1 - గరుడ పురాణము - ఆచార కాండము
32 - పంచతత్త్వార్చన - విధి
‘హే పరమాత్మా! తెలుసుకున్నంత మాత్రాననే సాధకునికి పరమపదాన్ని ప్రాప్తింప చేసే సారతత్త్వంలో భాగమైన పంచతత్త్వార్చన ఒకటున్నదని విన్నాను. మాపై దయ వుంచి దానినుపదేశించండి’ అని కోరాడు శివుడు.
లోక కల్యాణం కోసం శంకరభగవానుని ఆరాటాన్ని అర్థం చేసుకున్న ఆదిదేవుడు ఆనందభరితుడై ఇలా చెప్పసాగాడు.
‘సువ్రతుడవైన శంకరదేవా! మీకా పంచతత్త్వ పూజావిధిని తప్పక వినిపిస్తాను. ఎందుకంటే ఇది దివ్యం, మంగళస్వరూపం, కల్యాణకారి, రహస్యపూర్ణం, శ్రేష్ఠం, అభీష్ట సిద్ధిప్రదం, కలిదోష వినాశకం, పరమపవిత్రం.
హే సదాశివా! పరమాత్మయు, వాసుదేవుడునైన శ్రీహరి అవినాశి, శాంతుడు, సత్త్వస్వరూపుడు, *ధ్రువుడు, శుద్దుడు, సర్వవ్యాపి, నిరంజనుడు. ఆ విష్ణుదేవుడే తన స్వీయమాయ యొక్క ప్రభావం ద్వారా అయిదు ప్రకారాలుగా కనిపిస్తున్నాడు. ఈ ప్రకారాలు అయిదు రూపాలుగా, తత్త్వముగా పూజింపబడుతున్నాయి. విష్ణువు యొక్క పంచరూపాలు వాచక మంత్రాలు వారి పేర్లతోనే ఇలా వుంటాయి.
(* నిత్యుడు, అచలుడు అని అర్థము)
ఓం అం వాసుదేవాయ నమః,
ఓం ఆం సంకర్షణాయ నమః,
ఓం అం ప్రద్యుమ్నాయ నమః,
ఓం అః అనిరుద్ధాయ నమః,
ఓంఓం నారాయణాయ నమః ।
సర్వపాతకాలనూ, మహాపాతకాలనూ నశింపజేసి పుణ్యాన్ని ప్రదానం చేసి, సర్వ రోగాలనూ దూరం చేసే, అయిదుగురు మహా దైవతముల వాచకాలే ఈ పంచమంత్రాలు.
ఈ పంచదేవ పూజకై సాధకుడు ముందుగా స్నానం చేసి విధివత్తుగా సంధ్యవార్చి మరల కాలుసేతులు కడుగుకొని పూజామందిరలో ప్రవేశించి ఆచమనం చేసి తమ మనసుకు నచ్చిన అసనాన్ని వేసుకొని స్థిరంగా కూర్చుని అం క్షౌం రం అనే మంత్రాలను చ్చరిస్తూ శోషణాది క్రియలను చేయాలి. అనగా శరీరాన్ని పొడిగా చేసుకోవాలి.
శ్రీ వాసుదేవకృష్ణుడే ఈ జగత్తుకి స్వామి. పీతాంబర విభూషితుడు, సహస్ర సూర్య సమాన తేజసంన్నుడు, దేదీప్యమాన మకరాకృతిలో నున్న కుండల సుశోభితుడునగు ఆ శ్రీకృష్ణ భగవానుని ముందుగా ప్రతి హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి. తరువాత సంకర్షణ భగవానుని అనగా బలరామదేవుని, ఆపై యథాక్రమంగా ప్రద్యుమ్న, అనిరుద్ద, శ్రీమన్నారాయణులను ధ్యానించాలి. పిమ్మట ఆ దేవాధిదేవుని నుండి జనించిన ఇంద్రాది దేవతలను కూడా ధ్యానించాలి. మూలమంత్రం ద్వారా రెండు చేతులతో వ్యాపక రూపంలో కరన్యాసం అనంతరం అంగన్యాస మంత్రాలతో అంగన్యాసం నెరవేర్చి సర్వదేవత లనూ పూజించాలి. ఆ న్యాస మంత్రాలనూ, పూజా మంత్రాలనూ వినిపీస్తాను, వినండి:
తరువాత ఓం పద్మాయ నమః అంటూ స్వస్తిక, సర్వతోభద్రాది మండలాలను నిర్మించి ఆ మండలంలో ఇవే మంత్రాలతో దేవతలందరినీ పూజించాలి.
