1 - గరుడ పురాణము - ఆచార కాండము
220 - సపిండీకరణ శ్రాద్ధవిధి
మనిషి మృతి చెందిన ఏడాదికి అదేశిథినాడు ఈ శ్రాద్ధాన్ని పెట్టాలి. 1దీనిని పద్ధతిగా సరైన సమయంలో చేస్తే ప్రేతానికీ పితృలోక ప్రాప్తి కలుగుతుంది.
(1దీనిని న్యాయంగా సాంవత్సరిక శ్రాద్దమనాలి, గాని జనం సంవత్సరీకాలు అంటుంటారు.)
సపిండీకరణ శ్రాద్ధాన్ని అపరాహ్ణంలో పెట్టాలి. నియమాలు చాలావఱకు ఇతర శ్రాద్ధాలలాగే వుంటాయి. అవికాక అదనంగా వున్నవే ఇక్కడ చెప్పబడు తున్నాయి. పితామహాదుల ప్రతినిథి బ్రాహ్మణుల నెహ్వానించినపుడు
ఓం పురూరవో మాద్రవ సంజ్ఞ కేభ్యో....... అనే మంత్రాన్నుచ్చరిస్తూ వారిని వామ పార్శ్వమందున్న ఆసనాలపై కూర్చుండబెట్టి పురూరవ మాద్రకి2 నామకులైన విశ్వేదేవులను ఆవాహన చేయాలి. పితామహ ప్రపితామహానాం... ఇత్యాది వాక్యాన్ని చదివి వారి ప్రతినిధి బ్రాహ్మణుల అనుజ్ఞను పొంది మూడు పాత్రలను స్థాపించాలి. వాటిపై కుశదర్భలనుంచి ఆ పాత్రలపైనను, చుట్టునూ వేరే పాత్రలనుంచాలి. అన్య శ్రాద్ధాలలాగే అచ్చిద్రావ ధారణ3 ‘దాకా చేయాలి. తరువాత దేవపాత్రాచ్చి ద్రావధారణ4 చేయాలి. తరువాత యథావిధి క్రియను నడిపించి ఈ మూడు పాత్రలనూ పైకి తీసి ఓం యే సమానాః సమనసో........ ఇత్యాది మంత్రంతో పితృపాత్రలోని జలాన్ని పితామహ, ప్రపితామహపాత్రలలో పోయాలి. పవిత్రకాలతో సహా మిగతా ఇద్దరి పాత్రలలోని జలాలను పితృపాత్రలో పోయాలి. తరువాత పితృబ్రాహ్మణుని చేతిలో అర్ఘ్యపాత్రలోని పవిత్రకాన్ని తీసి వుంచి ఆయన తలపై, చేతులలో, పాదాలపై, ఆ పాత్రలోని పూలనే, సమర్పించాలి. తరువాత ఆయన చేతిలో నీటిని పోసి శ్రాద్ధకర్త తన రెండు చేతులతో అర్ఘ్యపాత్ర నెత్తి పట్టుకొని ఓం యాదివ్యా... అముక గోత్రమత్పితా మహ... ఇత్యాది మంత్ర వాక్యాలను పఠిస్తూ పితృపాత్రలోని కొంత అర్ఘ్యాదకాన్ని పితామహ ప్రతినిథి చేతులలోపోయాలి. పవిత్రక సహితంగా పరిశిష్ట జలాన్ని పాత్రలో నుండి తీసి వేరే పాత్రలో పోసి దానిని ఇతర పాత్రల మధ్య దాచాలి. పితృబ్రాహ్మణుని వామపార్వంలోని దక్షీణాగ్రకుశపై ఈ పాత్రను బోర్లించి పెట్టాలి.
