1 - గరుడ పురాణము - ఆచార కాండము
174 - బ్రాహ్మీఘృతాది స్నేహపాకాలు - వాటి వినియోగాలు
శ్రీ మహావిష్ణువు శంకర భగవానులతోనూ, సూత మహర్షి శౌనకాది ముని పుంగవులతోనూ వెలయించిన గరుడ పురాణ ప్రవచనంలో ఆయుర్వేదమును గూర్చి ధన్వంతరి శుశ్రుతునికి బోధన గావిస్తున్నాడు ఇలా:
“శుశ్రుతా! నేతితో నూనెతో కొన్ని ఔషధాలను తయారుచేసుకోవచ్చు. ఈ ప్రక్రియకు పనికి వచ్చే నేతినీ నూనెనూ ముందుగా వైద్యశాస్త్ర పరిభాషలో ‘భావన’ అనగా ‘మందుకి పనికొచ్చు శుద్ధి’ చేస్తారు. ఒక ప్రస్థ నేతిని ఒక్కొక్క అక్ష పరిమాణంలో శంఖ, పుష్టి, వచ, బ్రాహ్మి, సోమ, బ్రహ్మ, సువర్చల, అభయ, గుడూచి, ఆటరూషక, వాగుజిలతోనూ, ఒక ప్రస్థ కంటకారీ రసంతోనూ, ఒక ప్రస్థపాలతోనూ కలిపి వండితే ‘బ్రాహ్మీఘృత’ మనే స్నేహపాకం తయారవుతుంది. ఇది జ్ఞాపకశక్తినీ, తెలివితేటలనూ, బలాన్నీ పెంచుతుంది. ఇలాటిదే మరొకపాకం నేతితో త్రిఫల, చిత్రక, బల, నిర్గుండి, నింబ, వాసక, పునర్నవ, గుడూచి, బృహతి, శతావరిలను కలిపి వండితే తయారవుతుంది. శాస్త్రప్రకారం శుద్ధిచేయబడిన ఈ మిశ్రమం ఆరంభ దశలో వుండే ఏ రోగాన్నైనా అణచివేస్తుంది.
మధూక, మంజిష్ఠ, చందన, ఉత్పల, పద్మక, సూక్ష్మమైల, పిప్పలి, కుష్ఠ, త్వగెల, అగురు, కేసర, అశ్వగంధ, జీవనీయ ఓషధులను నీటిలో కలిపి బాగా ఆవిరులొచ్చేదాకా మరగించి, అవశేషాన్ని ఆడకలో సగం నూనెతో కలిపి, ఒక ఆఢకం పాలలో కలిపి మరల తక్కువ సెగలో ఉడికించి ఒక వెండి పాత్రలో ఉంచాలి. దీనిని ‘బల్య’ స్నేహ పాకమంటారు. దీనినొకప్పుడు మహారాజులు నిరంతరం తీసుకునేవారు. ఇది సర్వవాయు, ధాతు దోషాలనూ నివారిస్తుంది.
శతావరి రసాన్నీ, పాలనూ తలొక ప్రస్థా తీసుకొని, ఒక్కొక్క కర్మ మాత్రంగా శత పుష్టు, దేవదారు, మాంసీ, శైలేయక, బల, చందన, తగర, కుష్ఠ, మనశ్మిల, జ్యోతిష్మతిలను వాటితో కలిపి ఒక ప్రస్థ నెయ్యి లేదా నూనె గల పాత్రలో వేసి మరగించాలి. ముద్దగా, లేదా తైలంగా తీసి దాచాలి. దీనిని నారాయణ ఘృతం లేదా నారాయణ తైలమంటారు. స్వయంగా మహావిష్ణువే దీనిని ధన్వంతరికిచ్చాడని ప్రతీతి. ఇది సర్వరోగనివారిణి.
ఈ క్రింది మూలకాలను నేతితో గాని నూనెతో గాని తయారుచేసి వుంచుకొని అవసరం మేరకు వాడవచ్చును.
· శతావరి, గుడూచి
· చిత్రక, వ్యోష, నింబక, నిర్గుండి.
· ప్రసారణి, కంటకారి (రసాలు)
· వర్షభు, బల
· వాసక, త్రిఫల బ్రాహ్మిక, ఎరండక, భృంగరాజ, యష్టి, ముశలి, దశమూల, ఖదిర, వట.
వీటన్నిటినీ కషాయాలుగా గానీ, భస్మాలుగా గాని భద్రపఱచుకొనవచ్చును.
చిత్రక, అర్క, త్రివృత, యవాని, హయమారక, సుధ, బల, గణిక, సప్తవర్ణ, సువర్చిక, జ్యోతిష్మతి మూలికలను నూనెలో కలిపి వండిన దానిని నిష్యందన తైలమంటారు. ఇది భగందరములకూ అటు ఇతర సమస్యలకూ బాగా పనిచేస్తుంది. కణజాలాలను శుభ్రపరుస్తుంది. అవి బాగా పెరిగేలా చేస్తుంది. చర్మానికి చక్కటి రంగు నిస్తుంది,
ఆవనూనెలో అజమోద, సిందూర, హరితాల, రెండు రకాల నిశ, రెండు క్షారాలు, ఫెన, ఆర్ద్రక, సరల, ఇంద్రజారుణి, అపామార్గ, కదల, స్యందన, గొఱ్ఱె మూత్రాలను వేసి తక్కువ సెగలో ఉడికించి తీసి దానికి అవుపాలను కలిపి తయారు చేసిన దానిని అజమొరాదిక తైలమంటారు. ఇది కంటి వంటి చర్మరోగాలను కుదురుస్తుంది.
నేర్పరియైన చికిత్సకుడు తెలివైన గృహస్తు వీటిని ముందు అతి తక్కువ పరిమాణంలో తయారుచేసి పనితీరు చూసుకొని అప్పుడు బాగా తయారు చేసుకుంటారు.
