1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

182 -  భోజ్య పదార్థ విహితసేవన కాలం బల - బుద్ధి వర్ధక ఔషధాలు విషదోషశమనోపాయాలు

ఖగవాహనుడు కాల కంఠాదులకింకా ఇలా చెప్పసాగాడు. “ఎప్పుడు ఏవి తినాలో తెలుసుకుని తినేవారికే తిన్న ఆనందంతో బాటు ఆరోగ్యం కూడా వుంటుంది.

శరద్ గ్రీష్మ వసంతేషు

ప్రాయశోదధి గర్హితం ।

హేమంతే శిశిరే చైవ

వర్షాసు దధి శస్యతే ॥ (ఆచార...18ఽ/1)

వసంత, గ్రీష్మ శరదృతువులలో పెరుగును తినడం మంచిది కాదు. హేమంత, శిశిర, వర్షర్తువులలోనే తినాలి. వెన్నతో పంచదారను కలిపి తింటే బుద్ధి వికసిస్తుంది. రోజూ ఒక పళం పాత బెల్లాన్ని తినేవాడి శృంగార సామర్థ్యం అనూహ్యంగా పెరిగి పోతుంటుంది. కుష్ఠను బాగా పొడి చేసి నేయి, తేనెలతో కలుపుకొని రాత్రి పడుకో బోయేముందు తింటే ముడతలు పడకుండా చర్మం, రాలిపోకుండా జుత్తు వర్ధిల్లుతాయి. అతసి, మాశ, గోధుమలను గుండగా నూరి నేతితోనూ పిప్పలి భస్మంతోనూ కలిపి ముద్దగా చేసి ఒంటికి రాస్తే కొన్నాళ్ళలో అది మన్మధుని శరీరంలాగా తయారవుతుంది.

యవ, శిల, అశ్వగంధ, ముశలి, సరలాలను పిండిగా జల్లించి బెల్లంతో కలిపి లేహ్యంగా చేసుకొని రోజూ తినేవారు ఎంత వయసొచ్చినా యౌవన, బలాలను కోల్పోరు. హింగు, సౌవర్చల, సొంటిలతో చేసిన కషాయాన్ని తాగితే పరిణామ శూలవ్యాధి, అజీర్ణం నయమౌతాయి. ధాతకి, సోమరాజిలను గుండగా చేసి పాలలో పోసి ఉడికించి రోజూ తీసుకుంటే అతి బలహీనులు కూడా పరమ బలవంతులవుతారు. బక్కచిక్కినవారు దుక్కలవుతారు. సర్వశక్తులూ క్షీణిస్తున్న వారొక పద్ధతి ప్రకారం రోజూ పాలు తాగితే ఆరోగ్యం, మేధస్సూ కూడా పెరుగుతాయి. పంచదార, తేనె, వెన్నలను కలిపి తింటే బలం పెరుగుతుంది.

కులీర(కర్కనశృంగి) చూర్ణాన్ని పాలతో కలిపితే క్షయరోగ నివారిణి తయారవుతుంది. భల్లాటక, విడంగ, యవక్షార, సైంధవ, మనశ్శిలు, శంఖచూర్ణాలను కలిపి పిండి జల్లించి నూనెలో ఫోసి ఉడికించి చల్లార్చి దాచుకుంటే మన దగ్గర ఒక గొప్ప అవాంఛిత రోమ వినాశకరమైన ఔషధమున్నట్లే.

1జలగను నూరి పిండి చేసి మూర రసంతో కలిపి ముద్దచేసి అరచేతికి రాసుకుంటే ఆ చేతిలో ఎంతసేపైనా అగ్నిని పట్టుకొని ఆడించవచ్చును. శాల్మలి రసాన్ని కంచరగాడిద మూత్రంతో కలిపి గుమ్మరించడం ద్వారా ఎంత ప్రజ్వలిస్తున్న అగ్నినైనా చిటికెలో ఆర్పివేయవచ్చును.

(1.జలగను పిండి చేయడం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పబడలేదు. జిలగను చంపి దానిని ఎండబెట్టి, తోలును ఇలా వాడడం కావచ్చును.)

గోరోచన, భృంగరాజలను పిండి నేతితో కలిపి వంటికి రాసుకుని

ఓం అగనిష్టంభనం కురుకురు అనే మంత్రాన్ని పఠించేవారికి వాన నుండి రక్షణ కల్పిస్తుంది.

ఓం నమో భగవతే జలం

స్తంభాయ సంసంసం కెక కెక చర చర

ఈ మంత్రం ద్వారా నీటిని అదుపు చేయవచ్చు. (శత్రు సంహారానికి సంబంధించిన ప్రయోగం ఇక్కడొకటి చెప్పబడింది.)

ఏవైనా అయిదురకాల ఎఱ్ఱటి పూలను, ఆ విభిన్నములైన అవే పూల మొక్కల లేదా చెట్ల రసాలను కలపి నూరుకొని ముద్దచేసి కుంకుమనూ, స్వీయరక్తపు చుక్కలనూ, ఒక పళం రోచననూ దానికి కలిపి నుదుటిపై పూసుకుంటే ఎవరినైనా తన వశం చేసుకోగలరు.

చంద్రుడు పుష్య నక్షత్రంలో ప్రవేశించే రోజు బ్రహ్మదండిని ఆహారపానీయాల్లో కలుపుకొని సేవిస్తే అందరినీ ఆకట్టుకునే అందం స్వంతమవుతుంది. ఒక పళం యష్టిమధుని నీటిలో ఉడికించి తాగితే మలబద్ధకం, మూత్రావరోధాలు, గుండె పనిలోని అడ్డంకులు కూడా తొలగిపోతాయి.

పిప్పలి, శృంగవెర, సైంధవ, మరిచ, కుష్ఠలను పొడిచేసి వెన్నతో, పెరుగుతో కలిపి తయారుచేసిన మందు ఎలాటి విషాన్నైనా విరిచేయగలదు. త్రిఫల, ఆర్ధ్రక, కుష్ఠక, చందనాలను నేతితో ఉడికించి త్రాగినా, ఒంటికి పూసుకున్నా విషం ఎక్కదు. గరుడుని వలె పాము విషాన్ని భయపెట్టే మందు పావురం కన్నులతో తయారవు తుంది. ఆ కనులను తెచ్చి హరితాల, మనశ్శిలలతో కలిపి నూరి మిశ్రమం చేసి ఉంచుకోవాలి. తేలు విషాన్ని హరించడానికి సైంధవ, త్రయూషణ భస్మం, పెరుగు, నెయ్యిలను కలిపి చేసిన మందు బాగా పనిచేస్తుంది. తేనే మంత్రం ఓం హ్రూంజః

రక్తాతిసార (రక్తవిరేచనాల)ను పంచదార, తేనెలను బియ్యపు కడుగుతో కలిపి తాగడం ద్వారా అరికట్టవచ్చును. పాలను తేనెతో కలిపి తాగితే రక్తస్రావాన్ని ఆపవచ్చును.