1 - గరుడ పురాణము - ఆచార కాండము
190 - 191 - ఒళ్ళునొప్పులు గండమాల, ప్లీహ, విద్రధి మున్నగు వివిధ రోగాల చికిత్స సుగంధద్రవ్యాల, విషచికిత్సమందుల వివరాలు
హే పార్వతీశా! అపరాజిత మూలాన్ని గోమూత్రంతో కలిపి తాగితే కంతి కనుమరుగైపోతుంది. మెడవద్ద, భుజాలలోనూ నొప్పులు కలిగినపుడు ఇంద్రవాగుణి కషాయాన్ని చల్లని నీటితో కలిపి త్రాగినా, జింగిణి, శుకగించి గింజలను నశ్యంగా చేసి పీల్చినా వెంటనే ఉపశమనం కలుగుతుంది.
అశ్వగంధ, పిప్పలి, ద్వివిధవచ, కుష్ఠలను పలాస్త్రి చేసి గేదెవెన్నతో కలిపి లింగంపై పూస్తే దానిలోపలి నాళాలలో కలిగే నొప్పులు పోతాయి. అలాగే గుండెపై మృదువుగా రాస్తే అక్కడి నొప్పులు తగ్గుతాయి. కుష్ఠ నాగబాలల పలాస్త్రిని వెన్నతో కలిపి బాలికల వక్షస్సుపై రాస్తే యౌవనపు వంపుసొంపులు కనుల కింపుగా పెరుగుతాయి.
ప్లీహ వ్యాకోచానికొక అరుదైన చికిత్స వుంది. ఇంద్రవాణిక మొక్కని పెకలించి రోగి నామాన్ని గట్టిగా అరచి చెబుతూ దాన్ని దూరంగా విసరివేస్తే రోగం తగ్గుతుంది.
విద్రధి- అనగా పైకి తేలకుండా వుండే పుండు తెల్ల పునర్ణవమూలాన్ని బియ్యపు కడుగుతో కలిపి తాగితే లోపల్లపలే మాడిపోతుంది. మహోదరంలోనగు వాటీకీ అరిటాకు భస్మం నీటిలో మరగించి తాగడం మంచి విరుగుడు అలాగే కదలీమూలాలను వెన్న, బెల్లంలతో వండి త్రాగితే నడుము ప్రాంతంలో వుండే క్రిములన్నీ నశిస్తాయి. రోజూ తెల్లారు జామునే నింబాకు పొడిని ఉసిరికకు అద్దుకొని సేవిస్తే కుష్టు మున్నగు రోగాలు నయమౌతాయి.
హరీతకి, విడంగ, హరిద్ర, తెల్ల ఆవాలు, సోమరాజ కరంజల వేగులు, సైంధవాలను కలిపి చూర్ణం చేసి గోమూత్రంతో ముద్దచేసి రాస్తే కుష్టు రోగం పోతుంది.
త్రిఫల ఒక పాలు, సోమరాజ బీజాలు రెండు పాళ్ళు తీసుకుంటూ వైద్యులు నిర్దేశించిన పథ్యాన్ని నిక్కచ్చిగా పాటిస్తే బద్దె పురుగు* నశిస్తుంది.
(* దీనిని ప్రస్తుత భాషలో రింగ్ వర్మంటున్నారు.)
అలాగే హరిద్ర, హరితాల, దూర్వ, గరుకుప్పులను గోమూత్రంతో ముద్దచేసి రాస్తే పామాయను బద్దె పురుగు, చర్మవిషాలు నశిస్తాయి.
తెల్లమచ్చలకుష్టును సోమరాజ విత్తనాలను వెన్న, తేనెలతో ముద్ద చేసి పెట్టడం ద్వారా జయించవచ్చు. దీనికి అనుపానంగా మజ్జిగను వాడాలి.
తెల్ల అపరాజిత వేరును నీటిలో వుంచి ఆ నీటితో శుద్ధిచేస్తూ తీస్తూ ఒక నెలపాటు రాస్తే బొల్లీ మటుమాయమవుతుంది.
గేదెవెన్న, సింధూర, మరిచకలను గజ్జి (పామా) వంటి తెగులున్న చోట రాస్తే ఆ రోగం పోతుంది. శుక్ల పిత్తానికి గంభారి పొడివేళ్ళను ఉడికించి పాలతో కలిపి చేసిన పానీయం మంచి విరుగుడు. శిల్హికను నశింపచేయాలంటే మూలకమూలాలను అపామార్గ రసంతో కలిపి నూరి చేసిన పలాస్ర్తిని శరీరంపై రాయాలి. హరిద్రాన్ని కదనీ భస్మంతో కలిపి పెట్టినా ఆ వ్యాధి తగ్గుతుంది. గజ్జికి కదలి, అపామార్గ చూర్ణాలను ఎరండతో చేర్చి, రాయడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది.
