1 - గరుడ పురాణము - ఆచార కాండము
61 - గ్రహాల శుభాశుభస్థానాలు తదనుసారంగా శుభాశుభఫలాల సంక్షిప్త వివేచన
మహేశాదులారా! ఒక జాతకుని యేడవ ఇంట్లో ఉపచయంలో వుండే చంద్రుడు మంగళకారి అవుతాడు. శుక్ల విదియనాడూ, పంచమ, నవమ గృహాల్లోవుండే చంద్రుడు ఆ జాతక చక్రమున్న వానిని గురువు వలే పూజ్యుని, గౌరప్యుని చేస్తాడు.
చంద్రునికి పన్నెండు అవస్థలు అనగా దశలుంటాయి. నక్షత్రాలు మూడేసి ఒక బృందం లేదా మండలంగా వుంటాయి కదా. అశ్వనితో మొదలుపెట్టి మూడేసి నక్షత్రాల కలయికలతో చంద్రునికీ ఈ అవస్థలేర్పడతాయి : ప్రవాసావస్థ, దృష్టావస్థ, మృతావస్థ, జయావస్థ, హాస్యావస్థ, నతావస్థ, ప్రమోదావస్థ, విషాదావస్థ, భోగావస్థ, జ్వరావస్థ, కంపావస్థ, సుభావస్థ.
ఫలితాలు కూడా అదే క్రమంలో ఇలా వుంటాయి : ప్రవాసం, హాని జయం, హాసం, రతి, సుఖం, శోకం, భోగం, జ్వరం, కంపం, సుఖం.
జన్మలగ్నంలో చంద్రుడుంటే తుష్టి,అదే చంద్రుడు ద్వితీయ భావంరెండింట) వుంటే సుఖ-హాని, మూడవ ఇంట వుంటే రాజ సన్మానం, చుతద్ద భావంలో వుంటే కలహం, పంచమభావంలో వుంటే స్త్రీ లాభం కలుగుతాయి. అరవ ఇంట చంద్రుడుంటే ధన, ధాన్య ప్రాప్తి కలుగుతాయి. అష్టమభావంలో చంద్రుడు అరిష్టదాయకుడై ఆ జాతకునికీ ప్రాణ సంకటాన్ని తెచ్చే అవకాశాలున్నాయి. నవమస్థానంలో వుంటే కోశంలో ధనంబాగా పెరుగు తుంది. దశమస్థానంలో కార్యసిద్ధి, ఏకాదశ స్థానంలో ఘన విజయం కలిగించే చంద్రుడు ఎవరికైనా పన్నెండవ ఇంటవుంటే మాత్రం మృత్యువు చేతిలోనికి పంపించి వేస్తాడు.
ఇక ఈ క్రింది నక్షత్రాలున్న గడియల్లో ఈ క్రింద సూచింపబడిన దిక్కుల వైపే యాత్రలకు బయలుదేరాలి. మరోలా కూడదు.
కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర
పునర్వసు, పుష్య, ఆశ్లేష - తూర్పు
మఖ, పూర్వఫల్గుని, ఉత్తర ఫల్గుని
హస్త, చిత్ర, స్వాతి, విశాఖ - దక్షిణ
అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ
ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ఠ - పశ్చిమ
ధనిష్ఠ, శతభీష, పూర్వాభాద్ర,
ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి - ఉత్తర
అశ్వని, రేవతి, చిత్ర, ధనిష్ట నక్షత్రాలు కొత్త సొమ్ములు పెట్టుకోవడానికి ప్రశస్తాలు. మృగశిర, అశ్వని, చిత్ర, పుష్య, మూల, హస్త నక్షత్రాలు కన్యాదానానికీ, యాత్రలకూ, ప్రతిష్టాది కార్యాలకూ శుభప్రదాలు.
జన్మలగ్నంలో శుక్రుడూ, చంద్రగ్రహమూ గల వారికి శుభఫలాల ప్రాప్తి ఎక్కువగా వుంటుంది. ఈ రెండు గ్రహాలూ రెండవ ఇంట నున్న వారికి శుభాలే వుంటాయి. తృతీయ భావంలో (అంటే మూడోయింట) చంద్ర, బుధ, శుక్ర, బృహస్పతులూ, చతుర్ధ భావంలో మంగళ, శని, చంద్ర, సూర్య, ఋధులూ శ్రేష్టతను ప్రసాదిస్తారు. అలాగే పంచమభావంలో శుక్ర, బృహస్పతి, చంద్ర, కేతువులూ, ఆరోంట శని, సూర్య, మంగళులూ, సప్తమ భావంలో బృహస్పతి, చంద్రులూ, అష్టమభావంలో బుధ, శుక్రులు కూడా శుభాలనే ఇస్తారు. అదేవిధంగా నవమ స్థానంలో బృహస్పతీ, దశమ భావంలో సూర్యశనులూ, చంద్రుడూ, ద్వాదశ స్థానంలో బుధ, శుక్రులూ సర్వ విధాల సుఖాలనూ సమకూరుస్తారు. ఇక ఏకాదశ స్థానంలో ఏ గ్రహమున్నా శుభాన్నే ప్రధానిస్తుంది. .
సింహంతో మకరం, కన్యతో మేషం, తులతో మీనం, కుంభంతో కర్కాటకం, ధనుస్సుతో వృషభం, మీడనంతో వృశ్చికరాశి యోగిస్తే మంచిది. దీన్ని షడష్టక యోగమంటారు. ఇది ప్రీతికారకం*.
(*ఒక్క గరుడ పురాణంలోనే షడష్టక యోగం మంచిదని చెప్పబడింది. వధూవరుల జాతకాలకు సంభంధించి మిగతా అన్ని శాస్త్ర గ్రంథాలలోనూ ఇది అశుభకారకంగానే పరిగణింపబడింది. వరుని లేదా వధువు యొక్క జన్మ రాశి ఒకరిది రెండవవారికి ఆరవది గాని ఎనిమిదవది గాని అగుటనే షడష్టక యొగమంటారు)
