సృష్టిని పెంచవలసి వచ్చింది. ఆయన వీరణ ప్రజాపతి కూతురైన ఆసక్తి అను సుందరిని పెండ్లాడి వేయి మంది పుత్రులను కన్నాడు కానీ వారంతా నారదమహర్షి ఉపదేశం మేరకు గృహస్థ జీవన విముఖులై పృథ్వి యొక్క హద్దులను చూసివస్తామని పోయి మరీ రాలేదు.
దక్షుడు మరల వేయి మంది పుత్రులను కని సృష్టిని కొనసాగించాడు. వారు ‘శబలాశ్వ’ నామంతో ప్రసిద్ధులయ్యారు. కాని వారు నారదుని బోధనలను విని సన్యాసులయిపోయారు. ఈ మారు దక్షుడిక కోపం పట్టలేక నారదుని మర్త్యలోకంలో జనించాలని శపించాడు. అందువల్ల నారదుడు కశ్యపపుత్రునిగా పుట్టవలసివచ్చింది.
ఈ మారు దక్ష ప్రజాపతి అసిక్నియను భార్య ద్వారా అరవైమంది అందమైన కన్యలను ఉత్పన్నం చేసి వారిలో నిద్దరిని అంగిరామహర్షికీ, ఇద్దరు కన్యలను కృశాశ్వునికీ పది మందిని ధర్మునికీ, పదునాల్గురిని కశ్యపునికీ, ఇరవై ఎనమండుగురిని చంద్రునికీ ఇచ్చి వివాహం చేశాడు. ఓ మహాదేవా! ఆ తరువాత దక్షుడు మనోరమ, భానుమతి, విశాల, బహుద అను నలుగురు కన్యలను అరిష్టనేమి కిచ్చి వివాహముగావించాడు.
ధర్ముని పత్ని విశ్వ ద్వారా విశ్వేదేవులూ, కశ్యపపత్నీ సాధ్య ద్వారా సాధ్యగణాల వాగూ జన్మించారు. మరుద్వతి ద్వారా మధుత్వంతుడూ, వసుద్వారా అష్టవసువుల ఆవిర్భవించారు. శంకరదేవా! భానుకి పన్నెండుగురు భానులూ, ముహూర్తకు ముహూర్తుల జన్మించారు. లంబనుండి ఘోషులు, యామీ ద్వారా నాగవీథి జన్మించారు. ధర్ముని పత్నులలో చివరిదైన సంకల్ప ద్వారా సర్వాత్మకు డైన సంకల్పుడు రూపాన్ని ధరించాడు.
ఆపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, అష్టవసువులు, వీరిలో మొదటి దేవతకు వేతుండి, శ్రమ, శ్రాంత, ధ్వని అనే కొడుకులు పుట్టారు. భగవంతుడైన కాల పురుషుడు ధ్రువపుత్రునిగా అవతరించాడు. వర్చమహర్షి సోమపుత్రుడు ఆ దేవుని దయ వల్లనే మనిషి వర్చస్వీకాగలడు. ధరుడను వసువు కుమనోహరయను దేవకన్య ద్వారా ద్రుహిణ హత, హవ్యవహ, శిశిర, ప్రాణ, రమణ నామకులైన పుత్రులు కలిగారు. అనిల పత్ని పేరు శివ. వారికీ పులోమజుడు, అవీతగతి నామకపుత్రులు జనించారు. అనల (అగ్ని) పుత్రుని పేరు కుమారుడు. ఇతడే రెల్లు వనంలో అవతరించిన కుమారస్వామి; కృత్తి కలచే పాలింపబడి కార్తికేయుడై నాడు. ఈయన తరువాత శాఖ, విశాఖ, నైగమేయులు అనలునికి కలిగారు.
దేవల మహర్షి ప్రత్యూష వసువు పుత్రుడు. విఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ ప్రభాస వసునందనుడు. విశ్వకర్మకు నలుగురు మహాబల పరాక్రమవంతులైన కొడుకులు పుట్టారు. వారే అజైకపాదుడు, అహిర్భుధ్న్యుడు, త్వష్ట, రుద్రుడు. త్వష్ట పుత్రుడే మహా తపస్వియైన విశ్వరూప మహర్షి రుద్ర నందనులైన హర, బహుగూష, త్ర్యంబక, అపరాజిత, వృషాకపి, శంభు, కపర్ధి, రైవత, మృగవ్యాధ, శర్వ, కపాలి నాయకులు ఏకాదశ రుద్రులుగా శంకరాంశ సంభూతులై మూడులోకాలకూ అధిపతులైనారు.
కశ్యపపత్ని అదితి పుత్రులు విష్ణు, శక, అర్యమ, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్,సవిత, మిత్ర, వరుణ, అంశుమాన్, భగనామధేయులై ద్వాదశాదిత్యులుగా వెలిగి లోకాలను వెలిగిస్తున్నారు.
రోహిణి మున్నగు ఇరువదేడు నక్షత్రకన్యలను దక్షుడు చంద్రునికిచ్చి వివాహం చేశాడు. దితికడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులూ, సింహికయను కూతురూ పుట్టారు. ఆమె పెండ్లి వీప్రచిత్తితో జరిగింది. హిరణ్యకశిపునికీ అనుహ్రాద, హ్రాద, ప్రహ్లాద, సంహ్రాద నామకులైన పుత్రులు జనించి ‘హ్లాదు’ లుగా ప్రసిద్ధి చెందారు; ముఖ్యంగా విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు. సంహ్లా(హ్రా) దునికి ఆయుష్మాన్, శిబి, వాష్కలులు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాదపుత్రుడు వీరోచని. అతని పుత్రుడే బలిచక్రవర్తి, బలికి నూగ్గురు కొడుకులు. వారిలో పెద్దవాడు బాణుడు.
