1 - గరుడ పురాణము - ఆచార కాండము
111 - రాజనీతి
(ఇది ఆ రోజులలో రాజుకి పనికివచ్చిన నీతి. ఇపుడు రాజులు లేరు. అయినా రాజాధికారాలుగల వారున్నారు. ప్రభుత్వముంది. కాబట్టి నేటి సమాజానికి కూడా ఈ నీతులవసరం)
ప్రజలనుండి పన్నులరూపేణా డబ్బు వసూలు చేయడం తోటమాలి మృదువుగా తాను పెంచిన మొక్క నుండీ *పూలు కోసినట్లుండాలి. అంతేకాని వంట చెట్టుకు కోసం చెట్టు నరకినట్లుండకూడదు.
(*ఈ భావాన్నే పువ్వులోంచి తుమ్మెద తేనెను లాగినంత మృదువుగా నొప్పి లేకుండా ప్రజల నుండి ప్రభుత్వము పన్నులు వసూలు చేయాలని చెప్పాడు. అర్థశాస్త్రంలో చాణక్యుడు. (గరుడపురాణంలో కూడా వుంది 125/5))
ఇతర రాజ్యాల నుండి వచ్చిన ద్రవ్యాలను రాజు స్వీకరించాలి. అవి పాడైపోతే, వీరిగిన పాలనువలె, త్యజించాలి. పాల కోసం ఆవుని వాడుకోవాలిగానీ పొదుగును కోసివేయకూడదు. అలాగే రాజు ధనికులనూ వాడుకోవాలి.
సత్యం మనోరమాః కామాః సత్యం రమ్యా విభూతయః ।
కింతువైవనితాపాంగ భంగి లోలం జీవితం ॥
వ్యాఘ్వ తిష్ఠతి జరా పరివర్జయంతీ
రోగాశ్చ శత్రవ ఇవ ప్రభవంతి గాత్రే ।
ఆయుః పరిస్రవతి భిన్నఘటా దివాంభో
లోకోన చాత్మహితమాచరతీహ కశ్చిత్ ॥ (ఆచార..111/9,10)
అన్నీ సత్యంలాగా శాశ్వతంలాగా కనిపిస్తాయి. కాని ఐశ్వర్యం, భోగాలు, స్త్రీ ప్రేమ, పదవి వంటివి సత్యాలూ కావు నిత్యాలూ కావు. అసలు కనిపించని రోగం, ముసలితనం, మృత్యువు మాత్రమే నిత్య సత్యాలు, శాశ్వతాలు. కాబట్టి రాజైనా ప్రజలైనా ధర్మాచరణ రకులై జీవించా.
పరస్త్రీలలో తల్లినీ, పరద్రవ్యంలో మట్టినీ, సర్వప్రాణులలో తన ఆత్మనీ చూడగలిగిన వాడే నిజమైన విద్వాంసుడు.
పదవికోసం ప్రయత్నించేవాడు ఆ పనిని ప్రజలకోసం చేయడు.తన కోసమే చేస్తాడు. అది క్షంతవ్యమే కాని ఆ పదవి వల్ల వచ్చిన అధికారాన్నీ ఐశ్వర్యాన్నీ ప్రజోపయోగ కరమైన యజ్ఞయాగాదులకూ దానాలకూ వినియోగించినవాడే నరకానికి పోకుండా వుంటాడు. రాజ్యాంతే నరకం, ధ్రువం - అనే నానుడి వానికీ వర్తించదు)
రాజుకైనా ప్రజలకైనా ధనం అత్యంత ముఖ్యం. ధనవంతునికీ మిత్ర, బంధు, బాంధవులుంటారు. అతనినే మహాపురుషుడనీ, సమర్థుడనీ కొనియాడతారు. ధనం కోల్పోతే అదే వ్యక్తిని అందరూ వదిలేస్తారు. వాడసలు మగాడే కాడంటారు. మరల ధనం సంపాదించుకు వస్తే నాలికకరచుకొని అతని చుట్టూ చేరతారు.
యస్యార్ధాస్తస్యమిత్రాణి యస్యార్థా స్తస్య బాంధవాః ।
యస్యార్థాః స పుమాఁల్లోకే యస్యార్థాః సచపండితః ॥
త్యజంతి మిత్రాణి ధనైర్విహీనం పుత్రాశ్చ దారాశ్చ సుహృజ్జనాశ్చ ।
తేచార్థవంతం పునరాశ్రయంతి హ్యళోహి లోకే పురుషస్య బంధుః ॥ (ఆచార..111/17,18)
రాజుకి శాస్త్ర జ్ఞానముండాలి. అదొక కన్ను వంటిదైతే, మరొక కన్ను గూఢచారులు.
ఏ రాజు యొక్క పుత్రులూ, భృత్యులూ, మంత్రులూ, పురోహితులూ, ఇంద్రియాలూ తమ తమ కర్తవ్య పాలనలో బద్దకం వహిస్తారో ఆ రాజు ఎంతో కాలం రాజుగా మనలేడు. వీరంతా సక్రమంగా పనిచేస్తే బలవంతుడైన రాజు ఎన్నేళ్ళయినా ఏలగలడు.
ప్రయత్నం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఉన్నవానిని దేవతలు కూడా మెచ్చుకొని పై పదవికి పంపిస్తారు.
ఉద్యోగః సాహసం ధైర్యం బుద్ధిః శక్తిః పరాక్రమం ।
షడ్విధో యస్య ఉత్సాహస్తస్య దేవోఽ పి శంకతే ॥
ఉద్యోగేన కృతే కార్యే సిద్ధిర్యస్య న విద్యతే ।
దైవం తస్య ప్రమాణం హీ కర్తవ్యం పౌరుషం సదా ॥ (ఆచార..111/3ఽ,33)
ఈ ఆరగలవాడే పురుషుడు. ఈ జన్మలోని పౌరుషమే మరుజన్మలో భాగ్యమవుతుంది.
