1 - గరుడ పురాణము - ఆచార కాండము
184 - అర్మ, అజీర్ణ, గండమాలాదుల చికిత్స
రజని, కదలీ భస్మం ముద్దచేసి రాస్తే చమరకాయలు, కురుపులపై పొరలు నశిస్తాయి. ఒక వంతు కుష్ఠకి రెండువంతులు పథ్యాన్ని కలిపి కషాయం చేసి తాగితే తొడలపైభాగంలో వచ్చే అన్ని నొప్పులు తగ్గుతాయి. అభయ, పిప్పలిలను వెన్న, పంచదారలతో కలిపి సేవిస్తే మొలలు తగ్గుతాయి.
ఆటరూషకం ఆకులను గుండచేసి వెన్నతో కలిపి చిన్నసెగతో ఉడికించి తీసి రాసినా మొలలు నశిస్తాయి. గుగ్గుల, త్రిఫల కషాయం గుదలోపలి మొలలను సమర్థంగా అణచివేస్తుంది. అజాజి, శృంగవెరలను పెరుగుతో కలిపి అంబట్లో వేసుకొని ఉప్పు కలుపుకొని తింటే మూత్రకృచ్ఛ్రం (నీరుకట్టు) విడిపోతుంది. (ఉప్పు కలపాలి) యవక్షారాన్ని పంచదారతో కలిపి తిన్నా నీరు కట్టురోగం కుదురుతుంది.
కాటుకపిట్ట మలమూత్రాలను గుఱ్ఱపు నోటినురగతోనూ1 శోభాజనంతోనూ కలిపి కాపడం పెట్టినా, కాటుకగా మార్చి పెట్టినా అదృశ్యం కావచ్చు.
(1 శోభాంజనం కావచ్చు.)
కాలిన గాయాలకూ, కురుపుల కవచాలకూ నువ్వులనూనెతో కాల్చిన యవను కలిపి రాస్తే గొప్ప ఫలితముంటుంది. లజ్జాలు, శరపుంఖల పలాస్త్రిని *వెన్నతో కలిపి రాసినా అదే ఫలితముంటుంది.
(* ఆంగ్ల పేస్ట్, తెలుగు ముద్దలకు పర్యాయపదంగా పలాస్త్రిని వాడడం జరిగింది.)
అగ్ని జన్యబాధలను తొలగించడానికి పైపై పూతలతో బాటు ఈ మంత్రాన్ని పఠించడం కూడా అవసరం.
ఓం నమో భగవతే ఠఠ ఛింధి
ఛింధి జ్వలనం ప్రజ్వలితం
నాశయ నాశయ హుం ఫట్ ॥ (ఆచార...184/8)
నిర్గుండి వేళ్ళను మణికట్టు చుట్టూ కట్టి వుంచితే జ్వరం తగ్గుతుంది. గుంజవేళ్ళను (తెల్ల గుంజ మాత్రమే) ఏడు ముక్కలు చేసి మణికట్టుకి కడితే మొలలు తగ్గుతాయి. అడవిలో ప్రయాణిస్తున్నపుడు విష్ణుక్రాంతను మేకమూత్రంతో పలాస్త్రి చేసి శరీరమంతటా పూసుకుంటే దొంగలు దరిచేరరు, పులులు దూరంనుండే తొలగిపోతాయి. బ్రహ్మదండి వేళ్ళతో ఎన్నో పనులు చేయవచ్చును. త్రిఫల చూర్ణాన్ని వెన్నతో కలిపి తింటే కుష్టు క్రిములు నశిస్తాయి. వెన్నను వైద్యశాస్త్రప్రకారం శుద్ధిచేసి పునర్నవ, బిల్వ, పిప్పలిలతో కలిపి పచనం చేసి సేవిస్తే వెక్కుళ్ళు, దగ్గు, ఆయాసం, గొంతు దురద తగ్గిపోతాయి. ఈ మందుని గర్భవతులకు వాడితే పురుడు సులభంగా వస్తుంది.
పైన చెప్పబడిన పునర్నవ, పిప్పలి, బిల్వల నందుని పాలూ, వెన్నా కలిపి ఉడికించి ఉండలు చేసుకొని రోజూ తింటే వీర్యవృద్ధి కలుగుతుంది. విడంగ, మధుక, పాఠ, మాంసి, సర్జపస, హరిద్ర, త్రిఫల, అపామార్గ, మనశ్మిల, ఉదుంబర, ధాటకీలను పొడి యొనర్చి నువ్వుల నూనెతో కలిపి వేడి చేసి చల్లార్చి తొడల మధ్య మృదువుగా పూసుకుంటే సంభోగ శృంగారం సఫలీకృతమవుతుంది. ఇరువురూ ఈ మందు రాసుకుంటున్న సమయంలో
నమస్తే ఈశవర్గదాయ ఆకర్షిణి వికర్షిణి ముగ్ధే స్వాహా
అనే మంత్రాన్ని జపిస్తే సత్సంతానం కలుగుతుంది.