కూష్మాండమునెండ బెట్టి కాల్చి భస్మం చేసి దానికి గోమూత్రాన్ని కలిపీ, హరిద్రతో నీటితో ముద్దచేసి చిన్న మూకుట్లో వేసి ఎద్దుపిడకపై తక్కువ సెగలో వేడిచేసి చల్లారినాక దానితో తయారుచేసిన తైలాన్ని చేతులకూ కాళ్ళకూ పట్టిస్తే వంకరలు తీరి అందంగా ఆరోగ్యంగా అవి పెరుగుతాయి. నువ్వులు, ఆవాలు, హరిద్ర, కుష్ఠకాలతో తయారుచేసిన తైలాన్ని శరీర మర్దనకుపయోగిస్తే దుర్వాసనలుపోయి సువాసనలబ్బుతాయి. దూర్వ, కాకజంఘ తైలం కూడా ఇలాటిదే. అర్జున పుష్పాలు, జంబు, లోధ్రల ఆకులుకూడా ఇలా తైలంగా చేస్తే శరీర దుర్వాసనను పోగొడతాయి. లోధ్ర, నీటిని కనక(లత) పొడితో కలిపి శరీరానికి రాసుకుంటే వేసవి కాలంలో శరీరాన్ని బాధించేవేవీ దరిచేరవు. కాకజంఘ తైలం శరీరానికి సుగంధాన్నిస్తుంది.
యష్టిమధు, వాసక రసాల కషాయానికి పంచదార, తేనెలను చేర్చి తాగితే రక్తపిత్త, తాప, కామెర్ల రోగాలు తగ్గిపోతాయి. వాసక రసాన్ని తేనెతో తాగితే రక్త పిత్తం తగ్గుతుంది. రోజూ పొద్దున్నే సహజశీతల జలాన్ని త్రాగితే పడిశమే పట్టదు. పట్టినా నిలబడదు. విభీటక, పిప్పలి, సైంధవాలను పుల్లంబలీతో తింటే గొంతు బాధలు (ధ్వనులతోసహా) తగ్గుతాయి.
అయాసం తగ్గడానికి పెద్ద ప్రయత్నమే చేయాలి. ఆమలక, మనశ్మిల, బలమూల, కొలపత్ర, గుగ్గులాలను ఆవుపాలతో కషాయం చేసి త్రాగుతుండాలి. ఇంకా బదరి, జాతీపత్ర, కొలపత్ర, మనశ్శిల లను కాల్చి ఆ పొగను పీలుస్తుండాలి. ఆయాసం శాశ్వతంగా నిష్క్రమిస్తుంది. త్రిఫల, పిప్పలీలను చూర్ణం చేసి తేనెతో రంగరించి భోజనానికి ముందు తీసుకుంటే దాహం, జ్వరం దగ్గరకు రావు. త్రిదోషాల వల్ల వచ్చే ఏ వాంతుల జబైనా బిల్వమూల, గుడూచిల కషాయాన్ని తేనెతో తీసుకుంటే సమసిపోతుంది. దూర్వను గుండ చేసి బియ్యపు కడుగుతో ముద్ద చేసి ఉంటే కూడా వాంతులాగుతాయి.
గౌరీశంకరా! చంద్రుడు పుష్యనక్షత్రంలో ప్రవేశించినప్పుడు తెల్ల పునర్నవ వేళ్ళను సేకరించి నీటిలో వేసుకొని త్రాగివేసిన వాని జోలికీ గాని ఇంటికీ గానీ ఏ సర్పాలూ రావు. ఎలుగుబంటి దంతాలతో చేయబడిన గరుడ ప్రతిమగల తాయెత్తును గానీ రక్షను గాని ధరించిన వానిని ఏ పామూ కాటు వేయదు. శాల్మలీ మూలాన్ని నీటితో కషాయం చేసుకొని త్రాగినవాని శరీరంలోకి పాముకోర దిగినా వీషమెక్కదు. లజ్జాలుక మూలాన్ని చంద్రుడు పుష్యనక్షత్రమండలంలో నున్నపుడు సంగ్రహించి మణికట్టుకి కట్టుకున్నా, వాటి రసాన్నిశరీరంపై పూసుకున్నా ఏ పామునైనా పట్టుకోవచ్చు. వోద్ర, దుందుభ జాలి పాముల విషాన్ని మహాకాలవేళ్ళను పుల్లంబలితో చేర్చి చేసిన పలాస్త్రీ శరీరంపై రాయబడి హరిస్తుంది. తండులీయక వేరు బియ్యపు కడుగు, వెన్నలతో పలాస్త్రీ చేయబడితే విష(సర్వవిధ విష) సంహారకమవుతుంది.