హిరణ్యాక్ష పుత్రులైన ఉత్కురుడు, శకుని, భూత సంతాపనుడు, మహానాభుడు, మహాబాహు, కాలనాభులు మహా బలశాలులు.
దనువు తనయులైన ద్విమూర్ధ, అయోముఖ, శంకర, శంకుశిర, కపిల, శంబర, ఏక చక్ర, మహాబాహు, తాగక, మహాబల, స్వర్భాను, వృషపర్వ, పులోమ, మహాసుర, విప్రచిత్తులు విఖ్యాతవీరులు.
స్వరానుని కన్య సుప్రభ. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. అతని కీంకా ఉపదానవి. హయశిర అను మరో ఇద్దరు శ్రేష్ఠకన్యలున్నారు.
పులోమా, కాలకా వైశ్వానరకన్యలు. ఈ పరమ సౌభాగ్య శాలీనుల వివాహం మరీచి పుత్రుడైన కశ్యపునితో జరిగింది. వారికీ అరవై వేల మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు. కశ్యపుడు వీరిని పౌలోములనీ కాలకంజులనీ వ్యవహరించాడు.
విప్రచిత్తి, సింహికలకు వ్యంశ, శల్య, బలవాన్, నభ, మహాబల, వాతాపి, నముచి, ఇల్వలు, ఖస్రుమాస్, అంజక, నరక కానాభులు పుట్టారు.
ప్రహ్లాదుని వంశంలో నివాతకవచ నామధారులైన దైత్యులు రెండు వందలమంది ఉదయించారు. తామ్రాకు సత్త్వ గుణ సంపన్నులైన ఆరుగురు కన్యలు పుట్టారు. వారి పేర్లు :శుకి, శ్యేని, భాసీ, సుగ్రీవి, శుచి, గృద్రిక. వీరికి క్రమంగా 1.చిలుకలు, గుడ్లగూబలు, కాకాదులు 2. శ్యేనాలు 3. భాసాలు 4. అశ్వాలు, ఒంటెలు 5. నీటి పక్షులు 6. గ్రద్దలు పుట్టగా వీటిని తామ్రావంశమన్నారు.
(క్రమతలో తేడా: సుగ్రీవునికి గుఱ్ఱాలూ, గృధ్రికు గ్రద్దలు పుట్టాయి.) వినతాగర్భాoడముల నుండి విశ్వవిఖ్యాతులైన అరుణుడు గరుడుడు ఉదయించారు.
సురసాగర్భము నుండి అపరిమిత తేజస్సంపన్నములైన సర్పాలు సహస్ర సంఖ్యలో జనించగా, కద్రువకు కూడా నాగులే జన్మించారు. వీరిలో ప్రముఖులు శేషుడు, వాసుకీ, తక్షకుడు, శంఖుడు, శ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఏలాపత్రుడు, నాగుడు, కర్కోటకుడు, ధనంజయుడు.
క్రోధాదేవికి మహాబలవంతమైన పిశాచగణము, సురభికి గోవులు, ఎద్దులూ, ఇరావతికీ వృక్షకుటుంబమూ జన్మించాయి.
ఖగా యను నామెకు యక్ష రాక్షస గణాలూ, ముగియను నామెకు ఆటపాటలతో అలరించే అచ్చరలూ, అరిష్టకు పరమసత్వసంపన్నులైన గంధర్వుల పుట్టారు. నలభై తొమ్మిది మరుత్తులను దేవతలు (రాక్షస మాతయైన) దితి కడుపున పుట్టారు.
ఈ మరుద్గణాల్లో ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, చతుర్జ్యోతి, ఏకశుక్ర, ద్విశుక్ర, త్రిశుక్రులు ఏడుగురూ ఒక గణం. ఈదృక, సదృక, అన్యాదృక, ప్రతిసదృక, మిత, సమీత, సుమిత నామధారులంతా మరొకగలం. ఋతజిత్, సత్యజిత్, సుషేణ, సేనజిత్, అతిమిత్ర, అమిత్ర, దూరమిత్ర నామక మరుత్తులది ఇంకొక గణం ఋత, ఋతధర్మ విహర్త, వరుణ, ధ్రువ, వీధారణ, దుర్మేధ నామధారులది నాలుగవ మరుద్గణం. ఇక ఈదృశ, సదృశ, ఏతాదృశ, మితాశన, ఏతేన, ప్రసదృక్ష, సురత నామక మహాతపస్వులు. అయిదవ గణానికి చెందిన మరుత్తులు. హేతుమాస్, ప్రసవ, సురభ, నాదిరుగ్ర, ధ్వనిర్భాస, వీక్షిప, సహనామధేయులది ఆరవమరుద్గణం. ద్యుతి, వసు, అనాధృష్య, లాభ, కామ, జయీ, విరాట్టు, ఉద్వేషణలది ఏడవ మరుద్గణం. వీటిని వాయుగణాలనీ, స్కంధాలనీ కూడా అంటారు.
ఈ నలభై తొమ్మండుగురు మరుత్తులూ విష్ణురూపాలే. మనువుతో సహా దేవదానవ రాజులు, సూర్యాదిగ్రహాలు వీరినే పూజిస్తారు.