పాదరసాన్ని జటిక రసం, పునర్నవ, అమృత దూర్వల వేళ్ళు, కనకం*, ఇంద్ర వారులతో కలిపి ఈ మిశ్రమాన్ని ఒక ఉక్కు పాత్రలో వుంచాలి. ఇదివిషం.
(*ఈ కనకం బంగారం కాదు. ఉమ్మెత్తగాని సంపెంగగాని కావచ్చును.)
రాగిని తేనె, వెన్న, బెల్లం, కారవెల్ల రసంలతో కలిపి కాలిస్తే వెండి తయారవు తుంది. అలాగే ఒక పళం సీసాన్ని పసుపుపచ్చని ధత్తూరపుష్పం, లాంగలిక రెమ్మలతో కలిపి కాల్చడం ద్వారా బంగారాన్ని తయారుచేయవచ్చును.
ధత్తూర నూనెతో వెలుగుతున్నదీపం కాంతిలో సమాధి స్థితిలో కూర్చున్న యోగి మానవులకే కాదు, దేవతలకు కూడా కనబడడు. మదపుటేనుగు యొక్క మదజల ధారలను కాటుకగా మార్చి దాని కంటికే పెడితే అది గొప్ప యుద్ధ విజయాలను సాధిస్తుంది. దానిపై నుండి పోరాడేవాడు మహావిజేత కాగలడు.
ఒక నీటి పాము నోటిలో దంతపు ముక్కను పెట్టి నీటిలోకి తోసేస్తే అది నేలపై వలెనే నీటిలోనూ నిలబడుతుంది. దాని కనులు, కోరలు, ఎముకలు, రక్తము, పొట్ట కొవ్వులను మిశ్రమంగా చేసి నూనెతో కలిపి తన శరీరం నిండా పూసుకొన్నవారు మూడు రోజుల పాటు జలగర్భంలో ఉండిపోగలరు. మొసలి కన్నులు, తాబేలు గుండె, ఎలుక యొక్క పొట్ట కొవ్వు, ఎముకలు, శిశుమారమనే పెద్ద సముద్రపు చేప యొక్క పొట్ట కొవ్వులను కలగలిపి పలాస్త్రి చేసి శరీరం నిండా పూసుకున్న వారు జలాశయాల అట్టడుగుభాగాల్లో కూడా, తమ స్వగృహాలలో వలెనే ఉండగలరు.
ఇనుపరజనును మజ్జిగలో కలుపుకొని తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి. తండులీయక వేరు, గోక్షురాలను పాలలో కలుపుకొని తాగితే తాపాలు, నోటి సమస్యలు తొలగిపోతాయి. జాతి, కొలల వేళ్ళను మజ్జిగతో కలుపుకొని త్రాగితే అజీర్ణ వ్యాధి నశిస్తుంది.
కుశవేళ్ళు గాని, బాకుచి గాని మజ్జిగలో కలిపితే అజీర్ణానికి మందుగా పనిచేస్తాయి. ఇవే బాకుచి వేళ్ళను పుల్లంబలితో కలిపి పుడిసిలిస్తే పలువరుసలో కలిగే వ్యాధులన్నీ తొలగిపోతాయి. కల్తీ ద్రవాలు త్రాగడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇంద్ర వారుణి మూలాలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల సమసిపోతాయి. సురభిక మూలాన్ని వాయు సమస్యలు వచ్చినప్పుడాశ్రయించాలి.
గుంజ పటాస్రిని పుల్లంబలిలో కలిపి తలకు పట్టీ వేస్తే ఎలాటి శిరోవేదనయైనా శిథిలమైపోతుంది. బల, అతిబల, యష్టిలను చూర్ణం చేసి తేనెతో పంచదారతో కలిపి తింటే గొడ్రాలు గర్భవతి కాగలదు. తెల్ల అపరాజిత వేరుని పిప్పల, సొంటిలతో కలిపి నూరీ తలకి రాస్తే తీవ్రమైన తలనొప్పి కూడా తొలగిపోతుంది.
ప్లీహవ్యాకోచానికి కేతకి పత్ర చూర్ణాన్ని బెల్లంతో కలిపి గాని, శరపుంఖని మజ్జిగతో కలిపీ గాని చేసిన మందు మంచి విరుగుడు. శుంఠి, సౌవర్చల, హింగులను కలిపి త్రాగితే అన్ని రకాల గుండెనొప్పి నుండీ శాంతి లభిస్తుంది.