(2బనారీదాస్ ప్రచురణలో మాద్రకకి బదులు ఆద్రవ అనే పేరుంది,
3పితరులకుద్దేశింపబడిన కర్మకాండ వారికి తృప్తికరంగా చేయబడాలని అందరినీ ప్రార్థించుటనే ‘అచ్చిద్రావధారణ’ మంటారు,
4అర్ఘ్యపాత్రకు ఎక్కడా కన్నాలు గాని పగుళ్ళు గాని లేకుండా పలుమార్లు పరీక్షించుకొను క్రియనే ‘దేవపాత్రాచ్ఛి ద్రావధారణ’ మంటారు.)
తరువాత పితామహాదులను గంధాదులతో సత్కరించి అగ్నౌకరణ* చేసి అవశిష్ట అన్నాన్ని పితరుల పాత్రలలో వేయాలి. ఇలా, ఆ తరువాత, ఇతర శ్రాద్ధ కర్మలనే అనుసరిస్తూ బ్రాహ్మణులకు ఆచమనాన్ని తాంబూలాన్నీ ఇవ్వాలి. అప్పుడు శ్రాద్ధకర్త ‘సుప్రోక్షితమస్తు, శివాఆపః సంతు’ అనే రెండు మంత్రాలనుచ్చరిస్తూ వృద్ధప్రపితా మహాది క్రమంలో బ్రాహ్మణుల చేతులలో జలప్రదానం చేస్తూ పితృ బ్రాహ్మణుల చేతులలో గోత్రస్యాక్షయ్యమస్తు అనాలి. తరువాత వారి చేతులలో తిలలతో కూడిన జలాన్ని పోస్తూ ఉపతిష్ఠతాం అనాలి.
(*అగ్నౌకరణ ఒక విశిష్ట విధి. ఇందులో అపసవ్యమై నీటిలోకి రెండు ఆహుతులను మంత్రపూర్వకంగా ఇస్తారు.)
ఆ తరువాత అఘోరాః పీతరః సంతు అనే వాక్యాన్ని శ్రాద్ధకర్త ఉచ్చరించగా అస్తు అని బ్రాహ్మణులు అంటారు. అలాగే స్వధాం వాచియిష్యే అనగానే వారు ఓం వాచ్యతాం అంటూ అనుజ్ఞనిస్తారు. కర్త ‘పితామహాదిభ్యః స్వధా ఉచ్యతాం’ అనగానే వారు అస్తుస్వధా అని అంటారు. అలాగే పితృభ్యః స్వధా ఉచ్యతాం అన్నపుడు కూడా అనుజ్ఞనిస్తారు.
తరువాత శ్రాద్ధకర్త ఓం ఊర్జంవహంతీ.. ఇత్యాది మంత్రంతో దక్షిణంవైపు తిరిగి జలధారనిచ్చి ఓం విశ్వేదేవా అస్మిన్ యజ్ఞేప్రియంతాం అనే మంత్రాన్ని చదువుతూ దేవబ్రాహ్మణుల చేతులలో యవలన నీటిని అర్పించి ఓం దేవతాభ్య... అనే మంత్రాన్ని మూడుమార్లు పఠించాలి. పిండపాత్రలను కదిలించి ఆచమన పూర్వకంగా బ్రాహ్మణులకు పితామహాది క్రమంలో దక్షిణలివ్వాలి. ఆశిషోమే ప్రదీయం తాం అనే వచనంతో ఆశీర్వాదాన్నర్ధించాలి. బ్రాహ్మణులంతట ప్రతి గృహ్యాతాం అంటారు. తరువాత దాతారోనోభి వర్ధంతాంఽమున్నగు మంత్రాలను చదివి అర్ఘ్యపాత్రను పైకెత్తి పట్టుకొని వాజే వాజే ఇత్యాది మంత్రాలతో దేవబ్రాహ్మణులనీ, అభిరమ్యతాం అనే మంత్రంతో పితృబ్రాహ్మణులనీ విసర్జించాలి. (అంటే వీడ్కొల్పాలని అర్థం)
శ్రాద్ధము, శ్రాద్ధకర్త, శ్రాద్ధఫలం ఈ మూడూ విష్ణురూపాలే నని, బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి తెలిపాడు.