మూలమంత్రాలతో పాద్యాది నివేదనాన్ని గావించి స్నాన, వస్త్ర ఆచమన, గంధ పుష్ప, ధూప, దీప, నైవేద్యాదుల నర్పించి, ఈ దేవతలకు నమస్కార ప్రదక్షి ణలను గావించిన పిమ్మట యధాశక్తి పలుమార్లు మూలమంత్రాన్ని జపించి దాని ఫలాన్ని శ్రీకృష్ణ వాసుదేవ ప్రభునికి అర్పించాలి.
తరువాత వాసుదేవునికి నమస్కరిస్తూ ఈ క్రింది స్తోత్రాన్ని పఠించాలి.
ఓం నమో వాసుదేవాయ నమః, సంకర్షణాయ చ ॥
ప్రద్యుమ్నాయాది దేవాయానిరుద్ధాయ నమోనమః
నమో నారాయణాయైవ నరాణాం పతయే నమః ॥
నరపూజ్యాయ కీర్త్యాయ స్తుత్యాయ వరదాయచ ॥
అనాదినిధనాయై వ పురాణాయ నమోనమః ॥
సృష్టి సంహారక కర్త్రేచ బ్రహ్మణః పతయే నమః ॥
నమో వైవేద వేద్యాయ శంఖచక్రధరాయ చ ॥
కలి కల్మష హర్త్రేచ సురేశాయ నమోనమః ॥
సంసార వృక్ష చ్చేత్రేచ మాయా భేత్రే నమో నమః ॥
బహురూపాయ తీర్థాయ త్రిగుణాయ గుణాయచ ।
బ్రహ్మవిష్ణ్వీశరూపాయ మోక్షదాయ నమో నమః ॥
మోక్షద్వారాయ ధర్మాయ నిర్వాణాయ నమోనమః ।
సర్వకామ ప్రదాయైవ పరబ్రహ్మ స్వరూపిణే ॥
సంసార సాగరే ఘోరే నిమగ్నం మాం సముద్ధర ।
త్వదన్యోనాస్తి దేవేశ నాస్తిత్రాతా జగత్ర్పభో ॥
త్వామేవ సర్వగం విష్ణుం
గతోఽహం శరణం తతః ।
జ్ఞానదీప ప్రదానేన
తమోముక్తం ప్రకాశయ ॥ (ఆచార - 3ఽ/30 - 37)
ఈ విధంగా సమస్త కష్టాలనూ దూరం చేసే దేవేశుడైన వాసుదేవ భగవానుని స్తుతించాలి. ఇతర వైదిక స్తుతులతో కూడా విష్ణు దేవుని హృదయంలో భావిస్తూ స్తుతించ వచ్చును. తరువాత విసర్జన చేసి మందిరంలో నుండి బయటికి రావాలి. ఈ పంచతత్త్వ యుక్తమైన విష్ణు పూజ సంపూర్ణకామనలను నెరవేర్చే వాసుదేవుని పూజలలో సర్వశ్రేష్టంగా వ్యవహరింపబడుతోంది.
నీలలోహిత శివ మహాదేవా! ఈ పూజనొక్క మారు చేసినా మనిషి కృతకృత్యుడవు తాడు. దీనిని చదివినవారూ, విన్నవారూ, ఇతరులకు వినిపించినవారూ దేహాంతంలో విష్ణులోకాన్ని చేరుకుంటారు”.