నీలి లేదా లజ్జాలుక వేరుని బియ్యపు కడుగులో నానబెట్టి తాగితే విష కీటకాల విషం విరిగిపోతుంది. అదేవిధంగా గుమ్మడిరసం, బెల్లం లేదా పంచదార, పాలు కలిపిన మండుకూడా కీటక విషహారకమే. శ్వేతార్క మూలాన్ని చంద్రుడు పుష్యనక్షత్ర మండలంలో నున్నపుడు సేకరించి సహజశీతల జలంలో నానబెట్టి తాగితే విషకీటకాల కాటు, విషం పూసిన కత్తిగాటు ఆ మనిషిని బాధించవు.
మతిపోయి తిరుగుతున్న వారిని మరల మతిమంతులను చేసే శక్తి కొద్రువ మూలాలకుంది. వీటిని బెల్లంతో పాలతో కలిపి త్రాగితే పోయిన జ్ఞాపకశక్తి మరల వస్తుంది. యష్టి మధుని పైవిధంగా తాగితే ఎలక కొరకడం వల్ల చేరిన విషం ఎగిరిపోతుంది. అదీ మూడురోజుల్లోనే! నల్ల అంకోటను వేడినీళ్ళలో వేసుకుని తాగితే ఎలాంటి విషమైనా జీర్ణమై పోతుంది.
ఓ మహాదేవా! ఆవుపాలనుండి అప్పుడే తీసిన వెన్నకు సైంధవ లవణాన్ని చేర్చి సేవిస్తే తేలుకాటునుండి ఉపశమనం కలుగుతుంది.
మనిషి కాటుకి మందులేడంటారు గానీ ఉంది. కుసుంభ, కుంకుమ, హరితాలు, మనశ్మిల, కరంజలతో అర్కమూలపు పొడిని చేర్చి తింటే మనిషి కాటు వల్ల ఎక్కిన విషం దిగిపోతుంది.
తేనెటీగ కుడితే సొంటి, తగరపాదికల పలాస్త్రీని ఆ కుట్టినచోట పూస్తే వెంటనే నొప్పి తగ్గిపోతుంది. దీనికి శతపుష్ప, సైంధవ, నవనీత మిశ్రమం ఇంకా బాగా పనిచేస్తుంది. కుక్క కాటుకీ శిరీష విత్తనాన్ని పాలలో ఉడికించి చేసిన మందు మంచి విరుగుడు. కప్పకాటుకీ వేరే మందేమీ అక్కరలేదు. ఆ చోట చర్మాన్ని చురించి కొంచెం ఎఱ్ఱబడగానే నీళ్ళు పోస్తే చాలు.
ఎలుక కాటు వల్ల ఎక్కిన విషం చంద్రుడు నడినెత్తిన వున్నపుడు సంగ్రహించిన ధత్తూరకాన్ని తీసి రసం పిండీ దానికీ పాలు, బెల్లం, వెన్నలను కలిపి చేసిన మందువల్ల దిగిపోతుంది. సాలెపురుగు విషానికి దేవదారు, గైరికాలను గాని నాగేశ్వర, రెండు రకాల హరిద్రను గాని మంజిష్ఠికతో కలిపి చేసిన పలాస్త్రి మంచి విరుగుడు. కరంజ బీజాలు, వరుణ బెరడు, నువ్వులు, ఆవాలతో చేసిన మిశ్రమౌషధం సామాన్య విషాలన్నిటినీ వీరిచేస్తుంది. గుఱ్ఱం దురదలతో హడావిడి చేస్తున్నపుడు దాని చర్మంపై కుమారీ పత్రం, వెన్న, ఉప్పులతో చేసిన పలాస్త్రీని పూస్తే అది శాంతిస్తుంది. ఇది కాస్త మొండిజబ్బు. పదిరోజులు మందు వాడాలి.
